చివరికి అంతా తెలిసిపోతుంది!

చివరికి అంతా తెలిసిపోతుంది
ప్రశ్నలన్నీ
రెక్కలు విప్పార్చుకున్న పిట్టల్లా ఎగిరిపోతాయి
పుస్తకం తెరిచివున్నట్టే ఉంటుంది
రాసుకోవడానికే ఏమీ మిగలదు
గాలి పాడుతున్నట్టే ఉంటుంది
స్వరాలేవీ సరిగా ధ్వనించవు

అంకం తర్వాత అంకంగా సాగిన
ప్రయాణమంతా
కళ్ళముందు కదలాడుతుంటుంది
ఏ సవ్వడీలేని చోట నిశ్శబ్దం
గంభీర ప్రసంగాన్ని కొనసాగిస్తుంది

వెర్రిగా తమ వెంట పరుగులు పెట్టించిన
చెలమలన్నీ ఎండమావులని తేలిపోతుంది
ఆశగా పెంచుకున్న గువ్వలు
ఆరాటపడి కూడబెట్టుకున్న ఆడంబరాలూ
ఏవీ వెంటరావని తెలిసిన క్షణం
ఈ మాత్రం దానికి ఇంత దూరం నడవాలా
అన్న స్పృహ…
పెదాల మీద బ్రహ్మాండమంత చిర్నవ్వవుతుంది
అన్నీ అర్థమవుతోన్నా ఏదీ చెప్పలేని అశక్తత
ఎవరికి వాళ్ళే తెలుసుకుంటార్లే అనే వైరాగ్యం
చిట్టచివరి జ్ఞానపుట బట్టబయలవుతుంది.

చివరికి అంతా తెలిసిపోతుంది
రంగులన్నీ మాయమైపోతాయి
రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడి
గుండెలమీద నగ్నంగా నర్తిస్తాయి.
ఆ దట్టమైన చీకటిలోయలో
ఆఖరికి అన్నీ కనబడతాయి
స్పష్టంగా… నిర్దిష్టంగా!

సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...