అదేమిటో

చీకట్లను ఈదుతూ అలసిపోతున్నపుడు
ఒక్కోసారి చందమామ అడ్డం పడి
వెన్నెలను పరిచయం చేస్తుంది

అదాటున బద్ధశత్రువు కనబడి
ప్రేమగా చేతులు చాపుతుంది

ఎన్నో సంక్లిష్టప్రశ్నలకు
ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న జవాబులు
ఉన్నట్టుండి కాళ్ళకడ్డంపడతాయి

ఒక్కోసారంతే!
మిట్టమధ్యాహ్నపు ఎండ
కొలిమిలా మండుతున్నప్పుడు
ఉక్కపోతను ఊదేస్తూ
చినుకుగజ్జెలతో ఓ
తడిమేఘం నడిచొస్తుంది

ఎన్నాళ్ళుగానో మొగ్గ తొడగని మొక్కకు
ఆకులన్నీ పూలై నవ్వుతాయి

అదేమిటో అరుదుగా ఒక్కోసారి…
తాకిన ప్రతీ వాక్యం
కవిత్వపు బంగారు తొడుగుతో
కనురెప్పల పరదాల మాటు నుండి
ఆనందభాష్పమై రాలిపడుతుంది.