పీడ‌క‌ల‌ను నేను…

వీధుల్లో గిల్లీదండీ ఆడేట‌ప్పుడు,
పోటీప‌డి బొంగరాల‌ను
గింగిరాలు కొట్టించేట‌ప్పుడు,
గ‌గ‌న‌మ్మీదికి గాలిప‌టాల‌ను
ఏక‌ధాటిగా ఎగ‌రేసేట‌ప్పుడు
నేను నేనుగానే ఉండేవాణ్ణి.

గాలి దారిమ‌ళ్ళి గాయాలు రేపిన‌ప్పుడు,
న‌డిక‌డ‌లిలో నెత్తురు పోటెత్తిన‌ప్పుడు,
పోటెత్తిన నెత్తుటిలో
క‌ష్టాల కాగిత‌ప్ప‌డ‌వ‌లు విడిచినప్పుడు-
అప్పుడు కూడా
నేను నేనుగానే ఉండేవాణ్ణి.

ఏమీ ఎర‌గ‌న‌ట్లు
నువ్వు విసిరిన‌
క‌ల‌ల వ‌ల‌ల్లో చిక్కుకున్నాక‌-
నేను నేనులా లేను.
నేను నాలో లేను.
నేను నాతో లేను.

అంతిమంగా చూసుకుంటే…
నీ వ‌ల‌లో చిక్కిన పీడ‌క‌ల‌ను నేను.