The Collector of Cracks


(Still – Stanley Hayter)

జానపద కథ. ఇప్పుడే రాయడం పూర్తయ్యింది. రాతబల్ల మీద, ఇంకు సీసా పక్కనే, ఇంకా ఇంకు తడారని కాగితాల్లోంచి అక్షరాలు మెత్తగా మెరుస్తున్నాయి. కొసమెరుగులు దిద్ది, రాతప్రతి చుడుతుంటే, అక్షరాలు కాగితంలోంచి కంట్లోకి దూకడానికి ఉత్సాహపడుతున్నట్టు అనిపించింది.

ఇప్పుడింకా మధ్యాహ్నమే. కథ చదివి వినిపించటం రాత్రి తొమ్మిదింటికి. అంతవరకూ ఆగాల్సిందే. పగటి సూర్యుడికి అభూతకల్పనలు అంటే గిట్టదు. రాత్రి దీపాలు అలా కాదు. ఏటవాలుగా నీడలు నిక్కించి ఒకటో రెండు కథలు వింటానికి వాటికి అభ్యంతరం ఉండదు.

ఈ వాక్యాలు రాత్రి కోసం వేచిచూడక తప్పదు.

రచయితతో కలయిక ఏర్పాటు చేయబడింది. ఒక నిశ్శబ్దమైన గది, కిటికీలలో అమర్చిన పూల లాగానే మరి కొంతమంది శ్రేయోభిలాషులు నా కథ వినడానికి ఎదురుచూస్తుంటారు, నిస్తేజంగా. కాని, (ఇలాంటివి జరుగుతాయని ఎవరూహించగలరు?) నాకు తారసపడిన ఒక వ్యక్తి కథలోని అభూతకల్పనను చెరిపేశాడు.

కథ చివరిసారి దిద్దడం అయిన వెంటనే అతన్ని కలవడమూ జరిగింది. లంచ్ టైమ్ అవుతుండడంతో కథని రాతబల్ల దగ్గరే వదిలేసి, కోటు తొడుక్కుని, వీధిలోకి వచ్చాను. ఒక వంద అడుగులు వేశానో లేదో, ఒక దీపస్థంబానికి ఆనుకుని, శిల్పంలా కదలకుండా నిలబడి ఉన్న ఒక వ్యక్తి నన్ను ఆకట్టుకున్నాడు. సన్నగా రివటలా ఉన్నాడు. వీధికి అటువైపు గడియారాల దుకాణం తలుపు మీద గీసి వున్న గడియారపు బొమ్మను, దానిపైన గీసిన నల్లటి అంకెలను పొడుస్తున్న నల్లటి ముళ్ళకేసి, తదేక ధ్యానంతో చూస్తున్నాడు. అతన్ని దాటుకుని వెళిపోదామనుకుంటూనే అతని కేసి వెనుదిరిగి చూశాను. అతనింకా అక్కడే, అలాగే ఉన్నాడు అరమోడ్పు కనులతో, బంగారపు అంచుతో తెల్లటి ముఖంతో గీసిన ఆ గడియారం కేసి అలానే చూస్తూ. నేను కూడా గడియారం వైపు చూశాను. సమయం: 1 గం. 27ని.

నున్నగా గీసిన గడ్డమూ, శ్రద్ధగా ఇస్త్రీ చేసిన సూటూ, తమ వయసు దాచలేకపోతున్నాయి: సూటు మీద మడతచారలు, అతని నుదుటి మీద గీతలు. వీధిలో, ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు రాచుకుంటూ, షాపు విండోల్లోకో, పోస్టర్లూ, ప్రకటనలూ అంటించిన స్థంభాలకో లేదా దించుకున్న తలతో బూట్లకో –అంటుకుపోయిన కళ్ళతో, వస్తూపోతూ ఉన్న పాదచారులెవ్వరూ ఇతన్ని పట్టించుకోలేదు. నేను, మెడకు చిన్న పెట్టె తగిలించుకొని, ఏవో చిన్న చిన్న వస్తువులు వీధిలో అమ్ముకుంటున్న మరో చిన్నకుర్రాడు మాత్రం ఈ ప్రహసనాన్ని గమనిస్తున్నాం. ఇంతలో అతను, తన ఎడమవైపు కోటు జోబులోకి చెయ్యి జొనిపి, అందులోంచి ఒక పాకెట్‌వాచ్‌ బయటకి తీశాడు. తన పాకెట్‌వాచ్‌నూ దుకాణం తలుపుమీది గడియారం బొమ్మనూ మార్చిమార్చి చూసుకున్నాడు. తరువాత తన వాచ్‌లో సమయాన్ని బొమ్మమీద గీసివున్న సమయానికి జాగ్రత్తగా సెట్ చేసుకున్నాడు. ఆ చిన్న కుర్రాడు ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. నేను నా నడక కొనసాగించాను. ఎదురుగుండా, రకరకాల ప్రకటనలు, పోస్టర్ బోర్డ్‌ల మధ్య మరో తెల్లటి గడియారం బొమ్మ కనిపించింది. నేను సాధారణంగా వీధిలో ప్రకటనలు, షాపుల బోర్డులు పట్టించుకోను. కానీ ఇప్పుడు చూశాను. నల్లటి అంకెలను పొడుస్తున్న నల్లటి ముళ్ళు. సమయం: 1 గం. 27ని.

ఏదో తెలియని కీడు జరగబోతున్నట్టు నా మనసు శంకించింది. నడక వేగం పెంచాను. నా కళ్ళు కూడా అంతే వేగంగా తెల్లటి వృత్తాలకోసం, నల్లటి ముళ్ళ కోసం చూస్తున్నాయి. నీడలో చీకటిగా ఉన్న ఒక పక్క సందులో కనిపించింది అది. అదే తెల్లటి గడియారం బొమ్మ. దాని నల్లటి ముళ్ళు, ఆ చీకట్లో దాక్కొనివున్నాయి కాని నేను గుర్తించగలిగాను, అవి ఏ అంకెలను పొడుస్తున్నాయో. సమయం: 1 గం. 27ని.

నేను ముందుకి కదల్లేక అక్కడే ఆగిపోయాను. కళ్ళెత్తి వాటి వైపు చూశాను. ఎందుకో ఆ ముళ్ళు తిరుగుతాయని, తిరగాలని, గడియారపు తెల్లటి ముఖాన్ని అలా చీల్చకుండా ఉండాలని అనిపించింది. కానీ, ఆ ముళ్ళు అలాటి ప్రయత్నమేదీ చెయ్యలేదు. బంగారపు అంచుతో మెరుస్తున్న ఆ గడియారపు బొమ్మలో ఏదీ కదలలేదు. ఏమీ మారలేదు. ఆ నల్లటి ముళ్ళు వాటికి కావలసినది దొరికినట్టు అలానే తమ కొనలను ఆ అంకెల మీదనుంచి గడియారపు అంచును తాకుతూ స్తంభించిపోయివున్నాయి. శాశ్వతంగా.

చుట్టురా దూసుకుపోతున్న వాహనాల చక్రాలు, టకటకా దాటుకుపోతున్న బూట్లు. కనీసం ఒక అరడజను భుజాలు నన్ను రాసుకుంటూ నడిచిపోయాయి. బరువైన బస్తా ఒకటి నా భుజాల్ని రాసుకుంటూ ముందుకి పోయింది. చిరిగిన టోపీతో, మెడలో పెట్టెతో, వీధిలో చిన్న చిన్న వస్తువులమ్ముకుంటున్న కుర్రాడు నన్ను చూసి నవ్వాడు. ఇక ముందుకు కదలక తప్పలేదు.

నేను, తిరిగి నా కథ దగ్గరకు వచ్చేసరికి చీకటిపడింది. నంబర్లేసిన పేజీలమీద, ఇప్పుడు మౌనంగా అక్షరాలు, నల్లగా మెలికలు తిరిగి తమ రహస్యాలను కాపాడుకుంటున్నట్టుగా ఉన్నాయి. పేజీలను మడతపెట్టి, జేబులో పెట్టుకున్నాను. గడియారం ముల్లు మెల్లగా తొమ్మిది గంటలకు దగ్గరగా జరుగుతోంది.

2.

అందరం ఒక వలయంగా కూర్చున్నాం. నిశ్శబ్దం. నా కథకు మాట్లాడే సమయం వచ్చింది. దీపానికి దగ్గరగా జరిగి గొంతు సవరించుకున్నాను: “ది కలెక్టర్ ఆఫ్ క్రాక్స్. ఎ ఫెయిరీ టేల్: అనగనగా, ఒక దేశంలో…”

నడవా బైటనుంచి చిన్నగా డోర్‌బెల్ కీచుమంది. నేను చదవడం ఆపాను. మాకు ఆతిథ్యం ఇచ్చిన పెద్దమనిషి నిశ్శబ్దంగా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లోకి వెళ్ళాడు. ఒక నిమిషం తర్వాత, కాస్త ఇబ్బందిగా నవ్వుతూ వచ్చాడు; అతని పక్కనే ఉదయం చూసిన గడియారం మనిషి, పొడుగాటి ఫ్రాక్ కోట్ వేసుకొని పైదాకా గుండీలు పెట్టుకొనివుండి, ఎవరితోనూ చూపు కలపకుండా నిల్చున్నాడు. ఈ అనుకోని అతిథి అందరికీ ఒకసారి నమస్కారం చేస్తున్నట్టు తల నిలువుగా ఊపి, విడిగా గది వెనకాల తలుపుకు దగ్గరగా ఒక మూలనున్న కుర్చీలో కూర్చున్నాడు. తలుపు తీసినాయన నా చెవిలో చెప్పాడు: “ఈయన ఒక మాథమెటీషియన్, ఫిలాసఫర్. కాస్త తిక్క మనిషి. కానీ మనల్నెవర్నీ ఇబ్బంది పెట్టడు లెండి.”

కళ్ళు కాగితాలవైపు దించి (నా ఉత్సాహం చచ్చిపోయింది) మొదలెట్టాను: “ది కలెక్టర్ ఆఫ్ క్రాక్స్. ఎ ఫెయిరీ టేల్: అనగనగా, ఒక దేశంలో… దాని పేరు ఏమిటో ఎవరికీ తెలీదు. తాపడం చేసిన రహదారులకు, నాచు పట్టిన కాలిబాటలకూ దూరంగా, కొండలు కోనలకు ఆవల, కాకులు దూరని కారడవిలో ఒక పచ్చికబయలు. అక్కడ ఒక ముసలి ఋషి ఉండేవాడు…” ఇలా అన్ని జానపద కథల్లానే ఉపోద్ఘాతం అయ్యాక, ఆ కథ ఆ ఋషిని వర్ణించింది.

ఆ ఋషి ఎంత సాధువో ఎంత మంచివాడో; ఆ అడవిలో గాలికి దెబ్బతిన్న కొమ్మల్నీ, జంతువులు తిని పాడుచేసిన మొక్కల్నీ ఆయన ఎలా బాగుచేశాడో; తల్లిలేని పక్షికూనల్ని ఎలా సాకాడో; ఉదయారుణ రాగాలకీ, వర్ణాలకీ ఆకాశం వైపుకీ, భగవంతుడి మందిరం వైపుకీ సూటిగా సుళ్ళు తిరుగుతూ ఎగరడం ఎలా నేర్పాడో; తమ లేలేత రెక్కలు వాడిపోయేలోగా పువ్వులకు భగవంతుడిని కీర్తించడం ఎలా మప్పాడో; నలిగిపోతున్న గడ్డిని ఉదయపు మంచుబిందువులని ఒక్కోటిగా భగవంతుడికి సమర్పించుకోవాలని ఎలా ఒప్పించాడో.

వణికే తన చెయ్యి పైకెత్తి మూడు వేళ్ళతో పరకల్నీ, మంచుబిందువులనీ, వేర్లనీ, నాచునీ, పక్షి గుంపులనీ, ఈగల మందల్నీ ఉద్దేశించి, ‘మీ త్యాగానికి బదులుగా, భగవంతుడు మీకు ఎప్పటికీ దాహంలేకుండా నీరిస్తాడు. మీరెప్పుడూ స్వచ్ఛంగా, ఆర్తి ఎరుగకుండా జీవిస్తారు.’ అని దీవించేవాడు. ఆయన చెప్పినట్టే అయ్యింది. దేవుడు పైనుండి ఈ సాధువు ఆశీర్వాదాలు నిజం చేసేవాడు.

అలా ఉండగా, ఒకనాడు, చరాచర జగత్తు అంతా నిద్రిస్తున్న సమయంలో, ఈశ్వరుడు ఆకాశం నుండి భూమికి దిగివచ్చి ఈ సాధువు ఉంటున్న పూరిపాకలోకి వచ్చాడు.

“నీకేం కావాలో కోరుకో. బొందితో స్వర్గమా, ఇహలోకపు ఐశ్వర్యమా, రాజ్యభోగమా–ఏది కోరినా సరే ఆనందంగా ఇస్తాను.”

ఆ ఋషి చేతులు జోడించి ఇలా అన్నాడు: “ఓ ప్రభువా, స్వర్గం ఎందుకు–అది నీ దయవల్ల కాక మా ప్రవర్తన పట్ల నీ తీర్పుగా వచ్చేదే కదా? రాజభోగాలు, అష్టైశ్వర్యాలు ఎందుకు–నీ విశాల సృష్టిని సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకూ నేను కళ్ళతో చూడటం లేదా? ఈ తృణప్రాయమైన ప్రలోభాలను నేను ఎన్నడో వదిలివేశాను కదా. అయితే, ప్రభువా, నేను కోరుకొనేది ఒక్కటే. ఈ సృష్టిలోని వస్తువులలోనూ, పదార్థాలలోనూ వున్న బీటలపైనా, పగుళ్ళపైనా నాకు అధికారం ఇవ్వు. వాటిని నేను సంస్కరిస్తాను. వాటికి ధార్మికతను నేర్పిస్తాను.”

దేవుడు నవ్వాడు: “నీ కోరిక ప్రకారమే జరుగుతుంది.”

సూర్యోదయమైంది. రోజు గడిచింది. సూర్యాస్తమయం అయింది. ప్రపంచమంతా ఆఖరి ప్రార్థనలు ముగించుకొని నిద్రపోయే సమయం అయ్యాక ఋషి, అడవిలో తన ఆశ్రమం బయట మంచెపై నిల్చుని పగుళ్ళని పిలిచాడు. దయతో కరుణతో నిండివున్న ఆ పిలుపును విన్న పగుళ్ళు– అవి వున్న వస్తువుల్లోంచి, పదార్థాలలోంచి తమను తాము సడలించుకొని విడిపడి అతని దగ్గరకి చేరాయి; చిన్నవి, పెద్దవి, సన్నటివి, వెడల్పాటివి, సూటివి, వంకరటింకరవి–అన్నిరకాల బీటలూ ఆ పచ్చికలోకి చేరాయి; రాళ్ళని చీల్చిన పొడుగాటి పగుళ్ళు, గోడలలో పాకివున్న నెర్రెలు, చెక్కముక్కలలో, కర్రపలకలలో, మట్టితో ఇటుకతో చేసిన పొయ్యిలలో, చంద్రమండలంపై లోయలంత లోతుగా పాకి వున్న ఆకుపచ్చటి పగుళ్ళు, వయొలిన్‌ల వొంటిపైన, వార్నిష్ పూతలోను కంటికి కూడా కనిపించని వెంట్రుకవాసి చీలికలు, ఆ పచ్చిక మైదానంలో ఇప్పుడు ఆ ఋషి ముందు మోకరిల్లి కూర్చున్నాయి.

విశ్వం నలుమూలలనుంచీ అన్ని రకాల పగుళ్ళు, చీలికలు, బీటలు, నెర్రెలు, నెరియలు అన్నీ వచ్చి చేరాక, ఋషి తన దయామమయమైన వాక్కుతో ఇలా అన్నాడు: “భగవంతుడి సృష్టి సంపూర్ణం. నిష్కళంకం. అలా లేకపోవడం అపరాధం. మీరు అన్ని పదార్థాల్లోకి చొరబడి, వాటిని చీలుస్తున్నారు, బీటలు వారుస్తున్నారు. ఎందుకని? మీ చీలిన దేహాల పోషణకోసం, మీ వంకరలు పెద్దవి చేసుకోడం కోసం. మీరు అలా పెరిగిపోతుంటారు, పెద్దయిపోతుంటారు. ఒక చిన్న చీలికగా మొదలై, అంతలోనే, వంకరటింకరగా పెద్ద పగులై, ఇంకాస్సేపటిలో నోరుతెరిచిన వ్రయ్యలై, మీరు పదార్థాల కలయికని, సంయోగాన్ని ధ్వంసం చేస్తారు. రాళ్ళు పగిలి వ్రయ్యలైపోతాయి, కొండలు విరిగి ముక్కలైపోతాయి. భూమిలో బలహీనమైన వేర్లకి వర్షపు నీరు అందకుండా చేస్తారు, పళ్ళలో రంధ్రాలై వాటిని కుళ్ళబెడతారు, పచ్చటి మానులలో తొర్రలు తొలుస్తారు. మీ దేహవాంఛలని వదలండి మిత్రులారా. మీ దేహం ఎలానూ వంకరటింకర శూన్యమే కదా?”

మంచు కురిసిన ఆ పచ్చిక మీద సాగిలబడివున్న పగుళ్ళన్నీ తదేకంగా ఋషి ప్రవచనాన్ని విన్నాయి. ఆపైన ఆ ఋషి వణుకుతున్న తన చేతిని ఎత్తి దీవించి వాటివాటి ఇళ్ళకు పొమ్మని పంపేశాడు. ఆ పగుళ్ళన్నీ, వాటి శూన్య శరీరాలని ఒద్దికగా వంచుకుని, మెల్లగా తిరుగుమార్గం పట్టాయి. అవి ఏ వస్తువుల్లో ఉండేవో అక్కడికే నిశ్శబ్దంగా చేరుకున్నాయి–పొయ్యిలో బీట పొయ్యిలోకి, కర్రలో నెర్రె కర్రలోకి, రాయిలో పగులు రాయిలోకి, చందమామలోని లోయ చందమామలోకి.

ఈ విధంగా, ప్రతీ రాత్రి తొమ్మిది గంటలకు, అంటే ఆఖరి ప్రార్థన చేసే సమయానికి విశ్వంలోని అన్ని పగుళ్ళూ ఆ ఋషి ముందు ఆ పచ్చికలో మోకరిల్లేవి. ఆ సమయంలో లోకం అంతా గొప్ప శాంతితో నిండి, ఏ పగుళ్ళు లేకుండా సంపూర్ణంగా ఉండడం రివాజయింది. చివరికి మనుషుల పుర్రెలలోని చీలికలు కూడా బైటపడి ఋషి దగ్గరకు చేరుకొనేవి. ఆలోచనలు ఆగిపోయేవి. లేనిపోని ఊహలు చీకాకు పెట్టకుండా ప్రజలంతా విశ్రాంతిగా నిద్రపోయేవారు. పగులు అనేది ఎక్కడున్నా సరే, ఆయన పిలుపుకి లొంగాల్సిందే. ఒకసారి, ఒక కొండ కనుమ దట్టమైన అడవుల గుండా ప్రయాణించి ఆయన సన్నిధికి తన బరువైన శరీరాన్ని ఈడ్చుకొంటూ వచ్చింది. ఋషి ఆ కనుమను, ‘నువ్వు ఇక రానక్కరలేదు, నిన్ను విడుదల చేస్తున్నాను. ఆ దేవుడు నీతో ఉండుగాక’ అని దీవించి పంపేశాడు.

తన విముక్తితో బాధపడిన ఆ కనుమ తిరిగి తన కొండలను చేరుకుంది. కానీ, ఆ రాత్రి అకస్మాత్తుగా కనుమలోని కొండదారి మూసుకుపోయిందని, ఆ చఱియలో ఉన్న ఒక గ్రామం నేలమట్టమయ్యిందని అందరూ చెప్పుకున్నారు. ఒక గంట గడిచాక కనుమ మళ్ళీ తెరుచుకున్నమాట నిజమే కాని, ఇక అక్కడ శిథిలాలు, శవాలు తప్ప ఏమీ మిగల్లేదు.

కథ చదవటం ఆపి తల ఎత్తి చూశాను. ఆ మూలనున్న మనిషి కాలు మీద కాలు వేసుకొని మోకాలిని అరచేతుల్లో వేళ్ళమధ్య వేళ్ళు జొనిపి పట్టకారులా పట్టుకొని శ్రద్ధగా వింటున్నాడు.

ఆ ఋషి ప్రతీ రాత్రి సమయానికి తన ప్రవచనం ముగించి, ఆలస్యం కాకుండా ఆ పగుళ్ళని పంపేసేవాడు. కానీ, ఒక రాత్రి అతని ప్రసంగం ఎప్పటిలా ఆగలేదు. ఒక ఉద్విగ్నభావధారలో మునిగిపోయిన ఆ ఋషి కాలాతీతమవుతోందని గుర్తించలేదు. కోడి ఒకసారి కూసింది. మరోసారి కూసింది. అతని ప్రసంగం అప్పటికీ ఆగలేదు. భూమి అంచుపై వేకువరంగు మెరిసే సమయానికి కాని ఋషి తన ప్రవచనం ముగించి చేయి ఎత్తి దీవించలేదు.

కానీ ఆలస్యం జరిగిపోయింది: అప్పటికే ఇక్కడా అక్కడా, దగ్గర్లోనూ దూరంగానూ వీధుల్లోనూ, దారుల్లోనూ జనసంచారం మొదలయింది. బండి చక్రాలు కదులుతున్నాయి; గిట్టల చప్పుళ్ళు, పాదాల తొక్కిసలాటలో నిద్ర లేచిన ప్రపంచం ఒళ్ళు విరుచుకుంటోంది. పగుళ్ళు వడివడిగా వీధులలో, దారులలో, సందులలో పాకుతూ వాటి గమ్యస్థానాలు చేరుకోవడానికి ప్రయత్నించాయి. ఎన్నో పగుళ్ళది దూరప్రయాణం. ఇంతలో, ఒక పగులు మీద ఒక బండిచక్రం పడింది, ఇంకో చీలిక మీద బూటు కాలు పడింది. భయంతో పగుళ్ళన్నీ దొరికిన చోటల్లా ఎలాగోలా సర్దుకుపోసాగాయి. ఒక కొండరాయిలోని పగులు వయొలిన్ లోకి దూరింది. అక్కడ ఉండాల్సిన చీలిక దారిన పోతున్న ఒక మనిషి పుర్రెలోకి చేరుకుంది. చందమామలో లోయలది అన్నిటికన్నా అతి దూర ప్రయాణం. అవి ఇక ఎప్పటికీ గమ్యం చేరుకోలేమన్న భయంతో అడ్డదిడ్డంగా పాకి కల్లోలాన్ని పుట్టించాయి. దానితో భయాందోళనలు ప్రబలిపోయాయి. చుట్టుముట్టుకుంటున్న బండిచక్రాలు, పాదాల తొక్కిసలాటనుండి తప్పించుకోవడం కోసం వేరే దారి లేక కొన్ని పగుళ్ళు ఒకటిగా కలిసిపోయి భూమి లోపలికి దిగబడిపోయాయి. దానితో భూమి బీటలు వారింది. ప్రజలు, వాహనాలు, గుర్రాలు అన్నీ ఆ పగుళ్ళలో పడిపోయాయి. పైనుంచి వినవస్తున్న ఈ కల్లోలంతో మరింత భయపడిన పగుళ్ళు భూమి లోలోపలికి ప్రయాణించసాగాయి. నేల ఆవులిస్తున్నట్టుగా మరింత వెడల్పుగా తెరుచుకోసాగింది. బీటలు లోపలికి పోయే కొద్దీ వాటిలో పడిపోతున్న గుర్రాలు, మనుషులు, వాహనాలు మట్టికింద కప్పబడిపోసాగాయి. మనుషుల కల్లోలం పగుళ్ళని మరింత భయపెట్టింది. పగుళ్ళ భయం మనుషులని మరింత సంక్షోభానికి గురిచేసింది. అది నిజంగా భూమి భయకంపితమైన దుర్దినం.

అడవిలో, దట్టమైన చెట్ల మధ్యలోంచి ఋషికి ప్రజల ఆర్తనాదాలు, శాపనార్థాలు, ప్రార్థనలు వినిపించాయి. ఆయన వణుకుతున్న చేతులని ఆకాశంవైపు ఎత్తి ‘ఓ ప్రభువా, నన్ను కనికరించు. చాచిన నా చేతులు అందుకో. నువ్వు ఇంతకుముందు ఇచ్చిన మాటప్రకారం, నన్ను స్వర్గానికి తీసుకొనిపో. ఈ భూమి నన్ను ద్వేషిస్తున్నది’ అని ప్రార్థించాడు.

చాలాసేపు అతని చేతులు అలా చాచబడే ఉన్నాయి, కాని చివరికి దిగిపోయి వేళ్ళు పిడికిలిగా బిగుసుకున్నాయి. అతను చుట్టూ చూశాడు. తెలుసుకున్నాడు– అతనిప్పుడు ఆ అడవికి స్నేహితుడు కాదు. పువ్వులు అతని చూపు పడకుండా అసహ్యంతో ముడుచుకుపోయాయి. పెద్ద పెద్ద చెట్లు తమ ఊడలని ఊపుతూ కోపంగా తల తిప్పుకున్నాయి. ఋషి చూపు ఒక దారి మీద పడింది. దారి సాగి బండి చక్రాల గుర్తులు కనిపించాయి. అవి మరికొంత దూరం సాగి ఒక వీధిలోకి కలిసిపోయాయి. ఆ వీధి పాడుబడిపోయివుంది.

ఇప్పుడు ఆ సాధువు ఒక క్రూరుడు, ధూర్తుడు, మహా పాపి.

కాగితాలు కిందపెట్టి, గదంతా కలియచూశాను. సగం తెరుచుకున్న నోళ్ళు కొన్ని, సాగి నవ్వుతున్న నోళ్ళు కొన్ని–పగుళ్ళలా. అలా సన్నగా సాగిన ఆ పగుళ్ళ లోంచి కలగాపులగంగా మాటలు బైటపడ్డాయి: ‘పర్లేదు’, ‘చాలా బాగుంది’, ‘కానీ, ఆ ముగింపే కాస్త… చప్పగా ఉందేమో.’

“కానీ అప్రస్తుతం కాని విషయం ఒకటి ఉంది.”

చుట్టూ ఉన్న కళ్ళను దాటుకుంటూ, నేను తలుపు దగ్గరగా ఆ మూలన కూర్చునివున్న గడియారం మనిషి వైపు చూశాను. పైదాకా గుండీలు పెట్టుకున్న ఆ పొడుగాటి ఫ్రాక్ కోటు పెదవులు విడివడి లేవు. మోకాలి చిప్పని కరుచుకున్న అతని సన్నటి వేళ్ళు పట్టు విడవలేదు. అతని నోరు తాళం పడ్డట్టు మూసుకునే ఉంది. నాకు మధ్యాహ్నం గుర్తుకొచ్చి మనసు మళ్ళీ ఏదోలా అయిపోయింది.

“ఇప్పటికే చాలా ఆలస్యమైనట్లుంది కదా? టైమెంతయిందో!” అన్నాను.

అతను మెల్లగా తన పట్టకారు చేతులను మోకాలినుంచి తీసి నిటారుగా నిలబడుతూ భావరహితంగా లోగొంతుకతో అన్నాడు: “1గంట 27నిమిషాలు.”

ఆ వెంటనే మర్యాదగా అందరికీ తల పంకించి, తలుపు తెరుచుకుని మాయమైపోయాడు.

‘అప్పుడే అంత రాత్రయిందా!’ చేతులు కోటు జేబుల్లోంచి గడియారాలు బయటకు తీశాయి: అవును, అయింది.

బై! గుడ్‌బై! కొన్ని పగుళ్ళు ఇంకా నవ్వుతూనే ఉన్నాయి. కొన్ని ఆవులిస్తున్నాయి.

3.

“నేను ఎడంవైపుకి వెళ్ళాలి, మీరూ…”

“నేనిటు.”

నడుచుకుంటూ మెయిన్ రోడ్ మీదకు వచ్చాను. వెన్నెల వెలుగులో అటూ ఇటూ చెట్ల నీడల మధ్యగా నేరుగా సాగిన ఆ రోడ్ నిర్మానుష్యంగా ఉంది. బెంచీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉన్నట్టుండి, ఎడం వైపున్న బెంచీ మీదనుంచి ఒక పొడుగాటి, సన్నటి ఆకారం కనిపించింది. మనిషి ఎవరో కనిపించకపోయినా ఆ కూర్చున్న భంగిమ తెలిసినదే. కాలి మీద కాలు, మోకాలి చిప్పలని కరుచుకున్న చేతులు, పెద్ద టోపీ అంచు మొహం కనిపించకుండా మీదకి లాక్కుని–అతనే! నా అడుగులు నెమ్మదించాయి.

“నీకోసమే ఎదురు చూస్తున్నాను”

అతని విగ్రహంలో ఏ మార్పూ లేదు. కదలకుండా కొద్దిగా భుజం కదిల్చి కూచోమనట్టుగా సైగ చేశాడు. అతని పక్కన కూర్చున్నాను. ఒక క్షణం పాటు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.

“ఈ సంగతి చెప్పు,” హఠాత్తుగా, ఏ హెచ్చరికా లేకుండా, తన మొఖం నా మొహానికి దగ్గరగా పెట్టి అడిగాడు. “ఋషి దగ్గరకి పోయిన పగుళ్ళలో ఒక పగులు–‘నేను’కు ‘నేను’కు మధ్య– ఎప్పటికీ పూడ్చలేనిది ఉందా? మనిద్దరినే తీసుకో, ఒకే బెంచ్ మీద కూర్చుని వున్నాం. మన తలల మధ్య దూరం కొన్ని అడుగులే కదూ? లేదూ కొన్ని మిలియన్ మైళ్ళా? నిజం కదూ? అన్నట్టు… నా పేరు లోవెనిక్స్, గాట్-ఫ్రీడ్ లో-వె-నిక్స్.” ప్రతీ అక్షరాన్ని ఒత్తి పలుకుతూ, నాకేదో సంకేతానిస్తున్నవాడిలా అన్నాడు.

ఇద్దరం బలంగా కరచాలనం చేసుకున్నాం.

“సరే. మళ్ళీ కథకొద్దాం. నీ కలెక్టర్ ఆఫ్ క్రాక్స్ కథకు సబ్‌టైటిల్ ఏంటీ? ‘ఎ ఫెయిరీ టేల్’ అని కదా?” అతని భంగిమ కొనసాగించాడు (కాలు మీద కాలు, అరచేతులతో మోకాలిని పట్టకారులా పట్టుకున్న చేతివేళ్ళు). “అంటే ఒక అభూతకల్పన.”

“అవును.”

“హ్మ్, ఒకవేళ వాస్తవం కడవలకొద్దీ కలల్లోకి వస్తే, అప్పుడు అవే–ఆ కలలే–వాస్తవాన్ని తనవిగా చేసుకుంటాయి కదా? నీకది అభూతకల్పన; కానీ నాకు అది ఒక ఒడంబడిక. ఒక ప్రోటోకాల్, ఒక సైంటిఫిక్ ఫాక్ట్. నిజంగానే నీ ఊహలన్నీ అయోమయం, నీ పదాలన్నీ అస్పష్టం. కానీ, అయోమయం అభూతకల్పన కాదు. నీ కన్‌ఫ్యూజన్ ఫాంటసీ కాదు. నేను కవిని కాను, అందువల్ల అభూతకల్పనను స్పష్టం చేయలేను. అప్పటికీ, అభూతకల్పన, లేదా భ్రాంతి అనేది పొగమంచు లాంటి కల్పన కాక సరూప్యమైన సత్యాల నుండి పుట్టిస్తే మరింత మెరుగ్గా ఉంటుంది కదా? కానీ, వాటిమీద నీకంత ఆసక్తి ఉండదేమో?”

“లేకేం. కావలసినంత ఉంది.”

“మొదట: భావంలో తప్పు జరిగింది. ఎ మిస్టేక్ ఇన్ ఎమోషన్. ఇది నవ్వులాటగా తీసుకోగలిగిన తప్పు కాదు. నీ నవ్వు కాదు నీ ‘నవ్వు’ నీ పగుళ్ళ ఇతివృత్తం నుంచి, అంటే నీ థీమ్ ఆఫ్ క్రాక్స్ నుంచి నిన్ను చీల్చేస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టుగా పట్టుకున్న కలం పాళీ మధ్యనున్న చీలికతో నువ్వు నీ ఇతివృత్తంతో ఆటలాడుకోవడం లేదు. ఆ థీమ్, ఆ ఇతివృత్తమే నీతో, నాతో, మనందరితో, అంతటితో ఆడుకుంటోంది.” అతని చెయ్యి ఒక పెద్ద సున్నా చుట్టింది. ఆ చేతి వెనకగా, మా కాళ్ళ ముందు ఉన్న నేలను, అటుపైన వీధిలో చెట్లను, ఆకాశంలో నక్షత్రాలను, ఇంటి పై కప్పులను, తిరిగి కింద నేలను గమనించాను. “అవును, ఇదంతా, కనిపిస్తున్నదంతా ఒక పెద్ద ఖాళీ చీలికలో ఎప్పుడో ఇరుక్కుంది. అవును. ది థీమ్ ఆఫ్ ది క్రాక్స్. దీని లోతుల్లోకి పోతే ఏముందో నీకు తెలుసా? అందరిలాగానే నువ్వూ స్థలాన్ని వదిలి ఊహించలేవు. ఎవరినన్నా అడుగు. పగుళ్ళంటే బండరాళ్ళల్లో చెక్కముక్కల్లో రోడ్లూ బిల్డింగుల్లో ఇలా వస్తువుల్లో స్థలాల్లోనే చెప్తారు. కానీ, నీ ఊహను హద్దులు దాటించి–కవిత్వం అలానే కదూ పుట్టేది?–పగుళ్ళని అంగుళాలలో కాకుండా క్షణాలలో కొలిస్తే, స్థలం లోని చీలికలను కాకుండా కాలం లోని చీలికలు కొలిస్తే అప్పుడు…”

“నాకు సరిగా అర్థం అవటం లేదు…” గొణిగాను.

“ఎవరికీ ఇది పూర్తిగా అర్థం కాదు.” గాట్‌ఫ్రీడ్ లోవెనిక్స్ నా మాటకి అడ్డు పడ్డాడు. “అదే మంచిది. పూర్తిగా అర్థం కాకపోవటమే మంచిది. ఇంతకీ, నీకీ ఊహ ఎప్పుడు వచ్చింది?”

“సరిగ్గా గుర్తులేదు. ఎలా దూరిందో నా కలం లోకి. రెండు మూడునెలలైందనుకుంటా”

లోవెనిక్స్ చిన్నగా నవ్వాడు: “ఆహా!నేను ఈ పగుళ్ళ రాజ్యంలోనే పదమూడేళ్ళుగా బతుకుతున్నాను. ఊహూఁ, ఇది నాకు జానపద కథలో దొరకలేదు. పదమూడేళ్ళక్రితం సైకోఫిజియాలజీలో ప్రయోగాలు చేశాను. శారీరక మానసికానుభవాల మధ్య సంబంధాలను పరిశోధిస్తూ, మనుషుల దృశ్యావలోకన ప్రక్రియ అధ్యయనం చేస్తుండగా జరిగిందది. మన చూపులో ఉన్న చీలికల గురించి అప్పుడే తెలిసింది. అది నిరంతరాయమైనది కాదు. అది ఒక అవిచ్ఛిన్న రేఖ కాదు.

ఉదాహరణ చెప్తాను, విను. నువ్వొక కార్‌లో ఉన్నావు. ఇంజన్‌ సిలిండర్‌లలో పిస్టన్స్ పైకీ కిందకీ కదులుతుంటాయి సిలిండర్‌లో ఒత్తిడి పెంచి గాసోలీన్ విస్ఫోటనానికి దారి తీస్తాయి. ప్రతీ విస్ఫోటనానికి మధ్య కొంత ఖాళీ అంటే విరామం ఉంటుంది. అది లోపల జరిగేది. నువ్వు బయటనుంచి చూస్తున్నప్పుడు కారు చక్రం మాత్రం నిరంతరాయంగా తిరుగుతూ కనిపిస్తుంది. మనం ఏది చూసినా ఇలాగే. మన కన్ను చూస్తున్న వస్తువు ఏదైనా చూస్తున్నంతసేపూ నిరంతరాయంగా ఒక కాంతిరేఖలా మన కంట్లో పడుతున్నట్టే ఉంటుంది. కానీ, నా అనుమానం నాది. ఒక విద్యుత్ దీపం నుండి వచ్చే మెరుపు క్షణంలో యాభైవేలవవంతు సేపు వెలుగుతుంది. కాని, అది మన కంటిలో క్షణంలో ఏడవవంతు సేపు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏడవవంతు మెరుపులు, వాటిమధ్య ఏడవవంతు విరామంతో మన కంట్లో పడ్డప్పుడు మనం ఆ మెరుపును ఒక పూర్తి క్షణం పాటు నిరంతరాయంగా ఉన్నదని అనుకుంటాం. కాని అవి సెకెండులో 7/50000 వంతు మాత్రమే మెరుస్తున్నాయి. ఇంకోలా చెప్పాలంటే, సెకెండులో 49993/50000 సేపు చీకటి ఉంది. కానీ ఆ చీకటినీ మనం వెలుగు అనే భావిస్తున్నాం. నీకు అర్థం అవుతోందా? ఇప్పుడు ఆ క్షణాన్ని నిమిషంగా, నిమిషాన్ని గంటగా, గంటని సంవత్సరంగా, శతాబ్దిగా చూడు, ఆ లిప్తపాటు మెరిసి మాయమైపోయిన మెరుపు దీపాన్ని సూర్యుడిగా చూడు. సూర్యుడిని రోజులో తొంభైతొమ్మిది శాతం కక్ష్యలోంచి తప్పించేసినా, మనం సూర్యుడు లేడని గుర్తించలేం. చీకట్లోకి నెట్టేయబడ్డా కూడా ఊహాసూర్యుడి మాయపగలులో ఆనందంగా బతికేస్తాం.

నిన్ను విసిగిస్తున్నానా ఏం?”

“లేదు. లేదు.”

“ఈ విషయంలో నా ఆలోచనలు అంతకుముందు జరిగిన ప్రయోగాల మీదే ఆధారపడ్డాయి. సినిమా ప్రొజెక్టరు ఎలా పనిచేస్తుందో అందరికీ తెలిసిందే కదా. ప్రొజెక్టరు క్షణానికి పదహారు బొమ్మలను తెర మీద చూపెడుతుంది. ఒక బొమ్మని మన కంటికి చూపించి, మరో బొమ్మని తెరమీదకి తెచ్చే వ్యవధిలో, తెరమీద బొమ్మ తొలిగిపోయి మరో కొత్త బొమ్మ ఇంకా పడని ఆ సమయంలో మన కంటి ముందు ఏమీ లేకపోయినా కన్ను ఏదో ఉన్నదనే అనుకుంటుంది. చూడనిది చూసినట్టుగా భావించబడుతుంది.

“తొందరపడి నేను దీన్ని సిద్ధాంతీకరించలేదు. చాలా ప్రయోగాలు చేశాను. ప్రొజెక్టర్ బల్బుముందు ఒక చిన్న డిస్క్ తిరుగుతూ ఉంటుంది. అది ప్రొజెక్షన్‌ను తెరమీద పడకుండా ఆపే మూత లాంటిది. దాని మీద ఒక సన్నని చీలిక, ఒక కిటికీలాగా ఉంటుంది. ఆ చీలిక ప్రొజెక్టర్ బల్బ్ ముందరికి వచ్చినప్పుడల్లా అందులోంచి కాంతి తప్పించుకొని తెరమీద పడుతుంది. ఇలా క్షణానికి పదహారు సార్లు ఆ చీలిక ప్రొజెక్టర్ బల్బు ముందుకు వస్తూ ఉంటుంది, పదహారు బొమ్మలని తెరమీద పడనిస్తుంది. ఒక రెగ్యులేటర్ సాయంతో దాని వేగాన్ని మనం నియత్రించ వచ్చు. నేను అదే చేశాను. లాబరేటరీలో కొంతమంది ప్రేక్షకులకి సినిమా చూపిస్తూ, అందులో కొన్నిచోట్ల నేను దాని వేగం తగ్గించి బొమ్మకు బొమ్మకు మధ్య విరామం కొంత పెంచాను. నాకు గానీ, ప్రేక్షకులకి గానీ తేడా ఏమీ తెలియలేదు.

దీంతో నాకు ఇంకాస్త ధైర్యం వచ్చింది. ఆ విరామాన్ని రెండు మూడు చోట్ల మరింత పెంచాను. అయినా సరే, నేను తప్పించి ఇంకెవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. అంతేకాదు, నా ప్రయోగంలో ప్రేక్షకులకు–ఫిజిక్స్ చదువుకుంటున్న పిల్లలు–వారినుంచి ఏం ఆశించానో కూడా వారికి తెలీదు. మనందరం కూడా అంతే కదా, సూర్యుడి వెలుగు చేసే ప్రయోగాలలో మననుంచి ఏం ఆశించబడుతున్నదో మనకు మాత్రం తెలుసా?

సరే, ఈ విజయంతో మరింత ఉత్సాహం వచ్చి, ఆ చీలికని మరో రెండింతలు పెంచాను. అవి కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఒకరిద్దరు మాత్రం, ఏదో స్క్రీను మిణుకు మిణుకుమంటున్నదన్నారు. ఒకడు బొమ్మల మధ్య ఖాళీ ఉన్నట్టుందన్నాడు. చాలా మామూలు విద్యార్థిలా కనిపించే ఒక్కడు మాత్రం నన్ను ఆశ్చర్యపరిచాడు. అతను కూడా ఈ విరామాన్ని గమనించాడు. ‘జీవితంలో కూడా ఇలానే అవుతుందిగా?’ అన్నాడు. అందరూ నవ్వడంతో సిగ్గుపడి అతను మరింకేం మాట్లాడలేదు. కొద్దిరోజుల తర్వాత అతన్ని అనుకోకుండా కలిశాను. అప్పుడు మళ్ళీ ఈ సంగతి అతన్ని అడిగితే, అతను ఏదో ఇరుకున పడ్డవాడిలా మొహం పెట్టి, అసలు విషయం చెప్పాడు. చిన్నప్పుడే ఒకటి రెండు సార్లు, ప్రపంచం తన కళ్ళ ముందు నుంచి మాయం అయిపోవడం చూశాడట. అది ఒక క్షణంకాలం మాత్రమే ఉండినా, అతను అప్పుడు అపస్మారకంగా కానీ, మత్తులో కానీ, సుషుప్తిలోగానీ లేడు. శుభ్రంగా మామూలుగానే ఉన్నాడు, అందుకని అదేమీ అప్పుడప్పుడు జరిగే, మూర్ఛ లాంటిది కాదని అన్నాడు. అతను మెడిసిన్ చదువుతున్నాడు కూడానూ. మళ్ళీ అలాంటి అనుభవం ఈ మధ్యకాలంలో జరిగిందా అని అడిగాను. ‘అవుతుంది, కానీ అప్పటిలా ప్రపంచం అంతా స్మృతినుంచీ, దృష్టినుంచీ పూర్తిగా జారిపోదు. అది మసకబారుతూ ఉంటుంది అప్పుడప్పుడూ, వస్తువులన్నీ కంటినుంచి దూరంగా జరిగిపోతూ చిన్నవైపోయి, మళ్ళీ కళ్ళముందు పెరుగుతూ కాస్సేపటికి స్పష్టంగా అన్నీ యథాతథంగా ఉంటాయి’ అన్నాడు.

ఆ సంభాషణ పూర్తికాకపోయినా అది నాలో సుళ్ళు తిరగడం మొదలెట్టింది. రకరకాల ప్రతిపాదనలు ఆలోచించాను. గుండె కొట్టుకోవడంలో వ్యాకోచించడానికీ, సంకోచించడానికి మధ్య ఒక ఖాళీ ఉన్నప్పుడు, సూర్యకాంతిలో మాత్రం ఎందుకుండకూడదు? అప్పటినుంచీ సూర్యుడిని నీడలా వెంటాడటం మానలేదు. పన్నెండేళ్ళయ్యింది, ఒక్కరోజు, ఒక్క క్షణం కూడా వదలకుండా వెన్నాడుతూనే ఉన్నా, నీలాకాశంలో పొడుచుకొచ్చే ఆ పచ్చటి గోళం గురించి. సూర్యుడిలో నల్లటి మచ్చల గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ, సూర్యుడే గ్రహాలపై చీకటి ప్రసరించే నల్లటి మచ్చ అని ఎందరికి తెలుసు? కొన్ని సందర్భాలలో, మిట్టమధ్యాహ్నంపూట, ఒక క్షణమాత్రం నల్లటి రాత్రి పొడుచుకురావడాన్ని నేను చూశాను. సూర్యుడినుంచి భూమిని తాకుతున్న కిరణాలు వాయిద్యం మీది తీగలలా బిగువుగా, బిగుసుకుని, క్రమక్రమంగా సన్నబడిపోతూ, మసకబారిపోతూ, ఉన్నట్టుండి తెగిపోయి నల్లటి చీకటి. ఒక్క క్షణం. తరువాత అంతా మామూలే, అదే నీలాకాశం, అదే సూర్యుడు, అదే భూమి.

రాత్రి ఎక్కడికీ పోదు, గమనించావా? మిట్ట మధ్యాహ్నం పూట కూడా. అనంతమైన ముక్కలుగా, అది అన్నిచోట్లా దాక్కొని ఉంటుంది. ఒక చెట్టు ఆకు ఎత్తి చూడు. దానికింద దాక్కుని ఉన్న చీకటి వీచిక ఒకటి తటాలున వేరులోకి పాకిపోయి తలదాచుకుంటుంది. ఎటుచూసినా– నడవాల లోపల, గోడల వెనుక, ఆకుల కింద–రాత్రి, ముక్కలైపోయి పీలికలుగా తచ్చాడుతూ ఉంటుంది. సూర్యుడు పడమటికి వాలగానే, ఈ పీలికలన్నీ, అన్ని చోట్ల నుంచి–ఆకుల వెనకాలనుంచి, సందుగొందుల నుంచి, మారుమూలల నుంచి, కొండ చఱియలనుంచి–మెల్లగా పాక్కుని వచ్చి, ఒకదానితో ఒకటి అల్లుకుపోయి రాత్రిని నేస్తాయి. మిట్ట మధ్యాహ్నం అప్పుడు కూడా ఈ చీకటి పీలికలు రాత్రిని అల్లడానికి చేసే కనికట్టు ఇది. కళ్ళముందు కనిపించే ఈ రాత్రి భౌతికం. ఇలాంటిదే ఇంకొక రాత్రి ఉంది–ఇది అధిభౌతికం–అది మన ఇంద్రియ ప్రపంచాన్నే కాక అతీంద్రియ ప్రపంచాన్ని, ఆత్మను కూడా కనికట్టు చేస్తుంటుంది. ఇదంతా తత్వచింతన. కానీ ఆ రోజుల్లో నాకు మూకవుమ్మడి సూత్రాలంటే భయంగా ఉండేది. నా లేబరేటరీలోని ప్రయోగ ఫలితాలకు, వాటిని ప్రపంచానికి అన్వయించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి, మధ్య ఉన్న ఒక పగులును నేనెప్పుడూ దాటలేకపోయాను.

“పుటాకార, కుంభాకార కటకాలతో, కళ్ళ లోలోపలికి చూడగలిగే ఆప్థాల్మోస్కోపులు, మన కళ్ళు రంగులు ఎలా చూస్తాయో పరిశోధించి ఎవాల్డ్ హెరింగ్ తయారు చేసిన కలర్ డిస్కులు, రకరకాల ఫిల్ములతో, ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను అప్పట్లో. అనుకోకుండా…”

లోవెనిక్స్ సుతారంగా చేతివేళ్ళు విరుచుకున్నాడు. “అవును, అనుకోకుండా…” అంటూ ఉన్నట్టుండి చెవి రిక్కించాడు. వెన్నెల పరుచుకున్న చీకటి రోడ్డు మీద ఉన్నట్టుండి ఇద్దరు వ్యక్తుల ఆకారాలు కనిపించాయి, వాళ్ళ నీడలు వాళ్ళకంటే ముందుగా పరచుకుంటూ. ఆ నీడల వెనకగా వాళ్ళూ వెళ్ళిపోయారు మౌనంగా.

“నీడలతో నడిపించబడుతున్నారు!” గుసగుసగా నాతో గొణిగి, మళ్ళీ మొదలెట్టాడు.

“అప్పుడు నేను ఆమె ప్రేమలో పడిపోయాను. అదంతా ఎలా జరిగిందో ఇప్పుడు తెలీదు కానీ, ఆకులు రాలే కాలం అది. ఇంకా నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. కదంబపత్రాలు, అదే, కడిమి చెట్ల ఆకులు ఊదా, బంగారు రంగుల్లోకి మారి ఉన్నాయి. 1గంట 30నిమిషాలకు ఆమెని కలవాలి. ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుడదని చకచకా నడుస్తున్నాను. ఇంకా ఒక మలుపు తిరగాలి. ఆ మలుపులో, పదడుగుల దూరంలో పొడుగాటి కడిమి చెట్టు నీడ దారంతా పరుచుకుని ఉంది. ఆ క్షణం నా మెదడులో చెక్కినట్టుగా శాశ్వతంగా ముద్రపడిపోయింది. నేను పీకలోతు ప్రేమలో ఉన్నానప్పుడు. ఆ నీడ పది, ఐదు, మూడడుగుల దూరంలోకి వచ్చేసరికి… నేను ఆ నీడ మీద నా అడుగు వేశానో లేదో, ఏదో వినాశనం జరిగింది. ఒక్కసారిగా, నా అడుగు పడి తోకతొక్కిన తాచులా ఆ నీడ సుళ్ళు తిరుగుతూ పైకిలేచింది. పైకి, ముందుకి, కుడి, ఎడమ, పూనకం వచ్చినదానిలా ఊగుతూ నల్లగా ఆకాశంలోకి ఎగిసింది. అన్నిటినీ చుట్టుముట్టింది–దారిని, సూర్యుడిని, చెట్లని, ప్రపంచాన్ని, సర్వస్వాన్ని, నా ‘నేను’ని కూడా. శూన్యం. మరుక్షణంలో, పచ్చటి రిబ్బనులా రోడ్ మీద ఇసక తిరిగి కనిపించింది, దానిపైన అల్లుకున్నట్టుగా అటూ ఇటూ ఉన్న చెట్ల నీడలు, పైన నీలంగా ఎప్పటిలా ఆకాశం. అందులో పచ్చటి గోళం. అది కన్నుగీటి తెరవగానే ఆ క్షణం ముందున్నవన్నీ మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి. కానీ, ఏదో ముఖ్యమైంది మాత్రం తిరిగిరాలేదు. అది నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ శూన్యంలో ఏదో చిక్కుకుపోయి మరలి రాలేకపోయింది.

యాంత్రికంగా ఒక అడుగు ముందుకేశాను. కానీ ఎక్కడికి? గుర్తుకొచ్చింది. కానీ వెంటనే కాదు, అప్రయత్నంగానూ కాదు. నా గుండెలో నేను అంతకు ముందెరగని శూన్యం వంటి భావన. ‘ఆమె’ గురించి అంతా స్పష్టంగా గుర్తుకువచ్చింది. ఆమె మాటలోని వణుకు, కనుబొమ్మల రెపరెపలు అన్నీ. ఆమె నాకోసం ఆ మలుపుకి అవతల ఎదురుచూస్తుంటుందని తెలుసు. కానీ, ఆమె నాకు ఎందుకు అవసరమో నాకు అర్థం కాలేదు. మిగిలిన అందరిలానే ఉంటుంది, నాకు పూర్తిగా భిన్నంగా ఉండే ఆమె నాకు ఎందుకు? ఆ నల్లటి చీలిక, తను మింగేసిన వాటన్నిటిని తిరిగి కక్కేసింది, ఒక్కటి తప్ప: నా గుండెలోంచి ఒక చీలిక ఏదో, సృష్టి అంతటితో పాటు ఆ చీకటిలోకి వెళ్ళిపొయింది. అన్నీ తిరిగివచ్చాయి కాని నా చీలిక మాత్రం తన గమ్యం చేరలేదు. సూర్యుడు వెలుగుతున్నాడు, భూమి తిరుగుతోంది. కానీ ఆ చీలిక నేను పోగొట్టుకున్న దాన్ని మింగేసింది.

నాకు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది. చెవురు గింగురుమంటున్నాయి, అడుగులు తడబడుతున్నాయి. దగ్గరలో ఒక బెంచిమీద కూర్చున్నాను. అనాలోచితంగా జోబు లోంచి పాకెట్‌వాచ్ తీసి చూశాను: 1గం. 27ని.

“ఇంకా మూడు నిమిషాలే ఉంది, ఆమెను కలవడానికి. నన్ను నేను సంబాళించుకుంటూ లేచి నిలుచున్నాను, యాంత్రికంగా పార్కు గేటు వైపు నడిచాను–నా ‘నేను’లో ఇప్పుడు ఎవరూ లేరు, ఖాళీ. వరసగా ఉన్న ఇళ్ళ మధ్యలోనుండి యాంత్రికంగా నడుస్తూ, షాపుల అద్దాల్లో నాకు ఏ మాత్రం అవసరం ఆసక్తి లేని వస్తువల్ని చూస్తూ, ఎత్తైన హోర్డింగుల మీద కనిపించిన అక్షరాలతో అర్థం లేని పదాలను తయారు చేస్తూ. అనుకోకుండా ఒక పెద్ద వాచీ బొమ్మ కనిపించింది. చూసి కదిలిపోబోయాను కాని, ఆ వాచి ముళ్ళు నా కళ్ళలో గుచ్చుకుని నన్ను కదలనివ్వలేదు, చూపు తిప్పుకుందామని ప్రయత్నిస్తుండగా, అప్పుడు గుర్తుపట్టాను, ఆ గడియారం మీద పెయింట్ చేసి ఉన్న సమయం– 1గం. 27ని. నా సమయం!

అప్పటినుండీ గడియారాల ముఖాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నన్ను నేను మరిచిపోవాలంటే రద్దీ నిండిన వీధుల్లో చకచకా కాసేపు నడిచిరావడం నాకు అలవాటు. కానీ అడుగు అలా బైటపెట్టగానే చచ్చిపోయిన గడియారపు ముఖాలు, శాశ్వతంగా ఆగిపోయిన ముళ్ళతో నన్ను చుట్టుముట్టేవి. అన్నిటిలోనూ, సమయం: 1గం. 27ని. చూడకుండా తలతిప్పుకు పోదామని ప్రయత్నించేవాడిని. కాని, నీలం, నలుపు, పసుపు రంగుల అంచులతో తెల్లటి ముఖంపైన గీసిన ఆ నల్లటి ముళ్ళు నా కళ్ళలోకి పొడుచుకొచ్చేవి. అడుగు బైటపెట్టకుండా నా గదిలోనే దాక్కున్నాను. అయినా లాభం లేకపోయింది. నిద్రలో కూడా ఆ గడియారం బొమ్మలు నన్ను వదిలిపెట్టలేదు. ప్రతీరాత్రి ఒకే కల–జనసంచారం లేక చచ్చిపోయినట్టుగా ఉన్న వీధులు, మూసేసిన షాపులు, దించేసిన షట్టర్లు, ఆర్పివేసిన దీపాలు. ఒంటరిగా ఆ వీధులగుండా, గోడలపైన గీసిన తెల్లటి గోళాలు, వందలు వేలు, ఆ తెల్లటి ముఖాలపై అవే అంకెలు, వాటిని అక్కడే పొడుస్తూ నల్లటి ముళ్ళు అదే భంగిమలో– 1గంట 27నిమిషాలు, 1గంట 27నిమిషాలు, 1గం. 27ని.

అప్పుడు తెలిసింది కాదు, చాలా కాలం వరకూ నాకు అర్థం కూడా కాలేదు. ప్రతీ గడియారపు బొమ్మలో ముళ్ళను అలానే గీయడానికి ఆ చిత్రకారుల చేతులని ఏ శక్తి నడిపిస్తోంది? ప్రాబబిలిటీని బట్టి చూస్తే, గడియారంలో సమయం చూపించడానికి ఉన్న కాంబినేషన్లన్నిటినీ లెక్కకడితే, 720 గడియారం బొమ్మల్లో, ఒక్కదానిలో మట్టుకు 1:27 అనే సమయం ఉండాలి. కానీ, నువ్వు కూడా ఈ పాటికి గమనించే ఉంటావు కదా, పదింట ఏడిట్లో…”

“యెస్! నేనూ గమనించాను. దీనికి మీ వివరణ తెలుసుకోవాలని ఉంది.”

నా సహవాసి ఏమీ మాట్లాడలేదు. తల పూర్తిగా దించుకొని, ఏదో జ్ఞప్తికి తెచ్చుకుంటున్నవాడిలా దీర్ఘాలోచనలో మునిగిపోయున్నాడు.

తెల్లారగట్ల వీచే చల్లగాలి, చెట్లని అటూ ఇటూ ఊపి, వాటి నీడలను మళ్ళీ మా కాళ్ళముందు పరచింది. లోవెనిక్స్ తన ధ్యానం నుంచి బయటకొచ్చాడు.

“ఆఁ, అదంతా ఆ తర్వాత వదిలేశాను. నా లాబరేటరీలో పరికరాలు, పుస్తకాలు ఎందుకూ పనికిరాకుండాపోయాయి. ఆ ఇరుకైన లాబరేటరీ గది నన్ను బంధించలేకపోయింది. అంతవరకూ గది పైకప్పు వరకే వెళ్ళగలిగిన నా ఆలోచనలకిక ఆకాశమే హద్దయింది. నాకర్థమైనంత వరకు అసలు సమస్య ఏమిటంటే–సముద్రంలా, తనలోకి తనను లాక్కొనే క్షణాలు జీవుడికీ ఉంటాయి. జీవుని ఎరుక రెండు రకాలుగా వ్యక్తమవుతుంది – ‘నేను’, ‘అది’. ‘నేను’కు తన ఎరుక ‘నేను’గానే తెలుస్తుంది. ‘నేను-కాదు’ అన్న ఎరుక మాత్రం ‘అది’గా తెలుస్తుంది.

ఒక సంగతి అడుగుతా చెప్పు. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నేను చెప్పే ఈ మూడు నిరంతరాయ స్థితులలో నువ్వున్నావా? ఒకటి: ‘నేను’, ‘అది’ అనే ఎరుక ఉన్న స్థితి; రెండు: ‘నేను’ అనే ఎరుక మాత్రమే ఉన్న స్థితి; మూడు: ‘నేను అనే ఎరుకలో అది అనే ఎరుక’ ఉన్న స్థితి. ఏమిటి గందరగోళంగా ఉందా? వివరంగా చెప్తాను విను. ఈ విశ్వం నానుండి దోచుకోబడ్డ క్షణంనుండీ, రవినీ భువినీ మింగేసేలా విస్తరించగల ఒక పగులు-చీలిక నా అస్తిత్వంలో ఏర్పడ్డ దగ్గరనుండీ, ఈ విశ్వంపై నాకు అనుమానంగానే ఉంది. గ్రహాల కక్ష్యలు తడబడవనీ, వాటి సూర్యుళ్ళ కాంతి నిరవధికంగా ప్రసరిస్తూనే ఉంటుందనీ నాకు నమ్మకం పోయింది. చీకట్లోకి జారిపోవడం అరుదుగానే జరుగుతుందనకో, దాని గురించి తెలిసినవాళ్ళు కూడా అంత అరుదుగానే ఉంటారు. కానీ ఆ చీలిక తెరిచిన ఉపద్రవం మాత్రం ఎప్పుడూ మూసుకుపోదు. అది ప్రతిక్షణం ఈ ప్రపంచాన్ని కబళించడానికి ఆవులిస్తూనే ఉంటుంది. ఈ చీలిక వల్ల రెండుగా చీలిపోయింది నేనొక్కడినే కాదు. నువ్వు కూడా. కాదూ? జెర్మన్ కవి హెన్రిక్ హెయ్‌నీ ఏమన్నాడు? ఒక మహాప్రపంచపు గాయపు చీలిక ఒకటి నా హృదయంలోకి దూసుకొని వచ్చింది–అని కదూ. అతను కవి, తనది కేవలం మెటఫర్ అనే అనుకున్నాడు. అలా కాక…”

లోవెనిక్స్ ఉన్నట్టుండి ఆగిపోయి, చేయి చాచి చూపించాడు. “చూశావా?”

అతని మాటల్ని శ్రద్ధగా వింటూ, నేను పరిసరాలు గమనించలేదు. రాత్రి గడిచిపోయింది, వేకువ ఆకాశానికి, భూమికి మధ్య ఎర్రటి చీలికలా విచ్చుకుంటోంది. నిదానంగా అది పెద్దదవుతోంది, చుక్కలు వాటి కాంతి రేఖలని వెనక్కి తీసేసుకుంటున్నాయి. రాత్రి చూరుల్లోకి, బొక్కసాలలోకి నల్లటి నీడల పీలికలైపోయి సర్దుకుపోయింది. సమస్తం గోచరమవుతోంది–మొదట అంచులతో, ఆ పైన రంగులతో.

“ఇంక నేను వెళ్ళాలి.”

లోవెనిక్స్ నావైపు తిరిగాడు. అప్పుడుగాని అతని మొహాన్ని నేను పరిశీలనగా చూడలేదు. కొద్దిగా ఉబ్బిన బుగ్గలు, కోసుకుపోయిన గాయంలా ఉన్న అతని నోరు సానబెట్టి, మెరుస్తున్నట్టు ఉంది. అతని తీక్షణమైన కళ్ళల్లో ఎప్పటికీ మాసిపోని జీవకళ ఉట్టిపడుతోంది. అలాంటి మొహాన్ని, ఆ మండే కళ్ళనీ ఎవరి చరితార్థ జీవితపు ఆత్మకథలోనో ఒక పుటలోని చిత్రపటంగా చూసినట్టు అనిపించింది. (తర్వాత ఎప్పటికో కాని లోవెనిక్స్ నాకు జర్మన్ శాస్త్రవేత్త, తత్వవేత్త అయిన గాట్-ఫ్రీడ్ లీబ్నిజ్‌ లాగా స్ఫురించలేదు.)

“కానీ, మీరు చెప్తున్నది ముగించలేదు?”

“ముగించడం ఎవరికీ సాధ్యం కాదు. నేను చెప్పేది ఇదే: కాలం ఒక తెగని దారం కానప్పుడూ, అస్తిత్వం అవిచ్ఛిన్నమైనది కానప్పుడూ, ఈ ‘సంపూర్ణ విశ్వం’ సంపూర్ణం కాక అసంగతమైన ముక్కలుగా పగుళ్ళతో విరగకొట్టబడినదే అయినప్పుడూ ఇంకేం మిగిలింది? నిన్ననూ రేపునూ కలుపుతూ, మనకొక బాధ్యతను ఆపాదిస్తూ మనకు నీతివర్తనం నేర్పే ఆ పుస్తకాలలోని ప్రవచనాలు మిగలవు. ఏ నీతులూ ధర్మాలూ మిగలవు ఒక్కటి తప్ప. ఒక్క చీలికన్యాయం తప్ప. ఇదిగో ఇదే అది: చీలికను దాటుకొని వచ్చేసిన నేను ఆ చీలికలో మిగిలిపోయిన, వదిలివేసిన, లేదా వేయబడిన దేనికీ కూడా బాధ్యుణ్ణి కాను. నేను ఇక్కడ ఉన్నాను, నేను చేసినదంతా అక్కడ ఉంది. ఈ రెండూ రెండు వేర్వేరు కిటికీలు కూడా లేని ప్రపంచాలలో ఉన్నాయి. ‘కృతమేగాని కర్త్యవ్యంబు లేదు.’ ఇది నేనెప్పుడో కనుగొన్నాను. నీకు అర్థం అయ్యిందా?”

“అయింది.”

“ఆ మలుపు చివర్లో నాకోసం వృథాగా ఎదురుచూసిన ఆమెని నేను అక్కడే వదిలేశాను, ఒక్కమాట కూడా లేకుండా. ఆ తర్వాత ఆమె రాసిన ఉత్తరాలని కూడా నేను తెరిచి చూడకుండా తిప్పి పంపించేశాను. ఓ రోజు పేపర్లో ఆమె పేరు కనిపించింది (ఆమె పేరు సోఫియా, అవును. సో ఫి యా). బాల్కనీలోంచి దూకింది. చనిపోయేముందు ఉత్తరం కూడా ఏమీ రాయలేదు. అయినా, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను?”

మొహం తిప్పుకున్నాడు, అతని గుండ్రటి భుజాలు, అతని నల్లటి టోపీ అంచులు మాత్రం నాకు కనిపిస్తున్నాయి. టోపీ అంచు కొద్దిగా వణికింది.

“ఏమయ్యింది?”

“ఏం లేదు. ఊరికే… అయామ్ సారీ.”

అతను లేచి నిల్చున్నాడు. అతనితోపాటే నేనూ లేచాను.

“ఇంతకీ, గడియారం బొమ్మల గురించి మీరు చెప్పనే లేదు?”

“అవును కదా, మరోసారి చూద్దాంలే.”

అతని చెయ్యి వదలలేదు నేను.

“మరోసారి? ఎప్పుడో అది?”

అతను ఏదో సందిగ్ధంలో ఉన్నట్టు, ఏమీ అనలేదు.

“ఇది మీది, నాది కాదు” అని నా కథ అతని చేతిలో పెట్టాను.

థాంక్స్ చెప్తున్నట్టు నీరసంగా నవ్వి, అతని అడ్రస్ చెప్పి, చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఆ బెంచ్ మీద కూలబడ్డాను. పొద్దెక్కుతోంది, జనాలు వస్తూ పోతూ ఉన్నారు. దుమ్మురేపుతూన్న గిట్టలు. చక్రాల ఇనుప కచ్చడం కింద కంకర రాళ్ళ చెకుముకి మెరుపులు.

నేనూ వెళ్ళాలి. కాని అక్కడే తచ్చాడాను. సూర్యుడి మీద, భూమి మీద, నా మీద కూడా ఏదో తెలియని అపనమ్మకం నా శరీరాన్ని కమ్ముకుంది. నేను ఒక్క అడుగు వేసినా–సూర్యుడు, రాళ్ళు రువ్వుతున్న మెరుపులు, మన మిథ్యాహంకారాల పొరల కింద విశాలంగా పరుచుకున్న సమస్త భూప్రపంచం నుండి కాలిమట్టి వరకూ, సర్వస్వమూ ఒక్కసారిగా చీకటిలోకి కుంగిపోయి–ఈ ఉదయం వాగ్దానం చేస్తున్న రోజు ఇక ఎప్పటికే రాదేమో అన్న భయం కలిగింది.

4.

చాలా రోజులపాటు కలెక్టర్ ఆఫ్ క్రాక్స్‌ను కలవడానికి సాహసించలేకపోయాను. కానీ, గడియారం బొమ్మలు నన్ను ఊరుకోనివ్వలేదు. ఆ నల్లటి గడియారం చేతులు, వాటి మాయని ఛేదించేదాకా నన్ను వదిలిపెట్టవు.

లోవెనిక్స్ గది ఆరో అంతస్తులో ఉంది. చిట్ట చివరి మెట్ల వంపులో, ఒక చీకటి అటకలాంటి గది అది. నేను వెళ్ళేసరికి ఆ గది ఖాళీగా ఉంది. గాట్ఫ్రడ్ లొవెనిక్స్ ఇప్పుడక్కడ లేడు, ఎటో వెళిపోయాడు. కాని, ఎక్కడికి? ఆ ఇంటి యజమానితో చాలాసేపు మాట్లాడి రాబట్టగలిగిన సమాచారం అల్లా ఒక చిన్నపల్లెటూరి పేరు. అతన్ని వదలడం ఇష్టంలేక వెంటనే, అతని పేరు, ఊరి పేరు మాత్రం ఎడ్రసులో రాసి, ఒక ఉత్తరం పోస్టు చేశాను. అతన్ని ఆ ఉత్తరం చేరుతుందా? ఏమో! చాలా రోజులపాటు సమాధానమేమీ రాలేదు. బహుశా అతనికి ఉత్తరం అందలేదేమో అనుకున్నాను. కానీ, ఒకరోజు, ఇంక ఎదురుచూసి ప్రయోజనం లేదనే నిర్ణయానికి వచ్చేసేక, పోస్ట్‌మాన్ ఒక బూడిద రంగు కవరు నా చేతిలో పెట్టాడు. కవరు చింపి, ఉత్తరం బయటకి తీశాను.

డియర్ సర్,

మీకు చెప్పకుండా పారిపోయిన నన్ను క్షమిస్తారని ఆశిస్తాను. నేనొక తిక్క మనిషిని. మీ కథని, మీ ఉత్తరాన్ని ఇప్పుడు చదివాక మిమ్మల్ని అలా ఒదిలేసి రావడం తప్పని తెలుసుకున్నాను. ఏదీ కాకపోయినా కనీసం ఒక థీమ్ మనలను కలిపింది కదా. ముందు, ఆ గడియారం బొమ్మల గురించిన మీ ఆతృత తీరుస్తాను. వాటిలో ప్రత్యేకమైన మిస్టరీ ఏమీ లేదు. సముద్రం ఆటుపోట్లు ప్రతీరోజు నిర్దిష్టమైన సమాయనికే, ఒక్క క్షణం కూడా తేడా లేకుండా ఎలా వస్తాయో, అలాగే, జీవి ‘ఉనికి’కి ఉండే ఆటుపోట్లకి కూడా (అది రోజువారి ఘటన కాకపోయినప్పటికీ) ఒక కచ్చితమైన సమయం ఉండి తీరాలి కదా? మన వివేకం, మన బాహ్యచేతన ముతకగా, మొరటుగా ఉంటుంది. అది ఇంత సూక్ష్మమైన సృష్టి నియతిని గమనించలేదు. కానీ అవ్యక్తచేతన–తాత్వికుడిదైనా, గడియారపు బొమ్మలు వేసే చిత్రకారుడిదైనా–అది అతి సూక్ష్మమైనది. దానికి అన్నీ తెలుసు. గడియారం బొమ్మ గీసేటప్పుడు చిత్రకారుడికి సమయం ఎంతని చూపాలా, ముళ్ళు ఎక్కడ ఉంచాలా అన్నది ముఖ్యం కాదు. కానీ అతని చేతుల్లోంచి ప్రవహిస్తున్న అతని అవ్యక్తచేతన (అన్‌కాన్షస్) అది చాలా ముఖ్యం. ప్రతీసారీ, ప్రతీచోటా అది ‘తన’ సమయాన్ని, అవ్యక్తచైతన్యపు సమయాన్ని, చెరిపివేయబడ్డ బాహ్యచైతన్యపు సమయాన్ని, శూన్యతలు మాత్రమే మిగిలిన సమయాన్ని–చిత్రిస్తుంది. ఆ బొమ్మల కిందనుంచి నడిచిపోయే మనుషులెవరూ ఆ బొమ్మల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలుసుకోలేరు. ఎప్పటికీ. ఇది మీరూ నేనూ మాత్రమే గమనించగలిగాం.

ఇప్పటివరకూ నేను గమనించినవి, నా ఊహలు ఆలోచనలు, అన్నీ దీన్నే ధృవపరుస్తున్నాయి. ఇకముందు నేను శూన్యంతో చెయ్యబోయే ప్రయోగాలలో, సరిగ్గా ఈ సమయమే నన్ను గమ్యానికి చేరుస్తుంది.

భవదీయుడు,
జి. లోవెనిక్స్

నేను వెంటనే అతనికి ధన్యవాదాలు తెలుపుతూ, అతని ఊహలను మెచ్చుకుంటూ ఉత్తరం రాశాను. ఒక విద్యార్థిలా అతను చేయబోయే ప్రయోగాల గురించి కుతూహలంతో అడిగాను. అతను, ఆ కలక్టెర్ ఆఫ్ క్రాక్స్, రాసిన రెండో ఉత్తరంలో, నన్ను తన యంగ్ ఫ్రెండ్ అని సంబోధిస్తూ, ఇప్పుడు అతని ఆలోచన ఫార్ములాలు, నీతి సూత్రాల పరిధి దాటి ఒక కొత్త దశ ప్రారంభం అయ్యిందని చెప్పుకుంటూ వచ్చాడు.

నీ కథలో శారీరిక మానసికానుభవాల మధ్య ఉన్న ఆంటలాజికల్ అంతఃసూత్రం నాకు ఇప్పుడే అర్థం అవుతోంది. సరళరేఖలో ఉండే ఏ బిందువూ ఆ రేఖలో భాగం కాదు. ఆ బిందువు ఆ రేఖను అక్కడ విరగకొడుతున్నది. ది పాయింట్ ఆన్ ఎ లైన్, ఇన్ ఫాక్ట్, పంక్చర్స్ ఇట్ వేర్ ఇట్ ఈజ్. మీ కవులు మసకమసకగానే చూస్తారు, కానీ సత్యాన్ని వెంటనే చూస్తారు. మాలాంటి తాత్వికులు స్పష్టంగా చూస్తారు, కాని దానికి సమయం పడుతుంది. అంచలంచలుగానే మేము చూడగలం. డెకార్తె రాసిన మెడిటేషన్స్ నేను మళ్ళీ చదువుతున్నాను. అందులో అతను ఈశ్వర సంకల్పం గురించి అద్భుతంగా చెప్తున్నాడు: ‘విధాత పని సృష్టిని కొనసాగించటం కాదు, సరికొత్తగా సృష్టించడం–.’ డెకార్తె వాదనని పొడిగించి ఇలా చెప్తాను నేను. ‘–ఏ సృష్టి అయితే ప్రతిక్షణం, శూన్యంలోకి పడి అంతమవుతున్నదో; ప్రతిక్షణం, సరికొత్తగా సమూలంగా సూర్యుడినుండి ఇసుకరేణువు వరకు సృష్టించ బడుతున్నదో, ఆ సృష్టిని సరికొత్తగా ఈశ్వర సంకల్పశక్తితో సృష్టించడం.’ అయితే, ఈ సరికొత్త సృష్టితలాల మధ్య శూన్యం ఉంటుందన్నది స్పష్టం. ఒక సరళరేఖలో బిందువు లేని చోటు అది. అదిగో ఆ శూన్యంలోనే మన నల్లటి పగుళ్ళ సామ్రాజ్యం ఉండేది.

మీ కవుల్లో ఒకరు, చాలా కాలం క్రితం ఆ నరకంలోకి, ఆ మృతుల సామ్రాజ్యం లోకి వెళ్ళాడు. ఇప్పుడింక తత్వవేత్త కూడా వెళ్ళాలి.

నా ప్రయోగాల వివరాలని ఉత్తరంలో చెప్పడానికి కుదరదు. నీకు వీలున్నప్పుడు ఒకసారి ఇక్కడకి రా, సమక్షంలో మాట్లాడుకుందాం. అయినా, ఇప్పుడు మాటల సమయం కాదు, ఆ పగుల్లోకి చొచ్చుకుపోవాల్సిన సమయం వచ్చేసింది.

నా సిద్ధాంతపు ప్రత్యేకత ఇది: గోడమీద గడియారం బొమ్మకి తెలిసిన సత్యం మనుషులకి తెలియదు. ఎందుకని? వారి అస్తిత్వాన్ని చీల్చేస్తున్న పగులు అక్కడితో ఆగక ఆ అస్తిత్వపు ‘ఉనికి’ని కూడా మింగేస్తుంది. మళ్ళీ అస్తిత్వంలోకి వచ్చిపడ్డాక, వాళ్ళకి ఒక క్షణం ముందు వాళ్ళ ఉనికి లేదనే సత్యం ఎరగరు. అతి కొద్ది మంది మాత్రం ఆ పగులు నుంచి బైటకు రాలేరు. వారివల్లనే తిరిగివచ్చిన వారు భయంతో ఏదో కీడు శంకిస్తారు. వాళ్ళ గురించి ప్రపంచం ‘గుర్తు తెలీని ప్రదేశంలో మరణించి’నట్టుగా చెప్తుంది, కానీ ప్రతీ క్షణంలోనూ మనలో ప్రతీ ఒక్కరికోసం ఆ ‘గుర్తు తెలీని మరణ ప్రదేశం’ పొంచి చూస్తోందని వీరికి తెలియదు.

ఆ చీకటి మాయనుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అది నోరు తెరచి ఆవులించినప్పుడు, మన అస్తిత్వపు ‘ఉనికి’ని దానికి అర్పించకుండా ఉండడం. ఆ చీకటి ఆవులింత ఎప్పుడు రాబోతున్నదో, కచ్చితంగా నిమిషాలు క్షణాలతో సహా గుణించి తెలుసుకున్న మనిషి, సరిగ్గా ఆ సమయంలో సంకల్ప శక్తితోనూ, విశ్వాస బలంతోనూ అస్తిత్వం లేని ‘ఉనికి’లో ఉండి తనను తాను కాపాడుకుంటాడు. అలా చెయ్యగలిగిన మనిషి మరణంలోకి సజీవంగానే ప్రవేశిస్తాడు. దీనికి మహాకవి దాంతే రాసిన త్రిపదలు సరిపోవు. సిద్ధాంతాలు ప్రతిపత్తులూ కావాలి. కవి ప్రతీకలు, పదచిత్రాలతో మాత్రమే చెయ్యగలిగినదాన్ని, తాత్వికుడు ఆలోచనతో మాత్రమే సాధించగలగాలి.

నా లెక్కలు నన్ను మోసం చెయ్యవు, నా విశ్వాసం కూడా నన్ను వంచించదు. ప్రయోగానికి సిద్ధపడాల్సిన రోజు దగ్గరలోనే ఉంది.

భగవదానుగ్రహం నాపట్ల ఉందని ఆశిస్తూ

జి.ఎల్.

అతని ఉత్తరం నన్ను కలవరపెట్టింది. ఆ వారం ఇంకే ఉత్తరమూ రాలేదు. బ్యాగ్ సర్దుకొని రైలు ఎక్కాను, తెల్లవారుజామున నా ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ.

5.

పన్నెండింటికి చేరాల్సిన ట్రైను గంట లేటయ్యింది. నా సంచి స్టేషనులో వదిలేసి, ఊర్లో లోవెనిక్స్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. ఎత్తైన ప్రహరీగోడలో పొదిగిన ఆ ఇంటి తలుపు నెట్టినప్పుడు నా గడియారం సమయం 1గం. 45ని. అని చూపించింది. ఆ గోడ వెనక పెరడు, పెరటికి అటువైపు చిన్న ఇల్లు, దానికి మూడు కిటికీలు. ఎవరూ లేరు. ఇంటి తలుపు వారగా తెరిచి ఉంది. మెల్లగా తలుపుమీద తట్టాను. ఎవరూ పలకలేదు. తలుపు నెట్టి తెరిచి లోపలికి వెళ్ళాను.

ముందున్న గదిలో పుస్తకాలు తప్పించి ఇంకేం లేవు. గొంతెత్తి లోవెనిక్స్‌ని పిలిచాను, కాని జవాబు లేదు. ఆ గదిలోంచి మరో గదికి తలుపుంది, ఆ తలుపు సందులోంచి చూశాను. అక్కడ ఒక మేజాబల్లపై అతను తల వాల్చి వున్నాడు. చేతికుర్చీలో కూర్చొనివున్న అతని నుదురు టేబిలు మీదకు ఆనివుంది, చేతులు వదులుగా కుర్చీలోంచి కిందకి వేలాడుతున్నాయి.

అతన్ని పిలిచాను. మౌనం. ఇంకా గట్టిగా పిలిచాను. మళ్ళీ మౌనమే. లోపలకి వెళ్ళి అతని భుజం గట్టిగా ఊపుతూ పిలిచాను. అతని తల పక్కకు వాలిపోయింది. జీవం కోల్పోయిన గాజు గోళీలాంటి కంటిలో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక భయానక దృశ్యపు ఆనవాలు. వాలిన అతని తలకింద నొక్కుకుపోయి, చిన్న చిన్న అక్షరాలతో రాసిన ఒక నోటుపుస్తకం. ఇంకా పూర్తిగా చల్లబడని అతని తలను పైకెత్తి ఆ నోటు పుస్తకం తీసుకున్నాను. చివరి పేజీలో ఉన్న వాక్యాల్ని తొందర తొందరగా పరిశీలించాను. ఆ చివరి వాక్యాలు ఇంకా తడి ఆరలేదు. దాన్ని నా జేబులో కుక్కుకుని, ఒక్కో తలుపూ గట్టిగా వేసుకుంటూ బయటకి వచ్చేశాను. అంతా నిర్మానుష్యంగా ఉంది.

ఇంకో గంటలో నేను మళ్ళీ ట్రైన్లో కూలబడివున్నాను.


లోవెనిక్స్ నోటు పుస్తకంలో ఉన్న ఈక్వేషన్లు, ఫార్ములాలు నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ, ఒకటి మాత్రం అర్థం అయ్యింది: నా జానపద కథ పూర్తి అయింది. నేను లొంగిపోయాను. కానీ, లోవెనిక్స్ కాదు. అతని తత్త్వాన్వేషణ దాహం తీరేది కాదు. వాటికి పన్నికలు, యుక్తులు కావాలి, భావనలు కావాలి. నావి, నావి కానివి, రాసినవి, రాయనివి అన్నీ కావాలి. ప్రపంచంలోని ప్రతి అభూతకల్పన ఆ దాహాగ్నిలో సమిధలు కావాలి.

అలా కాకూడదు. నిన్న రాత్రి, నాకు సంక్రమించిన ఆ చీలికన్యాయం వారసత్వాన్ని అగ్నికి ఆహుతి చేశాను. పన్నికలకు, భావనలకు శెలవు.

కల్పన తన ప్రతీకారం తీర్చుకుంది.

(1927)