రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా?

రచన: సురేశ్ కొలిచాల
మార్చి 2014

కో అద్ధా వేద క ఇహ ప్ర వోచత్ కుత ఆజాతా కుత ఇయం విసృష్టిః।
అర్వాగ్ దేవా అస్య విసర్జనేనాఽథా కో వేద యత ఆబభూవ॥

– (నాసదీయ సూక్తం ఋగ్వేదం 10-129-06)

ఈ సృష్టి ఎక్కడినుండి వచ్చిందో, ఎలా సృష్టింపబడిందో ఎవరు చెప్పగలరు? దేవతలు కూడా సృష్టి మొదలయ్యాకే వచ్చిన వారు కదా, మరి ఈ సృష్టి ఎలా మొదలయ్యిందో ఆ ఎరుకగల వారెవ్వరు?

ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న।
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ త్సో అంగ వేద యది వా న వేద॥

– (నాసదీయ సూక్తం ఋగ్వేదం 10-129-07)

ఈ సృష్టి ఆ కర్త సంకల్పమే, అవునో, కాదో? అత్యున్నత ఆకాశంలో ఉండి అధివీక్షించే దేవదేవునకు తెలుసునా? ఆయనకు కూడా తెలుసునో తెలియదో!


ఈమధ్య దాకా మా అబ్బాయిలిద్దరూ రాత్రి పూట పడుకునే ముందు కథలు చెప్పమని అడిగేవారు. వంతులవారిగా నేను, మా ఆవిడ కథలు చెప్పేవాళ్ళం. నా వంతు వచ్చినప్పుడు భారత, భాగవత, రామాయణ కథలనే నాకు తోచిన విధంగా చెప్పేవాడిని. మూడు కన్నుల శివుడు హిమాలయాల్లో ఉంటాడని, పాల సముద్రంలో విష్ణువు పాముపై పడుకుంటే, ఆయన నాభి నుండి ఉద్భవించిన కమలంలో ఉండి బ్రహ్మ మనల్నందరినీ సృష్టిస్తాడని అల్లిబిల్లి కథలుగా అల్లి చెబుతుంటే మాపిల్లలు ఊఁ కొడుతూ నిద్రపోయేవారు.

ఏ ప్రాచీన నాగరికతకైనా ఈ రకమైన కథలు, కథనాలు ఉంటాయి. శక్తివంతమైన పౌరాణిక గాథలు (mythology) ఏ జాతికైనా వారి వారసత్వ సంపద. నిజానికి నా దృష్టిలో ‘హిందువు అంటే ఎవరు?’ అన్న ప్రశ్నకు భారత, భాగవత, రామాయణ కథలను తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న వారంతా హిందువులే. అయితే, ఈ ఇతిహాస, పురాణ కథల ఆధారంగా మన ప్రాచీన చరిత్రను నిర్మించుకోగలమా? అంతేకాక, ఇతర ఆధారాల ద్వారా మనకు తెలిసిన చరిత్రను ఉపయోగించి ఈ కథల్లో నిజానిజాలను, అంతరార్థాలను నిర్ధారించగలమా? ఈ విషయంపై గత 50 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న ఒక శాస్త్రవేత్త చెప్పిన అభిప్రాయాలను ఉటంకించడం ఇక్కడ అసమంజసం కాదనుకుంటాను:

“We have to be careful how we use history and myth to understand one another. In this context I would define a myth as a story that a group of people believe for a long time despite massive evidence that it is not actually true; the spirit of myth is the spirit of Oz: Pay no attention to the man behind the curtain. […] we need to use history to understand myth—that is, we need to understand why such a text was composed and retold many times […] But we cannot use the myth to reconstruct the actual history behind the text; we cannot say that the text is evidence. […] Such myths reveal to us the history of sentiments rather than events; motivations rather than movements.” (W. D. p. 23).

పై మాటలు రాసిన పరిశోధకురాలు మరెవరో కాదు, ప్రస్తుతం వివాదాస్పదమైన అమెరికన్‌ రచయిత్రి వెండీ డానిగర్‌ (Wendy Doniger). ఈ కొటేషన్ పెంగ్విన్-ఇండియా ఉపసంహరించుకున్న The Hindus: An alternative history పుస్తకంలో 23వ పేజీలో నుండి తీసుకున్నదే.

ఈ పుస్తకాన్ని నేను నాలుగేళ్ళ క్రితమే చదివాను. అయితే, హిందూమత చరిత్రను కూలంకషంగా చర్చించిన ఈ పుస్తకంలో కొన్ని విషయాల్లో డానిగర్ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవించలే(దు)ను. అలాగే, కొన్నిచోట్ల ఆవిడ విశ్లేషించిన తీరుపై నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆవిడ ఇచ్చిన సమాచారంలో కొండొకచో చిన్న చిన్న పొరపాట్లు కూడా కనిపించాయి. హిందూమతానికి ముఖ్యమైన అంశాలు కొన్నింటిని ఆవిడ స్పృశించకుండా వదిలేయడం వల్ల ఈ పుస్తకంలో కొన్ని చర్చలు అసమగ్రమనిపించాయి.

అయితే, నాకు ఈ పుస్తకంలో హిందువులను అవమానపరిచే అంశాలు గాని, హిందూ మతాన్ని పనిగట్టుకొని కించపరిచే ఉద్దేశం గాని ఏ కోశానా కనిపించలేదు. ప్రతి పేజీలోను ఒక పరిశోధకురాలు తాను ఎన్నుకున్న అంశంపై అన్నీ దృక్కోణాలను విశ్లేషించడానికి, అన్నీ ప్రత్యామ్నాయ కథనాలను వీలైనంతగా చర్చించడానికి పడే తాపత్రయమే కనబడింది. ప్రతి అంశంపై ఇప్పటిదాకా మనకు తెలిసిన సమాచారం అసమగ్రమేనని ఇంకా ఎన్నో పరిశోధనలకు ఆస్కారం ఉందని అడుగడుగునా చెప్పుకునే సత్య శోధనా తత్పరతే కనిపించింది. విదేశీ వనితగా తాను చేసే విశ్లేషణల్లో తనకు తెలియకుండానే ‘పాశ్చాత్య పక్షపాతం’ (western bias) చొరబడే ప్రమాదం ఉందని ఒప్పుకునే నిజాయితీ కనబడింది.

అందుకే, ఈ పుస్తకాన్ని నిషేధించాలని దీనానాథ్ బాత్రా అనబడే వ్యక్తి ‘శిక్షా బచావో ఆందోళన్‌’ అనే సంస్థ ద్వారా కోర్టుకు వెళ్ళాడని విని ఆశ్చర్యపోయాను. అంతే కాక, భారతదేశంలో ఈ పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్‌-ఇండియా వారు నాలుగేళ్ళ కోర్టు పోరాటం తరువాత ఆ సంస్థతో కోర్టు వెలుపల సంధి చేసుకొని ఈ పుస్తకాన్ని మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకోవాలని, మిగిలిన ప్రతులను తగులబెట్టాలని నిర్ణయించిందని విని మరింత విస్తుపోయాను.

ఎవరీ వెండీ డానిగర్?

వెండీ డానిగర్ (Wendy Doniger) అమెరికాలో భారతీయ శాస్త్రాన్ని గత 50యేళ్ళుగా అధ్యయనం చేస్తున్న ప్రొఫెసర్. ఈమె న్యూయార్క్ నగరంలో యూదుల కుటుంబాన 1940లో జన్మించింది. ఆ రోజుల్లో ఈవిడ తండ్రి లెస్టర్ డానిగర్ ఒక ప్రచురణ సంస్థను నడిపేవాడు. వెండీ డానిగర్ ‘సంస్కృతము, భారతీయ విద్య’ అన్న అంశాలపై రాడ్‌క్లిఫ్ కాలేజీలో బి. ఏ. చేసి, అదే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ నుండి 1963లో ఏం.ఏ.; ఆపై 1963-64లలో ఇండియాలో గడపి, 1968లో హార్వర్డ్ నుండే ‘Asceticism and Sexuality in the Mythology of Siva’ అన్న అంశంపై పిఎచ్. డి.; తరువాత నాలుగేళ్ళు ఇంగ్లాండ్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో, The Origins of Heresy in Hindu Mythology అన్న అంశంపై పనిచేసి 1973లో డి. ఫిల్. పట్టాలు పుచ్చుకున్నారు.

ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ విభాగంలో, విశిష్టాధ్యాపకురాలిగా పనిచేస్తున్న వెండీ డానిగర్ హిందూ మతంపై ఎన్నో పుస్తకాలు, అనువాదాలు రాశారు. 1975లో సంస్కృతంలోని శివపురాణపు కథలకు అనువాదాన్ని, 1981లో ఋగ్వేదంలో 108 సూక్తాలకు, 1991లో మనుధర్మశాస్త్రానికి, 2002లో వాత్సాయన కామసూత్రానికి, 2006లో హర్షుని ప్రియదర్శిక, రత్నావళి కావ్యాలకు — అనువాదాలు ప్రచురించారు. మొదట్లో ఫ్రాయిడ్ సిద్ధాంతాలను ఆధారం చేసుకొని హిందూమతాన్ని, పురాణాలను విశ్లేషణ చేసిన ఈమె, ఆపై హిందూ పౌరాణిక గాథలపై మత, తత్త్వ, తాంత్రిక విషయాలను విస్తృతంగా చర్చిస్తూ 16 పుస్తకాలు వెలువరించారు. వీటిలో ప్రముఖమైనవి:

  • The Implied Spider: Politics and Theology in Myth. The 1996–1997 ACLS/AAR Lectures. New York: Columbia University Press, 1998,
  • Splitting the Difference: Gender and Myth in Ancient Greece and India. The 1996 Jordan Lectures. Chicago and London: University of London Press and University of Chicago Press, 1999.
  • The Bedtrick: Tales of Sex and Masquerade. Chicago: University of Chicago Press, 2000.
  • La Trappola della Giumenta. Trans. Vincenzo Vergiani. Milan: Adelphi Edizione, 2003.
  • The Woman Who Pretended to Be Who She Was. New York: Oxford University Press, 2005.
  • The Hindus: An Alternative History. New York: Penguin Press, 2009.
  • On Hinduism, Oxford University Press, 2013.

ఇవేకాక, ఎన్నో పుస్తకాలకు పరిష్కర్తగా పనిచేసిన డానిగర్, ప్రతిష్ఠాత్మకమైన జర్నళ్ళలో వందలకొద్ది పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. ప్రస్తుతం ఆవిడ సంపాదకురాలిగా, ఒక రచయితగా Norton anthology of primary Hindu writings అన్న పుస్తకంపై పని చేస్తున్నారు. నవంబర్ 2014లో మార్కెట్లో లభ్యమయ్యే ఈ పుస్తకంపై మరింత దుమారం చెలరేగే అవకాశం ఉంది.

దీనానాథ్‌ బాత్రా ఎవరు?

హిందీ, ఇంగ్లీష్ టీచరుగా, ఆపై ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీవిరమణ తీసుకున్న దీనానాథ్‌ బాత్రా, భారతీయ విద్యా బోధనలో దుష్ట పాశ్చాత్య ప్రభావాన్ని ఎదురుకోవడానికి ‘శిక్షా బచావో ఆందోళన్‌’ పేరిట ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పాకిస్తానులో భాగమైన పంజాబ్ ప్రాంతంలో జన్మించిన ఈయన, స్వాతంత్ర్యం తరువాత కుటుంబంతో సహా భారతదేశానికి తరలివచ్చారు. ఇప్పటికీ ఆయన పాకిస్తాన్ లోని చిన్ననాటి ఊరు, బడి, దేవాలయము గుర్తు చేసుకుంటూ ఉంటారు.

‘వసుధైక కుటుంబకమ్’, ‘ఏకం సత్ విప్రా బహుదా వదంతి,’ వంటి ఘనమైన సందేశాలను ప్రపంచానికి అందజేసిన హిందూమతానికి ప్రపంచంలో సరైన గుర్తింపు రాకపోవడానికి పాశ్చాత్య పండితులే కారణం అని ప్రబలంగా నమ్మే బాత్రా గత 10 సంవత్సరాలలో ఎంతోమంది రచయితలను, పుస్తక ప్రచురణ సంస్థలను కోర్టుకు తీసుకెళ్ళారు.

అంతకు ముందు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుపుతున్న రోజుల్లో మానవ వనరుల శాఖ మంత్రి అయిన మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలో నడిచే ‘విద్యాభారతి అఖిల భారతీయ విద్యా సంస్థాన్’ అనే సంస్థకు బాత్రా జనరల్ సెక్రటరిగా పనిచేశారు. ఆ రోజుల్లో, ఆ సంస్థ ద్వారా కేంద్రీయ విద్యాలయాలకు పుస్తకాలు అందజేసే NCERT పాఠ్యాంశాలలో 100కు పైగా వివాదాస్పదమైన మార్పులను బాత్రా ప్రవేశపెట్టారు.

2008లో రామానుజన్ రాసిన ‘మూడు వందల రామాయణాలు‘ వ్యాసాన్ని డిల్లీ యూనివర్సిటీ హిస్టరీ సిలబస్ నుండి తొలగించడానికి హైకోర్టును ఆశ్రయించిన వారిలో బాత్రా ప్రముఖుడు. కోర్టు నియోగించిన కమిటీ రామానుజన్ వ్యాసం సిలబస్‌లో ఉండాల్సిందేనని తీర్పు చెప్పింది. ఆ రోజుల్లో డిల్లీ యూనివర్సిటీలో హింసాకాండ, అల్లర్లు చెలరేగడమే కాకుండా, అక్కడి ప్రొఫెసర్లకు బెదిరింపు ఉత్తరాలు, ఫోన్‌కాల్స్ వచ్చేవి (ప్రొఫెసర్ ఉపేందర్ సింగ్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం.) యూనివర్సిటీ వారు 2011లో ఆ వ్యాసాన్ని తొలగించడానికే నిర్ణయించుకున్నారు.

అంతేకాక, ది హిందూ పబ్లిషర్ అయిన ఎన్. రామ్ ఫ్రంట్‌లైన్ పత్రికలో ‘శాఫ్రాన్ టెర్రర్‘ అన్న శీర్షికతో వ్యాసాన్ని ప్రచురించినందుకు బాత్రా ఆయనకు లీగల్ నోటిసులను పంపించారు. కేంద్రీయ పుస్తకాలలో 75 పంక్తులు అభ్యంతరకరమైనవిగా ఉన్నాయని NCERTకి వ్యతిరేకంగా 10 వేర్వేరు కోర్టు కేసులు కూడా వేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న వెండీ డానిగర్ పుస్తకాన్ని నిషేధించాలని గత నాలుగేళ్ళుగా కోర్టులో పోరాటం చేసిన బాత్రా, పెంగ్విన్ నిర్ణయం సంతృప్తి నిచ్చిందని ఇకపై డానిగర్ రాసిన On Hinduism వంటి ఇతర పుస్తకాలపై దృష్టి సారిస్తానని చెబుతున్నారు. 84యేళ్ళ వయస్సులో కూడా అలుపెరుగక పనిచేసే ఈయన, రాజకీయాల్లో రాబోయే మార్పుల దృష్ట్యా భారతదేశానికి, భారతీయతకు మంచి రోజులు రాబోతున్నాయని ఉత్సాహంగా చెబుతున్నారు.


ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ

“I disapprove of what you say, but I will defend to the death your right to say it.”

– (attributed to Voltaire.)

ఎన్నో ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగాలలో వాక్-స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కుగా పేర్కొనబడింది. అయితే, ఈ వాక్-స్వాతంత్ర్యానికి ఎంతవరకూ హద్దులు ఉండాలి అన్న విషయంలో వివిధ దేశాల్లో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. వాక్-స్వాతంత్ర్యానికి ఏ రకమైన హద్దులు ఉండకూడదా? వాక్-స్వాతంత్ర్యం ప్రజల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పుడు, విద్వేషాలను, హింసను ప్రేరేపించినప్పుడు, ఆ స్వాతంత్ర్యాన్ని అరికట్టాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు వాక్-స్వాతంత్ర్యానికి సంబంధించిన చరిత్రను పరిశీలిద్దాం.

ప్రపంచంలో మొట్టమొదటి ప్రజాస్వామ్యంగా పేరొందిన గ్రీక్ నగరం ఏథెన్స్‌లో క్రీ.పూ. 470లో జన్మించిన సోక్రటీస్ (Socrates) సత్యము, నీతి వంటి అంశాలు సాపేక్షమని, సంక్లిష్టమైనవని, ఒకరికి నీతిగా కనిపించేది మరొకరికి అవినీతి అవుతుందని లోతైన తాత్విక చర్చలు చేసేవాడు. తత్త్వశాస్త్రం పేరిట యువతను అవినీతికి పురికొల్పుతున్నాడన్న నేరారోపణతో ఆయనకు మరణశిక్ష విధించింది ఆ మొట్టమొదటి ప్రజాస్వామిక నగరం. ప్రజలు విధించిన శిక్షను సంతోషంగా స్వీకరించి విషపానీయాన్ని తాగి మరణించాడు సోక్రటీస్.

తన బోధనలతో యువతను పెడదారి పట్టిస్తున్నాడనే నేరం మోపి ఏసుక్రీస్తును శిలువపైకి ఎక్కించి చంపించింది రోమను ప్రభుత్వం.

గలీలియో (Galilio Galieli) 1610లో తను చేసిన ఖగోళ పరిశోధనల సారాంశాన్ని Sidereus Nuncius అన్న పుస్తకంగా ప్రచురించాడు. ఇందులో, చంద్రునిపై కొండల గురించి, శుక్రగ్రహం యొక్క కక్ష్య గురించి, గురుగ్రహానికి ఉన్న ఉపగ్రహాల గురించి, సూర్యునిపై కనిపించే మచ్చల గురించే కాక, గ్రహాలు భూమి చుట్టూ కాక సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయన్న ప్రతిపాదన కూడా ఉంది. భూమి చుట్టూ అన్నీ గ్రహాలు తిరుగుతున్నాయని నమ్మే క్రిస్టియన్ మతస్థులకు ఇది చెంపపెట్టుగా తోచింది. బైబిల్ లోని సూత్రాలను ధిక్కరించే ఈ ప్రతిపాదనలు క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని, అందుకే ఆ పుస్తకాన్ని నిషేధించాలని రోమన్ చర్చ్ 1615లో నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ప్రతిగా గలీలియో తన సిద్ధాంతాలను సమర్థించుకుంటూ Dialogue Concerning the Two Chief World Systems అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం పోపును సూటిగా విమర్శిస్తున్నట్టుగా, క్రిస్టియన్ మతానికి తిరుగుబాటుగా భావించి రోమన్ చర్చ్ గలీలియోకు జీవిత ఖైదును శిక్షగా విధించింది.

మిగిలిన మతాలతో పోలిస్తే, ఈ రకమైన మతమౌఢ్యం భారతదేశంలో ఇంతకు మునుపు లేదు. సిద్ధాంత చర్చలు, వాదవివాదాలతో భారతీయ తాత్వికత చరిత్ర అంతా నిండి ఉంది. నాసదీయ సూక్తంలో దేవుడి జ్ఞానాన్నే ప్రశ్నించే తాత్విక చింతన భారతీయ దర్శనాల్లో మొదటినుంచి కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో ఎన్నో సంవాద వివాదాలు కనిపిస్తాయి. వేదాలను నిరసించే వ్యాఖ్యలు ఉపనిషత్తులోను, ఇతిహాస, పురాణాలలోను కనిపిస్తాయి. వైదికమతానికి ఆవల ఉన్న బుద్ధ, జైన, అజీవక, చార్వాక మతాలు కూడా సంఘాలను, ఆరామాలను ఏర్పరచి సిద్ధాంత చర్చలు బాహాటంగా చేసేవారని మనకు తెలుసు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు మొదలైనవారు కూడా ఎన్నో రోజులు వాదవివాదాల్లో పాల్గొని తమ సిద్ధాంతాలని నిరూపించుకునేవారు. మామూలు ప్రజానీకం కూడా ఇతర మతాల పట్ల సహనంతో మెలిగేవారనే అనుకోవాలి. వెండీ డానిగర్ మాటల్లో చెప్పాలంటే:

“This open-mindedness was supported by the tendency of Hindus to be more orthoprax than orthodox. That is, most Hindus have not cared about straight opinions (ortho-doxy) nearly so much as they care about straight behavior (ortho-praxy). Although there is a very wide variety of codes of action, each community has a pretty clear sense of what should and shouldn’t be done, and some things were Simply Not Done.[…] but no one was impaled (the Hindu equivalent of burning at the stake) for saying that god was like this rather than like that. Each sect acknowledged the existence of gods other than their god(s), suitable for others to worship, though they might not care to worship them themselves.” [“The Hindus”, Doniger 2009, p. 46]

ఇక, వాక్-స్వాతంత్ర్య విషయానికి వస్తే, ఆధునిక ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలలో ఒకరుగా భావించే జాన్ స్టూవర్ట్ మిల్ (John Stuart Mill) అన్న తత్త్వవేత్త ఇతరులను దెబ్బతీసే ‘క్రియ’ (action) శిక్షార్హమైనదే అయినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే ‘అభిప్రాయం’ (opinion) శిక్షార్హం కాకూడదని అంటాడు. అయితే, ఆయన దృష్టిలో ఇటువంటి అభిప్రాయ వ్యక్తీకరణ కూడా కొన్ని అరుదైన సమయాల్లో శిక్షార్హం కావచ్చు. ఒక అభిప్రాయం ప్రత్యక్ష్య హింసను ప్రేరేపించేదయితే మాత్రమే దాన్ని చట్టరీత్యా నేరంగా నిర్ణయించడం సబబని ఆయన అభిప్రాయం.

“No one pretends that actions should be as free as opinions. On the contrary, even opinions lose their immunity, when the circumstances in which they are expressed are such as to constitute their expression a positive instigation to some mischievous act. An opinion that corn-dealers are starvers of the poor, or that private property is robbery, ought to be unmolested when simply circulated through the press, but may justly incur punishment when delivered orally to an excited mob assembled before the house of a corn-dealer, or when handed about among the same mob in the form of a placard. Acts, of whatever kind, which, without justifiable cause, do harm to others, may be, and in the more important cases absolutely require to be, controlled by the unfavorable sentiments, and, when needful, by the active interference of mankind. The liberty of the individual must be thus far limited; he must not make himself a nuisance to other people.[On Liberty, Mill, p. 101]”

అమెరికా రాజ్యాంగానికి తొట్టతొలి సవరణగా డిసంబర్ 15, 1791 నాడు ప్రకటించిన భావ ప్రకటనా స్వేచ్ఛ (Freedom of speech) అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. First Amendment Right అంటూ అమెరికన్లు గర్వంగా చెప్పుకొనే ఈ రాజ్యాంగ సవరణ, అమెరికా దేశంలో ఎదుటివారికి ప్రత్యక్షంగా హాని కలిగించనంతవరకూ ఏ రకమైన అభిప్రాయాన్నైనా ప్రకటించే హక్కును కల్పిస్తుంది.

ఈ మొదటి రాజ్యాంగ సవరణ హక్కు వల్ల అమెరికాలో పుస్తక నిషేధాలు చాలా అరుదుగా జరిగాయి. అమెరికాలో బానిసల బ్రతుకులను బాహాటంగా వర్ణించిన హారియట్ బీచర్ స్టోవ్ (Harriet Beecher Stowe) రాసిన Uncle Tom’s Cabin పుస్తకంపై చాలామంది కన్నెర్రజేశారు. స్టోవ్ రాసిన విషయాల్లో అసత్యాలు, అభూత కల్పనలు ఉన్నాయని, దక్షిణ అమెరికా ఎప్పుడు దర్శించని స్టోవ్ ఇక్కడి బానిసల గురించి రాయడం హాస్యాస్పదమని విమర్శలు గుప్పించారు. ఈ పుస్తకం అమ్మే దుకాణాలపై దాడులు, బెదిరింపులు కూడా జరిగాయి. అయినా, ఆ పుస్తకం నిషేధానికి గురికాలేదు.

అలాగే, The Scarlet Letter – Nathaniel Hawthorne, 1850; Leaves of Grass – Walt Whitman, 1855; The Adventures of Huckleberry Finn – Mark Twain, 1884; The Call of the Wild – Jack London, 1903; The Great Gatsby – F. Scott Fitzgerald, 1925; Gone With the Wind – Margaret Mitchell, 1936; For Whom the Bell Tolls – Ernest Hemingway, 1940; The Catcher in the Rye – J.D. Salinger, 1951; Fahrenheit 451 – Ray Bradbury, 1953; Catch-22 – Joseph Heller, 1961; The Autobiography of Malcolm X – Malcolm X and Alex Haley, 1965; Beloved – Toni Morrison, 1987, మొదలైన పుస్తకాలు ఎంతో వివాదాస్పదమయ్యాయి కానీ, ప్రభుత్వం ద్వారా నిషేధానికి నోచుకోలేదు.

అలాగే, క్రిస్టియన్ మతాన్ని విమర్శిస్తూ, అందులోని ప్రత్యామ్నాయ కథనాలను వివరిస్తూ వందలకొద్ది పుస్తకాలు, వేలకొలది పరిశోధక వ్యాసాలు వచ్చాయి. ఈ పుస్తకాలపై మతానుయాయులు ఎంతగా విరుచుకుపడ్డా ఆ పుస్తకాలు మాత్రం అమెరికా దేశంలో నిషేధానికి గురి కాలేదు.

చివరకు అమెరికన్ జాతీయ పతాకాన్ని కాల్చివేయడం కూడా ‘భావప్రకటన స్వేచ్ఛ’లో భాగమేనని 1969లోనూ, 1989లోనూ అమెరికన్ న్యాయస్థానాలు తీర్పు ఇచ్చి, అమెరికా జాతీయ జెండాను కాల్చినందుకు అరెస్టు అయిన వారిని నిర్దోషులుగా విడుదల చేశాయి.

భారతీయ శిక్షాస్మృతిలోని 295ఎ సెక్షన్ చరిత్ర

విచిత్రమేమిటంటే, భారతదేశం గురించి ఇప్పుడు పాశ్చాత్యుల కథనాలను నిషేధించడానికి భారతీయ శిక్షాస్మృతిలో తరచుగా ఉపయోగించే 295ఏ సెక్షనును మొదటగా ప్రవేశపెట్టింది బ్రిటిష్‌వారు. 1927లో పంజాబులో రాజపాల్ అనే వ్యక్తి ‘రంగీలా రసూల్‘ అంటూ మహమ్మద్ ప్రవక్త శృంగార కలాపాలను వర్ణించే చిన్న పుస్తకాన్ని రచయిత పేరులేకుండా ప్రచురించాడు. అప్పటికే పంజాబులో హిందూ-ముస్లిములమధ్య గొడవలతో శాంతిభద్రతలు కొరవడిన సమయంలో ఈ పుస్తకం మరింత అలజడిని రేపింది. 153ఎ సెక్షన్ ప్రకారం ప్రచురణకర్త రాజపాల్ పై చర్య తీసుకోవాలని కొంతమంది ముస్లిములు కోర్టుకు వెళ్ళారు. జస్టిస్ దిలీప్ సింగ్ సెక్షన్ 153ఎ ప్రకారం ఇప్పటికే మరణించిన వ్యక్తి గురించి రాయడం నేరం కాదని, రాజపాల్ నిర్దోషి అని నిర్ణయించాడు. అయితే, అదే తీర్పులో మతపరమైన ఉద్రేకాలను రెచ్చగొట్టే అభిప్రాయాలు, పుస్తకాలు, కరపత్రాలు శిక్షార్హం చేయడానికి సెక్షన్ 295కు సరికొత్త క్లాజును జతచెయ్యాలని సూచన కూడా చేశారు. ఈ నిర్ణయం వెలువడిన తరువాత లాహోర్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ పుస్తకాన్ని ప్రచురించిన రాజపాల్ 1929లో హత్య చేయబడ్డాడు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ విషయాన్ని పునఃసమీక్షించాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జస్టిస్ దిలీప్ సింగ్ చేసిన సూచన ప్రకారమే సెక్షన్ 295కు సరికొత్త క్లాజును జతచేయమని సిఫారసు చేసింది.

అయితే, ఈ కమిటీ సభ్యులలో ఒకరైన జిన్నా (M. Ali Jinnah), సెక్షన్ 295ఎ చట్టం మతపరమైన దాడులను ప్రత్యక్షంగా రెచ్చగొట్టే అభిప్రాయాలకే తప్ప ఈ చట్టం చారిత్రక దృక్పథాలను పరిశీలించేవారి పట్ల, మతాన్ని పరిశోధించే వారి పట్ల వర్తింపజేయ కూడదని అభిప్రాయపడ్డాడు. జిన్నా చెప్పిన వాక్యాలు:

[…] 295(A) should apply only to genuine cases of deliberate and malicious intent and “the fundamental principle that those who are engaged in historical works, those who are engaged in the ascertainment of truth and those who are engaged in bonafide and honest criticisms of a religion shall be protected.”

అయితే, బ్రిటిస్‌వారి పాలనలోనూ, ఆ తరువాతి కాలంలోనూ పై సూచనను పెడచెవిన పెట్టి 295ఎ సెక్షన్ ఆధారంగా ఎన్నో పుస్తకాలను నిషేధించారు. 1932లో రశీద్ జహాన్ (Rashid Jahan) రచించిన అంగారే అన్న పుస్తకంలో కథలు ఇస్లాం మతగురువులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆ పుస్తకాన్ని నిషేధించారు. 1934లో వైలీ (Max Wylie) రాసిన Hindu Heaven; 1937లో ఆర్థర్ మైల్స్ (Arthur Miles) రాసిన The Land of the Lingam, అన్న పుస్తకాలు హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని నిషేధానికి గురి అయ్యాయి.

స్వతంత్ర భారతంలో కూడా ఇదే విధమైన నిషేధాలు కొనసాగాయి. 1954లో ఆబ్రే మీనన్ (Aubrey Menen) రామాయణ కథను వ్యంగ్యంగా చిత్రిస్తూ రాసిన Rama Retold అన్న పుస్తకం నిషేధానికి గురైనది. 1983లో సేమోర్ హర్ష్ (seymour Hersh) రాసిన The Price of Power అన్న పుస్తకంలో మొరార్జీ దేశాయి సి.ఐ.ఏ. ఏజెంటుగా పనిచేశాడన్న కథనం రాసి ఉన్న కారణంగా ఈ పుస్తకం అమ్మకాలను పరువు నష్టం దావా కింద బాంబే హైకోర్టు నిలిపివేసింది.

1988లో సల్మాన్ రూష్దీ రాసిన The Satanic Versesని ఇదే సెక్షన్ ఉపయోగించి భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ పుస్తకాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం భారతదేశమే. 1995లో రూష్దీదే మరో రచన, The Moors Last Sighలో బాల్ థాకరేతో సహా పలు రాజకీయ నాయకులను వ్యంగ్యంగా చిత్రీకరించినందుకుగానూ భారత ప్రభుత్వం ఆ నవలను కూడా నిషేధించింది.



అయితే, గత 20 సంవత్సరాల్లో ఈ సెక్షనును ఉపయోగించి ఎన్నో పరిశోధనాత్మకమైన పుస్తకాలను హిందుత్వవాదులు విజయవంతంగా నిషేధింపజేయగలిగారు. శివాజీపై చారిత్రాత్మకంగా పరిశోధిస్తూ జేమ్స్ లేన్ (James Laine) రాసిన Shivaji: Hindu King in Islamic India (2003) అన్న పుస్తకంలో శివాజీ జననం గురించి రాసిన కథనంపై పెద్ద దుమారం చెలరేగింది. శివసేనకు చెందిన కొంతమంది అల్లరిమూకలు పూణేలో ఆయన పని చేసిన భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ (BORI) సంస్థపై దాడి చేశారు. ఈ దాడిలో కొన్ని విలువైన తాళపత్ర గ్రంథాలు కూడా నాశనమయ్యాయి. శంభాజీ బ్రిగేడ్ అనే మరో సంస్థకు చెందిన కొందరు ఆయనకు సహాయం చేసిన సంస్కృత పండితులపై దాడి చేశారు. ఈ పుస్తకాన్ని 2004లో మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. 2010లో భారత సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని తొలగించింది.

2003లో ద్విజేంద్ర ఝా (Dwijendra NarayaN Jha) రాసిన The Myth of the Holy Cow పెద్ద సంచలనాన్ని రేపింది. వైదిక బ్రాహ్మణులు ఆవుమాంసం తినేవారని ఆధారాలతో నిరూపించిన ఈ పుస్తకాన్ని హైదరాబాద్ సివిల్ కోర్టు నిషేధించింది. 2006లో ప్రముఖ భారతీయ క్రికెటర్ రవిశాస్త్రి oka ATapai ప్రత్యక్ష్య వ్యాఖ్యానం చేస్తూ తను బ్రాహ్మణుడే అయినా, తనకు బిల్‌తాంగ్ అన్న వంటకం చాలా ఇష్టమని చెప్పుకున్నాడు. బిల్‌తాంగ్ ఆవు మాంసంతో చేస్తారు కాబట్టి ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని ఇదే సెక్షన్ కింద ఆయనపై కోర్టులో కేసు వేశారు.

మరో హాస్యాస్పదమైన సంఘటన 2012లో జరిగింది. బాల్ థాకరే (Bal Thackeray) మరణించిన సందర్భంగా ముంబైలో బంద్ నిర్వహిస్తే షాహీన్ దాడా అనే 21-సంవత్సరాల అమ్మాయి “People like Thackeray are born and die daily and one should not observe a ‘bandh’ for that.” అని తన ఫేస్‌బుక్ పేజీ పై రాసుకుంది. దాన్ని రీనూ శ్రీనివాసన్ అనే మిత్రురాలు ‘లైక్’ చేసింది. వారి వ్యాఖ్యలు థాకరే అభిమానుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పాలఘర్ పోలీసులు ఆ ఇద్దరినీ 295ఎ సెక్షన్ కిందే అరెస్ట్ చేశారు. ఇది జరిగిన రెండు రోజులకు షాహీన్ వాళ్ళ మామయ్య ఆస్పత్రిపై శివసేనకు చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆ తరువాత వారి అరెస్టు చెల్లదని కోర్టు నిర్ధారించి వారిపై కేసు ఎత్తివేసింది.

బాత్రా అభియోగాలు, నిజానిజాలు

వెండీ డానిగర్ పుస్తకం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని బాత్రా కోర్టులో వేసిన దావాలో మొత్తంగా 47 అభియోగాలు ఉన్నాయి. హిందూమత మూల గ్రంథాలను చదివిన వారికి, డానిగర్ పుస్తకం క్షుణ్ణంగా పరిశీలించిన వారికి ఈ అభియోగాలు చాలా వరకూ నవ్వు తెప్పిస్తాయి. ఈ అభియోగాలన్నింటికి వరుసబెట్టి జవాబు ఇవ్వడం నా ఉద్దేశ్యం కాదు కానీ, అందులో ప్రధానమైనవి కొన్నింటిని పరిశీలిస్తాను. బాత్రా పంపిన లీగల్ నోటిస్ పూర్తి పాఠం outlook పత్రిక సైటులో చూడవచ్చు.

[బాత్రా] 5. That after reading the said book my client is of the opinion my client states that the aforesaid book is written with a Christian Missionary Zeal and hidden agenda to denigrate Hindus and show their religion in poor light.

వెండీ డానిగర్ క్రిస్టియన్ మతస్థురాలు కాదు, యూదుమతానికి చెందింది అన్న నిజం తెలియజేయడం ఇక్కడ అప్రస్తుతం కాదనుకుంటాను. అయితే, తనకు తెలియకుండానే తన రాతల్లో ‘పాశ్చాత్య పక్షపాతం’ చొరబడే ప్రమాదం ఉందని ఒప్పుకొనే నిజాయితీ ఆమెకు ఉన్నది. (she often describes herself as a ‘recovering Orientalist’).

[బాత్రా] 6. That the entire list of the books authored by YOU NOTICEE shows that YOU NOTICEE concentrate, focus and write on the negative aspects and evil practices prevalent in Hinduism. That the words used by YOU NOTICEE for referring to various Hindu Gods are highly objectionable.

ప్రాథమిక హిందూమతాన్ని వివరిస్తూ ఇంగ్లీషులో ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకం ఉద్దేశ్యం హిందూమతంలో ప్రత్యామ్నాయ కథనాలను వెలికి తీసుకురావడమేనని ఆవిడ ముందుమాటలోనే చెప్పుకున్నారు. ‘హిందూయిజం: ఒక ప్రత్యామ్నాయ చరిత్ర’ అని అని పుస్తకం శీర్షికలోనే ఉంది కదా. అయితే, ఈ పుస్తకంలో వివరించిన కథనాలు విభిన్న సంప్రదాయాలను తనలో కలుపుకొని, భిన్న అభిప్రాయాలను ఆదరించిన హిందూమతం యొక్క విశాల దృక్పథాన్ని, ఉత్కృష్టతను ఉగ్గడించేవిగానే ఉన్నాయి కానీ, హిందూమతాన్ని కించపరిచే విధంగా లేవు. ఆవిడ ముందుమాటలో రాసిన వాక్యాలు చూడండి:

“Since there are so many books about Hinduism, the author of yet another one has a duty to answer the potential reader’s Passover question: Why shouldn’t I pass over this book, or, Why is this book different from all other books? This book is not a brief survey (you noticed that already; I had intended it to be, but it got the bit between its teeth and ran away from me), nor, on the other hand, is it a reference book that covers all the facts and dates about Hinduism or a book about Hinduism as it is lived today. Several books of each of those sorts exist, some of them quite good, which you might read alongside this one. The Hindus: An Alternative History differs from those books in several ways.

First, it highlights a narrative alternative to the one constituted by the most famous texts in Sanskrit (the literary language of ancient India) and represented in most surveys in English. It tells a story that incorporates the narratives of and about alternative people—people who, from the standpoint of most high-caste Hindu males, are alternative in the sense of otherness, people of other religions, or cultures, or castes, or species (animals), or gender (women). Part of my agenda in writing an alternative history is to show how much the groups that conventional wisdom says were oppressed and silenced and played no part in the development of the tradition—women, Pariahs (oppressed castes, sometimes called Untouchables)—did actually contribute to Hinduism. My hope is not to reverse or misrepresent the hierarchies, which remain stubbornly hierarchical, or to deny that Sanskrit texts were almost always subject to a final filter in the hands of the male Brahmins (the highest of the four social classes, the class from which priests were drawn) who usually composed and preserved them. But I hope to bring in more actors, and more stories, upon the stage, to show the presence of brilliant and creative thinkers entirely off the track beaten by Brahmin Sanskritists and of diverse voices that slipped through the filter, and, indeed, to show that the filter itself was quite diverse, for there were many different sorts of Brahmins; some whispered into the ears of kings, but others were dirt poor and begged for their food every day.”

నిజానికి, ముందుమాటలో చెప్పుకున్నట్టుగా ప్రత్యామ్నాయ కథనాలు – ఇతిహాసపు చీకటికోణం కింద అట్టడుగున పడి కనిపించకుండా పోయిన కథలు – అంత ఎక్కువగా ఈ పుస్తకంలో కనిపించలేదనే ఈ పుస్తకంపై నాకున్న ఫిర్యాదు.

[బాత్రా] 7. That on the book jacket of the book Lord Krishna is shown sitting on buttocks of a naked woman surrounded by other naked women. That YOU NOTICEE have depicted Lord Krishna in such a vulgar, base perverse manner to outrage religious feelings of Hindus. That YOU NOTICEE and the publisher have done this with the full knowledge that Sri Krishna is revered as a divinity and there are many temples for Sri Krishna where Hindus worship the divinity. The intent is clearly to ridicule, humiliate & defame the Hindus and denigrate the Hindu traditions.

భాగవతంలోని కృష్ణుడు గోపికలతో సాగించిన రాసక్రీడలను దశమస్కంధంలో విపులంగా వర్ణించిన విషయం సంస్కృత భాగవతం కానీ, తెలుగు భాగవతం గాని మూల కృతులను చదువుకున్న వారికి తెలుసు. నిజంగా వారు నగ్నంగా శ్రీకృష్ణునితో ఉన్నారా అని సంశయపడే వారికి పోతన ఇలా సమాధానం చెబుతాడు:

హరి తను సంగసుఖంబున
బరవశలై వ్రేత లెల్లఁ బయ్యదలు నిజాం
బరములు నెఱుఁగమి చోద్యమె? – (ఆంధ్ర భాగ. -10.1-1098)

అలాగే సంస్కృత భాగవతంలో రాసక్రీడల శ్లోకాలు చదివిన వారికి ఆ పుస్తకం మీది ముఖచిత్రం అంతా చోద్యంగా అనిపించదు. మచ్చుకు ఈ శ్లోకం అర్థం తెలుసుకోండి:

నద్యాః పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకమ్
జుష్టం తత్తరలానన్ది కుముదామోదవాయునా
బాహుప్రసారపరిరమ్భకరాలకోరు
నీవీస్తనాలభననర్మనఖాగ్రపాతైః
క్ష్వేల్యావలోకహసితైర్వ్రజసున్దరీణాం
ఉత్తమ్భయన్రతిపతిం రమయాం చకార (10.29.45-46)

అయితే, పుస్తకం లోపల లోతైన చర్చలు చేస్తూ, పుస్తకం బయట ఆ చర్చలకు అంతగా పొంతనలేని గోపికల రాసలీల దృశ్యం ముఖచిత్రంగా ఉంచడంలో నిజంగానే ఔచిత్యం లేదు. అయితే, హిందూ మతాన్ని అవమానపరచే ఉద్దేశ్యం కన్నా, ఈ పుస్తకాన్ని మార్కెటింగ్ చేయడం కోసం ఆకర్షణీయంగా ఉంటుందని ఈ ముఖచిత్రాన్ని ఎంచుకున్నారని నిర్ధారించడం అంత కష్టమైన పనేం కాదు.

[బాత్రా] 9. That YOU NOTICEE has yourself stated at page 15 that your focus in approaching Hindu scriptures has been sexual.

“The Sanskrit texts [cited in my lecture] were written at a time of glorious sexual openness and insight, and I have focused precisely those parts of the texts.”

So the approach of YOU NOTICEE has been jaundiced, your approach is that of a woman hungry of sex.

ఈ అభియోగం పూర్తిగా నిరాధారమైనది. వెండీ డానిగర్ ఇక్కడ ఈ పుస్తకం గురించి చెప్పడం లేదు. 2003లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతూ అప్పుడు తను పత్రికకు చెప్పిన విషయాల ఉటంకింపు ఇది.



ఒకసారి వెండీ డానిగర్ లండన్‌లో ఇచ్చిన తన ప్రసంగంలో, ‘లక్ష్మణుడు తనను కోరుకుంటున్నాడని’ సీత నింద వేసిన సంగతి వాల్మీకి రామాయణంలో ఉందని ప్రస్తావించినందుకు ఒక హిందువు ఆమెపై కోడిగుడ్డు విసిరాడట. ఆ సంఘటనకు సమాధానంగా మరుసటి రోజు ఆమె పత్రికకు చెప్పిన వాక్యాలను ఇక్కడ ఉటంకించారు. పూర్తి కొటేషన్ ఇది:

“The Sanskrit texts [cited in my lecture] were written at a time of glorious sexual openness and insight, and I have often focused on precisely those parts of the texts. . . .The irony is that I have praised these texts and translated them in such a way that many people outside the Hindu tradition—people who would otherwise go on thinking that Hinduism is nothing but a caste system that mistreats Untouchables—have come to learn about it and to admire the beauty, complexity and wisdom of the Hindu texts.”

[బాత్రా] 25. That YOU NOTICEE at page 14 has cited a passage from Valmiki’s Ramayan in which Sita accuses Laxman of wanting her for himself but has not mentioned that very passage from Valmiki Ramayana in your book.

ఇక్కడ బాత్రా ఉద్దేశం ఏమిటో అర్థం కాదు. నాకైతే, వాల్మీకి రామాయణంలో సీత లక్ష్మణుడిని అలా అనలేదని, ఇదంతా వెండీ డానిగర్ కల్పనేనన్న ఆరోపణ ధ్వనిస్తుంది. అయితే, సీత రామునికి ప్రాణహాని కలిగిందన్నా కోపంలో లక్ష్మణున్ని ఎంతగా దుర్భాషలాడిందో వాల్మీకి రామాయణం చదివిన వారికి విదితమే. మాయలేడిని పట్టితేవడానికి రాముడు వెళ్ళిన “సీతా, లక్ష్మణా” అన్న అరుపు విని సీత ఆందోళన చెంది లక్ష్మణున్ని రాముని కోసం వెళ్ళమంటుంది. లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేనంటాడు. అప్పుడు లక్ష్మణున్ని అనుమానిస్తూ అన్న మాటలు అరణ్యకాండలో 45వ సర్వలోని ఈ శ్లోకాలలో కనిపిస్తాయి:

ఇచ్ఛసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణ మత్ కృతే|| 3-45-6
లోభాత్ తు మత్ కృతం నూనం న అనుగచ్ఛసి రాఘవం|

లక్ష్మణా, నీవు నా గురించే రాముని వినాశనం కోరుతున్నట్టు కనిపిస్తుంది. కచ్చితంగా (నూనం), నామీద మోహపడే నీవు రాముని జాడ వెతకడానికి వెళ్ళటం లేదు.

అలా లక్ష్మణున్ని కించపరిచి మాట్లాడుతుంటే, దానికి ప్రతిగా లక్ష్మణుడు సంయమనం కోల్పోకుండా తాను తన అన్న విధించిన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నట్టు సమాధానమిస్తాడు.

న్యాస భూతా అసి వైదేహి న్యస్తా మయి మహాత్మనా || 3-45-17
రామేణ త్వం వరారోహే న త్వాం త్యక్తుం ఇహ ఉత్సహే |

లక్ష్మణుడు: ఓ వైదేహి, నీకు రక్షకుడిగా ఆ మహాత్ముడు నన్ను నియోగించాడు. అందువల్ల నిన్ను వదలివెళ్ళడం నా ధర్మం కాదు (నా వల్ల కాదు).

లక్ష్మణేన ఏవం ఉక్తా తు క్రుద్ధా సంరక్త లోచనా || 3-45-20
అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్య వాదినం |

ఆ మాటలు విన్న సీత ఎర్రబడ్డ కళ్ళతో కృద్ధురాలై, సత్యవాది అయిన లక్ష్మణుడిని పరుషంగా నిందిస్తూ ఇలా అంది:

అనార్య కరుణారంభ నృశంస కుల పాంసన || 3-45-21
అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్ |

ఓరి అనార్యుడా, కరుణా హీనుడా, కులానికి/వంశానికి చెడబుట్టిన వాడా, రాముడు గొప్ప సంకటంలో ఉండటం నీకు ప్రియంగా తోస్తోందని నాకనిపిస్తుంది.

రామస్య వ్యసన్మ్ దృష్ట్వా తేన ఏతాని ప్రభాషసే || 3-45-22
న ఏవ చిత్రం సపత్నేషు పాపం లక్ష్మణ యత్ భవేత్ |
త్వత్ విధేషు నృశంసేషు నిత్యం ప్రచ్ఛన్న చారిషు || 3-45-23

ఓరీ లక్ష్మణా, రాముని సంకట స్థితి చూసే నీవు ఈ ధర్మపన్నాలు పలుకుతున్నావు. దుష్ట ఆలోచనలతో రహస్యంగా మెలిగే నీలాంటి నికృష్ట శత్రువులు ఇలాంటి పాపపు పనులు చేయడంలో ఆశ్చర్యమేమున్నది?

సుదుష్టః త్వం వనే రామం ఏకం ఏకో అనుగచ్ఛసి |
మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేన వా || 3-45-24

ఎంత దుష్టుడివి నీవు, నాకోసమే రహస్యంగా నీవొక్కడివే రాముడిని అనుసరించి వచ్చావు. లేదా భరతుడు నిన్ను పురికొల్పి ఉంటాడు ఈ పని చెయ్యడానికి.

తత్ న సిద్ధ్యతి సౌమిత్రే తవ అపి భరతస్య వా |
కథం ఇందీవర శ్యామం రామం పద్మ నిభేక్షణం || 3-45-25
ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథక్ జనం |

ఇది నీ ఆలోచనే అయినా, భరతునిదైనా జరిగే పని కాదు. ఇందీవర శ్యాముడు, పద్మ నిభేక్షణుడు అయిన రాముణ్ణి తప్ప వేరెవ్వరిని భర్తగా కామించలేను/కోరుకోలేను.

ఇది కచ్చితంగా వాల్మీకి రామాయణంలోనిదే. యుద్ధకాండలో సీత లక్ష్మణుడిని అనరాని మాటలు అన్నాను కాబట్టే నాకిలా జరిగింది అని వాపోతుంది. ఇదే కథ తెలుగులోని రంగనాథ రామాయణంలోనూ, థాయిలాండ్ వారి రామకియెన్ లోనూ కనిపిస్తుంది. మరి ఈ కథనం భారతదేశంలో ఆధునిక రామాయణ కథల్లో వినిపించదెందుకు, అన్న ప్రశ్నకు సమాధానంగా డానిగర్ ఇలా అంటుంది:

“To the accusation that I cited a part of the Hindu textual tradition that one Hindu “had never heard of,” my reply is: Yes, and it’s my intention to go on doing just that. The parts of his own tradition that he objected to are embraced by many other Hindus and are, in any case, historically part of the record. One reason why this book is so long is that I wanted to show how very much there is of all that the egg faction would deny. And so I intend to go on celebrating the diversity and pluralism, not to mention the worldly wisdom and sensuality, of the Hindus that I have loved for about fifty years now and still counting.”

నిజానికి, కాస్త తెలివైన జడ్జి ఎవరైనా ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి ఆపై ఈ కేసు పరిశీలించి ఉంటే ఇటువంటి నిరాధారమైన అభియోగాలు ఉన్నందుకు ఈ కేసు ఎందుకు పనికి రానిదని వెంటనే కొట్టివేసి ఉండేవాడు. కానీ అలా జరగలేదు.

[బాత్రా] 10. That YOU NOTICEE should be aware that in Hinduism linga is an abstract symbol of God [Shiva] with no sexual connotations but YOU NOTICEE emphasizes only those texts which portray linga as erect male sexual organ [page 22]. This shows your shallow knowledge of the Great Hindu religion and also your perverse mindset.

శివుని పూర్వ చరిత్ర గురించి నిజంగా మనకు చాలా విషయాలు తెలియవు. సింధులోయ నాగరికతకు సంబంధించి మొహంజొదారోలో లభించిన ముద్రికలలో జంతువుల మధ్య పద్మాసనంలో ఉన్న మూర్తి (పశుపతి?) శివుని తొలి రూపాల్లో ఒకటో కాదో మనకు తెలియదు. ఋగ్వేదంలో ప్రస్తావించిన ‘శిశ్నదేవుడు’ శివుడో కాదో మనకు తెలియదు. తొలత అనార్య దేవునిగా వర్ణింపబడిన ‘రుద్రుడు’ హిందూ మతంలో ప్రముఖ దేవునిగా ఎప్పుడు, ఎలా మారాడో మనకు అంతగా అంతు పట్టదు. శివుడిని జ్యోతిర్లింగంగా కీర్తించే శ్లోకాలు మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కనిపిస్తే, పురాణాల్లో మాత్రం శివలింగాన్ని చర్మలింగంగా వర్ణించే కథలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు, పద్మ పురాణంలో భృగు మహర్షి కైలాసం వెళ్ళినప్పుడు శివపార్వతులు ఏకాంతంలో ఉండి ఆయనను ఉపేక్షిస్తారు. కోపంతో భృగు మహర్షి పెట్టిన శాపం వల్ల శివుని అంగం భూమి మీద పడుతుంది. ఆ లింగం నుండి వెలువడిన అగ్ని భూమిని కాల్చేస్తుండగా భయభ్రాంతులై ప్రజలు మొరపెట్టుకోవడంతో, ఆ తేజస్సును యోని రూపంలో పార్వతి మాత్రమే ధరించగలదని ఆ ఋషులు చెబితే, పార్వతి యోని రూపంలో ఆ లింగాన్ని ధరించి శాంతిపజేస్తుందట. శివపురాణంలోని కథలో మాత్రం శివుడు దారుకావనంలో దిగంబరంగా తిరుగుతున్న వేళ ఋషిపత్నులు శివుణ్ణి చూసి మోహించడంతో, కోపగించిన ఋషులు శివుణ్ణి శపిస్తారు కాబట్టి అతడి అంగం శివలింగంగా మారుతుంది. ఇదే కథ స్కంద పురాణంలోనూ, కూర్మ పురాణంలోనూ కనిపిస్తుంది.

వెండీ డానిగర్ తన పుస్తకంలో ఈ విషయం మీద అన్ని వైపుల కోణాలకు సమాన ప్రతిపత్తిని కలగజేస్తూ ఈ అంశాన్ని సున్నితంగానే ప్రస్తావించినట్టు నాకనిపిస్తుంది. మచ్చుకు ఈ పంక్తులు చూడండి:

“In addition to understanding the history of the texts, we need to understand the relationship between records of historical events and the construction of imaginary worlds as well as the symbolism that often joins them. To begin with the symbolism of physical objects, sometimes a linga is just a linga—or, more often, both a linga and a cigar. Numerous Sanskrit texts and ancient sculptures (such as the Gudimallam linga from the third century BCE) define this image unequivocally as an iconic representation of the male sexual organ in erection, in particular as the erect phallus of the god Shiva. […]

But other texts treat the linga as an aniconic pillar of light or an abstract symbol of god (the word means simply a “sign,” as smoke is the sign of fire), with no sexual reference. To some, the stone lingas “convey an ascetic purity despite their obvious sexual symbolism.” There is nothing surprising about this range; some Christians see in the cross a vivid reminder of the agony on Calvary, while others see it as a symbol of their God in the abstract or of Christianity as a religion. But some Hindus who see the linga as an abstract symbol therefore object to the interpretations of those who view it anthropomorphically.”

[బాత్రా] 13. That YOU NOTICEE do not inform your readers in your voluminous 779 page book the most basic principle that for all Hindus Vedas are the supreme scripture and supersede anything and everything which is in conflict with Vedas. In Mahabharata [1-V-4] it is stated:

“Whenever there is conflict between what is declared in the Vedas and provisions in any of the Smritis, Puranas etc. what is declared in the Vedas shall prevail.”

వేదసాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్నవారికి ఆ వేదాలలో వర్ణించిన మతానికి, తరువాతి కాలం అభివృద్ధి చెందిన హిందూ మతానికి తేడాలు స్పష్టంగా తెలుసు. ఋగ్వేదంలో కనిపించే దేవతలు మిత్ర, వరుణ, అర్యమ, భగ, అంశ, ఇంద్ర, అగ్ని, ఉషస్ వంటి ప్రధాన దేవతలు తరువాతి హిందూ మతంలో ప్రాధాన్యత కోల్పోయారు. వేదాలలో ప్రముఖమైన అగ్నిస్తోమ (సోమయాగం), అశ్వమేధ, పురుషమేధ, అగ్నిచయన, చాతుర్మాస్య యజ్ఞాలు తరువాతి కాలంలో కనిపించవు. ప్రస్తుతం హిందూ మతంలో ప్రధానమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వం, లక్ష్మి, పార్వతి, సరస్వతి వంటి స్త్రీ దేవతల ప్రస్తావన వేదాలలో కనిపించదు. హిందూ మతానికి ప్రధానమని చాటిచెప్పే దశావతారాల ప్రస్తావన గాని, కర్మ సిద్ధాంతం గాని, పునర్జన్మ సిద్ధాంతం గాని వేదాలలో ఎక్కడా కనిపించదు.



నిజానికి వేదోత్తర కాలంలో వెలువడిన వాఙ్మయంలో వేదాల నిరసన బహుళంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ముండకోపనిషత్తులో విద్యలు పరా, అపరా విద్యలు అని రెండు రకాలని చెబుతూ, నాలుగు వేదాలు తక్కువ తరగతికి చెందిన అపరా విద్యలకు చెందినవని, పరా విద్యలు బ్రహ్మతత్త్వాన్ని తెలిపి ముక్తిని ప్రసాదిస్తాయని ఘోషిస్తున్నాయి.

తత్రాపరో ఋగ్వేదో యజుర్వేదః
సామవేదోఽ థర్వవేదః శిక్షా కల్పో
వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి।
అథ పరా, యయా తదక్షర మధిగమ్యతే ॥ (ముండకోపనిషత్తు I 2-4)

ఈ రెండువిద్యల్లో నాలుగు వేదాలు, వేదాంగాలైన శిక్షా , కల్పం, వ్యాకరణం, నిరుక్తం, చందస్సూ, జ్యోతిషమూ అన్నీ అపరా విద్యలే. ఇక శాశ్వతమూ, అమరమూ అయిన బ్రహ్మ తత్వాన్ని అందించే విద్య పరావిద్య.

భగవద్గీతలోనూ వేదవిద్యలను, కర్మకాండను నిరసిస్తూ శ్లోకాలు కనిపిస్తాయి. ప్రసిద్ధి చెందిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా’ అన్న శ్లోకానికి ముందున్న నాలుగు శ్లోకాలు, వేదాలలో ఉన్న జ్ఞానం పైపైన ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నా అది త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందిందని, ఆత్మజ్ఞానానికి పనికిరాదని ఖరాఖండిగా చెబుతున్నాయి.

యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః
వేద-వాద-రతాః పార్థ నాన్యదస్తీతి వాదినః (2.42)

పార్థా: అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు (వేద-వాద-రతాః) ఇంతకు మించింది వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.

కామాత్మానః స్వర్గ-పరా జన్మ-కర్మ-ఫల-ప్రదాం
క్రియా-విశేష-బహులాం భోగైశ్వర్య-గతిం ప్రతి (2.43)

కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవీ, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైశ్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥ (2-44)

భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్చయ జ్ఞానం ఏర్పడదు.

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥ (2-45)

అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి. నీవు వాటికి అతీతుడవై, సుఖదుఃఖాది ద్వందాలని వదిలి, నిత్యము శుద్ధ సత్వములో నిలిచి, యోగక్షేమాలను వర్జించి ఆత్మజ్ఞానివి కమ్ము.

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే ।
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥ (2-46)

అంతటా జలం పొంగుతున్నప్పుడు బావి యొక్క ఉపయోగం ఎంతవరకో, అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.

[బాత్రా] 26. That YOU NOTICEE at page 36 has written:

“The women were forbidden to study the most ancient sacred text, the Vedas.” It is another totally false statement as there are at least 29 women risikas whose compositions are there in Rig Veda. Atharva Veda [XI.5.18] expressly sanctions study of Vedas by female. Details may be seen in book ‘Vedic Equality & Hinduism.’[ISBN: 81-7822-285-x].

నిజానికి వెండీ డానిగర్ వేద వాఙ్మయంలో స్త్రీ రచయితల పాత్ర గురించి ఋగ్వేదానికి తను చేసిన అనువాద పుస్తకంలో విపులంగా చర్చించారు. అయితే, మహాభారతం నుండి మనుధర్మ శాస్త్రం దాకా స్త్రీలు, శూద్రులు వేదాలు చదవకూడదని చెబుతున్నాయి. నేడు కూడా భారతదేశంలో స్త్రీలు వేదాలు చదవడానికి అనర్హులని చెప్పే పండితులు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితినే వివరిస్తూ The Hindus పుస్తకంలో వెండీ డానిగర్ స్త్రీలు వేదాలు చదవకూడదని అంటారని, కానీ స్త్రీలు వేదరచనలో పాలుపంచుకున్నారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని ప్రస్తావించారు.

“Women are sometimes said to have been excluded from the ancient Indian texts and therefore to have left no trace, history having been written by the winners, the men. But in fact women made significant contributions to the texts, both as the (usually unacknowledged) sources of many ancient as well as contemporary narratives and as the inspiration for many more. Some Hindu women did read and write, forging the crucial links between vernacular languages and Sanskrit. Women were forbidden to study the most ancient sacred text, the Veda, but the wives, whose presence was required at Vedic rituals, both heard and spoke Vedic verses,38 and they may well have had wider access to other Sanskrit texts. Later, in the second or third century CE, the Kama-sutra tells us not only that women had such access but even that they sometimes commissioned such texts to be written (1.3). Women in Sanskrit plays generally speak only dialects (Prakrits), while men speak only Sanskrit, but since the men and women converse together, generally without translators, the women must understand the men’s Sanskrit, and the men the women’s dialects. Moreover, some women in plays both speak and write Sanskrit, and some men speak in dialects, trampling on what is left of the convention. It is a basic principle of one school of Indian logic that something can be prohibited only if its occurrence is possible. The fact that the texts keep shouting that women should not read Vedic texts suggests that women were quite capable of doing so and probably did so whenever the pandits weren’t looking. Women as a group have always been oppressed in India (as elsewhere), but individual women have always succeeded in making their mark despite the obstacles.”

ప్రాచ్యవాదం, వలసవాదం

అయితే, భారతదేశం వంటి ప్రాచ్య దేశాల గురించి పాశ్చాత్య దేశపు పండితులు చేస్తున్న పరిశోధనలు నిస్వార్థంగా కనిపించినంత మాత్రాన వారి ప్రభావం గురించి తక్కువ అంచనా వేయవద్దు. ఫ్రెంచ్ తత్త్వవేత్త మిషెల్‌ ఫూకో (Michel Foucault) చెప్పినట్టు ఏ సమాజం లోనైనా జ్ఞానం అన్నది నిష్పక్షపాతమైన సత్యశోధన వల్ల మాత్రమే జన్మించదు. ఆయన దృష్టిలో జ్ఞానానికి, అధికారానికీ విడదీయరాని సంబంధం ఉంది. అధికారం జ్ఞానసృష్టికి ఉపయోగపడుతుంది; కొత్తగా సృష్టించిన ఆ జ్ఞానం అధికారం చెలాయించడానికి పనికివస్తుంది. ఈ సిద్ధాంతం ఆధారంగా పాశ్చాత్యులు ప్రాచ్యదేశాలను గురించి చేసిన పరిశోధనను గురించి క్షుణ్ణంగా పరిశీలించిన పాలస్తీనా దేశానికి చెందిన సయీద్ (Edward Wadie Said) అనే పండితుడు, పాశ్చాత్యల పరిశోధన, వారి వలసపాలనకు, సామ్రాజ్యవాదానికి ఎంతగానో దోహదపడిందని అభిప్రాయపడ్డారు. ప్రాచ్యాన్వేషణ సాగించిన పాశ్చాత్య విద్యావేత్తలూ, సంస్థలూ, ప్రభుత్వాలూ అన్నిటికీ అధికారం ఉండడం చేత, వాళ్ళకు తెలిసిందే నిజమని అందరినీ నమ్మించగలిచారు. ఆయన చేసిన ఈ బలమైన వాదానికే ప్రాచ్యవాదం (Orientalism) అని పేరు.

ఇప్పుడు వలసపాలన లేకున్నా, పాశ్చాత్యుల పరిశోధనల్లో వారికి తెలియకుండానే ఒక రకమైన ‘పాశ్చాత్య పక్షపాతం’ చొరబడుతుందని సయీద్ చేసిన విశ్లేషణల వల్ల మనకు అర్థం అవుతుంది. ఈ రకమైన పరిశోధనలు ప్రాచ్య దేశాలపై పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని కొనసాగించడానికి పనికివస్తాయి. ఈ రకమైన ఆధిపత్య దాడిని ఎదుర్కోవాలంటే పుస్తకాలను నిషేధించడం, వారి పరిశోధనలను నిరోధించడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమి లేదు. పాశ్చాత్య దృక్పథాలతో చేసిన సిద్ధాంత చట్రాలను సవాలు చేయగలిగే లోతైన పరిశోధనలు మాత్రమే వారి అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రతిఘటించగలుగుతాయి. జ్ఞానంపై పాశ్చాత్యుల గుత్తాధిపత్యాన్ని మనం ఎదురుకొనగలిగేంతగా మనం జ్ఞానాన్ని సముపార్జించుకున్నప్పుడే వారి జ్ఞానాన్ని, అధికారాన్ని ప్రతిఘటించగలం.

వలసపాలనలో భారతీయ సమాజపు పూర్వ విజ్ఞానం, మేధో సంపద పూర్తిగా మరుగున పడిపోయాయి. ఒకసారి వెల్చేరు నారాయణరావుగారు చెప్పినట్టు, వలసపాలన వలన మనకు ముఖ్యంగా జరిగిన కీడు ఆర్థిక నష్టమో, రాజకీయ దాస్యమో కాదు — మనం మన భారతీయ సమాజపు పూర్వ విజ్ఞానం కోల్పోవడమే మనకు కలిగిన దౌర్భాగ్యం.

హిందుత్వవాదం వల్లే హిందూమతానికి అత్యంతప్రమాదం

ఇప్పటి పరిస్థితిని సరిగా అర్థం చేసుకుంటే, ప్రస్తుతం హిందుత్వవాదులనుండే హిందూమతానికి అత్యంతప్రమాదం ఏర్పడుతుందని మనకు తెలుస్తుంది. మూల గ్రంథాలు చదివి భారతీయ సంస్కృతిలోని నిర్మాణ సంక్లిష్టతలను లోతుగా అర్థం చేసుకొనే జఠర పుష్టి లేని ఇప్పటి హిందుత్వవాదుల దృక్పథం నిజానికి పూర్తిగా పాశ్చాత్యవాదం. పాశ్చాత్య మతాలలో లాగా హిందూ మతానికి ఒక దేవుడు, ఒక ప్రబోధకుడు, ఒకే మూల గ్రంథం ఉన్నాయని వాదించడం ఏ మాత్రం భారతీయం కాదు. హిందూ విశ్వాసం ఒక్కడే దేవుడన్నవాడిని, అనేక మంది దేవుళ్ళున్నారన్న వాడిని, అసలు దేముడే లేడన్నవాణ్ని కూడా సమానంగా ఆదరిస్తుంది. అలాగే శృంగారాన్ని సంకోచం లేకుండా చర్చించిన హిందూ మతం యొక్క విశిష్టతను గుర్తించుకోకుండా, బ్రిటిష్ వారి ద్వారా సంక్రమించిన విక్టోరియన్ నీతుల పరదాలు కప్పుకొని మన నాగరికతను మనమే చిన్నబుచ్చుకోవడం, విశాల వీథుల్లో పరిఢవిల్లిన హిందూ మతాన్ని ఇరుకు ఛాందస వీథుల్లో బురఖా వేసి నడిపించడం వంటిదే.

వెండీ డానిగర్ పుస్తకం ఇండియన్ మార్కెట్ల నుండి ఉపసంహరించడం వల్ల ఒరిగిందేమిటి? ఆ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ లేని ప్రచారం జరిగింది. అమెజాన్.కామ్‌లో పదకొండు వేల రాంక్ ఉన్న పుస్తకం యొక్క డిమాండ్ ఒక్క వారం రోజుల్లో ఆకాశాన్నంటి ఇప్పుడు ఆ పుస్తకం ప్రజాదరణలో 33వ స్థానానికి చేరుకుంది. ఇండియాలో కూడా డిజిటల్ కాపీలు, పెంగ్విన్-ఇంటర్నేషనల్ కాపీలు యదేచ్ఛగా లభ్యమవుతున్నాయి. ఈ పుస్తకానికి జరిగిన ప్రచారంతోపాటు మతదురభిమానంలో హిందువులు ముస్లిములకు ఏ మాత్రం తీసిపోరని, వారి మతాన్ని ఏ మాత్రం విమర్శించినా సహించరని ప్రపంచ వ్యాప్తంగా అందరూ అనుకోవడానికి ఈ నిషేధం ఆస్కారం కలిపించింది.

దృక్కోణాల విభేదం, లక్ష్యాల వైవిధ్యం వల్ల ఒకే సంఘటన, ఒకే సత్యం వేర్వేరుగా కనిపిస్తాయన్న సత్యం భారతీయ దార్శనీకులకు ఏనాడో తెలుసు. అంధగజన్యాయం లాగా, హిందూ మత చరిత్ర అనబడే గజాన్ని వర్ణించే ఎన్ని ప్రత్యామ్నాయ కథనాలు ఉంటే నిజాన్ని అంత బాగా అర్థం చేసుకోగలం. మన భాషా, చరిత్ర, సంస్కృతుల గురించి లోతైన అవగాహన కలుగజేసే సిద్ధాంతాలను ప్రతిపాదించగలిగే పరిశోధనలు, పరిశోధకులు, విశ్వవిద్యాలయాలు భారతదేశంలోనే తయారయినప్పుడు నిజమైన భారతీయ తత్త్వం విశ్వానికి వెల్లడి అవుతుంది. అంతేకాని, అభిప్రాయభేదాలను దీర్ఘ సంవాదాల ద్వారా పరిష్కరించుకొనే ఘనమైన సంప్రదాయం ఉన్న మన జాతికి ఇలా పుస్తకనిషేధాలు, పరిశోధకులపై బెదిరింపు దాడులు, భావప్రకటనాస్వేచ్ఛపై నియంత్రణలు — మునుపెన్నడూ లేని మతమౌఢ్యాన్ని, ఆత్మన్యూనతను పంచి పెంచి పోషిస్తాయే తప్ప ఏ రకంగానూ మేలు చేయవు. భారతీయ సంస్కృతిని రక్షిస్తున్నాం అని రొమ్ములు విరుచుకుంటున్న వారిచేతిలోనే మన సంస్కృతికి బమియన్ బుద్ధుల విగ్రహాలకు పట్టిన గతి పట్టకుండా చూసుకోవాల్సిన తక్షణావసరం మనందరిదీ కూడా.

ఉపయుక్త గ్రంథాలు

  • సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత – సంకలన కర్త: డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య 1989
  • శ్రీ వాల్మీకి ప్రణీత శ్రీ రామాయణం (అరణ్య కాండ), శ్రీ గోవిందా రాజీవ వ్యాఖ్యోపేతం, విజయ ముద్రశాల, 1972
  • రంగనాథ రామాయణము, గోన బుద్దారెడ్డి
  • The Argumentative Indian, Amartya Sen, Penguin Books, 2005
  • The Hindus, Wendy Doniger, The Penguin Press, 2009
  • On liberty, John Stuart Mill, 1863
  • Power/Knowledge: Selected Interviews and Other Writings, 1972-1977, Michel Foucault (Author) , Colin Gordon (Editor)
  • Orientalism, Said, Edward W, New York: Pantheon Books, 1978

ఇంటర్నెట్ లింకులు

  • బాత్రా పంపిన లీగల్ నోటిసు పూర్తి పాఠం
  • అమెరికా పబ్లిక్ రేడియోకు వెండి డానిగర్ ఇచ్చిన ఇంటర్వ్యూ
  • దీనానాథ్ బాత్రా టైమ్ మాగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ
  • Firstpost.com లో దీనానాథ్ బాత్రా గురించి
    
   

135అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
…

పాఠకుల అభిప్రాయాలు

కొత్తవి
  1. 1
    పూర్ణిమ March 1, 2014 12:27 pm

    పర్లేదు. త్వరలోనే ఈ వ్యాసం వస్తుందని ఆశిస్తూ, ఎదురుచూస్తుంటాం.

  2. 2
    Kumar N March 3, 2014 12:50 am

    Thank you. Very educative for me.

  3. 3
    రామారావు కన్నెగంటి March 3, 2014 1:03 am

    రెండు సూచనలు –

    ౧. యూదు ప్రభుత్వం కాదు క్రీస్తుకి సిలువ వేసింది – పిలాతు గారి కోర్టు. అంటే, రోమన్ ప్రభుత్వం అనుకోవాలి (యూదుల మత గ్రూప్ వారు కూడా ఆ కోర్ట్ లో భాగమే).

    ౨. దక్షిణ అమెరికా కంటే దక్షిణ రాష్త్రాలు అంటే పోతుందేమో!

    వ్యాసం బాగుంది — నిన్నటి నుంచీ ఎదురు చూస్తున్నాను.

  4. 4
    రఘోత్తమరావు March 3, 2014 4:04 am

    సురేశ్ గారు,

    ఇతర విషయాల కంటే మీరుదహరించిన భగవద్గీత శ్లోకాలపై వివరణ ఇవ్వదల్చాను.

    //భగవద్గీతలోనూ వేదవిద్యలను, కర్మకాండను నిరసిస్తూ శ్లోకాలు కనిపిస్తాయి. ప్రసిద్ధి చెందిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా’ అన్న శ్లోకానికి ముందున్న నాలుగు శ్లోకాలు, వేదాలలో ఉన్న జ్ఞానం పైపైన ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నా అది త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందిందని, ఆత్మజ్ఞానానికి పనికిరాదని ఖరాఖండిగా చెబుతున్నాయి.//

    మీరు చెప్పిందే గనుక కృష్ణుడి ఉద్దేశ్యమైతే ఇక వేదాలకు విలువేమిటి? వేదవేత్తల అస్తిత్వమెక్కడ? వేదాలను విడిచిపెట్టిన ఆత్మజ్ఞానం అన్నది సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. కనుక కృష్ణుని పై మాటలకు అసలైన అర్థాలను తెలుసుకోవాలి.

    త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్య వ్రాసిన గీతాభాష్యం ఆధారంగా మీరుదహరించిన శ్లోకాలకు యథామతి వివరణనిస్తున్నాను.

    యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః
    వేద-వాద-రతాః పార్థ నాన్యదస్తీతి వాదినః (2.42)

    //సురేశ్ వ్రాసినదిః పార్థా: అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు (వేద-వాద-రతాః) ఇంతకు మించింది వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.//

    మధ్వాచార్య భాష్యంః

    “ముక్తిని పొందడమనేది ’ఫల’మైతే స్వర్గాది భోగాలు పువ్వులవంటివి (పుష్పితాం). కేవలం వేద శబ్దాలను (వాచాం) మాత్రమే వల్లించేవారు కర్మలను, వాటి వల్ల లభించే సుఖాలను మాత్రమే తెలుసుకుంటారు. అలాకాక, ఎవరు వేదాలలోని అర్థాలను తెలుసుకొని మాట్లాడుతారో (వేదవాదరతాః) వారు ఫలం (ముక్తి) పట్లనే ఆసక్తి కలిగివుంటారు గాని పువ్వుల (కర్మజన్యువులైన స్వర్గాది సుఖాలు) పట్ల ఆదరం చూపరు.”

    కామాత్మానః స్వర్గ-పరా జన్మ-కర్మ-ఫల-ప్రదాం
    క్రియా-విశేష-బహులాం భోగైశ్వర్య-గతిం ప్రతి (2.43)

    //సురేశ్ వ్రాసినదిః కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవీ, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైశ్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.//

    మధ్వాచార్య భాష్యం: సుఖం, సంపత్తు (భోగైశ్వర్య) మొదలైన వాటిపైనే మనసు పెట్టిన వారు (కామాత్మానః) వాటిని ప్రసాదించే కర్మలందే ఆసక్తి కలిగినవారవుతారు. తద్వారా మళ్ళీ మళ్ళీ కర్మలను చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ చివరకు అనగా మహాప్రళయానంతరం అంధఃతమస్సును (గతిం) పొందుతారు (ప్రతి).

    భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్।
    వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥ (2-44)\

    //సురేశ్ వ్రాసినదిః భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్చయ జ్ఞానం ఏర్పడదు.//

    రఘుః పై పేర్కొన్న మధ్వభాష్యంలోనే ఈ శ్లోకాన్ని కూడా చేర్చడమైంది కనుక ప్రత్యేకంగా వ్యాఖ్యానించలేదు.

    త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
    నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥ (2-45)

    //సురేశ్ వ్రాసినదిః అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి. నీవు వాటికి అతీతుడవై, సుఖదుఃఖాది ద్వందాలని వదిలి, నిత్యము శుద్ధ సత్వములో నిలిచి, యోగక్షేమాలను వర్జించి ఆత్మజ్ఞానివి కమ్ము.//

    మధ్వాచార్య భాష్యం: త్రిగుణాత్మకమైన (అన్ని) విషయాలను తెలిపేవే వేదాలు. (అంటే వేదాలు త్రిగుణాత్మకాలు కావని, కేవలం సంసారానికి మాత్రమే చెందినవి కావని అర్థం). బాహ్యదృష్టికి వేదాలు త్రిగుణాత్మకమైన కర్మల్ని, సుఖాలను చెబుతున్నట్టు కనిపించినా “పరోక్షవాది వేదానాం” అన్న వాక్కును అనుసరించి బాహ్యమైన వేదార్థాలను మాత్రమే తెలుసుకోకు. ఓ అర్జునా! వేదాలలోని త్రిగుణబాధితాలైన బాహ్యవిషయాలు విషం వంటివి కనుక వాటిని విడిచిపెట్టు (నిస్త్రైగుణ్యో భవ). వేదాలలోని అంతరార్థమైన, త్రైగుణ్యవిషహారిణియైన పరమాత్మతత్వాన్ని (కృష్ణతత్వం) తెలుసుకో. అప్పుడు నువ్వు ఆ పరమాత్మతో అనుసంధానింపబడగలవు, శుద్ధసాత్వికుడవు కాగలవు. విరుద్ధ యోగాల నుండి విముక్తుడవై క్షేమంగా ఉండగలవు. (నిర్ద్వంద్వ – నిత్యసత్వస్థ – నిర్యోగ – క్షేమ),

    యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే ।
    తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥ (2-46)

    //సురేశ్ వ్రాసినదిః అంతటా జలం పొంగుతున్నప్పుడు బావి యొక్క ఉపయోగం ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.//

    మధ్వాచార్య భాష్యం: బావి (ఉదప)లోని నీటి యొక్క ఉపయోగం, చుట్టూ విస్తారంగా నిండివున్న నీటి (సంప్లుత+ఉదక) ఉపయోగంతో ఎలా పోల్చవచ్చునో (యావన్ + అర్థ) అదేవిధంగా వేదాలలో (బాహ్యార్థంలో) తెలుపబడ్డ త్రిగుణాత్మకాలైన కర్మల్ని, సుఖాల్ని వేదవిదులు కూడా పొందుతారు. (అంటే వేదవిదులు ఆ సుఖాల కొరకు ప్రత్యేకంగా ప్రయత్నించరు అని అర్థం)

    —–
    ద్వితీయాధ్యాయారంభంలో కృష్ణుడు “ప్రజ్ఞావాదాంశ్చ భాషసే” అంటాడు. బుద్ధికి తోచినట్టుగా మాట్లాడ్డమే ’ప్రజ్ఞావాదం.’ ఇది నిజానికి ప్రజ్ఞ+అవాదం అన్న సంధితో వచ్చింది. ప్రజ్ఞ అంటే వేదవిహితమైన లేక శాస్త్రవిహితమైన ఆలోచన. దానికి విరుద్ధమైనది (అవైదికమైన/అశాస్త్రీయమైన) అవాద ప్రజ్ఞ.

    గీతకు విరుద్ధమైన వ్యాఖ్యానాలను చేస్తే అది కూడా ’ప్రజ్ఞావాద’మే అవుతుంది.

  5. 5
    జయప్రభ March 3, 2014 6:18 am

    జ్ఞానంపై పాశ్చాత్యుల గుత్తాధిపత్యాన్ని మనం ఎదురుకొనగలిగేంతగా మనం జ్ఞానాన్ని సముపార్జించుకున్నప్పుడే వారి జ్ఞానాన్నీ, అధికారాన్నీ ప్రతిఘటించగలం”

    సురేశ్ కొలిచాలా! ఈ వాక్యం తో మీరు మీ సమకాలం లో ఉన్న ఈ దేశం లోని మేధావులని మొత్తంగా జ్ఞాన శూన్యులుగా చేయడం లేదా? ‘మనం’ అన్న మాటని వాడి మీ నమ్మకాలని మీరు ఇటువంటి వాక్యాల ద్వారా ఇతరులందరి నమ్మకాలుగా ప్రకటించకండి. మీ అభిప్రాయాలలో మీ చాదస్తాన్ని మీరూ ప్రకటించుకున్నట్టే అవుతుంది ఇలా రాస్తే!

    జయప్రభ.

  6. 6
    రాజు March 3, 2014 6:47 am

    రఘోత్తమరావుగారు ఈ మధ్యన ఫెస్ బుక్ లో వెన్డీ కి సంస్కృత భాషపై ఉన్న జ్ఞానాన్ని ఎద్దేవా చెస్తూ చక్కని వ్యాసాలు వ్రాశారు. చదువ గలరు

  7. 7
    రఘోత్తమరావు March 3, 2014 8:03 am

    రఘోత్తమరావుగారు ఈ మధ్యన ఫెస్ బుక్ లో వెన్డీ కి సంస్కృత భాషపై ఉన్న జ్ఞానాన్ని ఎద్దేవా చెస్తూ చక్కని వ్యాసాలు వ్రాశారు. చదువ గలరు

    రాజుగారు, నేను వెండీని ఎద్దేవా చేయలేదండి. ఆవిడ సంస్కృత ప్రయోగాల్ని ప్రశ్నించానంతే. ఎద్దేవా చేయాలంటే అది మరో వెండీ విషవృక్షం కాగలదు ః)

  8. 8
    వివేక్ March 3, 2014 10:29 am

    మన సనాతన ధర్మము నిజంగా సనాతనమైనదనీ, గొప్ప ఋషులు మనకు జ్ణానాన్ని పంచారనీ, వేదాలపైనా, వేద వాజ్మయము పైనా మనకు ఇక్కడే చాలినంత సమాచారమూ, భాష్యములూ, ఇతర విశ్లేషణలూ ఉన్నాయనీ ప్రపంచపు మొత్తానికి తెలుసు. కారణాంతరాల వల్ల మన గొప్ప సంస్కృతి కొంత దెబ్బతిన్నంత మాత్రాన, ఎవరో వచ్చి మన వేదాల గురించీ, మన మతము గురించీ ప్రత్యేకముగా చెప్పనక్కర లేదు. విదేశీయులకు చెప్పాలనుకుంటే అది ఆయా దేశాల ఇష్టము. ఒకవేళ అలాగ ఇక్కడ చెప్పాలనుకుంటే మొదట హిందువుగా మారి, అందులోని అసలైన తత్త్వమును అర్థం చేసుకుని, మొదట తాను అనుభవించి చెప్పితే అది వేరే విషయము. యాభై యేళ్ళు కాదు కదా, జీవితకాలమూ శ్రమించినా వేదాలను అర్థం చేసుకోవడము అంత సులభము కాదు అని మనకు వేదం లోనే ఎన్నో చోట్ల కనిపిస్తుంది. ఇంకొక మతం పై అంత ఆసక్తి ఎందుకో గానీ, నిజంగా మంచి ఆసక్తి ఉంటే ఇటువంటి రాతలు రావు. వారి మాటలు, పదాలు తియ్యగా ఉండొచ్చు. అంతమాత్రాన అవి భావమును కప్పలేవు.

    ఆ పుస్తకాన్ని చదివితే గానీ సరైన దీటైన జవాబు ఇవ్వలేను.

  9. 9
    రాజు March 3, 2014 10:54 am

    దురదృష్టవశాత్తు శన్కరులను, రామానుజులను అధ్యయనం చేసినట్లు మధ్వాచార్యులను చాల మన్ది అధ్యయనం చేయలేదు. వాస్తవిక ఆస్తికత కేవలం బ్రహ్మమ్ లో ఎలా సమస్త వాంగ్మయమ్ సమన్వయం ఔతుందో తెలుసుకున్నపుడే జిగ్సా పజిల్ సొల్వ్ చెసినట్లు ఆహా ఫీలిన్గ్ కలుగుతున్ది. రఘు గార్కి ధన్యవాదాలు.

    అసలు త్రిమతాచార్యులు చెప్పిన్ది ఏమిటొ తెలియదు కాని మిడి మిడి జ్ఞానంతో వేద వాంగ్మయాన్ని చిత్తమ్ వచ్చినట్లు వ్యాఖ్యానిన్చడమ్ మూర్ఖత్వమ్ కాక మరొకటి కాదు.

  10. 10
    సురేశ్ కొలిచాల March 3, 2014 11:10 am

    +రామారావు కన్నెగంటి: మీ సూచనలకు కృతజ్ఞతలు. ఆ వాక్యం సరిచేశాను.

    +రఘూత్తమరావు గారు: మధ్వాచార్యుల వారు భగవద్గీత వేదాలను విమర్శించలేదని చెప్పడానికి ఎన్ని మల్లగుల్లాలు పడ్డారో మీకే అర్థమవుతుంది. దీని గురించి విపులంగా వీలు చూసుకొని రాస్తాను.

    ప్రజ్ఞావాదం అన్నది ప్రజ్ఞ+అవాదం అన్న సంధితో వచ్చింది కాదు. ప్రజ్ఞా అన్నది స్త్రీ లింగం కాబట్టి దీర్ఘాంతంగానే రాయాలి. ఒకవేళ ప్రజ్ఞా+అవాదం అన్న సంధి చేయవలసి వస్తే ప్రజ్ఞాఽవాదమని రాస్తారండి. ప్రజ్ఞాఽవాదాంశ్చ అని అవగ్రహతో (ఽ) ఆ శ్లోకాన్ని నేనెక్కడా చూడలేదు.

    +జయప్రభ గారు: నేనన్నది Foucault చెప్పిన జ్ఞానం-అధికారం గురించి. విశ్వవిద్యాలయాల మేధో ప్రపంచంలో (Academic World) గౌరవాన్ని పొందగలిగే భారతీయ మేధావులను తయారు చేసుకోగలిగినప్పుడే మనం మన భారతీయతను, భారతదేశ ఘన సంప్రదాయాలను కాపాడుకున్నట్లు అవుతుందని చెప్పడమే నా చాదస్తం.

  11. 11
    తాడిగడప శ్యామలరావు March 3, 2014 12:01 pm

    నిస్సందేహంగా ఇది ఒక మంచి వ్యాసం.

    అలాగే కొందరు కొన్ని మంచి సందేహాలనూ లేవనెత్తారు.

    భగవద్గీత ప్రస్తావనకు వచ్చింది. భగవద్గీతకు ఇప్పటికే లెక్కలేనన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. అలా వస్తూనే ఉంటాయి రానున్నకాలంలో‌ కూడా.

    నేను ‘త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున’ అన్న దాన్ని వ్యాఖ్యానించగల పాండిత్యం‌కలవాడిని కాను. కాని గీతలో ఇక్కడ ‘వేదా’ అని చెప్పబడినది లౌకికమైన విషయజ్ఞానం గురించి. అది త్రిగుణాత్మకమైన సృష్టిని ఎరుకపరచేది మాత్రమే అనీ, నిస్త్రైగుణ్యుడవు కమ్మని భగవానువాచలోని అంతరార్థం బహుశః త్రిగుణాత్మకమైన ప్రకృతికి అతీతమైన స్థితినిని సంపాదించమనీ చెప్పటం అనీ అనుకుంటున్నాను. నామరూపాత్మకమైనది ప్రకృతి. నామరూపాలు లేకపోతే సృష్టి లేనే లేదు. నామరూపాలచేత తెలియబడే ప్రతిదానికి దాని అభావం కూడా అలాగే తెలియబడటం చేత సమస్తద్వంద్వాలూ ఎరుకలోనికి వస్తున్నాయి. ప్రకృతిని అధిగమించినప్పుడు నామరూపాలూ అధిగమించబడి సమస్తద్వంద్వాలకూ ఉనికి ఉండని ఆ స్థితిలో శుధ్ధసత్త్వం‌ మాత్రమే ఉంటుంది. అందుచేత త్రిగుణాత్మకమైన ప్రకృతినీ దానివలన కలిగే ద్వంద్వాలనీ (వాటిలో సుఖదుఃఖాదులూ ఉన్నాయి) అధిగమించి కేవలం ఆత్మగా సుప్రతిష్ఠితుడవు కమ్మని భగవానుడి అభిప్రాయం. ఇది నా అవగాహన. దీనితో‌ పండితులు ఏకీభవిస్తారో లేదో‌ తెలియదు కాని ముఖ్యంగా ఈ‌లాంటి శ్లోకాలలో వేద శబ్దం రాగానే చతుర్వేదాలకు ఆ శబ్దాన్ని అరోపించటం అన్నిసందర్భాలలోనూ సబబు కాకపోవచ్చునని చెప్పటమే నా వ్యాఖ్య ఉద్దేశం.

    మన ప్రాచీన గ్రంధాల్లో శృంగారం గురించి వ్యాసకర్త అభిప్రాయం సమర్థనీయమే. మాటవరసకు జయదేవుడి అష్టపదులకు ఈ రోజున తెలుగుచేస్తే అవి బూతులే అనిపించుకొనే అవకాశం మెండు. అదేదో గుడిలో నగ్నపార్వతి శిల్పం ఉన్నదొక ఆలయస్తంభం పైన.

    మరొక అభిప్రాయం వ్యాసకర్తది కూడా సమర్థనీయమే. ఈ‌నాడు మన మతగ్రంథాల గురించి ఇతరులు వ్రాస్తే ఆమోదాక్షేపణాదులు చెప్పటం అటుంచి వాటిపైన సాధికారంగా సమ్యక్దృక్పధంతో వ్యాఖ్యానించగల వారెందరు?

  12. 12
    రఘోత్తమరావు March 3, 2014 12:49 pm

    +రఘూత్తమరావు గారు:మధ్వాచార్యుల వారు భగవద్గీత వేదాలను విమర్శించలేదని చెప్పడానికి ఎన్ని మల్లగుల్లాలు పడ్డారో మీకే అర్థమవుతుంది. దీని గురించి విపులంగా వీలు చూసుకొని రాస్తాను.

    సురేశ్ గారు,

    మల్లాగుల్లాల గురించి – మధ్వాచార్యుల్లో గానీ ఇతర ప్రాచీనాచార్యుల్లోగానీ తప్పుల్ని ఎంచగలిగే తెలివి నాకు లేదండి. అందువల్ల సదరు మల్లాగుల్లాలన్నీ నా తెలుగు అనువాదం వల్లనేనని మనవి చేసుకొంటున్నాను. కాదు అవన్నీ మధ్వాచార్యుల వారి మల్లాగుల్లాలే అని మీరు నిశ్చయించివుంటే మీరు వ్రాయబోయే వ్యాసాన్ని తప్పక చదవాల్సిందే. ఆ వెలుగులో మధ్వ భాష్యాన్ని మరోమారు చదువుకొంటాను.

    ఇక ప్రజ్ఞావాదం గురించి వారి మాటల్లోనే “प्रकर्षॆण जानन्ति इति प्रज्ञाः । तदावाद प्रज्ञावादः प्रज्ञमतविरुद्धवदं वदसि । कथम्? – गतासून् ।”. గతాసూన్ అన్న పదాన్ని ఎలా గత+అసూన్ అని విడదీసి చదువుతామో (గత సున్ అని చదవమో) అలానే ప్రజ్ఞ+అవాద గా చదవి చూడమని చెప్పారు. ప్రజ్ఞ అన్నది పుంలింగం గనుక ప్రజ్ఞ+అవాద = ప్రజ్ఞావాద అన్నది దుష్టసంధి కాదని నా అభిప్రాయం. లేదూ ప్రజ్ఞా అన్న స్త్రీలింగంతోనే ప్రయత్నిస్తే ప్రజ్ఞా సంబంధిత అవాదః అని సమాసం చేసి దాన్నుండి ప్రజ్ఞావాద అన్న సంధిని చేయవచ్చు అని నా బుద్ధికి తోస్తోంది. అని ఐతే ప్రజ్ఞావాద పదాన్ని “చక్కటి వాదం” అన్న అర్థంలో కాక విరుద్ధార్థంలోనే ఎందుకు చదవాలన్నదే అసలు విషయం.

    అర్జునుడు పోయినవాళ్ళ గురించి, ఉన్నవాళ్ళ గురించి బాధపడుతూ శాస్త్రవిరుద్ధమైన మాటల్ని మాట్లాడాడు కనుక అర్జునుడిది అశాస్త్రీయమైన వాదమని గీతాచార్యుని భావమని మధ్వ వ్యాఖ్యానం. దీనికి పూరకమేది? అని అంటే “కార్పణ్యదోషోపహతస్వభావః ప్రుచ్హామిత్వాం ధర్మసమ్మూఢచేతాః” అన్న అర్జునుని మాటలే. ధర్మసమ్మూఢుడైనాడు గనుకనే అధార్మికమైన “ప్రజ్ఞావాద”నను చేశాడు అర్జునుడు.

  13. 13
    సురేశ్ కొలిచాల March 3, 2014 1:54 pm

    తాడిగడప శ్యామలరావుగారు: మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. “త్రైగుణ్యవిషయా వేదా” అన్నప్పుడు వేద శబ్దానికి చతుర్వేదాలను అరోపించటం సబబు కాకపోవచ్చన్నారు. మరైతే, చతుర్వేదాలను పేర్లతో సహా ప్రస్తావించి వాటిని అపరా విద్యలుగా వర్ణించిన ముందకోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తులలో శ్లోకాల గురించి మీ అభిప్రాయం చెప్పగలరా?

    రఘూత్తమరావు గారు: ప్రజ్ఞ అన్నది ఇక్కడ పుంలింగం కాదన్నది సుస్పష్టం. ఇదే అధ్యాయంలో తరువాత వచ్చే ఈ కింది శ్లోకాల్లో ప్రజ్ఞాప్రతిష్ఠితా = ప్రజ్ఞ + అప్రతిష్ఠితా కావడానికి వీల్లేదు కదా!

    యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్।
    నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 2-57 ॥

    యదా సంహరతే చాయం కూర్మోऽఙ్గానీవ సర్వశః ।
    ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥ 2-58 ॥

    తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః ।
    వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥2-61 ॥

  14. 14
    జయప్రభ March 3, 2014 2:14 pm

    కొలిచాలా! మీ వాక్యాన్ని మరోసారి చదివి చూసుకోండి. గుక్కతిప్పుకోకుండా రాయాలన్న ప్రయత్నంలో ఒకటే తత్తర పడ్డట్టు లేదూ :)? ఏదైతేనే మీ జవాబు నాలో ఏ కాస్త ఆసక్తినీ కలిగించలేదు.

    జయప్రభ.

  15. 15
    రఘోత్తమరావు March 3, 2014 3:04 pm

    సురేశ్ గారు,

    ప్రజ్ఞ పుంలింగం కానప్పుడు స్త్రీలింగం కూడా కాకూడదు. నపుంసకం అసలే కానోపదు (ఇది హాస్యానికే సుమండి!)

    మేదినీ కోశం ప్రకారం ప్రజ్ఞః అన్నది త్రిలింగ పదము అంటే పురుష, స్త్రీ, నపుంసకాల్లో వాడొచ్చు.

    “ప్రజ్ఞస్తు పండితే వాచ్యలింగో” అన్న వ్యాఖ్యానం మేరకు ప్రజ్ఞను పండితుడు అన్న అర్థంలో వాడినప్పుడు పుంలింగంగాను, “బుద్ధౌ చ యోషితి” మేరకు బుద్ధి అన్న అర్థంలో వాడినప్పుడు స్త్రీలింగంగాను పరిగణించాలని మేదినీకరుని ఉవాచ.

    మధ్వాచార్యులు “ప్రజ్ఞస్తు పండితః” అన్న పుంలింగానికి ప్రాధాన్యతనిచ్చి ప్రజ్ఞ+అవాద = ప్రజ్ఞావాద అని వ్యాఖ్యానించారు. అర్జునుడు పుం కాబట్టి ప్రజ్ఞ అన్నది కూడా పుం గానే వాడారు. ఆవిధంగా ’ప్రజ్ఞా’గా కాకుండా ప్రజ్ఞ అని హ్రస్వాంతం చేస్తే సవర్ణదీర్ఘసంధి సూత్రం సక్రమంగానే కుదురడమే గాక గీతాచార్యుని ఆంతర్యం కూడా అవగతమవుతుందని మధ్వోవాచ!

    మీరన్నట్టు స్త్రీలింగార్థంలో వాడితే ప్రజ్ఞావాదాన్ని బుద్ధివాదంగా పరిగణించాలి. అప్పుడు ప్రకర్షేణ జానాతి ఇతి ప్రజ్ఞాః అన్న అర్థం కుదరదు. ఎందుకంటే మానవ బుద్ధికి తోచినదల్లా శాస్త్రసమ్మతం కాబోదు. ఈ విషయాన్ని (స్త్రీలింగ ప్రజ్ఞను)కూడా ప్రస్తావిస్తూ మధ్వాచార్యులు “అర్జునా! బుద్ధి (కి తోచిన)వాదాన్ని చేస్తున్నావు (భాషసే) కానీ అది పండితుడు చేయవలసినది కాదు (నాను శోచంతి పండితాః)” అని కృష్ణుడు ఉపదేశించాడని వ్యాఖ్యానించారు.

    ఇక ప్రజ్ఞా ప్రతిష్ఠితా గురించి – సంస్కృత మూలంలో ఈ రెండు పదాల్ని కలపకుండా విడివిడిగా వ్రాయడం వల్ల “ప్రజ్ఞావాద”లా కలపడానికి, సంధి చేయడానికి అవకాశం లేదు. మీరు కూడా రెండింటిని విడిగానే వ్రాశారు! ఇక్కడ మళ్ళీ మేదినీకోశార్థాన్ని వాడుతూ ’ప్రజ్ఞ’ను పుంలింగంగాను ’ప్రతిష్ఠితా’ను విశేషణంగాను వాడితే రెండవ పదం ముందరి పదానికి బలం చేకూరుస్తుంది. ఆ విధంగా ప్రజ్ఞ, ప్రతిష్ఠితా అన్నవి రెండు వేరు వేరు పదాలుగా వాడబడడం వల్ల ఎటువంటి సంధి, విసంధులకి అవకాశం లేదు.

  16. 16
    Rao Vemuri March 3, 2014 6:16 pm

    సురేశ్‌ చాల శ్రమ పడి, పరిశోధన చేసి ఈ వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసం చదివిన తరువాత నాకు చిన్న అనుమానం వస్తోంది. వెండీ డానిగర్‌ హిందువు కాదు కనుక ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆక్షేపణలలా కనిపించాయా మనవాళ్లకి? ఒక క్రైస్తవేతరుడు ఇదే రకం పుస్తకం క్రైస్తవమతం మీద కాని, ఇస్లాం మతానికి చెందని వ్యక్తి ఇదే రకం పుస్తకాన్ని ఇస్లాం మీద కాని రాస్తే ఆయా మతాల వారి ప్రతిస్పందన ఎలాగుంటుందో? మన పిల్లలని మనం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం కాని అదే పని పరాయి వాళ్లు చేస్తే చాంతాడంత కోపం వస్తుంది. – వేమూరి.

  17. 17
    రాజు March 4, 2014 4:30 am

    వేమూరి గారి వ్యాఖ్య వెండీ ను సమర్ధిస్తున్నట్లు ఉంది. ఇక్కద వెండీ ఇతర దేశానికి చెందింది కనుక ఆమెపై దాడి చేయాలని కాదు ఈ వ్యాసం, దానిపై ఇప్పుడు జరుగుచున్న చర్చా. వేదొక్తమైన విషయాలను చిత్తం వచ్చినట్లు ఎవరు వ్రాసినా ఆ వ్రాతలను ఖండించ వలసిందె. ఇక భారతీయులు ఇస్లాం, క్రైస్తవ గ్రంధాలపై వ్యాఖ్యానాలు వ్రాసి ఆ వ్రాతలపై ఖండనలను పొందిన దృష్టాంతాలు చరిత్రలో నాకు తెలిసినంత వరకూ లేవు ఎందుకంటే అసలు నిజమైన భారతీయ సాధకులకు జీవిత కాలం చాలదు మన వాఙ్మయాన్ని చదివి అర్ధం చేసుకోవడానికి. ఒక వేళ వ్రాసి ఉండి ఉంటె తెలుపగలరు. విదేశీయులకు మన వేదాలపై ఆసక్తి ఉండడం వాటి ప్రాచీనత రీత్యా సహజమే.

    అసలు త్రిమతాచార్యులు చెప్పిందే పూర్తిగా మన భారతీయులకు తెలియదు అప్పుడు వెండీ లాంటి రచయితలు వ్రాసింది బాగ అర్ధమైపొయింది అని అనుకొంటే ఇహ వ్రాయవలసింది చర్చించాల్సింది ఏమీ లేదు.

  18. 18
    ..nagarjuna.. March 4, 2014 5:15 am

    విశ్లేషణాత్మకమైన వ్యాసం అందించారు సురేష్ గారు. ధన్యవాదాలు.
    అయితే అంతటి ఒక scholarగా చెప్పబడుతున్న రచయిత చేసిన కొన్ని interpretations చూసాక నాకు కొంత ఆశ్చర్యం కలిగింది, చాలా పరిశోధన చేసానని చెప్పుకున్నవాళ్ళు ఇలా ఎలా అర్దం చెసుకున్నారని,
    ఉదా: In Chapter 8: THE THREE AIMS OF LIFE.. the author states “Kama represents pleasure and desire, not merely sexual but more broadly sensual—music, good food, perfume, paintings”

    but in Chapter9: THE LOSS OF SITA
    the author writes, as said by Lakshmana, “..The king is perverse, old, and addicted to sex, driven by lust” .. probably quoting this.

    ఇలాంటి striking and selective interpretations ను చూసాక కూడా రచయితలోని నిజాయితినీ ప్రశ్నించకుండా ఉండగలమా?

  19. 19
    సురేశ్ కొలిచాల March 4, 2014 8:00 am

    నాగార్జున గారు: మంచి ప్రశ్నే అడిగారు. వెండీ డానిగర్ రామాయణ,మహాభారతాలు క్షుణ్ణంగా చదువుకుందని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. ఫలానా పదానికి ఫలానా ఇంగ్లీష్ పదం వాడింది కాబట్టి ఆమెకు సంస్కృతం రాదు, రామాయణ, మహాభారతాలు ఆమెకు తెలియవు అన్న విమర్శలు వింటూవుంటాం. అయితే, ఆమెకు తెలిసినన్ని పురాణ కథలు, ఉపనిషత్తుల కథలు, అనేక రకాల రామాయణ, మహాభారత కథలు — వాటిలో కనిపించే సూక్ష్మ వ్యత్యాసాలు — ఆమెకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవని ఆమెను వ్యక్తిగతంగా ఎరిగిన వారు నాతో అన్నారు.

    మీరు చూపిన శ్లోకంలో దశరథుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాటల్లో కామ- అన్న శబ్దానికి అర్థం ‘దేహ సంబంధమైన కాముకత్వం’ కాదు అన్నదే మీ ఆరోపణ, అవునా?

    రాముడు, లక్ష్మణుడు అడవులకు వెళ్ళిన తరువాత అయోధ్యలో ఉన్న తల్లిదండ్రుల గురించి వారు మాట్లాడుకున్న విషయాలను వివరించే వాల్మీకి రామాయణపు శ్లోకాలు చూడండి (అయోధ్య కాండ, 53వ సర్గ):

    స తు సమ్విశ్య మేదిన్యాం మహా అర్హ శయన ఉచితః |
    ఇమాః సౌమిత్రయే రామః వ్యాజహార కథాః శుభాః || 2-53-5

    గొప్ప శయనతల్పం పై పరుండడానికి అలవాటు పడిన రాముడు, మైదానంపై మేను వాల్చి సౌమిత్రితో ఇలా పలికాడు.

    ధ్రువం అద్య మహా రాజో దుఃఖం స్వపితి లక్ష్మణ |
    కృత కామా తు కైకేయీ తుష్టా భవితుం అర్హతి || 2-53-6

    మహారాజు నేడు రాత్రి దుఃఖం అనుభవిస్తుంటాడు. కైకేయికి మాత్రం తన కోరిక (కామా) నెరవేరినందుకు తృప్తిగా ఉండి ఉంటుంది.

    సా హి దేవీ మహా రాజం కైకేయీ రాజ్య కారణాత్ |
    అపి న చ్యావయేత్ ప్రాణాన్ దృష్ట్వా భరతం ఆగతం || 2-53-7

    భరతుడు తిరిగి వచ్చాక ఆ దేవి కైకేయి రాజ్యం కోసం ఆ మహారాజు ప్రాణాలను హరించదుకదా!

    అనాథః చైవ వృద్ధః చ మయా చైవ వినాకృతః |
    కిం కరిష్యతి కామ ఆత్మా కైకేయ్యా వశం ఆగతః || 2-53-8

    వృద్ధుడు, అనాథ అయిన ఆయన, నేను లేకుండా ఉన్న వేళ, కామాత్ముడై, కైకేయి వశంలో పడిపోయి ఏం చేస్తాడో.

    ఇదం వ్యసనం ఆలోక్య రాజ్ఞః చ మతి విభ్రమం |
    కామఏవ అర్థ ధర్మాభ్యాం గరీయాన్ ఇతి మే మతిః || 2-53-9

    మహరాజుకు కలిగిన సంకట పరిస్థితిని (వ్యసనం), మతిభ్రమణాన్ని చూస్తుంటే అర్థ, ధర్మాదుల కంటే కామమే బలమైనదని నాకనిపిస్తుంది.

    కో హి అవిద్వాన్ అపి పుమాన్ ప్రమదాయాః కృతే త్యజేత్ |
    చంద అనువర్తినం పుత్రం తాతః మాం ఇవ లక్ష్మణ || 2-53-10

    ఎటువంటి అవిద్యావంతుడైన తండ్రి అయినా స్త్రీ కోసం నావంటి పుత్రుణ్ణి త్యజిస్తాడా?

    సుఖీ బత సభార్యః చ భరతః కేకయీ సుతః |
    ముదితాన్ కోసలాన్ ఏకో యో భోక్ష్యతి అధిరాజవత్ || 2-53-11

    అయ్యో! కైకేయి సుతుడు, తన భార్యతో కోసల రాజ్యాన్ని అధిష్టించి ఒక్కడే సంతోషంగా భోగిస్తాడు.

    స హి సర్వస్య రాజ్యస్య ముఖం ఏకం భవిష్యతి |
    తాతే చ వయసాతీతే మయి చ అరణ్యం ఆశ్రితే || 2-53-12

    తండ్రి వయసాతీతుడైనాడు. నేను అరణ్యాలపాలయ్యాను. ఇక భరతుడే సర్వరాజ్యానికి అధిపతిగా కాగలడు.

    అర్థ ధర్మౌ పరిత్యజ్య యః కామం అనువర్తతే |
    ఏవం ఆపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా || 2-53-13

    దశరథ రాజులాగా ఎవరైతే అర్థాన్ని, ధర్మాన్ని పరిత్యజించి కామాన్ని అనువర్తిస్తారో, వానికి ఈ రకమైన కష్టాలు తప్పవు.

    వాల్మీకి రామాయణంలో ఇంత వివరంగా చెప్పిన రాముని వచనాలు చదివాక కూడా కామ- అన్న పదం దశరథుని కాముకత్వాన్ని, స్త్రీలోలత్వాన్ని సూచించడానికి వాడిందని అనుకోవడంలో తప్పు లేదు కదా!

    వెండీ డానిగర్‌ను విమర్శిస్తున్న వాళ్ళలో చాలా మంది వాల్మీకి రామాయణాన్ని, సంస్కృతమూలాలను చదవలేదు. వీళ్ళలో కొంతమందికి సినిమాల్లో, టీవీ సీరియళ్ళలోనూ చూపిందే వారికి తెలిసిన రామాయణము. వీరందరికంటే, పలు భాషల్లో, పలురకాల రామాయణాలను తరచి చూసి కొత్త కొత్త కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న వెండీ డానిగర్‌ దృక్కోణం నాకు చాలా ఆసక్తికరంగాను, పరిశోధనాత్మకంగానూ అనిపిస్తుంది. ఆవిడ విశ్లేషణతో వీరు ఏకీభవించకపోయినా ఫరవాలేదు కాని, ఆమె పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా, సంస్కృత మూలాలతో పరిచయం లేకుండా ఆమె పాండిత్యాన్ని కించపరుస్తూ నానా మాటలు అనడం సమంజసం కాదని నా అభిప్రాయం. మీరేమంటారు?

  20. 20
    చంద్ర మోహన్ March 4, 2014 9:10 am

    సురేశ్ గారూ,

    మంచి వ్యాసం. ఇక్కడ రెండు రకాల వాదాలు ఉన్నాయి:

    1. ఫలానా పుస్తకం రచయితకు తానేం వ్రాస్తుందో, ఎందుకలా వ్రాస్తోందో బాగా తెలుసు. ఆమెకు హిందూ ధర్మాన్ని కించపరిచే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. కనుక ఆమె పుస్తకాన్ని నిషేధించడం తప్పు. (అంటే ఒకవేళ ఆమె అజ్ఞాని అయి ఉండివున్నా, ఆమె హిందువులను అవహేళన చేసే ఉద్దేశ్యంతో వ్రాసి వున్నా పుస్తకాన్ని నిషేధించితే తప్పు లేదు).

    2. అసలు ఆమె ఏం వ్రాసిందన్నది ప్రక్కన పెడితే, ఏ పుస్తకాన్నైనా నిషేధించడం, ఏ వాదాన్నైనా అది మనకు నచ్చలేదు కనుక తిరస్కరించడం తప్పు. అందులో మనకు అభ్యంతరకరమైనవి ఏమైనా ఉంటే చర్చల ద్వారా, వాదాల ద్వారా ఎదుర్కోవాలి గాని అసలు ఆ పుస్తకాన్ని అమ్మనివ్వం అని చెప్పడం మంచిది కాదు.

    ఇందులో ఏదో ఒక వాదాన్ని మీరు ఆవిష్కరించి ఉంటే గొడవలేక పోవును. ఈ రెండు వాదాలనూ కలగలిపేసి మీరు చిక్కులు కొనితెచ్చుకొన్నట్లు నాకు అనిపిస్తోంది 🙂

    నా వోటు రెండో వాదానికే.

  21. 21
    రాజు March 4, 2014 9:12 am

    మొత్తం మీద వెండీ తనకు తెలిసినట్లు తర్జుమా చేసినా మన భారతీయులలొ మన సొంత వాంగ్మయం పట్ల ఉన్న అజ్ఞానాన్ని వెలికి తీసింది. ఒక్క సారిగా భగవద్గీతను వదిలి రామయణం పై చర్చ మొదలైంది ఎందుకో అర్ధం కాలేదు. ఒక చర్చ పూర్తి కాకుండా మరొక చర్చ మొదలు పెట్టడంలా ఉంది!

  22. 22
    Sravya V March 4, 2014 9:35 am

    సురేష్ గారు,

    నాకు కొన్ని సందేహలు, ఇవి వెండీ పుస్తకం లోని అంశాలు గురించి కానీ, లేదూ పురాణాలు ఏమి చెబుతున్నాయి అని కానీ కాదు! కొంచెం టాపిక్ నుంచి పక్కకి పోయి అడుగుతున్నందుకు క్షమించాలి (మరీ out of context కాదులెండి).

    1. ఇది మీ వ్యాసం లోని భాగం :

    [నిజానికి, కాస్త తెలివైన జడ్జి ఎవరైనా ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి ఆపై ఈ కేసు పరిశీలించి ఉంటే ఇటువంటి నిరాధారమైన అభియోగాలు ఉన్నందుకు ఈ కేసు ఎందుకు పనికి రానిదని వెంటనే కొట్టివేసి ఉండేవాడు. కానీ అలా జరగలేదు.]

    పెంగ్విన్ పబ్లిషర్స్ (ఇది ఏదో చిన్న పబ్లిషింగ్ సంస్థ కాదు కదా?) ఇది గమనించకుండా అది కూడా కోర్టు బయట ఒప్పందంతో కేసు నుంచి తప్పుకోవటం ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి కారణం ఏదన్నా ఉందంటారా?

    2. పుస్తకం ఎవరూ ఇంత వరకు బాన్ చేయలేదు కేవలం పెంగ్విన్ పబ్లిషర్స్ వెనక్కి తీసుకున్నారు అంతే కదా? మరి వెండీనో లేదూ ఆ పుస్తకాన్ని సమర్దించేవారు చాలా మందే ఉన్నారు కదా, వీళ్ళు ఎవరన్నా వేరే పబ్లిషర్స్ నుంచి పుస్తకాన్ని రిలీజ్ చేయొచ్చు కదా?

    3. ఇండియన్ లా, అమెరికన్ లా, కంపేర్ చేసి రాశారు. అమెరికాలో జెండాని కాల్చినా నేరం కాదు ఇది అందరికీ తెలిసిన విషయమే, అదే పని ఇండియాలో చేస్తే కేసు. అది కూడా అందరికీ తెలిసిన విషయమే కదా? వేరు వేరు దేశాలకి వేరే వేరే Law policies ఉండటం నేరమా? అయినా ఒక matured సొసైటీ Lawని ఇండియా లో కూడా implement చేయమనడం మనకి బావున్నా అది సాధ్యం కాదేమో. ఆ సాధ్యాసాధ్యాలు ఏంటొ తెలుసుకోవాలి అని ఉంది.

    4. బాత్రా తనకున్న కోర్టులో కేసు వేసుకునే వెలుసుబాటు / అవకాశం ఏదో దాన్ని వాడుకుని లీగల్ గా ప్రొసీడ్ కావటంలో నేరం ఏంటి? అది అతను చేయకూడదు అని అనటం తన హక్కుని కాలరాయటం కాదా? ఇది violation of freedom స్పీచ్ కాదంటారా? ఆ లీగల్ నోటిస్ లో బుక్ ని బాన్ చేయమని లేదు కదా? ఏవో కొన్ని అంశాలు ప్రస్తావించారు. దానికి వెండీ ఎందుకు వివరణం ఇవ్వకూడదు? ఫిక్షన్ రాస్తే ఏమో కానీ, ఆల్టర్నేట్ హిస్టరీ అని చెప్తునప్పుడు వివరణలు, దానికి తగిన ఆధారాలు అవసరం కాదా?

    5. మీరు The Satanic Versesని ఇక్కడ ప్రస్తావించారు. ఆ పుస్తకం విషయం లోను, ఈ పుస్తకం విషయం జరిగిన రభస ఒక్కటేనా? తేడా లేదంటారా?

    మొత్తం మీద మాత్రం అమెజాన్.కామ్‌లో పదకొండు వేల రాంక్ ఉన్న పుస్తకం – (ఇది మీరు చెప్పినదే) మరి అంతగా పాపులర్ కానీ పుస్తకాన్ని పబ్లిషర్స్ వెనక్కి తీసుకుంటే నిజంగా చాలా నష్టం జరిగిపోతుంది అని ఇంత వాదనలు ఎందుకబ్బా వీళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడ్ అయ్యి కోర్టు ద్వారానే సమాధానం చెప్పి ఉండొచ్చుగా అని కూడా అనిపిస్తుంది. ఇది ఎంత వరకు కరెక్టో అది మాత్రం తేల్చుకోలేక పోతున్నాను.

    ఈ పుస్తకానికి అస్సలు సంబంధం లేని ఇంకో సందేహం కూడా వస్తుంది — 200 / 300ఏళ్ళ తరవాత ఎవరన్నా తెలుగు వాళ్ళ చరిత్ర రాయాలని నిర్ణయించుకుంటే ఇప్పుడు వచ్చే సినిమాలు, టివిల్లో వచ్చే సీరియల్స్, తెలుగు బ్లాగుల్లో రాస్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా సోర్సెస్ అవుతాయా అని. అవుతాయేమో!

  23. 23
    సురేశ్ కొలిచాల March 4, 2014 10:06 am

    వేమూరి గారు: వెండీ డానిగర్ విదేశీ పరిశోధకురాలు కాబట్టి ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆక్షేపణలలా కనిపించాయన్నది వాస్తవమే కావచ్చు. నిజానికి హిందువులు కానివారు వెండీ డానిగర్ పుస్తకం చదివితే హిందూ మతంలో తొలినుండి కనిపించే భిన్నత్వంలో ఏకత్వం, కొత్త కొత్త ఆలోచనలను తనలో ఇమిడ్చుకోగలిగే విశాల దృక్పథం మొదలైన వాటి గురించి ఆమె వివరించిన విధానాన్ని బట్టి హిందూ మతంపై ఎనలేని గౌరవం కలుగుతుందనే నా అభిప్రాయం.

    ఇక, బైబిల్ లోని కథల గురించి పలురకాల విశ్లేషణలతో క్రైస్తవులు, క్రైస్తవేతరులు రాసిన వందలకొద్ది పుస్తకాలు వచ్చాయి. నీషీ (Nietzsche) రాసిన The Antichrist (Der Antichrist), రసెల్ (Bertrand Russell) రాసిన Why I Am Not a Christian క్రిస్టియానిటీనీ తీవ్రంగా విమర్శిస్తూ రాసిన పుస్తకాలలో కొన్ని. మతాతీత/లౌకిక లక్ష్యాలతో ఐజక్ అసిమోవ్ రాసిన Asimov’s Guide to the Bible, అమెరికన్ ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్ రాసిన The Life and Morals of Jesus of Nazareth వంటి పుస్తకాలపై కొంతమంది మతఛాందసవాదులు విరుచుకుపడ్డా ఆ పుస్తకాలు ఏ నిషేధానికి గురికాలేదు.

    విశ్వవిద్యాలయాల్లో బైబిల్ పై అధ్యయనాలు Textual criticism, Source criticism, Form criticism, Redaction criticism, Canonical criticism, Rhetorical criticism, Narrative criticism,Psychological criticism, Socio-scientific criticism, Postmodernist criticism, Feminist criticism అంటూ శాఖోపశాఖలుగా విస్తరిల్లినట్టుగా క్రిస్టియన్ స్టడీస్ పై కొన్ని పేపర్లు చూచాయగా చూసిన నాకనిపిస్తుంది. హిందూ మతానికి చెందిన వారిలో దీపక్ చోప్రా రాసిన The Third Jesus: The Christ We Cannot Ignore, Jesus: A Story of Enlightenment చూశారా? ఇందులో దేవదూతగా మనకు తెలిసిన జీసస్, చర్చి వారు వారి మతప్రచారానికి సృష్టించుకున్న వ్యక్తి అని, చరిత్రకారులు చెబుతున్న రెండవ జీసస్ కాక, అసలు జీసస్ కథ అంటూ ఊహాత్మకంగా మూడవ జీసస్ కథ చెబుతాడు. ఈ పుస్తకాలపై వివాదం కానీ, అనవసరమైన ప్రచారం కానీ జరగలేదు.

    పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు భారతదేశానికి పక్కనే ఉండడం, అక్కడ ప్రబలంగా ఉన్న తాలిబన్ ఛాందస భావాలు, వారి మతంపై, మతగ్రంథంపై ఏమాత్రం కొత్తరకమైన విశ్లేషణను సహించలేని మూఢత్వం, మన దేశంపై కూడా పడి హిందూ మతస్థులను ఈ రకమైన మతమౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నాయని నా అభిప్రాయం.

  24. 24
    రఘోత్తమరావు March 4, 2014 10:34 am

    సురేశ్ గారు,

    భగవద్గీత పై చర్చ ముగిసినట్టే కదండి? మీరుదహరించిన శ్లోకాలకు మీరు వ్రాసిన అనువాదాలు తప్పని ఒప్పుకున్నట్టే గదా! అవునైతే చెప్పండి. మీరుదహరించిన, వ్యాఖ్యానించిన రామాయణ శ్లోకాలపై చర్చిద్దాం.

  25. 25
    Rama kanneganti March 4, 2014 10:57 am

    Societies balance contradictory interests in interesting ways. On one hand, they have self-interest in perpetuating themselves. On the other hand, they need to rejuvenate themselves periodically. The self-interest part lays down the rules not to disturb the existing status-quo. After all, it was working to create a stable society, right? Often, they trample the human rights, the individual rights. But, in return they promise a stable society. Most religious rules fall under this category.

    For instance, Christianity prohibits doubt; so does Islam, even more virulently. Hinduism, being a synchretic religion, does not allow itself to be so easily defined.

    Now, coming to the part about rejuvenation. The western world, from Galileo to Holocaust revisionists, eventually come around treating dissidents well enough. Of course, historical baggage makes people wary of certain kinds of dissidence — for example, in Germany, Holocaust Revisionism is illegal.

    The west, in particular, the US, has setup good enough legal structures to balance out these two perspectives. Pendulum keeps swinging occasionally — the post 9/11 world has seen erosion of such individual rights. England is considered notoriously bad in this aspect. That is, it doesn’t have a useful way of dealing with dissidence. On one hand, they have strong libel laws, that prevents even scientific research (valid, well-regarded, and almost uniform acceptance) from being published. On the other hand, they have strong commitment to free speech — enough to let even preaching against the free speech.

    Now, India seems to have inherited this schizophrenia. It has some archaic laws that caters to sentiments of people, that place uneven burdens. Be it so — it is the prerogative of people how they govern themselves.

    But, is it? In lot of ways, constitution guarantees the rights of individuals, to differ, to practice that which offends others. However, in practice, continual pandering by the powers led to a state where people worry about hurting the sentiments — minorities and majorities as well. That may lead to de-facto self-censoring.

    In this background, Wendy Doniger’s writings represent a proxy fight. Suppose she is wrong. That doesn’t mean that there is legal obligation for her to correct it, unless there is *very* broad interpretation of libel laws or variants of it. Without taking a stand for or against the validity of her writing, I would like to make the statement that the law is too broad to make permit such a law suit. Now, we can think that Penguin is especially chicken — but looking at other legal precedents (ex: the book about Sahara guy etc), they may be justified in pulling back the book lest they should lose.

    We can argue that the legal rules are fine as is — that is, they should prevent books being published if they are wrong, if they are bad propaganda, if they hurt the sentiments, and if they incite unrest. While this is a sliding scale, those that have very little regard or interest in people’s intelligence choose to continue to coddle them by this legal route.

    Consider this: India has a long history of dissidence. It has a long history of alternative literature. Heck even alternative non-fiction (anybody read P.N. Oak?). And, considering the large population of India, even 1% agree with it, it will be larger than all the Swedes in the world :-). Many people postulated that it is something to do with the synchretic nature of Hinduism, which gave its strength against different religious movements.

    It is interesting that the same Hindus are supporting these kind of laws that go against historical nature of discourse in India. Of course, we can say that Mr. Batra is actually, a Pakistani, and perhaps we might be true :-).

  26. 26
    J K Mohana Rao March 4, 2014 1:31 pm

    There is a sister to section 295 called section 292 that deals with books containing erotic and sexual content. It is under this section that rAdhikAsAMtvanamu, together with a few other books, was banned. Since the then British government found that the Raja of Venkatagiri was involved in the publication of the said books, the ban was sustained only in the case of muddupaLani’s book. One of the first acts of Premier Prakasam after independence was to lift this ban (a few of these were discussed in the essays on nAgaratnamma). Wendy’s book is not the only book that came under Section 295a. DhuNDhi (on vinAyaka from a daLit perspective), a kannaDa book was banned by the govt of Karanataka. The Tamil Nadu govt banned meeNDezhum pANDiyar varalAru (Resurgence of the Pandyan history that described that one of the daLits ruled the Pandyan kingdom). The Gujarat govt banned Jaswant Singh’s book on Jinnah. Remember Wendy’s book was not “banned” in India, it was withdrawn. The books are still there in libraries. One can have discussion on the book like here in eemATa and conduct seminars on it. Reading passages from it in public is another matter, though (remember the Satanic Verses incident).

    The real problem in the application of Section 295 and such other sections is the difficulty in defining what is “hurt” (like hurting religious sentiments) which is the keyword when such books are banned. How is the “public order” disturbed is another matter. Since there are no definitions, they become quite subjective in interpretations.

    yours truly, mOhana

  27. 27
    Yoga March 4, 2014 6:48 pm

    With all due respects to Suresh garu:

    0. I still couldn’t read it completely but with a quick scan I say the following:

    1. The essay is too long with lot of needless details

    2. Does eemaaTa have a word limit for essays?

    3. Was this peer reviewed and followed the same process like it does for other entries? I am appalled that a mediocre essay like this being accepted by eemaaTa. Just because someone throws lot of information and references or the author self-proclaims that it is a “Detailed analysis” doesn’t make it a good essay.

    4. It is not clear what the author is trying to convey. There is absolutely no clarity in thought of the author nor any insights coming out of this essay. It seems like too much of information ending with a very bizarre conclusion.

    5. The author should clarify what is the problem first. Is it Indian penal code or is it Hindutva. He seems to think latter but in this Wendy Doniger case, it has nothing to do with Hindutva. Besides, for all his “research” if one types in wikipedia the list of books banned in India (takes five seconds), it will perhaps clear the ignorance of the author.

    I don’t know what is Hundutva nor what the author means is Hindutva but somehow the author comes to this bizarre conclusion that Hindutva is more dangerous to Hinduism and Hindus? Was Hindutva reason for all this list of banned/unimportable books?

    6. It has to be understood that India is not a free country. We live just under an illusion. There was never free speech (British and later and current times). India is also not a secular country. There is a clear state policy supporting specific religions. The wiki list will educate the author and others that book banning and courts intervention are routine regardless of the religious affiliations. With his selective treatment of the problem and the bizarre conclusion that he draws, it seems to me that the author is at best ignorant or at worst intellectually dishonest.

    7. Teaching and pontificating Hindus about debate is another unnecessary attempt. And how Hinduism is open adnauseum doesn’t add any value to the (confused) problem the author is trying to tackle. The author however should clarify in what context ancient Hindus debated, and educate us on the Purvapaksha tradition. Then, he should clarify if Wendy and her ilk, and the all non-Hindu religions and if Christianity and Islam also agree to the rules of this tradition. This will add value to the essay.

    8. The author also conveniently seems to ignore the glaring errors pointed out by readers like Raghottama Rao garu (ref: His FB timeline).

    9. The context of the problem needs to be defined after removing all the needless details. The problem is simple. Wendy Doniger published a book. Some Hindus found it offensive and they are well within their rights to file a law suit based on the laws of the land. They did that. The court case ran for two years or so and Penguin withdrew the books themselves voluntarily. The reasons are known only to them. So, where is Hindutva (whatever that means), or un-openness of Hindus coming from?

    10. The question to address is whether there are errors in the text as agreed by experts (and I do think there are as pointed out not only by Raghu garu but also from Rajiv Malhotra’s assessment). If so, why can’t Wendy agree to correct those? Can the author clarify if the open debate rules of Hindus apply to her also? Of course if there are not errors and why she thinks so should be clarified. I guess this is what happened in the two year court case. However, if Penguin thought strategically it makes sense for them to withdraw, it is their problem. Why is it Hindus’ problem? Just so that the author and educate themselves on this matter: Penguin withdrawing books is not happening the first time: It happened before:

    11. More later… once I manage to complete this extremely long essay… eemaaTa should spare its readers from ordeals of this kind…

    12. I hope the author addresses these and either modify his essay or write a rejoinder considering there has been enough discussion on the subject matter also.

    Sincerely
    Yoga

  28. 28
    తమ్మినేని యదుకుల భూషణ్ March 4, 2014 9:22 pm

    1964 లో సెక్షన్ 292 క్రింద నిషేధించబడ్డ వివాదాస్పదమైన పుస్తకం Lady Chatterley’s Lover ( D.H.Lawrence) 1960 దాకా బ్రిటన్ లోనే అచ్చు పడలేదు. Aసక్తి కలిగించే విషయం ఈ నవల కూDA పెంగ్విన్ ప్రచురణే, పోతే అక్కడ వ్యవహారం కోర్టుదాకా వచ్చి నిషేధం తొలిగింది. అమెరికాలో కూడా పరిస్థితి ఏమంత భిన్నంగా లేదు. నిషేధానికి కారణం అశ్లీలమన్న ఆరోపణే. మతం పట్టు సడలి, వ్యక్తివాదం బలపడి, ఎన్నో రకాలుగా ముందంజ వేసిన పాశ్చాత్య సమాజాలే కొన్ని పుస్తకాల విషయమై క్రిందా మీదా అయినాయి అంటే మత పరంగా జనాభా పరంగా ఎంతో సంకీర్ణమైన భారత దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం ఒక పరిణామ క్రమంలో భాగంగా తీసుకోవాలి; పెంగ్విన్ కోర్టు బయట రాజీపడటం నాకు ఆశ్చర్యం కలిగించింది, వాద ప్రతివాదాలు తెలుసుకొనే అవకాశం లేకుండా పోయింది భావి తరాలకు ; లారెన్స్ నవల విషయంలో మనకు వాద ప్రతి వాదాలు తెలుసు, అది ఇప్పుడు పుస్తక ప్రచురణ చరిత్రలో భాగం. కొద్దో గొప్పో ఉదార భావ జాలం వంట బట్టించుకున్న మన సామాజిక రాజకీయ వ్యవస్థకు పరమత అసహనంలో వేళ్ళూనికి పోయి నామ మాత్ర అస్తిత్వం గల పాకిస్తాన్ రాజకీయ సామాజిక వ్యవస్థకు ఏ మాత్రం సంబంధం లేదు.

    ఇక పోతే, ఐదేళ్ళ క్రిందట టైమ్స్ లిటరరి సప్లిమెంట్ లో ఈ పుస్తకమ్మీద ఒక సమీక్ష వచ్చింది. పుస్తకం బాగోగులు, రచయిత్రి లోటుపాట్లు క్లుప్తంగా తెలుసుకోగోరే వారికి ఉపకరిస్తుంది. ఇంకా విశదంగా కావాలి అంటే షుల్మన్ రాసిన సమీక్ష.

  29. 29
    హిందువుననుకునే ఒక హిందూత్వ వాది March 5, 2014 12:46 am

    హేమిటో! చక్కగా పసిబాలుడి పల్లవడోలలో ఊగులాడుదామని వచ్చేసరికి, ఇలా జరిగింది. ఈ వెండీ ఎవరో, ఆవిడ రాతల్లో గీతలేమిటో!

    అహో! వెండీ ఇట్టి ప్రత్యామ్నాయ ప్రబంధ సుందరమైన ఆలోచనాత్మక గ్రంథమేల రాయవలె! రాసినదిపో, అది నిరంకుశ నిర్హేతుక నిర్లిప్త భారతావనియందు సముద్రవాయసమేల ప్రచురించవలె! ప్రచురించెనుపో! బాత్రా మహాశయుడు అది తనమత విశ్వాసాలను కించపరుచుచున్నదని ఏల శంకించవలె! శంకించెనుపో, అతడు ఏ పవిత్ర యుద్ధమునో చేయక, కేవలము న్యాయస్థానమును ఆశ్రయించుటయా! ఆశ్రయించెనుపో, న్యాయస్థానము తన సహజరీతిలో తన తీర్పును నేనెక్కే రైలు లాగ జీవితకాలం ఆలసింపచేయనేల! చేసెనుపో! సముద్రవాయసం తను ప్రచురించిన పుస్తకాలను అర్జునుని బ్రహ్మశిరోనామకాస్త్రము వలె ఏల ఉపసంహరింపవలె! ఇందువలన కదా, నేనొక గొంగళీ పురుగుననీ, ఉదారవాద సమాజ చైతన్యాభిలాషియైన భారతీయత్వాన్ని బురఖా వేసి ఇరుకు వీధుల్లో నడిపిస్తున్నానని తెలిసినది. మతమౌఢ్యాన్నీ, సంకుచితత్వాన్నీ, నింపుకుని పరిఢవిల్లుతున్న ఈ జాతి సంస్కృతికి నిష్కృతి లేదు. విశ్వసమాజం ముస్లిములకు సరితూగుదురు అని నిందిస్తుండగా జీవించుటెట్లు? ఈ ఆత్మన్యూనతతో మరణించుటెట్లు? అహో నా అస్తిత్వానికే ప్రమాదమొచ్చినదే! మనుటయా? మరణించుటయా? ఈ మేధావులకు టోకుగా ముస్లిములను కించపరుచు అధికారమెట్లు వచ్చేనో? సరి సరి! ఉదారవాదమన్న వామాంకస్థితముకదా! ఈ అపప్రధతో జీవించు ముస్లిములే ఆధారభూతముగా నేను కూడ మనెదును గాక!

  30. 30
    రాజు March 5, 2014 3:56 am

    రఘోత్తమరావు గారి వ్యాఖ్యకు సురేశ్ గారి సమాధానం లేదు కనుక భగవద్గీత పై రఘోత్తమ రావు గారు చెప్పినవి సత్యాలని తెలిసిపొయింది. చర్చను అర్ధంతరంగా ముగించి మరో విషయాలపై మళ్ళడం సబబు కాదు. అలాగే రామాయణంపై రఘోత్తమ రావు గారు చర్చిద్దాం అని చెప్పగా మౌనం వహించడం కూడా సబబు కాదు.

  31. 31
    తాడిగడప శ్యామలరావు March 5, 2014 4:58 am

    ఈ వ్యాస రచయితగారు నన్నుద్దేశించి ‘మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. “త్రైగుణ్యవిషయా వేదా” అన్నప్పుడు వేద శబ్దానికి చతుర్వేదాలను ఆరోపించటం సబబు కాకపోవచ్చన్నారు. మరైతే, చతుర్వేదాలను పేర్లతో సహా ప్రస్తావించి వాటిని అపరా విద్యలుగా వర్ణించిన ముందకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తులలో శ్లోకాల గురించి మీ అభిప్రాయం చెప్పగలరా? అని ప్రశ్నించారు.

    ఛాందోగ్యోపనిషత్తు నాదగ్గర లేదు కాబట్టి దానిలోని శ్లోకాలను ఉటంకించి అభిప్రాయం చెప్పలేను. ముండకంలో మీరడిన శ్లోకం గురించి వ్రాస్తాను. ముండకోపనిషత్తులో ప్రథమముండకంలో

    తత్రాఽపరో ఋగ్వేదో యజుర్వేద
    సామవేదోఽథర్వవేదః శిక్షాకల్పో
    వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి
    అథ పరా యయా తదక్షరమధిగమ్యతే

    అన్న మంత్రం నాలుగువేదాలనూ, వాటితో బాటుగా శిక్షాదిగా ఉన్న ఆరు వేదాంగాలనూ‌ ప్రస్తావిస్తున్నది. ఈ మంత్రం తాత్పర్యం ప్రకారం ఇవన్నీ అపరవిద్యలునూ సనాతనమైన ఆత్మను గూర్చి తెలియజేసేది మాతం అపరవిద్యగానూ చెప్పబడుతున్నాయి. నాకున్న మిడిమిడి సంస్కృతభాషాజ్ఞానానికి అవగాహన ఐనదిది. ఈ సందర్భంగా నా అభిప్రాయం క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

    నాలుగువేదాలూ సమస్తమైన (వైదిక)కర్మకలాపానికీ మూలం. ధర్మం యొక్క స్వరూపంగా భాసిల్లే విధినిషేధాలనూ ఈ వేదం ఆధారాలుగానే తెలుసుకుంటున్నాము. సమస్తమైన ఆర్షజీవనానికి శ్రుతి అంటే వేదమే ప్రమాణం. శ్రుతివిరోధం లేనంతవరకూ ఉపనిషత్తులు కూడా ప్రమాణాలు. శ్రుత్యుపనిషత్ప్రమాణాలకు విరోధం కానంత వరకూ పురాణేతిహాసాలు కూడా ప్రమాణాలే. ఇదీ మనం ఆర్షవాంగ్మయం నుండి ప్రామాణికతను గ్రహించే విధానం. శిక్షాదిగా ఉన్న ఆరు వేదాంగాలూ, వీటిని సమగ్రంగా బోధించే సమస్తశాస్త్రాలూ కూడా శ్రుతిప్రామాణ్యతను అనుసరించే తగినంత ప్రమాణాలు. కాని ఇదంతా ఇహలోక వ్యవహారంలో ధర్మానుష్ఠానానికి సంబంధించినది. స్వర్గాదికామసుఖప్రదములైన యజ్ఞాదులన్నీ కూడా వైదికమైన వ్యవహారములే. వేదాధ్యయనం కావచ్చును, యజ్ఞాచరణం కావచ్చును కాని అవేవీ స్వయంగా మోక్షప్రదమైనవి కానేకావు. అందుచేత వీటికి సంబంధించిన సమస్తవ్యవహారమూ అపరవిద్య.

    కేవలం ఆత్మాఽనాత్మవివేకసంపాదనా సాధనాలైన ఉపనిషత్తులు మాత్రము పరవిద్యను బోధిస్తున్నాయి. పునరావృత్తిరహితమైన పదమునకు చేర్చేది తత్త్వమసీతి వాక్యప్రబోధములను చక్కగా తెలుసుకున్నవాడే కాని ఏవిధమైన లౌకికవిద్యాభ్యాసం చేసినవాడూ కాడు.

    అట్టి పరావిద్యను యెఱిగినవాడు దేహాభిమానం విడచి పరమాత్మతో సంయోగం చెందుతాడు. అనేక జన్మలసాథన పట్టవచ్చు ఒక జీవికి ఆ స్థితి రావటానికి. గీతలోనే, భగవన్ముఖంగా, యోగభ్రష్టుడు తిరిగి తన యోగాభ్యాసాన్ని కొనసాగించేందుకు తగిన ఉత్తమమైన జన్మను పొందుతాడని చెప్పబడింది. అందుచేత అప్పుడప్పుడు మనకు జన్మసిధ్ధులైనవారు కూడా లోకంలో దర్శనం ఇస్తారు. కాని వారు తాము లౌకికప్రపంచంలో పదిమంది దృష్టికి రావటాన్ని ఇష్టపడకపోవచ్చు తరచుగా. అందుచేత అటువంటి వారు మనమధ్యే ఉన్నా వారి సంకల్పం లేనిదే మనం వారిని తెలుసుకోలేము. ప్రాపంచికమైన విషయాలమీద వారికి ఏ విధమైన కోరికా ఉండదు కాబట్టి వారు ఏ విధమైన అపరవిద్యలను ఆశ్రయించరు. రకరకాల సౌఖ్యాలను అపేక్షించే మనకోసమే అపరవిద్యలు. కేవలం పరబ్రహ్మమును కోరిన వారు పరవిద్యను మాత్రం ఆదరిస్తారు.ఇంతకంటే చెప్పగల అధికారిని కాదు, క్షమించాలి.

  32. 32
    indrani Palaparthy March 5, 2014 10:39 am

    హేమిటో! చక్కగా పసిబాలుడి పల్లవడోలలో ఊగులాడుదామని వచ్చేసరికి, ఇలా జరిగింది. ఈ వెండీ ఎవరో, ఆవిడ రాతల్లో గీతలేమిటో! 🙂

    సముద్రవాయసం తను ప్రచురించిన పుస్తకాలను అర్జునుని బ్రహ్మశిరోనామకాస్త్రము వలె ఏల ఉపసంహరింపవలె! ఇందువలన కదా, నేనొక గొంగళీ పురుగుననీ, ఉదారవాద సమాజ చైతన్యాభిలాషియైన భారతీయత్వాన్ని బురఖా వేసి ఇరుకు వీధుల్లో నడిపిస్తున్నానని తెలిసినది.

    హ హ 🙂 బావుంది హిందుత్వవాది గారు!

    ఇంద్రాణి.

  33. 33
    ..nagarjuna.. March 5, 2014 1:17 pm

    @రఘోత్తమరావు గారు, ప్రజ్ఞావాదం గురించి గీతలో మీరు ఉదహరించిన శ్లోకానికి ముందర శ్లోకం,

    శ్లో: “తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత,
    నేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః”

    కు మధ్వాచార్యుల భాష్యం ఈ విధంగా ఉంది: జ్ఞానవంతుడైన నీ కిట్టి దుర్భుద్ది ఎట్లు కలిగెనని పరిహాసము చేయుచు అర్జునుని జూచి ఈ వాక్యమును పలికెను.

    ఆ తరువాత వచ్చే శ్లోకం

    శ్లో.అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భషసే,
    గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః

    ఈ రెండింటినీ కలిపి చూస్తే, “బంధువులనూ పూజ్యులనూ ధర్మం నేర్పిన గురువులనూ చంపి రాజ్యం చేజిక్కించుకోవడం కంటే త్యజించి బిచ్చమెత్తుకోవడం శ్రేయస్కరం కదా, ఆలోచించు. ఏం చేయాలో నీవే చెప్పు” అన్న అర్జునుడితో కృష్ణుడు “పండితులైనవారు బ్రతికున్నవారిని గురించిగాని, చనిపోయినవారిని గురించిగాని దుఃఖింపరు. నువ్వు పండిత వచనాలు పలుకుతూ (పరిహాసంగా) కూడనివాటిని గురించి దుఃఖిస్తున్నావు” అన్నాడు. ఈ విధంగా చూసినపుడు కర్మధర్మాలలో అభిమానం కలిగి ఉండిన అర్జునుడు ఇతర శ్రుతులకు పలుకుతూ సందిగ్ద వాదన చేశాడుగాని మీరు అన్నట్టు అది అవాదం కాదేమో! నా ఈ అన్వయంలో ఏదన్నా తప్పుంటే చెప్పండి.

    త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
    నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥ (2-45)

    గురించి శంకర భాష్యం ఇలా ఉంది: “అర్జునా! వేదములు ఈ సంసారమే విషయముగా గలవి. నీవు నిష్కాముడవును, ద్వంద్వములను వదలినవాడవును, నిత్య సత్వగుణము గలవాడవునూ, ఆత్మజ్ఞానము కలవాడవును కోరికలేనివాడవును నగుము.”

    అయితే ఇదే శ్లోకానికి మధ్వాచార్యులు భాష్యం చేస్తూ ఆ త్రిగుణాలు వేదాలలో పైకి కనిపించే అర్దం మాత్రమే అన్నారు.

    “యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే..” అన్న శ్లోకం గురించి మధ్వాచార్యులు ఇలా చెప్పారు: “వేదాలలో చెప్పిన ఫలమంతా బ్రాహ్మణునిలో నంతర్భవించును. బ్రాహ్మమును పొందువాడు బ్రాహ్మణుడు. బాహ్మపరోక్షజ్ఞానము గలవాడు బ్రాహ్మణుడు. అది జ్ఞానమువలన కలుగును”

    దీనికే శంకర భాష్యం “సమస్తవేదములయందు చెప్పబడిన కర్మలననుష్ఠించడంవల్ల గలుగు ఫలము అంతకన్నను మిక్కిలి గొప్పదైన జ్ఞానముగల బ్రహ్మజ్ఞానికి గలుగు మోక్షరూపఫలములో నంతర్భావము నొందును” గా ఉన్నది.

    ***
    @సురేష్ గారు,

    నాకు రచయిత్రి భాషా పరిజ్ఞానం గురించి సందేహాలు లేవండి. ఉన్న సంశయమల్లా ఆమె అన్వయాలు సబబుగా ఉన్నాయా, వాటిని అన్వయించడంలో ఆవిడ నిజాయితీగా ఉన్నారా లేదా అని. రామాయణంలోంచి మీరు ఉదహరించిన శ్లోకాలలో చూసినా “మహారాజు నేడు దుఃఖం అనుభవిస్తుంటాడు”, “అర్థ, ధర్మాదుల కంటే కామమే బలమైనదని నాకనిపిస్తుంది” అని కోరిక (this need not necessarily be lust .. భార్యపై ఉండే సహజమైన ఆసక్తి ఇష్టం కావచ్చు) వల్లనే నేడు మహారాజు దుఃఖితుడై ఉన్నాడని చెప్పిన రాముడు/లక్ష్మణుడితో దశరథుడిని explicit గా sex-addict అని చెప్పించడం కరెక్టేనా అని.

  34. 34
    రఘోత్తమరావు March 5, 2014 2:57 pm

    నాగరాజు గారు,

    గీత పై శంకర-మధ్వ భాష్యాలపై మీరడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ముందు ఒక విషయాన్ని పంచుకోదలిచాను.

    మన ధార్మిక గ్రంథాల విశ్లేషణ చేసే సందర్భంలో విశ్లేషకులు రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి:

    1. ప్రసంగం
    2. ప్రసక్తి

    ఒక ప్రసంగంలో ఎన్నో ప్రసక్తులు ఉంటాయి. ఉదా: రామాయణంలోని రామ వనవాసం. ఈ ప్రసంగం పుట్టడానికి ఎన్ని ప్రసక్తులు అవసరమయ్యయో చూడాలి.

    సురేశ్ గారు దశరథుని కాముకత్వం వల్ల వనవాస ప్రసంగం పుట్టుకొచ్చిందన్నట్టుగా వ్రాసారు. అది చదివిన వారికి మరే ప్రసక్తి లేనట్టుగా అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి ఐదు ప్రసక్తులు ఉన్నాయి:

    1. దశరథునికి శ్రవణ కుమారు డిచ్చిన శాపం.
    2. కైకేయికి దశరథుడిచ్చిన మూడు వరాలు.
    3. మంథర – కైకేయి సంభాషణ.
    4. ఎప్పుడో ఇచ్చిన వరాలను రామ పట్టాభిషేక సమయంలోనే కైక అడగడం.
    5. వశిష్ఠుడు వంటి బ్రహ్మర్షి నిర్ధారించిన పట్టాభిషేక ముహూర్తం విఫలమవడం.

    పైవన్నీ ఒక్క బిందువు దగ్గర కలిసినప్పుడే వనవాస ప్రసంగం సంభవనీయమైంది. ఇందులో ఏ ఒక్క ప్రసక్తిని వదిలినా ప్రసంగంలోని పరమార్థం మాయమైపోతుంది. ప్రస్తుతం వెండీ గాని, సురేశ్ గారు గాని చేసినది ఇదే. ఏదో ఒకటి రెండు శ్లోకాలను తీసుకొని అందులోని మాటలే సిద్ధాంతమని అనుకోవడం పొరబాటు.

    పై నేపధ్యంలో అర్జున విషాదాన్ని, నిర్వేదాన్ని ఒకటి, రెండు భగవద్గీత శ్లోకాలతోనే సరిపెట్టాలని చూస్తే అది విపరీతార్థాలకు దారి తీస్తుంది. బంధువుల్ని చంపలేనని ఏడ్చిన అర్జునుడు కృష్ణప్రబోధంతో యుద్ధానికి మళ్ళాడు. కానీ అభిమన్యుని మరణంతో మళ్ళీ దుఃఖించి యుద్ధం మధ్యలోనే అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యాడు. అంతకు మునుపు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కృష్ణుడి మీద అహంకరించాడు. ఇలా ఎన్నెన్నో ప్రసక్తుల్ని చేర్చి అర్జునుడిని ఉద్దేశ్యించి గీతలో కృష్ణుడు వాడిన పదాలను విశ్లేషించాలి.

    రెండో అధ్యాయం మొదట్లోనే కృష్ణుడు “క్లైబ్యం మాస్మ గమః పార్థ” అని అర్జునుణ్ణి మందలిస్తాడు. క్లైబ్యం అంటే నపుంసకత్వమని అర్థం కదా! మరి అర్జునుడు నపుంసకుడా? కానప్పుడు ఆ పదాన్ని కృష్ణుడు ఎందుకు వాడాడు? – ఇవన్నీ అర్థం కావాలంటే భారత యుద్ధం వరకూ గల అర్జునుని వ్యవహారాలన్నింటినీ సమీక్షించాలే తప్ప ఒక్క యుద్ధ ప్రసంగంతోనే నిర్ధారణలకు రాకూడదు.

    ఇక మీరుదహరించిన మధ్వభాష్యపు తెలుగు అనువాదం సరికాదని నా అనుమానం. మూల సంస్కృత భాష్యం ఇలా ఉంది:

    “తత్ర సేనయోర్మధ్యే్ బాంధవాదిమోహజాలసంవృతం వశీదంత అర్జునం భగవాన్ ఉవాచ – ప్రజ్ఞావాదాన్ స్వమనీషోత్థవచనాని | కథమ్ అశోచ్యా? గతాసూన్”

    పై దానిలో ప్రజ్ఞావాదాన్ అన్నదానిని “స్వమనీషోత్థవచనాని” అని వివరించారు. అంటే మానుషబుద్ధికి తోచిన మాటలని అర్థం. ప్రజ్ఞావాదానికి “స్వమనీషోత్థవచనాని” అన్న అర్థాన్ని ఎలా సాధించాలి? అని ప్రశ్నిస్తే “గతాసూన్” పదాన్ని గత + అసూన్ అని విడదీసినట్టుగానే ప్రజ్ఞ+అవాద అని విడదీయలన్నారు ఆచార్యుల వారు.

    ఐతే ప్రజ్ఞావాదంను ప్రజ్ఞ+అవాదం అని ఎందుకు విడదీయాలన్నదే ముఖ్య విషయం.

    దీనికి నా సమాధానం:

    ప్రజ్ఞావాదం = పండిత వచనాలు అని భావిస్తే, “నాను శోచంతి పండితాః” లోని పండిత పదం రావడం వల్ల పునరుక్తి దోషాన్ని ఆపాదించాల్సివస్తుంది. తద్దోష పరిహారార్థంగా ప్రజ్ఞావాదాన్ని అశోచ్యా అన్న పదంతో బాటూ చదవాలని మధ్వచార్యులు సూచించారు. అశోచ్యా అంటే ఆలోచనకు అనర్హమైనదని అర్థం. మీరన్నట్టు అర్జునుడివి పండిత వచనాలైతే అవి శోచ్యాలే గానీ అశోచ్యాలు కాలేవు. కనుక ప్రజ్ఞావాదాన్ని ప్రజ్ఞ+అవాద గా విడదీసి ప్రజ్ఞావాదమంటే అశాస్త్రీయమైన మాటలని, అవి అనర్హమైనవని (అశోచ్యా) తెలుసుకోవాలని మధ్వుల భావన.

    మిగతాది రేపు కొనసాగిస్తాను….ధన్యవాదాలు.

  35. 35
    Yoga March 5, 2014 3:12 pm

    Some links on this issue that could be educative to readers:

    1. Rajiv Malhotra’s interview to Rediff.com on this issue:
    http://www.rediff.com/news/slide-show/slide-show-1-when-westerners-make-fun-of-our-gods-theyre-instigating-trouble/20140217.htm

    2. Kanchan Gutpa’s article on this matter in Niti Central on the hypocrisy of the “liberals”
    http://www.niticentral.com/2014/02/12/wendy-doniger-hindus-and-fraudulent-left-liberals-189575.html

    There are more links on this in Niti Central on this subject (search using Wendy Doniger)

    3. List of books that are banned/unimportable in India:
    http://en.wikipedia.org/wiki/List_of_books_banned_in_India

    4. Univ of Chicago site link summarizing the issue of western interpretations of Hinduism. It also discusses the views of Rajiv Malhotra
    http://magazine.uchicago.edu/0412/features/

  36. 36
    SriRam March 5, 2014 4:19 pm

    Why the Wendy Doniger episode is not a free speech issue
    http://www.firstpost.com/india/why-the-wendy-doniger-episode-is-not-a-free-speech-issue-1388751.html

    [Note to commenters: Please refrain from posting article links without an original opinion, or a comment for them to be a part of. No further posts with only links to essays on the web are allowed – Ed.]

  37. 37
    J K Mohana Rao March 5, 2014 4:40 pm

    నా అభిప్రాయములు క్రింది అభిప్రాయములకు మాత్రమే పరిమితము –
    1. దశరథునికి శ్రవణ కుమారు డిచ్చిన శాపం.
    2. కైకేయికి దశరథుడిచ్చిన మూడు వరాలు.
    కైకేయికి ఈ వరములను గురించి తెలుసు. ఆమెకు కూడ రాముడంటే ప్రీతి, వాత్సల్యము. పట్టాభిషేకమునకు ముందే పుత్రశోక శాపము దశరథుడు అనుభవిస్తే తరువాత రాజ్యపాలన ఎట్టి కష్టము లేకుండ సాగిపోతుంది కాబట్టి ఆ వరములను కైక అడిగినట్లు భాసమహాకవి ప్రతిమా నాటకములో, యజ్ఞఫలనాటకములో వివరిస్తాడు. తన తొట్రుబాటులో 14 రోజులు అనడానికి బదులు 14 ఏండ్లు అంటుంది ఆమె. The rest is history. కాని మునిశాపమును దశరథుడు అనుభవించడమును కైకేయి ఆపలేక పోతుంది. వాల్మీకి రామాయణములో సీత లక్ష్మణుని సందేహించడము ఆమె పాత్రలో లోపమా? విధేయుడు – మోహన

  38. 38
    Yoga March 5, 2014 5:21 pm

    The latest analysis of Raghottama Rao garu clearly illustrates the importance of precision in language and the context. So, given these inputs and the fact that the conclusion of the essay is erroneous, would the author Suresh garu consider revising his opinion? Is he open to being corrected?

    [Rest of the post is edited as it pertains to a discussion on Facebook and not here on eemaata. — Ed.]

  39. 39
    తః తః March 6, 2014 12:04 am

    వాల్మీకి రామాయణములో సీత లక్ష్మణుని సందేహించడము ఆమె పాత్రలో లోపమా? విధేయుడు – మోహన

    కాదు. అది వాల్మీకిని సరిగా అర్థం చెసుకొక పొవటం. వాల్మీకి (ఒక అద్భుతమైన) రక్త మాంసాల కవి. A flesh and blood poet like Shakespeare.

    తః తః

  40. 40
    రాధిక March 6, 2014 3:59 am

    సురేష్ గారు, ఒక సందేహం.

    “దృక్కోణాల విభేదం, లక్ష్యాల వైవిధ్యం వల్ల ఒకే సంఘటన, ఒకే సత్యం వేర్వేరుగా కనిపిస్తాయన్న సత్యం భారతీయ దార్శనీకులకు ఏనాడో తెలుసు. అంధగజన్యాయం లాగా, హిందూ మత చరిత్ర అనబడే గజాన్ని వర్ణించే ఎన్ని ప్రత్యామ్నాయ కథనాలు ఉంటే నిజాన్ని అంత బాగా అర్థం చేసుకోగలం.” అన్నారు మీరు వ్యాసంలో.

    అది ఒకే సత్యం వేరు వేరుగా కనిపించడమా! వేరు వేరుగా చెప్పబడడమా! ఒక సత్యం పలురకాలుగా చెప్పబడడం, అంధ గజ న్యాయం ఒకటి కాదేమో కదా! మొదటి దాన్ని అందరికీ “తెలిసిన ఒకే సత్యం” పలురకాలుగా చెప్ప బడుతుంది అన్న అర్ధం లోనూ రెండోదాన్ని ఎవరికీ “అసలు సత్యం తెలియదు.” అన్న అర్ధం లోనూ కదా వాడతారు! అంధ గజ న్యాయాన్ని పాటించకూడని విషయంగానే ఇప్పటివరకు విన్నాను. మీరు అది నిజాన్ని తెల్సుకోవడానికి ఉపయోగిస్తుందంటున్నారు!

  41. 41
    రామారావు కన్నెగంటి March 6, 2014 8:21 am

    Since nobody raised objections to whatever I said, I am correct. Shall we move on?

    That means all of you agreed that:

    1. The blasphemy/libel laws as they are stated are incorrect and antithetical to Hinduism.

    2. Hinduism has enough contradictions in it that using coherence as a way of logic does not work.

    3. And, the legal recourse to the book insults the intelligence of people and stifles discourse.

    Thanks for agreeing I am right. It is most satisfying to be correct. But, then, I always knew that.

  42. 42
    రాజు March 6, 2014 9:22 am

    ఒక సాధకుని దృష్టితో చూస్తే ఈ సంభాషణలో రఘోత్తమ రావుగారి వాదన చక్కగా చిక్కగా ఉంది. మధ్వుల భాష్యం ఆ ఒక్క శ్లొకం లోనే అంత పటిష్టంగా ఉంటె మొత్తం చదివితే ఇంకా ఎన్ని విషయాలు తెలుసుకొవచ్చొ అనే కుతూహలం కలుగక మానదు. రఘోత్తమ రావుగారి వంటి వారు మధ్వుల గీతా భాష్యాన్ని ఆంధ్రీకరిస్తె ఎంతొ మేలు.

    //మన ధార్మిక గ్రంథాల విశ్లేషణ చేసే సందర్భంలో విశ్లేషకులు రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి: 1. ప్రసంగం 2. ప్రసక్తి

    ఇది కొత్త విషయం నా వరకూ. ధన్యవాదాలు.

  43. 43
    రఘోత్తమరావు March 6, 2014 11:39 am

    //రామారావు కన్నెగంటి అభిప్రాయం: March 6, 2014 8:21 అం//

    Actually, no one took a notice of what you have said Sir. All the 3 conclusions that you have drawn are part of your free speech & nothing more 🙂

    [Our stats, on the other hand, show that quite a few took notice. But if you believe no one did… – Ed.]

  44. 44
    తః తః March 6, 2014 1:16 pm

    ఒకే ఒక భరద్వాజుడు, ఒకే ఒక జనకుడు కాక పలువురు భరద్వాజులు, పలువురు జనకులు ఉన్నట్లే ఒకే ఒక శివుడు కాక పలువురు, అనేకులు, అనేకానేకులు శివుళ్లు ఉన్నారని నా అభిప్రాయం. లింగం ఊడిపొయిన శివుడూ, జంగం అయిపొయిన శివుడూ ఒకరు కాదన్నది (కాక పోవచ్చన్నది) నా ప్రతిపాదన. ఒకే ఒక ఒకే ఫిజిక్స్ లేదు ఒకే ఒకే మెకానిక్స్ లేదు. (ఒకదాంతో మరొకటి కలుపుకుని కషాయం చేసుకొవచ్చు, అది వేరే విషయం). కాబట్టి ‘శివుడి చరిత్ర’ అంటూ ఉండదు. కాబట్టి శివుడి చరిత్ర ఒకరికి తెలియటమూ, మరొకరికి తెలియక పోవటమూ అన్న ప్రసక్తి లేదు. అకడమీషియన్స్ సృష్టించిన మోడరన్ మిత్ లలొ ఇది ఒకటి. నా శివుడి గురించి నాకు తెలుసు.

    “అమంగల్యం శీలం తవభవతు నా మైవ మఖిలం తథాపి స్మర్తౄణాం వరద పరమం మంగళమసి!”

  45. 45
    సురేశ్ కొలిచాల March 6, 2014 1:47 pm

    ‘When I use a word,’ Humpty Dumpty said, in rather a scornful tone, ‘it means just what I choose it to mean — neither more nor less.’? 🙂

    ఈ మధ్య ఒక సంస్కృత పండిత సభ జరిగితే, అందులో సౌమ్యుడు, వినయశీలి అయిన పండితుణ్ణి అధ్యుక్షునిగా ఎన్నుకున్నారట. అధ్యక్షుడు అన్న పదానికి అందరికీ తెలిసిన అర్థం అధి + అక్షః అంటే పైనుండి చూచువాడు, supervisor, పెద్ద- మొదలైన అర్థాలు మనకు తెలుసు కదా. ఆ వినయశీలి లేచి అధ్యక్షుడు అంటే అ + ధి (=బుద్ధి) + అక్ష (=ఇంద్రియాలు), అని చెబుతూ నాకు బుద్ధి, ఇంద్రియాలు లేవు కాబట్టి నన్ను అధ్యక్షుడిదిగా ఎన్నుకున్నారు అని చమత్కరించారట. పక్కనే కూర్చున్నా మహా పండితుడు లేచి “భగవద్గీతలో ‘అక్షరాణాం ఆకారోస్మి’ అని పరమాత్ముడు అన్నాడు కాబట్టి ఆ అ-కారరూపుమైన పరమాత్మ యందు బుద్ధి, ఇంద్రియాలు కలవాడు కాబట్టి ఆయనను అధ్యక్షుని చేయడం సబబే అని హర్షధ్వానాల మధ్య వివరించాడట.

    పదనిర్మాణ రీత్యా (morphologically) సంస్కృత భాష ఒక సంలీన భాష (inflectional language). ఒక వాక్యాన్ని, వివిధ పదాలుగా; ఒక పదాన్ని భిన్నమైన పదాంశాలుగా ఎన్నో రకాలుగా విడదీయవచ్చు. ఈ రకమైన సౌలభ్యం వల్ల ఒకే శ్లోకాన్ని వివిధ రీతులుగా విడగొట్టి పరస్పరం వ్యతిరేకమైన అర్థాలు సాధించవచ్చు. ఈ రకమైన పాండిత్య ప్రకర్ష చమత్కారాలకు బాగానే ఉంటుంది కానీ, శాస్త్ర చర్చల్లో అంతగా పొసగదు. అయితే, గత కొన్ని వందల యేళ్లుగా మన పండితులు పదాలకు కొత్త, కొత్త అర్థాలు క్రోంగొత్త రీతిలో సాధిస్తూ మన గ్రంథాలకు సరికొత్త భాష్యాలు రాయడంలోనే తలమునకలయ్యారంటే అతిశయోక్తి కాదేమో.

    ఉదాహరణకు, మధ్వాచార్యులవారు మహావాక్యాలలో ఒకటైన “తత్త్వమసి (that art thou)” అన్న దానికి భాష్యం చెబుతూ ఛాందోగ్యోపనిషత్తులో “శ్వేతకేతో తత్త్వమసి (O Svetaketu, thou art that)” అన్న దానిని “శ్వేతకేతో + అతత్త్వమసి = శ్వేతకేతోతత్త్వమసి”(O Svetaketu, thou art not that)” అని విడదీసి ద్వైత సిద్ధాంత అన్వయాన్ని సాధించాడు. ఈ రకమైన పదవిభజనలతోనే ఆయన ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన వన్నీ తన సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయని నిరూపణ చేశాడు. ఈ రకమైన పదవిభజనలు శంకరాచార్యుల, రామానుజాచార్యుల భాష్యాల్లో కూడా కనిపిస్తుంటాయి. అందువల్లే వారు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలన్నీ తమ, తమ సిద్ధాంతాలను సమర్తిస్తున్నాయని చెప్పుకోగలిగారు.

    అయితే, చారిత్రకంగా చూస్తే, వేదానంతర కాలంలో వైదిక కర్మకాండ పట్ల ఒక రకమైన నిరసన ఉండేదని, ఆ నిరసన భావం ఉపనిషత్తులలో, భగవద్గీత వ్రాయబడిన తొలిదశల్లో తీవ్రస్థాయిలో ఉండేదని మనకు లభిస్తున్న ఆధారాలను బట్టి ఊహించవచ్చు. ఆ వాతావరణంలోనే వైదిక కర్మకాండలకు తిరుగుబాటుగా భౌద్ధ మతం, జైన మతం, సాంఖ్య, యోగ, అజీవిక, చార్వాక మతాలు ప్రాచుర్యం చెందాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ దృష్టితో చూస్తే, భగవద్గీతలో నేను ఉటంకించిన నాలుగు శ్లోకాలలో వేదాలను తక్కువ చేసి “త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున” అని చెప్పడానికి సులభమైన వివరణ ఇవ్వవచ్చు. అంతేకాని, ఆ శ్లోకాలలో “వేదం” అంటే “వేదం” కాదు అంటూ వితండవాదన చేయడం వల్ల మనకు కొత్త విషయాలేం బోధపడవు.

    అలాగే, ముండకోపనిషత్తులో వేదాలను తక్కువస్థాయి విద్యలుని, వాటిని అపరవిద్యలుగా నిర్వచించారని వ్యాసంలో అనుకున్నాం కదా. అదే ఉపనిషత్తులో ద్వితీయఖండంలో అపరవిద్యల గురించి ఇంకా ఇలా అంటారు:

    ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా అష్టాదశోక్త మపరం యేషుకర్మ
    ఏ తచ్ఛ్రేయో యేఽభినందంతి మూఢా జరామృత్యుం తే పునరేవాపి యంతి ||7||

    అపరమైన కర్మ పదునెనిమిది అంగాలతో కూడిన యజ్ఞకర్మల పైన ఆధారపడి ఉండును. ఇవన్నియు వాస్తవానికి బలహీనమైన తెప్పల వంటివి. వీటి వల్ల పదే, పదే జరామృత్యువులు తప్పవు.

    అవిద్యాయా మంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః
    జంఘన్యమానాః పరియంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధాః ||8||

    అజ్ఞానములో చరిస్తూ, తామే ధీరపురుషులని, ప్రజ్ఞావంతులని ఆత్మస్తుతి ఒనర్చుకొను మందమతులు శోకగ్రస్తులై, అంధునిచే నడిపించబడు అంధునివలె దిక్కుతోచక పరిభ్రమిస్తుంటారు.

    అవిద్యాయాం బహుధా వర్తమానా వయం కృతార్థా ఇత్యభిమన్యంతి బాలాః
    యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్ తేనతురాః క్షీణలోకా శ్ఛ్యవంతు ||9||

    అజ్ఞానముతో చరించు ఈ మూర్ఖులు తాము ఆప్తకాములైనట్లు చిన్నపిల్లల్లా భావిస్తుంటారు. రాగరతులై ఉన్నందున సత్యమును గ్రహించలేరు. అందువలన పుణ్యకర్మఫలముగా లభించిన స్వర్గాది లోకములు అనుభవించిన పిదప మళ్ళీ క్రిందికి జారుదురు.

    ఇష్టాపూర్తం మన్యమానా వరిష్ఠం నాన్యచ్ఛ్రేయో వేదయన్తే ప్రమూఢాః
    నాకస్య పృష్ఠే తే సుకృతేఽనుభూత్వే మం లోకం హీనతరం వా విశంతి ||10||

    కర్మపరులైన ఈ మూర్ఖులు యజ్ఞవిధులు, పుణ్యకార్యములు మాత్రమే శ్రేష్ఠమైనవని భావిస్తూ, అన్యమైన మరే శ్రేయోమార్గమును తెలియలేరు. వీరు ఉన్నతమైన స్వర్గలోకములో పుణ్యఫలము అనుభవించి మఱల ఈ లోకములో గాని, ఇంతకన్నా హీనమైన లోకములో గాని ప్రవేశించుదురు.

    అలాగే బృహదారణ్యకోపనిషత్తులోనూ ఇటువంటి వేదనిరసన కనిపిస్తుంది. ఆదిశంకరుని భాష్యాల్లోనూ జ్ఞానాన్ని ఉగ్గడిస్తూ వేదాలను, కర్మకాండను నిరసించే శ్లోకాలు కనిపిస్తాయి. శంకరుడు వేదనింద చేశాడా లేదా అంటూ సుదీర్ఘ చర్చలు మన పండిత లోకంలో మామూలే.

    అయితే, వెండీ డానిగర్ రాసిన పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మికం కాదు, చారిత్రాత్మకం. నా వ్యాస ప్రాధాన లక్ష్యం కూడా ఇటువంటి ఆధ్యాత్మిక చర్చల గురించి కాదు. వేదంలో వర్ణించిన మతానికీ, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో అనుసరిస్తున్న హిందూ మతానికి చాలా తేడాలు ఉన్నాయని, అందువల్ల కేవలం వేదాల ఆధారంగా హిందూ మతం గురించి సంపూర్ణంగా వివరించలేమన్నదే నా వాదన. నా వ్యాసంలో బాత్రా అభియోగానికి బదులుగా ఇలా అన్నాను:

    ఋగ్వేదంలో కనిపించే దేవతలు మిత్ర, వరుణ, అర్యమ, భగ, అంశ, ఇంద్ర, అగ్ని, ఉషస్ వంటి ప్రధాన దేవతలు తరువాతి హిందూ మతంలో ప్రాధాన్యత కోల్పోయారు. వేదాలలో ప్రముఖమైన అగ్నిస్తోమ (సోమయాగం), అశ్వమేధ, పురుషమేధ, అగ్నిచయన, చాతుర్మాస్య యజ్ఞాలు తరువాతి కాలంలో కనిపించవు. ప్రస్తుతం హిందూ మతంలో ప్రధానమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వం, లక్ష్మి, పార్వతి, సరస్వతి వంటి స్త్రీ దేవతల ప్రస్తావన వేదాలలో కనిపించదు. హిందూ మతానికి ప్రధానమని చాటిచెప్పే దశావతారాల ప్రస్తావన గాని, కర్మ సిద్ధాంతం గాని, పునర్జన్మ సిద్ధాంతం గాని వేదాలలో ఎక్కడా కనిపించదు.

    ఇప్పుడు వివిధ మానవీయ, సామాజిక శాస్త్ర (linguistics, epigraphy, archaeology, history, population genetics etc.) పరిశోధనల ద్వారా మనకు లభ్యమౌతున్న సమాచారాన్ని బట్టి మనం మన చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకొని, హిందూ మత చరిత్రలో పరిణామాలను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో వెండీ డానిగర్ రాసిన పుస్తకం ఒకటి. కొంత నిష్పాక్షిక దృష్టితో ఆమె పుస్తకాన్ని చదివితే హిందూ మతపరిణామం గురించి కొంతైనా అవగాహన కలుగుతుందని నా అభిప్రాయం.

    ఆఫీసు పనుల ఒత్తిడిలో గత రెండురోజులుగా ఈమాటలో నా వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలకు సమాధానాలు వెంటనే రాయలేకపోయినందుకు క్షంతవ్యుణ్ణి. ఇతర అభిప్రాయాలకు కూడా ఈ రోజు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

  46. 46
    Yoga March 6, 2014 1:58 pm

    “దృక్కోణాల విభేదం, లక్ష్యాల వైవిధ్యం వల్ల ఒకే సంఘటన, ఒకే సత్యం వేర్వేరుగా కనిపిస్తాయన్న సత్యం భారతీయ దార్శనీకులకు ఏనాడో తెలుసు…”

    Suresh garu: Could you please elaborate on this? I feel something is terribly wrong with this statement. This seems to be usage of loose vocabulary. I doubt if our Ancient daarsaniks meant it like what you say. May be you can quote a source that says it this way? You might actually mean they recognized the limitations of human rationality (bounded rationality)http://en.wikipedia.org/wiki/Bounded_rationality

    Because of this limitation what just “appears” may not be true. Our perception might be wrong. I am sure you know the classic examples of “illusion” that are used by our philosophers. So, I don’t need to elaborate. Therefore what they probably meant is to be cautious about “knowing” and assuming that truth is understood. I believe it is this fundamental approach, that enabled them to be open about new ideas.

    Based on your quote above, I am at odds to see that truth can be different just because view points or goals are different. If that is so, it would negate the truth, and the statement becomes invalid, isn’t it?

    A wrong understanding of this fundamental approach might lead to agreeing with misinterpretations and falsehoods. Loose vocabulary therefore is dangerous for propagating ideas and has to be challenged.

    I would like to know your view point on this. Correct me if I am wrong.

    Sincerely
    Yoga

  47. 47
    ప్రసాద్ March 6, 2014 2:09 pm

    సురేశ్ గారూ, మీ వ్యాసం ఎంతో సమగ్రంగా వుంది కానీ పైన చంద్రమోహన్ గారన్నట్లు ఈ వ్యాసంలో రెండు అంశాలు కలగలిసిపోవడం సమస్య.

    ఆమె జ్ఞానా, అజ్ఞానా, పక్షపాతంతో రాసిందా లేదా అన్నవాటితో సంబందం లేకుండా మన సంస్కృతి మొదట్నుంచి వాద ప్రతివాదాల్ని ఎలా ప్రోత్సహిస్తూ వచ్చిందో, అన్ని రకాల మతాలకీ ఎలా చోటిస్తూ వచ్చిందో అన్న పార్శ్వాన్నే స్పృశించి వుంటే బావుండేది. అయినా గానీ నా మట్టుకు ఇది రెండు వ్యాసాలనుకొని చదివాను. వెండీ రాసిందాన్ని మీరు సమర్థించిన తీరు, నచ్చకపోయిందాన్ని నిషేధించాలనడాన్ని మీరు నిరసించిన తీరు చాలా తార్కికంగా సోదాహరణంగా వున్నాయి.

    ఇక్కడ కొంతమంది హిందూమతాన్ని హిందువే అర్థం చేసుకోగలుగుతాడు అన్నట్లు అర్థంలేని వాదన చేస్తున్నారు. పాశ్చాత్యులకు “పాశ్చాత్య పక్షపాతం” వుంటే మరి మనకు స్వపక్షపాతం వుండదా? ఇక్కడ ఈ వ్యాసాన్ని తప్పుబడుతున్న వారందరూ ఈ “స్వపక్షపాత” వ్యాధితో బాధపడుతున్నవారేనని నాకనిపిస్తున్నది. ఉదాహరణకు దశరధుడి కామాన్ని lustగా పాశ్చాత్యపక్షవాదమనుకుంటే, దాన్ని pleasure and desire, not merely sexual అనేవాళ్లది స్వపక్షవాదమనవద్దా?

    వేదం ఏం చెబుతుందో, గీత ఏం చెబుతుందో దానికి భాష్యం ఎలా చెప్పుకోవాలో త్రిమతాచార్యుల బాష్యాలనుంచే తెలుసుకోవాలనడం, బిడ్డ ఎలాంటిదో తల్లినే అడిగి తెలుసుకోవాలన్నట్లుగా వుంది.

  48. 48
    vicky March 6, 2014 2:17 pm

    వ్యాసం బాగుంది. ప్రచురణ కర్తలు కోర్టు వెలుపల రాజీకి రావటం చూస్తుంటే దేశంలో ఛాందస వాదం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. Blasphemy అనేది ఒక అర్థం లేని మాట. ఆ ఇస్లామిక్ దేశాలలా తయారయ్యేలా ఉన్నాం చూస్తుంటే.

  49. 49
    కామేశ్వరరావు March 6, 2014 2:38 pm

    రఘోత్తమరావుగారికీ, సురేశ్‌గారికీ ఉన్నంత సంస్కృత జ్ఞానం కానీ, Wendy గురించీ, alternative history గురించీ సురేశ్‌గారి కున్నంత పరిచయం కానీ నాకు లేవు. ఈ వ్యాఖ్య నేనొక సామాన్య హిందువుగా రాస్తున్నాను. (పూర్వకాలంలో ఇలా సామాన్యులు పండితచర్చలలో తలదూర్చే అవకాశం ఉండేదా అనేది అనుమానమే, మంచికో చెడ్డకో యీ కాలంలో అది సాధ్యమయ్యింది!).

    1. తాను రాసిన దానికి “Alternative” అనే విశేషణాన్ని స్పష్టంగా శీర్షికలోనే పెట్టారు వెండీ. ఇంక దాన్ని సంప్రదాయ భాష్యాలతో, వ్యాఖ్యానాలతో సరిపోల్చి తప్పుపట్టడంలో అర్థమేముంది? హైందవ వాఙ్మయంపై Wendy కాని, సురేశ్‌గారు కాని చేస్తున్న వ్యాఖ్యానాలు స్పష్టంగా – an alternative to the established or mainstream commentaries. ఇవి వైదిక ప్రామాణ్యాన్ని అంగీకరించని బౌద్ధ, చార్వాక వాదాలవంటివి. వాటిని శంకరుల, మధ్వాచార్యుల వంటి వారి భాష్యాలతో పోల్చి తప్పనడం ఎంతవరకూ సమంజసం?

    2. వెండీ సిద్ధాంతాలను Galileo లేదా ఇతర scientific theoriesతో పోల్చడం సరికాదని నా బుద్ధికి తోస్తోంది. వైజ్ఞానికశాస్త్రం భౌతిక ప్రపంచానికి సంబంధించినది. అందులో సత్యాసత్యాలు భౌతిక ప్రయోగాల ద్వారా నిర్ధారించగలిగేవి. Wendy’s subject is not “science”. అంటే ఇందులో వైజ్ఞానికంగా నిర్ధారించగల సత్యాసత్యాల ప్రమేయం లేదు. వేదాలను కాని, స్మృతి పురాణ ఇతిహాసాలను కాని ఒక ప్రత్యేక కోణంలో చూసి, అన్వయించి, పరిశీలించడం మాత్రమే. కాబట్టి, ఇందులో సంప్రదాయ దృష్టే సత్యమైనదీ, లేదా Wendy దృష్టే సబబైనదీ వంటి నిర్ణయాల ప్రసక్తి అసలు వస్తుందా? కాకపోతే, పూర్వకాలంలో అవైదిక మత సిద్ధాంతాలు ఎదుర్కొన్న ప్రతిఘటనే ఇప్పుడూ ఇలాంటి సిద్ధాంతాలు ఎదుర్కొంటున్నాయని భావించ లేమా? పూర్వం ఆయా మతాలనూ మతసిద్ధాంతాలనూ నిజంగానే చాలా సంయమనంతోనూ ఉదారభావంతోనూ హిందువులందరూ స్వీకరించారా?

    3. వెండీ పుస్తకాన్ని హిందువులు కానివారు చదివితే హిందూమతం మీద చాలా గౌరవం కలుగుతుందని సురేశ్‌గారు అన్నారు. ఇది నిజమే కావచ్చు. కానీ అది 1st person point of view కాదు. ఒక “సామాన్య” హిందువు దృష్టికన్నా అది వేరైనది. కాబట్టి వారికి గౌరవం కలిగించినంత మాత్రాన ఒక హిందువుకి కూడా అదే భావన కలిగించాలని లేదు. ఒక హిందువు అలాంటి దృష్టితో చూడాలంటే, తనని తాను alienate చేసుకొని తటస్థునిగా మారి చూడగలగాలి. బహుశా ఈ కాలంలో చాలామందికి అది అలవడినట్టుగా ఉంది. అయితే అది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని నా స్వానుభవం. నేను చదువుకున్న చదువు వల్లనో, ఇతర కారణాల వల్లనో నాకూ కొంత అలాంటి దృష్టి అలవడిందని నేను అనుకుంటున్నాను. కాని పూర్తిగా అలవడ లేదు. పూర్తిగా alienate అవ్వగలిస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు కాని, ఈ రెంటికీ చెడ్డ రేవడి స్థితి మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఈ alienated viewకి కొన్ని ఉదాహరణలు చెపుతాను.

    సురేశ్‌గారు రామాయణ, భాగవత కథలను “అల్లిబిల్లి” కథలు అన్నారు. నా దృష్టిలో యిది ఒక చక్కని ఉదాహరణ. చిన్నప్పుడు, నేను వీటిని విన్నప్పుడు, వీటిని “అల్లిబిల్లి” కథలుగా వినలేదు. నిజంగా జరిగిన కథలుగా విన్నాను. అదే నమ్మాను. పెరిగి పెద్దయిన తర్వాత అవన్నీ బహుశా కట్టుకథలు అనే విషయాన్ని విన్నాను. అలాంటి దృష్టి వచ్చిన తర్వాత, అవి నా హృదయంనుండి కొంత దూరంగా జరిగాయి. కేవలం వాటిని కట్టుకథల్లాగా చూసి, వాటిలోని కల్పనా చమత్కారం, శిల్పనైపుణ్యం, లేదా రసానుభూతి వగైరా వగైరాలను చూసి ఆస్వాదించవచ్చు గదా? వచ్చు, ఇప్పుడు నేనుకూడా చాలావరకూ అదే దృష్టితో వాటిని చూస్తున్నాను. కానీ అవేవీ ఇంతకుముందు అవి నిజమైన కథలే అన్న నమ్మకమున్నప్పుడు యిచ్చిన దగ్గరితనాన్నీ, అనుభూతిని ఇవ్వలేకపోతున్నాయి మనసుకు. ఇదే విషయం, భక్తి కీర్తనలకు కూడా వర్తిస్తుంది. చాలామంది వాటిలోని సంగీతసాహిత్యాలను మాత్రమే ఆస్వాదిస్తారు. నేనుకూడా వాటిని ఆస్వాదిస్తాను. అయితే, రామదాసు నేరుగా రామునితో పెట్టుకున్న మొర, లేదా త్యాగయ్య రాముని ఎదురుగా ఆలపించిన కీర్తన అనే నమ్మకం ఉండిన రోజుల్లో, ఆ పాటలను విన్నప్పుడు కలిగిన ప్రత్యేక అనుభూతి నేనిప్పుడు పొందలేకపోతున్నాను. ఇంకా చాలా ఉదాహరణలు ఇవ్వగలను. పండగలు జరుపుకోవడం కూడా అలాంటి alienated viewకి ఉదాహరణే. ఇదంతా “మానసికమైన ఎదుగుదల”లోనో లేదా “సమాజం ఎదుగుదల”లోనో ఒక భాగమా? అయ్యుండవచ్చు, నాకు తెలియదు. కాని ఏదో లోటు మాత్రం చాలా స్పష్టంగా కష్టపెడుతూ ఉంటుంది.

    4. మళ్ళీ మొదటికి వస్తాను. పూర్వ కాలంలో సిద్ధాంత చర్చల్లో సామాన్యులు ఎంతవరకూ భాగస్వాములు? సామాన్యులపై వాటి ప్రభావం ఎంత? ఇవి పండితుల వాదప్రతివాదాలకూ, రాజాశ్రయాలకూ మాత్రమే పరిమితమయ్యేవని అనుకుంటున్నాను. అంచేత వాటివల్ల సామాన్యప్రజలకి (అంటే ఆయా సిద్ధాంతాలలో ప్రవేశం లేని వారికి) పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పుడలా కాదు కదా? ఈ గందరగోళానికి అదొక ముఖ్యకారణం కాదా?

    ఆఖరిగా, ఈ వ్యాఖ్య నేను ఒకరిని సమర్థించడానికో మరొకరిని వ్యతిరేకించడానికో రాసింది కాదు. కేవలం, కొంత కాలంగా నాలో ఉడుకుతున్న అస్పష్టభావాలను వ్యక్తపరచడానికి మాత్రమే, జరుగుతున్న చర్చకి ఎంతో కొంత సంబంధం ఉందన్న ఉద్దేశంతో. దీని గురించి ఇంతకన్నా చెప్పే సామర్థ్యం నాకు లేదు. కాబట్టి దీనిపై ఇంకేవైనా వ్యాఖ్యలు వచ్చినా మౌనంగా చదువుకుంటాను.

  50. 50
    భాను March 6, 2014 3:47 pm

    సురేష్ గారికి,

    మొట్టమొదట వేదాలు మౌఖికం, అవి పుస్తక రూపంలో చదవటం కన్నా ఒక గురువు దగ్గర నేర్చుకోవటం ఉత్తమం. ఇక వెండీ మరియు ఇతర యురోపియన్ / అమెరికన్ రచయితలు సంస్కృతాన్ని ఒక భాషగా అధ్యయనం చేసి అసలు సంస్కృతీ తెలియకుండా భారతీయ వేదాలు, ఇతిహాసాలు ఉపనిషత్తులపై పుస్తకాలు రాసిన వారు. భారతీయులు కాని హిందువులు భారత సంస్కృతిని పాటించి రాసే ఇలాంటి గ్రంధాలూ రాస్తే వాళ్లకి కొంత అవగాహన వుంటుంది, అది లేకుండా పెద్ద ఉద్గ్రంధాలని రాసిన వారు, ఒక వైద్యుడు కానివాడు నాలుగైదు వైద్య పుస్తకాలు చదివి ఒక కొత్త పుస్తకం రాసినట్టుగా వుంటుంది. మీకు కామ అన్న పదం కేవలం sex కాదు అన్న విషయం నేను చెప్పక్కర్లేదు. రామాయణంలో దశరథుడు కామం కొద్ది ధర్మాన్ని పక్కన పెట్టాడు అన్నది Wendy లాంటి వాళ్లకి కనిపిస్తుంది, వారు మరిచి పోయే విషయం ఏమిటంటే, అక్కడ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అన్న విషయం (for both Rama and Dasharatha). ఇక్కడ మాటని నిలబెట్టుకోవటం గురించి రాయకుండా, అప్పట్లో శృంగార విశృంఖలత వుంది దాంట్లో తప్పేముంది? అని వాదిస్తే, మనం ఎంత శాతం ప్రజలు అలా మాట్లాడేవారు/ వ్యవహరించేవారు? అది అత్యధికులా? లేక కొంత మంది చేసే పనా? ఇది తెలియనంత వరకు హిందూ మతంలో గొడ్డు మాంసం తినేవారట, లేక అప్పట్లో అంతా కామ చర్చలు బహిరంగంగా జరిపే వారట అని అనుకోవటం తప్పు. పరాయి దేశంలో 28 సంవత్సరాలకే సంస్కృతంలో డాక్టరేట్ పట్టా (in a questionable manner) పొంది విశేషంగా, స్త్రీ వాదం, sex ముఖ్యంగా Mythologies of Transvestism and Transsexuality లాంటి విషయాలని అమెరికాలో విద్యార్థులకి బోధించి దాన్ని ఒక వేరు దృక్పథం అని చెప్పటం వెనకాల ఒక ఉదారవదాన్ని రుద్దే ప్రయత్నం చేసిన Wendy భారత దేశంలో ఖచ్చితంగా సవాళ్ళు ఎదురుకుంటుంది.

    సంస్కృత భాష ఆంగ్లము కన్న ప్రాచీనమయినది. భారతీయ చరిత్రకారులందరికి సంస్కృతం నేర్చుకోవటం కష్టం కాదు. సరిపడా పుస్తకాలు వున్నాయి, చెప్పే గురువులు వున్నారు. ఇన్ని ఉండగా పనిగట్టుకొని సంస్కృత గ్రంథాలను తర్జుమా చేసి పాశ్చాత్యులు రాసిన ఆంగ్ల పుస్తకం, దాన్ని ఆధారంగా తీసుకొని ఇంకొక వ్యక్తీ మరొక పుస్తకం, ఇక వీటిపై ఆధారంగా తీసుకొని రాసిన మరికొన్ని పుస్తకాలు, వాటిని ఆధారంగా తీసుకొని చరిత్ర రాసిన ఘనత భారతీయ చరిత్రకారులకె దక్కింది. ఒక హాస్యాస్పద విషయమేమిటంటే, భాష అందుబాటులో ఉండి కుడా ముక్కు ఎక్కడ వుంది అంటే తిప్పి చూపినట్లు, ఒక్కొక్క పుస్తకం వెనక ఒక వంద ఆంగ్ల తర్జుమా మూలసూచీల పునాదిపై రాసిన భారత చరిత్రకారులు ఒక ట్రైను టిక్కెట్ పెట్టి భారత దేశంలోని ఏ సంస్కృత అధ్యాపకుని దగ్గరకు వెళ్లి అడిగిన అంతకన్నా బాగా చెబుతారు.

    ఇక వివాదం గురించి మాట్లాడాలంటే, అది ఒక కోర్టు కేసు, రెండు పార్టీల మధ్య జరిగినది. శాంతియుతంగా పరిష్కరించబడ్డది. అది కుడా మన జఠరాగ్నిలో జీర్ణించుకోలేక పొతే, ఈ క్రింది విషయం చూడండి:

    ఇప్పటివరకు 50పై చిలుకు పుస్తకాలు 1924 నుండి వివాదం రేపాయి. అందులో 3 మాత్రమె సంఘ్ పరివార్ కు చెందిన సంస్థల నుండి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. మొన్నటికి మొన్న Air India మాజీ డైరెక్టర్ జితేందర్ భార్గవ రాసిన The descent of Air India అనే పుస్తకం నిరోధించడం జరిగింది. నిషేధించిన పుస్తకాలలో రెండు శాతం ప్రమేయం ఉన్న సంఘ్ పరివార్ తో ప్రమాదముంది అంటున్నారు, ఏడెనిమిది వరకు నిషేధించిన ఇస్లాం రచనలు, నాలుగు వరకు గాంధీ – నెహ్రులపై రాసిన పుస్తకాలు అన్ని సంఘ్ పరివార్ నిషేదించిందా? లింగం గురించి రాసిన పుస్తకం 1937 లో నిషేదించబడినది, దాని వెనుక సంఘపరివార్ ఉందంటారా? మరి Da Vinci Code చిత్రాన్ని మూడు నాలుగు రాష్ట్రాల్లో నిషేధించినప్పుడు ఆవిడ ఎక్కడికెళ్ళారు? నాగాలాండు, ప్రపంచంలో మేటి బాప్టిస్ట్ రాష్ట్రంగా పేరుపొందిన ఈ భారత దేశ రాష్ట్రం Da Vinci Code పుస్తకాన్ని కూడా నిషేదించింది. దాని వెనకాల సంఘ్ పరివార్ ఉందంటారా?

    ఇది బాత్ర ఒంటరి పోరాటం చేసి గెలిచిన కేసు కాదు, అమెరికాలో స్కూళ్ళలో చాలా వివాదాలు జరిగిన తరువాత నిజానిజాలు నిగ్గు తేల్చి చరిత్రని రాసిన నేపధ్యంలో గెలిచిన కేసు. ప్రమాదం హిందూ సంస్థల నుండి లేదు, ఉన్న దేశంలో సంసృతం చదువకుండా ఇంగ్లీషు తర్జుమాని చదివి ఏరికోరి కొన్ని అవలక్షణాలపై పుస్తకాలు రాసి ఇదే హిందూ ధర్మం లేక ఇది హిందూ ధర్మానికి ఇంకొక కోణం అని తెలిపే భారత రచయితల నుండి, వారెక్కిన పల్లకీలపై ఊరేగి అసలు విషయం రాయక కొత్త దృక్కోణాలని రాసే పాశ్చాత్య రచయితల నుండి వుంది.

    చివరిగా నేను ఈ విషయం పై వాదులాడదలచుకోలేదు. కోర్టు లో ఇరుపక్కల వారు లోతుగా చూసి సంధి చేసుకున్న దావా ఇది. All I can say is, opening other works of Wendy is like opening a can of worms.I guess the publishers don’t want to go there. Waste of Time and Money for them. From what I came to know from persons who have personally interacted with her, she collects ( I should say used to collect) an honorarium of $ 10K for each temple visit in the USA. I guess she made enough money from those visits to offset this book case.

    http://en.wikipedia.org/wiki/List_of_books_banned_in_India

    http://en.wikipedia.org/wiki/California_textbook_controversy_over_Hindu_history

    http://divinity.uchicago.edu/sites/default/files/imce/pdfs/CVs/doniger%20VITA.academic.pdf

    http://news.bbc.co.uk/2/hi/south_asia/5036094.stm

    http://www.telegraphindia.com/1060524/asp/nation/story_6261949.asp

…

పాఠకుల అభిప్రాయాలు

కొత్తవి

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • పలుకుబడి: సంఖ్యాపదాలు – 3
  • పలుకుబడి: ఋతువులు, కాలాలు
  • వేంకటంలో కొండలరాయడు
  • అక్కమహాదేవి వచనాలు – 4
  • హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా?

ఇటువంటివే…

  1. ఈమాట మార్చ్ 2014 సంచికకు స్వాగతం!
  2. Narayana Rao on the Recorded Text and the Received Texts
  3. కంద పద్యగాథ – 1
  4. నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు
  5. కొ.కు ఉత్తరాలు – 1

మార్చి 2014 సంచికలో ...

  • Mrs. Bird’s House
  • అనగా అనగా ఒకరాత్రి
  • అనాథ
  • అరుణాచల పతి
  • ఈమాట మార్చ్ 2014 సంచికకు స్వాగతం!
  • ఉగాది పాటలు
  • ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌ మీద
  • ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు
  • కంద పద్యగాథ – 1
  • కోనసీమ కథలు: శిరోముండనం
  • గౌతమి
  • దేవకన్య
  • ధనుర్దాసు
  • నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు
  • నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు
  • నీలి తలపాగా
  • బల్లి ఫలితం
  • మాటలు
  • ముగ్గురు సాధువులు
  • శ్రీమాన్ పుట్టపర్తి : శివతాండవ కవితాగానం
  • శ్రీమాన్ పుట్టపర్తి: నా జ్ఞాపకాలు
  • సైగల్…
  • హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు
Mrs. Bird’s House

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.