సింహం చెట్టు

జైభారత్ సర్కస్ వూళ్ళోకి వస్తోందని ఆనోటా యీనోటా విన్నాం. పిచ్చి ఆనందం! పిచ్చి వుత్సాహం! ఒక రోజు పొద్దున చద్దన్నాల రేవు కాగానే మొత్తం ముఠా ముఠా నిజానిజాలు తేల్చుకోడానికి వూరిమీద పడ్డాం. బాపట్ల మా తాతగారి వూరు. ఆ రోజుల్లో సంవత్సరానికి నాలుగు నెలలు బడిసెలవులుండేవి కదా! ఒక్క రోజు వృధా కాకుండా ఎక్కడెక్కడినించో అందరం వచ్చి వాలేవాళ్ళం. కుడి ఎడమలుగా ఒకే సైజు మనవళ్ళం ఆరుగురం వుండేవాళ్ళం. తాతగారి వూరు మాకు కొట్టిన పిండి. చెరిగిన చేట. ఇంకో నలుగురు పిల్లల్ని పోగేసుకుని బయలుదేరాం. మున్సిపల్ గ్రౌండ్స్‌లో రంగుల డేరా విచ్చుకుంటూ కనిపించింది. మా ఆనందానికి అవధులు లేవ్. డేరా దగ్గరికి చేరేసరికి మాది పదిమంది గుంపయింది. అక్కడ నేలలో పెద్దపెద్ద ఇనప శీలలు దిగ్గొడుతూ మోకులు బిగిస్తూ చాలామంది కనిపించారు. ‘ఒరే వీడేరా బఫూను, వీడు రింగుమాష్టరు, వీడు…’ అని కేకలేస్తూ కనిపించిన మమ్మల్ని తరిమేశారు. దాన్ని మేం చిన్నతనంగా ఏమాత్రం భావించలేదు. డేరా బయట ఒంటెల్ని చూశాం. పెద్ద వలలో వున్న కోతుల్ని పలకరించాం. ఎలుగుబంటి మీద మా వాడెవడో చిన్న రాయి విసిరాడు. అక్కణ్ణించి తరిమివేయబడ్డాం. దులిపేసుకుని బోనులో వున్న సింహాన్ని చూశాం. పులి, నీటిగుర్రం కూడా వున్నాయనీ అవింకా రాలేదనీ స్పష్టమైన సమాచారం సేకరించాం. రెక్కలు తెగిన పక్షిలా అక్కడో జీపు ఆగివుంది. ‘ఇదేరా జంపింగ్ జీప్!’ అని నలుగురొకేసారి అరిచేసరికి, అక్కడ నిద్ర పోతున్న పిల్లలు లేచి ఏడుపు లంకించుకున్నారు. ఈసారి ఆడవాళ్ళు మళయాళంలో మమ్మల్ని కసురుకున్నారు.

ఓ పక్కన వంటలైపోతున్నాయ్. అంటించాల్సిన మైదా వుడుకుతోంది. మరో మూల గడ్డిమంట మీద డప్పులు వేడి పెడుతున్నారు. మా శీనుగాడు గుర్రం తోకలోంచి వెంట్రుక పీకే ప్రయత్నం చేశాడు. గుర్రం ఒక్కసారి తుళ్ళిపడి భయంతో సకిలించింది. అంతే! మున్సిపల్ గ్రౌండ్స్ హద్దులు దాటేదాకా తరిమారు. బతుకు జీవుడా అని బయటపడ్డాం. ఇహ మాకు అవే కబుర్లు. ఎవడి అనుభవాలు వాడు తవ్వుతున్నాడు. బావిలో సైకిలు, మోటారు సైకిలు తొక్కే ఫీట్ వుందో లేదో తెలుసుకోలేకపోయాం. రాత్రిపూట డేరా లైటు ఆకాశంలోపడి తిరుగుతుందో లేదో కూడా తెలియలేదు. రెండు రాత్రిళ్ళు మాకు అవే కలలు. పాపం! ఓ పిల్లాడు వుయ్యాల మీంచి వుయ్యాలకి మారుతూ గురి తప్పాడు. గ్యాలరీలోకొచ్చి నామీద పడ్డాడు. పెద్ద కేకతో లేచాను. ఇల్లంతా లేచింది. తలో మాటా అన్నారు. కాళ్ళు కడిగించి, నీళ్ళు తాగించి మళ్ళీ పడుకోపెట్టారు.


మూడో రోజుకల్లా సర్కస్ ఆట మొదలైపోయింది. ఆ రోజు పొద్దుటే వూళ్ళోకి వూరేగింపు వచ్చింది. ఒక ఏనుగు, దాని పక్కన గున్న ఏనుగు, నాలుగు ఒంటెలు, నాలుగు గుర్రాలు వూరేగింపులో పాల్గొన్నాయ్. డప్పులు, బ్యాండ్ మేళం దుమ్ము లేపుతున్నాయ్. ఇద్దరు మనుషులు వెదురు గడలమీద కరెంటు స్తంభం ఎత్తున పొడుగాటి చారల పైజమాలతో నడుస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. జీప్ నిండా కోతులు కొలువు తీరి వున్నాయ్. నిదానంగా కోతుల జీపు వూరేగింపులో నడుస్తోంది. మైకుల్లో మధ్యమధ్య జైభారత్ సర్కస్ గురించి, వింతలూ విడ్డూరాల గురించి అరుస్తూ చెబుతున్నారు. గులాములు కొట్టుకుని బఫూన్ టోపీలు పెట్టుకున్న ఇద్దరు గడపోటు వేసుకుంటూ ఒంటె మీంచి గుర్రం మీదికి, అట్నించి ఏనుగు మీదికి జంప్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు. వూరేగింపు బాపట్ల మెయిన్ రోడ్లన్నీ చుడుతోంది.

ఆ రోజునించే సర్కస్ మొదలు. రోజుకి రెండాటలు! మాకు గంగవెర్రులెత్తుతున్నాయ్. కుర్చీ, గ్యాలరీ రెండు తరగతులున్నాయ్. కుర్చీ టిక్కెట్ రూపాయ్, గ్యాలరీ అర్ధ రూపాయ్. పిల్లల హడావిడి చూసి, మా తాతగారు సర్కస్ టెంట్ల మీద బడిపెట్టారు. “మీకు తెలియదు, సర్కస్ డేరాకో నీతి నియమం వుంది. ఏది ఏమైనా, మిన్నొచ్చి మీదపడ్డా సర్కస్ ఒక్క రోజు కూడా ఆగడానికి లేదు. పొన్నూరులో సర్కస్ పది రోజులు ఆడుతుంది. అప్పుడే మన బాపట్లలో టెంట్ వేయడం మొదలవుతుంది. అవీయివీ ఒక్కొక్కటే రావడంతో ఇక్కడ ఆటలు మొదలవుతాయ్. పొన్నూరులో చివరి అయిదు రోజులు కొన్ని ఫీట్లుండవ్. అన్నీ పూర్తిగా రావడానికి అయిదు రోజులు టైమ్ పడుతుంది. మన బాపట్లలో పది రోజులు కాగానే డేరా ఒకటి చీరాలకు వెళ్తుంది. అందుకని సర్కస్‌కెప్పుడూ వారం గడిచాక వెళ్ళాలి. ఆ కంపెనీవాడిదగ్గర రెండు డేరాలు సిద్ధంగా వుంటాయ్, తెలిసిందా?” అనగానే మా ప్రాణం లేచొచ్చింది. ఆ బడికి అంత త్వరగా గంట కొడతారని మేమెవ్వరం అనుకోలేదు.

ఇదిలా వుండగా, సర్కస్ జీపు మా వాకిట్లో వచ్చి ఆగింది. ఇద్దరు దిగి లోపలికి వచ్చారు. మా తాతగారి వాకిట్లో కనిపిస్తూ అయిదు కొబ్బరి చెట్లున్నాయ్. ‘ఒంటెల తిండికోసం కొబ్బరి మట్టలు ఇస్తారా, కొట్టుకు పోతాం?’ అని అడిగారు. వాటికిగాను ఆరు కుర్చీ టిక్కెట్ పాస్‌లు యిస్తామన్నారు. మా తాతగారు నాలుగు కుర్చీ, ఆరు గ్యాలరీ పాస్‌లయితేనే చెట్లెక్కమన్నారు. సరేనని చెట్లెక్కి మొవ్వాకు తప్ప మరో మట్ట లేకుండా చేశారు. మొత్తం ఒంటెల వీపుల మీద కట్టుకుని కదిలారు. అన్నప్రకారం పాస్‌లు ఎప్పుడైనా చెల్లే విధంగా యిచ్చారు. మా మనసులు కుదుటపడ్డాయ్. ఇక వెళ్ళడం తరువాయి.

మేం రోజులు లెక్కపెట్టుకుంటూ ఎలాగో నాలుగురోజులు గడిపాం. ఆఖరికి నీటిగుర్రం కూడా పాత డేరా నించి వచ్చేసిందని తెలిశాక తాతగారు మమ్మల్ని వదిలారు. అసలు స్పెషల్ పాస్ వాళ్ళకక్కడ చాలా గౌరవం వుంటుందనుకున్నాం గాని అదేం లేదు. మున్సిపల్ వుద్యోగులు, కరెంటువాళ్ళు, పోలీసులు, ఇంకా బోలెడుమంది ఫ్రీ పాస్‌లతో వస్తారట. అందుకని పాస్‌ల వాళ్ళని అస్సలు ఖాతరు చెయ్యరు. ఏదైతేనేంగానీ మా కొబ్బరి మట్టల ముఠా సర్కస్‌ని యమాగా ఆనందించింది. ఆట వదిలాక రెండో ఆట కోసం డేరా మీద తిప్పే లైటుని పూర్తిగా గమనించాక ఇంటిదారి పట్టాం. దారి పొడుగునా సర్కస్ ముచ్చట్లు తనివితీరా చెప్పుకున్నాం. మా ముఠాలో ఒకరిద్దరికి సర్కస్ ఫీట్ల మీద కొన్ని డౌట్స్ వున్నాయ్. అందుకని మళ్ళీ ఓసారి రావాలని అనుకున్నాం గాని కొబ్బరి మట్టలు ఎప్పటికి పెరిగేను? సర్కస్ మాట ఎట్లావున్నా, డేరాకెళ్ళి ఏనుగు లద్దె తొక్కిరావాలని మాత్రం గట్టిగా అనుకున్నాం. దానివల్ల ఎంత బలమొస్తుందో చంద్రం చూసినట్టే చెప్పాడు.

ఉన్నట్టుండి సర్కస్ సింహం చచ్చిపోయిందనే వార్త బాపట్లంతా నిండిపోయింది. ఏ నోట విన్నా ఇదే మాట. ఆదుర్దాగా వెళ్ళాం. నిజమే. సింహాన్ని లారీ మీదికి ఎక్కిస్తున్నారు. మున్సిపల్ గ్రౌండ్స్ జనంతో కిక్కిరిసిపోయింది. నిలబడే చోటు కూడా లేదు. మేం ఎలాగో బయటపడ్డాం.

మధ్యాన్నానికి సింహం శవయాత్ర మొదలైంది. లారీలో ఏటవాలుగా బల్ల బిగించి దాని మీద సింహాన్ని పడుకోపెట్టారు. పూలదండ వేశారు. సర్కస్‌లో వున్న ఆడ మగ పిల్లాజెల్లా లారీ వెంట నడిచారు. నీరసంగా బ్యాండ్ మేళం మోగుతోంది. పాపం, నిన్నగాక మొన్ననే కదా చూశాం! ప్రతి షోలో దానివంతు వచ్చినప్పుడు బోను చక్రాల మీద రింగులోకొస్తుంది. రింగ్ మాస్టర్ తలుపు తీసి బోనులోంచి సింహాన్ని దింపుతాడు. రింగ్‌మాస్టర్ తన మెడలో హంటర్‌ని తీసి ఝుళిపిస్తాడు. సింహం వులిక్కిపడుతుంది. పిల్లిలా అయిపోతుంది. రింగ్‌మాస్టర్ మెరిసే దుస్తుల్లో నల్ల కళ్ళద్దాల్లో ప్రత్యేకంగా కనిపిస్తాడు. సింహాన్ని రింగులో రెండుమూడుసార్లు నడిపించి ప్రేక్షకులకి ప్రదర్శిస్తాడు. తర్వాత సింహం ముందుకాళ్ళు తన అరిచేతుల్లో పెట్టుకుని వెనక కాళ్ళమీద నడిపిస్తాడు. మాస్టర్ జూలు మీద చెయ్యి వెయ్యగానే సింహం నోరంతా తెరిచి గర్జించేది. అప్పుడు టెంట్‌లో లైట్లారిపోతాయ్. సింహం మీద స్పాట్‌లైట్ పడుతుంది. తగినట్టు బ్యాండు మోగుతుంది. అంతా అయాక సింహాన్ని వొళ్ళంతా నిమిరి ఓ కుందేలుని దాని నోటికి అందిస్తాడు. దాన్ని కరుచుకుని సింహం బుద్ధిగా బోనులోకెళ్ళిపోయేది. ఇహ డేరా అయిదు నిముషాలు చప్పట్లతో యీలల్తో దద్దరిల్లిపోతుంది. ఇప్పుడా సింహం శవమై వూరేగుతోంది. దారుణం!

కొట్టాయం నించి సర్కస్ యజమాని నంబియార్ వచ్చి వాలాడు. అడ్డపంచె మీద సిల్కు చొక్కా, దాని మీద జారిజారిపోతున్న సిల్కు వుత్తరీయం, వేళ్ళనిండా వుంగరాలు, సగం మొహాన్ని మింగేస్తున్న నల్లద్దాలతో లారీ వెనక నడుస్తున్నాదు. హంటర్ మెడలో వేసుకుని లారీలో సింహం పక్కన నిలబడి రింగ్‌మాస్టర్ తలవంచి అందరికీ అభివాదం చేస్తున్నాడు.

వూరివారు కూడా వూరేగింపు వెనక నడుస్తూ సింహం మాటలే మాట్లాడుకుంటున్నారు.

‘ప్చ్… ఎంతటి సింహమైనా ఆ కొర్రగింజంతా వున్నంత వరకే. అది కాస్తా పోయాక ఒఠి తోలుబొమ్మే!’

‘ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో… పాపం, ఆఖరి కళ్ళం యిక్కడ రాసిపెట్టుంది…’

‘వేరే సర్కస్ కంపెనీ దగ్గర పదేళ్ళనాడు కొన్నార్ట. వీటికి ట్రయినింగులు అందరూ యివ్వలేరుట. ఇచ్చిన వాటినే కొంటార్ట. ఏంటో, అదో ప్రపంచం!’

‘చూశారా, క్షణభంగురం! ఫస్ట్ షోలో కూడా నోరంతా తెరిచి గర్జించిందిట. రెండో ఆటకి బోను తెరిచేసరికి చచ్చిపడివుందిట. అనాయాస మరణం! అదృష్టం…’

దారి పొడుగునా షాపుల షట్టర్లు మూసేశారు. కొందరు లారీ ముందు కొబ్బరికాయలు కొట్టారు.

గడియార స్తంభం సెంటర్లో గానుగ వీరాస్వామి ఇద్దరి సాయంతో లారీ ఎక్కాడు. గులాం కొట్టుకుని సింహం పక్కన నిలబడ్డాడు. వెంటనే జిందాబాద్‌లు, వర్ధిల్లాలి నినాదాలు చెలరేగాయ్. వీరాస్వామి మున్సిపల్ వార్డు మెంబరు. సముద్రానికి వెళ్ళే దారిలో రోడ్డు పక్క పోరంబోకులో సింహాన్ని గుంటపెట్టడానికి పర్మిషన్ యిప్పించింది ఈయనే కావడం వల్ల యీ జిందాబాదుళ్ళు. చాలామందికి జరగనంత వైభవంగా సర్కస్ సింహం అంతిమ యాత్ర సాగింది.

టౌనుకు దూరంగా రోడ్డువార అనుకున్న చోట గొయ్యి సిద్ధంగా వుంది. వూరేగింపు అక్కడికి చేరింది. అందరూ కలిసి వుపాయంగా సింహాన్ని గోతిలోకి దింపారు. శ్రద్ధగా పడుకోబెట్టారు. సర్కస్‌వాళ్ళు గోతి చుట్టూ నిలబడి ప్రభువు ప్రార్థన చేశారు. మళయాళంలో ఏమో మాటలన్నారు.

రింగ్‌మాస్టర్ మెడలో హంటర్ తీసి, పెద్ద ధ్వనితో ఝుళిపిస్తూ తను షోలో అరిచే అరుపు అరిచాడు. ఒక్కసారి… రెండుసార్లు… మూడుసార్లు… ఇక హంటర్ కిందపడేసి బావురుమన్నాడు. చేతుల్లో మొహం కప్పుకుని నా రాజు చచ్చిపోయాడంటూ గోలగోలగా ఏడ్చాడు. అంతా రింగ్‌మాస్టర్‌ని ఓదార్చారు. యజమాని నంబియార్‌తో మొదటి పిడికెడు మట్టి వేయించారు.

ఆ రోజు సర్కస్ డేరా ఆటలు లేక నిలిచిపోయింది. మొదటిసారి సర్కస్ డేరా ఆగింది!

సింహం పని చివరిదాకా చూసి, మేం ఇంటికి చేరాం. తాతగారు మాకోసం బయట గేట్లో కాపు కాస్తున్నారు. “నాకేం చెప్పద్దు. పదండి…” అంటూ బావి గట్టుకు తోలుకుపోయి లాగుచొక్కాలమీదే నీళ్ళు తోడించి పోయించారు. ఏవిఁటో పరమ చాదస్తం!

తర్వాత ఏ సెలవలకు వచ్చినా సింహాన్ని గుర్తుచేసుకుంటూ ఆ వైపు వెళ్ళొస్తుండేవాళ్ళం. వూరివాళ్ళక్కూడా అది బాగా గుర్తే. కొన్నాళ్ళకి ఆ దిబ్బ మీద ఏదో అడవి మొక్క పడి మొలిచింది. మొక్క మానుకట్టింది. అది మొక్కగా వున్నపుడు దాని ఆకుల్ని, చిగుళ్ళని మేకలు కూడా ముట్టుకునేవి కావుట! ‘భయం. అడుగున సింహం వుంది కదా!’ అనుకునేవారు. కొంచం పెరిగి పెద్దయాక దానికో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు దాన్నందరూ ‘సింహం చెట్టు’ అని పిలుస్తారు.