కషాయం

నా గది గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడతడు.

సన్నగా, పొడవుగా, అందంగా, పచ్చని ఛాయలో – అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు.

రోషకషాయిత నేత్రాలతో, చేతిలో పొడవాటి కత్తితో – అచ్చమైన సినిమా విలన్లాగానూ ఉన్నాడు.

అతడు కొద్ది క్షణాలు నన్నే తీక్షణంగా చూశాడు. తర్వాత గుమ్మానికి కాస్త పక్కగా జరిగి, “దారి ఇస్తున్నాను. పారిపో. తర్వాత నువ్వు లేడి. నేను పులి. వేట మొదలు,” అన్నాడు.

నాకు ఆలోచించడానికి సమయం లేదు. అతడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. ఒక్క ఉదుటున గదిలోంచి బయటపడి అతణ్ణి దాటాను. వెంటనే పరుగు లంకించుకున్నాను. నా వెనుక అతడి అడుగుల చప్పుడు. అది నేలమీద కాక నా గుండెల మీదన్నట్లుంది. వేగంగా పరుగెడుతుంటే ఆ చప్పుడు గుండెలమీంచి చెవుల్లోకి వచ్చింది. ఇంకా వేగం పెంచాలనుకునేలోగానే ఓ బలమైన హస్తం వెనుకనుంచి నా భుజంమీద పడింది.

కెవ్వుమని అరిచి లేచి కూర్చున్నాను.

కల. తెల్లవారు ఝామున వచ్చిన భయంకరమైన కల. నిజంలా అనిపించి భయంతో వణికించిన కల.

ఆర్నెల్లక్రితం ఉద్యోగంలో చేరడానికి ఈ ఊరొచ్చాను. బ్రహ్మచారిని కావడంతో అద్దెకు గది దొరకడానికి రెండు నెలలు పట్టింది. అందాకా ముందు బంధువులింట్లో ఓ నెల, తర్వాత ఓ మిత్రుడి రూమ్‌లో మరో నెల ఎలాగో కాలక్షేపం చేశాను. ఈ గదికొచ్చి నాలుగు నెలలైంది. ఇంతవరకూ ఎప్పుడూ ఇలాంటి కల రాలేదు.

మనిషికి కలలు రావడం మామూలే! మహాత్ములైతే మనుషుల మధ్య సామరస్యం కోసమూ, లోక కల్యాణం కోసమూ కలలు కంటారుట. సామాన్యుడి కలలు కేవలం తన పరిధిలోనే ఉంటాయన్నది నాకు స్వానుభవమే. చిన్నప్పుడు పెద్దవాళ్ళు నన్ను ముద్దు చేస్తున్నట్లు కలలొచ్చేవి. దెయ్యాల కథలు వింటే అవే కల్లోకొచ్చి భయపెట్టేవి. సినిమా చూస్తే నేనే హీరోనైపోయినట్లు కలలు. కాలేజికొచ్చాక క్లాస్‌మేట్సూ, లెక్చరర్సూ, అమ్మాయిలూ, సినీమా హీరోయిన్లతో కలలు. చదువైపోయాక ఇంటర్‌వ్యూల కలలు. ఉద్యోగంలో చేరాక పెళ్ళి కలలు. కానీ ఇలా ఎవరో నన్ను చంపుతున్నట్లు కల రావడం ఇదే మొదటిసారి.

చిత్రమేమిటంటే నన్ను కలలో చంపబోయిన ఆ విలన్‌ ఇలలో నాకు హీరోగా తెలుసు. తెలిసిన హీరోలంతా పరిచయస్తులు కానవసరం లేదుగా, అతడూ అంతే! అతణ్ణిప్పటికి నాలుగు సార్లు చూశాను. చూసినప్పుడల్లా జరిగిన ప్రతి సంఘటనా నేనతణ్ణి హీరో అనుకునేలా చేసింది.

అతణ్ణి మొదటి సారి చూసింది ఓ సినిమా హాలు దగ్గిర.

జులాయిలా కనిపించే ఓ యువకుడు సాదాసీదాగా కనిపించే ఓ మధ్యతరగతి యువతిపై ఏదో వ్యాఖ్య చేశాడు. ఆమె చిరాగ్గా గొణిగింది. దాంతో రెచ్చిపోయి ఆ జులాయి ఆమెని అసభ్యమైన పదజాలంతో నిందించడం మొదలెట్టాడు. ఇదంతా నాతో సహా చాలామందే చూస్తున్నాం. ఎవరో ఒకరు జోక్యం చేసుకునే వాళ్ళమేమో కానీ జులాయికి తోడుగా ఇంకో నలుగురు జులాయిలున్నారు. పురాణకాలంలో నిండు కొలువులో కులసతికైనా, 21వ శతాబ్దంలో నడి బజార్లో కులీన యువతికౖైెనా వస్త్రాపహరణం అసాధారణం కాదు. దాన్నాపడానికి దేవుడున్నాడులే – అని చోద్యం చూసే సగటు భారతపౌరులం కదా, మాలో ఒక్కరం కూడా ఆమెకు మద్దతుగా వెళ్ళలేదు.

జులాయి మాటలకా యువతి అవమానంతో కుంచించుకుపోతున్న సమయంలో అక్కడ దేవుడిలా ప్రత్యక్షమయ్యాడతడు. ‘నేనెవరో తెలుసా’ అంటూ తన పేరు చెప్పి గర్జించాడు. నిర్భయంగా జులాయిల మీదకి వెళ్ళాడు. పోలీసులకి ఫిర్యాదు చేస్తానంటూ వాళ్ళమీద చెయ్యెత్తినంత పని చేశాడు. అప్పటికి చుట్టూ ఉన్నవాళ్ళలో చలనమొచ్చింది. ఆ యువతికి వత్తాసు మొదలై పెరిగింది. దాంతో జులాయి ఆమెకి సారీ కూడా చెప్పి తనవాళ్ళతో అక్కణ్ణించి జారుకున్నాడు.

“ఒప్పుకి ఉన్న బలం తప్పుకి లేదు. ఎదురు తిరగాలి కానీ, ఒప్పుముందు ఎంతటి బలమైౖన తప్పయినా తల వంచుతుంది,” అని అక్కడున్నవాళ్ళని మందలించిన అతణ్ణి – నేను పేరుతో కాక, హీరోగానే గుర్తుంచుకున్నాను.

రెండోసారి హీరోని సూపర్‌ మార్కెట్లో చూశాను.

ఓ పదహారేళ్ళ కుర్రాడు అతడి జేబులోంచి పర్స్‌ కొట్టేస్తుంటే ఎవరో చూసి పట్టుకున్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు కుర్రాణ్ణి చావదన్నడానికి సమాయత్తమయ్యారు. హీరో వాళ్ళని వారించాడు. “ఇంత సులభంగా దొరికిపోయాడంటే, దొంగతనానికి కొత్తయి ఉండాలి,” అని ఆ కుర్రాడిమీద జాలిపడ్డాడు. “అలాంటివాడి పరిస్థితి తెలుసుకుని, దారి మార్చుకోమని సుద్దులు చెప్పాలి. చేతనైన సాయం చెయ్యాలి. అంతే తప్ప తన్ని పంపించడం మంచి పద్ధతి కాదు,” అన్నాడు. తర్వాత ఆ కుర్రాడితో కాసేపు మాట్లాడి, అతడితోనే కలిసి వెళ్ళిపోయాడు.

మరి ఆ కుర్రాడితో ఇంటికెళ్ళాడో, ఏమైనా ఉపాధి చూపించాడో లేదో నాకు తెలియదు. అతడు మాత్రం నాకు సూపర్‌ హీరో ఐపోయాడు.

మూడోసారి నా హీరో ఓ మూడు కాళ్ళ ముదుసలిని ట్రాఫిక్‌ లోంచి రోడ్డు దాటిస్తూ కనిపించాడు.

నాలుగోసారి బస్‌స్టాప్‌ దగ్గిర. ఒక వ్యక్తి ఆటో దిగి ఆటోవాలాకి యాభై రూపాయల నోటిచ్చాడు. వెనక్కి పదిహేను రూపాయలు రావాలి కానీ ఆటోవాలా చిల్లర లేదన్నాడు. ఆ విషయమై ఇద్దరికీ గొడవౌతున్న సమయంలో అక్కడికొచ్చాడు హీరో. పర్సు తీసి యాబై రూపాయలకీ చిల్లర తీసిచ్చాడు. “మరీ పదిహేను రూపాయల చిల్లర కూడా లేదనడం సరికాదు,” అని ఆటోవాలాని గట్టిగా మందలించాడు.

స్త్రీ బాల వృద్ధుల్నీ అసహాయుల్నీ ఆదుకుంటూ – అలా నాలుగుసార్లు నాచేత ఆరాధించబడ్డ నా హీరో ఐదోసారిగా ఈ రోజు కలలో కనిపించి విలన్‌గా మారిపోయాడు. ఎందుకు?

ప్రతి మనిషిలోనూ మంచి, చెడు ఉంటాయి. మంచి చెడుని అణచితే సన్మార్గుడు. చెడు మంచిని అణచితే దుర్మార్గుడు. డాక్టర్‌ జెకిల్‌ అండ్‌ మిస్టర్‌ హైడ్‌ నవలలో హీరోలా మసిలే జెకిల్‌ ఓ కషాయం త్రాగి, హైడ్‌గా మారి విలన్‌లా ప్రవరిస్తూంటాడు. హైడ్‌ మళ్ళీ అలాగే మరో కషాయం త్రాగి జెకిల్‌గా మారుతూంటాడు.

నా హీరో కూడా అలాంటి కషాయం త్రాగుతాడా? అసలలాంటి కషాయం నిజంగా ఉంటుందా?

ఎంత ఆలోచించినా జవాబు తోచలేదు. కానీ అతడిపై నాకేర్పడిన ఆరాధనాభావాన్ని బట్టి ఒకవేళ నన్ను చంపడమే అతణ్ణి మరోసారి హీరోని చేస్తుందేమో అన్న అనుమానం కూడా కలిగింది. కానీ అతడిలో నిండా మంచితనం. అన్యాయాన్ని చూసి సహించలేని ధైర్య గుణం. అలాంటివాడు ముక్కూ మొహం తెలియని నాలాంటి మామూలు ప్రాణిని చంపాలని ఎందుకు అనుకుంటాడు?

కలలు మన ఆలోచనల్నీ, సమాజాన్నీ ప్రతిఫలిస్తాయట. వాటిని తేలిగ్గా కొట్టి పారేయకూడదట. లోతుగా విశ్లేషించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రయోజనంట. మరి నా కలని నేనెలా అర్థం చేసుకోవాలి?

నేటి సమాజంలో స్వార్థం పెచ్చుమీరిపోయింది. సాటివాణ్ణి పట్టించుకోవడం తగ్గిపోయింది. నా గురించే ఆలోచిస్తూ, నా కోసమే జీవించే నాలాంటి వాళ్ళదే ఇప్పుడీ సమాజంలో మెజారిటీ. మేమెన్నుకున్న మాలాంటి వారే మనకి నాయకులౌతున్నారు. ఐతే మా అందరి లోనూ ఏదో మూల అపరాధభావం ఉండకపోదు. అందువల్ల మాకు భిన్నంగా, నిస్వార్థంగా ఉండేవాళ్ళని చూస్తే మాకు చిన్నతనం. వాళ్ళపై అసూయ పుట్టి వాళ్ళకు లేని స్వార్థాన్నో, దౌష్ట్యాన్నో ఆపాదించాలనిపిస్తుంది. నాయకులు – తమ వల్లకాని పనులు చేసే సజ్జనులపై మాటలతో మీడియాలో బురద చల్లుతారు. నాలాంటివాళ్ళు నిద్రలో కలలు కంటారు.

నిజానికి ఇలా అనుకోవడం నన్ను నేను చిన్నబుచ్చుకోవడమే ఔతుంది. అందుకని నా ఆలోచనల్ని మరో దారికి మళ్ళించాను.

మెరిసేదంతా బంగారం కాదు. నల్లనివన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు కావు. కంచు మ్రోగినట్లు కనకం మ్రోగదు. నా హీరోలో కూడా ఓ విలన్‌ ఉన్నాడు. ఏదో రోజున బయటపడతాడు. నా కల నాకు చెబుతున్నదదే!

అప్పుడలా అనుకున్నా కానీ ఆ రాత్రే నిజంగా అలా జరుగుతుందనుకోలేదు…

అర్థరాత్రి రెండు గంటల సమయం. మంచి నిద్రలో ఉన్నాను. కాలింగ్‌ బెల్‌ మ్రోగితే ఉలిక్కిపడి లేచాను. కళ్ళు నులుముకుంటూ గోడ దగ్గిరకెళ్ళి లైట్ స్విచ్‌ వేశాను. ఈలోగా కాలింగ్‌ బెల్‌ మళ్ళీ మ్రోగింది. వెళ్ళి తలుపు తీసి ఉలిక్కి పడ్డాను.

నాకు ఇలలో తెలిసిన హీరో. కానీ ఏ కషాయం తాగాడో రోషకషాయిత నేత్రాలు. ఏ ఉద్దేశ్యంతోనో చేతిలో కత్తి. అచ్చం కలలో కనపడ్డ విలన్‌లా ఉన్నాడు.

“మీరు?” అన్నాను. కొంచెం వెరగు. కొంచెం వెరపు.

“నిన్ను చంపడానికి వచ్చాను,” అన్నాడు తన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తూ. ఆ గొంతు ఉద్దేశ్యం కంటే చాలా కటువుగా ఉంది. నా హీరో నన్ను చంపడమా? నమ్మలేక పోయాను.

“నీకూ నాకూ వైరమే కాదు, పరిచయం కూడా లేదు. నువ్వు నన్ను చంపడం ఎందుకు?” అన్నాను, అది కలే అయుంటుందన్న ధైర్యంతో.

“మీవాళ్ళు మావాళ్ళు పదిమందిని వేటాడి చంపారు. అందుకని మేము కనీసం పాతికమంది మీవాళ్ళని టార్గెట్‌గా పెట్టుకున్నాం. నిన్ను వేటాడ్డం నా వంతు,” అన్నాడతడు.

అర్థమైంది. ఊచకోతకు విత్తుముందో, చెట్టుముందో స్పష్టం కాని ఓ మత కలహం. మొదలైతే ఏది విత్తో, ఏది చెట్టో అన్న పట్టింపుండదు. కానీ ఊచకోత కోసిన విలన్‌ తనవాళ్ళలో హీరో ఐపోతాడు.

అప్పుడు స్ఫురించింది నాకా కల ఎందుకొచ్చిందో!

మొన్న పేపర్లో మత కలహాలకు బీజం పడినట్లు చదివాను. ఆ వార్త చదవగానే అంత వరకూ నా వాళ్ళనుకుంటున్న నా ఇరుగు పొరుగులు నా మతంవాళ్ళు కాదని స్ఫురించింది. సమాజానికి మణిపూసలాంటి నా హీరో పేరు కూడా గుర్తొచ్చి అతడూ నా మతంవాడు కాదని స్ఫురించింది. ముక్కూ మొహం తెలియనివాళ్ళని కూడా, చొరవ తీసుకుని ఆదుకునే నా హీరో, ముక్కూ మొహం తెలియని వాళ్ళని కూడా అంతం చేయగల ఆవేశస్ఫూర్తి పొందగలడనిపించింది. అందుకే నాకా కలొచ్చింది.

అతడు నాకు దారి ఇస్తున్నట్లుగా పక్కకు తప్పుకున్నాడు. కళ్ళు మాత్రం మరింత కషాయితమయ్యాయి.

అర్థమౌతోంది నాకు. రాబర్ట్‌ లూయీస్‌ స్టీవెన్సన్‌ నవల్లో వ్రాసిన కషాయం కల్పన కాదు. ఈ సమాజంలో ఆ కషాయం ఏదో ఒక కారణంగా అందరూ తాగుతూనే ఉన్నారు. దాని ప్రభావంతో అంతా ఆవేశపడక పోవచ్చు కానీ ఆ స్ఫురణ సామాన్యుడిలో కూడా అనుమానాన్నీ, భయాన్నీ నింపగలదు. అందుకే నాకా కల వచ్చింది.

నా హీరో, విలన్లా చూస్తూ, ఇంకా ఆలస్యమేమిటన్నట్లు, ‘ఊఁ’ అని హెచ్చరించాడు.

నేను ఒక్క ఉదుటున గదిలోంచి బయటపడి పరుగు లంకించుకున్నాను.

నా వెనుక అతడి అడుగుల చప్పుడు. అది నేలమీద కాక నా గుండెల మీదన్నట్లుంది. వేగంగా పరుగెడుతుంటే ఆ చప్పుడు గుండెలమీంచి చెవుల్లోకి వచ్చింది.

ఇంకా వేగం పెంచాలనుకునేలోగానే ఓ బలమైన హస్తం వెనుకనుంచి నా భుజంమీద పడింది. అది వాస్తవమైతే కెవ్వుమని అరిచి నేల కూలిపోతాను. కల ఐతే చటుక్కున లేచి కూర్చుంటాను.

కానీ రెంటికీ అవకాశముందని నాకు తెలుసు…