ఒక కవిత ఏమి చేయలేదు

ముందుగా మూడు మాటలు

ఆంగ్ల కవిత్వంపై ఏమాత్రం ఆసక్తి ఉన్నా, అమెరికాలో పొయట్రీ మేగజైన్‌ పేరువినని వాళ్ళుండరు. 1912లో హారియట్ మన్రో (Harriet Monroe) స్థాపించి మొట్టమొదటి సంపాదకురాలుగా పనిచేసింది. తరువాత చాలామంది సంపాదకత్వం వహించారు. 2002లో ఇలై లిలీ (Eli Lily) మనుమరాలు రూత్ లిలీ, 100 మిలియన్ డాలర్లు ఇవ్వడంతో, పొయట్రీ మేగజైన్‌ ఒక ప్రత్యేక సంస్థ (Poetry Foundation) ఆధ్వర్యంలోకి వచ్చింది.

ఒకప్పుడు, తెలుగునాట భారతి పత్రికలోనో, తెలుగు స్వతంత్రలోనో, రెండవపేజీలో కవిత అచ్చయితే, తెలుగులో ‘కవి’ అని చక్రాంకితాలు వేసుకునేవాళ్ళు. సరిగ్గా, అల్లాగే, పొయట్రీ పత్రికలో కవిత అచ్చయితే, ఇంగ్లీషులో కవి అని ముద్ర పడిపోయేది. పాపం! రూత్‌ లిలీ కవిత్వం రాసింది కానీ తన కవిత ఒక్కటి కూడా పొయట్రీలో అచ్చవలేదు.

ఎజ్రా పౌండ్, ఇంగ్లండ్ నుంచి టి. ఎస్. ఎలియట్ రాసిన ‘ది లవ్‌సాంగ్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ ప్రుఫ్రాక్’ పొయట్రీ పత్రికకి 1914లో పంపించాడు. ఆ పద్యం 1915లో అచ్చయ్యింది. ఇప్పుడు మనం గొప్పకవులని చెప్పుకునే మేరియాన్‌ మూర్‌, కార్ల్‌ శాండ్బర్గ్, వాలెస్‌ స్టీవెన్స్‌, రాబర్ట్‌ ఫ్రాస్ట్‌, లాంగ్‌స్టన్ హ్యూస్‌, మొదలైనవారందరి కవితలూ ఈ పత్రికలోనే అచ్చయినాయి. మరో విశేషం. పత్రిక మొదలైన తరువాత (1912) మూడవ సంచికలో, (డిసెంబర్ 1912) రవీంద్రనాథ్ టాగోర్ మూడు కవితలు (ఆంగ్లానువాదాలు) ఈ పత్రికలోనే వచ్చాయి! 1913లో టాగోర్‌కి నోబెల్‌ బహుమతి వచ్చింది. హారియట్ మన్రోకి అది ఎంతో గర్వప్రాయం అయిందని చెపుతారు.

కొద్దిగా గూగులించినా ఎంతమంది ప్రముఖులు ఈ పత్రికకి ముఖ్యసంపాదకులుగా పనిచేశారో వివరంగా చూడొచ్చు. సంపాదకులుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ లక్ష్యాలకి కాలానుగుణంగా పత్రిక ప్రచురణలో మార్పులు తెచ్చారు. అయితే మన్రో ముఖ్యలక్ష్యం: ఇంగ్లీషులో మంచి కవిత్వం, ఎవరు రాసినా, ఎక్కడనుంచి వచ్చినా, ప్రచురించాలి. సంపాదకసంబంధిత పాలన (Editorial Policy), సంపాదకుల అభిరుచులతో, అభిమానాలతో, సాహిత్యోద్యమాలతో, ఎప్పుడూ ముడిపడకూడదు. ఈ లక్ష్యానికికి విరుద్ధంగా సంపాదకులెవ్వరూ ప్రవర్తించలేదు. సంవత్సరంలో సుమారు, 150000 కవితలు, వ్యాసాలు, పొయట్రీ పత్రికకి ప్రచురణకై వస్తాయి. బహుశా 350 రచనలు ప్రచురించబడతాయి.

2013 నుండి జులై 2020 వరకూ డాన్ షేర్ (Don Share) ముఖ్య సంపాదకుడిగా పనిచేశాడు. తన ముద్ర వేశాడనే చెప్పాలి. మైకల్‌ డిక్మన్‌ (Michael Dickman) ఒక యేడాది క్రితం, షేర్‌కి 30 పేజీల పద్యం (Scholl’s Ferry Road) పంపించాడు. జూన్‌-జులై, 2020 సంచికలో, షేర్‌ ఆ కవిత అచ్చువేశాడు. ఆ కవితలో నల్లజాతి స్త్రీలపై, పసిఫిక్ దీవుల్లో మైనారిటీలు, ఆసియా వాసులపై – వాళ్ళు మాట్లాడే భాషపై – క్రూరంగా, ప్రచ్ఛన్నంగా, ఎగతాళి చేసిన పదజాలం ఉన్నదని ఆరోపణ వచ్చింది. అమెరికన్‌ సాహిత్యరంగంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. వందలకొద్దీ రచయితలు, కవులూ, విమర్శకులూ సంతకాలతో ఉత్తరం రాశారు. డిక్మన్‌ స్వయంగా ఆ కవితని వెనక్కి తీసుకొని, పొయట్రీ పత్రిక ఆర్కైవ్‌ల్లో కూడా పెట్టవద్దని కోరాడు. డాన్‌ షేర్‌ పొయట్రీ పత్రిక ముఖ్యసంపాదకుడి పదవికి రాజీనామా ఇచ్చాడు. ఆ పద్యం ప్రచురించడంలో తాను ఆలోచనారహితంగా, దక్షతారహితమయిన నిర్ణయం చేసినట్టు ఒప్పుకున్నాడు.

డాన్‌ షేర్‌ రాజీనామా తరువాత, పొయట్రీ పత్రికలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం, మూడు సంచికలకి ఒక కొత్త అతిథి సంపాదకులు పత్రికని నిర్వహిస్తున్నారు. మైనారిటీ రచయితలకి, కొత్త కవులకీ ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతూన్నది.

మే నుంచి ఆగస్ట్‌ 2021 వరకు, అతిథి సంపాదకురాలు, అలబామా కవి, ఆష్లీ జోన్స్ (Ashley Jones). ‘కవిత్వం ఎల్లవేళలా ఒక అద్దంలా, ఒక భూతద్దంలా, ఒక ఉపశమనకారిగా ఉంటుందని నా నమ్మకం. ప్రస్తుతం కవిత్వం ఆ పని మరింత ఉధృతంగా చేస్తున్నది’ అని యాష్లీ రాసింది. జూన్ 2021 పత్రికలో డేరియస్‌ డాట్రీ (Darius V. Daughtry) రాసిన కవిత (What can a poem do?), ప్రచురించింది. తెలుగులో దాని అనుసృజన నేను జులై 12, 2021 ఆంధ్రజ్యోతిలో ఒక కవిత ఏమి చేయగలదు? అన్న మకుటంతో ప్రచురించాను.

అయితే, జులై-ఆగస్ట్ 2021 పొయట్రీ పత్రికలో ఆలియా కాటన్‌ (Aliyah Cotton) రాసిన కవిత (What a Poem Cannot Do) ప్రచురించబడింది. ఈ కవిత డాట్రీ కవితకన్నా శక్తివంతమైనదని, సమయోచితమైనదనీ నా అభిప్రాయం.

నేనే పొయట్రీ పత్రికకి అతిథి సంపాదకుడినయివుంటే, ఈ రెండు కవితలూ ఒకే సంచికలో ప్రచురించేవాడిని. అంతేకాదు. ప్రచురణకి ముందుగా రెండు కవితలనీ ప్రముఖ విమర్శకులకి పంపించి, తులనాత్మకంగా పరిశీలించి వ్యాఖ్యలు రాయమని కోరేవాడిని. జులై-ఆగస్ట్ 2021 సంచిక పూర్తిగా ఈ రెండు కవితలకే కేటాయించేవాడిని. మొదటి కవిత ఆంధ్రజ్యోతిలో అచ్చు కాకపోతే, రెంటినీ ఒకే వారం వెయ్యమని బ్రతిమాలుకునేవాణ్ణేమో! అది ఎలానూ కుదరదు కాబట్టి ఇప్పుడు ఈమాటలో రెండో కవిత ఈ ముందుమాటలతో వేయమని అడిగాను. – వేవే.

ఒక కవిత ఏమి చేయలేదు

ఒక ఉరితీతకు సిద్ధం చెయ్యలేదు. ఒక పురుషుణ్ణి
ఒక స్త్రీని, ఒక పసి బిడ్డని, ఇంటికి పోతున్నప్పుడు అడ్డగించలేదు.
భయంతో శరీరం కొంకర్లుపోతూ,
దుమ్ములో కాలి మడమలు కొట్టుకుంటూ వాళ్ళని
ఆ ఇంట్లో నుంచి బలవంతంగా బయటికి యీడ్చలేదు.
తగినంత మోటుగా పేని
గట్టిగా ముడి వేసి, బారువ బరువు మోయగల
ఒక భారీ తాడు తేలేదు.
ఒక బలమైన తాడు.

ఉరి ఉచ్చు గట్టిగా బిగించే తాడు వెతకలేదు.
బలమైన కొమ్మలతో ఎత్తైన చెట్టు వెతకలేదు.
ఉన్నట్టుండి వేలాడపడే చావు బరువుని
తట్టుకోగలిగే చేపుగా పెరిగిన చెట్టును వెతికి పట్టుకోలేదు.

కొమ్మ మీదుగా తాడు విసిరి కంఠహారంలా చేయలేదు.
భయభరితంగా శరీరం
కొయ్యబారిపోయేదాకా తాడు బిగువుగా లాగి పట్టుకోలేదు.
తరువాత, తొడలమీదగా కారే ద్రవం కాలేదు.
ఉబ్బిన కళ్ళు కానేకాలేదు.

రాక్షసిబొగ్గులా నల్ల రంగులో చెవిపోగుల్లా ఊగిసలాడే
భారీశరీరాన్ని చూసే మూకజనం కాలేదు.

ఇది
కాల్చలేదు. కొరివితో
వాతపెట్టి శరీరాలపై గుర్తుగా
ముద్ర వెయ్యలేదు.
నవ్వుతూ చప్పట్లుకొడుతూ
ప్రోత్సహించే మూకజనం కాలేదు.
చక్కగా చూడడానికి అనువుగా
బుల్లోడిని బుజాలకెత్తుకునే తండ్రి కానేకాలేదు.

తళుక్కున మెరిసే దీపం,
గొంతులో కఫంలా చప్పుడు చేసే
పాత కెమేరా కాలేదు.

ఇది
జ్ఞాపకచిహ్నాలుగా దాచుకొని,
భవిష్యత్తులో అమ్ముకొనే పోస్ట్‌కార్డులు
కాలేదు.

లేదా ఉత్సవాల్లో పంచరంగులతో
అలంకరించబడి ఊరేగించే
ప్రభలు కాలేదు,
గాలిగుమ్మటాలు కట్టి శరీరాన్ని
ఊరంతా తిప్పి ప్రదర్శించలేదు.

ఒక పద్యం రాత్రి మేరీ టర్నర్‌ను[1]మే 16, 1918న, ఒక వలసతోట యజమాని హత్య చేయబడ్డాడు. నేరస్థుణ్ణి గుంపుగా వేటాడి పట్టుకోటానికి ఆ హత్య ఒక ప్రత్యేక ప్రేరణ అయ్యింది. దీని ఫలితంగా మే 1918లో జార్జియా రాష్ట్రం (యు.యస్.ఏ.)లో వరుసగా హత్యలు జరిగాయి. తెల్లవాళ్ళు, రెండు వారాల్లో కనీసం 13 మంది నల్లజాతీయులను చంపారు. మరణించిన వారిలో హేస్, మేరీ టర్నర్ ఉన్నారు. మే 18న హేస్ హత్య చేయబడ్డాడు. మే 19న అతని భార్య మేరీని, ఆమె పాదాలు కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అప్పటికి మేరీ ఎనిమిదినెల్ల గర్భవతి. ఆమెకు పుట్టబోయే బిడ్డను ఆమె పొత్తికడుపు నుండి పెరికితీసి నరికి చంపారు. ఆమె శరీరాన్నిపదేపదే తుపాకులతో కాల్చివేసారు. ఆమె సామూహిక హత్యకు ఎవరూ శిక్షింపబడలేదు.

జాతివిచక్షణ ప్రబలంగా ఉండే రోజులవి. అమెరికాలో, దక్షిణరాష్ట్రాలలో నల్లజాతి ప్రజలపై ప్రత్యేకించి 1880 నుండి 1930 వరకు, లించింగ్‌లు శిఖరాగ్రానికి చేరాయి. అప్పటిలో జార్జియారాష్ట్రంలో అత్యధికంగా హత్యలు జరిగాయి. యు. యస్. ఏ. లో హత్య చేయబడిన వేలాది వ్యక్తులలో ఎక్కువమంది నల్లజాతివారు; చాలామంది మగవాళ్ళు. కానీ కనీసం 159 మంది మహిళలు కూడా హత్యచేయబడ్డారు.

పెరుక్కొని లాక్కొని పోలేదు.
ఇది ఆమె రక్తం వేడిని అనుభవించదు
ఆమె బట్టలు పెట్రోల్‌లో పడేయలేదు.
ఇది ఆమె కడుపులోకి లోతుగా పోయి
పిల్లవాడిని బలాత్కారంగా పెరకలేదు.
ఎనిమిది నెలల జీవితాన్ని చితకగొట్టే
చిత్రవధ చేసే బూటు మడమ కాలేదు.

‘నువ్వు ఎప్పటికీ మీ తల్లిలా
మట్టిలో మోకాళ్ళపై పడి ప్రార్థించలేవు,’
అని, ఆమెతో చెప్పలేదు.

ఇది శవాన్ని గోనెసంచిలో ఇంటికి తీసుకెళ్ళలేదు
కట్టె గొడ్డలితో కళేబరాన్ని చిత్రవధ చేయలేదు.
ఇది కొయ్యగుంజకి తల తగిలించి
ఆ గుంజని రహదారిలో నేలపై పాతలేదు.
ఇది తల అక్కడ వదిలి రాలేదు
సూర్యుడు, పక్షులు, క్షుద్ర క్రిమికీటకాలు వచ్చేవరకు.

[గమనిక: “రిపబ్లికన్లందరూ ఇక్కడ ఏమి చూస్తున్నారో గుర్తుంచుకోవాలి – ఇది ఒక ఉరితీత (Lynching)[2](of a mob) kill (someone), especially by hanging, for an alleged offense with or without a legal trial.చిత్రవధచేయు, విచారణ చేయకుండా చంపు.. కానీ మేము గెలుస్తాము! అక్టోబర్ 22, 2019 – తనపై అభిశంసన తీర్మానంపై చర్చ జరుతున్న సందర్భంలో ట్విట్టర్లో డానల్డ్ ట్రంప్!]

అధస్సూచికలు[+]