మంటో కథలు: సహాయ్

“ఒక లక్షమంది హిందువులూ ఒక లక్షమంది ముస్లిములూ చచ్చిపోయారని అనకు… రెండు లక్షలమంది మనుషులు చచ్చిపోయారను! ఈ రెండు లక్షలమంది చనిపోవడంలో గొప్ప విషాదం ఏమీ లేదు. విషాదం ఎక్కడుందీ అంటే ఆ చంపినవాళ్ళూ, చచ్చినవాళ్ళూ ఎవరి ఖాతాలోకీ జమ కాకపోవడంలో ఉంది. లక్షమంది హిందువులని చంపి ముస్లిములు హిందూ మతాన్ని తుడిచిపెట్టాం అనుకొనుండచ్చు, కానీ అది బతికే ఉంది, బతికే ఉంటుంది. అలానే, లక్షమంది ముస్లిములని చంపి ఇస్లాము ఖతమైందని హిందువులు బాకాలు ఊదుకోనుండొచ్చు, కానీ నిజం మీ కళ్ళముందుంది… ఇస్లాము మీద కనీసం సన్నటి గోటి గీత కూడా పడలేదు. తుపాకులతో, కత్తులతో మతాలని చంపవచ్చనుకునేవాళ్ళు మూర్ఖులు. మతం, ఆచారం, వ్యవహారం, ధర్మం, నమ్మకం, విశ్వాసం… ఇవ్వన్నీ మన ఒంట్లో ఉండవు. మన మనసులో ఉంటాయి… కత్తులు, చాకులు, తుపాకుల వల్ల ఇవెప్పుడు నాశనమవ్వాలి?”

ముమ్తాజ్ ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మేం ముగ్గురం వాడిని ఓడ ఎక్కించడానికి వచ్చాం. వాడు మమ్మల్ని విడిచి పాకిస్తానుకి వెళ్తున్నాడు ఏదో వేరే పని కోసమనే వంకతో–ఎన్నాళ్ళకని వెళ్తున్నాడో, ఎందుకని వెళ్తున్నాడో తెలీదు. పాకిస్తాను అనేది ఉందో లేదో, ఎక్కడుందో ఎలా ఉంటుందో, దాని ఉనికి కూడా మాకు తెలీదు.

మేం ముగ్గురం హిందువులం. పంజాబు పడమటి ప్రాంతాల్లో ఉంటున్న మా చుట్టాలు చాలామంది ప్రాణాలూ ఆస్తులూ పోగొట్టుకున్నారు. దాని ప్రభావమే అయుండాలి, ముమ్తాజ్ మాకు దూరంగా వెళ్ళిపోతుండడం. కొన్ని రోజుల ముందు జుగల్‌కి లాహోర్ నుండి ఉత్తరం వచ్చింది, మతకలహాలలో వాళ్ళ బాబాయి చనిపోయాడని. వాడిని ఆ సంఘటన బాగా దెబ్బతీసింది. ఆ దెబ్బ ప్రభావమే అనుకుంటాను, ఒకరోజు మాటల్లో ముమ్తాజ్‌తో అన్నాడు: “మన బస్తీలో అలాంటి అల్లర్లే జరిగితే నేనేం చేసుండేవాడినా అని ఆలోచిస్తున్నాను.”

ముమ్తాజ్ అడిగాడు: “ఏం చేసుండేవాడివి?”

జుగల్ చాలా నెమ్మదిగా స్పష్టంగా జవాబిచ్చాడు: “ఆలోచిస్తున్నాను. ఎక్కువ తటపటాయించకుండానే నిన్ను చంపేసుండేవాడిని!”

ఇది విని ముమ్తాజ్ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాడు. వాడి మౌనం అలా ఎనిమిది రోజులు సాగింది, ఉన్నట్టుండి ఈ రోజు నాలుగుంబావుకి ఓడ ఎక్కి కరాచీకి పోతున్నానని చెప్పినదాకా.

మా ముగ్గురిలో ఎవ్వరితోను ముమ్తాజ్ ఈ ప్రయాణం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని, జుగల్‌కి బాగా నమ్మకం, ‘ఆలోచిస్తున్నాను. ఎక్కువ తటపటాయించకుండానే నిన్ను చంపేసుండేవాడిని!’ అని తనన్న మాటలే ముమ్తాజ్ ప్రయాణానికి కారణం అని. నిజంగా గుండెలు మండే కోపంలో అయినా సరే తను ముమ్తాజ్‌ను చంపగలడా? జుగల్ ఈ విషయం గురించి అప్పణ్ణుంచీ ఆలోచిస్తూనే ఉన్నాడు. అందరిలోకీ వాడికే ముమ్తాజ్ బాగా దగ్గర. అందుకనే ఈరోజు వాడేమీ మాట్లాడకుండా ఉన్నాడు. వింతేంటంటే, ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని ముమ్తాజ్ ఆ పూట ఒకటే వాగడం మొదలుపెట్టాడు. ఓడ ఎక్కబోయే కొన్ని గంటల ముందు అది మరీ ఎక్కువైంది.

అసలు, పొద్దున్న లేస్తూనే వాడు తాగడం మొదలుపెట్టాడు. ఏదో విలాసయాత్రకు వెళ్తున్నట్టే హడావిడిగా సామానులు సర్దుతూ సర్దిస్తూ… వాడే మాట్లాడతాడు, వాడే నవ్వుతాడు… వాడిని ఎవరైనా చూస్తే బొంబాయి ఒదిలిపోవడానికి సంబరపడుతున్నవాడిలా ఉన్నాడు. కాని, మా ముగ్గురికీ అర్థం అవుతూనే ఉంది వాడు మమ్మల్ని మభ్యపెడుతున్నాడని. వాడు తన మనసులో ఏముందో మాకు తెలీకుండా దాచిపెట్టేందుకు పైకి ఇలా నటిస్తున్నాడు.

వాడిలా చెప్పాపెట్టకుండా ఉన్నట్టుండి పెట్టుకున్న ఈ ప్రయాణం గురించి వాడితో మాట్లాడాలని నేను అనుకున్నాను. జుగల్‌ని కూడా కదిలించి చూడమని చెప్పాను. కానీ ముమ్తాజ్ మాకు సందు దొరకనివ్వలేదు.

జుగల్ ఇంకో మూడు నాలుగు పెగ్గులు తాగి మరింత గమ్మునైపోయి, పక్క గదిలోకి వెళ్ళి పడుకుండిపోయాడు. ముమ్తాజ్ చాలా బిల్లులు కట్టవల్సి ఉంది. డాక్టర్లకి ఫీజులు ఇవ్వవలసి ఉంది. లాండ్రీ నుండి బట్టాలు తెచ్చుకోవాల్సి ఉంది. ఈ పనులన్నీ నవ్వుతూ చేసుకుంటున్నప్పుడు నేను, బ్రిజ్‌మోహన్ ముమ్తాజ్‌తో పాటే ఉన్నాం. కానీ సందు చివర హోటల్ పక్కన ఉన్న కిళ్ళీకొట్టువాడి దగ్గర పాను తీసుకున్నప్పుడు మాత్రం వాడి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అక్కడి నుండి వచ్చేస్తూ, బ్రిజ్‌మోహన్ భుజం మీద చేయి వేసి చిన్నగా అన్నాడు: “గుర్తుందా, బ్రిజ్! పదేళ్ళ క్రితం మన పరిస్థితి ఏమీ బాలేనప్పుడు ఈ పాన్ షాప్ గోవిందు మనకి ఒక రూపాయి అప్పిచ్చాడు.”

దారంతా ముమ్తాజ్ ఇంకేమీ మాట్లాడలేదు. కాని, ఇంటికి వెళ్తూనే మళ్ళీ ఆపకుండా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఆ కబుర్లకు తలా తోకా లేదు. అయినా సరే, హాయిగా చెప్తున్న ఆ కబుర్లకు నేనూ, బ్రిజ్‌మోహన్ తెగ నవ్వాం. ఇంతలో బయలుదేరే సమయం వచ్చింది. జుగల్ కూడా లేచి వచ్చి కలిశాడు మాతో. టాక్సీ ఒక్కసారి ఓడరేవు వైపుకు మళ్ళేసరికి అందరం గమ్మునైపోయాం. ముమ్తాజ్ కళ్ళు బైటకు చూస్తూ బొంబాయిలో ప్రతీ గల్లీకి, చౌరస్తాకూ వీడ్కోలు చెప్తున్నట్టున్నాయి. టాక్సీ చివరికి పోర్టుకు చేరుకుంది. పోర్టు నిండా కిక్కిరిసిన జనం. వేలమంది రెఫ్యూజీలు వెళ్తున్నారు. కానీ వారిలో ఆస్తిపరులు చాలా కొద్దిమందే కనిపిస్తున్నారు. ఎక్కువ మంది ఏ దిక్కూ లేనివాళ్ళే అక్కడ. అంతమంది ఉన్నా, నాకు ముమ్తాజ్ ఒంటరిగా ఒక్కడే వెళ్తున్నట్టు అనిపించింది. మమ్మల్ని వదిలేసి వాడు ఎప్పుడూ కనీ వినీ ఎరుగని ఊరికి వెళ్తున్నాడు. ఆ ఊరు కొంతకాలానికి పరిచయం కావచ్చు, కొత్తదనం పోవచ్చు, కానీ ముమ్తాజ్‌కు అది ఎప్పటికీ పరాయిదే. నా ఆలోచనలే ఇవన్నీ. ముమ్తాజ్ మనసులో ఏముందో నేను చెప్పలేను.

సామాను మొత్తం కాబినులోకి చేరిపోయింది. ముమ్తాజ్ మమ్మల్ని ఓడ డెక్ పైకి తీసికెళ్ళాడు. అక్కడ నుంచి దూరంగా ఆకాశమూ సముద్రమూ కలిసిపోయి కనిపిస్తున్నాయి. ముంతాజ్ చాలాసేపు అటే చూస్తూండిపోయాడు. వాడు జుగల్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు: “చూశావా, ఇది కళ్ళు చేసే కనికట్టు. ఆకాశం, సముద్రం ఎప్పటికీ కలవవు. కానీ కలిసినట్టు కనిపిస్తాయి. ఇది నిజం కాకపోయినా ఎంత హాయిగా ఉంటుంది, ఇవి అలా కలిసినట్టుండడం!”

జుగల్ ఏమీ అనలేదు. అతడికి ఆ క్షణాల్లో కూడా ఇదే మాట తొలిచేస్తూ ఉండుండచ్చు: “ఆలోచిస్తున్నాను. ఎక్కువ తటపటాయించకుండానే నిన్ను చంపేసుండేవాడిని!!”

ముమ్తాజ్ ఓడలో ఉన్న బార్ నుండి బ్రాందీ తెప్పించాడు, పొద్దుటినుంచీ తాగుతున్నది అదే కాబట్టి. మేము నలుగురం చేతుల్లో గ్లాసులు పట్టుకొని రైలింగుకి ఆనుకొని నుంచున్నాం. రెఫ్యూజీలు కిటకిటలాడుతూ ఓడ ఎక్కుతున్నారు. నిలకడగా ఉన్న సముద్రం మీద నీటికొంగలు చక్కర్లు కొడుతున్నాయి.

జుగల్ ఉన్నట్టుండి గ్లాసు ఎత్తి ఉన్నదంతా ఒక్కసారి ఖాళీ చేశాడు. చేసి, చాలా నిజాయితీ నిండిన గొంతుతో అన్నాడు: “నన్ను మన్నించు, ముమ్తాజ్… నిన్ను ఆ రోజు బాధపెట్టినట్టున్నాను నా మాటలతో…”

ముమ్తాజ్ కాసేపు ఆగి, జుగల్‌ని అడిగాడు: “నువ్వా మాటలు–ఆలోచిస్తున్నాను. ఎక్కువ తటపటాయించకుండానే నిన్ను చంపేసుండేవాడిని!–అన్నప్పుడు నువ్వు నిజంగా అలానే ఆలోచించావా? నీ మంచి మనుసుతో నువ్వు తీర్మానించుకున్నది అదేనా!”

జుగల్ అవునన్నట్టుగా తల ఊపాడు: “…అందుకే కష్టంగా ఉంది.”

“నువ్వు నన్ను చంపితే నాకింకా కష్టంగా ఉండేది.” ముమ్తాజ్ నిదానంగా అన్నాడు: “కానీ అదే విషయం మీద నువ్వు కొంచెం ఆలోచించి ఉంటే నీకు తెలిసేది నువ్వు ముమ్తాజ్‌ని, ఒక ముస్లిమ్‌ని, ఒక స్నేహితుణ్ణి కాదు చంపేసింది, నువ్వు చంపేసింది ఒక మనిషిని, అని. వాడొక దగుల్బాజీ అయినా సరే. నువ్వు చంపింది నీకు నచ్చని వాడి దగుల్బాజీతనాన్ని కాదు, వాడినే. వాడు ఒక ముసల్మాన్ అయితే నువ్వు వాడిలోని ముసల్మానీని చెరిపివేయలేదు. వాడి జీవితాన్నే చెరిపివేశావు. అతడి శవం ముస్లిముల చేతికి దొరికితే శ్మశానంలో ఒక సమాధి ఎక్కువయేది. కానీ ప్రపంచంలో ఒక మనిషి తక్కువైపోయేవాడు.”

కాసేపు మౌనంగా ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోయి, వాడే మళ్ళీ మాట్లాడ్డం మొదలుపెట్టాడు, “నా మతస్థులు నన్ను మతం కోసం ప్రాణం ఇచ్చిన వీరుడని పొగడొచ్చేమో. కానీ ఖుదా కీ కసమ్, వీలైతే నేను సమాధిని చీల్చుకొని అరవడం మొదలుపెట్టేవాడిని- ‘నాకీ వీరత్వపు సన్మానాలు వద్దు… నేను రాయని పరీక్షలకు డిగ్రీలు నాకక్కర్లేదు…’ అని. లాహోరులో మీ బాబాయిని ఒక ముస్లిము చంపాడని విని నువ్వు బొంబాయిలో నన్ను చంపేస్తావు… చెప్పు, నీకూ నాకూ పతకాలెందుకివ్వాలి? లాహోరులో మీ బాబాయిని చంపినవాడికి, మీ బాబాయికి ఏ కోటలు కట్టించాలి? నేను మాత్రం ఒకటే చెప్తాను. చచ్చినవాళ్ళు కుక్కచావు చచ్చారు, ఏ కారణమూ లేకుండా. చంపినవాళ్ళు ఏ ఉపయోగమూ లేకుండా ఊరికే చేతులకు రక్తం అంటించుకున్నారు. అంతే.”

మాట్లాడుతూ మాట్లాడుతూనే ముమ్తాజ్‌లో ఆవేశం పెరిగింది. కాని, వాడి ఆవేశంలో నిజాయితీ కూడా ఉంది. నా మనసులో వాడన్న ఒక మాట సుళ్ళు తిరిగింది: “తుపాకీలతో, కత్తులతో మతాలని చంపచ్చనుకునేవాళ్ళు మూర్ఖులు… మతం, ఆచారం, వ్యవహారం, ధర్మం, నమ్మకం, విశ్వాసం… ఇవ్వన్నీ మన ఒంట్లో ఉండవు… మనసులో ఉంటాయి… కత్తులు, చాకులు, తుపాకీల వల్ల ఇవెప్పుడు నాశనమవ్వాలి?”

నేను వాడితో అన్నాను: “నువ్వు చెప్పేది సరిగ్గానే ఉంది.”

ఇది విని ముమ్తాజ్ తన ఆలోచనలను స్పష్టం చేసుకుంటున్నట్టుగా, దవడలు బిగించి అన్నాడు: “కాదు. ఏదీ సరిగ్గా లేదు. నా ఉద్దేశ్యంలో ఇప్పుడు జరుగుతున్నది ఏదీ సబబు కాదు. నేనే బహుశా చెప్పాలనుకుంటున్నది సరిగ్గా చెప్పలేకపోతున్నట్టున్నాను… మతం అంటే నా ఉద్దేశ్యం ఈ మతం, ఈ ధర్మం, మనలో నూటికి తొంభైమంది పడి నలిగిపోతున్న ఈ చట్రం కాదు. నాకు ఇదంటే కోరిక లేదు. నా కోరిక దాని కోసం, ఏది ఒక మనిషిని ఇంకో మనిషి నుండి వేరు చేసి హెచ్చుతగ్గుల్లో ఉంచదో అది… ఏది ఒక మనిషిని నిజంగా మనిషి అని నిరూపిస్తుందో అది… కానీ అదేంటి? చిక్కేంటంటే నేను దాన్ని చేతిలో పెట్టుకొని చూపించలేను.”

చెప్తున్నప్పుడు వాడి కళ్ళల్లో ఒక సన్నటి మెరుపు మెరిసింది. వాడు తనలో తనే మాట్లాడుకుంటున్నట్టుగా అన్నాడు: “కానీ అతడిలో ప్రత్యేకత ఏముందని? ఖాస్ బాత్ ఏమీ లేనివాడు. హిందూ మతం అంటే దురభిమానం ఉన్నవాడు. అతడు చేసే పని కూడా అసహ్యమైంది. అయినా కూడా అతడి మనసులో ఆ వెలుగు ఎలా ఉండేది?”

నేనడిగాను: “ఎవరిది?”

“ఒక బ్రోకరుది.”

మేము ముగ్గురం ఉలిక్కిపడ్డాం. ముమ్తాజ్ అన్నతీరులో నాకేమీ అమర్యాద కనిపించలేదు నాకు. అందుకని అడిగాను మళ్ళీ: “ఒక బ్రోకరుది?”

ముమ్తాజ్ అవునంటూ తలూపాడు. “నాకు వింతగా ఉంటుంది అతడు ఎలాంటి మనిషో తలుచుకుంటే. ఇంకా వికారం అనిపిస్తుంది అతను చేసే పని చూస్తే. అతనొక ఆడవాళ్ళ బ్రోకరు. తార్పుడు పనిలో బతికే మనిషి. కానీ అతని మనసు ఎంత స్వచ్ఛంగా ఉండేది!”

ముమ్తాజ్ కొద్దిసేపు ఆగిపోయాడు, పాత విషయాలేవో మనసులో మననం చేసుకుంటున్నట్టు… కొన్ని నిమిషాలు గడిచాక మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు: “అతడి పూర్తి పేరు నాకు గుర్తు లేదు… ఏదో సహాయ్ అనుకుంటా… బనారస్‌ నుంచి వచ్చాడు. మనిషి ఎప్పుడు చూసినా శుభ్రంగా ఉండేవాడు. అతడుండే చోటు చాలా చిన్నగా ఉండేది కానీ చక్కగా ఉండేది. కర్టెన్లు వేలాడుతుండేవి. మంచాలూ బల్లలూ ఉండేవికావు కాని, దిండ్లు, పరుపులు వేసి ఉండేవి. దుప్ఫట్లూ, గలేబులూ ఎప్పుడూ అప్పుడే ఉతికి తొడిగినట్టు ఉండేవి. నౌకరు ఉండేవాడు కానీ, ఇల్లంతా అతనే శుభ్రం చేసుకొనేవాడు. అదొక్కటే కాదు, ఏ పని అయినా సరే, అలానే… ఏదైనా మీదపడితే తప్పుకుపోయేవాడు కాదు. దగా, మోసం చేసేవాడు కాదు… రాత్రి బాగా పొద్దుపోయినాక నీళ్ళు కలిపిన మందు అమ్మేవాళ్ళు షాపుల వాళ్ళు. అది కొనబోతే, అది అసల్ మాల్ కాదు, డబ్బులు పాడుచేసుకోకండి అని చెప్పేవాడు. ఎవరి గురించయినా అతడికి అనుమానాలు ఉంటే దాచేవాడు కాదు, నేరుగా మొహం మీదే చెప్పేవాడు… అసలు సంగతేంటంటే, ప్రతి పదిలోను రెండున్నర లెక్కన కమీషను తీసుకుంటానని, అతడు మూడేళ్ళల్లో ఇరవై వేలు సంపాదించాడని, ఇంకో పదివేలు సంపాదించాలని అతడు నాకు చెప్పటం. పదివేలే ఎందుకో, ఇంకా ఎక్కువ ఎందుకు వద్దో తెలీదు… ముప్ఫై వేలు కాగానే బనారసుకి వాపస్ వెళ్ళిపోతానని, అక్కడ బట్టల కొట్టు పెట్టుకుంటానని… బట్టల కొట్టే ఎందుకన్నది కూడా నేను చెప్పలేను.”

ఇక్కడవరకూ విన్న నా నోటి వెంట వచ్చిన మాట: “భలే వింత మనిషిలా ఉన్నాడే!”

ముమ్తాజ్ తన కబుర్లు కొనసాగించాడు. “…అతడు తలనుండి కాళ్ళ వరకూ కపటపు మనిషి అనుకున్నాను… ఒక పెద్ద ఫ్రాడ్ అనుకున్నాను! అతడు తన దందాలో చేర్చుకున్న అమ్మాయిలందర్ని తన కూతుర్లుగా చూసుకునేవాడంటే ఎవరు నమ్ముతారు? అప్పట్లో నాకు నమ్మశక్యం గాని విషయం ఇంకోటేంటంటే అతడు ప్రతి అమ్మాయి పేరిట పోస్టాఫీసులో ఒక సేవింగ్స్ అకౌంట్ తెరిచి వాళ్ళ జీతాన్ని మొత్తం అందులో జమ చేసేవాడు… పైగా వాళ్ళందరి తిండీ బట్టల ఖర్చూ అతనే తన జేబులోంచే పెట్టేవాడు. వీటన్నిటిలోనూ ఏదో మతలబీ ఉందనే నాకనిపించేది. నాకతను మరీ దొంగబుద్ధి ఉన్నవాడిలా కనిపించేవాడు. ఒక రోజు నేను అతడి దగ్గరకి వెళ్ళాను. నాకు మీనా, సకీనా ఇద్దరూ ఆ రోజు సెలవులో ఉన్నారని చెప్పాడు: ‘నేను ప్రతి వారం వీళ్ళిద్దరికి సెలవిస్తాను, బయటకెళ్ళి హోటలులో మాంసాహారం తినొస్తారని… మీకు తెల్సుగా ఇక్కడ అందరూ వైష్ణవులని. ఇంట్లో వండలేం కదా.’ నేను ఇది విని మనసులోనే నవ్వుకున్నాను, నన్ను బనాయిస్తున్నాడని… ఇంకో రోజు ఏం చెప్పాడంటే, అహ్మదాబాదు నుండి వచ్చిన హిందూ అమ్మాయి–ఆమెకి ఒక ముస్లిము కస్టమరుతో పెళ్ళి కూడా చేయించాడు–లాహోర్ నుండి ఉత్తరం రాసిందని. దాతా సాహెబు దర్గాలో ఆమె కోరుకున్న మొక్కు తీరిందని. అందుకని ఇప్పుడామె సహాయ్ తొందర తొందరగా ముప్ఫైవేల రూపాయలు జమ చేసుకోవాలని, త్వరగా బనారస్ వెళ్ళిపోయి అక్కడ బట్టల కొట్టు పెట్టుకోవాలని మొక్కుకుందని. ఇది విని నాకు నవ్వు ఆగలేదు. నేను ముస్లిమ్‌ని కనుక నన్ను మంచి చేసుకోవడానికి ఈ కథలన్నీ చెప్తున్నాడు, ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడని అనుకున్నాను.”

నేను ముమ్తాజ్‌ని అడిగాను: “అయితే నీ అనుమానం నిజం కాదా?”

“కానే కాదు. అతను చెప్పినవాటిలో లేనిపోని కబుర్లు, నిజం కానివీ ఏమీ లేవు. అతను జీవితంలో కొన్ని తప్పులు చేసి ఉండుండచ్చు కాని చాలా పెద్దమనిషీ, మర్యాదస్తుడూ.”

జుగల్ అడిగాడు: “అది నీకెలా తెల్సింది?”

“అతడు చనిపోయినప్పుడు.”

ముమ్తాజ్ కాసేపటి వరకు మౌనంగా ఉన్నాడు. దూరంగా ఆకాశం, సముద్రం కలిసిన మసక చీకటిని చూస్తూ ఉండిపోయాడు. “అల్లర్లు మొదలయ్యాయి… నేను తెల్లారుఝామునే లేచి భిండీ బజారు నుండి వెళ్తున్నాను. కర్ఫ్యూ పెట్టారు కాబట్టి బజారులో బళ్ళూ మనుషులూ ఎక్కువగా లేరు. ట్రాములు కూడా నడవడం లేదు. టాక్సీ వెతుక్కుంటూ నేను జే.జే. ఆసుపత్రి దగ్గరకి చేరుకునేసరికి అక్కడ ఫుట్‌పాత్ మీద ఒక మగమనిషి లుంగచుట్టుకుపోయి బస్తాలో పడుండడం చూశాను. ఎవరో కూలివాడు గోనెపట్టా కప్పుకొని పడుకున్నాడనుకున్నాను. కానీ చుట్టూ రాళ్ళు, వాటి మీద రక్తం, మాంసపు ముక్కలు చూసి ఆగిపోయాను. హత్య జరిగింది అని అర్థమైపోయింది. నా దారిన నేను పోదామనుకున్నాను, కానీ అప్పుడే శవంలో కదలిక కనిపించింది. నేను ఆగిపోయాను. దగ్గర్లో ఎవరూ లేరు. వంగి అతడివైపు చూశాను. నాకు బాగా పరిచయమైన సహాయ్ కనుముక్కు తీరు కనిపించింది. నెత్తురు వాసన నిండిన గాలిలో అక్కడే అతడి పక్కన ఫుట్‌పాత్ మీద కూర్చొని జాగ్రత్తగా చూశాను. సహాయ్ ఎప్పుడూ వేసుకునే ఖద్దరు చొక్కా, ఎప్పుడూ తెల్లగా ఒక్క చుక్క మరక కూడా లేకుండా ఉండేది, ఇప్పుడది రక్తంలో తడిసి ముద్దయిపోయివుంది. ఒంటినిండా గాయాలు. పక్కటెముకలు కొన్ని విరిగిపోయినట్టున్నాయి, అతను నొప్పితో మూల్గుతున్నాడు. నేను జాగ్రత్తగా అతడి భుజం ఊపుతూ నిద్రపోయేవాడిని లేపినట్టు లేపాను. ఒకట్రెండు సార్లు పేరు పెట్టి పిలిచాను కూడా. అతను కదలలేదు. నేను లేచి వెళ్ళిపోదామనుకునే లోపలే అతడు కళ్ళు తెరిచాడు… చాలాసేపటి వరకూ సగం మూసుకుపోయిన కళ్ళతో నన్నే చూస్తూ ఉండిపోయాడు, నేనెవరో తెలియనట్టు. ఉన్నట్టుండి అతను నిలువెల్లా వణికిపోతూ నన్ను గుర్తుపట్టి ‘మీరు! మీరు!’ అన్నాడు.

నా నోట్లోంచి వరుసగా ప్రశ్నలోచ్చాయి. అక్కడ ఎందుకున్నాడు? ఎవరు అతన్ని కొట్టారు? ఎప్పటినుండీ అలా ఫుట్‌పాత్ మీద పడున్నాడు? ఎదురుగా ఆస్పత్రి ఉంది, వారికి పోయి చెప్పేదా? అతడికి మాట్లాడే శక్తి లేదు. నా ప్రశ్నలన్నీ పూర్తయ్యాక మూలుగుతూనే అతడి నోట్లోంచి కష్టం మీద కొన్ని మాటలొచ్చాయి: “ఇక్కడ నా రోజులు పూర్తయ్యాయి… దేవుడు ఇచ్చిన తీర్పే ఇది!”

ఆ తీర్పేదో ఆ దేవుడికే తెలియాలి, నాకు మాత్రం ఒక ముస్లిముని అయ్యుండి, ముస్లిముల ఇలాకాలో ఒక మనిషిని–ఆ మనిషి హిందువని నాకు తెల్సు–చంపింది ఒక ముస్లిమే, అతడు చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్నప్పుడు దగ్గర నుంచుని చూస్తున్నదీ ఒక ముస్లిమే అనే ఎరుక నన్ను కుదురుగా ఉండనివ్వలేదు… నేను పిరికివాణ్ణి కాదుగానీ ఆ క్షణాల్లో నా పరిస్థితి పిరికివాళ్ళకన్నా హీనంగా ఉంది. ఒక పక్క ఇది చేసింది నేనే అని నాకూ అదే గతి పట్టిస్తారేమో అన్నభయం ఉంది. అలా కాకపోయినా ఇదెలా జరిగింది, నువ్వెవరు, నువ్వెందుకు ఇక్కడున్నావు, నువ్వు చెప్పేది నిజమేనా అని చుట్టుముట్టి పొడిచి చంపుతారేమో అన్న భయమూ ఉంది… నేను అతణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్ళినా ప్రతీకారం తీర్చుకోడానికి నేనే ఈ పని చేశానని నన్ను ఇరికిస్తాడేమో అన్న పాడు అనుమానమూ వచ్చింది. కాకపోతే, ఎలాగూ చావాలని రాసిపెట్టి వున్నా ఇప్పుడు నేనూ ఇతనితో పాటూ చావడం ఎందుకూ? ఇవ్వన్నీ ఆలోచిస్తూ నేను లేచి వెళ్ళబోయాను… నిజానికి పారిపోబోయాను. కాని, అప్పుడే సహాయ్ నన్ను పిలిచాడు… నేను ఆగిపోయాను… ఆగదలచుకోలేదు కాని నా అడుగులు ముందుకు పడలేదు. నేను ఇబ్బందిగా అతణ్ణి ‘చెప్పేదేదో త్వరగా చెప్పు మియా, నేను పోవాలి,’ అన్నట్టుగా చూశాను. సహాయ్ తట్టుకోలేని నొప్పితో మూలుగుతూ అతి కష్టంమీద తన చొక్కా గుండీలు రెండు విప్పి, లోపలకు చేయి పెట్టాడు. కానీ ఇక ఏం చేయడానికీ శక్తి లేకపోయింది. నాతో అన్నాడు: “లోపల ఒక సంచీ ఉంది. దానిలో కొన్ని నగలు, పన్నెండువేల రూపాయిలు… ఇవి… ఇవి సుల్తానా సొమ్ములు… నేను… నేను ఒక దోస్తు దగ్గర ఉంచాను… కాని ఇవ్వాళ ఆమెకి… ఇవ్వాళ ఆమెకి పంపించాలనుకున్నాను… ఎందుకంటే… ఎందుకంటే రోజులు బాగాలేవు. రోజురోజుకీ అల్లర్లు పెరుగుతున్నాయి… మీరు ఆమెకి ఈ సంచీ ఇచ్చేయండి… వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపొమ్మని చెప్పండి… కానీ, మీరు జాగ్రత్త!”

ముమ్తాజ్ మౌనంగా ఉండిపోయాడు. కానీ నాకు వాడి గొంతు, సహాయ్ గొంతుతో–జే.జే. ఆసుపత్రి దగ్గర ఫుట్‌పాత్ మీద వినిపించినది– కలిసి, అక్కడ దూరంగా, ఆకాశమూ సముద్రమూ మసక చీకటిలో కలిసిన చోట, వాటితో కలుస్తూన్నట్టు అనిపించింది.

ఓడ కదలబోతున్నట్టుగా హారన్ వినిపించింది. ముమ్తాజ్ అన్నాడు: “నేను సుల్తానాను కలిశాను… ఆమె నగలు, పైసలు ఆమెకి ఇచ్చాను. ఆమె కళ్ళల్లో నీళ్ళు చూశాను.”

మేము ముమ్తాజ్‌ నుంచి శెలవు తీసుకొని కిందకు వచ్చేసరికి అతడు ఓడపై భాగం మీద రైలింగుని పట్టుకొని నించొని వీడుకోలుగా కుడి చేయి ఊపుతున్నాడు. నేను జుగల్‌తో అన్నాను: “ముమ్తాజ్ మాట్లాడుతుంటే నీకు వాడు సహాయ్ ఆత్మను పిలుస్తున్నట్టు అనిపించలేదూ? ఈ ప్రయాణంలో తోడు కోసం అడుగుతున్నట్టులేదూ?”

జుగల్ ఒక్కటే మాట అన్నాడు: “నేనే సహాయ్ ఆత్మని అయ్యుంటే…”

రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...