తెలుగు సాహిత్య విమర్శకు తూనికరాళ్ళు

కవిత్వాన్ని తూచేరాళ్ళు తనదగ్గర లేవన్నాడు చలం, మహా ప్రస్థానానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ అడిగినప్పుడు. సాహిత్యసృజనకు సంబంధించిన ఏ రూపాన్నైనా విమర్శించడానికి లేదా అంచనా గట్టడానికి నిజంగా ఏ విధమైన ప్రమాణాలు లేవా? అని ప్రశ్నిస్తే చలం అభిప్రాయం అది కాదని, ఆయన రాసిన యోగ్యతా పత్రంబట్టి తెలుస్తుంది. అయితే తెలుగులో సాహిత్య విమర్శ చాలావరకు విమర్శకుల స్వీయాత్మక అభిప్రాయాలపై, వారు సొంతంగా నిర్ణయించుకున్న కొలమానాలపై, వారి స్వీయ సౌందర్యాభిరుచిపై ఆధారపడి జరుగుతూ వస్తోంది. ఒక నవలనో, నాటకాన్నో లేదా కథనో, కవితనో చదివి ఒకరు చాలా బాగుంది అంటారు, మరొకరు పెదవి విరుస్తారు. మరి కొందరు ఫర్వాలేదనే వ్యాఖ్యానం చేస్తారు. ఎందుకలా అంటున్నారంటే తమదైన వివరణలు ఇస్తారు. సాహిత్య విమర్శలోకూడా ఇలాంటి ధోరణే కనిపిస్తుంది. ప్రకృతి శాస్త్రాలలో సార్వజనీనమైన, సర్వ ఆమోదయోగ్యమైన న్యూటన్‌ గమన నియమాలు, ఫారడే-మ్యాక్స్‌వెల్‌ విద్యుదయస్కాంత సూత్రాలు, ఐన్‌స్టీన్‌ విశ్వనిర్మాణ పరికల్పనలు మెదలైనవి ఉండగా సామాజిక-మానవీయ శాస్త్రాలకు సంబంధించి శాస్త్రీయ నిర్ధారణలు లేవా? ప్రత్యేకించి సాహిత్యవిమర్శకు అందరూ కట్టుబడి ఉండగలిగే తూనికరాళ్ళు లేవా? అనే ప్రశ్నలు అప్పుడప్పుడు తలెత్తుతాయి. దీని అర్థం ప్రకృతిని, సమాజాన్ని ఒకే విధంగా అధ్యయనం చేస్తామని కాదు. ప్రకృతిలో మార్పులు సహజసిద్దంగా జరిగితే, సమాజంలో మార్పులకు మానవుల చైతన్యం తోడవుతుంది. ఈ చైతన్యమే కళా సాహిత్య, సాంస్కృతిక రంగాలకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించవలసి ఉంటుంది. నూరేళ్ళకు పైబడిన ఆధునిక తెలుగు సారస్వతంపై వచ్చిన విమర్శను స్థూలంగా పరిశీలిస్తూ కొన్ని ప్రామాణిక తూనికరాళ్ళను సూచించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఆధునిక తెలుగు సాహిత్యసృష్టి సమకాలీన సామాజిక జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకోవడం, అందుకు తగిన రీతిన ఆధునిక సాహిత్య విమర్శనా పద్దతికూడా మౌలికంగా మారడంవలన గతకాలపు ప్రాచీన, ప్రబంధ సాహిత్యం ప్రస్తుత వ్యాసపరిధిలోకి రావు.

మొదటగా సాహిత్య దృక్పథం

ఏ సాహిత్య రూపానికైనా మూలం, ముడిసరుకు సమాజమే. మానవుల జీవిత సంఘర్షణలు, సంబంధ-బాంధవ్యాలు, భావోద్వేగాలు, అనుభూతులు, సుఖ-దుఃఖాలు, రాజకీయ-ఆర్థిక-సాంస్కృతిక సమస్యలు మొదలైన వాటన్నింటి సమన్వయ సమాహారమే సమాజమైతే వీటిని ఎలా అర్థంచేసుకోవాలి? సాహిత్యసృజనలో ఎలా వ్యక్తీకరించాలి? అనే ప్రశ్నలు రచయిత దృక్పథంపై ఆధారపడతాయి. ప్రతి రచయిత తన సాహిత్యంలో తెలిసికాని, తెలియకకాని ఒక సాహిత్య తాత్విక దృక్పథాన్ని అనివార్యంగా వ్యక్తీకరిస్తారు. కావున సాహిత్యవిమర్శలో వస్తు, రూపాలతోపాటు దృక్పథాన్ని పరిశీలించటం అవశ్యకమవుతుంది. ఆర్‌. ఎస్‌. సుదర్శనం రాసినట్లు, “సాంప్రదాయకమైన విమర్శ అలంకార శాస్త్రరీత్యా కావ్యం ఏ జాతికి చెందినది? దీని లక్షణాలు, గుణదోషాలు ఏమిటి? అని ప్రశ్నిస్తుందే తప్ప, కవి దృక్పథం ఏమిటి అనే ప్రశ్నకు ప్రాధాన్యం యివ్వదు. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. కావ్యార్థం కవి దృక్పథం మీదే ఆధారపడుతుంది.”[1]

ఆధునిక సాహిత్యవిమర్శలో సైతం రచయిత సాహిత్య దృక్పథాన్ని పరిశీలించడానికి తగిన ప్రాధాన్యతనీయకపోవడం జరిగింది. నిజానికి సాహిత్య దృక్పథమే సమాజంలో రచయిత స్థానాన్ని నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. ఒక రచన మౌలికంగా పురోగమనమైనదా లేక తిరోగమనమైనదా అనే అంచనాకు రావడానికి తోడ్పడుతుంది. శ్రీశ్రీ మాటల్లో చెబితే “ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికొక చరిత్ర, ఆ చరిత్రకొక పరిణామక్రమం ఉంటాయి. సామాజిక చారిత్రక పరిణామ గమనంలో కవి యొక్క సాహిత్య స్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రభావశీలి అయితే ఈ గమనాన్ని అతడు వేగవంతం చేస్తాడు.”[2]

రెండవ అంశం – రచయిత జీవించిన కాలం

రచయిత ఆలోచనలు పూర్తిగా సర్వస్వతంత్రమైనవి కావు. ఎంతో ప్రతిభ, మేధస్సు కలిగివున్న రచయిత భావాలు కూడా సమాజంలో నెలకొని వున్న ఆలోచనా ధోరణుల వ్యక్తీకరణగా ఉంటాయి. ఆ మాటకొస్తే ప్రతి వ్యక్తి ఆలోచన రెండు అంశాలచే నియంత్రించబడుతుంది. ఒకటి భౌతిక పరిస్థితి (material condition), మరొకటి ఆలోచనాపద్ధతి (method of thinking). ఒక సామాజిక వ్యవస్థలో ఒకానొక ప్రత్యేక దశలో నెలకొనివున్న వాస్తవిక భౌతిక పరిస్థితి నుండే ఆలోచనకు అవసరమైన ముడి వనరులు లభిస్తాయి, ఆలోచనా దృక్పథం అలవడుతుంది. ఈ భౌతిక వాస్తవిక పరిస్థితితో మనిషి మెదడు నిర్వహించే అంతఃచర్య (interaction) ద్వారా ఆలోచన పుట్టుకొస్తుంది. భౌతిక వాస్తవిక పరిస్థితితో అంతఃచర్య జరిగే తీరు, దాన్నుండి పుట్టుకొచ్చే భావాలు అనేవి ఆలోచనా దృక్పథం, అనుభవాలపై ఆధారపడివుంటాయి. భౌతిక వాస్తవిక పరిస్థితి ఒకటే అయినప్పటికీ మనిషికి మనిషికి మధ్య ఆలోచనలలో, భావాలలో వ్యత్యాసానికి కారణం ఆలోచనా దృక్పథం, అనుభవాలు వేరువేరుగా ఉండడమే. ఏది ఏమైనా భౌతిక వాస్తవిక పరిస్థితి పరిధిని అధిగమించి ఎవరూ ఆలోచించలేరు. అలాగే అన్ని యుగాలకు, సర్వ కాలాలకు పనికివచ్చే విషయాలను గూర్చి ఆలోచించడం అసాధ్యం. ఒక రచయిత సాహిత్యాన్ని సరిగా అంచనా వేయాలంటే ఆ సాహిత్య సృజన జరిగిన కాలాన్ని తప్పక దృష్టిలోకి తీసుకోవాలి. ఆ కాలానికి, ఆనాటి సామాజిక పరిస్థితులకు అతీతంగా, వాటిని గమనంలోకి తీసుకోకుండా పరిశీలించలేము. సమకాలీన పరిస్థితులలో ఒక రచయిత సాహిత్య పాత్రను అంచనా వేయలేము.

మూడవది – రససృష్టి లేదా కళాత్మకత రూపం

దీన్నే మరోమాటలో కళాశిల్పం లేదా కథన రీతి అని కూడా అనవచ్చు. జీవితాన్ని రసాత్మకంగా చిత్రీకరించటమే సాహిత్యం కావున రచయిత తీసుకున్న వస్తువును కళాత్మకంగా వ్యక్తీకరించినపుడే ప్రయోజనం నేరవేరుతుంది. అందుకే, ‘వాక్యం రసాత్మకం కావ్యం,’ అన్నారు పండితులు. వస్తువు ఎంత మంచిదైనా అందుకు తగిన కళారూపం కొరవడితే రచన వెలవెలబోతుంది. ఒకటి నిజమే! ఉన్నత వస్తువు లేకుండా గొప్ప రససృష్టి జరగదు. అయితే వస్తువు దానికంతట అదే ఉత్తమ కళారూపానికి దారి తీయదు. ఇక్కడే రససృష్టి గావించడంలో రచయిత ప్రతిభాపాటవం, జీవితాన్ని దర్శించిన తీరు వెల్లడవుతాయి. ఒక రచయిత ఆలోచనలు, భావాలు ఎంతో ప్రగతిశీలమైనవైనప్పటికీ అవి ఒక సాహిత్య రూపంలో అందంగా వికసించి, సురభిళ సౌరభాలు వెదజల్లడానికి తగిన, సముచితమైన రస మాధ్యమం అవసరం. ఇది లోపిస్తే రచన సాహిత్య అర్హతను పొందలేదు, పాఠకులను ఆకర్షించలేదు.

“రచయిత ఉద్దేశ్యం ఎంత గొప్పదైనా అది రచనలో కళాత్మకంగా వ్యక్తం కానంతవరకు దానికి విలువలేదు. కథావస్తువు గమ్యమే ఉద్దేశం. ఉద్దేశాన్ని కళగా మార్చే పరుసవేది శిల్పం లేదా రూపం.”[3]. అలాగే రససృష్టి లేదా కళాత్మకతతో ముడిపడి వున్న విషయం మరొకటుంది. ఒక రచయిత తానెన్నుకున్న వస్తువు సంక్లిష్టమైనదైనప్పటికీ దాన్ని చక్కగా కళాత్మకంగా చూపగలిగితే అది పాఠకుల హృదయపు లోతుల్లోకి చొచ్చుకుపోతుంది. వారి గుండెలను తాకుతుంది, సున్నిత భావోద్వేగాలను, అనుభూతులను తట్టి లేపుతుంది. అందుచేత పామరులు సైతం వారి మేధస్సుతో సంబంధం లేకుండా అత్యంత సంక్లిష్ట భావాలను కూడా చాలా సులభంగా అర్థంచేసుకోగలుగుతారు. పండితులైతే తమ మేధస్సుతో ఆ భావాలను మరింత లోతుగా అర్థంచేసుకొని ఆస్వాదిస్తారు. అలాగే కథనరీతికి సంబందించిన ఒక ముఖ్య విషయమేమంటే రచయితయే నేరుగా సంఘటనలను వివరిస్తూ, వర్ణిస్తూ కథనాన్ని నడపడం కంటే, పాత్రలమధ్య పరస్పర సంభాషణలు, భావోద్వేగాలు వ్యక్తమవుతూ, పాత్రల స్వభావాలు, చిత్తప్రవృత్తులు, గుణదోషాలు వెల్లడవుతూ కథాగమనం మెట్టుమెట్టుగా పట్టుబిగిస్తూ ముందుకు సాగితే పాఠకుల మనస్సులను రంజింపచేస్తుంది. కావున వస్తుసారం, రస రూపాల మేలుకలయిక ద్వారానే ఉత్తమ సాహిత్యసృష్టి జరిగి పాఠకుల్లో ఉన్నత స్థాయి భావోద్వేగాలు, అభిరుచులు పెంపొందుతాయి. ఇలాంటి సాహిత్యమే సమాజాన్ని మానవీయంగా, ఉన్నత జీవిత విలువల దర్పణంగా మార్చడంలో పురోగామి పాత్రను పోషిస్తుంది.

నాల్గవది – సౌందర్యాభిరుచి

కన్యాశుల్కం నాటకం మొదటి ముద్రణ ముందుమాటలో గురజాడ ఇలా రాశాడు: “ఇలాంటి అమానుష పరిస్థితులు నెలకొని ఉండడం సమాజానికే అవమానకరం. సమాజాన్ని అప్రతిష్ట పాలుజేసే ఇలాంటి పరిస్థితిని కళ్ళముందు పెట్టి, నైతిక భావాల ఉన్నత ప్రమాణాలను ప్రాచుర్యంలోనికి తేవడంకంటే సాహిత్యానికి ఉత్తమమైన కర్తవ్యమేమీ ఉండదు.”[4]. సాహిత్యం ద్వారా నైతిక భావాల ఉన్నత ప్రమాణాలను పెంపొందించడం అనేది కావ్యార్థం లేదా సాహిత్య ప్రయోజనం అనే భావనపై ఆధారపడి ఉంటుంది. అలాగే రచయిత సౌందర్యాభిరుచితో కూడ విడదీయరాని విధంగా ముడిపడి ఉంటుంది. ‘కళ అనేది కళ కోసమే లేదా కావ్యం అనేది కావ్యానందాన్ని పంచడానికే’ (art for art sake) అని భావించేవారికి సమాజ నైతిక ప్రమాణాల విషయంలో పెద్దగా పట్టింపు ఉండదు. ఈ తరహా రచయితల సాహిత్యంలోని స్త్రీ-పురుష సంబంధాల చిత్రీకరణలోనూ, హాస్యరస సంభాషణలలోనూ వారి సౌందర్యాభిరుచి వ్యక్తమౌతుంది. ఉన్నతాభిరుచిని పెంపొందించడానికి బదులు ప్రణయం, శృంగారంల పేరుమీద అసభ్యతకు తావిచ్చిన సందర్భాలు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. పేరుమోసిన పెద్ద రచయితల్లో కూడా ఇలాంటి ధోరణి కనిపిస్తుంది. ఒక విషయం నిజమే! కాల్పనికవాద (romantic) సాహిత్యంలో ప్లటోనిక్‌ ప్రేమ, అమలిన శృంగార భావనలు అసభ్యతకు తావులేకుండా హృద్యంగా చిత్రీకరింపబడ్డాయి. అలాగే ఆధునిక సాహిత్యంలోకూడా కొద్దిమంది రచయితల విషయంలో లైంగిక సంబంధాల వర్ణనలనేవి సామాజిక సంస్కారాలు, సభ్యతల కట్టుబాట్ల పరిధిని దాటిపోలేదు. అయితే ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో సాహిత్య సౌందర్యాభిరుచి బాగా దిగజారిపోయింది. ఈ పెడధోరణికి బలైన రచయితలు హాస్యాన్ని వెకిలిగా మార్చడం, ప్రత్యేకించి స్త్రీల స్వరూప, స్వభావాలపై వెటకార వ్యాఖ్యానాలు చేయడం కనిపిస్తుంది. మరికొందరు తమ మానసిక వికారాలకు అనుగుణంగా స్త్రీ-పురుషుల లైంగిక ప్రవృత్తులను సభ్యతా సంస్కారాల పరిధిని దాటి చిత్రీకరించడం, కొంతమంది విమర్శకులు దాన్ని ‘బోల్డ్‌’గా రాసినట్లు అభినందించడం జరుగుతోంది. దీనికి భిన్నంగా ‘కావ్యార్థం సమాజ హితం’ అని గట్టిగా విశ్వసించే రచయితలు సమాజంలో ఉన్నత నైతిక ప్రమాణాలను పెంపొందించడానికి ప్రాధాన్యతనిస్తారు. అయితే ఈ కోవకు చెందిన రచయితలంతా ఉన్నత విలువలను ప్రోదిచేసే పాత్ర పోషించలేకపోయినప్పటికీ, తమ సాహిత్యం ద్వారా విలువల దిగజారుడుకు దోహదం చేయడానికి మాత్రం ఇష్టపడరు. కావున సాహిత్య విమర్శలో సౌందర్యాభిరుచిని పరిగణనలోనికి తీసుకోవడం తప్పనిసరి.

ఐదవది – భావి నవజీవనాన్ని అంతర్లీనంగా అల్లిన వైనం

మునుపు ప్రస్తావించిన రచయిత సాహిత్య తాత్విక దృక్పథంతోనూ, సాహిత్య ప్రయోజనంతోనూ సన్నిహితంగా ముడిపడివున్న అంశమిది. గురజాడతో ప్రారంభమైన ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పరిశీలించినపుడు రెండు విషయాలు ప్రస్ఫుటంగా ద్యోతకమవుతాయి. ఒకటి- వ్యవహారిక భాషలో రచన, రెండు- ఇతివృత్తంలో సామాజిక జీవితం. గురజాడ పేర్కొన్నట్లుగా, “పుష్కలమైన, అనంతమైన సంఘటనలతో నిండి వున్న ఎంతో గాంభీర్యమూ, వైవిధ్యమూగల నేటి జీవితాన్ని వీక్షించక ప్రపంచ ప్రసిద్ది కెక్కిన ప్రాచీన కాల్పనిక కథలనుంచి రచయితలు ఎందుకు యితివృత్తాలు స్వీకరిస్తారో అర్థంకాక నాకు ఆశ్చర్యం వేసింది. ఈ కారణాల వల్ల నేను వాస్తవ జీవితం నుంచి ఇతివృత్తాన్ని స్వీకరించి దానిని తెలుగున వాడుక భాషలో నాటకంగా రూపొందించాను.”[5]. “దీనితో సాహిత్యం దేవతల కథలనుండి, రాణుల ప్రేమగాథలనుండి, రాజుల సాహసకృత్యాలనుండి భూమిమీదకు దిగివచ్చి జీవితాన్ని చిత్రీకరించడం ప్రారంభించింది.”[6]. తెలుగు సాహిత్యంలో ఇదొక కొత్త మలుపు, నవజాగరణ (renaissance) తెచ్చిన విప్లవం. అయితే నేటి పరిస్థితుల్లో ఒక రచయిత సాహిత్యంలో కేవలం జీవిత యథార్థాలను చిత్రీకరించటంతోనే సరిపోదు. అక్కడికే పరిమితమైతే అదొక ఛాయాచిత్ర ప్రతిబింబ రూపం (photographic reflection) లాంటిదవుతుంది. రవి కాంచని చోటు కవి గాంచున్‌- అన్నట్లుగా జీవిత సంఘర్షణలోని సంక్లిష్టతలను చూడగలగాలి. అదే సమయంలో ప్రస్తుత సామాజిక గర్భంలో రూపొందుతున్న రాబోవు జీవితపు ఆకాంక్షలను దర్శించగలగాలి. ఓ సందర్భంలో గోర్కీతో టాల్‌స్టాయ్‌ ఇలా అన్నాడు: “నిజజీవితాన్ని యథాతథంగా రాయకు. జీవితంపై నీ అభిప్రాయాలతో, జీవితం ఎలా ఉండాలని వాంఛిస్తున్నావో వాటిని చిత్రీకరించు.”[7]. కావున సాహిత్యం కేవలం జీవితం ఇలా ఉందని లేదా ఇంత దుర్భరంగా తయారైందని చూపే దర్పణం మాత్రమేకాదు. నేడున్నది, రేపు రాబోయేది (what is and what ought to be) అనే రెండింటినీ మేళవించి చిత్రీకరించిన సాహిత్యం గొప్పదవుతుంది. అలాంటి సాహిత్యం పాఠకుల్లో జీవితాన్ని మెరుగ్గా మార్చాలనే తపనను జ్వలింపచేస్తుంది. దీనర్థం రచయిత తన సొంత సృజనాత్మకతను కోల్పోయి సాహిత్య రచనను ఒక తరహా భావజాలానికి అనుగుణ్యమైన ఫక్తు ప్రచారంగా మార్చడం కారాదు. దీన్ని అంతర్లీనంగా అదే సమయంలో అస్పష్టతకు తావులేకుండా వ్యక్తీకరించగలగాలి. దీనికిగాను పైన చెప్పిన రచయిత కళాత్మకత, శిల్ప చాతుర్యం తోడ్పడుతాయి. ఈ విషయంలో రచయిత సాఫల్య, వైఫల్యాలను అంచనా వేయాలి.

ఆరవ అంశం – భాష మరియు శౖలీసరళత

రచనా సంవిధానానికి (టెక్నిక్‌) సంబంధించిన అంశమిది. ఆధునికోత్తర వాదం (post modernism) అనబడే ఒక భావజాలం తలెత్తిన తరువాత సాహిత్యంలో కూడ కులం, జెండర్‌, మైనారిటీ, ప్రాంతీయత వంటి ధోరణులు బలంగా ముందుకు రావడంతో పాటుగా సాహిత్య భాష, శైలి ప్రభావితమయ్యాయి. వందేళ్ళ క్రితం గ్రాంథిక భాషా ప్రభావం నుండి బయటపడి వ్యవహారిక వచనంలో కొనసాగిన తెలుగు సాహిత్యాన్ని ప్రస్తుతం విమర్శిస్తూ మాండలికంలో, పల్లె భాషలో రాయడమే నిజమైన ప్రజాసాహిత్యంగా ప్రస్తుతించడం ప్రారంభమైంది. సాహిత్య విమర్శలో కూడా కులం స్పృహ, జెండర్‌ స్పృహ, మైనారిటీ స్పృహ, ప్రాంతీయతా స్పృహ అంటూ విడదీసి అంచనా వేయడం కూడా జరుగుతోంది. ఈ విధమైన విభజన చూడడానికి సరైందిగానే అనిపించవచ్చు. ఎందుకంటే ఈ తరహా స్పృహలతో సృజించిన సమస్యలన్నీ విస్తృత సామాజిక ఇతివృత్తాలే. అయితే ఈ ధోరణుల తప్పుడు అవగాహన వలన ఒక ప్రజా సమూహానికి విరుద్ధంగా మరో సమూహాన్ని నిలబెట్టి చూపడం, సాహిత్యంలో చిత్రీకరించడం జరిగి విచ్ఛిన్నకర వాదానికి దారితీసింది. దీని వలన సామాజిక వైరుధ్యాల అసలు మూలాలు మరుగున పడిపోయి కొసరుకై కలహాలు ముందుకు వస్తాయి.

ఇక ప్రాంతీయ లేదా పల్లె యాసలో (slang) రాయడం గురించి. సమాజం కోసం, ప్రజల కోసం రాస్తున్నాము అనే భావనలో చదువుకున్న, సాహిత్య అభిరుచి ఉన్న పాఠకుల కోసం అనే అర్థం ఇమిడి వుంది. అంతేకాని అట్టడుగు దళితుల గురించి, గ్రామీణుల గురించి రాసినంత మాత్రాన వారంతా చదువుతారని కాదు. వారిలో కొద్ది మందితో పాటుగా ఎక్కువమంది ఇతర పాఠకులు ఉంటారు. వీరంతా సహజంగానే వ్యవహారిక వచనాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతారు. వాస్తవానికి సాహిత్యం అన్ని అడ్డుగోడలను అధిగమించే ప్రజాస్వామ్య భావజాల వ్యాప్తితో పాటుగా భాషను మెరుగు పర్చి ఒక మాతృ భాషలోని ప్రజలందరూ ఉపయోగించే ప్రామాణిక భాషను అభివృద్ది చేయడానికి తోడ్పడాలి. అంతేకాని పాత ఫ్యూడల్‌ విభజనలకు, అప్పటి వెనుకబడిన మాండలిక భాషకు సాహిత్యంలో పెద్ద పీఠవేయడం మంచిది అనిపించదు. అలాగే పల్లె ప్రజల లేదా ఓ కులపు మొరటు (rustic) భాషలో రాసినప్పుడే వారి గురించి బాగా అర్థం చేసుకుని రాసినట్లు భావించడం కూడా సరైంది కాదు. వ్యవహారిక భాషకు గురజాడ ఇచ్చిన నిర్వచనంలో శిష్ట వ్యవహారికం లేదా సంస్కరించబడిన వాడుక భాష అనే అర్థం ఇమిడి వుంది. “తెలుగు సాహిత్య భాషను నాగరికతా వ్యాప్తికి ఒక గొప్ప సాధనంగా చేయాలంటే, దాన్ని వ్యవహారిక భాషకు దగ్గరగా తీసుకురావాలి. దాన్ని పూర్తిగా వినూత్నం చేయాలి. తెలుగుదేశంలోని వివిధ ప్రాంతాల్లో మామూలుగా మాట్లాడే తెలుగుభాషలో పాతుకొని పోయివున్న ప్రజల అలవాట్లవల్ల మాండలిక బేధాలు పెద్దగాలేవు. సమర్థులైన రచయితలు గట్టిగా పూనుకుంటే, ఒక కొత్త ఉమ్మడి సాహిత్య భాషను సులభంగా రూపొందించవచ్చు.”[8]. భావితరాల రచయితలపై గురజాడ మోపిన బాధ్యతను విస్మరించి మాండలికాన్ని తలకెత్తుకోవడం భావ్యం కాదు. మరోవైపు సామాన్య పాఠకులకు అర్థం కాని విధంగా దీర్ఘ సమాసాలతో, సంస్కృత పదబంధాలతో, సంక్లిష్ట వాక్యనిర్మాణంతో రాసే పండిత రచయితలు కూడా ఉన్నారు. సూటిగా, సరళంగా రాయడానికి బదులు పద ఆడంబరానికి ప్రాధాన్యతనిచ్చే తపన వీరిలో కనిపిస్తుంది. ఇలాంటి అవాంఛనీయ ధోరణుల నుండి తెలుగు సాహిత్యము, విమర్శ బయటకు రావాలి. సరళ శైలిలో, ప్రామాణికమైన వ్యవహారిక వచనంలో సాహిత్య సృజన జరగడానికి దోహదం చేయాలి.

చివరిది – బాధాసర్ప ద్రష్టులతో బలంగా పెనవేసుకున్న సాహిత్యబంధం

సాహిత్యకారులను నోరులేని నిర్భాగ్యుల మరో గొంతుక (voice of the voiceless) అని అంటారు. అందుకే సాహిత్యసృజనకు సమాజం జీవగర్రగా నిలిస్తే, అట్టడుగులకు సాహిత్యకారులు అండగా నిలుస్తారు. కావున ప్రజారచయితలు విశాల ప్రజాబాహుళ్యం చేస్తున్న జీవిత పోరాటాలతో సంబంధం లేకుండా ఉండలేరు, సరికదా, సజీవ సాహిత్యాన్ని సృష్టించలేరు. అటు ప్రపంచ సాహిత్యంలోనూ, ఇటు మన భారతీయ భాషల్లోనూ ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించిన రచయితలందరూ ఆయా కాలాలలో జరిగిన సామాజిక, సాంస్కృతిక పోరాటాలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములైన వారే లేదా ఆ పోరాటాలతో భావోద్వేగ సంబంధం కలిగివున్న వారే. కాలం విసిరిన సవాళ్ళను ఎదుర్కోవడానికి, మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను దర్శించడానికి సామాజిక కార్యాచరణలో పాల్గొన్నవారే. వీరు ప్రజలను అమితంగా ప్రేమించి, వారి కన్నీటి గాథలను, జీవిత బాధలను కళ్ళారా చూసి స్పందించారు. తమ సామాజిక స్థాయితోను, వర్గ-లింగ బేధాలతోను నిమిత్తం లేకుండా పీడిత, తాడిత బాధాసర్ప ద్రష్టులవైపు నిలబడ్డారు. జీవిత పోరాటాల క్షేత్రస్థాయినుండే తమ సాహిత్య సృజనకు అనువైన భావం, భావావేశం రెండింటినీ పొందగలిగారు. హృదయమున్న ప్రతియొక్కరినీ కదిలించగలిగే రసమాధ్యమంలో, అందరికీ అర్థమయ్యే సరళభాషలో వ్యక్తీకరించారు. అందుచేతనే వారి సాహిత్యం విశ్వజనీనమైంది. ప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటర్జీ ఇలా ప్రకటించాడు: “తమకున్న సర్వస్వాన్ని అర్పించి అందుకు ప్రతిఫలంగా ఏదీ పొందని వారున్నారు సమాజంలో. వారే నిర్భాగ్యులు, అభాగ్యులు, పీడితులు. వారు మనుష్యులే అయినప్పటికీ వారి కన్నీళ్ళను సమాజం గమనంలోకి తీసుకోలేదు. తమచుట్టూ అంతులేని సంపదలున్నప్పటికీ వాటిపై తమకు హక్కు ఎందుకులేదు అని అడగలేని నిస్సహాయ జీవితాలు వారివి. నేను వారికి చెల్లించ వలసిన రుణం ఏమైనా స్వల్పమైనదా? వారి బాధలే నాకొక గొంతుకనిచ్చాయి. ఆ మనుష్యుల తరఫున ఫిర్యాదును ఇతర మనుష్యులవద్ద నమోదు చేయడానికి వారే నన్ను పంపారు. వారికి వ్యతిరేకంగా అంతులేని అన్యాయాన్ని, వంచించబడిన న్యాయాన్ని, భరింపశక్యంకాని, న్యాయాన్యాయ విచక్షణలేని అధికారాన్ని నేను చూశాను. అందువల్ల నా కార్యభారమంతా వారితోనే.”[9]. ఈ కోవకు చెందిన రచయితల జీవితం వేరుగా, సాహిత్యం వేరుగా కాక రెండూ పెనవేసుకొని ఒకే రాగంలో పల్లవించాయి. కావున రచయిత జీవితాన్ని, ఆ జీవితంతో కలగలసిపోయిన సాహిత్యాన్ని ఒక అంశంగా సాహిత్య వివేచనలో పరిశీలించవలసిన అవసరముంది.


స్థూలంగా, సంక్షిప్తంగా వీటిని సాహిత్య విమర్శకు సంబంధించిన ప్రమాణాలుగా లేదా తూనికరాళ్ళుగా క్రోడీకరిస్తున్నాను. ఇవి సర్వసమగ్రమని ఎవరూ భావించరాదు. అలాగే వీటిని విడదీసి వేర్వేరుగా చూడరాదు. అవగాహన కోసం వీటిని ఒకటి, రెండు… అంటూ విడదీసినప్పటికీ, ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న అంశాలని మరువరాదు. వాస్తవానికివి పరస్పర పూరకాలేకాక ఆధారితాలు కూడా. సామాజిక పరిస్థితులు రచయిత సాహిత్య తాత్విక దృక్పథాన్ని, రస మాధ్యమాన్ని రూపొందిస్తే, సాహిత్య తాత్విక దృక్పథం రచయిత ఎంచుకునే వస్తువును ప్రభావితం చేస్తుంది. సమాజం యెడల బాధ్యతాస్పృహ నైతికతతో ముడిపడిన సౌందర్యాభిరుచికి దారి తీస్తుంది. ప్రజలపట్ల పట్టింపు రచయిత ప్రయోగించే భాషను, శైలిలో సరళతను నిర్ణయిస్తుంది. రచయితను ప్రత్యక్ష కార్యాచరణకు పురికొల్పుతుంది.

ఈ ప్రతిపాదిత ప్రమాణాల దృష్ట్యా ఆధునిక తెలుగు సాహిత్య వినువీధులను విహంగ వీక్షణం గావిస్తే గురజాడ, శ్రీశ్రీలు ధృవతారలుగా కనిపిస్తారు. ఆధునిక దృక్పథానికి జాడ గురజాడది కాగా, అభ్యుదయ సాహిత్య యుగకర్తగా శ్రీశ్రీ నిలుస్తాడు. అన్ని అంశాలలో కాకపోయినప్పటికీ చాలావాటిలో వీరిరువురు చేసిన కృషి వలన తెలుగు సాహిత్యం నవ్యపథాన మలుపు తిరిగింది.

గురజాడ, శ్రీశ్రీల తరువాత ఉన్నవ, శ్రీపాద, దాశరథి, కొకు, ఆరుద్ర, రావిశాస్త్రి, చాసో, సోమసుందర్‌, మధురాంతకం, కాళీపట్నంలతోపాటు మరికొందరు అభ్యుదయ పథంలో తెలుగు సాహిత్యాన్ని కొన్ని కొన్ని అంశాలలో సుసంపన్నం చేశారు. ఇక కాల్పనిక వాద సాహిత్య ధోరణికి ప్రతిరూపంగా నిలిచిన రాయప్రోలు, కృష్ణశాస్త్రి, నండూరి, తిలక్‌ తదితరులు మన సారస్వతానికి మనోహరమైన కళాత్మక రంగులద్దారు. తెలుగు సాహిత్య క్షేత్రాన్ని నలువైపులా దుక్కిదున్ని, అన్ని రూపాలలో అనితర సేద్యం చేసిన సాహితీ ఉద్దండుడు విశ్వనాథవారిది గత వైభవాన్ని కీర్తించే తిరోగమన దృక్పథం. “ఆయనలో, భావన, ఆలోచన, దర్శనము (insight) అన్నీ హైందవ సంప్రదాయ నిబద్ధమైనవి.”[10]. కాలం, వస్తువు ఆధునికమైనప్పటికీ ప్రాచీన పద్య సాంప్రదాయంలోనున్న గుర్రం జాషువా సాహిత్యం జనరంజకం కాలేకపోయింది. పాలగుమ్మి పద్మరాజు కథన కౌశలాన్ని, ప్రపంచ ఖ్యాతిని కీర్తిస్తాము కానీ మానసిక వైకల్యమే మానవ ప్రవర్తన అని ఆయన చెప్పడాన్ని మెచ్చుకోలేము. సామాజిక కట్టుబాట్లను నిరసించిన రచయితగా చలం కనిపించినప్పటికీ స్వేచ్ఛను విశృంఖలత్వంగా, స్త్రీ-పురుష సంబంధాలను సెక్స్‌ ఆనందంగా వికృతం చేశాడాయన. “స్త్రీకి స్వాతంత్య్రం- ఆర్థిక స్వాతంత్య్రం కూడా- ఉండాలని చలం చెప్పాడు. కానీ స్వాతంత్ర్యాన్ని స్త్రీ శృంగార జీవితానికే పరిమితం చేస్తున్నట్లుగా చిత్రీకరించాడు.”[11]. ఆయన సాహిత్యంలో స్వీయ వైరుధ్యాలు అడుగడుగునా అగుపిస్తాయి. చలం శైలి, సంవిధానం ఆకట్టుకున్నప్పటికీ, ఆయన సాహిత్యంలోని తక్కువ స్థాయి సౌందర్యాభిరుచిని అంగీకరించలేము. ఇక విశిష్ట రచయితలుగా పిలువబడ్డ గోపీచంద్‌ది జీవితానికి మార్గదర్శకత్వం చూపలేని హేతువాదమైతే, బుచ్చిబాబుది ఎవరి జీవితానుభవం వారిది అనే వైయుక్తిక వాదం. ఇదంతా మన ముందు తరాలకు చెందిన సాహిత్యకారుల సంగతి. ప్రస్తుత కాలానికి వస్తే ఎంతో సాహిత్యం వస్తున్నప్పటికీ అది రాశిలో ఎక్కువ, వాసిలో తక్కువ అన్న చందంగా తయారైంది. సన్మానాల, సత్కారాల సాహిత్యమే ఎక్కువ కనిపిస్తుంది. అదే సమయంలో నేటి జీవితరంగాలన్నింటిలో నెలకొన్న తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఉత్తమ సాహిత్యసృష్టికి కావలసిన భావాన్ని, భావావేశాన్ని ఉత్పన్నం చేస్తున్నాయి. సరైన సాహిత్య తాత్విక దృక్పథాన్ని, సౌందర్యాభిరుచిని, సామాజిక బాధ్యతా స్పృహను వ్యాప్తి చేయగలిగితే తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇందుకు తోడ్పడడానికి నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, నిష్పాక్షికంగా సాహిత్య విమర్శ జరగాలి.


ఆధార పట్టిక

  1. ఆర్‌.ఎస్‌. సుదర్శనం, ‘సాహిత్యంలో దృక్పథాలు’, నవోదయా పబ్లిషర్స్‌, 1982, పుట:2.
  2. శ్రీశ్రీ, గురజాడ ‘ఆధిక్యానికి కారణాలు’ (వ్యాసం), శ్రీశ్రీ ప్రస్థానత్రయం, మూడవ సంపుటి, కదంబ ప్రస్థానం, మనసు ఫౌండేషన్‌, ప్రథమ ముద్రణ, 30 ఏప్రిల్‌ 2010, పుట: 21.
  3. వల్లంపాటి వెంకట సుబ్బయ్య, ‘కథాశిల్పం’, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ, నాల్గవ ముద్రణ, ఆగస్టు, 2016, పుట: 22 & 23.
  4. గురజాడ, ‘కన్యాశుల్కం’ తొలికూర్పు, 1897, ఆంగ్ల పీఠిక తెలుగు అనువాదం, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌, తృతీయ ముద్రణ, 1991 మే, పుట: 17&18.
  5. సెట్టి ఈశ్వరరావు, ‘కన్యాశుల్కం ఒక అపూర్వసృష్టి’, గురజాడ రచనలు, కన్యాశుల్కం, రెండవ కూర్పు, 1909, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 15వ ముద్రణ, 2010, పుట:186.
  6. ఆర్వీయార్‌, ‘యుగకర్త శ్రీశ్రీ’, తృతీయ ముద్రణ, జులై 2013, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, పుట:16.
  7. Sumita Chatterjee, ‘Socialist Realism and Maxim Gorky’ (Article), Published in Trend, A Cultural Quarterly, Publishers : Subir Basu Roy, C/o Pathikrit, Kolkata, Vol.3, No.1, March 1974, Page: 44 (తెలుగు అనువాదం వ్యాసకర్తది).
  8. గురజాడ రచనలు, ‘కన్యాశుల్కం’, రెండవ కూర్పు, 1909, పీఠిక, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 15వ ముద్రణ, 2010, పుట: 22.
  9. 57వ జయంతి సందర్భంగా జరిగిన సత్కారానికి శరత్‌ స్పందన, భారతవర్ష, కార్తీక సంచిక, బి.ఎస్‌.1339, ఆంగ్లానువాదం: Bengali Greats Series: Sarat Chandra Chattopadhyay- the immortal wordsmith of Bengal, www.bengalonline. sitemarvel.com (తెలుగు అనువాదం వ్యాసకర్తది).
  10. ఆర్‌.ఎస్‌. సుదర్శనం, ‘సాహిత్యంలో దృక్పథాలు’, నవోదయా పబ్లిషర్స్‌, 1982, పుట:77.
  11. వల్లంపాటి వెంకట సుబ్బయ్య, ‘కథాశిల్పం’, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ, నాల్గవ ముద్రణ, ఆగస్టు, 2016, పుట: 111.
జిజ్ఞాస

రచయిత జిజ్ఞాస గురించి: పుట్టింది, విద్యా బుద్ధులు నేర్చింది అనంతపురం జిల్లాలో, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం నుండి న్యాయవిద్యలో స్నాతకోత్సర పట్టా. చిన్న కవితలు, కథలు రాయడంతో సాహితీ వ్యాసంగం పదిహేనేళ్ళ క్రితం ప్రారంభమైంది. ...