సాహిత్యావగాహన: మరొక దృక్పథం

ముందుగా, నేను ఒక సాధారణ పాఠకుడిగా కథ, నవల, నాటకం ఎల్లా చదువుతానో ఎలా అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తానో చెప్పుతాను.

ఒక కథ తీసుకోండి. (ఈ వ్యాసంలో నేను ‘కథ’ అన్నప్పుడు, కథ అన్న పదం నవలకి, కవితకి నాటకానికీ కూడా వర్తిస్తుంది.) ముందుగా ఆ కథ చదివినప్పుడు, ఆ కథ నా మానసిక స్థితిలో మార్పు తీసుకొవస్తుంది. నన్ను ఒక రకమైన ఉద్విగ్న స్థాయి (emotional level) లోకి తీసుకొపోతుంది. ఆ స్థాయిలో ఒక అనుభూతి నిస్తుంది. అది పాఠకులందరికీ సహజమని అనుకుంటాను. కొంచెం లోతుగా వెళ్ళి, అదే సాహిత్యప్రక్రియని మరొకసారి పరిశీలనగా చదవటం మొదలు పెడితే, నా అనుభూతికి కారణం, నా అనుభవాలు, — నా పాత జ్ఞాపకం, నా స్మృతి — కావచ్చునని చూచాయగా కనిపిస్తుంది. ఈ రకమైన అనుభూతి నాకు ఎక్కడనుంచి వచ్చింది? ఈ కథలో ఒక పాత్ర ఎక్కడో చూసినట్టున్నదే? కొన్ని పాత్రలు ఎక్కడో, ఎప్పుడో నాకు తారస పడినట్టున్నాయే? ఈ కథలో సన్నివేశం (situation), దానిని వర్ణించిన పరిస్థితి ఎక్కడో ఎప్పుడో విన్నానేమో చెప్మా? అని సవాలక్ష ప్రశ్నలు పుడతాయి. బహుశా, భారతంలో కథ ఏదో చదివినప్పుడో, ఏదో పురాణకథ విన్నప్పుడో ఇలాంటి సన్నివేశం -– దరిదాపుగా ఇలాంటి సన్నివేశం — ఒకటి ఉన్నదా? అప్పుడు, ఆ కథ మరొక సారి మరొక దృక్పథంతో చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడం జరుగుతుంది. చాలా సార్లు, కథలు, నవలలూ, నేను తిరిగి మరోసారి ఓపిగ్గా చదువుతాను. అలా చదవడం నాకు చాలా సరదా నిస్తుంది, చాలా సమయాలలో ఒకటికి రెండుసార్లు చదవడం ‘మోర్ రివార్డింగ్’ అని అనిపిస్తుంది. ఆ కథని మరింత చక్కగా ‘విశ్లేషించుకోడానికి’ ఉపయోగపడుతుంది.


ఈ అనుభూతికి కారణం నా స్మృతిపథంలో, నా చిన్నప్పుడు హత్తుకొపోయిన ఒక సన్నివేశం కావచ్చు; ఎప్పుడో ‘తలా వలా పలకా పడవా రోజుల్లో’ నేర్చుకున్న ఒక విశేషం కావచ్చు. ఇదేదో నేను కొత్తగా కనుక్కున్న విషయం కాదు. అనాది కాలం నుంచి — అంటే మానవజాతి మొదలైనప్పటి నుంచీ — ఈ రకమైన జ్ఞాపకాలు, వ్యక్తి అనుభవాలకి, అనుభూతులకీ కారణభూతం అవుతున్నాయి. సాంప్రదాయికముగా అందరూ ఒప్పుకున్న స్మృతిని అధిగమించి ఖండికలుగా వ్యక్తి స్మరణలో ఇవి మిగిలి ఉంటాయని అంటారు. ఈ వివరణ ఒప్పుకోవటానికి, కార్ల్ యూన్గ్ (Carl Jung) వాస్తవ్యమని ప్రతిపాదించిన వారసత్వ స్మృతికి సంబంధించిన సిద్ధాంతాలని సమ్మతించాలి.

ఆధునిక సాహితీవిమర్శకులలో ప్రసిద్ధికెక్కిన నార్థాప్ ఫ్రై (Northop Frye) తన ప్రసిద్ధమైన పుస్తకం[1]లో, ప్రతి ఆధునిక కృతికీ ఒక ‘ప్రాచీన ప్రతీక’ ఉంటుందనీ దానిని ఆర్కిటైప్ (Archetype) అంటారనీ, అంటాడు. నీకు తెలిసినా తెలియకపోయినా, ఈ ప్రాచీన ప్రతీకలు నీ సాహిత్యంలో ఉంటాయి.

అతని ఉద్దేశంలో, ఇప్పటి వరకూ విమర్శకులు వారి వారి అభిరుచులని ఆధారంగా చేసుకొని సాహిత్యాన్ని విమర్శించారు. అది తప్పు. అంతే కాదు, కేవలం, కథ, కథనం, కథా వస్తువు –- వీటిలో ప్రత్యేకత, మౌలికతలను ప్రశ్నించడం ప్రధానం కాదు. ఒక శిల్పాన్నో, చిత్రాన్నో పరిశీలనగా చూడటానికి, ఆ శిల్పానికి, ఆ చిత్రానికీ కొంచెం దూరంగా వెనక్కి వెళ్ళి చూడాలి. అల్లాగే, సాహిత్యాన్ని కూడా సరియైన అంతర్గత అవగాహన రావడం కోసం చూడాలి. సాహిత్య విమర్శకుడి (అంటే serious reader) బాధ్యత ఏమిటంటే, కథకి దూరంగా వెళ్ళి కథని చూడటం. అంటే, ఆధునిక కథ, నవల, కృతి — వీటికీ ప్రాచీన ప్రతీకకీ ఉన్న సంబంధాన్ని అన్వేషించడం విమర్శకుడు చెయ్యవలసిన పని, అని ఫ్రై వాదం. ఆర్కిటైప్ అంటే మరికాస్త వివరంగా తెలుసుకునేముందు, పౌరాణిక కథ (myth) ప్రస్తావన అవసరం. (పౌరాణిక కథ ఇక్కడ mythకి నిజంగా సరైన అనువాదం కాదు. అయినా నాకు ఇంతకన్నా లోతైన మాట తెలియక, వాడటం తప్పటల్లేదు.)

ఆదిమ మానవుడు కొన్ని వేల సంవత్సరాల నుంచీ తన అనుభవాలు చెప్పుకుంటూనే వచ్చాడు. తను పడ్డ కష్టాలు, తన భయాలు, తన ఊహలు, తన ఆకాంక్షలు, తన కోరికలూ ప్రతిబింబిస్తూ గుహల్లో శిల్పాలు చెక్కాడు, బొమ్మలు వేశాడు. ఆ తరువాత కథలు. ఈ మానవ జీవితాల కథలన్నీ, మౌఖికరూపంగా ఒక తరాన్నుంచి మరో తరానికి అందించబడ్డాయి. ఈ ప్రసరణలో, ఎన్నో రకాల మార్పులు వచ్చి వుంటాయి ఆదిమ ప్రాచీన కథకి, కథలకీ! ఈ విధంగా మానవ సంస్కృతుల్లోకి ప్రవేశించి, జనాన్ని ఆకట్టుకున్నవే మిథ్స్. ఆ పౌరాణిక కథల్లో ఏవో కొన్ని అంశలు, కొన్ని భాగాలు, నమూనాలుగా మానవజాతి సామూహిక స్మృతిలోకి ప్రవేశించుతాయి. సూక్ష్మంగా ఆర్కిటైప్‌ని మాదిరి (pattern), నమూనా (model) అని అనచ్చు. లేదా, కొంచెం లోతుగా చెప్పాలంటే, ఈ నమూనాకి పురాణసంబంధితమైన మాతృకే ఆర్చిటైప్. (mythic original on which a pattern is based.)

తరువాత ఈ కథలన్నీ, కొన్ని తరాల తరువాత, రకరకాల చిలవల పలవలతో, పుస్తకరూపం లోకి దిగుమతి అయ్యాయి. ఇది అన్ని సంస్కృతుల్లోనూ జరిగిన విషయమే! అందుకని, కల్తీ లేని పౌరాణిక గాధ అసంభవం — అల్లాగే కల్తీ లేని ఆర్చిటైప్ కూడా ఉండదు. అంటే, అన్ని సంస్కృతుల్లోనూ, ప్రాచీన సాహిత్యం అని చెప్పుకొనే సాహిత్యంలో, చెప్పిన మిథ్ లన్నీ నిజం చెప్పాలంటే, స్థానచ్యుతి పొందిన పౌరాణికాలు (displaced myths) అంటాడు, నార్తోప్ ఫ్రై.


నమూనాకి పౌరాణికసంబంధితమయిన మాతృకే ఆర్చిటైప్ అన్నాము కద! ఆర్చిటైప్ వెతికిపట్టుకోవటం అంటే, నమూనా ని గుర్తుపట్టటం అన్నమాట. దీనిని విన్యాస జ్ఞానం (pattern recognition) అందాము. ఈ విన్యాస జ్ఞానం బాగా చదువుకున్న వాళ్ళకో, ‘సాంస్కృతికం’గా ఎంతో ఎత్తు ఎదిగిన వాళ్ళకో, పట్టు విడవకండా సాహిత్యావధానం చేసిన వాళ్ళకో తేలిగ్గా వంటపడతాయి కాని, పాఠకులందరికీ సాధ్యమా? అన్నది అసలు ప్రశ్న. కథ చదవడం కొత్తగా మొదలు పెట్టినపుడు, కథ అతుకులు విరిగిన బొమ్మలా, అసంబద్ధంగా (disjointed) కనపడుతుంది.

ఒక చిన్న ఉదాహరణ చెపుతాను. పిల్లల కనెక్ట్ ది డాట్స్ పుస్తకాలు గుర్తుకు తెచ్చుకొనండి. చిన్న పిల్లలు, కాగితం మీద అచ్చులో ఉన్న చుక్కలు పెన్సిల్ తోనో, క్రేయానుల తోనో కలిపి బొమ్మ వేస్తారు. ఒక పదో పరకో అలా బొమ్మలు వేసింతర్వాత, వాళ్ళు కొత్త కాగితం మీద చుక్కలు చూడంగానే బొమ్మ ఏదో పసి కట్టెయ్యగలరు. అది ‘కోతి’ బొమ్మ, ఇది ‘విమానం’ బొమ్మ అని చుక్కలకేసి చూడంగానే చెప్పేస్తారు. ఇదే విన్యాస జ్ఞానం అన్నానూ, నమూనా గుర్తించడం అన్నానూ. నా మటుకు నాకు అన్ని చుక్కలూ, గీతలూ కలిపే దాకా ఆ బొమ్మ ఏదో పసిగట్టటం చేతకాదు. ఇది అభ్యాసంతో వస్తుంది. కాస్త చదువుకున్న తరువాత, కొంచెం ఆలోచనతో తిరిగి చదివిన తరువాత, ఈ విన్యాసాలు, ఈ ఆర్కిటైపులు, ఈ తిరిగివచ్చే జ్ఞాపకాలూ సాధారణ పాఠకుడికి గూడా సంభవమే!

ఇంకొక కొత్త విషయం కూడా బోధపడుతుంది. సాహిత్యంలో పూర్తి మాతృక (wholly original) అన్నది నిజం కాదని! అది అసంభవం అనిన్నూ! అది గుర్తిస్తే చాలు — అప్పుడు, ఇదెక్కడో చూశానే? చదివానే? అన్న ప్రశ్న సమంజసమయిన ప్రశ్న అని తెలుస్తుంది.

జాన్ బార్త్ (John Barth) ఎక్కడో రాస్తాడు: నాలుగయిదు వేల ఏళ్ళ క్రిందటి ఒక ఈజిప్షియన్ పురాతన పత్రంలో (Egyptian Papyrus) ఉన్న విషయం. అన్ని కథలూ ఎక్కడో ఎవరో చెప్పేసినవే! అందుకని సమకాలీన కథా రచయితకి రాయటానికి కథలు లేవు; పాత కథలే తిరిగి చెప్పటం తప్ప.

దీని వలన నష్టం లేదు. ప్రతి మంచి కథకుడికీ ఈ విషయం తెలుసు. అటువంటి రచయిత చేతిలో ఆ పాత కథే, కొత్త కొత్త ప్రతిధ్వనులని వినిపిస్తుంది. మరొక రకంగా విడమర్చి చెప్పాలంటే, ఒక కథ మరొక కథ నుంచి ఎదుగుతుంది. ఒక పద్యం మరొక పద్యం నుంచి ఎదుగుతుంది. ఒక్కొక్కసారి ఒక కథ నుంచి మరొక పద్యం, ఒక పద్యం నుంచి మరొక్క కథ ఎదుగుతాయి. ఎదుగుతాయి అనడం కన్నా ‘పుట్టుకొస్తాయి’ అనడం సబబు. దీనిని ప్రేరణ (influence) అని, ప్రభావితం అవడమని చెప్పవచ్చు. రచయితలు అందరూ ప్రతీకలు (symbols) వాడుతారు. కొన్ని కథల్లో, ఇది కొట్టవచ్చినట్టు కనబడుతుంది. కొన్నింటిలో మనం జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి, ఈ ప్రేరణ అనే దానిని, ఈ ప్రతీకలు అనేవాటినీ! దీనిని గురించి తరువాత ముచ్చటిద్దాం.

ఎలియట్ (T.S. Eliot) తన విమర్శనా వ్యాసాలలో రాస్తాడు: ఒక రచయిత రచనకి మూలం తెలుసుకోవడం చాలా అవసరం. కవులు మరొకరి రచనల నుంచి తమ రచనల లోకి ‘అరువు’ తెచ్చుకుంటారు. తను, దాంతే (Dante) నుంచి అరువు తెచ్చుకున్న వాక్యం ఎలా మార్చుకున్నాడో ఉదహరిస్తాడు కూడాను! దీనిని ‘గ్రంథచౌర్యం’ అనకూడదు. బహుశా తనని, అలాగని దూషిస్తారనే తన కవితలకి పాదసూచికలు[2] ఇచ్చాడు. ఒక రకంగా పరిశీలిస్తే, యెలియట్ రాసినదాంట్లో, ‘మూలం తన స్వంతది,’ అన్నది ఏమీ లేదేమో అనిపిస్తుంది. ప్రేరణ, ప్రభావన (influence) యెలియట్ విమర్శలలో[3] చాలా ముఖ్యమయిన అంశం.

ఇక్కడ అవాంతరప్రసంగం అని కొందరికి అనిపించినా, నేను ప్రస్తావించ దలచాను.

కావ్య మీమాంసాలో రాజశేఖరుడు[4], తన భార్య అవంతీసుందరి చెప్పినదని చెబుతూ, ఆవిడ శబ్దార్థహరణం గురించి. శబ్దార్థహరణం, ఎప్పుడు అనింద్యం కాదో చేసిన వివరణ విపులంగా రాస్తాడు. ‘(గ్రంథ) చౌర్యము చేయని కవి ఉండడు. ఒక్కొక్క కవి నూతన మార్గములు సృజించును. ఒక్కొక్కడు మార్పులు చేయును,’ అని తను రాసి, పదకొండవ అధ్యాయం చివర ఈ విధముగా వివరిస్తాడు: ‘ఎవడు శబ్దమునందును, అర్థమునందును, ఉక్తులయందును ఏదైన ఒక నూతనవిషయమును చూడగలుగునో, ఏదైన ఒక ప్రాచీన విషయమును చక్కగ చిత్రించునో అతడు మహాకవి అని గ్రహింపవలెను. రాజశేఖరుని ప్రస్థావన తేవడంలో నా ఆంతర్యం ఎలియట్‌ని న్యూనత పరచటానికి కాదు. ఆయన గత శతాబ్దంలో చెప్పిన కొన్ని విషయాలు భారతీయ అలంకారికుడు మరొక భాషలో, మరొక సందర్భంలో పదవ శతాబ్దంలో చెప్పారు అన్న విషయం గుర్తు చెయ్యడానికే చెప్పాను.


ఒక కథ మరో కథని గుర్తు చేసింది, పోలికలు కనిపించాయి; సాదృశ్యత కనిపిస్తుంది. అయితే ఒరిగేదేమిటి? అని అడగచ్చు. నిజంగా ఏమీ లేదు, అని నేను కప్పదాటు వెయ్యచ్చు కూడాను! అయితే, ఒక సాధారణ పాఠకుడుగా నువ్వు ‘ఆహా!’ అని ఆనందించవచ్చు. ఈ పైవిషయం స్థూలంగా చెప్పాలంటే, పాత సాహిత్యం కొత్త సాహిత్యంతో సంభాషణ చేస్తున్నది అని అర్థం. దీనినే, పాశ్చాత్య విమర్శకులు ఇంటర్‌టెక్స్చువాలిటీ (intertextuality) అంటారు. మనం పాఠ్యాంతర సంబంధం అని అర్థం చెప్పుకుందాం.

పాఠ్యాంతర సంబంధం అసలు అర్థం ఇది: సాహిత్యంలో ఒక దానితో మరొక దానికి సంబంధం ఉన్నది. అది అవిచ్ఛిన్నమైన సంబంధం. నువ్వు రాసిన కథకో, కావ్యానికో, నవలకో, మరొక రచనతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఇది రక రకాల అంచెలలో జరుగుతూ ఉంటుంది. పాత సాహిత్యం, కొత్త సాహిత్యం, అనవరతమూ సంభాషణ కొనసాగిస్తూనే ఉంటాయి. ఇది పరస్పర చర్య. ఈ చర్య కొందరి రచనలలో సూటిగా శ్రమ లేకండా పాఠకుడికి కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. కొన్ని రచనలలో అంత తేలికగా కనపడదు. ఏది ఏమయితేనేం! కొంచెం పొడిగించి చెప్పాలంటే, ‘నీ నవలలో నువ్వు వినని, చదవని సాహిత్యంలో విశేషం, ప్రతిధ్వనించటమో లేదా దాని ఖండనో’ ఉంటుందని అర్థం.

ఈ పాఠ్యాంతర సంభాషణ పాఠకుని పఠనానుభవాన్ని పెంచి వృద్ధి చేసి సుసంపన్నం చేస్తుంది. కథలో అనేకమైన పొరలున్న అర్థాలు కూడా గోచరిస్తాయి. దీనినే బహుళార్థకత అంటారు. అయితే, ఈ బహుళార్థకత అంతా పాఠకుడికి పూర్తిగా ఎప్పుడూ తెలియక పోవచ్చు కూడాను! పాఠ్యాంతర సంభాషణ మొదటిసారిగా ప్రస్తావించిన వాడు, రష్యన్ రూపవాద (formalism) సాహితీవేత్త మిఖయేల్ బాఖ్తిన్ (Bakhtin). ఈ రెండింటిపై, ఇతను క్షుణ్ణంగా వ్యాఖ్యానించాడు. పాఠ్యాంతరసంబంధం, బాఖ్తిన్ కాల్పనిక సాహిత్యానికే (ముఖ్యంగా నవలకే) పరిమితం చేసినప్పటికీ, ఇది సాహిత్యంలో అన్ని ప్రక్రియలకీ వర్తిస్తుంది[5]. ఈ విషయం ఎలియట్ గుర్తించాడు.

ఈ ఆర్కిటైపులు, మాదిరి గుర్తింపూ, పాఠ్యాంతర సంబంధం, బహుళార్థకత, వగైరా, వగైరా — పాత సాంస్కృతిక సాహిత్యం అంతా ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకీ చదివి ఆకళింపు చేసుకున్న వాళ్ళకే గాని, అందరూ ఎలా గుర్తించగలరు? ఇది మళ్ళీ పాత ప్రశ్నే. ఎవడూ పాత సాహిత్యం అంతా చదవలేదు. చదవలేరు.