డిసెంబర్ 2017

ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నము అనే పాట 1966లో వచ్చిన రంగులరాట్నం సినిమాలోది. రాసినది ఎస్. వి. భుజంగరాయ శర్మ. ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతీయ తాత్త్విక దృక్పథాన్ని మొత్తం రంగరించి శర్మ ఈపాటలో నింపారంటారు శ్రీరమణ, శర్మగారి 92వ జయంతి (డిసెంబర్ 15న) సందర్భంగా రాసిన తన నివాళి వ్యాసంలో. అలాగే, వెంపటి చినసత్యం, పట్రాయని సంగీతరావులతో కలిసి కూచిపూడి త్రయంలో ఒకరిగా పేరుపొందిన భుజంగరాయ శర్మ తన పదం ద్వారా ఆ నాట్యకళకు చేసిన మరవలేని సేవను, మనిషిగా వారి మహనీయతనూ పరామర్శిస్తారు తను మాత్రమే చెప్పగలిగే మాటల్లో; ఆ రంగులరాట్నం సినిమా తీసిన బి. ఎన్. రెడ్డి మీద అప్పుడు రాసిన వ్యాసం తరువాత, వారి ఆకాశవాణి ఇంటర్‌వ్యూ ఇదే సంచికలో ఇప్పుడు పరుచూరి శ్రీనివాస్ అందించడం కాకతాళీయమే అయినా సందర్భోచితం; రజనీకాంతరావు, సంగీతరావుల గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఒకప్పుడు ఈమాటలో రాసిన వ్యాసం ఈ సందర్బంలో గుర్తుచేసుకోవడం సముచితం; సాహిత్యవిమర్శలో ఒక సరి అయిన బాట పరుస్తున్న చామర్తి మానస తన ఐదుకవితలు శీర్షికలో కవి రవి వీరెల్లి గురించి, అతని కవితాసంపుటి కుందాపన గురించి చేసిన విమర్శాసమీక్ష; పూడూరి రాజిరెడ్డి కథాసంపుటిపై జి. ఉమ రాసిన సమీక్షాపరిచయం; యాత్రాసాహిత్యకుడు, సాహిత్యయాత్రికుడు దాసరి అమరేంద్ర కొత్త పుస్తకం నుంచి ఒక అధ్యాయం; ఇంకా కవితలు, కథలు, శీర్షికలూ…


ఈ సంచికలో:

  • కథలు: టోరాబోరా వంటమనిషి – అవినేని భాస్కర్ (ఎ.ముత్తులింగం). Indian groceries – పాలపర్తి ఇంద్రాణి; నాపై కథ రాస్తావా? – పి. విక్టర్ విజయ్ కుమార్.
  • కవితలు: వో షామ్ కుచ్ అజీబ్ థీ – శారదయామిని; నేను లేని ప్రపంచం – అనూరాధ నాదెళ్ళ; సడి లేని సంభాషణలు – రేఖాజ్యోతి; ఐదుకవితలు: కుందాపన–దిగులుపువ్వు, Solitary, చిన్నోడి అమ్మ, కప్పతల్లి, రాత్రికి లోకువై – రవి వీరెల్లి; పర పరాగ్-1972 – పాలపర్తి ఇంద్రాణి; కల కాని వేళ తను – విజయ్ కోగంటి.
  • వ్యాసాలు: ఐదుకవితలు: కుందాపన – మానస చామర్తి; అందీ అందని కావేరీ సంగమం – దాసరి అమరేంద్ర; ఒక అంతర్ముఖుని బహుముఖరూపాలు – జి. ఉమ; కూచిపూడి పదం–భుజంగరాయ శర్మ – శ్రీరమణ; గణపతి: అంతుచిక్కని వింతదేవుడు-4 – సురేశ్ కొలిచాల.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: చూపులు కలిసిన శుభవేళ – భైరవభట్ల కామేశ్వరరావు; తెరచాటు-వులు: 11. జాటర్‌ఢమాల్ – కంచిభట్ల శ్రీనివాస్; శబ్దతరంగాలు:దర్శకుడు బి. ఎన్. రెడ్డితో ముఖాముఖీ – పరుచూరి శ్రీనివాస్ సమర్పణ.