ఒక ప్రయాణం

ఏదో పిలుపునందుకుని
మోస్తున్నవన్నీ పక్కనపెట్టి
బయలుదేరావు

పేరు తెలియని స్టేషన్ల గుండా
రైలు పరుగులు తీస్తుంటుంది

రైలు నిండా అపరిచితులు
ఒకే చోటికి ఒకే రైలులో వెళ్తున్నా
ఎవరి లోకం వాళ్ళది
ఎవరి ప్రయాణం వాళ్ళది

ఈపాటికే అతనొచ్చేసి
ఆ నది ఒడ్డున తోచిందేదో
రాసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు
లేదూ
చదివేందుకూ రాసేందుకూ ఏముందని
కలాన్నీ కాలాన్నీ ఆ నదిలోకే విసిరేశాడో

రమించడానికీ
విరమించడానికీ మధ్య
ఎన్ని యుగాల అంతరం?

ఏదైనా ఎందుకవసరమో
ఎప్పటికీ నీకర్ధం కాదు

నీకు అవసరం కాదు అనీ
ఆ అవసరమే నువ్వు అనీ
నీకు నువ్వే అడ్డు అనీ

ఎన్ని సార్లు తల కొట్టుకుని
అతను నీకు వివరించలేదు?

అయినా అదేంటో
మళ్ళీ మళ్ళీ తలెత్తే
అవే ప్రశ్నలు

ఆ ప్రశ్నలని
మూటగట్టుకునే
బయలుదేరావు

రెండు రైళ్ళు మారి
రిక్షాలో అస్సీ చౌరా దగ్గర దిగి
రాతి పలకలు పేర్చిన
ఇరుకు సందుల్లోంచి
నడుచుకుంటూ
నది ఒడ్డుకి చేరావు

అదిగదిగో…
గుడ్డివాళ్ళ రాజ్యంలో
అద్దాలమ్ముకుంటున్న కబీరులా
అతను!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...