నూలు చీర

ఎప్పుడో తన రోజుల్లో వొక వెలుగు వెలిగిందే
అప్పుడప్పుడూ తన మెరిసే జిలుగుల్ని ప్రదర్సించిందే
పాముకుబుసం కాక పోయినా, పట్టు వస్త్రం కాక పోయినా
ఇనుప బీరువా సొరుగుల్లో వాటి చెంత వున్నదే
ఏ జన్మలో, ఏ లోకాన ఏ అదృష్టం చేసుకుందో కాని
మా అమ్మ చుట్టూ మెత్తగా చుట్టుకునేది రంగు పోతేనేం
మా అమ్మ ఎద మీద వెచ్చగా పరుచుకునేది
తడి తగిలిన అమ్మ చేతుల్ని మురిపెంగా తుడుచుకునేది
చిన్నప్పుడెప్పుడో వేడి ఇస్త్రీ పెట్టెతో ఆడుకున్నా
తర్వాత దాని సెగతో తెగతెంపులు చేసుకొని
ఒక తాపసి లా వొక చెట్టులా ప్రాపంచిక మెరుగుల్ని
వదిలేసి మా అమ్మ అనంత సౌందర్యంలో వొకటై పోయింది
అమ్మకీ చీరకీ మధ్య భేదం కరిగి పోయింది
మెత్తటి ఆ నూలు చీర మా మనసుల్లో
రంగూ రూపం లేని భావంలా మిగిలిపోయింది