కథానాయకుడు కావలెను.
సుప్రసిద్ఢ కథ పాతాళ భైరవికి గాను యోగ్యుడైన, అర్హుడైన కథానాయకుడు కావలెను. రూపములో, గుణములో, ధైర్యసాహసములలో, సత్ప్రవర్తనలో, ఇన్నినాళ్ళూ ఈ కథకు నాయకుడిగా ఉండి, ప్రజల మనసును చూరగొన్న తోటరాముడిని మరిపించి, మురిపించగలిగే దిట్టయి ఉండవలెను. యుక్తితో, శక్తితో మాయావి మాంత్రికుడిని మట్టి కరిపించి, రాజకుమారిని పరిగ్రహించి, పాతాళ భైరవి ఆశీస్సు…
కూర్చున్న రాయి మీద నుండి ఒక ఉదుటున లేచి, మాంత్రికుడిని సమీపించి, అతడి చేతిలోని ప్రతిని లాక్కొని నలిపి, నేల కేసి కొట్టింది రాజకుమారి.
“ఈ ఉపాయమూ నచ్చలేదే నీకు, ఢింభకీ?”
“ఢింభకినీ, డింగరినీ కాను. నీ బుల్‌బుల్‌ను నేను. నీ జిగిడీను. అలా పిలు.”
“మారాము శాయక, మాట వినవే! మనకొక కథానాయకుడు కావాలే.”
“ఏం? ఎందుకు కావాలి? వదిలిపోయిన వాడి కోసం ఎందుకీ వెదుకులాట?”
“కాదనుకున్నాడే! కాదనను. కాని కథ అన్నాక కథానాయకుడొకడు ఉండాలి గదే, ఢింభకీ. లేకున్న…”
“ఆఁ! లేకపోతే? లేకపోతే ఏంటంట?”
“నన్నెవరు హరిస్తారు? నిన్నెవరు వరిస్తారే?” అంటూ నేల మీద పడున్న ప్రకటనని చేతిలోకి తీసుకొన్నాడు.
“అంతేనా? అంతేనా! అయితే పద. నన్ను పాతాళ భైరవి సన్నిధికి తీసుకెళ్ళు. నిన్ను బలి ఇచ్చి దేవిని ప్రసన్నం చేసుకుంటాను. ఆపై నిన్ను సంజీవనితో బతికించుకుంటాను. తర్వాత మనిద్దరం పెళ్ళి చేసుకుందాం.”
“గారడీ మాటలాడకే, ఢింభకీ! ఇంకెక్కడి సంజీవనే?”
ప్రతికి అంటుకున్న మట్టిని వదిలించడానికి దాన్ని గాల్లో దులిపాడు. కుడిచేతితో తొడ మీద పెట్టుకుని చేతితో సాపు చేశాడు. సగం తెగిన అతడి ఎడమ చేయి భుజం నుండి జీవం లేకుండా ఊగుతోంది. రాజకుమారి ఆ చేతినే చూస్తూ ఉండిపోయింది. అది గంట వినిపించని గడియారపు లోలకంలా నిశ్శబ్దంగా అటూ ఇటూ ఊగుతూనే ఉంది.
అసలైతే, కథ మొదలవ్వాల్సిన దగ్గరే మొదలయ్యింది. తోటలో, తోటరాముడితో.
తోటరాముడు మహాసాహసవంతుడు. సన్మార్గుడు. బుద్ధిగలవాడు. బుద్ధి చెప్పగలవాడు. అల్లరివాడు. అయినా, అందరివాడు. అతడికో జతగాడు. ఉజ్జయిని రాజ్యంలో రాజుగారి కోటలో తోటను చూసుకునేది వాళ్ళ అమ్మ. అమ్మకు సాయం చేసేవాడు తోటరాముడు.
ఒకరోజు ఆ తోటకు రాజకుమారి రాబోతుందని కబురొచ్చింది. రాజుగారి ఏకైక కుమార్తె కాబట్టి, ఎప్పుడూ చూడలేదు కాబట్టి దొంగచాటుగా ఆమెను చూడాలనుకున్నాడు.
చూపులు కలిశాయి.
ఆ రాత్రి తన మదిలోని కలవరాన్ని అంతా జాబిలికి చెప్పుకుంది, రాజకుమారి. ఆ జాబిలి వెన్నెలలోనే, అమ్మ ఒడిలో ఆదమరచి నిద్రపోయాడు రాముడు.
రాజకుమారి తోటకు మళ్ళీ మళ్ళీ వెళ్ళింది. తోటరాముడికి ఆ విషయం మామూలైపోయింది. ఎప్పుడన్నా ఎదురుపడితే వినమ్రంగా తలదించుకుని వెళ్ళిపోయేవాడు.
మొదటిసారిగా రాజకుమారికి కోటలో ఊపిరాడలేదు. ఆ ఎత్తైన ప్రాకారాలు తనను చుట్టిముట్టి గాలాడనీయకుండా చేస్తున్నట్టు అనిపించింది. తోటలోనే కోట ఉన్నా, కోటలోనే తోట ఉన్నా ఎంత బాగుండేదో అని అనుకుంది.
రాముడు ప్రాణాలకు తెగించి రాజకుమారిని పాము కాటు నుండి రక్షించాడు. అతడు తన ప్రేమను అలా వ్యక్తపరిచాడనుకుంది రాజకుమారి.
అన్నీ అనుకున్నట్టే అవ్వవు కదా? ఈ కథ కూడా అలాగే.
తోటకి వెళ్ళలేని రాజకుమారిని చూడ్డానికి తోటరాముడు కోట ప్రాకారాలు దాటి రాలేదు. పరాగ్గా ఉన్న కూతురి మనసు గ్రహించి, ప్రభువులే పరాక్రమానికి పారితోషికం ప్రకటించారు. తోటరాముడి మనసేమిటో తెల్సుకోడానికి ప్రయత్నించారు. ‘నిజం చెప్పమన్నారా? అబద్ధం చెప్పమన్నారా?’ అని అడిగి, తోటరాముడు నిజమే చెప్పేశాడు. రాజుగారి అనుగ్రహం కాస్తా ఆగ్రహంగా మారింది. తెల్లవారగానే తల తీసేయమని తీర్పిచ్చారు.
ఆ చెరసాల నుండి తప్పించుకొని, రాజకోట ప్రాకారం దాటుతున్న దృశ్యాన్నే దుర్భిణిలో చూశాడు మాంత్రికుడు. ‘సన్మార్గుడు. మహాసాహసవంతుడు’ — కరుణించిన దేవి పలుకులనే మళ్ళీ స్మరించుకున్నాడు. సదాజపుని వెంటబెట్టుకొని ఉజ్జయినికి చేరుకున్నాడు.
కూడలిలో జనాన్ని కూడబెట్టి తన విద్యలను ప్రదర్శించాడు. అతడి విద్యలు ప్రజలందరికీ వినోదాన్ని అందించాయి. మారువేషంలో ఉన్న తోటరాముడూ కళ్ళప్పగించి చూశాడు ఆ మాయలన్నీ! ప్రదర్శన అయ్యాక అందరితో పాటు చప్పట్లు కొట్టి ఇంటికి చక్కా పోయాడు.
జరగని కథను తెలుసుకున్నాడు మాంత్రికుడు. ప్రేమ లేకపోయినా, వాడికి డబ్బు మీద ఆశ ఉంటే చాలుననుకున్నాడు. తోటరాముని కదలికలు కనిపెడుతూ, అతడి దారికాచి ఎదురుపడ్డాడు మాంత్రికుడు.
“అనంత ఐశ్వర్యం ఇచ్చే నిక్షేపంరా! నీకొక్కడికే ఆ కీలకం చూపిస్తాను. సాహసం శాయరా, ఢింభకా!”
“నాకేం వద్దు. అమ్మే ఐశ్యర్యం. అమ్మే నా ప్రపంచం.”
“అలా అనకురా ఢింభకా! నీవు సాహసివిరా. వరపుత్రుడవిరా!”
“అందుకే! అన్ని వ్రతాలు పట్టి కన్న అమ్మ కంటనీరు చూడలేను. ఆమె కంటికి దూరం కాలేను. బందిఖానా నుండి తప్పించుకుంది కూడా అందుకే.”
అయినా మాంత్రికుడు పట్టు వదలలేదు.
ఆ రాత్రికే తన తల్లిని, స్నేహితుని తీసుకొని ఎవరికీ చెప్పాపెట్టకుండా కథ నుండి వెళ్ళిపోయాడు.
రాజుగారు పంపిన సైన్యానికి గాని, మాంత్రికుడి దుర్భిణికి గాని తోటరాముడు దొరకలేదు.
తన రాముణ్ణి తానే వెతుక్కుంటానని రాజకుమారి కోటను వదిలి బయలుదేరింది. తన మంత్రతంత్రాలకు లేని బలం ఆమె ప్రేమకు ఉండచ్చునని ఆమెను అనుసరించాడు మాంత్రికుడు, ఆమెకు తెలీకుండా.
పుట్టలూ గుట్టలూ దాటి కొండలూ కోనలూ దాకా వెళ్ళింది రాజకుమారి. కళ్ళు కాయలు కాచాయి. పాదాలకు పుళ్ళు పడ్డాయి. ఆమె ఆగలేదు. వెతకడం ఆపలేదు. అలసి సొలసి స్పృహ తప్పి పడిపోయేవరకూ.
స్పృహ వచ్చేసరికి రాజకుమారి ఒక మందిరంలో ఉంది. చుట్టూ బోలెడు పరిచారికలు ఉన్నారు. ఎవరినీ గుర్తుపట్టలేకపోయింది.
మంచం పక్కనే ఉన్న మాంత్రికుణ్ణి చూసింది. కళ్ళు తిరిగి పడిపోయింది.
కోలుకోడానికి కొన్నాళ్ళు పట్టింది. సపర్యలు చేస్తున్న పరిచారికలు ఆమెను కాపాడ్డానికి మాంత్రికుడు పడ్డ కష్టాన్ని కథలుకథలుగా చెప్పుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కదిలించడానికి ఇష్టపడక, ఉన్న చోటనే కోట కట్టి, అన్ని వసతులూ సమకూర్చాడని, దేశవిదేశాల నుండి వైద్యులని రప్పించాడని, తోటరాముడి కోసం మహాయాగం చేయబోతున్నాడని విన్నది రాజకుమారి.
మాంత్రికుడు వచ్చాడు.
“మీరెవరో తెల్సుకోలేకపోయాను. మా ఇద్దరి కోసం ఇంత తాపత్రయపడుతున్న మీకు, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?”
“సన్మార్గులకు సాయం శాయడం మా వ్రతము, రాజకుమారి!”
“మీ వంటి మంత్రసిద్ధుల అనుగ్రహం, మా పూర్వజన్మ సుకృతం.”
“ఛీ, నీచుడా! నీ పాపం పండే రోజు వస్తుంది. నా రాముడొస్తాడు. నిన్ను వధిస్తాడు. చూస్తూ ఉండు.”
చేతికందినది అందినట్టు మాంత్రికుని పైకి విసిరింది. పరిచారికలు ఆమె రెండు చేతులనూ పట్టుకున్నారు.
మాంత్రికుడికి పౌరుషం వచ్చింది. ఆ బికారి రాముడి చావు నాచేతిలోనే అని అరిచాడు. ఆమెపై ప్రత్యేక నిఘా ఉంచమని ఆజ్జాపించి, వెళ్ళిపోయాడు.