సహజ గాయని ఎస్. వరలక్ష్మి

నాకు చిన్నప్పటినుండి బాగా తెలిసిన, నేను ఇష్టపడిన గాయనుల కంఠాలు రెండు. అవి బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మిల కంఠాలు. బాలసరస్వతిగారు తరచుగా రేడియోలోనో, సభల్లోనో, టి.వి. ఛానెళ్ళలోనో కనిపిస్తూ, వినిపిస్తూ వుండటంవల్ల ఆవిడ సినీ, సంగీత జీవితాన్ని గురించిన వివరాలు మనకీనాడు బాగానే తెలుసు. అలాగే ఆవిడ పాడిన పాటలు కూడా తేలికగానే దొరుకుతున్నాయని చెప్పాలి.


ఎస్. వరలక్ష్మి
1927 – 22సెప్టెంబర్ 2009

ఎస్. వరలక్ష్మిగారి విషయానికొస్తే ఆవిడ గురించి మనకు తెలిసింది తక్కువ. ఆ కొద్ది కూడా కంపల్లె రవిచంద్రన్ ఆరేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ‘జ్ఞాపకాలు’ శీర్షిక క్రింద చేసిన ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నది. ఆ ఇంటర్వ్యూలోనే ఆవిడ “నేను పబ్లిక్ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తుంటాను” అని చెప్పుకున్నారు. కారణాలేమయినా మనకు లభ్యమవుతున్న కొద్ది సమాచారం ముఖ్యంగా సినిమాలకు, సినిమా పాటలకు సంబంధించినది. కానీ ఆవిడ రేడియోలో పాడిన లలిత సంగీతం గురించి, రికార్డులపై వచ్చిన అపురూపమైన ప్రైవేటు పాటలగురించి ప్రస్తావించిన వారు తక్కువ. ఆ పాటలను కొన్నింటినైనా ఈమాట పాఠకులకు పరిచయం చేయాలన్న వుద్దేశ్యంతోనే ఈ నాలుగు మాటలు చెప్పదలచుకున్నాను.

కానీ మొదటిగా ఒక సినిమా పాట – ‘మీర జాలగలడా’. దీని వెనకున్న కథ కాస్త పెద్దది.

మీర జాలగలడా నా యానతి

మీర జాలగలడా నా యానతి

‘గంధర్వ గోత్రాన పుట్టిన తెరవేలుపులు’ అనే వ్యాసంలో (’మోహిని’ – ఆంధ్రప్రభ విశేష ప్రచురణ, రెండవ భాగం, 1999) వి.ఎ.కె. రంగారావు గారు ఎస్. వరలక్ష్మి గురించి ఇలా రాశారు: “‘మీర జాలగలడా’ ఆమె పాడిన తీరు అద్వితీయం. రికార్డులపై ఆ పాట స్థానం నరసింహరావు, కపిలవాయి రామనాథశాస్త్రి పాడగా విన్నాను. స్టేజిమీద టి.జి. కమల అనబడే కమలా చంద్రబాబు, సినీనటి జమున పాడటం కన్నాను. తెరమీదనే పి. సుశీల, కొద్దిమార్పుతో ఎస్. జానకి నేపథ్యంతో జముననూ, జయలలితనూ ఈ పాట పాడగా చూశాను. జానకి పాటలో మెరుపు మెలికలున్నాయి. సుశీల పాటలో మాధుర్యం, కమల సాధనలో ధీరత్వం, జమునలో ఉత్సాహం, రామనాథశాస్త్రిలో సంగీత సామర్ధ్యం బుజ్జగిస్తాయి, బుదిరిస్తాయి. ఈ పాట తమది చేసుకున్న స్థానం స్థానే సత్య, ముఖ్యంగా ‘వై’ దర్భికి అన్నచోట వెక్కిరింపుతో సహా సాక్షాత్కరిస్తుంది. ఒక్క ఎస్. వరలక్ష్మి పాటలోనే యివన్నీ కలిసి కట్టుగా వుంటాయి. ఈ సినిమాలో ఆమె పాడిన ఏ పాటా రికార్డుకెక్కకపోవడం, ఆ సినిమా యిప్పుడు దొరకకపోవడం దురదృష్టం.”

రంగారావు గారు ఇంత గొప్పగా పొగిడారంటే ఎలాగయినా సంపాదించవలసినదే అని సర్వ ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ఈ సినిమా ఆడియో ఒక నాటకాభిమాని ద్వారా పొందటం జరిగింది. ఆయన పాతికేళ్ళ క్రితం ఈ సినిమాలోని పాటలమీద ప్రేమతో సినిమా ప్రింటు అద్దెకు తెచ్చుకుని, ఒక 16mm ప్రొజెక్టర్ మీద వేసుకుని ఆడియో ట్రాక్ రికార్డు చేసుకున్నాడు. ఆయన చేసిన ఈ గొప్ప సేవకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! తరువాత ఈ పాటను మిత్రులు మధుసూధనశర్మగారు ‘సరెగమ’ (HMV) వారికోసం సంకలన పరిచిన ఎస్. వరలక్ష్మి పాటల్లో కూడా చేర్చడం జరిగింది.

కనవోయి వసంతము రేయి వలపు పూలబాల ఆనందమే లేదా (సాలూరితో)

“‘నవ వసంత వలపు పూల’ అన్న గేయం పాడిన కంఠం మాత్రం మన గాయకీమణులందరిలోకీ మకుటాయమానమైనదగిన స్త్రీ గాత్రం” అన్నారు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు. అదే రికార్డుపైన వచ్చిన మరో మంచి పాట ‘కనవోయి వసంతము రేయి’. ఈ రెండు పాటలకు సంగీతం: ఘంటసాల, సాహిత్యం: తోలేటి వెంకటరెడ్డి.

సాలూరి రాజేశ్వరరావుగారి సంగీతంలో బసవరాజు అప్పారావుగారి సంస్మృతి కార్యక్రమంలో పాడిన ఒక గొప్ప పాట ‘ఆనందమే లేదా’. తరువాత రికార్డుగా వెలువడింది. ఈ పాటను తెలుగు స్వతంత్ర, 1953 ఆగస్టు 21 సంచికలో రజనీకాంతరావుగారు విశ్లేషిస్తూ “ఒకే స్థాయిలో ఒకరు ఒక స్వరమూర్ఛనలో పాడుతుంటే అదే సాహిత్యాన్ని రెండవవారు అవే స్వరాలు కాక, వాటికి సంవాదులైన వేరుస్వరాల మూర్ఛనలో పొదిగిన మట్టులో ఒకేసారి మేళవించి పాడారు. అటువంటి ఫణితి మళ్ళీ రాలేదు. కాని ఆ విధమైన గానంలో పాల్గొనడానికి మంచి ధారణ, స్థైర్యమూ, సునిశితమనస్సూ కావాలి. వరలక్ష్మి కివన్నీ కరతలామలకాలే” అన్నారు.

1940-1955 మధ్య కాలంలో రేడియో సంగీత నాటికల్లోను, గీతావళి కార్యక్రమాల్లోను వరలక్ష్మి గొంతు వినిపిస్తుండేది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి విద్యాపతి నాటకంలో అనూరాధ పాత్ర ధరించి ‘ఆషాఢం అభిసారిక, ఆత్మేశ్వరుడెవరో’ ఇత్యాదిగా రెండు మూడు గేయాలు పాడినట్లు జ్ఞాపకమని రజనిగారే చెప్పారు.

యాభయవ దశకం మొదటి భాగంలో రేడియోలోనే రికార్డయిన (ఆల్ ఇండియా రేడియో వారి T.S records ద్వారా) ఒక మూడు పాటలు: 1. ఊపరే ఊపరే ఉయ్యాల (సంగీతం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రచన: వింజమూరి శివరామారావు), 2. గణగణగణ జయగంట, 3. నడిచి నడిచి (మల్లిక్ తో కలిసి). ఇలానే ఇంకో ప్రైవేటు రికార్డుపైన వచ్చిన మరో మంచి పాట [మధురముగా ఈ ప్రశాంత …] గడచిన గాథలు ఏవో నామదిలో …

ఊపరే ఊపరే ఉయ్యాల గణ గణ జయగంట నడచి నడచి (మల్లిక్‌తో) మధురముగా ఈ ప్రశాంత…

ఊపరే ఊపరే ఉయ్యాల పాట కోసం పాలగుమ్మి విశ్వనాథం గారు వెతుకుతుంటే అందివ్వగలగడం, ఆ తరువాత హెచ్. హేమవతిగారు ‘నిదురపో హాయిగా’ అన్న జోలపాటల సంకలనంలో (ఆడియో కాసెట్) పాడటం ఈ మధ్య కాలంలోని ఒక మంచి జ్ఞాపకం.

(చివరి మూడు పాటలకు సంబంధించిన రచన, సంగీతకర్తృత్వపు వివరాలెవరైనా అందించగలిగితే కృతజ్ఞుణ్ణి.)

రజనీకాంతరావు గారే అన్నట్లు “కర్నాటక సంగీతంలోని గాఢ ఫణితులుగాని, హిందుస్తానీ బాణీలోని బిరకాలుగాని, లలిత సంగీతంలోని మధుర ధోరణులుగాని, అశ్రమంగా అతి సహజంగా దొర్లిపోయే కంఠం ఆమెది. [పొందిన] శిక్షణ తాను స్వయంగా సంగీతకచ్చేరీలు చేసేటంతవరకూ రానీక, సినిమాలలోను, రేడియోలలోను లఘుగీతఫణితులు పాడగలగడంతో ఆగిపోయింది. లేకపోతే తెలుగునాటికి ఈమెయే మొదటితరగతి గాయకురాలై ఉండేది.”