[పాఠకుల సౌలభ్యం కోసం కథ-06లో ప్రచురితమైన అతడూ.. నేనూ.. లోయ చివరి రహస్యం కథను మీకందిస్తున్నాం. మీరు ఇప్పటిదాకా చదవక పోయినట్లైతే, ముందుగా కథను చదవమని మా మనవి. ఈ కథను మీకందించడానికి ఈమాటకి ప్రత్యేకంగా అనుమతినిచ్చిన కథాసాహితి సంపాదకులు నవీన్, రచయిత భగవంతం లకు మా కృతజ్ఞతలు – సం.]
నేనెప్పుడూ విశాఖపట్నం వెళ్ళలేదు, అరకులోయ భీమిలీలు చూడలేదు ఇన్నేళ్ళలోనూ. కానీ సినిమాలో, ఫ్రెండ్స్ తీసుకొచ్చిన మంచి ఫోటోలో, ఆ ప్రాంతమంతా నా కళ్ళకి కట్టినట్టే ఉంటుంది – నేనే వెళ్ళి ఆ లోయలన్నీ, ఆ కొండలన్నీ ఒంటరిగా తిరిగినట్లు. భక్తి సంగీతం విని పరవశించిపోడానికి కావలసింది దేవుడి మీద నమ్మకం కాదు, భక్తి భావం అర్ధం కావడం. భక్తిలో దైవంతో మమేకమైన ఆ మానసిక స్థితిని అనుభవించగలిగితే చాలు కదా.
నేను ఆత్మహత్య చేసుకోడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ ఎందుకు చేసుకోవాలనిపిస్తుందో తెలుసు, బాగా లోతుగానే, అరకులోయ కంటే దగ్గరగానే. ఆకలీ అప్పుల చావులు కాదు నేననేది, ప్రేమనుకొని ఆ భ్రమలో ఫెయిలై నిద్రమాత్రలు మింగడమో, మణికట్లు కోసుకోడమో గురించీ కాదు – ఇవి అర్ధమవుతై, కారణాలు ఎదురుగానే కనపడుతుంటాయి కదా, అందుకు. ఏ కారణమూ లేకుండా కుతూహలంతోనో నిర్లిప్తతతోనో చేసుకునే ఆత్మహత్య సంగతి నేనంటున్నది. ఏ ఆలోచనో చచ్చిపోతే ఎలావుంటుందీ అని ఏ రాత్రో ఏ పగలో ఏ ఒంటరి క్షణంలోనో ఠక్కున ఎందుకు తడుతుంది? బ్రతుకు మీద నిర్లిప్తతా చావు మీద కుతూహలాన్ని ప్రేరేపించేది? తన అస్తిత్వానికి ఏ విలువా కనపడక ఒక ఊహను పట్టుకుని జీవితాన్ని దాటుకుని అలా వెళ్ళిపోతే, అది మనకు తెలిసిన మరణమేనా, ఆత్మహత్యేనా, వేరే పదాలేమీ లేవా?
ఎవరో భగవంతం అట, ‘అతడూ నేనూ లోయ చివరి రహస్యం’ కథ-06లో కూడా అచ్చేశారు, మాగొప్పగా రాశాట్ట, అని హడావిడిగా మెయిలొచ్చింది ఓ రెండేళ్ళ క్రితం. ఓ వారం తర్వాత పేపర్లో ‘అర్ధం కాకపోయినా అద్భుతంగా ఉంది’ అనెవరో సమీక్షిస్తే ‘అద్భుతంగా ఉందన్నారుగా, అర్ధం కాకపోయినా పర్లేద’ని అతనన్నాడని ఓ వూసు. కథ చేతికి రాగానే ఒకట్రెండుమూడు సార్లు చదివి, ఒక పండితుడికిచ్చి, మంచి కథండీ అన్నాను, ఆయన చదివి “అర్ధం కానివన్నీ గొప్ప కథలేనా?” అన్నారు, తృణీకారంతో.
చీరాలలో చదువుకునే రోజుల్లో, ఒంగోలు నుంచి స్నేహితులతో కలిసి రోజూ రైల్లో పోయొచ్చేవాణ్ణి. రైలు పెట్టె గుమ్మం దగ్గర బైటి మెట్లపై కాళ్ళు పెట్టి కూర్చునే వాళ్ళం అప్పుడప్పుడూ. కరవది స్టేషన్ దాటగానే గుళ్ళకమ్మ మీద బ్రిడ్జీ ఇప్పుడెలా వుందో తెలీదు కానీ, అప్పుడు బోసిగా అటూ ఇటూ ఏ చట్రాలూ గట్రా లేకుండా నగ్నంగా వుండేది. వంతెన మీంచి రైలు పోతున్నప్పుడు, ముందుకొంగి చూస్తే గాల్లో తేలుతున్నట్టు ఉండేది, కాళ్ళకీ, కింద ఏటికీ ఇసకకీ మధ్య ఏమీ లేకుండా. తెలీకుండానే దూకేస్తామేమో అన్నట్టు గుమ్మానికుండే హ్యాండ్‌రైల్‌ని మరింత గట్టిగా పట్టుకునే వాళ్ళం, ఒక చిన్న గగుర్పాటుతో.
“ఈ లోయ సౌందర్యంచూస్తోంటే ఉన్నపళంగా అమాంతం ఇందులోకి దూకేయాలనిపిస్తోంది… కాసేపటికి ఈ ఆకుపచ్చ లోయలోంచే పక్షిలా అలా గాల్లోకి ఎగురుతూ రాగలనేమో అని కూడా అనిపిస్తోంది,” అన్నాను భావోద్వేగంతో. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య నుండి వీస్తోన్న చల్లగాలికి ఆ క్షణం నా చర్మం రక్తమాంసాలతో కలిసి నృత్యం చేయసాగింది.
అతడూ కాసేపు ఆ లోయలోకి చూసి – “చాలాకాలంగా నేనూ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాను. కానీ ఫలితం.. ఊహూ… శూన్యం,” అన్నాడు.
“ఏదీ… పక్షిలా ఎగురుతూ పైకి లేవడమా…?” అన్నాను అతనితోపాటే కదలుతూ.
“కాదు. మనిషిలా నేల మీద బరువుగా నడవగలగడం,” అన్నాడతను మళ్ళీ ఆశ్చర్యపరుస్తూ.
…పరిచయమైన రెండు గంటల్లోనే చాలా చొరవ తీసుకుంటున్నాడనిపించింది.
నిజమే, ఆలోచన వచ్చేముందు చెప్పి మరీ రాదు, వస్తే చొరవ తీసుకుని మెదడంతా నిండిపోతుంది. అందులోనూ ఉన్నపళంగా లోయలోకి దూకేయాలనే ఆలోచన వస్తే, శరీరం జలదరించేదాకా. నడిచే మనిషికీ ఎగరాలనే కోరిక, ఎగిరే మనిషికి నడవాలనే కోరిక, ఏదైనా కుతూహలమే, వైవిధ్యం లేని జీవితం శాసిస్తోంది కాబట్టే. కథ మొదలుపెడుతూనే ఏం జరగబోతోందో తెలుస్తూనే వుంది. ఎలా జరుగుతుందన్నదే…
నాకు డలీ అంటే ఇష్టం. పూర్తిగా అర్ధమౌతాడని కాదు. అర్ధమయీ అవకుండా వుంటాడని, మరీ అబ్‌స్ట్రాక్ట్‌గా కాకుండా – మనం రోజూ చూసే ప్రపంచం లోనుంచే రోజూ రాని ఊహల్ని రప్పిస్తాడని. మా ఇంట్లో గోడకు వేలాడుతున్న ‘మెటమార్ఫసిస్ ఆఫ్ నార్సిసస్’ను అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాను. మోకాలి పై తల పెట్టుకొని నీళ్ళలోకి చూస్తూ నార్సిసస్, అవశేషాలుగా మిగిలిన చేతి వేళ్ళలో పిగిలిన గుడ్డులోంచి విచ్చుకుంటున్న నార్సిసస్ పూవు కొత్త జీవితాన్ని సూచిస్తున్నట్టు, క్షయానికీ మరణానికి గుర్తుగా చీమలు, మాంసం కొరుకుతున్న బక్క కుక్కా… అర్ధమయ్యీ కాకుండా ఉండడం ఇది. ఏది మరణానికి సంకేతం, ఏది జీవితానికి చిహ్నం? ఏది ఎక్కడ ఆగిపోయి రెండోది మొదలవుతుందో ఈ స్రవంతిలో? ఏది ఆ రెంటినీ కలిపే సన్నని తెర? పోనీ, విడదీసే తెర?
ఇదంతా నాన్సెన్స్ అంటే ఏం చెప్పను? అర్ధం కాని వన్నీ గొప్పవేనా అంటే ఏం చెప్పను? ‘పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ’ మనకు ఉంటుందని నేననుకుంటాను. కాదు, ఉంటుంది. అది సాధనతో రాణించే గుణం. వాడేకొద్దీ పదునెక్కే కత్తి లాంటిది. నిర్వచించలేకపోయినా మన అనుభవంలో ఉన్నదే – ఇది మంచిదనీ అది కాదనీ, ఇది బాగుందనీ అది లేదనీ, మనం అంటున్న ప్రతిసారీ పదునెక్కుతున్నదిదే. మనకు వెంటనే అర్ధం కాకపోయినా ఒక కవిత, ఒక చిత్రం, ఒక వస్తువు, ఇది గొప్పదే, మంచిదే, మెరుగైనదే అని తడితే అది దీనివల్లే. స్ఫటికానికీ, వజ్రానికీ తేడా తెలిసేది దీనివల్లే. పిసరంత ఊహకు మసిపూసి మారేడు చేసి లేని విద్వత్తుని ప్రదర్శించే శుష్క ప్రేలాపనల నుంచి, రచయిత ఒక గంభీరమైన భావనని తన భాషలో చెప్తే, ఆ భాషను అర్ధం చేసుకోడానికి మనమే కష్టపడాలని ఎలా తెలుసుకోగలం, అంటే ఇదిగో ఈ పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ వల్లే. రెండూ ఒకే విధంగా ఆకృతమైనా భావసాంద్రతకీ, శబ్దకాలుష్యానికి తేడాని అనుభవించగలం, మన అనుభూతిని వివరించలేకపోయినా. ఈ కథను అర్ధం చేసుకోవాల్సింది నేనే అనిపించింది కూడా నా పర్సెప్షన్ వల్లే. ఇది మంచి సాహిత్యం కలిగించే అవసరం అనీ, ఇది నాకు నేను చేసుకుంటున్న సహాయం అని కూడా తెలుసు నాకు.
“మళ్ళీ ఒక సారి చదవండి. అర్ధమున్నదీ, అయ్యేదే. ఈ కథ ఒక ఆత్మహత్య గురించి” అన్నాను ఆయనతో.
అరకు వరకేనని అతనితో అబద్ధం చెప్పాను కానీ, నిజానికి నా గమ్యం – నేనిట్లా నేల మీద నడుస్తూ నడుస్తూ పక్షిలా మారిపోయి..గాల్లోకి ఎగిరేంతవరకూ. ఈ విషయం అతనితో చెప్పదలచుకోలేదు…
…..
ఒక్కసారి చుట్టూ ఉన్న పరిసరాల వంక పరిశీలనగా చూశాను. లోయలు శూన్యాన్ని తింటూ శూన్యాన్ని నెమరు వేసుకుంటున్నాయి. చెట్ల ఆకుల కింది నీడలు మధ్యాహ్నపు నిద్రలో జోగుతున్నాయి. ఆకాశంలోని నీలిరంగుని కూడా కలుపుకొని వెలిగిపోతున్న ఎత్తయిన కొండలు ఎవరికీ అంతుబట్టని రహస్యాల గురించి గుసగుసలాడుకొంటున్నాయి… ఈ భూమ్మీద ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలెన్నింటినో వదిలేసి నాగరికులంతా ఇరుక్కొని ఇరుక్కొని కాలుష్యాన్ని తింటూ నగరాల్లో ఎందుకు బతుకుతుంటారో కదా అనిపించింది. ఎవరి సంగతో ఎందుకు… నిన్నా మొన్నటి దాకా నేనూ అట్లా బతికినోడినే కదా…!ఏదో.. ఆ బతుకు మీద విరక్తి కలిగి… ఉన్నట్లుండి ఒక రోజు ఎందుకో – జీవితాన్ని మరణానికి ముందుండే కొద్దిపాటి సమయంతో ముడిపెట్టి చూసినందువల్లే కదా.. లక్ష్యమేదో తెలిసినట్లనిపించి.. ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా ఇలా బయలుదేరింది…?
యోసెమిటీ నేషనల్ పార్కు వెళ్ళేవాళ్ళంతా గ్లేషియర్ పాయింట్‌కి వెళ్తారు. అది, షుమారు మూడువేల అడుగుల ఎత్తున్న కొండ చరియ అంచు. అక్కణ్ణుంచి యోసెమిటీ వ్యాలీ అంతా చూడచ్చు. వచ్చేవారి కోసం కొండ అంచుకి దగ్గరగా ఒక మెటల్ రెయిలింగ్ కట్టుంటుంది, దాన్ని దాటద్దన్న హెచ్చరికతో. ఈ ఫెన్సు వెనకగా చరియనుంచి పక్షి ముక్కులా పొడుచుకొచ్చి ఒక రాయి ఉంటుంది కింద లోయలోకి తేలుతూ (ఏడో ఫోటో).
ఒకసారి రెయిలింగ్ దూకి వెళ్ళి ఆ రాయి వెనక అంచు దగ్గర నిలబడ్డాను. శరీరమంతా ఒక వింత గగుర్పాటు, గుళ్ళకమ్మ వంతెన మీద లాగే, ఇంకొంచెం బలంగా. నన్ను చిన్నగా అటూ ఇటూ ఊపుతున్న గాలి. ఒక్క పెద్ద అడుగు వేస్తే రాయి ముందు అంచు మీదికొస్తాను, నేనూ లోయపైన తేలతాను. అడుగు ముందుకు వేద్దామన్న కోరిక. వేయలేకపోయాను. శరీరంలో ఉన్న ఉద్వేగం సరిపోదు, ఇంకేదో కావాలి. ఉద్వేగాన్ని దాటిపోవాలి. అడుగు ముందుకు వేయాలంటే ఉద్వేగం నుంచి ఉన్మాదంలోకి నా మనస్థితి మారాలి. అప్పుడే అది సాధ్యం. అడుగు ముందుకు వేయడానికి, వేయకపోడానికీ మధ్య ఒక సన్నని తెర వుంది, వాటిని కలుపుతూనో, విడదీస్తూనో. ఆ తెర దాటి ఉన్మాదాన్ని పొందలేక పోయాను – నన్ను నేను మర్చిపోగలగాలి. నన్ను నేను నిర్వచించుకుంటున్నది నేనున్న స్థలాన్నీ కాలాన్నీ బట్టే కదా? లోయ మీద తేలాలంటే స్థలకాలాల స్పృహ పోగొట్టుకోవాలి – ఆ పని చేయలేకపోయాను.
పక్షుల గుంపొకటి మా తలలకు కొంచెం దూరంలోంచి వెళ్ళిపోయింది. సూర్యాస్తమయ సమయం దగ్గర పడుతోందని అర్థమైంది. ఇతను అరకు వరకే నాతో కల్సి ప్రయాణం చేస్తాడు. నేను అరకు దాటి చాలా దూరం వెళ్ళాలి. నా లక్ష్యాన్ని చేరుకోడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో తెలీదు.
“బాగా చీకటిపడేలోగానే అరకులోయ చేరుకోవాలి” అన్నాడతను.
“స్థలకాలాల స్పృహ మీకు బాగానే ఉంది కాబట్టీ త్వరలోనే మీరు మనిషి బరువును పొంది నేల మీద పూర్తిగా నడవగలరన్న నమ్మకం కలుగుతోంది నాకు,” అన్నాను అభినందన పూర్వకంగా.