జీవితానందం ఎక్కడున్నది? ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం మాత్రం వీలయినంత లేనితనంలో ఉందనిపిస్తుంది. ప్రతి పుస్తకం, ప్రతి కలం అతి బరువుగా తోస్తుంది. మరి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, కాగితాలు అనే మాటలు బహువచనాలుగా ఇంకా ఇంకా బెంబేలెత్తిస్తున్నాయి. ఒకప్పటి నా కల మహా అయితే రెండు జతల బట్టలు ఒక లుంగీ. నిజానికి ఒక చొక్కా లుంగీ మీదే జీవితాన్ని లాగించేయవచ్చు. ఇవాళ బీరువా నిండా దరిద్రం నింపుకున్నంతగా జతలు జతలు నింపుకున్నానెందుకో? ఎందువెనుక పరిగెత్తుకుంటూ పడి ఇన్నిన్ని పుస్తకాల చెత్త కొన్నానో నాకు అర్థం అవ్వడంలేదు. గంటల తరబడి నెట్‌కు అతుక్కుపోయి ఎక్కడెక్కడి పుస్తకాల కోసం ఎక్కడెక్కడికి పరిగెత్తి కొన్నానో! ఎంతెంత డబ్బు అప్పులు చేసి కొన్నానో! చిన్న బొమ్మ నచ్చి, పుస్తకం కవర్ నచ్చి, పేజీలు రెపరెపలాడిస్తే సూటిగా తగిలిన వాక్యం నచ్చి… కట్టలుకట్టలుగా కొన్న పుస్తకాలు, బుర్రకంతా ఎక్కించుకున్న ఎంగిలి తెలివితేటల్ని దేవి దేవి కక్కెయ్యబుద్ధిగా ఉన్నది. కట్ట కట్టి అవే పుస్తకాలను ఇప్పుడు ఎక్కడికయినా కంటికి కానరానంత దూరం పంపించేద్దామని, కాకపోతే కొరివి పెట్టి నిప్పులో రగిలెయ్య కోరుతుంది మనసు. అపుడు ఒక దాని కోసం ఆరాటపడ్డం దేనికని? అది దొరికాక ఇపుడు దాన్ని వదిలించుకుందామని ఏవిటీ? ‘లేనిది కోరేవు ఉన్నది వదిలేవు, ఎందుకు వలచేవొ ఎందుకు వగచేవొ ఎందుకు రగిలేవొ ఏమై మిగిలేవో’ అని ఈ ఇంత మాయ ఎప్పుడూ ఎందుకు కమ్మేసుకుంటుంది?
వీలయినంత ఖాళీగా ఉంటే ఎంత బావుంటుంది. ఇల్లు కాని, వళ్ళు కాని, మనసు కానీ… నేను ప్రతిసారీ కొత్తగా ఉంటే ఎంత బావుంటుంది? తెలిసిన ప్రతి ఒక్కరిని తెలీక కొత్తగా చూస్తుంటే ఎంత బావుంటుంది? అసలు ఎవరినీ చూడక తలదించుకుని రస్తా కొలుచుకుంటూ అలా వెళ్ళవలసిన చోటికి ఖాళీగా వెళ్ళిపోయి ఖాళీగా మరలి తిరిగి మధ్యలో తప్పనిసరిగా ఎవరైనా పలకరిస్తే, పలకరించిన ప్రతి మనిషిని ప్రతిసారి కొత్త ఏంజల్‌ని అప్పుడే కలిసినట్లు! మిమ్మలనే ఇంతకాలంగా వెతుకుతూ వస్తున్నా! ఎక్కడున్నారు ఇన్నాళ్ళు? అని చూపులతో ప్రతిసారి ప్రతి పాతమనిషిని కొత్తగా పరిచయం చేసుకుని మరిచిపోయి మళ్ళీ పరిచయం చేసుకుని మళ్ళీ మరిచిపోయి మళ్ళీ ఖాళీగా అచ్చం అప్పుడే పుట్టిన కొత్త శిశువులా…
జీవితానందం ఎక్కడున్నది? ఎప్పుడూ ఏ క్షణం అయినా బొమ్మల్లో ఉందనిపిస్తుంది. ఎంత బావుంటుంది బొమ్మ తాలుకు శ్రమ! తొందర తొందర అస్సలు బావోదు. తొందర రతికి మల్లే. గీసిన గీతలపై మరో గీత తాకీ తాకనంత సుతారంగా పరుచుకుంటూ. బొమ్మని తనలా పదే పదే చూసుకుంటూ, రంగుపై మరో రంగు మచ్చ అద్ది దాని రిఫ్లెక్షన్ కంటిపాపలో నింపుకుని తెగ ఆనందపడిపోయి. బొమ్మ పూర్తయ్యాకా ఎంత మహాశాంతిగా ఉంటుందో! ఇక చాలు ఇప్పటికిప్పుడు చచ్చిపోయి మళ్ళీ మరో బొమ్మ గీయడానికి లేవకుండా ప్రశాంతపు నిద్ర. ఎంత బావుంటుంది కదా! అలా లేదనుకో ఏమవుతుంది? బొమ్మలపై బొమ్మలుగా రచన సాగుతూనే ఉంటుంది. ఎవరో రావాలని, నన్నూ నా బొమ్మలనూ చూడాలని, ఆపై నన్నూ బొమ్మలనూ తన చెరో భుజానికి హత్తుకోవాలని ఉంటుంది. ‘మళ్ళీ బొమ్మ ఎపుడు గీస్తావు? నీ బొమ్మ చూడ్డం కోసం కాదు, నిన్ను హత్తుకోడానికైనా నాకో కారణం కావా’లని ఎవరైనా పిచ్చ ప్రేమగా అడగాలని ఉంటుంది. ఎంత కాలం అద్దం నాతో ఈ మాట అంటుంది? వట్టి గాజు తళకు లోకమా ప్రపంచంలో రక్త మాంసమంతా ఏవయ్యింది? ప్రతిసారి ఇంతేనా? సరేలే! ఇట్స్ ఒకే! ఐ విల్ లవ్ మి ఎనఫ్ ఫర్ ది బోత్ ఆఫ్ అజ్. అని చెప్పుకుంటూ అలానే ఉండి పోవాలా? ఇట్స్ నాట్ ఓకేబ్బా!
ఒకసారి మదరాసులో బాపుగారి ఇంట్లో ఆయన కలిసీ కలవగానే కొత్త బొమ్మలు ఏఁవేశారు? ఏవి చూపించండి? అని అడిగారు. అవి చూసి మురిసి ‘ఓయ్ వెంకట్రావ్ ఇలా రావయ్యా అన్వర్ బొమ్మలు చూడు ఎంత బావున్నాయో!’ అని ఆయనకు చూపించి ఆపై ‘ఏవండి, ఈ దగ్గరే మా గురువుగారు గోపులుగారి ఇల్లు. ఆయన్ని వెళ్ళి కలవండి ఈ బొమ్మలు చూపించండి చాలా సంతోషపడతా’రని అన్నారు. నాకు బాగా గుర్తున్నది, అది నాకు జ్ణానోదయం కలిగిన క్షణం. ఏవిటి ఈ చూపించడాలు? వారు మెచ్చుకోడాలు! ఆపై ఏం జరుగుతుంది? ఫలానా వారు మెచ్చుకున్న చిత్రకారుడిగా ఒక మూర్ఛబిళ్ళ ధరించి ఊరేగడం. ఛీ! నా మీద నాకు ఎంత అసహ్యం కలిగిందో, ఈ అడుక్కుతిని తిరిగే బ్రతుక్కు విముక్తి లేదా? ఏం పొందుదామని నా బొమ్మని ఇంటింటికీ మనిషి మనిషి దగ్గరకీ కోతిలా తిప్పి చూపించి? కుంచెని గారడీకర్రలా ధరించి విన్యాసాల పిల్లిమొగ్గలు వేయిస్తే? థూ! ఏం అసహ్యం ఈ జన్మ! ఎంత కంపరంగా అనిపించిందో ఆ వేళ నుండి నాపై నాకు. నా మట్టుకు నాకు ఎంత బావుంటుంది బొమ్మలు చూడ్డం! ఎంత బావుంటుంది వెండ్లిగ్ బొమ్మలు చూడ్డం. టొప్పి బొమ్మలు చూడ్డం, బట్టాగ్లియా బొమ్మలు చూడ్డం, విక్టర్ ఆంబ్రూస్ బొమ్మలు చూడ్డం, మనెల్లి బొమ్మలు చూడ్డం, బ్రయన్ హేడల్ బొమ్మలు, ఆస్టిన్ బ్రిగ్స్ బొమ్మలు, పింటర్ బొమ్మలు, తోమర్ హనుకా బొమ్మలు, జాన్ క్యూనో బొమ్మలు, నా ఈ వందలాది ప్రియతముల బొమ్మలు చూడ్డం, మళ్ళీ మళ్ళీ పదే పదే చూడ్డం, ఆ మంత్రజాలంలో మునకలెయ్యడం. మైమరచిపోడం… అలా నాకులాగే విపరీతంగా బొమ్మల్ని ప్రేమించే వారెవరైనా నేనెవరో తెలీక నా బొమ్మ తెలిసి లేదా నేనూ నా బొమ్మ తెలిసీ నన్ను మరింత ప్రేమించి నా పనిని ముద్దించి మురిపం చూపి నా కోసం నా బొమ్మ కోసం ద్వారం దగ్గర నిల్చి వెళ్ళబోతూ ‘మళ్ళీ బొమ్మ ఎపుడు గీస్తావు? నీ బొమ్మ చూడ్డం కోసం కాదు, నిన్ను హత్తుకోడానికి రావాలి కదా మళ్ళీ మళ్ళీ’ అనే ఒక అద్దం కాని కోసం…
జీవితానందం ఎక్కడున్నదో తెలుసా? అంతటిని వదలడంలో ఉన్నది, దేనిని పోందకపోవడంలో ఉన్నది. అందడం పొందడం అనే స్పృహ అసలు లేకపోవడంలో ఉన్నది. దేని లెక్కలోను లేకపోవడంలో ఉన్నది. చూసిందంతా ఒక కలలా దిగ్గున మళ్ళీ మళ్ళీ లేచి కూచోడంలో ఉన్నది. పొందడం ఏనాడూ ఆనందం కాదు. అది ఏనాటికయినా వెళ్ళిపోయేదేననే కొత్త ఆలోచన ఇచ్చే భయం. ఖోనేవాలేహీ పానేవాలే హోతేహై సూత్రాన్ని కూడా కాదని దేనిని ఎవరిని ఆశించకపోవడంలో ఉన్నది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక ఊహ ఉదయిస్తుంది. ప్రతి ఉదయం ఆ ఊహ తను ఒక పిట్ట రూపు ధరించి నా మంచం కోడుపై వాలి ఇలా పాడుతుంది: టుడేస్ సాడ్‌నెస్ హాజ్ బీన్ కాన్సల్‌డ్!