ఇంగ్లీషు చదువుల చరిత్ర 1

I

చెన్న పట్టణమున సుప్రీము కోర్టులో 1819 మొదలు 1835 వరకు ఇంటర్‌ప్రిటరు (ట్రాన్సులేటరు)గానుండిన ఏనుగుల వీరాస్వామయ్యగారును ఆరోజులలో పోలీసు డిప్యూటి సూపరెండెంటు మేజస్ట్రీటు పదవుల నందిన వి. రాఘవాచార్యులుగారును కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళెగారును 1827 సంవత్సరము నుండి 1853 సంవత్సరము వరకు మద్రాసు సుప్రీము కోర్టులో అడ్వకేటు జనరలుగా పనిచేసిన జార్జి నార్టనుగారి నాయకత్వమున దక్షిణ హిందూ దేశమున యింగ్లీషు విద్యావిధానమును స్థాపించుటకు అఖండమైన సేవ చేసిరి.

జార్జి నార్టనుగారి వలెనే చెన్నపట్టణమున సదరు అదాలత్ కోర్టులో గవర్నమెంటు ప్లీడరుగను సుప్రీముకోర్టులోను తరువాత మదరాసు హైకోర్టులోను అడ్వకేటు జనరలుగను పనిచేసి భారత దేశీయులపట్ల అత్యంత సానుభూతిగలిగి దేశీయులలో విద్యాభివృద్ధి గావించుటకును, రాజకీయ పరిజ్ఞానము కలిగించుటకును పాటుపడుచు, పచ్చయప్ప కళాశాల ధర్మములకు ముఖ్య ధర్మకర్తగా (patronగా) నుండి ప్రతి సంవత్సరోత్సవమున దేశీయుల సుద్బోధించుచు ఇరువదియయిదు సంవత్సరములు ప్రజాసేవ చేసిన జాన్ బ్రూస్ నార్టన్‌గారి పట్ల మదరాసు పౌరులు తమ కృతజ్ఞతను తెలుపుటకు, పచ్చయప్ప కళాశాలాభవనమున 1868 సంవత్సరం మార్చి నెలలో ఒక మహాసభ జరిసి వారి ఛాయాపటమును బహిర్గతము చేయు సందర్భమున ఈ జాన్ బ్రూస్ నార్టనుగారు మాట్లాడుచు – పూర్వము జార్జి నార్టను వీరాస్వామయ్య ప్రభృతులు చేసిన అపారమైన సేవను గూర్చి ఇట్లు కొనియాడిరి.

“…ఈ సందర్భములో నాపటమునకు ఎదురుగా నున్న రూపపటములోని జార్జి నార్టనుగారిని గూర్చి నేను కొంచము ప్రశంసింపక విరమింపజాలను. ఈ దేశములో విద్యాభివృద్ధి కొరకు నాకన్న ఆయన ఎక్కువ ముఖ్యకారకుడు. ఆయన యొక్క దూరదృష్టి పట్టుదల ఆయన తెలివితేటలు మతవిషయములతో సంబంధము లేని లౌకిక ఆంగ్లేయ విద్యాస్థాపనమునుగూర్చి ఈ దక్షిణ దేశమున జరిగిన దీర్ఘమైన గొప్ప పోరాటమును చేసి తుదకు విజయము గాంచినవి. ఈ పచ్చయప్పగారి విద్యాసంస్థను స్థాపించుట కుపయోగింపబడిన మూలధనమును తినుచు కూర్చున్నవారి దగ్గరనుండి బయటకు లాగి సంపాదించిపెట్టిన దితడే. ఈ పాఠశాల యొక్క వృద్ధికిని ఉన్నతస్థితికిని కారణభూతములయిన నిబంధనలను చేసినదియు నితడే. క్రిందటి తరములోని తెలివి గల నేటీవు(దేశీయు)లును దేశీయవిద్యాభివృద్ధికి జనకులును అని చెప్పతగినవారును, ఆయనతో పాటు ఈ చిత్రపటములోనే చిరస్మరణీయులుగ చిత్రింపబడి యున్నవారును ఆయిన వి. రాఘవాచార్యులు, ఏనుగుల వీరాస్వామయ్య (కోమలేశ్వరపురం) శ్రీనివాస పిళ్ళె గార్లను ఆయన దగ్గరకు చేరదీసి ప్రోత్సహించినాడు. సంఘసామ్యమునకు పునాది తల్లులేయనియు అందువలన స్త్రీ విద్య అత్యవసరమనియు గ్రహించి శ్రీనివాస పిళ్ళెగారు ఆడపిల్లల పాఠశాల నొకటి స్థాపించినాడు. ఇంగ్లీషు రాజ్యాంగమును గూర్చియు భారతదేశమున బ్రిటిషు పరిపాలనమును గూర్చియు ఆతడిచ్చిన అమూల్యమైన ఉపన్యాసములను గూర్చి నొక మారు మీకు జ్ఞాపకము చేయుచున్నాను.” అనిరి.

ఏనుగుల వీరాస్వామయ్య

ఏనుగుల వీరాస్వామయ్యగారు చెన్న పట్టణమున పందొమ్మిదవ శతాబ్దారంభమున నుండిన సుప్రసిద్ధ ఆంధ్రప్రముఖులలో ఒకరు. ఈయన ఆంధ్రనియోగి బాహ్మణుడు. తండ్రి పేరు సామయమంత్రి. ఈయన స్వయంకృషి చేత పయికి వచ్చినవారు. తొమ్మిదవ యేటనే తండ్రినిగోల్పోయి వీధిబడిలో చదువుకొని తెనుగు, అరవము, సంస్కృతము నభ్యసించి, ఇంగ్లీషు నేర్చుకొని కుంఫిణీవారి కొలువులో వాలంటీరుగా ప్రవేశించి తన తెలివితేటలవలన వివిధములైన ఉద్యోగములందు పైవారిని మెప్పించిరి. ఆనాడు మదరాసులో నేటి హైకోర్టుకు పూర్వముండిన సుప్రీముకోర్టులో ఇంగ్లీషుకు అరవము నుండి తెనుగునుండి తర్జుమా చేయుటకు ఇంటర్‌ప్రిటరను ఉద్యోగము ఖాళీరాగా అది వీరి బంధువులున్నూ సదరు కోర్టులో ఇంటర్‌ప్రిటరు ఉద్యోగము చేయుచున్న వారునూ అయిన వెన్నెలకంటి సుబ్బారావుగారికి ఇచ్చెదమని దొరలు చెప్పగా ఆ సుబ్బారావుగారి సిఫారసు పైన 1819లో వీరాస్వామయ్య గారికివ్వబడినది. అప్పటినుండి సుప్రీము కోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా ఉద్యోగము చేసిన దొరలందరి యొక్కయు మన్ననలకు పాత్రులయి 1835 వరకు ఆ యుద్యోగమును చేసి ఉపకార వేతనమునంది 1836 సంవత్సరము అక్టోబరు 3 తేదీన దివంగతులైరి. ఈయన జన్మవత్సరము తెలియలేదు. పింఛను పుచ్చుకొనునాటికి ఏబది సంవత్సరములుండునని యోచించిననుగూడ ఆయన 1780లోనో అంతకు పూర్వమో జన్మించియుండవలెనని తోచుచున్నది. వీరాస్వామయ్యగారు కన్యాకుమారి నుండి కాశ్మీరమువరకును రెండుమారులు భారత దేశమున పర్యటనము జేసిరి. తాము చూచిన సంగతులు లేఖలుగను దినచర్యగను 1830-31లో వ్రాసిరి. ఇది కాశీయాత్ర యను పేరున 1838లో ప్రకటించబడినది. వీరాస్వామయ్యగారు గొప్ప ప్రజాసేవకులు పరోపకార పారీణులు, చెన్న రాజధానిలో ఇంగ్లీషు విద్యాభివృద్ధికి, చాలా పొటుపడిరి. హిందూ లిటరరీ సొసైటీ అను ప్రజాసంఘమును స్థాపించి ప్రజాసేవ చేసిరి.

క్రీ. శ. 1832లో నందన సంవత్సరమున వచ్చిన ఘోరక్షామములో తాము స్వయముగా అన్నాతురులకు అన్నప్రదానము చేయటయే గాక బీదలను గాపాడుటకు సత్రములు పెట్టించి రాత్రింబవళ్ళు అన్నప్రదానము చేయించిరి. వీరాస్వామయ్యగారికి ఇంగ్లీషు తెనుగు అరవములందు సంస్కృతమునందు మంచి పాండిత్యముండెను. అనేక పండిత సభలయందు వారు వాదించి గెలుపొందిరి. వీరాస్వామయ్యరుగారు రచించిన కాశీయాత్రచరిత్రను 1838లో అచ్చు వేయించిన వీరిమిత్రులైన కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళెగారు వీరి జీవితసంగ్రహమును రచియించి దానిలో చేర్చిరి.

భారతదేశము ఇంగ్లీషువారి వశమగునాటికి మొగలు సామ్రాజ్యము విచ్ఛిన్నమై రాజకీయ విప్లవముల వలన యుద్ధముల వలన చాలచోట్ల పూర్వము నాటి రాజ్యాంగ కట్టుబాటులు సడలిపోయి పరిపాలనా విధానము కుంటువడినను దేశములో శాంతిభద్రతలు తగ్గి ప్రభుత్వ ఉద్యోగులు లంచగొండులై ప్రజలను పీడించుట ప్రారంభమై దేశ దారిద్ర్యము హెచ్చినను దేశములో పెద్ద పట్టణములందు చిన్న గ్రామములందు సైతము పూర్వకాలమునాటి విద్యాపద్దతులు అమలు జరుగుచునేయుండెను. 1757 మొదలు 1813 వరకును కుంఫిణీ వారు దేశప్రజలవలన పన్నులు వసూలు చేసి అమితలాభము సంపాదించుచుండినను, ప్రజల విద్యాభివృద్ధి విషయమున నెట్టిజోక్యమును కలిగించుకొనలేదు. పూర్వకాలపు ప్రభుత్వములు రాజులు అధికారులు విద్యాపోషణ కొరకిచ్చిన వర్షాజనములు, యీనాములు, జాగీరులను, వీరు మన్నించిన వారు కారు. అందువలన పోషణ లేక విద్య అభివృద్ధిగాక నానాటికి క్షీణించినది. దేశప్రజలలో విద్యాభివృద్ధి చేయుట అవసరమని 1813లో పట్టానిచ్చునప్పుడు పార్లమెంటు వారు హెచ్చరించి దానికొరకొక లక్షరూపాయిలు ఖర్చు పెట్టవలసినదని శాసించినను కుంఫిణీ వారు త్వరలో అట్టి ప్రయత్నము చేయలేదు.

దేశములో తెలివికలవారు కొందరు స్వతంత్రముగా ఇంగ్లీషు భాష నేర్చుకొని,దాని లాభమును గ్రహించి ఇంగ్లీషు విద్యావిధానమును స్థాపింపుడని పోరసాగిరి. 1823లో రామమోహనరాయలిట్లు కోరుచు, ఆ నాటి గవర్నరు జనరలైన ఆమహరెస్టుకు బహిరంగ లేఖ వ్రాసి బిషపు హెబ్బరుగారికిచ్చి పంపెను. ఇది ఇంగ్లాండులో కుంఫిణీ డైరెక్టర్ల కందచేయబడెను. తరువాత ఆంగ్లేయ విద్యావిధానమును స్థాపించుటకు ప్రభుత్వమువారు చేసిన నిర్ణయమునకిది తోడ్పడినది. ఎట్టకేలకు కుంఫిణీ వారు విద్యాభివృద్ధినిగురించి యోచింపదలచిరి. దేశీయులకు పూర్వపువిజ్ఞానము నేర్పు పాఠశాలలు స్థాపించవలెనా? లేక ఇంగ్లీషు భాషను పాశ్చాత్య శాస్త్రవిజ్ఞానమును నేర్పు పాఠశాలలు స్థాపింపవలెనా అను విషయమును గురించి చర్చలు బయలు దేరెను. అది తీర్మానించుటకు ముందుగా దేశములోని ప్రాతవిద్యావిధానము లే స్థితిలో నున్నవి? ప్రజల అక్షరజ్ఞాన మెట్లున్నది? అని విచారించుటకు వివిధ రాష్ట్రములందు విచారణ చేయసాగిరి.

చెన్న రాష్ట్రమున గవర్నరుగా నుండిన నర్ తామస్ మన్రోగారు 1822-26 మధ్య వివిధ జిల్లాకలెక్టరుల చేత ఈ విషయమును గురించి విచారణ చేయించిరి. దాని వలన నానాటికి మన రాజధానిలో పాఠశాలకుబోవు ఈడుగల బాలుర సంఖ్యలో దరిదాపుగా ఆరవవంతు మంది ఏదోవిధమగు విద్య నేర్చుచుండిరని అంచనా వేయబడినది. ఆనాటికి 12948 గ్రామపాఠశాలలున్నట్లును తేలినది. ఇట్లే బొంబాయిలో 1823-28 మధ్య జరిగిన విచారణవలన ఎనిమిదిమంది బాలురలో ఒకడు విద్య నేర్చినట్లు తేలినది. వంగ రాష్ట్రమున పురుషులలో నైదవవంతు చదువగలవారనియు, 1835 నాటికి వంగరాష్ట్రమున ఒక లక్ష గ్రామములున్నట్లును తేలినది. ఇది కుంఫిణీ వారి ప్రయోజకత్వముకాక ప్రజలలో స్వయంకృషి వలన నేర్పడియున్న పరిస్థితులు.

II

దేశమున ఆనాడుండిన పాఠశాలలు అనేక విధములు. పూర్వకాలముననుండిన ఆర్యవిజ్ఞానమున సంస్కృత భాష వేదశాస్త్రములు నేర్పు విద్యాపీఠములు గురుకులములు బౌద్ద విహారములు పోగా వాని స్థానమున గొప్ప పండితులు స్థాపించి నడుపుచున్న గొప్ప పాఠశాలలు కాశీ, నవద్వీపము మొదలగు పట్టణములయందుండెను–హిందువుల సామాన్య గ్రామపాఠశాలలు ప్రతి గ్రామమునందుండెను.

మధ్యకాలమున అనగా మహమ్మదీయులకు పూర్వము తరువాతను దేశములోని వర్తకుల యొక్కయు రైతుల యొక్కయు పిల్లలకు చదువుట, వ్రాయుట లెఖ్కలు నేర్పుటకు పట్టణములందు పల్లెలందు స్థాపించబడిన మహాజన పాఠశాలలని ప్రసిద్ది చెందిన ప్రాథమిక పాఠశాలలు మసీదులనంటి స్థాపించబడిన ‘మక్తాబులు’ను మద్రసాలనబడు పాఠశాలలును మహమ్మదీయ పాఠశాలలుగ నుండెను. ఈ వివిధ పాఠశాలల చరిత్ర చాలా చిత్రమైనది.

పూర్వము నాటి తక్షశిల, ఉజ్జయిని, కాశీ మొదలగు విద్యాపీఠములను పాహియాన్ హూనిత్యాంగు మొదలైనవారు దర్శించిరి. ప్రతి బౌద్ధవిహారము నొక విద్యాలయముగ నుండెను. అందు వేదశాస్త్రములు లౌకిక విద్యయు చతుష్షష్టి కళలకు సంబంధించిన విద్యయు, సాహిత్యమును సంగీతము, జ్యోతిశ్శాస్త్రము వైద్యము గూడ నేర్పబడుచుండెసు, ప్రతి తీర్థమునందును దేవస్థలమునందును గల సామాన్య గురుకులములకు లెక్కలేదు—ఇవిగాక గ్రామములందు సంస్కృత దేశ భాషలను బోధించు బడులుండెను. వీనిని ‘పంచాయతులు నడుపు’చుండెను.

మొగలు ప్రభుత్వమునకు పూర్వము తురుష్కరాజులు మద్రసాలు స్థాపించియుండిరి. ఫిరోజిషా కాలమున (1393) హిందువులు పారషీ భాష చదువుట అనేక హిందూ గ్రంథములు పారషీలోని కనువదింపబడుట, ఆ నాటి విద్యాభివృద్ధిని చాటుచున్నవి. ఈ పద్దతి దక్షిణమున బీజాపురము గోలకొండ వరకునూ వ్యాపించెను. మొగలు చక్రవరులీ పద్ధతుల నెల్ల చక్కగా నిర్వహించిరి. ఇది గాక ప్రతి మసీదునంటి క్రొత్త మక్తాబు లనబడు పాఠశాలలు స్థాపించిరి. ప్రతి నెల కింతయనిగాక వర్షాజనములును, రొక్కరూపమున బహుమతులును ఈనాములు జాగీరులిచ్చి పోషించిరి. ప్రాథమిక మాధ్యమిక విద్య చక్కగా అభివృద్ధిలో నుండెను. అక్బరు కాలమున దేశీయ సారస్వతములు మహోన్నతి జెందెను. ఔరంగజేబు చనిపోయిన పిదప గూడ ఇంగ్లీషు వారి పరిపాలన ప్రారంభ మగుపరకును ఈ మక్తాబులును మద్రసాలును హిందువుల గ్రామపాఠశాలలను గూడ చక్కగా జరుగుచుండెను.

కుంఫిణీ ప్రభుత్వము వచ్చినపిదప ‘దేశీయ రాజుల రాజ్యములందు’ ప్రాత పద్దతులు చక్కగా జరుగుతుండగా, ఇంగ్లీషు వారివశమైన రాజ్యభాగములందు మాత్రము తగిన పోషణము లేక విద్యాసంస్థలు క్షీణించి పోవుచుండెను. రాజ్యపరిపాలనమును కట్టుదిట్టము చేయుట కొరకు 1793లో గ్రామపంచాయతుల అధికారము తీసివేసి దేశమును జిల్లాలుగా విభజించి కలెక్టర్లను జడ్జిలను నియమించుటతో గ్రామపంచాయతులు నాశనమై, వాటితోపాటు గ్రామ పాఠశాలలును చాలవరకు నశించెను. పూర్వపు ఈనాములు పోయెను. ఉపాధ్యాయులు వేరు వృత్తులు చూచుకొనసాగిరి. వేరే జీవసము లేనివారు మాత్రము బడి పంతుళ్ళుగా మిగిలిరి. అందువలన నీ విద్యాపద్దతులు పాడై విద్య అధోగతిలోనికి దిగినది.

భారత దేశములో మొట్టమొదట ఆంగ్లేయులతో పరిచయము కలిగి స్నేహము చేసిన తరువాత వంగ రాష్ట్రమున ప్రాముఖ్యత వహించిన కొన్ని గొప్ప కుటుంబములకు మూల పురుషులుగ నుండినవారు దుబాషులుగనో దివానులుగనో, ఆంగ్లేయుల కొలువునందు జేరినవారై యున్నారు. ఉదాహరణము: దక్షిణదేశమున ఆనందరంగ పిళ్ళె, పచ్చయ్యప్పలవలె వంగరాష్ట్రమునకు రాజా నబకిష్ణదేవుగారొకడు. ఈయన క్లయివు వారన్ హేస్టింగ్సులకును సురాజుద్దౌలా మీర్జాఫరుల మధ్యను రాయబారములను నడిపిన దుబాషి. రాజా రాధాకాంత దేవుగారీయన వంశీయుడే. క్లయివు దివానగు రామచంద్ర గోవిందరామును ఉమచందు జగత్సేటులును, మహారాజా నందకుమారుడును ఇంగ్లీషు నేర్చుకొనకయే యీ కుంఫిణీ అధికారులతో వ్యవహారములు చేసినారు. రెండవ తరములోనివారు చెన్న పట్టణమున వెన్నెలకంటి సుబ్బారావు గారు ఏనుగుల వీరాస్వామయ్య గార్ల వలె వంగరాష్ట్రమున కలకత్తా మొదలగు ముఖ్యపట్టణములలో నుండిన ఇంగ్లీషు వారిదగ్గరను యూరేషియనుల దగ్గరను అర్మీనియనుల దగ్గరను ప్రయివేటు పాఠశాలలు స్థాపించిన ఇతర ఇంగ్లీషు దొరలవద్దను ప్రయివేటుగా ఇంగ్లీషుభాష నేర్చుకొని ఉద్యోగములు చేయసాగిరి. ఆంగ్లేయవిద్య యొక్క లాభములు వీరు గ్రహించి తమపిల్లల కావిద్య నేర్పించవలెనని ప్రయత్నించుచుండిరి. కాని ఆనాటి కుంఫిణీ ప్రభుత్వము నేటీవులయందు ఇంగ్లీషువిద్యను వ్యాప్తి జేయుటకు ఇచ్చగింపలేదు. పైగా దానిని ప్రతిఘటించెను. తుట్టతుదకు 1813లో కుంఫిణీవారికి కొత్త పట్టానిచ్చునప్పుడు ఇంగ్లీషువిద్యను ప్రోత్సహించునట్లు పార్లమెంటువారు శాసించిరి. అంతట కొందరు మిషనరీలుకూడా కొంత సాయము చేయవచ్చిరి.

ఆనాడు కలకత్తాలో ప్రాముఖ్యత వహించిన కటుంబములకెల్ల రాజా రామమోహనరాయలు పెద్దగా నుండెను. రవీంద్రనాథుని తాతయగు ద్వారకనాథ టాగూరుగారును ప్రసన్నకుమార టాగూరు గారునూ, బంగాళాబ్యాంకి దివానును కేశవచంద్రసేనుని పూర్వీకుడును అగు రామ్‌ కమలసేనుగారును బ్రోకరు అగు రస్యోమణిదత్తుగారును ప్రముఖులుగ నుండిరి. రాజా రామమోహనరాయలు స్థాపించిన బ్రహ్మసభకు వ్యతిరేక పక్షమగు సనాతనధర్మసభకు అధ్యక్షులయిన రాజా రాధాకాంత దేవుగారును గొప్ప దేశీయ నాయకులే. తరువాత వంగరాష్ట్ర నాయకుడయిన రామగోపాల ఘోషు, కెల్‌సాల్ ఘోషు కంపెనీలో భాగస్తులు వీరందరును ఇంగ్లీషు విద్య నేర్చి తమతోడి ప్రజల యందు విద్యాభివృద్ధి సంఘసంస్కరణమును కలిగించుటకు 19వ శతాబ్దాదియందు పాటుపడుచుండిరి.

రామమోహన రాయలుగారును డేవిడ్ హేర్ అను నొక దొరయు రాజా రాధాకాంత దేవు మొదలగు ప్రముఖులును కలిసి 1817లో హిందూ కాలేజి యను ఒక ఇంగ్లీషు విద్యాలయమును స్థాపించిరి. రామమోహనరాయలు స్వతంత్రముగా ఆంగ్లోవర్ణాక్యులరుస్కూలను నొక పాఠశాలను నడుపుచుండెను. ఇట్లింగ్లీషు పాఠశాలలో తరఫీదు పొందిన మొదటితరమువారు తయారైరి. ఇట్లు బ్రిటిష్ ప్రభుత్వము వారీదేశమున ఆంగ్లేయ విద్యావిధానమును ప్రవేశపెట్టుటకు పూర్వమే మన దేశీయలే ఈ విద్యాపద్దతిగోరి స్వతంత్రకృషి చేసిరి. కుంఫిణీవారీ కొత్త పద్ధతుల కిష్టపడక పూర్వపద్ధతులకే తోచిన సాయము చేయుచుండిరిగాని చాల కాలము వరకు ఇంగ్లీషు విద్యాభివృద్ధికి తగిన పని చేయలేదు. జనసామాన్యమునకు చదువులు నేర్పుట తమపని కాదని యుపేక్షించుచుండిరి. ప్రజలకు మెహర్బానీకొరకు మెప్పుకొరకు 1791వ సంవత్సరమున గవర్నరు జనరలగు వారన్ హేస్టింగ్సు కలకత్తాలో ఒక మహమ్మదీయ కళాళాలను స్థాపించెను. 1792లో కారన్ వాలీసు కాశీలో ఒక సంస్కృత విద్యాలయమును స్థాపించెను. చాల కాలము వరకు దేశీయ ప్రజల పూర్వవిజ్ఞానమే ప్రోత్సహించవలెనను ఊహ ప్రబలియుండెను. మహమ్మదీయ పరిపాలనమున పారషీ భాషను హిందువులు నేర్చుకొని పెద్దయుద్యోగములు చేయుచుండినట్లే ఈ ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్యమున ఇంగ్లీషుభాషను నేర్చుకొని పెద్ద ఉద్యోగములు చేయవచ్చునని తోచి దేశములో వివిధ ప్రాంతములందు గొప్ప కుటుంబములవారనేకులు తమ పిల్లలకు ప్రయివేటుగా ఇంగ్లీషు చెప్పుచుండిరి. వంగరాష్ట్రమున రామ మోహన రాయలువారును చెన్న రాష్ట్రమున వెన్నెలకంటి సుబ్బారావుగారు, ఏనుగుల వీరాస్వామయ్యగారు మొదలయినవారును ఈ విధముగ స్వతంత్రముగ ఇంగ్లీషు విద్య నభ్యసించినవారే. ఇంగ్లీషు విద్య కావలెనను కోరిక వంగరాష్ట్రములోను చెన్నరాష్ట్రములోనుకూడా ముఖ్యులగు భారతీయులకు కలిగి దానిని గూర్చి ప్రయ్యత్నము చేయసాగిరి.

III

1820లో మదరాసు స్కూలుబుక్కుసొసయిటీకి సదరు కోర్టు ఇంటర్‌ప్రిటరగు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావుగారు ఇంగ్లిషులో నొక దీర్ఘమైన లేఖ వ్రాసి ఈ దేశమునందు పాఠశాలలను సంస్కరించి ఆంగ్లేయవిద్యను వ్యాపింప జేయుడని ప్రభుత్వమువారిని కోరియుండిరి. ఈ లేఖ ఈ సొసైటీ వారి ప్రథమ నివేదికలో 1823లో ప్రకటింపబడినది. ఈ దేశములో వెంటనే ఆంగ్లేయ విద్యావిధానమును స్థాపింపుడని కోరుచు రాజా రామమోహన రాయలవారు 1823 డిశంబరు 12వ తేదీన గవర్నరు జనరలైన ఆమహరెస్టు ప్రభువుగారికి ఇంగ్లీషులో దీర్ఘమైన లేఖను వ్రాసి బిషప్ హెబరుగారిద్వారా పంపెను. ఈ లేఖలోని భావములకా బిషప్పుగారు మెచ్చుకొనిరి. ఆ లేఖలోని విషయములకు భారతదేశ ప్రభుత్వమువారును ఇంగ్లాఁడులోని కుంఫిణీ డైరెక్టరులును ప్రభుత్వమువారును తగిన విలువనిచ్చి గౌరవించినట్లు అనేక నిదర్శనములున్నవి.

ఇట్లు 1823 నాటికి బుద్ధిమంతులగు భారతీయులలో ఆంగ్లేయవిద్య నేర్చుకొనవలెనను వాంఛయు దేశములో ఇంగ్లీషువిద్యావిధానమును స్థాపించి ప్రజలలో విద్యాభివృద్ధి చేయవలెనను కోరికయు గాఢముగానుండెను. ఇట్టిస్థితిలో నీ దేశమున క్రైస్తవ మతప్రచారము చేయవచ్చిన మిషనరీలింకొక కారణమున ఆంగ్లవిద్యావిధానమును స్థాపించుటకు పూనుకొనిరి. చాలకాలము నుండి క్రైస్తవమతాచార్యులు దేశీయులలో చేయుచున్న ప్రచారము సక్రమముగా ఫలింపకపోవుటకును, తగినంతమంది క్రైస్తవులు గాకపోవుటకును గల కారణము హిందూ మహమ్మదీయ ప్రజలలో పూర్వసిద్ధాంతములు గట్టిగా పాదుకొని యండుటయే యనియు, చిన్నపిల్లలకు చదువు నెపమున క్రైస్తవ సిద్దాంతములు బోధించినచో వారి మనస్సులను క్రైస్తవమతమును స్వీకరించుటకు సుముఖముగ జేయవచ్చుననియు, చర్చి ఆఫ్ స్కాట్లాండు మిషనరీలు నిశ్చయించి హిందూదేశములో పాఠశాలలందు విద్యను బోధించుట ద్వారా క్రైస్తవమతబోధ చేయు ప్రచారకులను బంపుటకు నిశ్చయించిరి. అట్లువచ్చిన మిషనరీలలో ప్రముఖుడు అలెగ్జాండర్ డఫ్. ఇతడు 1830వ సంవత్సరము మే నెల 27వ తేదిన కలకత్తాకు వచ్చెను. ఇట్లే బొంబాయికి రాబర్టు నెస్బిట్‌గారు పోయి విద్యాగురువులైరి. జాన్ ఆండర్‌సన్ అను యువకుడు 1837 సంవత్సరం ఏప్రియలు 3వ తేదిన ఇట్లే చెన్న పట్టణమునకు క్రైస్తవమిషనరీగా వచ్చెను. వీరందరును ఒకే పద్ధతి నవలంబించిరి. ఆనాడు గవర్నరు జనరలుగానుండిన విలియం బెంటింకుగారు అధికారరీత్యా తాను క్రైస్తవప్రచారమునకు సహాయము చేసిన బాగుండదనియు, వ్యక్తిగతముగ చేయతగిన సాయమెల్ల చేయుదుననియు 1830లోనే డఫ్ దొరకు వాగ్దానము చేసియుండెను.

ఈ వాగ్దానము నతడు త్వరలోనే చెల్లించుకొనెను. చెల్లించుకొనుటలో పైన చెప్పిన లోటు కనబరచక అధికారరీత్యా పైకి క్రైస్తవమత ప్రచారమునకు సాయము చేయుచున్నట్లు కనపడని విధముగా కొన్ని పనులును, బహిరంగముగా కొన్ని పనులును చేసినాడు. 1833వ సంవత్సరమున కుంఫిణీవారికి కొత్త పట్టానొసగునప్పుడు పార్లమెంటువారీ దేశమున కొక లా మెంబరును లా కమీషనరును నియమించిరి. ఆ సూచన ప్రకారము ప్రభుత్వ సభ్యుడుగా వచ్చిన మెకాలేగారును విలియం బెంటింకుగారును దేశ ప్రజలయందు ఇంగ్లీషుభాషను ప్రవేశపెట్టినచో వారింగ్లీషు ప్రభుత్వమునకును ఇంగ్లీషు సభ్యతకును దాసులగుదురను తలంపుతోను, క్రైస్తవమతప్రచారము కూడ జరుగునను ఆలోచనతోను హిందూదేశమునందు ఆంగ్లేయ విద్యావిధానమును, ఇంగ్లీషు సాహిత్యమును, ప్రకృతి శాస్త్రవిజ్ఞానమును స్థాపించుటకు 7-3-1835 తేదీ నిర్ణయించిరి. ముందుగా ప్రభుత్వ కార్యాలయములయందు ఇంగ్లీషు భాష ప్రవేశ పెట్టుటకును పెరిషియన్ భాష తీసివేయుటకును విలియం బెంటింకు తగుఉత్తరువుల జేసెను. ఇట్లే దేశీయ వైద్యవిధానమునకు బదులు పాశ్చాత్య వైద్యవిధానమును స్థాపించుటకును నిశ్చయించిరి.

దీనితో ఇంగ్లీషు యుగమొకటి ప్రారంభమయ్యెనని చెప్పవచ్చును. అయినను కుంఫిణీ ప్రభుత్వమువారు దేశమునందు ఆంగ్లేయ విద్యావిధానమంత త్వరితముగా ప్రవేశపెట్టలేదు. ఇది జరుగునప్పటికి చాలాకాలము పట్టెను. మిషనరీలు మాత్రము అనేక ఇంగ్లీషు కాలేజీలు స్థాపించి మతప్రచారము చేయసాగిరి.

ఇంగ్లీషు కాలేజీలలోను పాఠశాలలలోను పరీక్షలందుత్తీర్ణులైన వారికి ప్రభుత్వోద్యోగము లివ్వబడునని 1844లో హార్డింజిగారు ప్రకటించుటతో ఆంగ్ల విద్యా విధానము స్థిరముగా నాటుకొనెను.

ఇక చెన్న పట్టణములోని స్థితిగతులను కొంచెము పరిశీలింతము. 1813లో ఇంగ్లాఁడు ప్రభుత్వమువారు భారతదేశమును పరిపాలించుటకు మరల ఇరవై సంవత్సరములకు కుంఫిణీ వారికి కొత్త పట్టానిచ్చినప్పుడు హిందూ దేశ ప్రజల జ్ఞానాభివృద్ధికొరకును నైతికాభివృద్ధి కొరకును కొన్ని నిబంధనలు చేయుట అవనరమని పైకి చెప్పుచు నిజమునకు క్రైస్తవ మతప్రచారము చేయు నుద్దేశ్యముతో పార్లమెంటువారు భారత దేశ ప్రజల జ్ఞానాభివృద్ధి నిమిత్తమొక లక్ష రూపాయిలు ఖర్చుపెట్టునట్లు శాసించిరిగాని కుంఫిణీ వారట్లు చేయుటకు భయపడి దీనిని గురించి ఎట్టిచర్యను దీసికొనలేదు. అందువలన ఏ విధమైన పాఠశాలలు స్థాపించబడలేదు. పైన చెప్పిన పట్టా నిచ్చుటలో హిందూ దేశమునకు క్రైస్తవ మిషనరీలు ధారాళముగా పోయి మతప్రచారము చేసికొనవచ్చునని పార్లమెంటు వారు శాసించినందున మిషనరీలు విద్యాబోధనము ద్వారా ప్రజల మనసులను తమ మతము వైపుకు తిప్పుకొని క్రమక్రమముగా హిందువులను క్రైస్తవులుగా చేయవచ్చునను తలంపుతో భారత దేశమునకు వచ్చి పాఠశాలలు స్థాపించుటకు నిశ్చయించిరి గాని అది అంత త్వరలో జరుగు కార్యము కానందున కొంత కాలము వరకు విద్యాభివృద్ధి యథాస్థితిలోనే యుండెను.

ఆంగ్లేయులీ దేశమునకు కొత్తగా వచ్చినప్పటి నుండియు నీ కాలమువరకును కుంఫిణీ వారెట్టిసాయము చేయకపోయినను మన దేశీయులు ఇంగ్లీషు నేర్చుకొనుటకు కొంత స్వతంత్రమైన కృషి చేసియుండిరి!

విజాతీయ క్రైస్తవ మిషనరీలును ఆర్మీనియనులును ఇతర అయిరోపా దేశీయులు మరికొందరును మన దేశమునకు వచ్చి ఇంగ్లీషు నేర్చుకొనదలచు ధనికులకు ఇంటిదగ్గర పాఠములు చెప్పుచు చిన్న చిన్న పాఠశాలలు కూడా అక్కడక్కడ స్థాపించిరి. వీరిదగ్గర నేర్చుకొన్న వారు కొందరు ఉపాధ్యాయులు బయలుదేరిరి గాని మొత్తముమీద ఇంగ్లీషు చదువులు అభివృద్ధి చెందుటకు తగిన అవకాశములు లేకుండెను. ఇక దేశీయ బాలురు చదువు నేర్చుకొను పాఠశాలలు చాల దుఃస్థితిలో సున్న వీధిబడులు. వీనియందు చెప్పబడు చదువు నేడు పెద్దబాలశిక్షలో మనము చూచు విషయములని చెప్పవచ్చు. ఇప్పటికిని నైజాములో కొన్ని మారుమూల గ్రామములందీ పద్దతి చూడవచ్చును. ఈ పాఠశాలలందలి పరిస్థితులను శ్రీచిలకమర్తి లక్ష్మీనరసింహము పంతులుగారు రామచంద్ర విజయము, గణపతి అను నవలలందు వర్ణించియున్నారు.

1820 సంవత్సరము నాటికి చెన్నపట్టణములో నుండిన పాఠశాలల యొక్క స్థితిని గూర్చి ఆనాడు మదరాసు సదరు కోర్టులో ఇంటర్‌ప్రిటరుగా నుండిన వెన్నెలకంటి సుబ్బారావుగారు మదరాసు స్కూలుబుక్సు సొసయిటీవారి కోరిక పైన ఆ సంఘ కార్యదర్శికి వ్రాసిన దీర్ఘమైన ఇంగ్లీషు లేఖలో చక్కగా వివరింపబడియున్నది. దానిలో వారిట్లు వ్రాసిరి:- చెన్న పట్టణములో దరిదాపుగా అన్ని వీధులలోను చాలా పాఠశాలలున్నవి. వానిలో ముగ్గురికి తక్కువగాకుండగను యాభైమందికి ఎక్కువగాకుండగను అన్ని కులముల పిల్లవాండ్రును చదువుకొనుచుందురు. మదరాసులోని తెలుగుబడులందలి ఉపాధ్యాయులు ఉత్తరాది నుంచి ఆహ్వానింపబడిన బాహ్మణులుగా నున్నారు. ఈ రాజధానిలోని గ్రామములన్నిటిలోను వీధిబడులు కలవు. పిల్లలను ఐదవయేటనే బడిలో వేయుదురు. వారికి గుంట ‘ఓనమః’లు, ఐదుబడులు గుణింతము బాల రామాయణమును చెప్పుచుందురు. తాటియాకులపై గంటముతో వ్రాయట, లెక్కలు, ప్రభవలును వీరికి నేర్పుచుందురు. అయితే వ్యాకరణము మాత్రము వీరికి నేర్పుట లేదు. ఆడపిల్లలు సాధారణముగా ఈ బడులందుచదువుకొనరు గాని భోగమువాండ్ర ఆడపిల్లలు మాత్రము చదువుకొనుచున్నారు. బడిపంతులు పడుకష్టమునకు తగిన ఆదాయము లేదు. వారిజీవనము గడుచుటయే కష్టముగా నున్నది. గ్రామములోని పిల్లలు తల 1కి రు. 0-4-0లు కంటే చెల్లించరు. చెన్న పట్టణములో తల 1కి ఒక రూపాయి చాలా పెద్ద జీత మనవచ్చును. ఈ దేశము పరిపాలించిన పూర్వపు అధికారులు బడిపంతుళ్ళకు రొక్కపు బహుమతులును, భూరూపకమైన ఈనాములును ఇచ్చుచుండిరి. గొప్పవారి పిల్లల చదువు పూర్తి అయిన తరువాత వీరికి బహుమతులు ముట్టుచుండెను. కలవారు పిల్లలను పాఠశాలలకు పంపుదురు. లేనివారు యింటి వద్దనే చదువు చెప్పుచుందురు. ఈ పిల్లలు నేర్చుకొను చదువు కొద్ది పాటిదే యయినను తరువాత కచ్చేరీలలో చేరినప్పుడు పై ఉద్యోగుల తరిఫీదు పొందుచు ఈ లోటును పూర్తిచేసుకొనుచుందురు. బడులందు లెక్కలు కూడ చెప్పుచున్నారు గాని అది అంత బాగ లేదు. నీతిబోధకమైన పుస్తకములు వారిచే చదివించుచున్నను వానియొక్క నిజార్థములు వారికి బోధింపబడుటలేదు. సంస్కృతము బోధించుబడులందు మాత్రము ఆభాషాభ్యాసమునందే వ్యాకరణము నేర్పుట తప్పనిసరి యగుచున్నది. దేశభాషలు బోధించుటలో కూడ నీ జాగ్రత్త యుండినచో బాగుండెడిది. గొప్ప వారికుటుంబములందు ఉపాధ్యాయులకు మంచి జీతములిచ్చి పిల్లలకింటి దగ్గరనే చదువు చెప్పించుచున్నారు. ఈ ఉపాధ్యాయులు ఇతరులకు చదువు చెప్పకూడదు.

ఇక నీ దేశపు నేటీవులకు ఇంగ్లీషు భాషను బోధించు విధానమును వర్ణించెదను. తన స్వభాష నేర్చుకొనుట ప్రారంభించిన పిదప ఇంకొక భాషను పలాని వయస్సులో నేర్చుకొనవలెనను నియమము లేదు. ఈ దేశములో అరువదేండ్లవాండ్రు కూడ ఇంగ్లీషు నేర్చుకొనుటను ప్రారంభించుట నేను స్వయముగా నెరుగుదును. హిందూ దేశీయుడు ఇంగ్లీషుపాఠశాలలో జేరగనే ముందుగా ఇంగ్లీషు అక్షరములు నేర్చుకొనును. సాధారణముగా ప్రతిదినము ఉదయము ఉపాధ్యాయుడొక స్పెల్లింగు బుక్కునుండి యొకపాఠమును వకబ్యులరీలో నొక పాఠమును నేర్పించును. డయలాగు అను పరస్పరభాష సంభాషణలు పూర్వకాలపు ఉపాధ్యాయులు పిల్లల కొరకు తయారు చేసినవానినుండి ఒక పాఠమును ఇచ్చుచుండును. ఒక విద్యార్థి నూరు మాటలు నేర్చుకొని కొంచెము దస్తూరీ బాగుగా వ్రాయగలిగినంతనే ఏదో ఒక కచ్చేరిలో ముందుగా (మేదువారీ) వాలంటీరుగా ప్రవేశించును. క్రమముగా ఆతడు తన బంధువుల ప్రాపకము వల్ల ఒక చిన్న జీతముగల ఉద్యోగము సంపాదించును.

జిల్లాలలో ఇంగ్లీషు నేర్చుకొను విద్యార్థులు చదువు పుస్తకములు వకబ్యులరీ, డయలాగు, అరేబియను నైట్సు మాత్రమే. బహుశః వ్యాకరణము వారికి తెలియదనియే నా నమ్మకము. నేను చెప్పిన వకబ్యులరీ డయలాగులు కూడా నిర్దుష్టమయినవనియు వ్యాకరణయుక్తములైనవనియు ఒక విద్యార్థి తప్పులు లేకుండా యింగ్లీషు మాట్లాడుటకు చాలినట్టివనియు నేను చెప్పుటలేదు.

అందువలన రాజధాని నగరములోను జిల్లాలలోను ప్రస్తుతము అమలులోనున్న యింగ్లీషు నేర్చు విధానము నిజమైన విద్యాభివృద్ధికి తోడ్పడునట్టిది కాదు. ఇప్పుడు మదరాసులో నున్న యింగ్లీషు ఉపాధ్యాయులలో చాలమందికి వ్యాకరణము తెలియదనియే నా అభిప్రాయము. కొన్ని యేండ్ల కిందట మదరాసులో మూడు నాలుగు పాఠశాలలకన్న హెచ్చుగా లేనప్పుడు ఈ ఉపాధ్యాయుల రాబడి కొంచెము బాగుగ నుండెను గాని ఇప్పుడు వాని సంఖ్య చాలా హెచ్చి ఉపాధ్యాయులకు జీవనము గడచుటయే కష్టము గానున్నది.

దేశములోని వివిధ భాషలలో విద్యాభివృద్ధి చేయుటకు ఆయా భాషలందు వ్యాకరణములను నీతికథలను లెక్కలను గణితశాస్త్రమును గురించిన పుస్తకములు తయారు చేయుట అవసరమని నాయభిప్రాయము. ఆలాగుననే యింగ్లీషు పాఠశాలలకొరకు ఇంగ్లీషు వ్యాకరణమును ఆ యా భాషలందు బోధించటయు, ప్రపంచచరిత్ర ఆ యా భాషలలోనికి అనువదించుటయు సామాన్య ఇంగ్లీషు సంభాషణలను తర్జుమాచేయించుటయు ఇంగ్లీషుభాషలోను తక్కిన భాషలలోను వకబ్యులరీలు నిర్మించుటయు మంచిభాషాంతరీకరణములలో చక్కని కథలను ప్రచురించుటయు అవసరము అని వెన్నెలకంటి సుబ్బారావుగారు 1820వ సంవత్సరం నవంబరు 22వ తేదీ తమ లేఖలో వ్రాసిరి.

(సశేషం)

[ప్రథమ ప్రచురణ: కృష్ణాపత్రిక, శ్రీ విక్రమ సంవత్సర ఫాల్గుణ మాసపు (మార్చి, 1941) సంచికలలో. ఈ వ్యాసాన్ని అందజేసిన దిగవల్లి రామచంద్రగారికి మా కృతజ్ఞతలు – సం.]