కాస్త ఘనీభవనం ఇంకాస్త ద్రవీభవనం

ఈ తరాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రచయిత. తనలోంచి తనను అవ్యక్తంగానే వ్యక్తం చేసుకుంటున్నాడు. ముసుగుల్లోంచి కాకుండా కాస్త వచనంలో ఆవిష్కరించుకుంటున్నాడు. చివరికి మిగిలిందిలో దయానిధిలా కాస్త కోమలత్వం నిండిన కోమలి, మరికాస్త అన్వేషణ లాంటి అమృతంతో ముందుకొచ్చాడు. తడి పొడుల మధ్య జ్ఞాపకాలను నెమేరుసుకుంటున్నాడు. గడ్డ కట్టుకున్న నేటి మనుషుల సౌకుమార్యాన్ని ప్రేమ ఒయాసిస్సులా పంచుతున్నాడు.

వచనంలో సూటిదనం, చెప్పాలనుకున్న వస్తువుతో స్పష్టత… అయితే, ఇంకాస్త ముందుకెళ్ళాలేమో అనిపిస్తుంది. కాలంతోపాటు, రచనలోనూ… ఇంకాస్త పోరాటం అవసరం అనిపిస్తుంది… శిల్పంలోనూ, శయ్యలోనూ. ‘కథంటే ప్యాషన్’ మాత్రమే అని చెప్పే ఈ యువకుడికి జీవితం లోతుల్లోని అట్టగుడు పొరల్ని పట్టుకునే తపన బాగా ఉంది. ఒకరిలోంచి మరికొందర్ని, మరికొందరి నుంచి ఏ ఒక్కరినో వెలికితీసి, నీడల్ని వాటి జాడల్ని పోల్చి చూసే శక్తి ఉంది మల్లికార్జున్‌కు. అయితే మూలాల్లోంచి పాదరరసాన్ని తనలో నింపుకునే ప్రయత్నంలో ఇంకా సహజాతాల్ని పట్టుకోవాలేమో! వెన్నెల్లో చీకటి గదులు కట్టుకుంటూ, చీకట్ని అక్షరాల్లోకి మార్చే శక్తిని మరింత ఆకళింపు చేసుకోవాలేమో!

కాస్త పట్టు, కాస్త విడుపుల మధ్య తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో ఇరానీ కేఫ్ కథలు సఫలీకృతం అయ్యాయి. కథానిక లక్షణాలు–ప్రారంభం, ముగింపు,సన్నివేశం, సందర్భం, వర్ణన, భాష, పాత్రలు, ప్రత్యక్ష దృష్టికోణం, ఉత్తమ పురుష దృష్టికోణం–వంటి పాత నిర్మాణ పద్ధతల కొలతల్లోంచి, స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్‌నెస్, థీమ్ ఆఫ్ ఆర్ట్‌ఫామ్ వంటి వాటిని కొంత పట్టుకుంటూ వదిలేస్తున్న దాఖలాలూ ఉన్నాయి వీటిలో. సన్నివేశాన్ని బొమ్మ కట్టిస్తూనే, పాత్ర సోల్‌ను మాటల్లో కాకుండా బిహేవియర్‌లో చూపించాడు రచయిత. అయితే, సందర్భం లేకపోయినా కావాలని మధ్యలో అక్కడక్కడా బయటకొస్తాడు. తన ఉద్దేశాన్ని చెప్పేసి మళ్ళీ కథలోకి వెళ్ళమంటాడు. కథల వరుసతో చూస్తే అతని ఆలోచనల్లో, కథ చెప్పే తీరులో, ఎన్నుకున్న వస్తువుల్లో పరిణతి, ప్రాపంచికత, తాత్వికతలో కూడా పరిణామం కనిపిస్తుంది. ప్రేమకథల నుంచి ఆంతరంగిక జగత్తుకు బాహ్య జగత్తుకు లంకె వేస్తాయి దృశ్యాదృశ్యం కథ నుంచి అర్బనూరు కథ వరకు.

టెక్నిక్ రహస్యాలు గాలిగోపురాల్లా కొన్ని కథల్లో కనిపిస్తాయి. ‘దృశ్యాదృశ్యం’లో చిన్నపిల్లాడు అఖిల్‌ను కిడ్నాప్ చేసి చంపేస్తారు. అయితే చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు మాత్రమే ఈ కథలో కనిపిస్తాయి. వర్తమానం నుంచి గతానికి లింక్ వేసిన ఈ టెక్నిక్‌లో రచయిత అక్కడక్కడా కొంత తడబడ్డా, చివరకు అనుకున్న అనుభవాన్ని మిగిలిస్తాడు. పాప్‌కార్న్ కథ ముగింపులో ప్రేమికులు సినిమా థియేటర్లో వదిలేసిన పాప్‌కార్న్‌ను అక్కడ పనిచేసే శ్రవణ్ అన్న కూతురికి ప్రేమగా ఇస్తాడు. వాళ్ళు ఇక కలవరని చెప్పిన రచయిత, కథకు ఏ మాత్రం సంబంధం లేని ఈ సన్నివేశంతో వాళ్ళు విడిపోయినా సంతోషంగా ఉంటారని చెప్పడానికేనేమో! ‘కారు చెప్పిన కథ’లో ముగింపు కూడా కారు, పాత్ర అంతఃసంఘర్షణను సూచిస్తుంది. ‘మొన్నవచ్చిన కల’ కథను కేవలం డైరీలా నడిపించినా కొంత డిఫరెంట్‌గానే చెప్పాడు ఇతను. కవిత్వ భాష దీనికి అదనపు హంగు.

ఆ ఆలోచన ఎంత బాగుంటుంది అంటే…
ఇవ్వాళ సాయంత్రం వచ్చే ఓ ఆలోచన
రేప్పొద్దున్నే పుట్టే కోరిక
ఎల్లుండెప్పుడో వినిపించే నాపేరు
ఏ శీతాకాలం మొదట్లోనో అచ్చయ్యే నా కథ

ఏ వర్షాకాలం సాయంత్రమో నేను అర్థం చేసుకున్న పాత్ర
ఏ సోమవారం ఉదయమో వచ్చే ఓ కోపం
ఏ శనివారం రాత్రో పుట్టే ఓ వాంఛ
ఏ కొన్నేళ్ళకో నెరవేరే నా కల
ఏ కొన్నాళ్ళకు నాదని చెప్పుకునే ఓ రోజు
ఏ ప్రపంచానికో నేననే వాడినొకడిని పరిచయమయ్యే క్షణమూ…
(45)

వీటిలో ఓ క్రమం. ఆ క్రమంలో పాత్రలోని కాంక్షలూ అన్యాపదేశంగా పాఠకుడికి చేరతాయి. అయితే ఈ కథను సినిమా టెక్నిక్‌తో పార్ట్స్‌గా రాసినా సంభాషణ, చర్చ, డైరీ భాషకన్నా ప్రత్యేకమైందే. అయితే రచయిత ప్రేమను నాది, నాకు మాత్రమే సొంతం, స్వార్థం… అనే కోణంలో చూసి తన చుట్టూ గిరి గీసుకున్నాడు. వాక్యాల మధ్య మెరిసే ఇంగ్లీష్, వస్తువు యూత్‌ పల్స్‌ను పట్టుకున్న సెల్‌ఫోన్ మెసేజ్‌లు, స్మైలీలు.

‘ఎంతెంత దూరం నుంచో.. ఇంతింత దగ్గరకు’ పూర్తిగా ఉత్తమ పురుష దృష్టికోణంలో నడుస్తుంది. సిటీకి వచ్చిన అమ్మాయితో పంచుకున్న అనుభవాలు, అనుభూతుల తాలూకు ఓ పాత్ర చుట్టూ అల్లిన చిట్టి లవ్‌ స్టోరీ. చాలా కథల్లో ముగింపులన్నీ క్లోజ్ చేసినా, గుండెను పట్టుకుంటాయి. కానీ పాత్రల్లో పరిపక్వత తక్కువ. ఎందుకంటే అవన్నీ ఎదిగీ ఎదగని మనసులోంచి, రొమాంటిసిజమ్‌ నుంచి పుట్టినవేనని చెప్పాలి.

‘ఉర్సు’ కథ ముగింపు తల్లి క్యారెక్టర్‌ను కాల్పనీకరించినా పాఠకుల మనసుకు దగ్గరవుతుంది. తన దగ్గరున్న డబ్బులతో పిలగాడికి బొమ్మ కొనిచ్చి, ఆ బిడ్డను ఎత్తుకుని నడిచే శక్తి లేకపోయినా ఊరికి బయలు దేరుతుంది ఆమె. మొదటి నుంచి పిలగాడు తల్లికోసం తపిస్తుంటాడు. దానికి ముగింపు కరెక్టుగా సరిపోయింది. ‘ఇరానీ కేఫ్’ పూర్తిగా డ్రీమ్ థాట్స్‌తో లోన్లీనెస్‌ను చెప్పిన కథ. మనిషిలోని ఇన్నర్ సెన్సిటివిటీని బహిర్గతం చేస్తుంది. తననుతాను డిస్టర్బ్‌ చేసుకుంటూ, సమాజంలోని సమస్యలను చెప్పినా, గన్‌తో కాల్చడం లాంటివి ఫ్రాయిడ్ డ్రీమ్‌ థియరీను గుర్తుకు తెస్తుంది. ఇరానీ హోటల్ నేపథ్యంలో, రచయిత తనను తాను డిఫరెంట్ కారెక్టర్‌ల బారిన పడి బహిర్ముఖుడ్ని చేసుకోవడం టెక్నికల్‌గా కొత్తగానే అనిపిస్తుంది. నేచర్‌ను స్త్రీలో చూడ్డం పాత టెక్నిక్కే కానీ కొద్దిగా సంభాషణల్లో, స్వభావాల్లో, కంటెంట్‌లో చలం పురూరవ గుర్తొస్తుంది ‘ఆమె ఆకాశం’ కథ చదివితే.

‘వెన్నెల, సముద్రం, ఆకాశం ఎవ్వరివీ కావు. ఎంతసేపు మనతో ఉన్నా’

‘నాకు మాత్రం ఆమె మనిషే’

‘అని నవ్వుకుంటున్నావా పాపం…’ అని నవ్వింది.

‘నేన్నీకు ఏమవుతాను?’ అడిగాడు.

‘ఏమవ్వాలి?’

‘నన్ను ప్రేమిస్తున్నావా?’

‘ప్రేమించడం నాకు చేతకాదు. కానీ, కొన్నాళ్ళు ఇలాగే ఉందాం. ఆమె తిరిగొచ్చే వరకూ…’

ఈ సంభాషణంతా మజిలీలా, పురుష పాత్ర స్వభావాన్ని పట్టి చూపిస్తుంది. పూర్తిగా అతడి కోణం నుంచే… తర్వాత ‘శరీరాలతో సంబంధం కుదరడం’(89) కూడా అలాంటి వ్యక్తీకరణే. మరో టెక్నిక్ ఈ కథలో పురుష పాత్ర ఎంట్రీతో ప్రారంభమై ఎగ్జిట్‌తో ముగుస్తుంది. చావడం కోసం ఎదురు చూసిన పాత్ర పురుషుడు. భవిష్యత్తుపై ఆశతో నిండిన పాత్ర స్త్రీది. వీరిద్దరి మధ్యా ద్వైదీభావమే కాదు, పురుషుడిలో ద్వంద్వ ప్రవృత్తీ కనిపిస్తుంది. వెనక నుంచి రెండో కథ ‘డ్రాఫ్ట్ బాక్స్‌’. దీనిలో కొంత చైతన్య స్రవంతి స్వభావం ఉంది. కానీ అది భాషలో కాకుండా సన్నివేశాలతో ముడిపడి ఉంది. పూర్తిగా లవ్‌ జర్నీలో సాగే ఈ కథలో కొంత కాంట్రడిక్షన్, ఐరనీ ఉంది. కంటెంట్‌ మీది పాత్రల వల్ల అస్పష్టత నిండుకుంది. లాస్ట్ కథ అర్బనూరు. ఈ కథలో ఊరి అనుభవాల తాలూకూ వాస్తవాలు తచ్చాడుతూ ఉంటాయి. దీనిని కూడా కొంత చైతన్య స్రవంతిలో రాశాడు రచయిత. సంతోష్, తాత, అమ్మ, వాడు, అమ్మ, ఆమె–లాంటి పాత్రల మధ్య ఇంటర్‌లింక్ కుదర్చడంలో సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా కొన్ని సింబల్స్‌ చూపించాడు కూడా.

ఒళ్ళంతా వణుకు మొదలైంది. కాళ్ళ వెంట్రుకలు ప్యాంటును అంటిపట్టుకున్నాయి.ఆ ప్యాంటులోకి ఇందాకటి పాము ఎక్కినట్టు అనిపించి వణికిపోయా..’ (106)

మరికొన్ని నేచర్‌కు సంబంధించిన వాక్యాలు అంతర్లీనంగా తచ్చాడుతూ కనిపిస్తాయి.

‘ఇద్దరి మధ్యా కాసేపు ఆకాశం చూస్తూ కూర్చున్నాం.’

‘మంచు నించి ఎండకు మారిపోయాయి రోజులు.’

‘సన్నగా వర్షం పడుతూనే ఉంది…’

కాస్త లోతుగా పసిగట్టగలిగితే పాఠకుడు అనుభూతి చెందుతాడు రచయితతో సహా.

చాలా కథల్లో అమ్మ పాత్ర నేరుగానే, అన్యాపదేశంగానే వస్తూ, పోతూ ఉంటుంది. అమ్మ ప్రేమకు, టీనేజ్ ప్రేమకు మధ్య ఊగిసలాడే చాంచల్య స్వభావం వెనుక సైకలాజికల్‌ థియరీని రచయిత పట్టుకున్నాడు. అందుకే లొంగినట్లు, తప్పుకున్నట్లు పాత్రలు మానసిక జగత్తు నుంచి లౌకికంగా కూడా ప్రభావితం అవుతుంటాయి. అంతలోనే పరుగెడుతుంటాయి.

వస్తువు పరంగా చూస్తే దృశ్యాదృశ్యం కథ–పిల్లాడి మర్డర్, కారు చెప్పిన కథ–ప్రమాదం చాటున దాగిన ఆవేశం, తను నేను, పాప్‌కార్న్‌, మొన్నొచ్చిన కల, డ్రాఫ్ట్‌ బాక్స్, లాంటివి ప్రేమ చుట్టూ తిరిగేవే. సమకాలీన యువ హృదయాలను తట్టి ఎవర్ని వాళ్ళ భవిష్యత్తు, వర్తమానం, గతాలకు తీసుకెళ్ళేవి. ఉర్సు కథ గ్రామీణ నేపథ్యంలో సాగిన తల్లిపిల్లల అనుబంధాన్ని చిత్రిస్తే, ఇరానీ కేఫ్ కథ మనిషి ఆంతరంగిక లోకం లోని కల్లోలాలకు యవనిక అయింది. ‘ఆమె ఆకాశం’ వర్ణనాత్మక ప్రాకృతిక సౌందర్యం నిండిన అలౌకిక భావన. ’అర్బనూరు’ యుంగ్ థియరీని పట్టుకున్న ఆనవాళ్ళకు జోడించిన వర్ణనాత్మకత.

అయితే రచయితకు వాక్యంపై పట్టు, అభినివేశం ఉన్నా, పాఠకుడి స్థాయికి దిగడానికి చాలా చోట్ల ఇష్టపడడు. కవిత్వంలో వలె భావాన్ని తెంపి, పాఠకుడి ఊహకు వదిలేసే స్వభావం ఉంది. సంభాషణల్ని, వర్ణనల్ని, అందమైన అక్షరాలతో పొదుగుతాడు. అయితే కథలోని ఇతివృత్తాన్ని బట్టి భాష మారుతూ ఉంటుంది. పదం వాక్యంలో ఇమిడే సామర్థ్యాన్ని బట్టి మారుతూ తనను తాను నిరూపించుకుంటుంది. అది కవిత్వంలోనే కాదు కథలో కూడా. కథలో రచయిత సగం కాకూడదు. పూర్తిగా రాయాలి. ముందే చెప్పినట్టు అక్కడక్కడా రచయితే కథ మధ్య ప్రవేశించిన సందర్భాలున్నాయి.

ఏదో నైపుణ్యం కావాలేమో ఆ చేతులకు, ఈ పని అలా చేస్తూండడానికి’ (ఉర్సు, 75)

నేను సృష్టించిన పాత్ర కాబట్టి నేనంత చెప్తే అంతే వయసు వాడిది’ (ఇరానీ కేఫ్, 81)

ఎలా అర్థం చేసుకున్నారో ఒకరినొకరు… ఒకేసారి, ఒకేలా నవ్వారు’ (ఇరానీ కేఫ్, 87)

కథలు చదవాలనే నేటి యూత్‌కు ఇవి పక్కా కిక్‌ ఇస్తాయి. సిగరెట్‌ కొత్తగా అలవాటు చేసుకున్నవాళ్ళకు లాస్ట్‌ పఫ్ అంత మజా ఇస్తాయి. ఎందుకంటే ఎక్కువగా ఇవి నేటి టీనేజర్ జీవితాలు, లవ్‌లో పడటాలు, లేవటాలు, ఊహలు, బేరాలు, సరసాలు, అమాయకం, గుండెల్లో దాచుకున్న అంతు చిక్కని రహస్యాల తాలూకూ నక్షత్రాల వెలుగులు. అయితే ఇరానీ కేఫ్, అర్బనూరు, డ్రాఫ్ట్‌ బాక్స్ కథలు చదివితే తప్పనిసరిగా రచయిత కథపై పట్టు సాధిస్తున్నాడు అని చెప్పొచ్చు. త్వరలో విజృంభిస్తాడు. అస్తిత్వవాదాల సాహిత్యం వేళ, గ్రామాలను, నగరాన్ని గట్టిగా పట్టుకున్న ఈ రచయిత తనకుంటూ సొంత భాషణాన్ని, నేపథ్యాన్ని సృష్టించుకోగలిగితే సాహిత్యలోకంలో నిలదొక్కుకుంటాడు అని చెప్పడంలో అభ్యంతరం, సందేహం లేదు.

పుస్తకం పేరు: ఇరానీ కేఫ్
ప్రచురణ: అజు పబ్లికేషన్స్ (డిసెంబర్ 2018)
పేజీలు: 112
వెల: 148రూ.
ప్రతులకు: నవోదయ బుక్ హౌజ్, అనల్ప బుక్ కంపెనీ, అమెజాన్.