వీరశైవులు

[వెల్చేరు నారాయణరావు, జీన్ రాఘేర్ శివా’స్ వారియర్స్ (ప్రిన్స్‌టన్ యూనివర్సిటి ప్రెస్, 1990) పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన పాల్కురికి సోమనాథ విరచిత బసవపురాణం, పుస్తకపు ముందుమాటకు తెలుగు అనువాదం.]

పరిచయము

బసవ పురాణము వీరశైవుల అత్యంత ప్రధాన గ్రంథము. ఇది పాల్కురికి సోమనాథునిచే బహుశా 13వ శతాబ్దములో రచించబడింది. ఇది 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ ధర్మకర్తయైన బసవేశ్వరుని వృత్తాంతము, మరియూ వీరశైవ శరణుల (లేదా భక్తుల) కథల సంపుటిగా సమకూర్చబడింది. వీరశైవాన్ని బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతమైన లింగాయత మతముగా కూడా వ్యవహరిస్తారు.

పాల్కురికి సోమనాథుని జీవితంలోని ఉదంతాలు

సోమనాథుని జీవితంపై ఖచ్చితమైన వివరాలు లేకపోయినా, సోమనాథుడు కూడా స్వయంగా తన గురించి తన పూర్వోత్తరాలు చెప్పుకోవడానికి ఇష్టపడకపోయినా అతని కీర్తి తెలుగు, కన్నడ రాష్ట్రాలలో ఒక మతంగా మారింది. సోమనాథుడు తనని తాను ఒక వీరశైవ శరణునిగా, ఒక భక్తునిగా మాత్రమే చెప్పుకున్నాడు. అతడు ప్రదర్శించిన అద్భుతాలు, శక్తుల గురించిన ఉదంతాలు ఎన్నో. ఈ కారణంగా సోమనాథుడు మహాత్మునిగా ప్రసిద్ధిచెందాడు.

పాల్కురికి సోమనాథుని బసవ పురాణాన్ని పిడుపర్తి సోమనాథుడు కొన్ని వందల సంవత్సరాల తరువాత సంస్కృత “మార్గ” సాంప్రదాయంలోని ఛందస్సులో మళ్ళీ రచించాడు. అతని రచనలో సోమనాథుని గురించిన ఒక సంఘటన ఉటంకించబడింది. ఒకనాడు వీరశైవులు బసవ పురాణాన్ని ఓరుగంటిలోని ఒక శివాలయంలో వింటుండగా ప్రతాపరుద్రుడు అక్కడికి వచ్చాడు. అక్కడ ఏమి జరుగుతుందో విచారించగా, రాజుతో వచ్చిన బ్రాహ్మణులు శివ శరణులు బసవ పురాణం పారాయణం చేస్తున్నారని చెప్పారు. రాజు దీన్ని గురించి మరింత తెలుసుకోవాలని కుతూహలపడగా ఒక దుష్టబ్రాహ్మణుడు అది పాపాత్ముడైన పాల్కురికి సోమనాథునిచే కొత్తగా రచింపబడిన కావ్యమని, హీనమైన ద్విపద ఛందస్సులో వ్రాయబడిందని, ఇటువంటి దోషం ఇదివరకెప్పుడు జరగలేదని నూరిపోసాడు. ఇది విన్న రాజు కుతూహలం వదిలి కావ్యాన్ని వినకుండా వెళ్ళిపోయాడు. కోపగించుకున్న వీరశైవులు ఆ బ్రాహ్మణున్ని చంపేందుకు అనుమతించవలసిందిగా సోమనాథున్ని కోరారు. ఇది విన్న సోమనాథుడు దీనిపై స్పందించకపోతే శరణుల ప్రతిష్టకు భంగమని తలచాడు. బ్రాహ్మణులను సాధారణ మనిషివలే వాదనతో ఓడిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

సోమనాథుడు ఓరుగంటికి శివలింగ చిహ్నములతో అలంకృతమైన ఎడ్లబండిలో బయల్దేరాడు. అయితే ప్రత్యర్థులు కొంతమంది పోకిరులను పోగుచేసి వారికి నకిలీ లింగాలను కట్టి, శివశరణులవలే అలంకరించి, సోమనాథున్ని స్వాగతించడానికి ఊరి పొలిమేర ద్వారం వద్దకు పంపారు. అలా వెళ్ళిన పోకిరీలు సోమనాథున్ని మ్రొక్కిన వెంటనే వారు ధరించిన నకిలీలు నిజలింగాలుగా మారిపోయాయి. వాళ్ళు వెంటనే శివభక్తులుగా మారారు.

సోమనాథుడు రాజకోట వద్దకు చేరుకున్నాడు. ద్వారంపై లక్ష్మీదేవి విగ్రహం ఉండింది. శివసేవకులైన ఎడ్లు వైష్ణవ సంబంధమైన చిహ్నాలుండడంవల్ల ద్వారంవద్దే ఆగిపోయాయి. సోమనాథుని ఆగ్రహంతో విగ్రహం తునాతునకలైంది. విషయం తెలిసిన రాజు పరుగున వచ్చి సోమనాథున్ని క్షమించమని శరణుజొచ్చాడు.

ఆ తరువాత సోమనాథుడు కొంతకాలం ఆ పురంలోనే వసించాడు. అక్కడినుండి వెళ్ళేముందు ముందు జరుగబోవు ముస్లిం దండయాత్రల గురించి తన భక్తులను హెచ్చరించాడు. తన వృద్ధాప్యాన్ని కర్ణాటకలోని కలికేములో గడిపాడు. తన అంత్యసమయములో భస్మాసీనుడై, ప్రాణోత్క్రమణ తరువాత తన దేహాన్ని పరిరక్షించమని శిష్యులను ఆదేశించి సమాధి నొందాడు. అంతమున శివుడు ప్రత్యక్షమై తనతో కైలాసానికి రమ్మని ఆహ్వానించాడు. అయితే సోమనాథుడు శివునితో “నీవు నన్ను సమాధి తెరచి ఎవరూ చూడకుండా తీసుకువెళితే, ప్రజలు నేను పారిపోయాననుకుంటారు. సమాధిని తెరవకుండా తీసుకువెళితే నా శరీరం కుళ్ళిపోయిందనుకుంటారు. కాబట్టి నన్ను అందరు చూస్తుండగా నీలో ఐక్యం చేసుకొ”మ్మని కోరాడు. అంతేగాక “శివశరణులు కాని భవులను చూడకుండా ఉండే వ్రతభంగము జరగకుండా ఉండాల”ని కోరాడు. శివుడు ఒక స్ఫటికనంది రూపంలో అతని సమాధిపై ప్రత్యక్షమై సోమనాథుని ప్రాణాన్ని తనలో నిలుపుకొని కొన్నాళ్ళు సమాధిపైనే అందరూ వీక్షించేందుకు అనువుగా ఉన్నాడు.

ఇంకో తెలుగు గ్రంథమైన పాల్కురికి సోమేశ్వర పురాణములో పై ఘటనతో పాటు మరో విషయం ప్రస్తావించబడింది. ఈ కథ చక్రపాణి రంగనాథుడనే వైష్ణవమత పండితునితో సోమనాథుని వాదము. శైవేతరులను చూడనని ప్రతిజ్ఞ చేసిన సోమనాథుడు వ్రతభంగము కలగకుండా తెర వెనక నుండి వాదించడానికి మాత్రమే అంగీకరించాడు. అయితే సోమనాథునికి వాదించవలసిన అవసరం రాలేదు. అతని కుమారుడైన చతుర్ముఖబసవేశ్వరుడు రంగనాథున్ని ఓడించాడు. అవమానంతో రంగనాథుడు తిరుగు ప్రయాణంలో శైవ క్షేత్రమైన శ్రీశైలం ద్వారా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మల్లికార్జునుని దర్శించడాన్ని తిరస్కరించి చూపు పోగొట్టుకున్నాడు. అక్కడి నుండి అహోబిలంలో వైష్ణవ దైవమైన నరసింహుని వద్దకు వెళ్ళాడు. అయితే కలలో నరసింహుడు ప్రత్యక్షమై శివుని ఆధిక్యతను వివరించి అతనికి బుద్ధిచెప్పాడు. ఆ పిదప రంగనాథుడు మళ్ళీ శ్రీశైలానికి వెళ్ళి ప్రార్థించగా ఒక కన్ను తిరిగి వచ్చింది. ఆ తరువాత సోమనాథుని వద్ద క్షమాభిక్ష కోరగా రెండవ కంటి చూపు కూడా వచ్చింది. తరువాత అతడు సోమనాథుని భక్తుడై శివునిపై స్తోత్రాన్ని రచించాడు.

సోమనాథుని అపార పాండిత్యాన్ని ఎంతోమంది శివకవులు స్తుతించారు. ఇందులో ఎంతో విస్పష్టంగా పిడుపర్తి సోమనాథుడు ఈ విధంగా వ్రాశాడు:

లిపి లిఖియింపక మున్న యపరిమితార్థోక్తి శక్తియాతని జిహ్వ జరుగుచుండు
ఛన్దాదికారణాది సరణిచూడకమున్న మదినుండుకావ్యనిర్మాణశక్తి
భాష్యసంతతులు చెప్పంగజూడకమున్న రుద్రభాష్య క్రియారూఢివెలయు
తర్కశాస్త్రాదివిద్యలుపఠింపకమున్న పరపక్షనిగ్రహప్రౌఢివెలయు॥

నతని నుతియింప నాబోటికలవియగునె
జైనమస్తక విన్యస్త శాతశూల।
కలితబిజ్జల తలగుండుగండిబిరుద
శోభితుడు పాల్కురికి సోమనభిదుండు॥

బసవ పురాణము – సాహిత్య మరియు సామాజిక పరిస్థితి

పై కథనాలతో కనబడిన గాఢమైన బ్రాహ్మణ వ్యతిరేక ధోరణి సోమనాథుని బసవ పురాణములోని రచనాశైలిలో కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. సాహిత్య చరిత్రకారులు తెలుగు సాహిత్యాన్ని రెండు సంప్రదాయాలుగా విభజించారు: మార్గము (సంస్కృతాధారము), దేశీయము. మార్గ సంప్రదాయము తూర్పు చాళుక్య వేంగి రాజైన రాజరాజనరేంద్రుని ప్రాపకంలో సంస్కృత మహాభారతాన్ని తెనుగీకరించిన నన్నయతో మొదలైందని చెప్పాలి. తెలుగులో ఆదికవిగా ప్రసిద్ధి పొందిన నన్నయ్య సంస్కృతం నుండి ఛందస్సును స్వీకరించాడు. ఆతను ప్రారంభించిన “చంపూ” శైలి పద్య, గద్యములను ఒకే వ్యాఖ్యానంలో కలుపుతుంది. ఈ శైలిని స్వీకరించడంలో నన్నయపై మహాభారతాన్ని 10వ శతాబ్దంలో కన్నడలో అనువదించిన కన్నడ కవి పంప యొక్క ప్రభావం కనబడుతుంది. నన్నయ తన రచనలలో బ్రాహ్మణ మతాన్ని ప్రచారం చేశాడు. దీనితో పోలిస్తే పాల్కురికి సోమనాథుడు దేశీయ శైలిని వాడి, ద్విపదలో రచించాడు. ఈ ఛందస్సు మౌఖిక సంప్రదాయానికి దగ్గరిదై సామాన్యుల జానపదములకు సన్నిహితంగా ఉంటుంది. బసవ పురాణము యొక్క పరిచయములో సోమనాథుడు దేశీయ శైలిపై తన మక్కువను ఈ విధంగా వివరించాడు:

“అందమైన సామెతలతో కూడిన తెలుగు కావ్యం, పద్యగద్య మిశ్రితమైన కావ్యం కన్నా సులువుగా అర్థమవుతుంది. కావున నేను ఈ కావ్యాన్ని సంపూర్ణంగా ద్విపదలో వ్రాయ సంకల్పించాను. ఇందులో పాదములన్ని అచ్చ తెలుగులే. వీటిని వేదములతో సమానంగా గ్రహించాలి. ఏలాగనిన ‘తూము కొలుచుటకు తూకమైన సోల కదా మరి?’ కవి ప్రశస్తి గొప్పకావ్యాన్ని సులభ పదములలో సమకూర్చుటలో ఉండునని అందరు అంగీకరిస్తారుగదా!”

ఆనాటి తెలుగు సాహిత్యంపై సంస్కృతము, సంస్కృత చంపూ శైలుల ప్రభావము సోమనాథునికి బాగా తెలుసు. ద్విపదని సిఫారసు చేస్తున్నప్పుడు ప్రేక్షకుల పట్ల అతని క్షమాపణా ధోరణిలో క్రొత్త సంప్రదాయానికి నాంది పలికే తీరును గమనిస్తే, సాహిత్య సమాజంలో అతను ఎదుర్కొన్న వ్యతిరేకతను అంచనా వేయవచ్చు. అయితే తన తదుపరి కావ్యమైన పండితారాధ్య చరిత్రను కూడా ద్విపదలోనే వ్రాసినా అక్కడ కవి పరిచయ తీరులో ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది. పండితారాధ్య చరిత్ర ప్రారంభంలోని సుదీర్ఘమైన ఉపోధ్ఘాతంలో సోమనాథుడు ద్విపద కవితా వైశిష్ట్యాన్ని, ఔన్నత్యాన్ని, ప్రశస్త గద్యపద్య సమ్మేళితమైన కావ్యములతో పోల్చి మరీ చాటుతాడు. ద్విపదకు ద్విపాదములను (రెండు పాదములు) శ్లేషగా వాడి ‘ఇహ, పరములు రెండూ సమకూర్చేది ద్విపద’ అనే భావం చెప్పాడు. సోమనాథుడు తన కావ్యంలో ఇతర కవుల ప్రస్తావన కూడా ఇష్టపడలేదు. నన్నయ తన కావ్య ప్రారంభంలో సంస్కృతకవి వ్యాసునికి అంజలి ఘటించాడు. ఆ తరువాతి కాలంలోని కవులు కూడా నన్నయతోబాటు ఇతర ప్రముఖ కవులను తమ కావ్యములలో స్తుతించారు. అయితే సోమనాథుడు మాత్రము తన కావ్యంపై ఏ సంస్కృత, తెలుగు కవుల ప్రభావం ఉన్నట్లు చెప్పుకోలేదు. కాగా తన పాండిత్యమంతా తన వీరశైవ గురువు యొక్క కృపయని చాటుకున్నాడు.

మార్గ సంప్రదాయంలో కవులు తమ కావ్యనేపథ్యం కోసం బాగా ప్రసిద్ధమైన మూలాన్ని, ముఖ్యంగా సంస్కృత మూలమున్న విషయాన్ని ఎంచుకొని వాటిని తెలుగులోకి అనువదించారు. పరోక్షంగా ఇతర స్థానిక విషయాలు ప్రోత్సహించబడలేదు. కథలే గాక మార్గ కవులు తమ ఆధిక్యతను వ్యాస, వాల్మీకాది సంస్కృత కవుల నుంచి పుణికిపుచ్చుకున్నారు. ఋషులుగా కీర్తించబడ్డ సంస్కృత కవుల గౌరవం మార్గ సంప్రదాయం ప్రారంభించిన వీళ్ళకి కూడా ఉపయుక్తమైంది. ఈ కవులు రాజుల, లేదా తత్సమానుల పోషణలో సకల భోగాలు అనుభవించారు; ఇక వీరి కావ్యాలను తమ పోషకులకు అంకింతమిచ్చి వారిని ప్రధాన శ్రోతలుగా ప్రస్తుతించారు.

సోమనాథుడు సంస్కృతమును, బ్రాహ్మణ్యమును, ఆనాటి సాహిత్యసంప్రదాయాలను పరిపూర్ణంగా వ్యతిరేకించాడు. తన కావ్యం మొత్తం నోటి ప్రచారంలో ప్రసిద్ధమైన వీరశైవ భక్తుల గాథల ఆధారంగా రచించాడు. ఈ గాథలకు సంబంధించిన ఉపదేశములను స్థానిక భక్త సమూహము నుండి సేకరించాడే గాని సంస్కృత ఋషికవులను ఆశ్రయించలేదు. తన కావ్యానికి శ్రోతగా తన స్నేహితుణ్ని ఎన్నుకున్నాడు కానీ ఏ రాజునీ కాదు. సంప్రదాయిక సాహిత్యశైలితో సోమనాథుని సంబంధరాహిత్యము “శైవ సంప్రదాయం” అనే ఒక క్రొత్త కావ్యసంప్రదాయానికి నాంది పలికింది.

సోమనాథుడు తన బ్రాహ్మణ వ్యతిరేకతను స్పష్టంగా చాటుకున్నాడు. తాను భవుల మరియు వీరశైవేతరుల సాంగత్యం చేయనని చెప్పుకున్నాడు. బసవ పురాణంలో “భవిజన సమాదరణ సంభాషణాది సంసర్గ దూరగుఁడ; నలిఁ బాల్కురికి సోమనాథుం డనంగ వెలసినవాఁడ; నిర్మల చరిత్రుండ” (భవులను ఆదరించను, వారితో సంభాషించను, వారితో కలసి తిరగను; నా పేరు పాల్కురికి సోమనాథుడు; నేను స్వచ్ఛమైన చరిత్ర గలవాన్ని) అని చెప్పుకున్నాడు. పండితారాధ్య చరిత్రలో ఇంకొంత ఆవేశంతో

భవికృతారంభసంభవ ధాన్యనిచయ,
భవినిరీక్షణరసపాకవితాన,
భవిహస్తగత ఫలపాకశాకాది
భవిగృహక్షేత్రాంఘ్రిప ధనవర్జితుఁడ
భవజన దర్శనస్పర్శనాలాప
వివిధ దానాదానవిషయదూరగుండ
శుద్ధభక్తిస్థల శ్రుతిమతాచార
సిద్ధవీరవ్రత శీలాన్వితుండ
నలిఁ బాల్కురికి సోమనాథుం
డనంగ వెలయువాఁడను;
జతుర్వేదపారగుండ…

తాత్పర్యం: భవులు పండించిన ధాన్యం ఉపయోగించను, ఆహారము భవుల కంటబడితే మరి తినను. ఫలములు, పత్రములు, కూరగాయలు భవులు ముట్టుకున్నారని తెలిస్తే వాటిని సేవించను. భవుల ఇంటి చెట్లను పండాయని తెలిస్తే కాయలు, పండ్లు తినను. భవులను చూడను, స్పృశించను, మాట్లాడను. వారికేమి ఇవ్వను, వారు ఇస్తే పుచ్చుకోను. శుద్ధ భక్తిస్థలమను వేదమార్గాన్ని పాటించేవాడిని, వీరవ్రతములో సిద్ధుడను శీలవంతుడను. నాపేరు పాల్కురికి సోమనాథుడు; చతుర్వేదములు చదివినవాడను.

సోమనాథుడు బ్రాహ్మణులను, బ్రాహ్మణ సాహిత్య శైలిని వ్యతిరేకించినా, వేద, పురాణ, శాస్త్రాలను మాత్రం సమ్మతించాడు. తను చతుర్వేద పారంగుడనని పలుమార్లు చెప్పుకున్నాడు. వీరశైవము కూడా వైదికమని నొక్కి చెప్పాడు. బసవపురాణములోనూ, పండితారాధ్య చరిత్రలోనూ, తన ఇతర రచనలలోనూ పలుచోట్ల శ్రుతులను అనగా వేద వాక్కులను ఉటంకించాడు. అయితే అతని తదుపరి రచనలలో సంస్కృత ఉటంకాలు పెరిగాయి. పండితారాధ్య చరిత్రలోని కొన్ని అధ్యాయాలలో ప్రతి వాక్యంలోనూ సంస్కృత పదోపయోగం కనిపిస్తుంది. అలా చూస్తే ఆ రచనలో తెలుగు కన్నా సంస్కృతమే ఎక్కువుందనుకోవచ్చు. వాస్తవానికి, తెలుగు కవులలో ఇంతగా సంస్కృత వాక్యాలను వాడినవారెవ్వరూ లేరు. కాబట్టి ఆనాటి “మార్గ” కవులతో పోలిస్తే సోమనాథుని రచనలలో కొన్ని భాగాలు అర్థంచేసుకోవడమూ కష్టమే!

యథేష్టంగా సంస్కృతోపయోగము, వేదశాస్త్ర పురాణాల ఉపప్రమాణాలు విరివిగా వాడడం చూస్తే సోమనాథుడు ఈ ఉపయోగము మూలాన్ని నిరూపించడం కోసం కాకుండా తన పాండిత్య ప్రదర్శన కోసం చేస్తున్నాడేమోననిపిస్తుంది. తమకు నచ్చని ధర్మాన్ని అవైదికమని ప్రచారం చేసి, తద్వారా సామాజిక గుర్తింపు పొందకుండా చూడటం బ్రాహ్మణులు వాడే ఒక బలమైన వ్యూహం. తెలుగు వీరశైవులు ఇటువంటి దాడికి గురికాకూడదని ప్రయత్నించారని అర్థమవుతుంది. బసవపురాణంలోని ప్రతీవిషయం బ్రాహ్మణ వ్యతిరేకమైనా, సోమనాథుడు అందులోని ఆచరణలు వైదికములని, వేదసమ్మతములని నొక్కి చెప్పాడు. కానీ వేదాలను వల్లించే బ్రాహ్మణులను మాత్రం కీర్తించకుండా చూసుకున్నాడు. బసవ పురాణం ఏడవ అధ్యాయంలో కల్లిదేవయ్య వేదపండితులతో తర్కిస్తాడు. వారి ఆధిక్యతను తిరస్కరిస్తూ తన కుక్క కూడా వారికన్నా చక్కగా వేదం వల్లించగలదని చాటి నిరూపిస్తాడు.

వీరశైవము మరియు బసవ పురాణము

బసవ పురాణంలో సోమనాథుడు వివరించినట్లు వీరశైవులకు గురు, లింగ, జంగమలను ముగ్గురే ముఖ్యులు. ప్రతీ వీరశైవుడు గురోపదేశంతో దీక్షను స్వీకరిస్తాడు. గురుశిష్యుల బంధం ఇతర సామాజిక బంధాలకన్నా అతి విలువైనది. గురువు భక్తుని తలపై తన అరచేతిని ఉంచి అతనిని వీరశైవునిగా మారుస్తాడు. దీనినే “హస్తమస్తకసంయోగ” క్రియగా వర్ణిస్తారు. ఈ సంయోగంచేత శిష్యుని శరీరంలో చిత్కళ అనగా శివశక్తిని ప్రవేశింపజేస్తాడు. ఈ విధంగా దీక్షా స్వీకారం చేసిన శిష్యుడు ఆ గురువు హస్తమునుండి ఉద్భవించిన పుత్రునిగా పరిగణింపబడతాడు. అటువంటి శిష్యుడిపుడొక క్రొత్త వ్యక్తి. అతని గతము, జన్మదాతలైన తలిదండ్రులు, ఇతరత్రా బంధములు అన్ని నశిస్తాయి. అతనికి గురువే తండ్రి.

గురువు శిష్యునికి శివలింగాన్ని అనుగ్రహిస్తాడు. భక్తుడాలింగాన్ని ఎల్లప్పుడూ కంఠాన ధరిస్తాడు. ప్రతిరోజూ ఐదు మార్లు ఆ శివలింగాన్ని కంఠము నుండి తీసి, అరచేతిలో ఉంచి, పూజించి, మళ్ళీ కంఠమునందు ధరిస్తాడు. లింగముతో వియోగము ఏమరిపాటుతో జరిగినా కూడా అది అవాంఛనీయమే. అటువంటి పరిస్థితి వస్తే ప్రాణత్యాగం చేయాలని శైవుల నమ్మకము.

ఇలా కంఠాన ధరించే లింగము భక్తుని స్వీయ లింగము. ఇది ‘ఇష్ట లింగము’ అని పిలువబడుతుంది. ఈ లింగము గుడిలో స్థాపించిన లింగము కన్నా గొప్పది. గుడిలో ఉంచిన లింగము ‘స్థావరము’ (అంటే కదలనిది); మెడలో ధరించే లింగము ‘జంగమము’ (అంటే కదిలేది). ఈ స్థావర-జంగమముల మధ్య బేధము వీరశైవులకు అతి ముఖ్యము. ఈ క్రింది బసవన్న వచనము ఈ ప్రతిపాదనను ప్రతిబింబిస్తుంది:

ఉళ్ళవరు శివాలయవ మాడువరు!
నానేన మాడువె? బడవనయ్య!
ఎన్న కాలే కంబ, దేహవే దేగుల,
శిరవే హొన్న కలశవయ్య,
కుడలసంగమదేవా కేళయ్య,
స్థావరక్కళివుంటు, జంగమక్కళివిల్ల

తెలుగు అనువాదం:
ఉన్నవారు శివాలయాలు కట్టెదరు
నేనేమీ సేతునో బడుగునయ్యా
నా కాలే కంభము, దేహమే దేవళము
శిరసే బంగరు కలశమయ్యా
కూడల సంగమ దేవ వినవయ్య
స్థావరానికి నాశముండును
జంగమానికి నాశమేది?

ఎ. కె. రామానుజన్ అనువాదం ప్రకారము, ఈ వచనము వీరశైవుల ‘వ్యతిరేక భావాలను, అనేక నేపథ్యాలను నాటకీయంగా వ్యక్తపరుస్తుంది’. ఇందులో ఒకటి దేవస్థానాల వ్యతిరేకత[1]వీరశైవులు మరియు బసవడు దేవస్థానాల వ్యతిరేకులు కారని, బసవ పురాణంలోని అనేక విషయాలను ఉటంకిస్తూ నా జత వ్యాసంలో నిరూపించాను. ఇష్టలింగము గుడిలో ఉంచిన లింగము కాకుండా శరీరంపై ధరించే లింగము. రామానుజుని అభిప్రాయము ప్రకారము:

మధ్యయుగ దక్షిణ భారత దేవస్థానములు పెద్ద గాలిగోపురాలతో మహా ప్రాసాదములుగా కట్టబడ్డాయి. ఇవి శక్తివంతులు, ఐశ్వర్యవంతుల ఆదరణలో ఎంతో వైభవాన్ని సంతరించుకొన్నాయి. వీరి ప్రాపకం లేకుండా ఆభరణ శోభితములైన దేవతామూర్తులు అందంగా చెక్కబడిన స్తంభాలతో కూడిన భారీ కట్టడాలతో వెలుగొందడం సాధ్యంకాదు. వీరశైవము వెనకబడినవారితో కూడి, వారికోసం చేయబడిన సామాజిక ఉద్యమం. చిన్నకులాలవారు ధనవంతులపై, అధిపతులపై చేసిన పోరు. పామరులు పండితులపై నెత్తుటిమాంసములతో రాతిపై జేసిన తిరుగుబాటు.

మధ్యయుగ ఆంధ్రదేశంలో, ధనిక, ఆధిపత్య వర్గాలంటే బ్రాహ్మణులు మరియు భూస్వాములైన రెడ్డి, కాపు, వెలమ జాతులవారు. వీరు వర్తకులు, చేతి వృత్తికారులు మొదలైన ఇతర కార్మిక వర్గాల కన్నా పైస్థాయిని అనుభవించేవారు. మతపరంగా అధికులైన బ్రాహ్మణులు కూడా భూస్వాముల ఆదరణను పొందవలసిందే. ఇక భూస్వాముల కులాలకు చెందినవారు తమకు స్వయంగా భూమి లేకపోయినా, వారి కులసంబంధాల కారణంగా సామాజికంగా ఔన్నత్యాన్ని, ఆధిపత్యాన్ని అనుభవించేవారు.

జజమాని/యజమాని పద్ధతి (అంటే ఆచరణాత్మకంగా శ్రమని మార్చుకునే పద్దతి) పరంపరాగతంగా కొనసాగే పల్లెలలో కార్మికవర్గాలకు చెందిన చాకలి, మంగలి, కుమ్మరి, సాలె, వడ్రంగి, మాల, మాదిగ, చండాల వృత్తుల వారు సామాజికంగా నిమ్న స్థాయికి అణచబడి, అంటరానివారుగా పరిగణింపబడ్డారు. ఇదే వర్గంలో నీచ వృత్తులను పాటించే చోరులు, వ్యభిచారులు, బడవాలు కూడా చేర్చబడ్డారు. వృత్తికారులలో పంచాలులుగా పరిగణించబడే కంసాలి, కమ్మరి, వడ్రంగి కులాలవారు, సాలెవారు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అంగీకరించక తాము కూడా బ్రాహ్మణ స్థాయి వారమని అభిలషించేవారు. కంసాలులైతే తాము విశ్వబ్రాహ్మణులమని చెప్పుకునేవారు. ఈ వృత్తికారులు చారిత్రాత్మకంగా బ్రాహ్మణులు తమ సొత్తుగా దాచుకునే పాండిత్యంలో పోటీపడుతూ వచ్చారు. వృత్తికారులలో కవులైనవారెంతోమంది కావ్యాలను రచించి, తమ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా చాటుకున్నారు. వీరు బ్రాహ్మణులతో పోటీపడుతుండడంవల్ల, బ్రాహ్మణుల శైలినే అనుకరిస్తూ, బ్రాహ్మణ సిద్ధాంతాలతో ఏకీభవించక, బ్రాహ్మణ వ్యతిరేక మతసిద్ధాంతాలను ప్రతిపాదించారు. వీరశైవ కవులలో చాలామంది ఇలాంటి వర్గాలనుండే వచ్చారు. మధ్యయుగ ఆంధ్ర వృత్తికారుల ప్రాముఖ్యతకు సాక్ష్యంగా బసవ పురాణంలో చెప్పబడిన ఎన్నో భక్తుల కథలు ఈ వర్గాలకు చెందినవారివే.

ఈ వృత్తికారులలో సహజమైన లక్షణము ఎన్నో చోట్లకి ప్రయాణించడము. వీరి వృత్తి ప్రావీణ్యము వీరి శరీరముతో కలిసి ఉంటుంది. జీవనోపాధి కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వీళ్ళు భూస్వాముల లాగా పండించడంపై ఆధారపడి, ఒక్కచోట కట్టివేయబడరు. భూమిపై ఆధారపడేవారు, ఊరూరా తిరిగే వ్యాపారస్తులు అనే ఇరు వర్గాలవారు తమ జీవనశైలి, నమ్మకాలు, అభిలాషలు, సామాజిక దృక్పథం వేరువేరు విధాలుగా ఏర్పరచుకున్నారు. ఈ ఇరు వర్గాల వారి మధ్య స్పర్ధలు ఉన్నా, లేకున్నా మధ్య యుగంలో వీరు విడిపోయారు. అది ఈనాటికీ కనబడుతుంది. తమిళదేశంలో భూస్వాములను కుడిచేతి వర్గంగా, వ్యాపారస్తులను ఎడమచేతి వారిగా వ్యవహరిస్తారు. తెలుగునాట దీనికి సమతుల్యమైన వ్యవహారము లేకపోయినా, సైద్ధాంతిక పరంగా చూస్తే ఈ వర్గాల మధ్య విభజన తమిళులలాగానే ఉంటుంది. బసవ పురాణంలోని భక్తుల కథలు, ఉదంతాలు చాలావరకు ఈ ఎడమ కులాల వారి నుండే ఉంటాయి. అంటే వృత్తికారులు, వ్యాపారులు, చాకలివారు, కుమ్మరులు, చర్మకారులు మొదలైనవారు. లేదా అవి నీచ వృత్తుల వారైన దొంగలు, వేటగాళ్ళు, వేశ్యలు, బడవాలు వంటివారి కథలుగా చెప్పబడ్డాయి. రైతులుగాని, వారి పాలేరులైన మాలల కథగాని ఒక్కటి కూడా కనబడదు. కానీ ఎడమ కులాలవారి కథలతో నిండి వారి సిద్ధాంతాలకు అద్దంపడుతుంది బసవ పురాణం.

ఈ స్థావర, జంగమ సిద్ధాంతాన్ని కుడి, ఎడమ కులాలతో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మధ్య యుగపు ఆంధ్ర కర్ణాటక దేవాలయాలు ఆనాటి రాజులు తమ ప్రాంతంపై అధికార నిరూపణకు కట్టినవి. గుడిలోని దేవుడు కూడా ఆ ప్రాంతాన్ని పాలించే దైవీశక్తిగానే కొలవబడ్డాడు. ఈ దేవుని యొక్క కృప ద్వారా రాజుకు కూడా అధికారప్రాప్తి ఆపాదించబడింది. ఈ దేవస్థానము రాజ్య స్థిరత్వము, సార్వభౌమత్వము, రాజ్య వైభవములకు ప్రతీకగా చూడబడింది. ఇక స్థలపురాణాలు ఆ గుడిలోని వేలుపు ఆ ప్రాంతంలో చేసిన లీలలు తద్వారా ఆ స్థలములో స్థిరపడడం గురించి వివరిస్తాయి. క్షేత్రము (లేదా స్థలము) కూడా దేవస్థానంలోని వేలుపు లాగా పవిత్రమని భావించబడింది. ఇటువంటి పవిత్ర స్థలానికి ముఖ్యుడు ఒక బ్రాహ్మణుడు. అతను ఆ గుడిలోని దేవ-రాజుకు పూజారియై, మంత్రియై, మరియు సలహాదారుడై ఉంటాడు.

ఇందుకు భిన్నంగా వృత్తికారులు, వ్యాపారులు, తమకు భూమిపై ఎటువంటి మక్కువ లేనివారై, తమ దైవాన్ని తమతో తీసుకెళ్ళేవారు. తమ సామర్థ్యం వలే దేవుడుకూడా వారి శరీరంలో అంతర్భాగమే. ఎక్కడికైనా తమతో తీసుకెళ్ళగలిగే జంగమలింగాన్ని ప్రసాదించే మతం వారి అభిలాషలకు ప్రస్ఫుటంగా అద్దంపట్టింది.

బసవపురాణము శరణ శరణులు సంప్రదాయంలో జంగమలకు సంపూర్ణ ఆధిపత్యం ఇచ్చి వారిని ఇతర లౌకిక సమాజంకన్నా ప్రత్యేకులుగా గౌరవించింది. ఈ శరణులు శివునికన్నా కూడా అధికులుగా పరిగణించబడ్డారు. వీరు ఎప్పుడు తప్పు చేయరు. వీరు ఏ చట్టానికైనా అతీతులే. బసవ పురాణం ప్రకారం, బసవన్న తీసుకున్న దీక్షలలో ఒకటి “భక్తుల తప్పులను శిక్షించక పోవడం. శివున్ని కలలో కూడా గెలవనీయక పోవడమనే ప్రమాణం; భక్తులను గెలిపిస్తాననే ప్రమాణం. హరుని భక్తులను విరోధించనే ప్రమాణం.”

దీనితో పోలిస్తే బ్రాహ్మణ మతంలో ఒక సన్యాసికి మతపరంగాకాని, సామాజికంగాకానీ ఉన్నత స్థాయి కలిగించలేదు[2]నాకు తెలిసినంత వరకు సనాతన ధర్మంలో ఒక సన్యాసి బ్రాహ్మణునికన్నా, రాజు కన్నా గొప్పవాడు. ఇది కూడా తప్పుడు అభిప్రాయమే.. గట్టిగా చెబితే సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు ఏ వర్ణానికి చెందరు. వారు సమాజం నుండి విడిపోయి ఏకాంతంగా ఉంటారు. అయితే వీరశైవులలో జంగమలది ఆచారాన్ని పంచుకుని పరస్పరము తోడ్పడుతూ తమ ప్రాంతంలోని ఇతర లౌకిక సమాజాలను అజమాయిషీ చేసే అధికారము కలిగిన గట్టి సమాజము. బసవపురాణములో జంగమల అధికారము రాజుకన్నాగూడా ఎక్కువగా చూపబడింది. వాళ్ళు తమ ప్రాంతపు రాజునైనా సరే అధిక్షేపించి హింసకాత్మక చర్యలు చేపట్టడం కనిపిస్తుంది. భక్తుడైన బసవన్న కూడా ఒకోసారి జంగమల చర్యల వెనక హేతుబద్దత గ్రహించలేడు. అతడు జంగమల సర్వజ్ఞతను ప్రశ్నించరాదనే నమ్మకాన్ని మాత్రమే ప్రతిపాదిస్తాడు.

ఈ భక్తులకు తమ స్వంత పురాణాలను తయారు చేసుకోవడం మరో ప్రత్యేకత. ఒక కొత్త సంప్రదాయము సమాజంలో పాటించే మతవ్యవస్థకు భిన్నంగా ఉంటే, ఏదో ఒక మహాపురుషుని చరిత్ర వారి కొత్తవిశ్వాసానికి ఆధారంగా చూపబడుతుంది. హైందవ మతంలో రాముడు, కృష్ణుడు వంటి క్రొత్త దేవతల ఆవిర్భావంతో, వారి లీలలను చూపే కథలలో క్రొత్త పురాణాలు మొదలైనాయి. అయితే శైవ, వైష్ణవ భక్తిసంప్రదాయాలలో మాత్రం మహాత్ముల జీవిత చరితలు గ్రంథాలకు ఆధారమయ్యాయి.

బసవ పురాణంలో భక్తుల జీవిత విశేషాలు వారి సామర్థ్యాన్ని, శక్తిని చాటుతుంటాయి. ఈ భక్తుల కథల సంపుటికి మూలమైన బసవన్ని ఒక దేవునిగానే గాక, దౌర్బల్యాలను ఎదుర్కునే సాధారణ భక్తునిగానూ చూపెడతారు. అతడు శివుని ఆజ్ఞతో శైవమత ప్రచారం కోసం భూలోకంలో అవతరిస్తాడు. శివుని వాహనమైన నంది మానవరూపంలో బసవనిగా అవతరిస్తాడు. బసవ పురాణాంతంలో అతడు దైవత్వానికి ప్రతీకగా కప్పడి సంగమేశ్వరంలోని శివలింగంలో ఐక్యమవుతాడు.

అతని అవతారము, శివునిలో ఐక్యమయ్యే మధ్య మనుష్యునిగా జన్మించిన కాలంలో ఎన్నో లీలలు చూపబడతాయి. ఈ కథలన్నీ ఎప్పుడో జరిగిన వాటిలా కాకుండా ప్రస్తుతం కళ్ళముందు కనబడుతూ జరిగేవిగా ఉంటాయి. భూమిపై ఉన్నంతకాలం బసవడు సామాన్య శివభక్తునిగా ఉంటూ సర్వోన్నతులైన జంగమలకు విధేయుడై వారిని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. రాజ్యానికి మంత్రిగా, బసవడు అప్పుడప్పుడూ జంగమల పట్ల రాజు బిజ్జలుని ప్రవర్తనను నియంత్రిస్తూ, సరిదిద్దుతూ ఉంటాడు. చాలా కథలు ఈ జంగమలు సామాజిక పద్ధతులను ధిక్కరించి, పౌర-నేర శిక్షాస్మృతులను అధిక్షేపించే సంఘటనలను ఉటంకిస్తాయి. ప్రతి సందర్భంలో బిజ్జలుడు వీరిని శిక్షించేందుకు ప్రయత్నిస్తాడు. బసవడు జంగమల దైవాధిక్యతను చూపుతూ అతనిని వారిస్తూ ఉంటాడు.

అయినా ఒకసారి జంగమలు బసవన్ని కూడా తప్పుబడతారు. ఉదాహరణకు, బసవడు తాను గొప్ప భక్తున్నని, శివుని కీర్తిస్తూ 464,000 పాటలను వ్రాశానని అహంకరిస్తే, అతని అహంకారాన్ని జంగమలు తీవ్రంగా నిరసిస్తారు.

బసవ పురాణంలోని పలు కథలలో జంగమలు[3]జంగమలు, వారికి మిగిలిన వీరశైవులకి ఉన్న అనుబంధము, తేడా జత వ్యాసంలో చెప్పబడింది. రచయిత అంటున్నట్లు జంగమలు ఉగ్రులు కారు. రచయిత అందరినీ జంగమల క్రింద జతకట్టినట్లు అగుపిస్తుంది. వారు శివయోగులు, శాంతస్వభావులు. ఉగ్రతను స్వాభావికంగా కలిగి ఉండటం కనబడుతుంది. హింస, చంపడం, దూషించడం, నాశనం చేయడం వంటి కృత్యాలతో జంగమలు తమ మతం పట్ల దృఢమైన విధేయతను ప్రదర్శిస్తారు. ఈ ఉగ్రత నమ్మకము లేనివారిపైనే కాకుండా, శివునిపట్ల గాని, ఇతర భక్తులపట్ల గాని, అపరాధం చేసిన భక్తులకు కూడా శిక్ష రూపంలో వర్తిస్తుంది. అంతే కాకుండా శివునిపై అపారమైన నమ్మకాన్ని ప్రదర్శించడానికి ఇదొక పద్ధతి. శరణులు ఇతరులను శిక్షించినట్లు తమని తాము కూడా అంతే సులువుగా హింసించుకుంటారు, ప్రాణత్యాగం కూడా చేస్తారు. తమ భక్తిని నిరూపిస్తూ తల త్రుంచుకుంటారు; మళ్ళీ తల అతుక్కొని సజీవులవుతారు.

సోమనాథుని కథనంలోని ప్రబలంగా కనిపించే ఉగ్రత పండితారాధ్యుని సూచనలను సమ్మతిస్తున్నట్లుగా ఉంటుంది. పండితారాధ్యుడు తన “శివతత్వసారము”లో శివభక్తులకు ఖచ్చితమైన నియమాలను విధించాడు. అందులో చెప్పిన ప్రకారము:

ఇతర ప్రాణులను హింసించరాదు. కానీ శివుణ్ణి నిందించిన పాపులను మాత్రం వధించడంలో సందేహించనవసరంలేదు (275)
శివనింద చేసే పుస్తకము వెంటనే దహించాలి, అటువంటివి వ్రాసినవాణ్ణి వధించాలి. (277)

వీరశైవుల సామాజిక వ్యవహారంలో హింస ఉన్నా, లేకపోయినా బసవ పురాణంలో ఇతరుల పట్ల ఉగ్రత, విరోధము చూపడము, దాని సమర్థన చూస్తే వీరిని ఒక ముకుళించుకున్న వ్యవస్థగా చూడవచ్చును.

బ్రాహ్మణ సమాజంలో స్త్రీలను, తక్కువ కులాల వారి స్థాయిలో ఉంచారు. ఉత్తమకులంలో పుట్టినా సరే స్త్రీలకు రెండవ జన్మగా పరిగణించి ద్విజత్వముతో ఉత్తమస్థాయిలో ఉంచే ఉపనయన సంస్కారము లేదు. వీరశైవులలో మాత్రం స్త్రీలకు పురుషులతో సమానమైన స్థాయిలో ఉంచి వారికి దీక్షా ప్రధానమును కూడా చేస్తారు. వీరశైవంలో వర్ణ, లింగ బేధములు లేకుండా అందరికి శివలింగ ధారణ చేస్తారు. పండితారాధ్యుడు స్త్రీలకు వీరశైవాన్ని వ్యతిరేకిస్తే పతినైనా సరే అధిక్షేపించే హక్కును కూడా ఇచ్చాడు. బసవ పురాణము పండితారాధ్యుని ప్రతిపాదనను పాటిస్తూ ఆరవ భాగంలోని వైజకవ్వ కథలో దర్శింపజేస్తుంది.

బసవ పురాణము, జంగమల పూర్వజాతిని ఎంచడం అసందర్భమని పలుమార్లు చాటడమే కాక జంగమలు శివరూపములని ప్రకటిస్తుంది. వర్ణాతీత సమాజాన్ని ప్రతిపాదిస్తుంది. బసవ పురాణంలో వర్ణాంతర వివాహాల ప్రస్తావన లేకపోయినా వీరశైవులలో ఒక వివాహ సందర్భము ప్రత్యేకంగా ఉటంకించబడింది. శరణ సంప్రదాయం ప్రకారము బ్రాహ్మణుడైన మధుపయ్య తన కుమార్తెను హరళయ్య అనే అంటరానివాని కుమారునికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు[4]రచయితలు ఈ కథని తారుమారుగా అంత్యజుడైన హారలయ్య కుమార్తెను బ్రాహ్మణుడైన మధుపయ్య కుమారునికి ఇచ్చి వివాహం చేసినట్లు వ్రాసియున్నారు. ఇది పొరపాటుగా వ్రాసిఉంటారని, సరిదిద్దాను.. ఈ వివాహం పెద్ద గొడవకు కారణమై రాజు బిజ్జలుని సంహారానికి దారి తీస్తుంది. సోమనాథుడు బిజ్జలుని వధించడం గురించి ఏడవ అధ్యాయంలో ప్రస్తావించినా, ఈ కులాంతర వివాహం గురించిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అంతే కాక, బసవ పురాణంలో పారంపరాగతములు కాని వృత్తులు కూడా కనిపించవు. చాకలులు, మంగలులు, నేతకారులు, చర్మకారులు, మొదలైన నిమ్న కులాలవారికి శరణులుగా ఉన్నత స్థాయి కల్పించినా వారు తమ కులవృత్తులను కొనసాగిస్తూ తమ కులాచారాలను పాటిస్తూ వచ్చారు[5]వీరశైవం స్వీకరించిన వారు పూర్వాశ్రమ ధర్మాలను, ఆచారాలను వదిలిపెట్టారు. కులవృత్తి కొనసాగించినా, కులాచారాలను వదిలి వీరశైవ ఆచారాలను పాటించారు. ఈ విషయాలు జత వ్యాసంలో స్పష్టం చేసాను..

కాయక వృత్తులను తక్కువగా భావించే బ్రాహ్మణ వ్యవస్థలా కాకుండా, బసవపురాణము కాయకష్టానికి అత్యంత గౌరవమిచ్చింది. ఎన్నో సందర్భాల్లో కాయక వృత్తి కొనియాడబడింది. బసవపురాణంలో “కాయకమే కైలాసము” (శరీరకష్టము శివునితో కైలాసములో ఉండడంతో సమానము) అనే ప్రముఖమైన సూక్తి కూడా చెప్పబడింది. చర్మకార వృత్తి అయినా సరే, దొంగతనమైనాసరే[6]బసవ పురాణంలో బసవడు వంకాయలను మేడలో లింగాయాలుగా ధరించి వచ్చిన వారిని వారు దొంగలని తెలిసినా వారికి కావలసింది తీసుకుపోమన్నాడు. అంతే కాదు వారి వంకాయలు లింగాలుగా మారిపోతాయి.ఈ మహిమ వల్ల దొంగలు శరణులుగా మారతారు. కానీ దొంగతనము కొనసాగించారు అనేది ఎక్కడా లేదు. ఇది రచయితల అతిశయమో, లేదా తప్పుడు అభిప్రాయంతో తెలియదు. వీరశైవంలో ఇతరుల ధనము ఆశించుట నిషిద్దము. బసవని వచనాలలో స్పష్టంగా ఉంటుంది. ఎలాంటి తారతమ్యము లేకుండా ఎవరైనా తమ వంశవృత్తిని కొనసాగించవచ్చు. ఆర్జించిన విత్తాన్ని జంగమార్పణం చేస్తే చాలు.

అయితే బసవపురాణము కాయక వృత్తులపట్ల నీచ భావాన్ని నిరసించింది. మడివాలు మాచయ్య అనే చాకలి శరణులలో అతి పవిత్రుడుగా శ్లాఘించబడ్డాడు. వీరభద్రుని అవతారంగా కీర్తించబడ్డాడు. ఎంగిలి, పచనం చేసిన వంటకము, మైల మొదలైన “అంటు”లు బసవపురాణంలో చాలాచోట్ల తిరస్కరించబడ్డాయి. నిమ్నకులస్థుడు వండిన ఆహారం పవిత్రంగా, బ్రాహ్మణుని ఇంట వండిన ఆహారం నీచంగా చూపబడింది. కన్నప్ప కథలో ఎంగిలి మాంసము, కల్లు, చర్మపు చెప్పులు మొదలైన బ్రాహ్మణులకు హీనమైన వస్తువులన్నీ శివునికి కన్నప్ప భక్తుడైనందున ఆమోదయోగ్యములని చెప్పబడింది.

ఇటువంటి పవిత్రత, అపవిత్రతను ప్రతిపాదించే బ్రాహ్మణ సంప్రదాయాలన్నింటిని బసవ పురాణము ఎగతాళి చేసింది. సోమనాథుడు బ్రాహ్మణులను ఇటువంటి సామాజిక సిద్ధాంతాలకు కర్తలుగా పరిగణించి, ఇటువంటి బ్రాహ్మణ సంప్రదాయాలను తీవ్రంగా వ్యతిరేకించాడు.

బసవ పురాణము మరియు పెరియ పురాణము

బసవపురాణాన్ని చదివినంతనే దీన్ని పెరియపురాణంతో (“గొప్ప పురాణము”) పోల్చక తప్పదనిపిస్తుంది. పెరియపురాణాన్ని రచించింది తమిళనాడు, తొండై ప్రాంతానికి చెందిన వెళాళుడైన “చెక్కిళార్”. చరిత్రకారుల ప్రకారము ఇతను చోళరాజు కులోత్తుంగుని (క్రీ.శ 1133-1150) ఆస్థానంలో మంత్రి. ప్రభాకర శాస్త్రి, మరియు సి. నారాయణరావుగార్ల ప్రకారము సోమనాథునికి పెరియపురాణము గురించి తెలియదు; వాళ్ళు తన కథనాలకు మూలాన్ని గురించి సోమనాథుడు ఇచ్చిన వివరణను ఉన్నది ఉన్నట్లుగా నమ్మినట్లు కనబడుతుంది. ఇదివరకు చెప్పినట్లు, సోమనాథుడు తనను బసవపురాణాన్ని వ్రాయమని శ్రీశైలంలో భక్తుల గోష్టిలో ఆఙ్ఞాపించారని చెప్పుకున్నాడు. తన మొదటి ఆశ్వాసంలో భక్తుల గోష్టిప్రసంగం మధ్య “అసదృశమైన బసవ పురాణాన్ని తమకంతో రచించాలని నాకెంతో కోరికగా ఉంది. కాబట్టి ఆ కథాసూత్రమేమిటో నాకనుగ్రహించండి.” మళ్ళీ ఏడవ ఆశ్వాసంలో “భక్తుల వల్ల విన్న విషయాలన్ని బసవ చ్రితంలో నేను యథాశక్తి చేర్చాను. నిజానికి బసవేశ్వరుని మహాద్భుత చరిత్రను వర్ణించడం ఈశ్వరునికి కూడా సాధ్యం కాదు. వర్ణించడానికి నేనెంతవాణ్ణి?”

పైన ఉదహరించిన వాక్యాలు సోమనాథునికి పెద్దల పట్ల ఉన్న భక్తిగౌరవాలను చూపుతాయి గాని, వారు ఈ కథలకు మూలమనే నిర్ణాయకములు కావు. తమ కించితత్వమును ఒప్పుకోవడం, అన్నింటిని తమ వేలుపు ప్రసాదంగా, లేదా ఇతర భక్తుల ఆశీర్వాదంగా ప్రకటించుకోవడం భక్తకవులలో మామూలే. సోమనాథుని కావ్యానికి ఆపాదించిన మొట్టమొదటి కాలము ఎంత లేదన్నా చెక్కిళరు కాలానికన్నా కొన్ని పదుల సంవత్సరాల తరువాతిదే. అంతేగాక సోమనాథునికి తమిళంలో కావ్యరచన చేయగలిగినంత పాండిత్యము ఉన్నదనడానికి కావలసినన్ని ఆధారాలున్నాయి. సోమనాథుడు తన కావ్యాలలో ఎన్నో భాషలను వాడాడు – సంస్కృతము, తెలుగు, కన్నడ, తమిళము, మరాఠీ అన్ని కలిపి ఒకే రచనలో వాడడం వృషాధిపశతకంలో, పండితారాధ్య చరిత్రలోను కనిపిస్తుంది. మధ్యయుగంలోని దక్షిణ భారతంలో భాషా సరిహద్దులు ఇప్పుడున్నంత ధృడంగా ఉండేవికావు. అటువంటి పరిస్థితుల్లో సోమనాథునికి పెరియపురాణం గురించి తెలియకపోవడం అసంభవం. అయితే గుర్తించవలసిన విషయమేమిటంటే ఆనాడు ఈ కథలన్నీ నోటా-నోటా వినబడే మౌఖిక సంప్రదాయాలే. కాబట్టి కవికి ఇంకో రచనను ఆధారం చేసుకొని వ్రాయవలసిన అవసరం లేదు.

బసవ పురాణములోను, పెరియ పురాణంలోనుగల కథనం ఒకే విధంగా ఉంటుంది. పెరియపురాణము అరవైమూడు నాయనార్ల కథా సంగ్రహము. ఇవి 12వ శతాబ్దము కన్నా చాలా ముందునుండే మధ్యయుగ శైవ సంప్రదాయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథలు. అరవైమూడు మంది అనేది జైన సంప్రదాయంలోని అరవైమూడు శలాక పురుషుల ఆధారంగా తీసుకున్న చిహ్నము. జైనమతంతో తీవ్రంగా పోటీ పడుతున్న శైవము జైన శలాకులను కీర్తించే మహాపురాణము, లేదా శ్రీపురాణమును అనుకరించి పెరియపురాణాన్ని రచించారు. పెరియ పురాణంలోనూ, బసవపురాణంలోనూ చాలా కథలు ఒకే విధంగా ఉంటాయి. అయితే పెరియపురాణంలోని నాయనార్ల తమిళ పేర్లు మాత్రం బసవపురాణంలో మార్చబడి ఉండవచ్చు.

అయితే ఈ రెండు పురాణాలమధ్య చాలా పోలికలు ఉన్నా ఒక ముఖ్యమైన తేడా మాత్రం ఉంది. ఇదివరకు చెప్పుకున్నట్టు బసవపురాణము ఎడమ కులాలకు సానుకూలమై, బ్రాహ్మణ వ్యతిరేకమై ఉంటుంది. ఇందుకు భిన్నంగా పెరియపురాణము కుడికులాలకు, బ్రాహ్మణులకు సానుకూలమై ఉంటుంది. చెక్కిళారు భూస్వాముల కుటుంబము నుంచి వచ్చినవాడు. ఇందులో అనేక కథలు ఉత్తమకులాలవారివై ఉంటాయి. ముఖ్యంగా ఈ రెంటి మధ్య తేడా వాటి స్వభావము – బసవపురాణమంతా బ్రాహ్మణులపై దాడిగా కనబడితే, పెరియపురాణము బ్రాహ్మణులను గౌరవిస్తుంది.

వీరశైవము యొక్క బ్రాహ్మణీకరణ

వీరశైవ సిద్ధాంతము వర్ణ వ్యవస్థకు వ్యతిరేకమయిన క్రాంతి ఉద్యమంగా నిలిచి, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సాహసంగా వ్యతిరేకించినా, కాలక్రమేణా క్రమానుగత సాంఘిక వ్యవస్థ ఇక్కడ కూడా నాటుకుంది. పన్నెండవ శతాబ్దపు క్రాంతి చల్లారి, వర్ణ వ్యవస్థ తిరిగి ధృవీకరించబడి, బ్రాహ్మణాధిపత్యానికి దారి తీసింది.

ఆంధ్రాలో బ్రాహ్మణ వీరశైవులు తమని తాము ఆరాధ్యులుగా పిలుచుకొని వారి వర్ణభేదాన్ని నిర్వహించుకున్నారు. వారి సాహిత్య పటిమ, సంస్కృత పాండిత్యము వల్ల బ్రాహ్మణ శైవులు శైవ సాహిత్య రంగానికి ఆధిపత్యం వహించారు. వారి చేతుల్లో సోమనాథ కృతములైన వీరశైవ రచనలన్నీ చాలావరకు బ్రాహ్మణీకరించబడినాయి. తరువాత వచ్చిన బ్రాహ్మణీకరించిన వీరశైవ సాహిత్యము సోమనాథుని సాహిత్యం కన్నా ఎక్కువ ఆదరణ పొందింది.

వేటూరి ప్రభాకర శాస్త్రిగారి అభిప్రాయము ప్రకారము రెండు రకములైన వీరశైవ సిద్ధాంతములు ప్రారంభమయ్యాయి: బసవేశ్వరుడు అవలంబించిన బసవ సంప్రదాయము, మరియు పండితారాధ్యుని ఆరాధ్య సంప్రదాయము. వీరి ఉద్దేశ్యంలో ఆరాధ్య సంప్రదాయము బ్రాహ్మణ వ్యతిరేకము కాదు. ప్రభాకర శాస్త్రి పండితారాధ్యునికి చెందిన ఒక వచనాన్ని ఇందుకు ఉదాహరిస్తారు:

“భక్తి తోడి వలపు, బ్రాహ్మణ్యంతో పొత్తు పాయలేను నేను బసవలింగా”

అనగా నేను భక్తిని, బ్రాహ్మణ్యాన్ని రెంటిని విడువలేను ఓ బసవా అని అర్థము.

బసవేశ్వరుడు బ్రాహ్మణ్యాన్ని వదిలి పండితారాధ్యున్ని వీరశైవం స్వీకరించమనినప్పుడు అతనిచ్చిన సమాధానంగా చెప్పుకునే నానుడి. అయితే ఈ ఉదంతము ఏ శైవ సాహిత్యంలోనూ వ్రాయబడలేదు. అయితే ప్రభాకర శాస్త్రిగారు దీన్ని ఒక జనశ్రుతిని గ్రహించి ఉదహరించారు. పండితారాధ్యుని “శివతత్వసారము”లో కూడా ఎక్కడా ఆయన బ్రాహ్మణ కర్మలు గాని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని గాని ఆమోదించినట్లు కనబడదు. ఇందులోని 134వ పద్యము ప్రకారము:

కులజ కులహీనులిద్దఱు, నెలకొని భవదచలభక్తినిష్ఠావృత్తిన్
వెలసిన మీద సమానుల, కులజులున్ గులహీనులనంగ గూడదువారిన్

అంటే ఉత్తమ కులానికి చెందిన వాడు, తక్కువ కులంలో పుట్టినవాడు శివభక్తిని స్వీకరిస్తే, వారిరువులు సమానులే అవుతారు. వారి కులాన్ని ఎంచుటకు వీలులేదు.

అంతేగాక 194వ పద్యములో:

శ్వపచుండైనను శివభక్తిపరుండగునేని నతడ ద్విజవర్యుం డా
శ్వపచునకుఁ గీడు శివభక్తి పరాన్ముఖు డైనయట్టి ద్విజుడు మహేశా

అంటే అంటరానివాడు శివభక్తిపరుడైతే బ్రాహ్మణుడే అవుతాడు. బ్రాహ్మణుడు శివభక్తిలేకపోతే అంటరానివానికన్నా హీనుడు.

పండితారాధ్యుడు బ్రాహణాధిపత్యాన్ని సమ్మతించాడనే జనశ్రుతి వల్ల బ్రాహ్మణ వీరశైవులతో ఆరాధ్యులనే తెగ మొదలైంది. ఆంధ్రదేశంలో వీరశైవులకు బ్రాహ్మణ వ్యతిరేకత తగ్గి, ఇతర హిందువులవలే వారిలో కూడా వర్ణ వ్యవస్థ మొదలై, కేవలం సంప్రదాయాలు, కట్టుబాట్ల రూపంలో మాత్రమే వీరశైవం ప్రత్యేకంగా నిలిచింది. రానురాను వీరశైవంలోని ఈ తెగల ప్రాముఖ్యత వీరశైవం యొక్క పూర్ణ సిద్ధాంతంకన్నా ఎక్కువ ప్రాముఖ్యతను పొందింది. ఈనాటి ఆంధ్రదేశంలో, తమ సంప్రదాయాన్ని వ్యవహరించేటప్పుడు వీరశైవమనే పదం వాడడం కూడా అరుదే.

బసవపురాణం యొక్క బ్రాహ్మణీకరణ

బసవపురాణం తెలుగులో బ్రాహ్మణేతర సాహిత్యానికి నాంది. మొదట దీనికీ, నన్నయ మొదలెట్టిన తెలుగు సాహిత్యంలోని బ్రాహ్మణశాఖకు చాలా తేడా ఉండింది. వీటిలో వ్యతిరిక్తత పలు విధాలుగా కనిపిస్తుంది: మతపరము (బ్రాహ్మణ్యము – వీరశైవము), భాషాపరము (సంస్కృతాంధ్ర మిశ్రమము – అచ్చ తెలుగు నుడి), మరియు ఛందోబద్ధము (చంపూ – ద్విపద). పాడుకోవడానికి సులువుగా ఉండే ఛందస్సు, అచ్చ తెలుగు భాషియము వాడడం వల్ల బహుశా సోమనాథునికి ఆనాడు నిమ్నకులాల వారిలో మంచి ప్రజాధరణ ఉండి ఉండవచ్చును. దీనికి వ్యతిరిక్తంగా, నన్నయ మహాభారతము కష్టమైన ధోరణి కలిగి, సామాన్యులకు దూరమై, పండితులైన అనువాదకర్తలచే ఉన్నత వర్గీయులైన బ్రాహ్మణ, భూస్వాములకు వినిపించ దగినట్లుగా ఉంటుంది.

ఈ శైలులు రెంటి మధ్య వ్యత్యాసము, తననుతాను “ఉభయకవి మిత్రునిగా” చెప్పుకునే, తిక్కన ప్రమేయంతో తగ్గినట్లుంటుంది. ఇతడు వర్ణ వ్యవస్థను, బ్రాహ్మణాధిక్యాన్ని విశ్వసించే బ్రాహ్మణకవి. అయినా నన్నయ చంపూ ఛందస్సును, శైవకవుల తెలుగు శైలిని కలిపి వాడాడు. తిక్కన పడిన రాజీ తెలుగు సాహిత్యంలోని ముఖ్యమైన మార్పుకు కారణమైంది. చంపూ ఛందస్సు ఇతరుల వర్గీయులలో కూడా ఆమోదం పొందినందువల్ల, తరువాతి తరాలలో బ్రాహ్మణ శివకవులు ఈ శైవసాహిత్యమును సంస్కృత మిళితమైన చంపూలో వ్రాసారు. వీరిలో ప్రముఖులు పదిహేనవ శతాబ్దానికి చెందిన శ్రీనాథుడు, మరియు పదహారవ శతాబ్దానికి చెందిన దూర్జటి. వీరు వీరశైవ కావ్యాలను బ్రాహ్మణ వర్గంవారు ఆదరించేలాగా చేసిన ప్రముఖులు. వీరు సంస్కృతోక్తమైన పాండిత్య శైలిలో, బ్రాహ్మణ సిద్ధాంతాలను పొందుపరిచి శైవ కావ్యాలను తిరిగి వ్రాసారు.

ఉదాహరణకు శ్రీనాథుడు “పండితారాధ్య చరిత్ర”ను తిరిగి రచించాడు. కానీ ఈ కావ్యం ఇప్పుడు లభించక పోవడం వల్ల సోమనాథుని కావ్యంతో పోల్చడం కుదరదు. కానీ “హరవిలాసము” అనే కావ్యంలో శ్రీనాథుడు సిరియాళుని కథను చెబుతాడు. ఈ కథ బసవ పురాణంలో అప్పటికే చెప్పబడింది. ఈ రెంటినీ పోలిస్తే శ్రీనాథుని రచనలో బ్రాహ్మణ ప్రాధాన్యత కనబడుతుంది. శ్రీనాథుడు సిరియాళున్ని వైశ్యునిగా వర్ణించాడు, అంటే చాతుర్వర్ణ బ్రాహ్మణ హిందూ వ్యవస్థలోకి అతన్ని చేర్చాడు. అంతే గాక సిరియాళున్ని పరబ్రహ్మముయొక్క తొడలనుండి పుట్టిన జాతికి చెందిన వానిగా వర్ణించాడు- అంటే ఋగ్వేదం (10.9)లోని బ్రాహ్మణ ఉద్భవ సిద్ధాంతాన్ని ఉటంకిస్తూ. అంతే గాక శ్రీనాథుని కథలో సిరియాళుడు తన పుత్రునికి ద్విజత్వాన్ని కలిగించడానికి, ఉపనయన సంస్కారాన్ని చేసిమరీ వధించి శివునికి అర్పిస్తాడు. అలా చేయకపోతే అది స్వీకరింపబడే నివేదన అయ్యేది కాదు. ఇందుకు భిన్నంగా ఇదివరకు సోమనాథుడు తన రచనల్లో ఉపనయన సంస్కారాన్ని తీవ్రంగా నిరసించాడని గుర్తించాలి. బసవని ఉపనయన నిరాకరణ ఘట్టాన్ని వివరిస్తూ బసవ పురాణంలో చాలా భాగాన్ని కేటాయించాడు.

ఇలాంటి సూక్ష్మమైన మార్పులవల్ల వీరశైవ పురాణ ఘట్టాలు రూపాంతరం చెంది కాలానుగుణంగా ఆంధ్ర దేశంలో బ్రాహ్మణ సిద్ధాంతాలకు అనుగుణంగా మారాయి. ఈ కథలను తిరిగి వల్లించిన బ్రాహ్మణ కవులు వీటిలో సోమనాథుడు తీవ్రంగా వాడిన బ్రాహ్మణ వ్యతిరేక భావాలను, వారిని తిట్టడమూ వంటి వాటిని తొలగించారు. బసవ పురాణంలోని కథలకు చంపూ రూపకాలైన శ్రీనాథుని హరవిలాసము, దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మాహత్యములలో బ్రాహ్మణ వ్యతిరేకత కనిపించదు.

ఇలా బసవపురాణపు బ్రాహ్మణీకరణకు అనుగుణంగా, దీని యొక్క సంస్కృతీకరణ కూడా జరిగింది. దీని అంతంలో ముద్రిక ప్రకారం ఇది బాదరాయణ మహర్షి కృతమని, స్కందుడు, అగస్త్యుని మధ్య జరిగిన సంభాషణగా చెప్పబడింది. ప్రభాకరశాస్త్రి గారు ఈ అనువాదాన్ని బ్రాహ్మణ శైవులైన కందుకూరి వంశంవాళ్ళు ప్రోత్సహించారని, ఇది బహుశా పందొమ్మిదవ శతాబ్దపు అనువాదమయి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. అయితే “ఈ సంస్కృత కావ్యం గురించి తెలిసినవారు, ఇది వ్యాస కృతమని, మిగిలిన ప్రాంతీయ రచనలు దీని అనువాదములని నమ్ముతారని” చెప్పుకొచ్చారు.

ఈ విధంగా సోమనాథుని కావ్యము ఎన్నోవిధాలుగా బ్రాహ్మణీకరింపబడింది. కానీ అతను వాడిన ద్విపద ఛందస్సు మాత్రం అంత ప్రాముఖ్యం పొందలేదు. సోమనాథుని తరువాత కొంతకాలానికే బ్రాహ్మణేతరుడు, వైష్ణవకవి అయిన బుద్ధారెడ్డి రామాయణాన్ని తెలుగులో ద్విపదలో వ్రాసాడు. ఆ పిదప ద్విపదలో బ్రాహ్మణ, బ్రాహ్మణేతర, శైవ, వైష్ణవ కవులచే పలు కావ్యాలు రచింపబడినా ఈ ఛందస్సుకు గుర్తింపు తంజావూరు, మధురైని పాలించిన నాయక రాజులు వచ్చేంతవరకు కలుగలేదు. వీరి ఆస్థానంలో కొంత కాలం ప్రాపునొందింది. కానీ వెంటనే మళ్ళీ పాత పక్షపాతాలు అంకురించాయి. పద్దెనిమిదవ శతాబ్ధి నానుడి ప్రకారము “ద్విపద కావ్యంబు, ముదిలంజ, దిడ్డిగంత, యియ్యనేరని రండ నాల్గేక రాశి” అంటూ ద్విపద కావ్యము హీనమన్న అభిప్రాయాలు ప్రచారములో ఉండేది.

బసవపురాణము పలు భాషలలో పలు విధాలుగా చెప్పబడింది. 14వ శతాబ్దములో భీమకవి బసవపురాణాన్ని కన్నడలో రచించాడు. ఎప్పుడు అనువదించారో తెలియని తమిళ బసవపురాణము సోమనాథుని తెలుగు బసవపురాణము, కన్నడలో భీమకవి బసవపురాణాన్ని ఆధారంగా చేసి వ్రాయబడినది. సంస్కృత అనువాదం గురించి ఇదివరకే చెప్పుకున్నాము.

ఇన్ని రకాలుగా చెప్పబడినా సోమనాథుని మొదటి బసవపురాణము మాత్రము పండిత బ్రాహ్మణ వర్గీయులలో మామూలుగానే నిర్లక్ష్యం చేయబడింది. ఈ వర్గాలవారు తెలుగు సాహిత్య దిశాక్రమంపై ఒత్తిడి చూపగలిగేవారు. వీరి ప్రభావంవల్ల బసవపురాణం తీవ్రంగా ఉపేక్షించబడింది. తెలుగు మహాభారతంపై ఎంతో పాండిత్య చర్చ జరిగి, ఈ కావ్యంపై ఎన్నో భాష్యాలు వ్రాయబడ్డా, బసవ పురాణంపై ఒక్క భాష్యం కూడా వ్రాయబడలేదు. బ్రాహ్మణేతర వీరశైవులు ఈ కావ్యాన్ని మతపరంగా వాడుకున్నా వీరికి భాష్యాలు వ్రాయించడానికి కావలసిన వనరులుగాని, ప్రాపుగాని లభించలేదు.

19వ శతాబ్దంలో సంప్రదాయక తెలుగు సాహిత్యానికి ఐరోపా – ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యం నుండి తగినంత ప్రోత్సాహం లభించింది. పాత తాళపత్ర గ్రంథాలు సమీకరించబడ్డాయి, రచనలు విమర్శనాత్మకంగా కూర్చబడ్డాయి, నిఘంటువులు పొందుపరచబడ్డాయి, సాహిత్యంయొక్క ఉపాఖ్యానాలు పండితులచేత ధారాళంగా, ఆధునిక దృక్పథంతో వ్రాయబడ్డాయి. కానీ వీటిని వ్రాసిన వాళ్ళు బ్రాహ్మణులే అయినందున, వీరికి బ్రాహ్మణేతర శైలులపై, మత విశ్వాసాలపై, పద్దతులపై అవగాహన లేనందున బసవపురాణంతోసహా అలాంటి సాహిత్యమంతా, మళ్ళీ ఉపేక్షించబడింది.

ఈ కొత్త తరపు సాహితీవేత్తలు సోమనాథుని అలక్ష్యం చేయడానికి మధ్యయుగపు భాషాశుద్ధత ఆధారంగా క్రొత్త తర్కాలను వాడుకున్నారు. వీరి ఉద్దేశ్యంలో వ్యాకరణకర్త ఈ కవులకు వ్యాకరణ బద్ధమైన భాషను అందించినట్లు తలచారు. వ్యాకరణాన్ని శబ్దానుశాసనంగా పరిగణించారు. ఒక వ్యాకరణవేత్తకు మాత్రమే దైవానుగ్రహంవల్ల భాషా శుద్ధత, సౌష్టవం కలుగుతాయని భావించారు. ఇక మిగిలినవారంతా దైవానుగ్రాహి అయిన వ్యాకరణవేత్త వద్ద శాస్త్రాన్ని అభ్యసించి పాండిత్యాన్ని సంపాదిస్తే తప్ప, వారి భాషాప్రయోగాన్ని తప్పులుగా నిర్ధారించుకున్నారు. సంస్కృత వ్యాకరణంలో పాణినికి ఈ స్థానం ఆపాదించబడింది. ప్రసిద్ధమైన సంస్కృత కావ్యాలన్నీ పాణిని వ్యాకరణ సూత్రాలను పాటించాయని నమ్మారు. అక్కడక్కడా తప్పులు దొర్లితే వాటిని కావ్య కళంకాలుగా పరిగణించారు. మహాకవి కాళిదాసు కవిత్వంలో కూడా ఈ మధ్యయుగపు సాహిత్యకారులు పాణిని సూత్రాల ఆధారంగా తప్పులుబట్టారు.

అదే విధంగా మధ్యయుగపు తెలుగు సాహిత్యకారులు తెలుగులో నన్నయను శబ్దశాసనునిగా గ్రహించారు. తెలుగులో మొదట వ్యాకరణ నియమాలను సమకూర్చి ఆంధ్రశబ్దచింతామణిని రచించి, భాషను శుద్ధిపరచి, సాహిత్యంలో పదప్రయోగానికి సంబంధించిన సూత్రాలను పొందుపరిచాడు. ఆ తరువాత మాత్రమే అతను మహాభారత అనువాదానికి పూనుకున్నాడు; లేని పక్షంలో అంతా గందరగోళంగా ఉండేది. ఆంధ్రశబ్దచింతామణి తెలుగు పదనిర్మాణాన్ని అసంపూర్ణంగా వదిలిందన్న విషయం వీరికి పట్టలేదు; వ్యాకరణాన్ని ఒక సూత్రాలను అందించే శాస్త్రంగా మాత్రమే వీరు గ్రహించారు. ఒక శాస్త్రకారునిగా వ్యాకరణవేత్తకు చాలా విలువనిచ్చారు. ఈ కాలంలో పండితులు సర్వజ్ఞులని భావించే కవిత్రయము, అనగా నన్నయ(12వ శతాబ్దము), తిక్కన(13వ శతాబ్దము), ఎఱ్ఱాప్రగడ(14వ శతాబ్దము)లు తెలుగు మహాభారతంలో వాడని పదములన్నీ వ్యాకరణదోషములుగా భావించి వాటిని పూర్తిగా త్రోసిపుచ్చారు.

మధ్యయుగపు భావనలు గౌరవించిన 19వ శతాబ్దపు సాహితీవేత్తలు సోమనాథుని రచనలన్నీ అయోగ్యములుగా భావించారు. అతని వందలాది పదప్రయోగాలు కవిత్రయము రచనల్లో కనబడవు; కాబట్టి వీటిని పనికిమాలినవిగా తిరస్కరించారు. ఉదాహరణకు, సాహిత్యకారుల కొరకు మొదటి అక్షరబద్ధమైన నిఘంటువును రూపొందించిన బహుజనపల్లి సీతారామయ్యగారు బసవపురాణంలోగాని, ఇతర వీరశైవ రచనలలో వాడిన పదాలను చేర్చకపోవడం గమనించవలసిన విషయం.

సోమనాథుని అసాధారణ పదప్రయోగం 20వ శతాబ్దపు ఉదారవాదులైన సాహితీవేత్తలను కూడా కొంచెం కలవరపరచింది. భాష వ్యాకరణవేత్తల నియమాలను పాటించవలసిన అవసరంలేదని వీరు ఒప్పుకున్నా, వీరు సోమనాథుని పదప్రయోగంలోని అతిక్రమణలు జీర్ణించుకోలేకపోయారు. సోమనాథుడు అంతే నియమబద్ధమైన వేరొక బాణిని ఉపయోగించాడని వీరు గ్రహించలేకపోయారు. ఇతని శైలి వేరుగా అనిపించడానికి కారణం ఈ సాహిత్యాన్ని అనుసరించిన వారు లేకపోవడమే. అందువల్ల, ఇటీవలి వరకు సోమనాథుడుగాని, ఇతర వీరశైవ కవులుగాని చేసిన రచనలు పనికిమాలినవిగా పరిగణించారు.

సోమనాథుని నిర్లక్ష్యం చేయడానికి ఇంకో కారణం అతని కవిత్వము. సంస్కృత కవిత్వమంతా కావ్యాలలో వాడడానికి కూర్చబడేది. బ్రాహ్మణ పండితులు, (మా ఉద్దేశ్యంలో తప్పుగా,) ఈ పద్దతిని ఖచ్చితంగా అన్ని సాహిత్యాలకు అంటగట్టారు. రస, భావ, గుణ, దోష, ఔచిత్యములను అన్ని సాహిత్య శైలులకు, సంప్రదాయాలకు ఒకే విధంగా సమానంగా ఆపాదించారు. ఇలా పోల్చి నిర్ణయించడంతో సోమనాథుని రచనలు వీరికి తప్పులతడకలుగా కనబడతాయి.

ఇలాంటి చాలా కారణాలు కలవడంవల్లను, బ్రాహ్మణ పక్షపాతంవల్లను, భాషా నియంతృత్వము వల్లను, కవిత్వ పరిమాణాలు అధిక్షేపించడంవల్లను, వీరశైవ సాహిత్యం మొత్తం తెలుగులో ఉపేక్షించబడింది. ఈ వైఖరి వీరశైవంతో వైరం తగ్గిపోయిన తరువాత కూడా చాలాకాలం అలానే ఉండిపోయింది.

బసవ పురాణంపై ఇటీవలి పరిశోధన

చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఉద్యోగి, తెలుగు సాహిత్యాన్ని సమీకరించడానికి ఎనలేని కృషి చేసాడు. ఇతడు 1840లో బసవపురాణము ప్రతిని చేయించడం ప్రారంభించాడు. అంతేగాక బ్రౌన్ మూడు వ్యాసాలను ప్రచురించాడు: “Essay on the Creed and Customs of Jangams”, “Essay on the Creed, Customs and Literature of Jangams”, and “Account of the Basava Puran, the Principal Book Used as a Religious Code by the Jangams”. తన సమకాలికులైన బ్రాహ్మణుల పక్షపాతాలతో బ్రౌన్‌కి సంబంధంలేదు. కాబట్టి అతనికి వీరశైవ తాళపత్ర గ్రంథాలను పరిరక్షించడంలో ఎలాంటి సంకోచము ఉండలేదు. ఇతనికి మతమూలముల పరిశోధన, తెలుగు సాహిత్యములపై మక్కువ వల్ల మనకీనాడు ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మతానికి సంబంధించిన అపూర్వమైన గ్రంథముల ప్రతులు లభిస్తున్నాయి.

తరువాతి కాలంలో శైవ బ్రాహ్మణుడైన కాశీనాథుని నాగేశ్వరరావు స్థాపించిన ఆంధ్రపత్రిక (1914) అనే తెలుగు పత్రిక ఈ వీరశైవ గ్రంథాలను ప్రచురించేందుకు ఆసక్తి చూపింది. ఆ సమయంలో చిలుకూరి నారాయణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి అనే బ్రాహ్మణ పండితులు ఈ మరుగున పడిన గ్రంథాలపై పరిశోధనలు ప్రారంభించారు. ఈ సమర్ధవంతులైన పండితులు మరియు, ఉత్సాహవంతుడైన ప్రచురణకర్తల కలయిక కుదరడం చాలా అదృష్టం. 1926లో ప్రభాకరశాస్త్రిగారు బసవపురాణాన్ని సమీకరించి, విమర్శాత్మకమైన పరిచయముతో ప్రచురించారు. 1939లో సి నారాయణరావుగారు పండితారాధ్య చరిత్రను తమ సుదీర్ఘమైన పరిచయము, విశ్లేషణలు, ఆంత్రములతో జతగూర్చి ప్రచురించారు. ప్రభాకర శాస్త్రి, నారాయణరావుగార్లిరువురును మంచి విజ్ఞానవంతులు, ఉదారవాదులు. వీరు ఈ గ్రంథాలను వాళ్ళ శక్తిసామర్థ్యాలు వెచ్చించి ఎలాంటి సాహిత్య, మత పక్షపాతము లేకుండా పరిశీలించారు. అదే కాలంలో వీరశైవ నిష్ఠుడు, ఉద్దండపండితుడైన బండారు తమ్మయ్యగారు తమ జీవితాన్ని బసవపురాణము, పండితారాధ్య చరిత్ర మరియు సోమనాథుని ఇతర గ్రంథాలను పరిశీలించడానికి అంకితం చేశారు. వీరశైవ మార్గాన్ని ఆచరించే వారైనందువల్ల, వారికి వీరశైవ సాహిత్యంపై వ్యక్తిగత నిబద్దత ఉండేది. ఇటువంటి గొప్ప పండితులకు నిడదవోలు వేంకటరావుగారు తోడయ్యారు. మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులైన వీరు సోమనాథుడు మరియు ఇతర శివ కవుల సాహిత్యాన్ని సమీకరించడం, విశ్లేషించడం సాగించారు. వీరందరి కృషివల్ల శైవ సాహిత్యానికి విస్తృతమైన ప్రచారం లభించింది. క్రమంగా మద్రాసు, వాల్టాయిర్ విశ్వవిద్యాలయాలకు చెందిన యువ పండితులు, స్వతంత్ర పరిశోధకులు శైవ సాహిత్యంలోని భాషా సమస్యలను, సాహిత్య వైవిధ్యాలను, క్రమాంతర సమస్యలను పరిశోధించడం, చర్చించడం ప్రారంభించారు.

వీరందరి కృషి తరువాత కూడా సోమనాథుని సాహిత్యం సమస్యాత్మకమే. ఒక కారణమేంటంటే వచ్చిన ప్రశ్నలన్నీ క్రమాంతర శైలి, భాషా శైలికి సంబంధించినవే. అందువల్ల ఈ సాహిత్యం చాలామట్టుకు భాష్యాలు కరువై, చాలా వరకు అచ్చుతప్పులు లేని ప్రచురణకు కూడా నోచుకోలేదు. ఈ సమస్యయొక్క తీవ్రత బసవపురాణాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఇందులోని చాలా పదప్రయోగాలు వీరశైవుల నిత్యాచార వ్యవహారాలతో ముడివడి ఉంటాయి. వాటి అర్థం కేవలం కొద్దిమంది నిష్టాయుతులైన వీరశైవులకు మాత్రమే తెలుస్తుంది. సోమనాథుని సాహిత్యము, మహాభారతము తదితర కావ్య సాహిత్యములాగా ప్రముఖంగా చదవబడేది కాదు. కేవలం కొంతమంది పండితులు మాత్రమే ఈ సాహిత్యాన్ని పూర్తిగా చదివామని చెప్పగలరు.

అయినా కూడా, ఒక విషయంలో మాత్రం సాహితీకారుల అభిప్రాయం మెరుగుపడింది. కవిగా సోమనాథుని గొప్పదనాన్ని ఎవరూ ప్రశ్నించరు. సాహిత్య విమర్శకులు, ఐతిహాసికులు మాత్రం సోమనాథున్ని గొప్పదనాన్ని కీర్తిస్తూ అతన్ని మహాకవిగా అభివర్ణిస్తారు. అయితే ఈ ప్రస్తుతి సాధారణమైనదే, విమర్శాత్మక విశ్లేషణతో కూడినది కాదు.

సోమనాథుని జన్మకాలము

ఇప్పుడు సోమనాథుని గూర్చిన చారిత్రక సాక్ష్యాలను చూద్దాం. దురదృష్టవశాత్తు మనకు ఉన్న ఆధారాలు చాలా తక్కువ. అతని పుట్టిన సమయ నిర్ధారణ కూడా సందేహకరమే. తెలుగు కవుల కాల నిర్ణయానికి, వారి కావ్య కాల నిర్ణయానికి సాధారణంగా మూడు పద్ధతులను వాడతారు. కవులు తమ సాహిత్యాన్ని తరచూ ఏ పరిపాలించే రాజుకో లేదా ప్రముఖమైన వ్యక్తికో అంకితమివ్వడం జరుగుతుంది. అటువంటి ప్రముఖుల జీవితకాలాన్ని ఉటంకించే బలమైన చారిత్రిక ప్రమాణములు, శాసనాలు వంటివి ఉంటాయి. అంతేగాక కవులు వారు గౌరవించే ఇతర కవులను ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు కవులు తమ వంశ వృక్షాన్ని, కులగోత్రాలను, తమ తలిదండ్రుల పేర్లు మొదలైన విషయాలను తమ కావ్యాల్లో చెప్పుకుంటారు.

సోమనాథుడు ఇటువంటి పద్ధతులేవి పాటించలేదు. ఏ రాజు యొక్క ప్రాపు పొందలేదు. తన సమకాలికులైన కవులనుగాని, లేదా పూర్వకవులను గురించిగానీ ప్రస్తావించలేదు. ప్రస్తావించిన వారు వీరశైవమతమును పాటించే శరణులు. వారి గురించిన నిర్ధిష్టమైన సమాచారం చరిత్రలో లేదు. అందువల్ల అతని జీవితకాలము గాని, బసవ పురాణము యొక్క రచనా కాలమునుగాని ఖచ్చితంగా చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. బసవేశ్వరుడు కర్ణాటకలో వీరశైవ మత ప్రవక్తగా ప్రసిద్ధి పొందిన అనంతరమే ఈ కావ్యం రచించబడినదన్న ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. క్రీ.శ 12వ శతాబ్దము (1106-1167) మధ్య బసవేశ్వరుడు జీవించాడనే విషయం అందరూ అంగీకరిస్తారు.

తెలుగు సాహిత్యకారులు సోమనాథుని కాలాన్ని గురించి తమలో తాము వాదించుకున్నారు. ఈ వాదనలు రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిది మల్లంపల్లి సోమశేఖర శర్మ, మరియు నేలటూరి వేంకటరమణయ్యల వాదము ప్రకారము సోమనాథుని సాహిత్య కాలము 1280-1340 మధ్యకాలములోది. ఇది సోమనాథున్ని కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుని సమకాలీకున్ని చేస్తుంది. రెండవది బండారు తమ్మయ్య గారి ప్రకారము సోమనాథుడు 1160లో జన్మించి 1230 వరకు జీవించాడు. దీని ప్రకారము సోమనాథుడు కాకతీయ రుద్రదేవుడు అనగా మొదటి ప్రతాపరుద్రుని సమకాలికుడు.

ఈ రెండు వాదనలు, సోమనాథుని గ్రంథముల ఆధారంగా, ఇతర తెలుగు కన్నడ కవులు సోమనాథుని ప్రస్తావించిన వాటి ప్రకారము, తెలుగు కన్నడ శాసనాల ఆధారంగా చేయబడినవి.

తమ్మయ్య వాదన సోమనాథుని కావ్యాల్లోని మూడు ప్రస్తావనలు ప్రమాణంగా చేయబడింది. మొదటిది బసవపురాణంలో సోమనాథుడు చెప్పినదాని ప్రకారము, అతనిని శరణుల సభలో బసవపురాణం రచించమని ఆదేశించినప్పుడు అక్కడ “పండితారాధ్యకృపా సముద్గతుండు” అయిన కరస్థలి సోమనాథయ్య ఉన్నాడని చెప్పాడు. తమ్మయ్యగారి ప్రకారము ఇది లింగదీక్షా సంస్కార వర్ణన. దీని ప్రకారము పండితారాధ్యుడు సోమనాథయ్యకి దీక్ష సంస్కారము చేసాడు. పండితారాధ్యుడు తెలుగు నాట వీరశైవ ఉద్యమానికి నాయకుడు, బసవేశ్వరుని సమకాలీకుడు. కాబట్టి పాల్కురికి సోమనాథుడు, కరస్థలి సోమనాథయ్య సమకాలికుడు కావడం వల్ల, అతను పండితారాధ్యుని అంత్యకాలంలో సమకాలికుడు గాని, లేదా గురువు లింగైక్యము పొందిన కొద్దికాలానికి పుట్టిన వాడైనా అయ్యుండాలి. రెండవది, సోమనాథుని ఆఖరి కావ్యాల్లో ఒకటని భావించే పండితారాధ్య చరిత్రలో తానూ బేలిదేవ వేమనారాధ్యుని మనుమని శిష్యున్నని చెప్పుకున్నాడు. బెలిదేవ వేమనారాధ్యుడు పండితారాధ్యుడు మొదటి ప్రకరణమైన “దీక్షా ప్రకరణం”లో పేర్కొనబడ్డారు. ఇతను బసవని కథను పండితారాధ్యునికి చెబుతాడు. ఈ విధంగా కూడా పండితారాధ్యునికి రెండు తరాల తరువాత వానిగా సోమనాథున్ని దాదాపు ఇదివరకు చెప్పబడిన కాలంలోనే నిర్ణయించవచ్చు. మూడవది, పండితారాధ్య చరిత్రను ముగిస్తూ అతని మనుమలను ప్రస్తావిస్తాడు. వారిని పేర్కొన్నందువల్ల సోమనాథుడు వారి కాలానికి గాని వారి తరువాతి కాలానికి గాని చెందినవాడు. తమ్మయ్యగారి ప్రకారము సోమనాథుడు పండితారాధ్యుని మనుమలను వివరిస్తున్నపుడు వాడిన పదములను పరిశీలిస్తే వారి సమకాలికుడనే అర్థము చేసుకోవాలి. ఈ కావ్యాంతర ప్రమాణాల ప్రకారము తమ్మయ్యగారు సోమనాథుడు పండితారాధ్యుని లింగైక్యానికి కొంత ముందు గాని, కొంత కాలము తరువాత గాని జన్మించినట్లు నిర్ణయించారు. దీనిని బలపరుస్తూ కొన్ని బాహ్య ప్రమాణాలను కూడా ఇచ్చారు. సోమరాజనే కన్నడ కవి తన ఉద్భటకావ్యంలో వృషభ స్తవమొనర్చిన సోమున్ని కీర్తిస్తూ ఈ క్రింది విధంగా రచించారు:

ప్రమథానీక కథార్ణవేందు హరిదేవాచార్యనం ధైర్యనం
సముదంచద్వృషభస్తవామర మహీజారామానం సోమనం
విమలజ్ఞాన సుదీపికాస్ఫురిత చేతస్పదమనం వద్మనం
క్రమదిందం బలగొండు పేళ్వెనొసెదా నీ కావ్యమం సేవ్యమం

ఇంకో పద్యంలో “నూఱిన్నందనాల్వత్తు నాల్కనే” అన్న మాటలను బట్టి శ. 1144 (క్రీ.శ 1222) కాలం వాడని తెలుస్తోంది. దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఈ పద్యంలో సోముడు బసవస్థవము రచించిన సోమనాథుడు కాక ఇంకెవ్వరు కాజాలరు, బసవన్ని కీర్తించినవారు ఆ కాలంలో ఇంకెవ్వరూ లేరు. ఇక క్రీ.శ 1122 నాటికి బసవన్నను కీర్తించిన వానిగా, బసవ పురాణము వ్రాసినవానిగా సోమనాథుడు అత్యంత ప్రసిద్ధిని పొంది ఉంటాడు. ఇలా సోమనాథుడు ప్రాపు పొందాడు కాబట్టి తమ్మయ్యగారు సోమనాథుని కాలాన్ని క్రీ.శ 1190గా నిర్ణయించారు.

చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, మరియు నేలటూరి వేంకటరమణయ్యల ప్రకారము బసవ పురాణము క్రీ.శ 1290లో రచించబడింది. వీరు తమ్మయ్యగారి ఆధారాలనే వాడినా, వీరు అన్వయించుకున్న పద్ధతి వేరు. వీరు పండితారాధ్యుడు కరస్థలి సోమనాథయ్యకు లింగదీక్ష ఇచ్చాడని నమ్మరు. వారి అనువాదం ప్రకారం కరస్థలి సోమనాథయ్య పండితారాధ్యుని కృప వల్ల పుట్టాడని, అది ఎప్పుడైనా జరిగి ఉండవచ్చని. వారు తమ్మయ్యగారు చూపించిన సోమరాజు ఉద్భతకావ్యం లోని కవితని కూడా అంగీకరించలేదు. ఈ కవితకు ఉన్న ఇతర ప్రత్యామ్నాయం ప్రకారము అది క్రీ.శ 1522కి సంబంధించిందని వీరి అభిప్రాయము. వీరు రెండ్రేవుల మల్లినాథయ్య మరియు దోచాయాదేవికి సంబంధించిన క్రీ.శ 1290కి చెందిన ఇంకో శాసనాన్ని చూపుతూ వీరి పేర్లు బసవపురాణంలో కవి పేర్కొన్న సమకాలీనులైన రెంటాల మల్లినాథుడు, దోచమాంబలేనని చెప్పుకొచ్చారు, ఈ శాసనం ప్రకారము వీరు బసవపురాణాన్ని క్రీ.శ 1290కి నిర్ధారించారు.

చిలుకూరి నారాయణరావుగారి ప్రకారము బసవపురాణము క్రీ.శ 1267లో రచించబడింది. ఈయన “విశ్వేశాచార్య”, “విశ్వేశ్వరాచార్య” అనే ఇరువురి పేర్ల ఆధారంగా ఈ నిర్ణయం చేశారు. వీరి పేర్లు క్రీ.శ 1242 నుండి క్రీ.శ 1267కి మధ్యలో ఎన్నో కనబడతాయి. నారాయణరావుగారు ఈ పేర్లను కరస్థలి విశ్వనాథయ్య అనే బసవ పురాణంలో పేర్కొన్న సోమనాథుని సాహితీ గురువుగా చెప్పుకొచ్చారు.

ఇరు పక్షాల సాక్ష్యాలు వారి అనుమానాలను, స్వీయాభిప్రాయ గుర్తింపులు, బలహీనమైన సిద్ధాంతాలను పరిశీలిస్తే దోషబద్దంగానే అనిపిస్తాయి. ఒక తేదీని నిర్ణయించే గట్టి ఆధారములేవి కనబడవు. ఇటువంటి పరిస్థితుల్లో సందర్భానుసారసాక్ష్యాలనే చూడవలసి ఉంటుంది. 12-13వ శతాబ్దాల మధ్య బ్రాహ్మణేతరులైన శైవ కవులు మరియు బ్రాహ్మణ కవుల మధ్య గట్టి విబేధాలు ఉండేవి. తెలుగు మహాభారత కర్త అయిన తిక్కన (క్రీ.శ 1210-1290) పలుకులను బట్టి ఇది గ్రహించవచ్చు. బ్రాహ్మణ కవి అయిన ఇతను వర్ణవ్యవస్థను, వేదం యొక్క ఆధిపత్యాన్ని నిర్ధ్వంధ్వంగా సమర్థించాడు. అయినా తిక్కన తననితాను “ఉభయకవి మిత్రున్న”ని చెప్పుకున్నాడు. అతను తన కావ్యాన్ని శివ విష్ణువుల ఏకరూపమైన హరిహరనాథునికి సమర్పించాడు. అటువంటి రాజీని బట్టి అదివరకటి కవిత్వసీమలో ఉన్న గట్టి శైవ సంప్రదాయ ప్రభావం అర్థం చేసుకోగలం. అటువంటి శైవ కవితా పరంపరకు సోమనాథుడు ప్రాతినిధ్యం వహించి ఉండాలి. తిక్కన దానితో తలపడవలసి వచ్చింది. ఇది నిజమైతే సోమనాథుడు తిక్కనకు సమకాలీకుడైనా లేదా అతని పూర్వీకుడైనా అయి ఉండాలి. ఏది ఎలావున్నా సోమనాథుని కావ్య రచన క్రీ.శ 1290 తరువాత మాత్రం జరిగి ఉండదు. మిగితా ఆధారాలేవీ లేనందున సోమనాథుడు క్రీ.శ 1200-1300 మధ్యకాలంవాడని భావించవచ్చు.

సోమనాథుని జన్మస్థానము

పూర్వీకుల ఊరి పేరుని ఇంటి పేరుగా వాడటం తెలుగు, కన్నడ దేశాలు రెంటిలోనూ సర్వ సాధారణము. ఆంధ్రప్రదేశ్‌లోని (ఇప్పుడు తెలంగాణ) నల్గొండ జిల్లా జనగామ తాలూకాలోని పాలకుర్తి గ్రామము సోమనాథుని పుట్టినూరిగా కొన్నిసార్లు చెప్పుకోబడింది[7]రచయితలు పాలకుర్తి సోమేశ్వరాలయాన్ని పరిశీలించారో లేదో గాని, కొండ దిగువున సోమనాథుని సమాధిని భక్తులు దర్శించుకుంటారు.. పాలకుర్తి అనే ఊరిపేరు సోమనాథుని ఇంటి పేరైన పాలకురికికి దగ్గరగా ఉండటంవల్ల ఇలా సూచించబడింది. అయితే చిలుకూరి నారాయణరావుగారి ప్రకారము సోమనాథుని జన్మస్థానము కర్ణాటకలోని తుముకూరు తాలూకాలోని హాల్కురికి. కన్నడలో పూర్వపు “ప” అక్షరాన్ని ఈనాటి కన్నడలో “హ”తో మార్చబడినందున “పాలకురికి” “హాలకురికి”గా మారి ఉండవచ్చు. ఈ ఊర్ల పేర్లు తప్ప సోమనాథుని పుట్టిన ఊరిని నిర్ణయించడానికి ఎటువంటి మిగిలిన ఆధారాలు లేవు. తన బసవ పురాణము, పండితారాధ్యచరిత్రలలో ఈ కావ్యాలను శ్రీశైలంలో రచించానని సోమనాథుడే చెప్పుకున్నాడు. అంటే సోమనాథుడు శ్రీశైలప్రాంతంలో చాలాకాలము ఉన్నాడని స్పష్టమవుతుంది. తరువాతి కాలంలో శైవులు సోమనాథుడు కర్ణాటకలోని కలికేములో లింగైక్యము చెందినట్లు చెప్పుకుంటారు.

సోమనాథుని కులము

సోమనాథుడు ఏ కులానికి చెందినవాడో కూడా ఖచ్ఛితంగా చెప్పలేము. సంప్రదాయక బ్రాహ్మణ కవులలాగా సోమనాథుడు తన కులాన్ని చెప్పుకోలేదు. బసవపురాణములోను ఇతర గ్రంథాలలోను తాను “ఈశ్వర కులాని”కి చెందినవానిగా చెప్పుకున్నాడు. శివపార్వతులను తన తలిదండ్రులుగా తలచాడు. వీరశైవ పరంపర ప్రకారము తాను గురుహస్త జన్మునిగానే పరిగణించాడు. తన గోత్రాన్ని భక్తిగోత్రంగా ప్రకటించాడు. తనకు జన్మనిచ్చినవారు తండ్రి విష్ణురామిదేవుడు, తల్లి శ్రియాదేవి అని చెప్పినా వారిని పెంచిన తల్లిదండ్రులని చెప్పుకున్నాడు. ఈ పేర్లు విష్ణు, లక్ష్ముల నుండి వచ్చిన వైష్ణవ నామములైనందున వీరు వీరశైవులు కారేమోననిపిస్తుంది. వీరశైవులు శివుని తప్ప ఇతర నామములను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి సోమనాథుడు వీరశైవాన్ని స్వీకరించి ఉండవచ్చు. ఏదిఏమైనా తలిదండ్రుల పేర్లను బట్టి వారి కులాన్ని తెలుసుకోవడం కష్టం.

బ్రాహ్మణులైన చిలుకూరి నారాయణరావు, ప్రభాకర శాస్త్రి, సోమశేఖర శర్మ, మరియు వేంకటరావుగార్ల ప్రకారము ఇతను బ్రాహ్మణుడు. సోమనాథుని వైదిక, పౌరాణిక, శాస్త్ర పాండిత్యాన్ని బట్టి అతడు బ్రాహ్మణుడనడానికి నిశ్చయాత్మక సాక్ష్యములని వీరి వాదన. ఇటువంటి వైదికజ్ఞానము బ్రాహ్మణునిగా పుట్టి ఉండకపోతే లభ్యమయ్యేది కాదని వీరి గట్టి నమ్మకము. అయితే ఈ అభిప్రాయానికి ఎటువంటి ఆధారము లేదు. వివిధ కులాలనుండి తీసుకోబడ్డ వీరశైవ జంగమలు[8]వీరశైవ జంగమలు వివిధ కులాలనుండి వచ్చినవారు కారు. వివిధ కులాల నుండి మారిన వారికి జంగమలు గురువులు. ఈ విషయాన్ని జతవ్యాసంలో స్పష్టపరచాను., బ్రాహ్మణ పండితులతో సామాజిక, ధార్మిక గౌరవానికి పోటీపడ్డారు. వీరు వేదవిజ్ఞానాన్ని అభ్యసించి బ్రాహ్మణులను ఆక్షేపించేవారు. సోమనాథుని వైదిక, పౌరాణిక, శాస్త్ర జ్ఞానం అతను బ్రాహ్మణుడనడానికి ఆధారము కాజాలదు.

కులానికి సంబంధించిన ఒక విషయం పండితారాధ్య చరిత్రలో కనబడుతుంది. ఇక్కడ తన శ్రోత అయిన సురనామాత్యున్ని తన ప్రియమైన మరిదిగా సోమనాథుడు వర్ణించాడు. దీని ప్రకారం సురనామాత్యుడు సోమనాథుని మేనమామ కొడుకైనా, లేక మేనత్త కొడుకైనా అయ్యుండాలి. ఈ సురనామాత్యుడు హరితస గోత్రుడు, ఆపస్తంబ సూత్రుడుగా చెప్పబడ్డాడు. ఈ రెండు కూడా బ్రాహ్మణ వర్గానికి చెందినవే.

అయినా ఈ ఆధారము సరిపోదు. ఈ సంబంధపు పదాలతో ఆంధ్రలో వ్యక్తిగతంగా దగ్గరివారిని కులసంబంధము లేకుండా సంబోధించడం సాధారణమే. ఇటువంటి కల్పిత సంభోదనలు చాలా కనబడతాయి. తిక్కన బ్రాహ్మణుడైనా తన పోషకుడు రాజైన మనుమసిద్ధిని “మామ” అని పిలుచుకున్నాడు. మనుమసిద్ధి బ్రాహ్మణుడు కాదని తెలుసు. ఇదే విధంగా సోమనాథునికి, సురనామాత్యునికి మధ్య ఇటువంటి కల్పిత సంబోధనలు ఉండి ఉండవచ్చు.

సోమనాథుడు బ్రాహ్మణుడనడానికి ఇంకో పాత చరిత్ర కూడా ఉంది. పాల్కురికి సోమనాథేశ్వర పురాణమనే గ్రంథము ప్రకారము అతను బలిదేవ వేమనారాధ్యుని కుటుంబముతో జోడించబడ్డాడు. పండితారాధ్య చరిత్ర ప్రకారము బలిదేవ వేమనారాధ్యుడు బ్రాహ్మణుడు. తెలంగాణాలో ఒక బ్రాహ్మణవంశంవారు సోమనాథుడు తమ వంశానికి చెందిన పూర్వజుడని, తమ కులాన్ని వదిలి జంగముడైనాడని ఈనాటికి చెప్పుకుంటారు. నా ప్రకారము ఈ కథలన్నీ బసవ పురాణాన్ని బ్రాహ్మణీకరించే ప్రక్రియలో భాగంగానే చూడాలి.

వీరశైవ పండితుడు, బ్రాహ్మణేతర జంగమ కులానికి చెందిన బండారు తమ్మయ్యగారి ప్రకారము సోమనాథుడు జంగమ కులానికి చెందినవాడే. జంగములు పండితులు, ఈనాటికి తెలుగునాట బ్రాహ్మణేతర వీరశైవుల కోసం పౌరోహిత్యము చేస్తుంటారు. మతగ్రంథాలకు కర్తలు, శాస్త్ర పండితులు అయిన బ్రాహ్మణుల వలెనే జంగములు కూడా బ్రాహ్మణేతర వీరశైవులకు పౌరోహిత్యము చేస్తారు. ఈ కులానికి చెందినవారు చాలామంది పండితులు, కవులు, గాయకులుగా ఉన్నారు.

తమ్మయ్యగారి వాదానికి అంతగా ఆమోదము లభించలేదు. మధ్యయుగపు ఆంధ్రదేశంలో జంగములనే కులము ఉండేది కాదని ప్రభాకరశాస్త్రిగారు సూచించారు. ఆనాటి కాలంలో జంగముడనే పదానికి అర్థము వీరశైవ సన్యాసి. ఆ తరువాతి కాలంలోనే జంగములనే కులము వచ్చింది.

బసవ పురాణములోని గట్టి బ్రాహ్మణ వ్యతిరేకత సోమనాథుడు బ్రాహ్మణేతరుడనే వాదనను సమర్థించడానికి బలమైన సాక్ష్యము. ఈ కావ్యం బ్రాహ్మణుల పట్ల ప్రగాఢమైన ద్వేషాన్ని వ్యక్తపరుస్తున్నట్లు అగుపిస్తుంది. ఇందులో చాలాచోట్ల సోమనాథుడు బ్రాహ్మణులను త్రాటిమాలలుగా, అంటే జంధ్యాన్ని ధరించిన అంటరానివాళ్ళుగా, బ్రాహ్మణగార్దభంబులుగా, అంటే బ్రాహ్మణ గాడిదలు, కర్మచండాలురుగా, అంటే కర్మను ఆచరించే అంటరానివాళ్ళు సంబోధించాడు. ఏడవ ఆశ్వాసంలో ఒక చర్మకార వనితను క్రతువులతో బ్రాహ్మణ సమానురాలిగా చేయ ప్రయత్నించే విషయంలో బ్రాహ్మణులను హేళన చేస్తూ పెద్ద ఉపాఖ్యానమే చెప్పబడింది. ఈ కథలో బ్రాహ్మణులు ఈ అంటరానివనితను బంగారు గోకలశంలో నింపిన పాలతో అభిషేకం చేయిస్తారు. ఆ తరువాత ఈ గోవు ముక్కలను ఒక్కో బ్రాహ్మణుడు తీసుకుంటాడు. ఈ కథలో బ్రాహ్మణులను తీవ్రంగా ధిక్కరించడమే కాకుండా వారి పేర్లను కూడా వక్రీకరించి వారిని వెక్కిరించారు. ఈ బంగారు గోవు శరీర భాగాలను గోమాంసాన్ని భక్షించే కులాలవారి భాషలో వాడే పదాలతో పశుశరీర అవయవాలను వర్ణించాడు. ఈ కావ్యవర్ణనలో బ్రాహ్మణులను అత్యాశాపరులుగా, అయోగ్యులుగా, అంతేగాక గోమాంస భక్షకులుగా అనిపించేటట్లు చిత్రీకరించారు. ఇంతటి బ్రాహ్మణద్వేషముతో కూడుకున్న వర్ణనలు ఏ ఇతర తెలుగు శైవకావ్యాల్లో కనబడవు. అంతేగాక బసవ పురాణంలో నిండిన బ్రాహ్మణ దూషణ, కఠోర వర్ణనలు, ధిక్కార ధోరణి గమనిస్తే ఇది మతపరమైన విభేదం మాత్రమేనని అనిపించదు.

ప్రభాకరశాస్త్రిగారు ఈ బ్రాహ్మణ వ్యతిరేకత కవికి అంటగట్టడం సరికాదని వాదిస్తారు. ఇటువంటి వైఖరికి కారణము ఈ కావ్యనాయకుడైన బసవేశ్వరుడు. ఈ బసవేశ్వరుడు బ్రాహ్మణ వ్యతిరేకి. శాస్త్రిగారి ప్రకారము సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో బ్రాహ్మణులను తిట్టలేదు. పైగా, శాస్త్రిగారి ప్రకారం పండితారాధ్య చరిత్రలో సోమనాథుడు బ్రాహ్మణులను గౌరవించాడు. ఎందుకంటే ఇక్కడి కథానాయకుడైన పండితారాధ్యుడు బ్రాహ్మణ వ్యతిరేకి కాకపోవడంవల్ల.

అయితే ఈ ద్వేషాన్ని బసవేశ్వరునికి ఆపాదించడం అంత సమంజసము కాదు. బసవేశ్వరుడు సైద్ధాంతికపరంగా బ్రాహ్మణ విశ్వాసాలను వ్యతిరేకించినా అతని వచనాల్లో ఎక్కడా సోమనాథుడు వాడినట్లు కఠోర, దూషణాత్మక, హింసాత్మక పదజాలము కనబడదు. పైగా బసవేశ్వరుని వచనాలు సాత్వికతను, దయను ప్రేరేపించేవిగా ఉంటాయి. అంతేగాక పండితారాధ్య చరిత్రలో బ్రాహ్మణ దూషణ లేదనడం కూడా పొరపాటే. ఇందులో బ్రాహ్మణులను గౌరవించడం నిజమే అయినా వారు వీరశైవ బ్రాహ్మణులు మాత్రమే. ఇతర బ్రాహ్మణులను బసవపురాణంలో మాదిరిగానే దూషించడం జరిగింది – వేద భారాన్ని మోసే బ్రాహ్మణ గార్దభంబులని. బ్రాహ్మణులను అవమానించడం బసవపురాణంతో పోలిస్తే పండితారాధ్య చరిత్రలో ఒక మోస్తరు తేడా ఉన్నా విషయం మాత్రం అదే. పండితారాధ్య చరిత్ర వ్రాసేటప్పటికి సోమనాథుడు వయసులో పెద్దవాడు, వీరశైవాన్ని ప్రచారం చేయడంలో గౌరవం పొందినవాడు. బసవపురాణం వ్రాసేటప్పుడు అతడు మండుతున్న కన్నులుగల విప్లవాత్మక భావాలతో నిండిన యుక్తవయస్కుడు. ఇంతటి తీవ్రమైన, నిరంకుశ దూషణ చేసే సోమనాథున్ని బ్రాహ్మణుడని నమ్మడం కష్టమే.

ఇతని కులానికి ఆధారమేదీ లేకపోయినా ఉహించడానికి అవకాశం ఉంది. పండితారాధ్య చరిత్రలో వేదప్రమాణ వాక్యాలను ద్విపదలో ఎలా పొందుపరుస్తాననే విషయాన్ని వివరిస్తూ- “సొట్టైన రత్నంబుచుట్టును బసిడిగట్టిన భావన నెట్టణ దెనుగు సంధి పూర్వాపరసంఘటనముల బంధురఛందోనిబద్ధముల్ గాగ వేదసూక్తముల వెరవైనమాటలాదట గల్పింతు”నని చూడమన్నాడు. తరువాత అదే ప్రకరణంలో “వేలిముద్రిక రత్నకీలన సేయుచోఁ లేశమైన వచ్చునే రత్నమొత్త? సొట్టైనరత్నంబుచుట్టును బసిడి గట్టుట యది వివేకంబట్లయయ్యు దేసిగా విరచించు ద్విపదకు వళ్ళు బ్రాసంబులును బొందువద దాపవలయుననుచు దదీయసూక్తాక్షర పంక్తి జెనకక యింతొప్పజెప్పునే యనుచు సన్నుతి సేయుచు సత్కవులలర దిన్నని సూక్తుల ద్విపద రచింతు” నన్నాడు.

ఈ రెండు ఉదాహరణలు కంసాలి వృత్తికి సంబంధించినవి – తెలుగు సాహిత్యంలో ఇటువంటి వాడుక అరుదు. నాకు తెలిసినంత వరకు ఏ బ్రాహ్మణ కవి కూడా ఇటువంటి కంసాలి ఉదాహరణను వాడలేదు. ఆభరణాలలో పొదిగి ఉన్న రత్నముల ఉదాహరణలు వాడుకలో ఉన్నా, అవి పూర్తిగా తయారుచేసిన వాటి గురించినవి గాని, తయారుచేసే పద్ధతినే ఉదాహరణగా వాడబడలేదు. మధ్యయుగపు తెలుగునాట కంసాలి జాతివారు బ్రాహ్మణులను తీవ్రముగా వ్యతిరేకించారు. అంతేగాక వారు పాండిత్యం సంపాదించినవారు. దీని ఆధారంగా మనం సోమనాథుడు కంసాలి కులానికి చెంది ఉంటాడని అనుమానించవచ్చును. అయితే ఇటువంటి ఉదాహరణలు అతని కులాన్ని తెలిపే సాక్ష్యాలు మాత్రం కావు. ఈ కోణంలో పరిశోధించడానికి హేతువులు మాత్రమే. ఎలాగైతేనేం చాలామంది తెలుగు పండితులు మాత్రం సోమనాథుని జన్మతర బ్రాహ్మణుడనే ప్రతిపాదనను సులభంగా నమ్మేసారు. సరయిన ఆధారము లేని ఈ వాదన అనుమానాస్పదమే.

సోమనాథుని ఇతర రచనలు

సోమనాథుని ఇతర రచనలు చాలా ఉన్నాయి. అవి అతనికి సంస్కృత ధర్మశాస్త్రాల పట్ల ఉన్న పరిజ్ఞానానికి ప్రతీకలు. తెలుగులో ప్రసిద్ధమైన కావ్యాలే కాకుండా సోమనాథుడు సంస్కృత, కన్నడ, తమిళ, మరాఠ భాషలలో కూడా కావ్య రచన చేసాడు. ఇన్ని భాషలలో సరళంగా అదే భావుకతతో వ్రాయగలిగిన అతిక్రొద్దిమంది కవులలో సోమనాథుడొక్కడు.

అతని రచనా సంగ్రహము –

అనుభవసారము
సోమనాథుని మొదటి కావ్యంగా నమ్మబడే, సంస్కృత ఛందోక్తమైన ఈ కావ్యం సాహిత్య ప్రక్రియలో సంప్రదాయబద్ధంగా ఉంటుంది. 242 శ్లోకాలతో ఈ కావ్యము వీరశైవులు పాటించే షట్స్థల సిద్ధాంతాన్ని వివరిస్తుంది. ఇందులో బసవని పేరురాదు గాని పండితారాధ్యుని ప్రశంసిస్తుంది. అందుకని సోమనాథుడు ఈ కావ్యాన్ని బసవని గురించి వినక మునుపు వ్రాసినదిగా భావిస్తారు.

చతుర్వేదసారము
నాలుగు వందల పద్యాలతో ఉండే ఈ కావ్యం వీరశైవ మత ముఖ్య సిద్ధాంతాలను తెలుపుతుంది. వీరశైవమే సర్వవేదాల నిజమైన సారమని నొక్కి చెబుతుంది. ఈ కావ్యంలోని ప్రతి పద్యము “బసవలింగా” అనే పదబంధముతో ముగుస్తుంది.

పండితారాధ్య చరిత్ర
ద్విపదలో రచించిన ఈ మహాకావ్యం పండితారాధ్యుని వృతాంతాన్ని తెలిపేది. ఈయన మామూలుగా శివలెంక మంచెన పండితుడు, శ్రీపతి పండితులతో సంబంధించి చెప్పబడతాడు. ఈ ముగ్గురు పండితులు భిన్నంగా పరిగణించే శైవ బ్రాహ్మణ పరంపరకు చెందిన ప్రసిద్ధులు. పండితారాధ్య చరిత్ర మాత్రం ఈ భిన్నత్వాన్ని ఒప్పుకోదు. పండితారాధ్య చరిత్ర తాత్వికంగాను, బ్రాహ్మణుల పట్ల అభిప్రాయపరంగాను బసవ పురాణానికి విభిన్నంగా ఉండదు. ఈ కావ్యంలో భక్తుల చరిత్రలు, మతపరంగా జైన, బౌద్ధ, బ్రాహ్మణ వ్యతిరేక వాదనలు పొందుపరచబడ్డాయి. బసవ పురాణంలో ఉండే కొంతమంది శైవ ప్రముఖుల చరిత్రలు ఈ కావ్యంలో మరల చెప్పబడ్డాయి.

పండితారాధ్య చరిత్రలోని ఒక కథనం ప్రకారము పండితారాధ్యుడు బసవడిని కలవడానికి శ్రీశైలానికి వెళ్ళాడు[9]బసవడు శ్రీశైలంలో ఉండలేదు. అతడు కళ్యాణకటకములో ఉండేవాడు. పండితారాధ్యుడు కళ్యాణకాటకానికి బయలుదేరతాడు. మార్గమధ్యంలో బసవన్న లింగైక్యన్ని విని ఖిన్నుడై శ్రీశైలానికి చేరతాడు. శ్రీశైలంలోని వీరశైవ పీఠం మల్లికార్జునుని గుడి వెనకాల, భ్రమరాంబ గుడి మెట్లపై ఉంటుంది. దీనికి పండితారాధ్య పీఠమని పేరు. పండితారాధ్యుడు, వీరశైవుల పంచాచార్యులలో ఒకడు. రచయితకు ఈ విషయం తెలిసినట్లులేదు. లేదా, ఇక్కడ అనుకోకుండా తప్పు దొర్లి ఉండాలి. . అక్కడికి చేరేటప్పటికి బసవడు రెండురోజుల క్రితం మరణించాడని తెలుస్తుంది. అప్పటికే వృద్ధుడైన పండితారాధ్యుడు కొంతకాలానికే పరమపదించాడు. ఈ కథనం ఆధారంగా పండితారాధ్యుడు బసవని సమకాలికుడని వివిధ పండితులు నిర్ణయించారు.

పండితారాధ్యుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో ఎన్నో కావ్యాలను రచించినట్లు తెలుస్తుంది. వీటిలో “శివతత్వసారము” తప్ప మిగిలినవేవీ ప్రస్తుతం అస్తిత్వంలో లేవు.

వృషాధిప శతకం
108 పద్యాలతో కూడిన ఈ కావ్యం “బసవ, బసవ, బసవ, వృషాధిపా” అనే సంబోధనా విభక్తి పల్లవిగా అంతమయ్యే పద్యాలతో కూడి ఉంటుంది. శతము అంటే వంద. దీని నుండి వచ్చిన శతకము తెలుగు సాహిత్యంలో ప్రముఖమైన సాహిత్య శైలి. ఇందులో 100 (లేదా, మంగళకరమైన సంఖ్య కాబట్టి 108) పద్యాలు ఒక మకుటాన్ని పల్లవిగా ఎంచుకొని అంతమవుతూ ఉంటాయి.

తెలుగులో మొట్టమొదటి శతకాన్ని పండితారాధ్యుడు రచించాడని ప్రతీతి. కానీ విమర్శకులు శివతత్వసారాన్ని శతకంగా పరిగణించారు. ఇందులో నాలుగు వందలకు పైబడి పద్యాలు పల్లవి లేకుండా ఉండడం కారణాలు. అందువల్ల, సోమనాథుని తెలుగులో మొదటి శతకకర్తగా పరిగణిస్తారు.

వృషాధిపశతకం ఏంతో ఉత్తేజభరితమైన బసవ స్తుతి. ఈ పద్యశైలి తరువాతి తెలుగు శతకకర్తలపై ఎంతగానో ప్రభావం చూపింది. ఈ శైలి ఛందోభరితమై, అనుప్రాసాయుక్తమై ఉంటుంది. ఎన్నో శైవకథలను ఉటంకిస్తూ భక్తులకు పారదర్శకమవుతుంది. ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే తెలుగుతో పాటు సంస్కృత, కన్నడ, తమిళ, మరాఠీ పద్యములు కూడా ఉంటాయి. సోమనాథుడు సంస్కృత తెలుగు సమ్మేళితమైన “మణిప్రవాళ” పద్యాలను కూడా సమకూర్చాడు. ఇది లక్షణాపరంగా వీరశైవ శైలి. దీనిని ఆంధ్ర బ్రాహ్మణ కవులు సంపూర్ణంగా త్రోసిపుచ్చారు.

పై కావ్యాలే గాక సోమనాథుడు ఇంకెన్నో స్తుతులను రచించాడు. సంస్కృత, కన్నడ భాషలలో ఎన్నో రచనలు ఉన్నాయి. కన్నడ కావ్యాలలో సద్గురురగడ, చెన్నబసవరగడ ప్రసిద్ధములు. సంస్కృత కావ్యాలలో, ఇప్పుడు లభించని రుద్రభాష్యము, వీరశైవ తత్వాన్ని వివరించే సోమనాథ భాష్యము ప్రసిద్ధములు.

అనువాదం

మద్రాసు ప్రభుత్వ ఓరియంటల్ తాళపత్ర గ్రంథాలయములో ఉంచబడిన సి.పి. బ్రౌన్ తాళపత్రాలలో, బసవ పురాణం పత్రాలు ఉన్నాయి. వీటిని సేకరించిన సి.పి. బ్రౌన్‌గారి ప్రకారం సంఖ్య. 970లో వివిధ తాళపత్ర గ్రంథాల పరిశీలనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో బసవ పురాణపు సారంశాము తెలుగు మరియు ఆంగ్లములో ఉంది. ఆంగ్ల సారంశాము బ్రౌన్‌గారి చేతివ్రాతలో ఉంది. 1896లో సోమనాథుని బసవ పురాణము శైవ బ్రాహ్మణులైన కందుకూరి కుటుంబమువారిచే ముద్రించబడింది. బ్రౌన్ తాళపత్రాలు, కందుకూరివారి ప్రతి ఆధారంగా వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 1926లో మరో ముద్రణ చేయించారు. ఆ తరువాత 1952లో బండారు తమ్మయ్యగారు మరోసారి ముద్రించారు. ఈ ప్రతులను వేటినీ విమర్శలుగా పరిగణించలేము. ఎందుకంటే ఇవి కేవలం వారికి లభించిన వ్యత్యాస ప్రతులను సేకరించి వాటిలో తమకు నచ్చిన ప్రతిని తమ ముద్రణకు వాడుకుని మిగిలినవి అంత్య గమనికలుగా (foot notes) ఉంచారు. వీటికి సంబంధించిన పునశ్చరణల వివరణలు లేవు.

ఈ అనువాదానికి వెంకటరావుగారి సంపాదకత్వము లభ్యమై ఉండడంవల్ల అది ఆధారంగా తీసుకోవడం జరిగింది. అయితే వెంకటరావుగారి సంపాదకత్వంలో సమస్యలు ఉన్న చోట్ల బ్రౌన్ సం. 970, ప్రభాకరశాస్త్రి (1926), బండారు తమ్మయ్య (1966) లను పరిశీలించడం జరిగింది.

బసవ పురాణము రచించిన కావ్యమైనా, మౌఖిక కావ్యరూపానికి దగ్గరగా ఉంటుంది. ఈ కావ్యము సాహిత్యమైనా వ్యక్తిగత పఠనానికి కాకుండా సామూహిక నిర్వహణలకు ఉపయుక్తమై ఉంటుంది. శైలిని పరిశీలిస్తే ఇది మౌఖిక కావ్యాలకు విడదీయరానంత దగ్గరగా, పల్లవులు పునరావృత్త పూరకమై ఉంటుంది. ఇటువంటి కావ్యాల అనువాదం చాలా కష్టము. కావ్యంలోని పునరోక్తములైన పల్లవులు శబ్ద ప్రయోగాలతో, అతిశయోక్తులతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. అనువాదంలో వీటి ప్రభావము కరవై మందంగా, రసహీనంగా మారుతుంది. అదృష్టవశాత్తు సోమనాథుని రచనాశైలి చాలా వరకు అప్రస్తుతాలు లేకుండా మధురమైన వృతాంతాలతో కూడి ఉంటుంది. అతని కథావిధానము ఇతర మతగ్రంథాలలా కాకుండా ఉత్తేజభరితమై, సూటిగా సాగుతుంది.

అయితే ఒక పెద్ద సమస్య, అతను ప్రతిసారి ఒక భక్తుణ్ణి పరిచయం చేస్తున్నప్పుడు చేసే శైలీకృత ప్రయోగములకు సంబంధించింది. ఉదాహరణకు (వెంకటరావుగారి 2వ అధ్యాయము, 30వ పుటలో):

సర్వాంగలింగి సంసారనిస్సంగి
గర్వాపహారి వ్రాక్తనశివాచారి
సారగుణావేశి సరససంభూషి
కారుణ్యరాశి లింగమనఃప్రవేశి
యగణితసుఖశీలి యతిదయాశాలి
నిగమార్థసంవేది నిచితప్రమోది
విరహితోభయకర్మి వరలింగధర్మి
యరివర్గసంహారి యాత్మోపకారి
లింగాభిమాని యద్భంగురజ్ఞాని
సాంగత్యసువిధాని సతతావధాని
పరమానురాగి సద్భక్తసంయోగి
విరసభవత్యాగి విమలాత్మయోగి
సత్యసాల్లాపి ప్రసన్నస్వరూపి
నిత్యప్రతాపి వినిర్గతపాపి
యీశ్వరమూర్తి యతీంద్రియవర్తి
శాశ్వతకీర్తి ప్రసాదప్రపూర్తి

ఇటువంటి పదప్రయోగాలున్న సాహిత్యము నిర్మాణాత్మాకమైనవి. కథకు సంబంధించిన ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు భక్తిపారవశ్యాన్ని పెంచడానికి ఉపయోగపడేవి. అంతేగాక ఒక పండితుడు గాఢమైన విషయాలను వివరించేందుకు నానార్థాలతో అలరారే సంస్కృత సమాసాలు అనువుగా ఉంటాయి. మా అనువాదంలో ఇలాంటి ప్రకారణాల గాఢత్వాన్ని తగ్గకుండా ఉండేందుకు సాధ్యమైనంత సాహిత్యపరమైన ప్రయత్నము చేసాము.

వ్యాఖ్యానములో సూటితనాన్ని ఇష్టపడేవాడైనా, సోమనాథుడు అప్పుడప్పుడు వివరణశైలిలో మౌఖిక కవుల పద్దతిని అరువుతెచ్చుకున్నాడు. మూడవ అధ్యాయములో చీరల గురించి వివరించవలసి వస్తే, అతడు చీరల రకాల జాబితాను వాటి లక్షణాలతో పాటు వివరించాడు. అలానే సంగీత వాద్యాల జాబితాను వాటి స్వరాల పేర్లతో సహా అదే అధ్యాయంలో వివరించాడు.

సోమనాథుని వాక్యవిన్యాసము కష్టతరంగాను, చాలాచోట్ల నిగూఢంగా ఉంటుంది. అలాంటి సందర్భాలలో మేము కుదిరినంతగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేసాము. పాడైపోయి స్పష్టత లేని అంశాలు, లేదా అర్థంగాని అంశాలు ఎదురైనప్పుడు వాటిని అలా అనువదించకుండా వదలవలసి వచ్చింది. అలాంటివి అంత్య గమనికలుగా సూచించబడ్డాయి. ఇలాంటి సమస్యల్ని వాటిని రాబోవు కావ్యాలు సమాధానపరుస్తాయని ఆశిద్దాం.

చాలాచోట్ల ఇటువంటి అంశాల స్పష్టతకు పిడుపర్తి బసవపురాణము ఉపయుక్తమైనది. అయితే కొన్ని సందర్భాలలో పిడుపర్తి బసవ పురాణము కూడా ఉపయోగపడలేదు. కారణం అచ్చు తప్పులు, లేదా పిడుపర్తి సోమనాథుడు బసవపురాణంలోని కొన్ని అంశాలను విడిచిపెట్టడం, లేదా అవే పదాలను పునరావృత్తం చేయడం, లేదా మూలాన్ని సరిగ్గా అర్థంచేసుకోకపోవడం. ప్రభాకరశాస్త్రి, చిలుకూరి నారాయణరావు, తమ్మయ్య, వెంకటరావుల నిఘంటువులు, పదకోశాలను ఆశ్రయించినా సరే కొన్ని పదాలను అర్థంచేసుకోవడం కష్టమే అయింది. ఇలాంటి సందర్భాలలో మా వ్యాఖ్యానాలు పండితులకు ఆమోదయోగ్యములని ఆశిస్తున్నాము.

ఇక ఆఖరిగా సోమనాథుడు వాడిన సంస్కృత ప్రమాణాల గురించి. చాలా చోట్ల ఈ ప్రమాణాల మూలాలు తెలియజేయబడలేదు. కొన్ని చోట్ల మూల ప్రమాణాలు అపారదర్శకంగా ఉన్నాయి. పారదర్శకంగా ఉండే ప్రమాణాలు అనువందించబడ్డాయి. వాటి మూల ప్రమాణాలు గమనికలుగా ప్రచురించాము.

సోమనాథుని కావ్యాన్ని సాధ్యమైనంతవరకు కచ్చితంగా. స్పష్టంగా, మూలగ్రంథములోని కావ్య నాణ్యత తగ్గకుండా సమర్పించే ప్రయత్నం చేసాము. మూలమును వృద్ధిపరచేందుకు గాని, పాశ్చాత్త్యుల రుచికి తగినట్లుగా మార్చేందుకుగాని, కుదించడానికి గాని, భాగాలను తీసివేయుటకు గాని ప్రయత్నించలేదు. మా ఉద్దేశ్యంలో మూల గ్రంథమును ఉన్నదున్నట్లు అనువదించడం రాబోవు తరాలవారికి అత్యంత విలువైనదవుతుంది.

ఈ అనువాదం మొత్తములో రచయితను పాల్కురికి సోమనాథునిగా సంభోదించాము. అయితే తెలుగునాట ఈయన పేరు పలు విధాలుగా ఉటంకించబడింది. కవి తన ఇంటి పేరును పాలకురికి, పాలుకురికి, పాల్కురికి అని మూడు విధాలుగా చెప్పుకున్నారు. ఇతని పేరు సోమన్న, సోమన, సోమనాథ, సోమనారాధ్యునిగా చెప్పబడింది. తరచుగా వాడని ఇంటిపేర్లు పాలకుర్తి, పాలుకుర్తి. ఆధునిక పండితులు కూడా ఒక పేరుని ప్రమాణంగా వాడలేదు. మేము చిలుకూరి నారాయణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రిగార్ల ప్రయోగాన్ని స్వీకరించాము.

అధస్సూచికలు[+]


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...