ఒక పాట – రెండు బాణీలు

ఫేస్ బుక్, గూగుల్ ప్లస్, వాట్సాప్ కంటే ముందు, అసలు వెబ్ బ్రౌజర్లే లేని రోజుల్లో చర్చలన్నీ ఈమెయిల్ ద్వారానో, యూజ్‌నెట్ న్యూస్ గ్రూపుల్లోనో జరిగేవి. యూజ్‌నెట్‌లోనే recreation (rec.) విభాగం క్రింద శాస్త్రీయేతర సంగీతం, ముఖ్యంగా హిందీ సినిమా పాటలపైన చర్చలకు Rec.Music.Indian.Misc (RMIM) అనే గ్రూపు ఉండేది. తక్కిన భారతీయ చర్చావేదికలకంటే భిన్నంగా, ఉదాహరణకి తెలుగుకి సంబంధించిన స్కిట్ (Soc.Culture.Indian.Telugu – SCIT), ఇక్కడ చాలా మంచి చర్చలు జరిగేవి. (ఈ గ్రూపు ఈ మధ్యనే పాతికేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బెంగళూరులో ఏప్రిల్ 8-9తేదీల్లో చాలా మంచి సమావేశం కూడా జరిగింది.) 1996 ప్రాంతంలో ఒకసారి ఈ గ్రూపులోనే Tandem Songs అంటే ఒకే పాటని- సాహిత్యంలో కొద్దిగా మార్పులుండవచ్చు- వేర్వేరు గాయనీ గాయకులు, అదే బాణీలోనో లేక వేరే బాణీలోనే పాడటం పైన ఒక పెద్ద చర్చ నడిచింది. ఆ సందర్భంలో తెలుగు సినిమా పాటల్లో కంటే లలిత సంగీతంలో ఇలాంటి పాటలు చాలా యెక్కువగా కనిపిస్తాయి కదా అని నాకు తెలిసిన లలిత గీతాల్ని ఒక చోట రికార్డు చేయడం మొదలుపెట్టాను. ఆ సంకలనం లోనుంచి ఒక 5 పాటలు ఇక్కడ వినండి. ఇలాంటి లలిత గీతాలు కొన్ని వందలు వుండవచ్చు. బాగా ప్రచారం పొందిన పాటో (ఉదా. అమ్మదొంగా నిన్ను చూడకుంటే- పాలగుమ్మి విశ్వనాథం), లేక దేవులపల్లి లాంటి ప్రముఖ కవి రచనో (ఉదా. మ్రోయింపకోయి మురళి, ఒక తుమ్మెద మదిలో ఝుమ్మంది, ఆకులో ఆకునై, …) అయితే చాలా మంది పాడిన సందర్భాలు వున్నాయి.

ఈ క్రింది 5 పాటల్లో మల్లిక్, సుమిత్రగార్లు పాడిన ‘ఒదిగిన మనసున’ అన్నది చాలా అరుదైన రికార్డింగు. అందరికీ చిత్తరంజన్, కనకవల్లీ నాగేందర్‌గార్లు పాడిన వర్షనే తెలుసు. కానీ మల్లిక్, సుమిత్రల పాట ఆకాశవాణిలో అంతకుముందే రికార్డయ్యింది. అలాగే మల్లిక్ పాడిన ‘తందనాన’ (ఆయన స్వంత బాణీ) బాగా ప్రచారం పొందిన పాట. కానీ ఎం. ఎస్. రామారావు బాణీ ఆకాశవాణి టి.ఎస్. రికార్డుగా విడుదల చేసింది. సీత, సత్యవతి పాడిన ‘గోపీలోలుడు రమ్మన్నాడే’ కూడా అలానే టి.ఎస్. రికార్డుగా విడుదలయింది.


  1. ఆగుమా జాబిలీ సాగిపోయెదవు ఏలా – రచన: రావులపర్తి భద్రిరాజు.

    1. బి. వరహాలు

    2. మల్లిక్

  2. గోపీలోలుడు రమ్మన్నాడే

    1. సీత-సత్యవతి

    2. గాయని?

  3. ఒదిగిన మనసున పొదిగిన భావమూ – రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి.

    1. మల్లిక్-సుమిత్ర

    2. చిత్తరంజన్- కనకవల్లి

  4. తందనానా భళా తందనానా – రచన: అన్నమయ్య.

    1. ఎమ్. ఎస్. రామారావు

    2. మల్లిక్

  5. వచ్చెనదిగో వర్షసుందరి

    1. కె. శేషులత

    2. గాయని?