(Calculus – Stanley Hayter)
అదిగో
అతడా ముప్పై వెండి నాణేలు
గుడిమెట్లపై విసిరేసి
విసవిసా వెళ్ళిపోయాడు
ఉరేసుకుని చచ్చిపోయాడు.
పాపపు సొమ్ము బొక్కసానికి
పంపడానికి జంకారు పూజార్లు
ఏం చెయ్యాలో పాలుపోలేదు వారికి
ఎందుకంటే అది ‘ప్రైస్ ఆఫ్ బ్లడ్.’
ఎడతెగని మంతనాలు జరిపారు
పెద్దలని సంప్రదించారు
చివరకి ఒక కుమ్మరివాడి నేల కొన్నారు
విదేశీయులని, పరమతస్థులనీ పాతిపెట్టడానికట.
అందుకే, ఈనాటికీ ఆ శ్మశానభూమిని
నెత్తురు నేల అనే అంటారు అందరూ.
ఈ నాలుగు చరణాలతో నేనో పది ఉద్గ్రంథాలు రాయగలను. వాటిని పది ఎడ్వెంచర్ నవలలుగా మార్చెయ్యగలను. ఓసారి ఈ పద్యంలోని ఇమేజ్‌లను సమీక్షిద్దాం: ఆలయం మెట్లమీద విసిరేయబడ్డ గుప్పెడు నాణేలు; ఉరితాటికి ఒక మెడ; ఆ నాణేలకంటిన రక్తపు వాసన కూడా పట్టించుకోని ఒక ఆశపోతు కుమ్మరి; కట్టిపడేసే శీర్షిక–ది ప్రైస్ ఆఫ్ బ్లడ్; విదేశీయులని, పరమతస్థులని పాతిపెట్టడానికి ఓ శ్మశానం; అద్భుతమైన చివరిపాదం. అది చచ్చినవాళ్ళకోసం కేటాయించిన ఒక జానెడు భూమిని, నాలుగు అంచుల్లోనూ పట్టుకుని లాగుతూ… అది ఎటువైపుకన్నది ఈ థీమ్‌ని ముందుకు తీసుకెళ్ళే రచయితను బట్టి కదా – అంటే రొమాంటిసిస్టా, సింబలిస్టా, రియలిస్టా అన్నదాని బట్టి – ఉంటుంది.
ఆ మూడో చరణం చుట్టూ నేను చాలాకాలం గిరికీలు కొట్టికొట్టి, చివరికి పక్కదారి నుండి లోపలికి జొరబడ్డాను. ఆ కుమ్మరివాడి నేల ఎలా ఉంటుందో ఊహించాను. ఎండకి ఎండి బీటలువారి, ఈతముళ్ళ కొమ్మలతో నిండిన ఒక రెండు పుట్ల భూమి; చుట్టూరా కాలిబాటలు, బండి చక్రాల జాడలు; దారితప్పి రికామీగా తిరిగే పరదేశీయులను మోసుకురావడం వల్ల ఏర్పడ్డ దారులవి.
ఇక్కడ ఈ థీమ్ నన్ను నిలదీసింది: ఆ పూజార్లు, శ్మశానభూమిని కొన్నప్పుడు పరాయివాళ్ళ గురించే ఎందుకు కొన్నారు, వాళ్ళ సొంత జెరూసలేమ్ ప్రజల కోసం కానీ, లేదూ తమ కోసం కానీ ఎందుకు కొనలేదు? సమాధానం నాలుగో చరణం చెప్తుంది–‘ది ప్రైస్ ఆఫ్ బ్లడ్’. ఆ పూజార్లు, జీసస్‌ను వాళ్ళ ధర్మసూక్ష్మాలనుసరించే విచారించారు, కాబట్టి వాళ్ళ నేరం ఏం లేదందులో. కాని నెత్తుటి డబ్బుతో కొన్న నేలలో తమవారిని పూడ్చలేరు. పరాయివాళ్ళని పూడ్చడానికైతే మత ధర్మాలు పట్టించుకోనక్కర్లేదు. ఇంతవరకూ బానే ఉంది. కాస్త ముందుకు పోయాక, థీమ్ నన్ను మరింత విసిగించింది: పరాయివాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు భూమినుండా, ఈ మరుభూమి మాత్రం జానెడు. శవాల సంఖ్య పెరుగుతోంది కానీ శ్మశానం పెరగటంలేదు. ఆ రక్తపు మడుగు, తూముగొట్టాలు లేని చెరువులా త్వరత్వరగా నిండిపోయి, పొంగిపోతోంది. (ఈ రక్తపు భూమిలో నెత్తురు మట్టం పెరగకుండా ఉండాలంటే ఎన్ని గొట్టాలు ఉండాలి? అనేది ఏ లెక్కల పుస్తకంలోనూ కనపడని లెక్క.) ఇక్కడితో ఈ థీమ్ ముందుకి కదలలేక అడ్డం తిరిగి ఆగిపోయింది. ఇది కదలాలి అంటే ఆ శ్మశానంలో సమాధులనంటిపెట్టుకున్న దయ్యాలనో, చచ్చిపోయేక కూడా అశాంతితో జడ్జ్‌మెంట్ రోజు వరకైనా కదలకుండా పడుండలేని ఆ పరాయి శవాలనో బతిమాలుకోవాలి. సెన్సార్ వాళ్ళ కత్తెర నుంచి తప్పించుకున్న చక్కని అభిరుచి (ఇది ఎంత అరుదో కదా!) లాంటిది కావాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ థీమ్‌ను ముందుకి తీసికెళ్ళడానికి రొమాంటిసిస్టుల ముతక విన్యాసాల వంటివేవో అవసరమవుతాయి.
అందుకే, ఇంకా ఆ మూడో చరణం మీదే తిరుగుతూ ‘కొనడం’ అన్న ఇమేజ్ లోకి దూరాను. నా హీరోగా ఆ ముప్పై వెండినాణేలనే ఎంచుకున్నాను; గలగలమంటూ, లెక్కకి అందుతూ, చావులేని, రొమాన్సు చాతకాని ఆ నాణేలే నా హీరో. ఈ గాస్పెల్ కథలో అవిగాక ఇంకెవరు మిగిలారు గనక? ఒకడు శిలువ ఎక్కాడు; మరొకడు ఉరేసుకున్నాడు; మిగిలినవాళ్ళు ఒకరి తర్వాత మరొకరు రక్తపుమడుగులో పూడ్చబడ్డారు. మిగిలినవీ, సరఫరాలో ఉన్నవీ – గలగలలాడుతున్న ఆ నాణేలే. మృణ్మయమైన ఆ మొదటి థీమ్ కంటే, హిరణ్మయమైన ఈ రెండో థీమ్ వెంటే–ఆ నాణేల వెనకే– నా కథ కూడా పరిగెడుతుంది.
ఇక మొదలెడదాం.
2.
ఇవి సాధారణమైన వెండినాణేలు– గుండ్రటి అంచులు, అచ్చుపోసిన అంకెలు, తగరపు మెరుగు. అయితే, వాటి మీద ఏదో కంటికి కనిపించని ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. కొత్తవాళ్ళకి శ్మశాన శాంతిని ప్రసాదించే ఆ నాణేలు మాత్రం విశ్రాంతిని ఎరగవు. వాటిల్లో ఉన్న ఏదో దురద వాటిని చేతి నుంచి చేతికి, పర్సు నుంచి పర్సుకీ మార్చుతూనే ఉంటుంది. ఎంతవరకూ అంటే…
అహా అలాకాదు, మొదటినుంచీ వరసలో వద్దాం.
జీసస్‌ను చంపడానికి కుట్ర పన్నిన జెరూసలేమ్ ప్రధానపూజారి కయాఫస్ ఆ నాణేలని జూడాస్‌కు ఇచ్చాడు; ఆ మరునాడే పశ్చాత్తాపంతో కుమిలిపోయి జూడాస్ ఉరేసుకుని చనిపోయే ముందు ఆ నాణేలను ఆలయం మెట్ల మీద విసిరేయడంతో అవి తిరిగి కయాఫస్ బొక్కసానికే తిరిగొచ్చాయి, కానీ బొక్కసం వాటిని తీసుకోడానికి నిరాకరించింది; అవి కుమ్మరివాడి దగ్గరకి వెళ్ళాయి. వాడు వాటిని ఒక రూకలసంచిలో వేసుకొని, నడుముకు దోపుకొని, కులాసాగా వీధుల్లో తిరుగుతూ నగరం ఉత్తర ద్వారం వరకూ వచ్చాడు. వాడుండేది జెరూసలేమ్ శివార్లలో, నగర ద్వారానికి ఆవల. సాయంత్రానికల్లా ఇల్లు చేరదాం అనుకున్నాడు పాపం. కానీ, ఆ నాణేల దురద సామాన్యమైనది కాదే, అవి ఒకచోట కుదురుగా ఉండనీయవు కదా. అవి వాడిని ఏం ప్రేరేపించాయో ఏమో, వాడు సారాకొట్టు వైపుకి మళ్ళాడు. అక్కడ ఒక నాణెం ఇచ్చి ద్రాక్షసారా తాగాడు, మరో నాణెంతో మరికొంత సారాయి, మరో నాణెంతో మరొకటి–ఇలా కాస్సేపటికే అవన్నీ వాడి గుడ్డ సంచీ నుండి, దుకాణం వాడి గల్లాపెట్టెలోకి చేరాయి. ఇక్కడ, పురాణ కథనరీతిలో మనం కొంత కల్పన జోడించవచ్చు; అతను తెల్లద్రాక్షసారా అడిగాడు, కానీ అక్కడ ఎర్రద్రాక్షసారానే ఉంది, రక్తం రంగులో, దాని రుచి కూడా మనిషి రక్తంలానే ఉంది… ఇలా. కానీ, నేను ఏమీ కల్పించడం లేదు, ఉన్నదున్నట్టే నిజాయితీగా చెప్తున్నాను.
జరిగిన వాస్తవమైతే ఇదీ: ఆ కుమ్మరోడు తడబడుతూ ఉత్తరద్వారం దాకా వెళ్ళి, కోట గోడలు పట్టుకుని బయటకు వచ్చాడు. బయట అతను పడిపోకుండా నిలబెట్టడానికి గోడలు లేవు. అతను తూలుతూ కిందపడ్డాడు. మత్తులో అక్కడే నిద్రపోయాడు. ఉదయం చలి అతన్ని లేవదీసింది, బుర్ర పోతపోసిన సీసంలా అనిపించింది, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు.
3.
ఆ నాణేల దురద అక్కడితో ఆగేది కాదుగా! వాటికి అప్పుడప్పుడే చేతి నుంచి చేతికి, వేలినుంచి వేలికి తిరుగాడాలనే దురద క్షణక్షణానికీ ఎక్కువవుతోంది. వచ్చిన ముప్పై నాణేలతో దుకాణంవాడు సంతృప్తి పడలేదు, కొట్టు తీసి మరికొంత సొమ్ముకోసం వేచి చూశాడు. కానీ, ఆ నాణేలు అతన్ని దారుణంగా మాయచేశాయి. ప్రవక్త రక్తాన్ని కళ్ళ చూసిన ఆ నాణేలు ఇప్పుడు ఈ సారాకొట్టుకు చేరుకున్నాయని అతని పాతా ఖాతాదారులకి తెలిసిపోయింది. (అప్పటికే ఈ కథ జెరూసలేమ్ అంతా మార్మోగిపోతోంది.) వాళ్ళు తాగుతున్న కొట్టులోనే ఈ నాణేలున్నాయని తెలిసి, వాళ్ళు తాగుతున్న సారా పారబోసి, దుకాణంవాడికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి చిల్లర కోసం అడిగారు. దుకాణం వాడు ఒక నాణెం ఒకరికి, రెండు ఇద్దరికీ మూడు ముగ్గురికీ ఇలా ఇవ్వబోయాడు. కానీ, దైవభక్తులైన తాగుబోతులందరూ గొంతెత్తి అరవడం మొదలెట్టారు:
“ది ప్రైస్ ఆఫ్ బ్లడ్! నెత్తుటి డబ్బు!”
“నమ్మకద్రోహపు నాణేలు!”
“అవి మాకొద్దు, వేరేవి ఇవ్వు.”
మీకిచ్చినవి ఆ నాణేలు కావని కొట్టు యజమాని నెత్తీ నోరూ కొట్టుకొని ప్రాధేయపడ్డాడు, కానీ అతని మాటెవరు నమ్ముతారు? వెండి నాణేలన్నీ ఒకేలా ఉంటాయి. వాళ్ళు వాటినోసారి చూసి, అనుమానంగా తలలూపి, వేరేవి అడగడం, ఇచ్చినవాటిని తలొకరూ పరీక్షించడం, ఇవి మాకొద్దని వాదించటం; అక్కడంతా పెద్ద గలాటాగా మారిపోయింది. నాణేలు ఒక చేతినుంచి మరో చేతికి మారడం, బల్లల మీద పడడం; ఈ ఊపులో అవన్నీ మిగిలిన నాణేలతో కలిసిపోయాయి. మామూలు నాణేలు, ఈ మాయదారి నాణేలు కలిసిపోయి, ఆ సారాకొట్టంతా స్వైరవిహారం చేశాయి.
అంతా అయింది. అందరూ దుకాణం వదలిపోయారు. బల్లలన్నీ ఖాళీ అయిపోయాయి, కొట్టు యజమాని నాలుక్కాళ్ళమీద పాక్కుంటూ నాణేలన్నీ ఒక్కొక్కటీ ఏరుకున్నాడు. ఒకరోజు గడిచింది, మరో రోజు, ఆపైన మరికొన్ని రోజులు గడిచాయి, కానీ ఒక్కడు కూడా పానశాలకేసి కన్నెత్తి చూడలేదు. అతడు మట్టికుండల మూతలు తీసి, అందులో పుల్లపెట్టి చూశాడు. ఏముందీ, తాగేవాళ్ళు లేక విసుగెత్తిన ద్రాక్ష సారాయి పూర్తిగా పులిసిపోయింది.
ఇక ఏదో ఒకటి చెయ్యాలి కదా! ఆ కుమ్మరివాడిని కసిదీరా తిట్టుకుంటూ, గల్లాపెట్టిలో డబ్బంతా తీసి, ఒక్కో నాణేన్నీ పరిశీలనగా చూసి, కుమ్మరివాడు ఇచ్చినవి వేరుచేశాడు; వాడు ఇచ్చిన నాణేలు కొత్తవి, ఇంకా తళతళలాడుతున్నాయి. అయినా సరే, అతను వాటిని పూర్తిగా గుర్తుపట్టలేకపోయాడు. పాపం ఎంత పరీక్షగా చూసినా ఒకసారి ఇరవైతొమ్మిది, మరోసారి ముప్పైఒకటి తేలాయి. అవి సరైనవో, కావో ఎవరు చెప్పగలరు?
ఇదిలా ఉండగా, కుమ్మరివాడు రాత్రంతా నిద్రపోయి, మత్తంతా దిగాక లేచి ఇంటికి చేరి పనిలో పడ్డాడు. మూడు నాలుగు రోజులు గడిచాయో లేదో, ఒకరోజు పొద్దున్నే సారాకొట్టు యజమాని తలుపు తోసుకొని ఇంట్లోకి వచ్చాడు. ఆ ముప్పై వెండి నాణేలు కుమ్మరివాడి మీదకు విసిరేశాడు, ‘ఇదిగో.ముప్ఫై నాణేలు. మొత్తం తీసుకో’ అంటూ. అంటూనే ఒక కర్ర పుచ్చుకుని అక్కడున్న కుండలన్నీ పగలగొట్టడం మొదలెట్టాడు. మధ్యలో ఆగి, నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ– ‘ఇంకా ఎన్ని బాకీ? ఈ బాన ఎంత? రెండు డ్రాక్మాలు కదా?’ ఫటేల్! ‘ఈ పూలకుండీ ఎంత?’ ఢమాల్! ‘ఈ దీపం కుందె ఐదు దీనార్లు చేస్తుందా?’ ఫట్! ఫట్! ఉన్నవి పగలకొట్టి లెక్కసరిపోయిందనుకున్నాక, కర్ర పడేసి బైటకు నడిచాడు. ‘ఇంకా పది లెప్టాన్లు మిగిలేయి. అవీ కానియ్యి!’ కుమ్మరివాడి అరుపుతోపాటు ఒక మట్టిపాత్ర సారాకొట్టు యజమాని వీపుకి తగిలి ఫెళ్ళుమంది.
ఇంటికి చేరిన సారాకొట్టువాడు, మర్నాటి నుంచీ తన వ్యాపారం యథావిధిగా సాగుతుందని ఆశించాడు పాపం. బెంచీలన్నీ శుభ్రంగా తుడిచాడు, కొత్త సారాయి మరిగించాడు, తలుపులు బార్లా తెరిచాడు. కానీ, ఆ రోజు కూడా ఒక్కడూ రాలేదు. మళ్ళీ అనుమానంతో తన గల్లాపెట్టంతా గాలించాడు– బహుశా ఒక్క మాయదారి నాణెం ఎక్కడైనా దాక్కునివుందేమో? చాలా నాణేలు అనుమానాస్పదంగా అనిపించాయి. ఒక్కోదాన్ని బయటికి తీసి మరోసారి వెయ్యికళ్ళతో పరీక్షించాడు. అనుమానంగా ఉన్నవాటిని తీసి బిచ్చగాళ్ళకి ఇద్దామనుకున్నాడు కాని అవి ఎక్కడినుంచి వచ్చాయో తెలిసిన బిచ్చగాళ్ళు అతని డబ్బు ముట్టడానికే నిరాకరించారు. ఒక వేశ్య దగ్గరకి పోయాడు. చివరికి ఆమె కూడా ఒక రాత్రిని ఇతనికి అమ్ముకోడానికి ఒప్పుకోలేదు.
పిచ్చెత్తి, ఒకరాత్రి కొన్ని నాణేలు రోడ్డు మీద వెదజెల్లేడు. దానివల్లా లాభం లేకపోయింది. అతని దురదృష్టం అక్కడితో అయిపోలేదు. ‘ఇంకా ఒకటో రెండో ఉండిపోయాయేమో’నని మళ్ళీ ఉన్న డబ్బంతా గాలించాడు. మర్నాడు రాత్రి మరికొన్ని నాణేలు విసిరేశాడు. రోడ్డు మీద దుమ్ములో దొరికిన ఆ డబ్బులను- ఈ సంగతి తెలియని ఊరికి కొత్తవాళ్ళు, పల్లెటూళ్ళనుండి కూరానారా అమ్ముకోడానికి రాత్రివేళ నగరానికొచ్చే రైతులు, తెల్లారగానే ఊరువిడిచి పోయే యాత్రికులు, ఏరుకున్నారు. ఆ అపవిత్రపు నాణేలు అలా చాలా డబ్బు సంచీల్లోకి, పర్సులలోకి చేరాయి.
జూడాస్ నాటిన విత్తనం మొలకలెత్తింది.
ఉన్న డబ్బంతా పారబోసుకున్న పానశాల యజమాని, తలని పాతకుండలా గోడకోసి బద్దలుగొట్టుకున్నాడు. మంచిపనే చేశాడు. అతనింకా బతికే ఉంటే ఈ ముప్పై నాణేల కథ ముప్పై అధ్యాయాలయుండేది. పాఠకులు, విమర్శకులు నేను కావాలని దీన్ని రొమాంటిక్‌గా, మిస్టికల్‌గా రాస్తున్నానని నామీద అభాండాలు వేసేవారు.
పానశాల ఉదంతం అయిపోయింది కాబట్టి, మరో అంకంలోకి వెళ్దాం – పగిలిన తలని ఇక్కడే వదిలేసి, పగిలిన కుండల దగ్గరకి.
4.
కుమ్మరివాడు పగిలిన పెంకులన్నీ ఎత్తి బైట పారేశాడు. కిందపడ్డ నాణేలన్నీ ఏరాడు, కాని వాటిని మాత్రం పారెయ్యలేదు. వాటిని ఎలా ఒదిలించుకోవాలా అని ఆలోచించాడు. ఎలాగైనా సరే వీటిని ఎవరికో ఒకరికి అంటగట్టాలి. అప్పటికే సారాకొట్టతను అందరికీ ఈ సంగతి చెప్పే ఉంటాడు, కాబట్టి వదిలించుకోవడం సులువు కాదు. అందరూ ఈ సంగతి మర్చిపోయేదాకా ఎదురుచూడాల్సిందే.
కానీ ఒక్క రోజు కూడా గడవకముందే చాలా మర్యాదగా గౌరవనీయంగా కనిపిస్తున్న ఒక ముసలి పెద్దమనిషి ఇంటి తలుపు తట్టాడు, ఇల్లంతా గాలింపుగా చూస్తూ అడిగాడు: “ఇంకా ఆ ముప్పై నీ దగ్గరే ఉన్నాయా?”
“ఏ ముప్పై?” ఏం తెలియనట్టు ప్రశ్నించాడు కుమ్మరివాడు, “ఉన్నాయే అనుకుందాం? వాటితో నీకేం పని?”
“ముప్పైకి ఇరవై ఇస్తా. ఇంత మంచి బేరం మళ్ళీ రాదని నీకూ తెలుసు”
ఇద్దరూ బేరాలాడుకున్నారు. చివరికి, ఇరవై ఐదు నాణేలకి బేరం కుదిరించి. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా ద్రవ్యమారకం జరిగింది.
ఆ ధర్మనిరతుడు నాణేలను చేతితో తాకడం ఇష్టంలేక, ఒక తోలు సంచీ తెరచి పట్టుకున్నాడు. అందులో కుమ్మరి ఆ ముప్ఫై నాణేలను కుమ్మరించాడు. సంచీకి గట్టిగా మూడు ముళ్ళు వేసి, దాన్ని బొడ్లో దోపుకుని, విస్తుపోయి చూస్తున్న కుమ్మరికి తలవంచి వీడ్కోలు చెప్పి, ముసలాయన, ఆ సాయంకాలంలోకి మాయమయిపోయాడు.
ఇంటికి చేరేక కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని, ఆ సదాచారసంపన్నుడు చిత్తశుద్ద్ధి కోసం ప్రార్థనలు చేశాడు.
మర్నాడు ఉదయం, తోలుసంచీలోంచి ఆ నాణేలు సుంకం వసూలు చేసుకోడానికొచ్చిన రెవెన్యూ గుమాస్తా గోనెసంచీలోకి మారాయి.
5.
ఆ నాణేలు పుచ్చుకున్న రెవెన్యూ గుమస్తా సత్తెకాలపు మనిషి. ఆయనను చూస్తే లూక్ రాసిన గాస్పెల్‌లో దేవుడి ముందు మోకరిల్లిన పెనిటెంట్ పబ్లికన్ నీతికథ గుర్తుకువస్తుంది. నిలువెత్తు నిజాయితీ, వృత్తి పట్ల నిబద్ధతతో మసలే అతనంటే పరగణాలో అందరికీ అమితమైన గౌరవం.
గాడిదని ముందుకి నడిపించుకుంటూ, ఇంటింటి ముందూ ఆగి ఒక చిన్న గంట మోగిస్తాడు తను వచ్చిన గుర్తుగా. కట్టాల్సిన పన్నులూ, జరిమానాలూ కట్టించుకుంటూ అలా అతను ఊరూరా తిరుగుతాడు. ఆ రోజూ అంతే.
ఇన్నేళ్ళ ఉద్యోగంలో ఏనాడూ అతను చిల్లిగవ్వ కూడా లంచం తీసుకోలేదు. ప్రభుత్వం డబ్బు పైసా కూడా వాడుకోలేదు. ఆ రోజు కూడా ఈ ముప్పై నాణేలు ప్రభుత్వ ఖజానాకి చేరుకునేవేమో, కానీ అతను ఆ రోజు ఇంకా ఎక్కిదిగాల్సిన గుమ్మాలు, తిరగాల్సిన ఊర్లు ఎన్నో ఉన్నాయి. నాణేలకి సంచీలో అసహనం ఎక్కువైపోయింది. వాటి దురద ఎలాటిదంటే అవి అతి తొందరగా సంచీనుంచి సంచీలోకి, చేతినుంచి చేతికి, మనిషినుంచి మనిషికి, ఊరినుండి ఊరికీ మారాలి. మచ్చలేని ఆ గుమాస్తాకి ఏమయ్యిందో తెలీదు, ఆ నాణేలని ఎలా పోగొట్టుకున్నాడో తెలీదు. పోనీ, కేవలం ఒక ముప్పై మాత్రమే లెక్క తేలకపోతే తన సొంత డబ్బే ఖజానాకి జమ చేసేవాడేమో. కానీ, అతని గాడిద కుంటిది. దాని ఎగుడుదిగుడు నడకలో ఈ నాణేలు నిద్రపోతున్న రాగినాణేలని కూడా చెడగొట్టి, తమతోపాటు తీసుకుపోయాయి.
సాయంత్రానికి సుంకపు డబ్బు ఉన్న సంచులన్నీ ఖాళీ అయిపోయాయి.
అతడు ప్రభుత్వానికి తనను విచారించి శిక్షించే అవకాశం ఇవ్వలేదు. తనని తనే విచారించుకుని, నేరానికి శిక్ష విధించుకున్నాడు. ధర్మగ్రంథంలో జీసస్ చేత మార్క్ పలికించిన విధంగానే, మెడకి బండరాయి కట్టుకుని నూతిలోకి తలక్రిందులుగా దూకేశాడు.
6.
తేరగా వచ్చిన సొమ్ము ఎక్కడ తేలుతుందో అక్కడికే చేరాయా నాణేలు –పేకాట క్లబ్బులకీ, చీకటి వ్యవహారాల గూళ్ళకీ, అక్కడ తారట్లాడే మనుషుల జేబుల్లోకీ. అలాంటి చోట్ల చేరిన నాణేలకి కిలుం పట్టదు. అవి చురుకుగా ఒకచోటి నుండి మరో చోటుకి కదిలిపోతూనే ఉంటాయి. వాటికి విరామం, విశ్రాంతి తెలియదు.
ఈలోగా, ఆత్మహత్య చేసుకున్న సారాకొట్టు యజమాని ఇంటిని ప్రభుత్వం జప్తుచేసి, తాళం వేసేసింది. ఇంటిలో దొరికిన సొమ్ము–అందులో ఇంకా జూడాస్ నాణేలు కొన్ని దాక్కుని వున్నాయి–రోములో వున్న ప్రభుత్వ ప్రధాన భాండాగారానికి చేరింది. ప్రశాంతత ఎరగని ఆ పది నాణేలు, బొక్కసంలో ఉన్న బంగారు, వెండి నాణేలన్నిటికీ తిరగాలనే పిచ్చి ఎక్కించాయి. నిద్రలేచిన నాణేలు గోనె సంచుల్లోంచి, భోషాణాలలోంచి బయటపడే మార్గాలకోసం ఆరాటంగా అన్వేషించాయి. ఆ చిట్టి చిట్టి లోహపు చక్రాలు, లేచి నిల్చుని ప్రపంచం నలుమూలలకీ బజార్లని వెతుక్కుంటూ దొర్లుకుంటూ పోయాయి. వాటి వెనకే కంచు కత్తులూ డాళ్ళూ వాటిని వెతుక్కుంటూ, దారంతా నరుక్కుంటూ తరలి వెళ్ళాయి. ఆ విధంగా, రాజ్యకాంక్ష తననుంచి తను పారిపోతున్న ముప్పై వెండినాణేలకీ కొత్తదారి చూపించింది. ముప్పై ఏళ్ళు తిరక్కుండానే, అవి జెరూసలేమ్ చేరుకున్నాయి- రోమన్ చక్రవర్తి టైటుస్ సైన్యం జెరూసలేమ్ నగరాన్ని ముట్టడించి ధ్వంసం చేయడానికి ముందుగానే!
ఆ నాణేలు ఎలా అయితే మట్టిలోకి విసిరికొట్టబడ్డాయో, జెరూసలేమ్ నగరాన్ని కూడా అవి అలానే మట్టిగా మార్చాయి. మంటల్లో, యుద్ధంలో కూలిపోయి, మంటల్లో కాలిపోయి, శిథిలాలలో మిగిలిపోయాక కాని ఆ ప్రవక్తల, వడ్డీవ్యాపారుల నగరానికి ప్రైస్ ఆఫ్ బ్లడ్ అంటే ఏమిటో అర్థం కాలేదు.
7.
ప్రతీ కొత్త పేరాతోనూ, ఈ కథ వేగాన్ని అందుకోవడం నాకు అతి కష్టంగా ఉంది. డబ్బు చలామణీ అయినంత వేగంగా పదాలు పరిగెత్తలేవు. నేను చెప్పడానికి ప్రయాసపడుతున్న కథ ముప్పై ఆకులున్న బండి చక్రం లాంటిది. అది మొదట మెల్లగా తిరగడం మొదలెట్టి, పోను పోనూ అతి వేగంగా తిరుగుతుంది. అలా తిరిగే చక్రంలో ఆకులు విడిగా కనిపించవు. అన్నీ కలిసిపోయి ఆ చక్రం ఒక పెద్ద వెండి పళ్ళెం లాగా, ఒక పెద్ద నాణెం లాగా కనిపిస్తుంది–క్రీస్తును అమ్మేసిన జూడాస్ చేతిలో కానీ, ఆ నాణేలు కొన్న సదాచారసంపన్నుడి తోలు సంచిలోకానీ పట్టనంత పెద్ద నాణెం.
ఇంతకు ముందు కుమ్మరివాడి దగ్గర, రెవెన్యూ గుమస్తా దగ్గరా కాస్సేపు కథనంతో తచ్చాడగలిగాను. ఇప్పుడు ఆ ప్రతీకాత్మక ధోరణి వదిలిపెట్టాలి. నేరుగా చప్పిడి వాక్యాల్లోనే చెప్పాలి. అలాగే చెప్తాను.
మనకు తెలిసిన వివరం ప్రకారం ఒక నాణెం చర్చి హుండీలోకి చేరింది. అది అలా పడగానే ఆ హుండీ లోపల కలకలం రేపింది. చర్చ్ హుండీ కలకలానికి స్పందనగా, దానిని కాపాడడం కోసం కవచధారులు, అశ్వారూఢులు అయిన యోధులు బయలుదేరారు. మతయుద్ధాలు మొదలయ్యాయి. ఇంకో నాణెం ఒక ఆర్థికతత్వవేత్త జేబులో పడింది. ఫలితంగా ఆ జేబునుండి అతని బుర్రలో థియరీ ఆఫ్ మనీ సర్కులేషన్ అనే ఒక సిద్ధాంతం కొత్తగా పుట్టుకొచ్చింది. దాని ప్రకారం సంపత్తిని, ఉన్న సంపద ఆధారంగా కాక, దాని ప్రతీకగా మారిన నగదు ఎంత వేగంగా చలామణీ అవుతున్నది, చేతులు మారుతున్నది అనే దాన్నిబట్టి అంచనా వేయడం మొదలైంది.
ఆ ముప్ఫై నాణేలు మరింత వేగంగా భూమిచుట్టూ తిరగసాగాయి. ఈ సందర్భంలో – బంగారం, వెండికి బదులుగా కాగితపు నోట్లు వాడాలని, అవి అచ్చువేయడానికి ఒక సెంట్రల్ బ్యాంక్ లాంటిది ఉండాలని ప్రతిపాదించిన ఆర్థికవేత్త జాన్ లా, లోతుకుపోయిన బుగ్గలతో, గల్లాపెట్టెకి ఉండే కన్నంలా పొడుచుకొచ్చిన మూతితో, మన కళ్ళ ముందు క్షణకాలం మెరుస్తాడు. ధనం మరుగున పడి రుణం ప్రతిష్ఠ పెంచుకోడం ఆయన పెట్టిన భిక్షే. నాణేలకి అలా కాగితపు రెక్కలు మొలిచాయి.
ఆ వెండి నాణేలు గలగలమంటూ గల్లంతు చేస్తూ భూమంతటినీ చుట్టాయి. ఏ చరిత్ర పుస్తకమైనా సంప్రదించి చూడండి– ఆ ముప్ఫై యూరోపియన్ దేశాలూ…
ఊహూ, ఇక ఈ నాణేల వెంట పరిగెత్తడం, వాటి ఆచూకీ పసిగట్టడం దుర్లభం. అవి చేతులు మారుతున్నాయి, గల్లా పెట్టెల్లో రాలుతున్నాయి, ఒక ఖండం నుండి మరో ఖండానికి దొర్లుతున్నాయి. కాలం వాటి గుర్తులనీ, వాటి మీదున్న ముద్రలనీ చెరిపేసింది. ఇప్పుడు అందులో ఏ ఒక్కదాన్నైనా మనం ఫ్రాంక్ అనో, మార్క్ అనో, షిల్లింగనో పొరబడుతుంటాం.
అరిగిపోయి, గుర్తుపట్టలేని విధంగా మారిన ఆ నాణేలని ఇప్పుడు పట్టుకోవడం ఎవరి తరమూ కాదు. ప్రియమైన పాఠకుడా, అందులో ఒకటి నిన్ననే నువ్వు తీసుకున్న నెలజీతంలో రాలేదని నేను చెప్పలేను. అపనమ్మకం మంచిది కాదు నిజమే. కానీ, నా యీ ఉబుసుపోని ఊసులని, వాక్యానికింత, అని మార్పిడి చేయడం మంచిపనేనా అన్న అనుమానం వదలడం లేదు. ఒకవేళ యీ వెండి నాణేల కథని ఎవరైనా… వెండి నాణేలిచ్చి కొనుక్కుంటే?
(1927)