కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం

తెలుగు వ్యాకరణం అనగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే పేరు బాలవ్యాకరణము రాసిన పరవస్తు చిన్నయ సూరి. కానీ ఆయన 19వ శతాబ్దంవాడు. పాశ్చాత్యుల సమకాలీనుడు. తెలుగులో మొదటి వ్యాకరణం అనగానే చాలామంది పండితులు నన్నయ పేరును, ఆయన రాసినట్లుగా ప్రాచుర్యం పొందిన ఆంధ్రశబ్దచింతామణినీ చెప్తారు. కానీ ఈ విషయంలో వ్యాకరణవేత్తలలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. నన్నయ చింతామణి రాయలేదని చెప్పడానికి ఆధారాలు బలంగానే ఉన్నా, నన్నయ్యనే తొలితెలుగువ్యాకర్తగా ఇప్పటికీ ప్రస్తావించేవారే ఎక్కువ. కానీ జాగ్రత్తగా అధ్యయనం చేస్తే తెలుగుకు తెలుగులో మొట్టమొదటగా వ్యాకరణం రాసింది 13వ శతాబ్దానికి చెందిన మూలఘటిక కేతన. ఆ వ్యాకరణం పేరు ఆంధ్రభాషాభూషణము. దీనికి సాక్ష్యంగా ఆయన తన పరిచయ పద్యాలలో మూడు పద్యాలలో ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు. (క్రింద పరిచయ పద్యాలు అన్న విభాగం చూడండి.)

తిక్కన మహాకవికి సమకాలికుడై ఆయనకు తన దశకుమారచరితము అనే దండి మహాకవి కావ్యపు తెలుగుసేతను అంకితమిచ్చి ఆయన మన్ననలు పొందిన కేతన ఇంత గట్టిగా తానే తెలుగుకు మొదటగా వ్యాకరణం రాస్తున్నాను అని చెప్పుకున్నాడు. అలాంటి మొదటి వ్యాకరణం గురించి ఎందువల్లనో గానీ తెలుగువారు గుర్తింపు ఇవ్వక పోవడం విచారకరం.

కేతన ఎవరు?

మూలఘటిక కేతన కవి, వ్యాకర్త, ధర్మశాస్త్రకర్త. సంస్కృతంలో దండి రాసిన దశకుమారచరిత్రను తెలుగులో రాసి, సమకాలీన కవి అయిన తిక్కనకు అంకితమిచ్చాడు. రాసిన పీఠికా పద్యాలలో తిక్కన వంశచరిత్ర ఉంది. కవికి అంకితమిచ్చే ఒరవడి కేతనదే. ఆంధ్రభాషాభూషణపు పరిచయపద్యాల్లో తను మ్రానయ, అంకమలకు కొడుకునని, సత్కవిగా పేరుపొందానని జ్ఞాన సంబంధ విషయాలపై లగ్నమైనవాడినని, మితభాషినని, ఎన్నో శాస్త్రాలు తెలిసినవాడిననీ తిక్కనచే మెచ్చిన కవినని చెప్పుకొన్నాడు.

క.⁠
వివిధకళానిపుణుఁడ నభి
నవదండి యనంగ బుధజనంబులచేతన్
భువిఁ బేరుఁ గొనినవాఁడను
గవిజనమిత్రుండ మూలఘటికాన్వయుఁడన్. (2)

క.⁠
ఖ్యాతశుభచరిత్రుఁడ వృష
కేతనపాదద్వయీనికేతనుఁ డనఁగాఁ
గేతన సత్కవి యనఁగా
భూతలమున నుతిశతంబుఁ బొందిన వాఁడన్.⁠ (3)

క.⁠
మ్రానయకును నంకమకును
సూనుఁడ మిత సత్యనయవచో విభవుఁడవి
జ్ఞానానూనమనస్కుఁడ
నానాశాస్త్రజ్ఞుఁడను గుణాభిజ్ఞుండన్. ⁠ (3)
కవితచెప్పి ఉభయకవి మిత్రుమెప్పింప
అరిది బ్రహ్మకైన నతడు మెచ్చ
పరగ దశకుమార చరితంబు చెప్పిన
ప్రోడ నన్ను వేరె పొగడనేల? (ఆంధ్ర–5)

దశకుమారచరితము వల్ల తనకు ‘అభినవదండి’ అన్న పేరు వచ్చిందని మొదట్లోనే అభివర్ణించుకొన్న అతడు, అరుదైన కవిబ్రహ్మ తిక్కన మెప్పు పొందిన తనకు ఇంకా వేరే పొగడ్త అవసరమా? అని చెప్పుకొన్నాడు.

తెలుగు సాహిత్య పరిణామాన్ని పరిశీలిస్తే కవి తన గురించి, తన కుటుంబం గురించి అంకితం పొందే వారిగురించి, తన గ్రంథం గురించి కావ్యమైతే ఆ కావ్యంలోని తను రాసే తీరు గురించి (కవిత్వ లక్షణం) ఇలాంటివన్నీ వివరిస్తాడు. కానీ వ్యాకర్తలు తమ వ్యాకరణం గురించి చెప్పుకోవడం తక్కువగా కనిపిస్తుంది.

ఆంధ్రభాషాభూషణము: పరిచయ పద్యాలు


ఆంధ్రభాషాభూషణము
190 పద్యాలతో ఏకాశ్వాసంగా రాసినట్టు కనిపిస్తుంది. 191వ పద్యం ఆశ్వాసాంత గద్యంగా ముగింపు చెప్తుంది. దీన్లో వ్యాకర్త పరిచ్ఛేద విభజన ఏమి ప్రత్యేకంగా చేయలేదు. కానీ ఆ విభజన చేసుకొనేవిధంగా వీలు కల్పించాడు. మొదట ఒకే ఒక పద్యంలో దేవతాస్తుతి చేసి విద్వత్కవులకు నమస్కరిస్తాడు. తర్వాత మొదటి మూడు పద్యాల్లో తనగురించి తను క్లుప్తంగా పరిచయం చేసుకొంటాడు.

తర్వాత ఆరు పద్యాలలో మునుపు తెనుగునకు లక్షణములు ఎన్నడు, ఎవ్వరు చెప్పరు(6) అని, తాను నన్నయ వంటి కవుల కరుణతో మొదటిసారి చెప్తున్నానని, సంస్కృతం ప్రాకృతం వంటి భాషలకు లక్షణాలు చెప్పి తెలుగుకు చెప్పకపోవడం తనకన్న పూర్వకవుల నేరం కాదని, తను అదృష్టవంతుణ్ణి కావడానికే వాళ్ళు దానిని తనకు వదిలివేశారని చెప్పుకొన్నాడు (పద్యం 7).

క.
మున్ను తెనుఁగునకు లక్షణ
మెన్నడు నెవ్వరును జెప్ప రేఁ జెప్పెద వి
ద్వన్నికరము మది మెచ్చఁగ
నన్నయభట్టాదికవిజనంబులకరుణన్. (5)

తే.
సంస్కృతప్రాకృతాదిలక్షణముఁ జెప్పి
తెనుఁగునకు లక్షణముఁ జెప్పు కునికి యెల్లఁ
గవిజనంబుల నేరమి గాదు నన్ను
ధన్యుఁ గావింపఁదలఁచినతలఁపుగాని. (6)

క.
భాషావేదులు నను విని
యాషణ్ముఖపాణినులకు నగు నెన యని సం
తోషింప నాంధ్రభాషా
భూషణ మనుశబ్దశాస్త్రమున్ రచియింతున్. (7)

క.
⁠ఒప్పులు గల్గిన మెచ్చుఁడు
తప్పులు గల్గిన నెఱింగి తగ దిద్దుఁడు త-
ప్పొ ప్పనకుఁ డొప్పు తప్పని
చెప్పకుఁ డీ కవు లుపాస్తి చేసెద మిమ్మున్. (8)

అంతటితో ఆగకుండా మళ్ళీ 11వ పద్యంలో ‘క్రొత్తగా ఆంధ్రభాషకు గొండొక లక్షణమిట్లు చెప్పెనే, ఉత్తమ బుద్ధి వీడ’ అని ముఖం పక్కకు తిప్పుకోక నా వ్యాకరణం వినండి; కవులారా మీకు మొక్కుతాను అని చెప్పుకొన్నాడు.

ఉ.
క్రొత్తగ నాంధ్రభాషకును గొండొకలక్షణ మిట్లు చెప్పెనే
యుత్తమబుద్ధి వీఁడ యని యోరలు వోవక విన్న మేలు మీ
రొత్తిన మీకు మాఱుకొని యుత్తర మిచ్చుట చాలవ్రేఁగు మీ
చిత్తమునందున న్నెరవు సేయకుఁడీ కవులార మ్రొక్కెదన్. (11)

ఇన్ని విధాలుగా కవి తానే నన్నయభట్టు మొదలైన కవుల కరుణతో తెలుగుకు ‘మొట్టమొదటి’ వ్యాకరణం రాస్తున్నానని చెప్పుకొన్నా, తెలుగు సమాజం అతన్ని, అతని వ్యాకరణాన్ని తగిన విధంగా ఆదరించలేదని చరిత్ర సాక్ష్యం చెప్తుంది.

అదే విధంగా ఆయన రాసిన పూర్తి పద్యాన్ని వదలి, ఆ పద్యంలోని మొదటి పాదాన్ని మాత్రమే తీసుకొని ఉటంకిస్తూ ‘తల్లి సంస్కృతంబె యెల్ల భాషలకును’ అంటూ ఆయన మూడో పాదంలో చెప్పిన ‘కొంత తాన కలిగె’ అన్న విషయాన్ని వదలివేశారు. దాంతో అశాస్త్రీయమైన జన్యు-జనక సంబంధం సాహితీవేత్తలలో స్థిరస్థానం సంపాదించుకొన్నది (పద్యం 14).

ఆ.
తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును
దానివలనఁ గొంత గానఁబడియెఁ
గొంత తాన కలిగె నంతయు నేకమై
తెనుఁగుబాస నాఁగ వినుతి కెక్కె. (14)

ఆధునికమైన శాస్త్రీయ ఆలోచనా విధానంలో వలె భాషను వర్ణించటానికి అనేక దారులు (పథాలు) ఉన్నాయని, తాను చూపేది ‘ఒక త్రోవ’ మాత్రమేనని, అది ఎవరైనా గంగ (కాశీ) వెళ్ళాలని కంచి నుండి బయలుదేరితే ఒక మార్గం ఓరుగల్లు, అయోధ్యల మీదుగా వెళ్ళమన్న విధంగా ఉంటుందనీ చెప్పాడు (పద్యం 13).

తే.⁠
కంచి నెల్లూరు మఱి యోరుఁగ ల్లయోధ్య
యనుపురంబులపై గంగ కరుగు మనిన
పగిది నొకత్రోవఁ జూపెద బహుపథంబు
లాంధ్రభాషకుఁ గల వని యరసికొనుఁడు. (13)

14వ పద్యంలో చెప్పిన విషయాన్ని మరింత బలోపేతం చేస్తూ ‘తెలుగున గల భేదంబులు … యెఱింగింతున్’ (15) అని చెప్పుకొన్నాడు.

క.
తెలుఁగునఁ గల భేదంబులుఁ
దెలుఁగై సంస్కృతము చెల్లు తెఱఁగులుఁ దత్సం
ధులును విభక్తులు నయ్యై
యలఘుసమాసములుఁ గ్రియలు నవి యెఱిఁగింతున్. (15)

ఆంధ్రభాషా భూషణము: పద వర్గీకరణ

సంస్కృతం ఎట్లా తెలుగై చెల్లుతుందో చెప్పే అంశాలన్నీ పదవర్గీకరణ చెప్తుంది. అయితే, విచిత్రంగా కేతన పదాలను అయిదు విధాలుగా వర్గీకరిస్తాడు. అవి:

ఆ.
తత్సమంబు నాఁగఁ దద్భవం బన నచ్చ
తెనుఁగు నాఁగ మఱియు దేశ్య మనఁగ
గ్రామ్యభాష నాఁగఁ గల వైదుతెఱఁగులు
వేఱె వేఱె వాని విస్తరింతు. (19)

ఈ తత్సమ, తద్భవ, అచ్చతెనుగు, దేశ్య, గ్రామ్య భేదాలలో అచ్చతెలుగును, దేశ్యాన్ని వేరువేరు పదవర్గాలుగా విభజించడంలో కేతన ఉద్దేశ్యమేమిటో మనకు పూర్తిగా బోధపడదు. కేతన తరువాతి వ్యాకర్తలు తత్సమ, తద్భవ, దేశ్య, గ్రామ్య అన్న నాలుగు విభాగాలనే అనుసరించారు.

తత్సమం అంటే?

తత్-సమం = తత్సమం. అంటే మూల సంస్కృతానికి సమానమైనవి అని. సంస్కృతంలోని పదాలన్నింటికీ అంతర్గత లింగం ఉంటుంది అర్థాలతో సంబంధం లేకుండా. అందువల్ల ఏయే సంస్కృత పదాలు తెలుగులో ఎట్లా వాడాలో తత్సమీకరణ సూత్రాలు మనకు తెలియజేస్తాయి. ఇవి ఎలా రూపొందుతాయో కేతన సూత్రీకరించి ‘సంస్కృత పదాలకై తెలుగు విభక్తులు’ చేరిస్తే తత్సమాలు అవుతాయని సూత్రీకరించి వన = వనము; ధన = ధనము; పురుష = పురుషుడు; అబలా = అబల; వసుమతీ = వసుమతి అని ఉదాహరణలిచ్చాడు. దీనివల్ల తత్సమీకరణ విధానం తెలియడమే కాదు; తెలుగు పదాలకు వేటికీ లేని ప్రథమా విభక్తి ప్రత్యయాలు అంటూ మనకు ‘డు, ము, వు’ అనే ఏకవచన ప్రత్యయాలు కొత్తగా వచ్చి చేరాయి. తమ్ముడు, అల్లుడు వంటి బంధువాచకాలలో కనిపించే డు-ప్రత్యయం తప్ప తెలుగులో ఏ పదాలకు ఈ విభక్తి ప్రత్యయాలు చేరవు. అందువల్ల తెలుగు భాషకు సహజంగా లేని ఏకవచన ప్రత్యయాలంటూ భాషావ్యవహారంలో ఈ మూడు ప్రత్యయాలు చేరాయి. మనకు భాషలో ఉన్నది కేవలం బహువచన ప్రత్యయమైన ‘లు’ మాత్రమే.

తద్భవాలు

దీనిని నిర్వచించకపోయినా, ఒక కందపద్యంలోనూ, ఒక సీసపద్యంలోనూ తద్భవ తత్సమాలు పక్కపక్కనే ఇవ్వడం వల్ల ఏయే తత్సమాలు ఏయే తద్భవాలుగా మారినాయో మనకు తెలుస్తుంది. ఇవన్నీ తెలుగు విద్యార్థులు పాఠశాల స్థాయిలో తెలుసుకొనే ఉదాహరణలే:

తద్భవం తత్సమం
లచ్చి లక్ష్మి
అచ్చం అచ్ఛం
వివ్వచ్చుడు బీభత్సుడు
గొనములు గుణములు
కొలము కులము
సిరి శ్రీ
దెస దిశ
బాస భాష
జముడు యముడు
జక్కులు యక్షులు
ఆన ఆజ్ఞ
జూదము ద్యూతము
మొగం ముఖము
కర్జం కార్యం

ఇప్పుడు వినియోగంలో లేని కొన్ని పదాలని ఈ కింది పదాలను తద్భవాలుగా ఇచ్చాడు:

తద్భవం తత్సమం
అగ్గువ అర్ఘంబు
దిగ్గియ దీర్ఘిక
నిద్దము స్నిగ్ధము
బన్నము భంగము
ముగుదుండు ముగ్ధుండు
అసము యశము
సమ్మెట చర్మయష్టి
ఈరసము ఈర్ష్య
వేరము వైరము

వీటినే వికృతి-ప్రకృతిగా విద్యా బోధనలో వ్యవహరిస్తూ వచ్చారు.

అచ్చతెలుగు

కొన్ని పదాలను ఇచ్చి– తల, నెల, వేసవి, గుడి, మడి, పులి, చలి, మడుగు, ఊరు, పేరు, బూరుగు, మగవాడు, అలుక–ఇవన్నీ ఎల్లవారికి తెలుసునని ఇవి అచ్చతెలుగులనీ వివరించాడు.

క.
తల నెల వేసవి గుడి మడి
పులి చలి మడుఁ గూరు పేరు బూరుగుమగవాఁ
డలుక యని యెల్లవారికిఁ
దెలిసెడియాపలుకు లచ్చతెనుఁగనఁబరఁగున్.

దేశ్య తెనుగు

సీ.
ఎఱుకువ నెత్తమ్మి యెరగలి యెసకంబు
నొస లింతి తేఁటి వెక్కసము నెమ్మి
మక్కువ చెచ్చెర మచ్చిక పొచ్చెము
కదిమి యేడ్తెఱ లగ్గు కలవలంబు
వెన్ను విన్నదంబు వీనులు వెన్నడి
యెక్కలి తివురుట యుక్కు మేటి
బాగు తొయ్యలి బోఁటి ప్రన్నన సరి జోటి
వేనలి పొలపంబు విన్ను మన్ను
తే.
నెల్లి కొఱలుట వీచోపు లుల్ల మువిద
వీఁక కాఱియ గ్రద్దలు వేఁట గ్రేణి
కౌను పాలిండు లొగి మొగి గనయ మిట్టి
తెఱఁగుపలుకులు ధర దేశితెనుఁగు లయ్యె.

వీటికి కేతన ఇచ్చిన ఉదాహరణలలో మనం నిత్యజీవితంలో వాడేవి తక్కువగానే కనిపిస్తాయి:

ఎఱకువ; నెత్తమ్మి; ఎరగలి; ఎసకంబు; నొసలు; ఇంతి; తేటి; వెక్కసము; నెమ్మి; మక్కువ; చెచ్చెర; మచ్చిక; పొచ్చెము (పొరపొచ్చాలు); కడిమి; యేడ్తెఱ; లగ్గు; కలవలము; వెన్ను విన్నదనము; వీనులు; వెన్నడి; ఎక్కలి; తివురుట; ఉక్కు; మేటి; బాగు; తొయ్యలి; బోటి; సరిజోటి; వేనలి; పొలపము; విన్ను; మన్ను; నెల్లి; కొఱలుట; వీచోపు లు ఉల్లము; ఉవిద; వీక; కాఱియ; గ్రద్దలు; వేట; క్రేణీ; కౌను పాలిండ్లు; ఒగి; మొగి; గనయము (వీటి అర్థాల కోసం చూడండి: ఉషాదేవి 2009[1]).

దేశ్యంపు తెనుగు

ఈ క్రింది ఉదాహరణలు:

సీ.
తెమ్మెర లెలమావి తెలిగన్ను క్రొన్నన
నలరాజు రేఱేఁడు వాలుఁగంటి
యలరులపిండు తెక్కలికాఁడు క్రొమ్మించు
కెమ్మోవి కెంజాయ కమ్మతావి
కడలి తామరకంటి వెడవిల్తుఁ డెడకాఁడు
నలువ కలువకంటి నాన సెగ్గ
మెలనాఁగ ముద్దియ చెలువ చిగురుబోఁడి
తెఱవ తలిరుబోఁడి మెఱుఁగుబోఁడి

తే.
పదరు విసువుట పరి గమి పసలు నసదు
పొద్దు రేయెండ తబ్బిబ్బు పోటు ముట్టు
తనివి వలవంత చెంత మంతన మనంగఁ
దేరనాడిన దేశ్యంపుఁదెనుఁగు లయ్యె. (25)

గ్రామ్యము

27వ పద్యంలో గ్రామ్యమనగ నెవ్వరును ఒప్పరు అనియు, ఒరుల తెగడుచోట ఒప్పును అని చెప్పినాడు కేతన.

ఆ.
[…] గ్రామ్య మనఁగ నెవ్వరు నొప్ప
రొరులఁ దెగడుచోట నొప్పు నదియు. (27)

గ్రామ్యానికి ఈ క్రింది ఉదాహరణలు 26వ పద్యంలో ఇచ్చాడు:

సీ.
పంచాకుమయ్య తోపించాకుమయ్య వా
టీదెచ్చుతారు మమ్మూదలంచి
యేగ గొంటూరమ్ము యేదాలు వోదాలు
మోనేటివా రానసేసువారు
వాడి విరాళితో బాడిగ వోకుమీ
యీడేకదా మమ్ము యినుతిసేసె
పంపేరు తెంపేరు పాడేరు సూసేరు
యిందాము కందాము పొందు మిస్తి

ఆ.
అటుకు దవ్వు వెగడు నషువలె నిషువలె
నాడ నీడ నేడ నచ్చ నిచ్చ
నోయ గాయ వేయ కుండాడు బామ్మఁడు
గద్ద గుద్దు నాఁగ గ్రామ్య మయ్యె. 26

ఇందులో క్రియాపదాలు ఇప్పటికీ వివిధ ప్రాంతాల్లో వాడుతున్నవే. కొన్ని మాటలు కొందరు సామాజికులకు మాత్రమే పరిమితం (అషు, ఇషు, బామ్మడు మొ.) ఇందులో ఇతరులను తెగిడే (తిట్టే) మాటలేవీ చెప్పలేదు. తీసుకొంటే ఒక్క ‘బామ్మడు’ అన్న పదాన్ని తీసుకోవాలి. అది కూడా పల్లె జనాల్లో వాడుక మాటే తప్ప తిట్టుగా వాడే మాట కాదు. అంటే గ్రామ్యం అంటే వాడకూడని ట్యాబూ అన్న అర్థంకన్నా గ్రామీణ ప్రాంతాల భాష అనుకోవాలి.

ఇంతా చెప్పి చివరకు తత్సమం తప్ప తక్కిన నాలుగు రకాలైన పదాలను ‘అచ్చతెలుగు’ అని ‘అఖిల జనులు’ అంటారని చెప్పాడు.

ఆ.
తత్సమంబు దక్క తక్కిన నాలుగు
నచ్చ తెనుఁగు లందు రఖిలజనులు […] (27)

అంటే ఇక్కడ తత్సమం కానివన్నీ తెలుగు అని, అంటే తెలుగు వ్యాకరణ లక్షణాలతో వీటినన్నింటిని విచారించవచ్చుననీ అన్నాడు. ఒక తత్సమానికే సంస్కృత లక్షణాలు పాటించాలి కాబట్టి తత్సమమే భిన్నం.

ఆంధ్రభాషా భూషణము: అచ్చులు, హల్లులు

అయితే పదవర్గీకరణ కంటే ముందే కేతన కేవలం రెండు పద్యాలలోనే తెలుగు అక్షరాలను వివరించాడు. మొత్తం ఎన్ని అన్నది అతడు నిర్ధారణగా చెప్పలేదు.

క.
ఆదులు స్వరములు నచ్చులు
కాదు లొగి న్వ్యంజనములు హల్లులు ననఁగా
మేదిని నెల్లెడఁ జెల్లును
కాదుల నైదైదు కూర్ప నగువర్గంబుల్. (16)

అ-తో మొదలయ్యేవి: స్వరములు, అచ్చులు
క-తో మొదలయ్యేవి: వ్యంజనములు, హల్లులు,

కేతన అచ్చులకు ఆదులని, వర్గాక్షరాలైన హల్లులకు కాదులని చక్కటి తెలుగు పేర్లు పెట్టాడు.

కాదులను ఐదు ఐదు చొప్పున చేర్చితే ‘వర్గములు’ అవుతాయి అని చెప్పాడు. అంటే:

క వర్గము: క ఖ గ ఘ ఙ
చ వర్గము: చ ఛ జ ఝ ఞ
ట వర్గము: ట ఠ డ ఢ ణ
త వర్గము: త థ ద ధ న
ప వర్గము: ప ఫ బ భ మ

కాదులను ఐదు-ఐదు చొప్పున 5 వర్గాల్లో ఉన్న అక్షరాలు 5×5 = 25. ఇక మిగిలినవి-

క.
యరలవలును శషసహలును
నరయఁగ నంతస్థ లూష్మ లనఁగాఁ జెల్లున్
సరవి నివె పేళ్ళు పెట్టుదుఁ
దిరముగఁ దల్లక్షణములు దెలిపెడిచోటన్. (17)

అంటే మిగిలిన హల్లులు ఇవి:

య ర ల వ – అంతస్థములు
శ ష స హ – ఊష్మములు

అంటే మొత్తం కేతన ఇచ్చిన హల్లుల సంఖ్య 25+8 = 33. ఇందులో అచ్చులెన్నో తెలియవని ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే సంస్కృతంలో హ్రస్వ ఎ, ఒ లు ఉండవు కదా. అలాగే, తెలుగులో ఐ, ఔ ఉండవు. అం, అః అని ఆ రోజుల్లో ఉన్నట్టు లేదు. అలాగే, కేతన ళ, క్ష, ఱ-ల గురించి ఏమీ చెప్పలేదు. ఈ అక్షరాలను తాను పద్యాలలో వాడినా అక్షరాలలో వాటిని పేర్కొనలేదు.

(సశేషం)

గ్రంథసూచి:

  1. Mūlaghaṭika Kētana, and A. Usha Devi. 2009. Andhra bhaashaa bhuushanamu (English translation, with commentary) Vijayawada: Emesco Books.
అయినవోలు ఉషాదేవి

రచయిత అయినవోలు ఉషాదేవి గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి \"ఉత్తమ ఉపాధ్యాయ\" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు. ...