కెరీర్ ఓరియెంటెడ్ మాన్

మగత నిద్రలో తొడల మధ్య ఏదో కదులుతున్నట్టు అనిపించేసరికి ఉలిక్కిపడి సీటులో కదిలాడు సందీప్. పక్కనున్న పెద్దావిడ కూడా కాస్త కదిలి, మళ్ళీ సర్దుకుంది. ఆవిడ పనేనని అర్థమవుతున్నా సందీప్‌కి ఏం చేయాలో తోచలేదు. ఆల్రెడీ వెనుక సీటులో ఓ ఆడమనిషి తన భారీకాయం నెపంతో పక్కనున్న అతడి మీద పడిపోతూ, రాసుకుంటూ పూసుకుంటూ ఉంటే భరించలేక డ్రైవర్ మేడమ్‌ని దీనంగా వేడుకుంటే ఈ సీటులోకి మార్చింది.

“ఈ సింగిల్ జెంట్స్‌తో తలనొప్పబ్బా! సీట్లు సర్దలేక… వెబ్‌సైటేమో మార్చి చావరు!” బస్సు నడపడానికి తయారవుతున్న ఇంకో డ్రైవరు విసుక్కుంది.

“లేదక్కా… ఇప్పుడు మార్చారు. సింగిల్ జెంట్ అయితే టిక్కెట్టు కన్ఫర్మ్ అవుతుందంతే! సీటు నెంబర్ ఇవ్వరు. ఫైనల్‌గా మనం ఏది ఇస్తామో అదే. దానికి ఒప్పుకుంటే టికెట్ బుక్ అవుతుంది ఇప్పుడు” అని వివరించింది. ఇంకా అక్కడే నిలుచున్న సందీప్‌ని చూసి, “వయసైపోయిన పెద్దావిడ, నిద్రలోకి జారిపోతుంది, అడ్జస్ట్ అవ్వండి సార్!” అని భరోసా ఇచ్చి పంపించింది.

ఇప్పుడు మళ్ళీ సీటు మార్చమంటే, ఒంటరి మగాడు కాబట్టి అర్థరాత్రి పూట బస్సులోంచి దించేయరు కానీ డ్రైవర్ కాబిన్ దగ్గరే కూర్చోటం తప్ప దిక్కుండదు. కునికిపాట్లు పడుతుండగా డ్రైవర్ ఏ స్పీడు బ్రేకరో వేస్తే మొహం పచ్చడైపోతుంది. ఆ ఊహకే భయం వేసి సీటునుండి లేవలేదతడు.

బస్సంతా చీకటి. ఆంటీ నిద్రలోనే ఉన్నట్టనిపిస్తుంది గానీ, అది దొంగనిద్రా, నిజం నిద్రా తేల్చుకోలేకపోయాడు. అటువైపు నుండి ఎవరిదో గురక! ఆ మనిషి పక్కన సీటు దొరికినా సరిపోయేది, కదా!

దాహం వేస్తుంది గానీ మంచినీళ్ళు తాగడానికి జంకు! ‘జెంట్స్ వాష్‍రూమ్స్ ఉన్నాయి’ అంటూ ఆల్రెడీ ఒకచోట ఆగింది బస్సు గంటన్నర క్రితం, డిన్నర్లకి ఆపిన చోట. సందీప్ భయపడ్డాడు దిగడానికి గాని, డ్రైవరు నాలుగైదు సార్లు రెట్టించింది. జెంట్స్… ఇవే వాష్రూములయ్యా, మళ్ళీ ఎక్కడా ఆపం… జెంట్స్ అందరూ వినండి!” జంకుతూనే దిగి, బాగ్ అంటిపెట్టుకుని, ఎటువెళ్ళాలా అని వెతుక్కుంటుంటే, ఒక పెద్దావిడ ఉత్సాహంగా అడక్కుండానే చూపించింది ఎటువైపు వెళ్ళాలో. సందీప్ ఇబ్బందిగా థాంక్స్ చెప్పి, అటు నడిచాడు. పైజామాలు, పాంటులు, చీర కుచ్చిళ్ళూ సర్దుకుంటున్న ఆడవాళ్ళు కనిపించిన దగ్గర, అడ్డుగోడ కట్టి దాచినట్టున్న మెన్స్ టాయిలెట్ చూసి, లోపలికి వెళ్ళాడు. ప్రైవేట్ ప్లేస్ అయినందుకో ఏమో, టాయ్‍లెట్స్ చాలా నీట్‍గా ఉన్నాయి. ఇహ, తెల్లారే వరకూ అవకాశం ఉండదు కాబట్టి సందీప్ వెళ్ళి పని ముగించుకొని వచ్చి పడుకుందామనుకున్నాడు. బస్సు కదిలిన కాసేపటికి ఆంటీ చేతివాటం చూపించాలనుకుంది. ఆ అదురుకో, రోజంతా టెన్షన్‌వల్లో, హోటల్లో తిన్న ఫుడ్‌వల్లో దాహం విపరీతంగా వేసింది అతడికి. అయినా కొద్దిగా పెదాలను మాత్రమే తడుపుకున్నాడు నీళ్ళతో.

బాగ్‌లో నుండి మొబైల్ తీసుకొని పాటలు పెట్టుకొని, ఎవరి మీదా వెలుతురు పడకుండా దాన్ని బోర్లా తిరగేశాడు. కానీ అంతలోనే భయం, ఎక్కడ నిద్రపట్టేస్తుందో, ఎక్కడ మొబైల్ జారి కిందపడిపోతుందోనని! బాగ్ పైకి తీసుకొని, ఒళ్ళో పెట్టుకొని, అందులో ఒక అరలో ఫోన్ పెట్టి ఇయర్‌ఫోన్స్ మాత్రమే బయటకి వచ్చేట్టు చూసుకొని, జిప్ మూశాడు.

ఒక వైపు కిటికీ ఉంది కనుక, ఆంటీ ఉన్న వైపున కప్పుకున్న బ్లాంకెట్ మీదే కూర్చుని వేళ్ళూ, చేతులూ దూర్చే అవకాశం లేకుండా సీల్ చేసేశాడు. అందులో మునగదీసుకుని సగం కూర్చున్న, సగం పడుకున్న అవస్థలో ఉండిపోయాడు. కాలేజీల్లో, తొలినాళ్ళ ఉద్యోగంలో బస్సు, ట్రేను ప్రయణాలు చేయాల్సి వచ్చినప్పుడు అబ్బాయిలు పిన్నులు, పెప్పర్ స్ప్రేలు పెట్టుకుంటే నయమని అందరూ అనగా విన్నాడే గానీ ఎప్పుడూ అలా చేసింది లేదు. అందులోను ఇవ్వాళ ఇలా బస్సులో ప్రయాణం చేయాల్సి వస్తుందని ఊహించనే లేదు.

ఆదమరచి నిద్రపోదామంటే అవకాశమే లేదు. సందీప్‌కి కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి. పొద్దున్నెప్పుడో నాలుగింటికి లేచి మొదటి ఫ్లైట్ పట్టుకున్నాడు. ఆ ముందు రోజు కూడా రోటి పచ్చళ్ళూ, మసాలాలు చేసి ఉంచాడు, మామగారికి మరీ ఇబ్బంది లేకుండా. అనితకి ఒకటికి పదిసార్లు చెప్పాడు కనిపెట్టుకోవాల్సిన విషయాలు, కానీ ఎంత వినిపించుకుందో ఏంటో! బిడ్డ పుట్టాక, బిడ్డ లేకుండా తలపెట్టిన మొదటి ప్రయాణం. అక్కడికీ మనసులో పీకుతూనే ఉంది అతడికి, “నేను వెళ్ళడం అవసరమా? వాడు వదిలి ఉండగలడా!” అని. శుక్రవారం పొద్దున్నే బయలుదేరి ఆదివారం రాత్రికి ఇంటికి చేరుకునేలా ప్లాను చేస్తే, రెండు రాత్రుళ్ళు ఉండి బాబుని చూసుకోవడానికి ఇబ్బందిపడుతూనే ఒప్పుకున్నారు అనిత పేరెంట్సు!

“అబ్బా… అన్నీ బుక్ చేసుకున్నాక ఎందుకింత ఆలోచిస్తావ్?” అని విసుకున్న అనిత అతడి మొహం కుంచించుకుపోవడం గమనించి, “మా నాన్న వస్తాడుగా, చూసుకుంటాడులే!” అని భరోసా ఇచ్చింది.

ఇద్దరూ కెరీర్ ఓరియంటెడ్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయని గ్రహించే పకడ్బందీగా ప్లాను వేసుకున్నారు. సందీప్ ఉద్యోగం మారాక ఏడాది, ఏడాదిన్నర వరకూ పిల్లల ప్రస్తావన వద్దనుకున్నారు. కొత్త ఉద్యోగంలో చేరిన రెండో రోజునే ప్రెగ్నెన్సీ రిజల్ట్ తెలిసింది. సందీప్ గుండెల్లో రాయి పడింది. లెక్కప్రకారమైతే తనకి ఇవ్వాల్సిన ఆర్నెళ్ళ పటర్నిటి లీవ్ ఏ షరతులూ లేకుండా ఇవ్వాల్సిందే! కానీ ఎవరి లెక్కలు వాళ్ళవి. వాళ్ళిచ్చే ట్రైనింగులు అవీ అయ్యి, అసలైన పనిని చేతిలోకి తీసుకునే సరికి లీవ్ అంటే, వాళ్ళకి మండుతుంది. కోరి కోరి చేరిన కంపెనీ!

బాబు పుట్టాక అనిత మూడో నెల నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలెట్టింది. ఆపైన ఆఫీసుకి వెళ్ళింది. పదిమందితో మొదలైన ప్రాజెక్టుని నూట ఇరవైమంది పనిజేసేంత పెద్దది చేసింది, ఆ సమయంలోనే. బాబుని, ఇంటిని సంభాళించుకుంటూ వచ్చాడు సందీప్. ఇద్దరి తల్లిదండ్రులు చుట్టం చూపుగానో లేదా బాబుకి మరీ బాలేనప్పుడు సాయంగా ఉన్నారు తప్ప బాధ్యతను నెత్తినేసుకోలేదు.

“వాడికి కనీసం ఏడాదిన్నర నిండితే ప్లే స్కూలులో వేయొచ్చు. ఆర్నెళ్ళకే ఎలా వేస్తాం?” అనిత అడిగింది.

“నాకు ఈసారి వచ్చిన హైకు నీ జీతమంత! ఆఫీసుకు వెళ్తే బేబీ సిట్టర్లకి అదీ ఇంకో ఖర్చు!” అనితే సమాధానమిచ్చింది.

ఆర్నెళ్ళు పోగవుతూ రెండేళ్ళయిపోయాక సందీప్ మళ్ళీ ఉద్యోగాల వేటలో పడ్డాడు.

ఆలెన్ ట్యూరింగ్ కాన్పరెన్స్ ఫర్ మెన్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్–ప్రతిష్టాత్మకంగా జరిగే సదస్సు ఇది, ప్రతి ఏడాది. ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న, టెక్నాలజి చదువుకుంటున్న మగవారికోసం మూడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. మగవారూ మహిళలతో సమానంగా అభివృద్ధి సాధించాలన్నది దీని వ్యవస్థాపకుల ముఖ్యోద్దేశ్యం. రెండో ప్రపంచ‍యుద్ధంలో కీలక పాత్ర వహించినా ప్రపంచానికి తెలీకుండా మరుగున పడిపోయిన ఆలెన్ ట్యూరింగ్‍ని సెలబ్రేట్ చేస్తూ చేసుకునే పండుగ! ఆది ప్రోగ్రామర్ ఎవరంటే గ్రేస్ హాపర్ పేరే వినిపిస్తుందిగానీ ఈ రంగంలో మగవాళ్ళ కృషి ఎవరికీ తెలీదు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు గురించి సందీప్ చాలా విని ఉన్నాడు కానీ ఎప్పుడూ వెళ్ళడం కుదర్లేదు. ఏదో ఇంకోదేశానికి వెళ్ళనవసరం లేకుండా ఈసారి బెంగళూరులోనే జరుగుతుంటే అవకాశం వదులుకోలేకపోయాడు. బాబుని వదిలి ఉండడానికి మానసికంగా సిద్ధమైయ్యాడు.

ఆ ప్రిపరేషన్ పనికొచ్చిందో లేదా అంతమంది మగవారిని ఒకచోట చూడగానే మైమరచిపోయాడో లంచ్ టైములో అప్పుడే పరిచయమైన ఒకతను, “ఓహ్… సో, యు ఆర్ ఎ న్యూ డాడ్!” అని మురిసిపోయేవరకూ బాబుని మర్చిపోగలిగాడు. కనీసం ఆరేడు వేలమంది ఉండచ్చు అక్కడ. తనతో పాటు ఇంతమంది మగవారు పనిజేస్తున్నారా టెక్నాలజిలో అని అవాక్కయ్యాడు. ఆ సూటుబూట్ల సముద్రంలో మునిగిపోయాడు. అతడు పనిజేసిన టీముల్లో మహా అయితే ఒక్కరిద్దరు మగపిల్లలు ఉండేవారు, తక్కిన వాళ్ళంతా ఆడాళ్ళే! బాయ్స్ స్కూల్, బాయ్స్ కాలేజిలో చదువుకోవడం మధ్య మొదట్లో చాలా బెరుగ్గా, బిక్కుబిక్కుమంటూ ఉండేవాడు. అయితే అతడి మొదటి మానేజర్ ప్రోత్సహించి, మీటింగుల్లో మాట్లాడ్డం, చేసిన పనిని ప్రొజెక్టు చేసుకోవడంలాంటివి నేర్పింది.

ఆమె ప్రోత్సాహంతోనే కంపెనీలోని మైస్ (మెన్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్) గ్రూపులో వాలంటరీగా చేరాడు. అబ్బాయిలు ఉద్యోగంలో వెనుకబడిపోకుండా, ఆడవాళ్ళతో సమానంగా ఉండేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ నేర్పించేవారు ప్రత్యేకంగా. కానీ మొత్తం రెండువేల మంది ఉన్న కాంపస్‌లో పట్టుమని ఇరవై మంది అబ్బాయిలు కూడా ఉండేవారు కాదు. వాళ్ళల్లోనూ చేరిన మూడు నెలలకో, ఆరునెలలకో పెళ్ళి అయ్యిందనో, పిల్లలు పుట్టారనో మానేసే అబ్బాయిలే ఎక్కువ! అందుకని మానేజర్లు వాళ్ళని తీసుకోడానికి ఆసక్తి చూపరు. ఓ పక్క మీటింగ్స్ లో డైవర్సిటీ అంటారు, ఇంకో పక్క ఇంటర్‌వ్యూలలో అబ్బాయిలని తీసుకోకుండా ఎలా తప్పించుకోవాలో చూస్తుంటారు.

అనితతో పరిచయం కూడా అక్కడే! ప్రణయం, పరిణయం వరుసగా జరిగిన పర్యవసనాలు.

“సిక్స్ టు నైన్… అక్కడే చిక్కంతా! ఆ ఎక్స్పీరియన్స్ బ్రాకట్‍లో ఉన్న అబ్బాయిలే ఎక్కువగా డ్రాప్ అయిపోతుంటారు! వాళ్ళని ఆపగలగాలి మనం…” అని సందీప్‍తో లంచ్ చేస్తూ మాట కలిపిన మధ్యవయసున్న ఆయన మొదలెట్టాడు.

“ఎట్లా కుదురుతుందండీ! అప్పుడే పెళ్ళిళ్ళు అవుతాయి. ఫామిలీస్ స్టార్ట్ చేస్తారు. పిల్లల బాధ్యత మగవాళ్ళదే కదా!” అన్నాడు గులాబీ రంగు టై ఆయన.

“విమెన్! వాళ్ళు బాధ్యత తీసుకోవాలండీ… అంతా మగవాళ్ళ మీద వదిలేయకూడదు. కుటుంబమంటే రెండు చక్రాల మీద నడిచే బండి కదా!” అన్నాడు ఇంకో నల్ల బ్లేజరాయన. సందీప్ తలూపడం చూసి, ’న్యూ డాడ్’ అని మురిసిపోయినాయన అందుకున్నాడు: “యు ఆర్ ఎ లక్కీ మాన్! చిన్నబాబుండి కూడా మీరు రాగలిగారంటే! మీ వైఫ్‌ని అప్రిషియేట్ చేయాలసలు!”

గర్వంగా రాబోతున్న సందీప్ నవ్వు ‘వాట్ ఎ హారర్!’ అని వినిపించేసరికి ఆగిపోయింది. అందరూ ఆ అరిచిన ఆయన వైపు చూశారు. ఆయనింకా తలకాయ అడ్డంగా ఊపుతూనే ఉన్నాడు, దేనికో ఒప్పుకోనట్టు, ప్లేటులో పెట్టుకున్న ఆహారపదార్థాలని సర్దుకుంటూ… “ఓన్లీ 23. చిన్న కుర్రాడు. షార్ప్ కిడ్! బాడ్, వెరీ బాడ్…” కథ తెలియకుండా డైలాగ్స్ వింటూ ఉండిపోయారు అందరూ. ప్రతి ఒక్కరి మొహంలో ఆశ్చర్యం. ఆయన గమనించి తనను తాను పరిచయం చేసుకున్నాడు.

“సారీ, ఐ ఆమ్ వికాస్, మైక్రోసాఫ్ట్‌‍లో రిసర్చర్‌ని. ఇప్పుడే ఒక క్లోజ్డ్ డోర్ సెషన్ నుండి వస్తున్నా. బ్రైట్ స్టూడెంట్స్‌తో మెంటరింగ్ సెషన్…” అందరి మొహాల్లో ఆశ్చర్యంపోయి ఆసక్తి కనిపించింది.

చెప్పండి! చెప్పండి! అన్నట్టు ఆసక్తిగా చూశారు ఆయన వైపు.

“సో వాట్ ఐ వాజ్ టెల్లింగ్… 23 ఏళ్ళ కుర్రాడు! మాస్టర్స్ అయ్యింది. పిహెచ్‌.డి చేయాలని. ఇంట్లో పిహెచ్‌.డికి ఒప్పుకోవడం లేదు. ఇంకా ఐదేళ్ళు ఆగలేము, వెంటనే పెళ్ళి చేసుకోమని. పిహెచ్‌.డి చేస్తే అంతకన్నా ఎక్కువగా చదువుకున్న అమ్మాయిని తేవడం ఎలా? అని…”

“ఓహ్!” సామూహికంగా నిట్టూర్చారు చుట్టూ ఉన్నవాళ్ళంతా! “రిగ్రసివ్” అన్నాడో ఆయన ఒక్క నిట్టూర్పుతో సరిపెట్టుకోలేక.

“సో, మెన్ హావ్ టు మారీ సో ఎర్లీ?” సాలడ్ తీసుకోడానికి వచ్చి కొంతభాగం విన్న ఒక విదేశీ ఒకడు ప్రశ్నతో దూరాడు. ఇండియన్లందరూ కాస్త ఇబ్బందిగా మెదిలి, “నాట్ ఎవ్రీబడీ, యూ సీ! ఓన్లీ ఎ ఫ్యూ హియర్ అండ్ దేర్” అని పడిపోయిన పరువుని నిలబెట్టడానికి ప్రయత్నించారు.

“సో శాడ్! అసలు మన దేశంలో రిసర్చ్‌కి వెళ్దామనుకునేవాళ్ళే తక్కువ! అందరికి ఆరంకెల జీతాలు కావాలి డిగ్రీలు చేతికి అందకముందే. మళ్ళీ వచ్చి ఇన్నొవేషన్ ఎక్కడా ఇండియాలో అని అడుగుతారు!” ఫారెనాయనని పక్కకు తప్పించి టాపిక్ లోకి వచ్చారు మళ్ళీ!

“మీరెలా రిసర్చ్‌లోకి వచ్చారు సార్?” అడిగాడో అబ్బాయి.

“మై మమ్మా… మేం బెంగాలీస్, ఒకే, మా మమ్మా నన్ను పెళ్ళి గిళ్ళి అని ఆపలేదు. నాకు ఓపికున్నంతవరకూ చదువుకోమంది… మా బాబా నసిగేవాడనుకోండి…”

ఈ మాటల మధ్యే సందీప్‌కి మెసేజ్ వచ్చింది వాళ్ళ మామగారి‍నుండి, “బాబుకి జ్వరం! నువ్వు బయలుదేరు!” అని.

వెంటనే అనితకి ఫోన్ చేశాడు. పొద్దున్న బయలుదేరే ముందు కూడా చూశాడు. హాయిగా నిద్రపోతున్నాడు బాబు. ఇంతలోనే జ్వరమేంటి మరి? అనిత అప్పటికే డాక్టరుకి కాల్ చేసి చేసింది. ఫోన్‌లో “ఏమో! జ్వరం ఎందుకో తెలీదు. మెడిసన్ తెస్తున్నా ఇప్పుడు. ఏమైనా ఉంటే చెప్తాలే” అని అంది.

లంచ్ తర్వాత సెషన్స్ అటెండ్ అయినా ధ్యాస నిలువలేదు.

“నువ్వు దగ్గరలేవని పసిగట్టేశాడు. బెంగతో వచ్చుంటుంది జ్వరం!” మామగారితో మెసేజ్‍లు ఆగలేదు. సందీప్‌కి కాలు నిలువలేదు. ప్రాణం కొట్టుకుపోయింది.

“ఈ రాత్రికి చూద్దాం, దీపూ, అంతగా అయితే రేపు బయలుదేరచ్చులే” అంది అనిత. అయినా వినిపించుకోలేదు. ఆఖరి ఫ్లైట్‍లో మాత్రమే సీట్లున్నాయి. విపరీతమైన ఖరీదు, అయినా ఓకే చేసేద్దాం అనుకున్నాడు.

“ఆ ఫ్లైట్ లాండింగ్ అర్థరాత్రి ఒకటిన్నరకి అంటే నేను పిక్ చేసుకోడానికి రావాలిగా మళ్ళీ!” అనిత గొంతులో విసుగు స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా తెలిసింది. అప్పటికే రెండు గంటల్లో అది పదో కాల్.

ఆమె ఎప్పుడూ అంతే, అతడి సోలో ట్రావల్, అదీ వేళగాని వేళలో అంటే కంగారుపడిపోతుంది. పొద్దున్న కూడా ఆమే స్వయంగా ఎయిర్‍పోర్ట్‌లో దించి వెళ్ళింది. ఫ్లైట్ ఆలోచన విరమించుకొని, బెంగళూరులో ఉన్న పాత‍స్నేహితులు సాయం చేస్తే ఈ బస్సు అయినా దొరికింది.

అనంతపూర్ దాటినట్టుంది బస్సు. టోల్ గేట్ దగ్గర ఆపింది కాకుండా మళ్ళీ ఆపారు కాస్త దూరంలో. ఆడవాళ్ళల్లో కొందరు దిగారు. ఆంటీ కూడా లేచింది. సందీప్ గుండె ఝల్లుమంది. “నిద్రే పట్టదా ఈ పీనుగకి!” అని తిట్టుకున్నాడు. కాసేపు ఆదమరచి పడుకుందామంటే దెయ్యంలా దాపురించింది.

వెనుక సీటులోంచి గుసగుసగా మాటలు వినపడ్డాయి.

“డ్రైవరుని అడుగు…” అని నసిగాడు అబ్బాయి.

“ఏమని చెప్పను?” ఇబ్బందిగా అడిగింది అమ్మాయి. మొత్తానికైతే కిందకు దిగి డ్రైవరుతో మాట్లాడింది. కిటికి దగ్గరకు వచ్చి అబ్బాయిని దిగమంది.

“ఛీ! ఇక్కడా… నేను రాను!” అన్నాడు అబ్బాయి.

అమ్మాయి అసహనంగా బస్సు ఎక్కి, సీటు దగ్గరకి వచ్చి, “రేపొద్దున్న జెడ్చర్ల వరకూ స్టాపు లేదట! ఇక్కడే కానిచ్చేయమంటున్నారు.” చెప్పింది.

“అంతా చెప్పేశావా?”

“కెవ్, నువ్వే కదా అడగమన్నావ్!” అతను గిచ్చినట్టున్నాడు. అమ్మాయి చేతిని రుద్దుకుంటూ కిందకు దిగింది.

కొత్తగా పెళ్ళైనట్టుంది వాళ్ళ వాలకం, వేషధారణ చూస్తూంటే. మొత్తానికైతే కిందకు దిగారు ఇద్దరూ.

ఆంటీ సీటు దగ్గరకొచ్చి పైజామా సర్దుకొని, బాగ్ తీసి కింద పెట్టి, జిప్పులు తీసి, మూసి, మళ్ళీ బాగు పైకి పెట్టీ కాసేపు టైమ్ పాస్ చేసింది. సందీప్ నిటారుగా కూర్చొని కిటికి బయటకు చూస్తూ ఉండిపోయాడు. వెనక్కి వెళ్తున్నవాళ్ళు అడ్డంగా నిల్చున్నందుకు విసుక్కుంటుంటే, సీటు వెనక్కి జరిపి కూర్చుంది. ‘నేను మెలకువగానే ఉన్నాను. నువ్వు గానీ వెధవపనులు చేశావంటే అరిచి గీపెట్టేస్తాను’ అని హెచ్చరికను తన బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పడానికి ప్రయత్నించాడు. ఆమె అటు మొహం పెట్టుకుని పడుకుంది. మళ్ళీ దొంగ నిద్రో, నిజం నిద్రో!

బస్సు పది నిముషాలైనా కదల్లేదు. ఆ కొత్త జంట ఎక్కడ వరకూ వెళ్ళారో ఏంటో, డ్రైవరు ఎదురు చూస్తూ ఉన్నాడు, అందరూ ఎక్కేశారు అప్పటికే! ఆ అమ్మాయి పరుగుపరుగున వచ్చి డ్రైవరుకి సారీలు చెప్తూ ఉంటే, అబ్బాయి వెనుక నిదానంగా వచ్చాడు.

“ఇందుకే ఫ్లైట్ బుక్ చేయ్ అని చెప్పాను నీకు. సచ్ అండర్ డెవలప్డ్ కంట్రీ, ఐ సే!” సీటుకి రాగానే గొణుకున్నాడు అబ్బాయి.

“లాంగ్ వీకెండ్ బేబ్! టికెట్స్ దొరకలేదు.” సంజాయిషీ ఇచ్చుకుంది అమ్మాయి.

ఏం భోగంరా నాయనా! అనుకున్నాడు ఒళ్ళుమండి సందీప్. ఆ అబ్బాయి చూడచక్కగా ఉన్నాడు. అయితే మాత్రం ఇంత గారం పోవాలా! ‘నా భార్య చూడు, నాకేది కావాలన్నా చేసి తీరుతుంది’ అని పదిమందికీ గొప్పగా చూపించుకోవాలనేమో. ఇలాంటివాళ్ళే, ఏ చీకూ చింతా లేకుండా జీవితం గడిపేస్తారు. ఒకసారి నిట్టూర్చి, ఎటూ నిద్రపోకుండా ఉండాలి కాబట్టి మొబైల్ మీద ముసుగేసి చూడ్డం మొదలెట్టాడు. లింక్డ్ఇన్‌లో ఒక పదిపదిహేను రిక్వెస్టులు, ఓ పాతిక కన్ఫర్మేషన్లూ వచ్చున్నాయి ఆ రోజు కలిసినవాళ్ళ నుండి. ఈ కనెక్షన్లతో ఏమన్నా అవుతుందా? అన్నది అనుమానమే! జాబ్ అప్లికేషన్స్ టాబ్‌కి వెళ్ళాడు. ఎవరూ ఇంటర్‍వ్యూకి పిలవలేదు. బ్రేక్ తీసుకోడానికి కారణం బాబు… అని అతడింకా ఏదో చెప్పబోతుండగానే ‘కాల్ యు బాక్’ అంటూ పెట్టేస్తున్నారు. కాన్పరెన్స్ టికెట్లు, ఫైట్లు అన్నీ కలిపి యాభై వేలు పోశాడు. రేపూ ఎల్లుండి ఉండి జాబ్ మేళాలో అదృష్టం పరీక్షించుకుందామని అనుకున్నాడు…

ఉన్నట్టుండి ఆ పిహెచ్‌డి చేయలేకపోతున్న అబ్బాయి గుర్తొచ్చాడు.

వాడితో పాటు తన క్లోజ్ ఫ్రెండ్, కాలేజ్‍లో ఒకే బెంచిలో చదువుకున్న అమన్ గుర్తొచ్చాడు. వాడిది నార్త్, జాయింట్ ఫామిలీ! ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రాకముందే పెళ్ళి చేసేశారు. ‘అబ్బాయి ఉద్యోగం చేయడం మాకిష్టం లేదు!’ అని ముందే తేల్చేశారు. వాడు చేసుకోనూ అని గింజుకున్నా ఎవరూ వినలేదు. కాలేజి టాపరు వాడు, వాళ్ళ బాచ్‌లో!

సందీప్ పెళ్ళి నాటికే పూర్తిగా మారిపోయాడు అమన్. ఎలాగోలా రెండు రోజులున్నాడే గానీ ఎప్పుడూ ఫోన్ మీదే. కుక్కర్ విజిల్ ఎక్కడ, ఎ.సి. రిమోట్ ఎలా వాడాలి? అన్నీ వాడు చెప్పాల్సిందే! టెక్నాలజి గురించి గాని, కెరీర్ గురించి గానీ ఒక్క మాట అంటే ఒట్టు! “లైఫ్ ఏది ఇస్తే అదేరా మనకి! చాలదా…” అని అడిగాడు సూటిగా, మళ్ళీ ఉద్యోగమో, పైచదువులో ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే! వాడికీ ఇద్దరు పిల్లలు, ఇద్దరూ అబ్బాయిలే. వాళ్ళనాటికైనా పరిస్థితులు మారతాయేమో!

సందీప్ కోర్ట్‌షిప్ టైములోనే చెప్పేశాడు అనితతో, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం మానననీ! అనిత కూడా “మానేసి ఏం చేస్తావ్? మా నాన్నతో పాటు డైలీ సీరియల్స్ చూస్తావా? మామాఅల్లుళ్ళ వీరంగం!” అని నవ్వేసేది.‍ ఆయనకి సీరియళ్ళ పిచ్చి. బి.కాం. చదివారు కానీ జాబ్ వచ్చేలోపే పెళ్ళైపోయింది, ఇహ పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయారు. సందీప్ వాళ్ళ నాన్న అలా కాదు, చదువుకుంది ఇంటరే అయినా ప్రైవేటుగా బి.ఎడ్. కట్టి పాసై టీచరుగా చేశాడు. అందువల్లే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే పోయినా, అన్నీ సింగిల్-డాడ్‌గా చూసుకోగలిగాడు.

స్టే-ఎట్-హోమ్ డాడ్‍గా ఉండే ఉద్దేశ్యం లేదని సందీప్ స్పష్టం చేశాడు అందరికీ. పాలసీ ప్రకారం వచ్చే ఆర్నెళ్ళ లీవ్ కాకుండా ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నొచ్చుకున్నాడు. అనిత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు, ఆమెకి ఆమె ఉద్యోగం అంత ముఖ్యం! ఇద్దరూ మొండిపట్టు పట్టి బాబుని పూర్తిగా ఏ ఆయాకో వదిలేయడం ఇష్టం లేక, మనసు చంపుకుని ఉద్యోగం మానుకున్నాడు.

ఎలా అయినా మళ్ళీ ఉద్యోగంలో చేరాలి. మళ్ళీ పనిలో పడాలి. అదంత తేలిక కాదు. న్యూ డాడ్స్ అంటే ఒక స్టిగ్మా ఉంది. వాళ్ళు ఎంత ఉద్యోగంలో చేరినా అది డబ్బు అవసరానికే కానీ వాళ్ళ ధ్యాసంతా పిల్లల మీదే ఉంటుందని, ఆఫీసుకు లేటుగా వచ్చి త్వరగా వెళ్ళిపోతారని, పని చేయమంటే బేబీకి ఫీవర్, బేబి సిటింగ్ అని సాకులు చెప్తారనీ మానేజర్ల నమ్మకం. అందుకని చంటిపిల్లలున్న తండ్రులని త్వరగా తీసుకోరు. తీసుకున్నా ముఖ్యమైన పనులు అప్పగించరు. జీతాలు పెంచరు. అలా అని పిల్లలు స్కూలుకి వెళ్ళే వరకూ ఆగితే, టెక్నాలజీ అంతా మారిపోతుంది. అప్పుడింక ఉద్యోగం దొరకడమే గగనం! ఇలాంటి చాలా చికాకులే ఉంటాయి, ‘బ్రింగ్ హిమ్ బాక్’ కాంపేన్లు ఎన్ని జరుగుతున్నా.

అనిత కూడా అదే ఇండస్ట్రీ అయినా ఇవేమీ అతడికి కనిపించినట్టు ఆమెకి కనిపించవు. ‘ఊరికే, నేను మైనారిటీ, మైనారిటీ అనుకుంటూ కూర్చుంటే అందరూ అన్యాయం చేసేవాళ్ళలానే కనిపిస్తారు. కాసేపు నువ్వు మగాడివనీ, ఇది ఉమెన్స్ వర్ల్‌డనీ మర్చిపో… యువర్ లైఫ్ ఉడ్ బి సో ఈజీ!’ అని అంటుంది. ‘అందరీకీ కష్టమే ఇక్కడ! నాకు ఏ ఆక్సిడెంటో అయ్యి ఏడాది బెడ్‍రెస్ట్ అయితే, జస్ట్ బికాజ్ నేను ఆడదాన్ని కాబట్టి ఉద్యోగంలో నుండి తీయకుండా ఉంటారా? ఉత్తినే జీతమిస్తారా? నువ్వున్న పరిస్థితీ అలాంటిదనుకో!” అని లెక్చర్ ఇస్తుంది. ఇలాంటి వాదనలు నచ్చకపోయినా స్త్రీపురుష సమానత్వం కోరుకుంటుంది ఆమె… సందీప్ దృష్టిలో ఆమె ఒక మెనినిస్ట్. మామగారిలా నసుగుతూ ఉండదు, ‘పిల్లలకన్నా ఉద్యోగాలు ముఖ్యమా?, పూట గడవడదా ఇప్పుడు నువ్వు కూడా ఉద్యోగం చేయకపోతే!’ అని.

“వాడికిప్పుడు అసలు జ్వరం లేదు. నువ్వు మాట వినిపించుకోకుండా బయలుదేరిపోయావు.” ఆ సమయంలో మెసేజ్ ఊహించలేదు అతడు.

“ఇంకా పడుకోలేదా?”

“లేచాను. నాలుగు గంటలకొకసారి టెంపరేచర్ చూడమన్నారు డాక్టర్. బస్సు బానే ఉందా?”

“టైమ్ బాంబుని పక్కన పెట్టుకున్నట్టుంది” అని టైపు చేసి డిలీట్ చేశాడు. తర్వాత ఎప్పుడో ఆంటీ గురించి చెప్తూ తిడుతుంటే, అనిత నవ్వుతుంటే బానే ఉంటుంది కానీ ఇప్పుడెందుకు ఆమెని కంగారు పెట్టడం అని ఊరుకున్నాడు.

“నీ మెసేజ్ కన్నా నీ బస్సే ముందొచ్చేలా ఉంది.”

“హె హె… అరగంటకోసారి పావుగంట సేపు ఆపుతోంది డ్రైవర్. రేపు నేను ఫోన్ చేసేవరకూ పిక్ చేసుకోడానికి బయలదేరకు. లేటయ్యేట్టుంది. పడుకో…”

“ఆర్ యు ఒకే? నాన్నకి చెప్పాను నీకు మెసేజ్ చేయొద్దని…”

“నేను ఒకే! నువ్వు పడుకో…”

ఆంటీ సన్నగా గురకపెడుతుంది. సందీప్ కూడా మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. ఎందుకైనా మంచిదని ఒళ్ళో బాగు అడ్డంగా ఉంచుకున్నాడు.


నిద్రలేచేసరికి మామగారు టీ చేసి పట్టుకొచ్చారు. అత్తగారు జెంట్స్ క్రికెట్ చూస్తున్నారు, టి.వి.లో.

“అబ్బా, ఇంక మగాళ్ళు ఆడేది కూడా వదలరా మీరు! ఇటివ్వండి రిమోట్…”

“ఉండరా… ఎవరో కొత్తబ్బాయి, విరాట్ కోహ్లీ అట! జెంట్స్‌లో స్మృతి మంథానా అంతటివాడంటున్నారు… చూడనీ కాసేపు!” అంది అత్తగారు.

రిమోట్ దొరక్క మామగారు సందీప్‌తో మాటలు కదిపారు. ప్రయాణం బడలిక తీరింది రోజంతా పడుకునేసరికి, బాబు కూడా నిక్షేపంలా ఆడుకుంటున్నాడు. అయినా సందీప్‌కి తిక్కగా అనిపించింది. ఒక్క రాత్రి ఓపిక పట్టుంటే ఇంకా బెంగళూరులో ఉండేవాడు. మొత్తంగా కాన్ఫరెన్సు అటెండ్ అయ్యుండేవాడు. ఒక మెసేజ్ రాగానే బెంబేలెత్తి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఒకటా రెండా, యాభై వేలు… బూడిదలో పోసిన పన్నీరు!

మెసేజుల మీద మెసేజులు పెట్టి కంగారు పెట్టినందుకు మామగారి మీద ఎక్కడా లేని కోపం తన్నుకొచ్చింది. ఇప్పుడేమో ఆయన సావకాశంగా ‘ఆ స్మృతి ఏదో ట్వీట్ చేసిందంట కదా, నేను ఔట్ అయ్యినప్పుడల్లా నా లవర్ని ఆడిపోసుకోకండ’ని కబుర్లు చెప్తుంటే మొహమాటానికి కూడా ఊఁ కొట్టాలనిపించలేదు!

అనిత కూడా రావొద్దని గట్టిగా ఏం వారించలేదని అనిపించింది అతడికి. బెడ్రూములోకి వచ్చేసి క్లోజ్ ఫ్రెండుకి వాట్సాప్‍లో చిరాకునంతా వెళ్ళగక్కాడు. ఎవరినీ ఏమీ అనలేడు, తనని తాను తిట్టుకోవడం తప్ప. ఈ లెక్కన రేపు ఉద్యోగంలో చేరినా చీటికిమాటికి పని మానేస్తాడా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి.

“మొదటిసారి కదా నీకు, అలానే ఉంటుంది… మెల్లిమెల్లిగా బేబీకి దూరంగా ఉండడం అలవాటవుతుంది.. చిల్!” అని భరోసా ఇచ్చాడు తొమ్మిదేళ్ళ పిల్లలున్న ఫ్రెండు ఒకడు.

జరిగినదాని గురించి ఆలోచించి లాభం లేదని, ఉద్యోగ ప్రయత్నాలు ఇంకా తీవ్రతరం చేయాలనీ నిశ్చయించుకున్నాడు. ఇంటిపనంతా త్వరగా ముగించేసుకుని, ఈ రాత్రి కూర్చొని అటకెక్కించిన ప్రాజెక్టు పని కొంత పూర్తి చేయాలని ప్లాను వేసుకోగానే ఉత్సాహమొచ్చింది. చకచకా వంటగదిలోకి వెళ్ళాడు.

“ఎంతైనా తండ్రి మనసు! బిడ్డ కిలకిలాడుతుంటే అంతకన్నా ఏం కావాలి తండ్రికి?!” మామగారు సన్నగా ధ్యాస మార్చడానికి ప్రయత్నించాడు, జెంట్స్ క్రికెట్‍లో మునిగిపోయిన భార్యని చూస్తూ.

(మాన్ హు హాజ్ ఇట్ ఆల్ అనే ఫేస్‌బుక్ పేజ్ ప్రేరణతో)

రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...