పాఠకులకు సూచనలు

ఈమాట పాఠకులకు నమస్కారం.

ఈమాటలో రచనలపై మీ అభిప్రాయాలని విమర్శలనీ రాయడానికి వీలుగా ప్రతీ రచన చివర ఒక అభిప్రాయాల పెట్టె వున్న సంగతి మీకు తెలుసు. ఈ అమరిక ముఖ్యోద్దేశం ఒక రచనపై ప్రత్యక్షంగా మీ అభిప్రాయాలనీ, మీ దృక్పథాన్నీ రచయితకు తెలియజేసేదిగా ఉండటం. కానీ, క్రమేణా, రచనపైన అభిప్రాయాలు తక్కువైపోయి, సాటి పాఠకుల కామెంట్లపై విమర్శ-ప్రతివిమర్శలతో, ఈ అభిప్రాయ వేదిక ఒక చర్చారంగంగా, ఒక్కొక్క సారి కలహవేదికగా మారిపోతున్నది. ఇది ఇలానే కొనసాగనిస్తే, రచయితకీ పాఠకులకీ మధ్య సుహృద్భావ వాతావరణం సమసిపోయే పరిస్థితి వచ్చి ఈమాట ప్రాథమిక ఆశయానికే దెబ్బ తగిలే ప్రమాదం రావచ్చు. ఆ స్థితి రాకముందే ఈమాట రచనలపై మీ అభిప్రాయాలను ప్రకటించడానికి కొన్ని నియమాలను ప్రవేశపెడుతున్నాం. వీటిని, మీ వాక్స్వాతంత్ర్యానికి కట్టుబాట్లుగా కాకుండా, ఈమాటలో ఒక స్నేహపూరితమైన వాతావరణం కోసం ఏర్పరుచుకున్న ఒడంబడికలుగా భావించి మాతో సహకరించమని కోరుతున్నాం.

  • మీ అభిప్రాయాలు ఈమాటలో రచనలకు ప్రత్యక్షంగా సంబంధించి వుండాలి.
  • అభిప్రాయాలు రచయితని లేదా ముఖ్యసంపాదకుడిని సంబోధిస్తూ రాయండి. సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి. వారితో సంప్రదించవలసిన లేదా చర్చించవలసిన అవసరం ఉంటే అందుకు చర్చావేదికను వాడుకొనండి.
  • మీ అభిప్రాయం ఆమోదించబడేముందు, మీరిచ్చిన ఈ-మెయిల్ ఐడీ నిర్ధారించబడుతుంది. అలా నిర్ధారణ కాని అభిప్రాయాలు తొలగించబడతాయి.
  • మీరు ఏ పేరుతోనైనా మీ అభిప్రాయాలు రాయవచ్చు. కాకపోతే, అభిప్రాయాల పెట్టెలో మీరిచ్చే మీ వివరాలు మిమ్మల్ని సంపాదకులు సంప్రదించడానికి వీలుకలిగేట్టు ఉండాలి. మీ ఈమెయిల్, మీరు కలంపేరు వాడదలచుకుంటే మీ అసలు పేరు, గోప్యంగా వుంచబడతాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, మీ లిఖితపూర్వకమైన అనుమతి లేకుండా మీ వివరాలు ఎవరికీ తెలియజేయబడవు.
  • అభిప్రాయాలు ఆయా రచనల సాహిత్య లక్షణాలపట్ల చర్చకు దారి తీసేవిగా ఉండాలి. అందువల్ల దయచేసి మీ అభిప్రాయాలను కవితలుగా, ఆలాపనలుగా, కథానికలుగా రాయకండి. మీ సృజనకు అభిప్రాయాల పెట్టె వేదిక కాదు.
  • మీ అభిప్రాయాలని పరిష్కరించి ప్రచురించడానికి, అసంగతమైన అభిప్రాయాలు తొలగించడానికీ సంపాదకులకు అధికారం ఉంటుంది. సంపాదకుల నిర్ణయాలపై ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
  • చర్చ సాహిత్యానికి సంబంధించి వున్నంతవరకూ, ఉత్తరాలలో వ్యక్తిగత నిందలూ, అసభ్యమైన భాషా లేనంతవరకూ, చర్చావరణం పరస్పర నిందారోపణలతో కలుషితం కానంతవరకూ ఆ చర్చపై ఇంకెటువంటి నిర్బంధాలూ వుండవు.