కంద పద్యగాథ – 1

పరిచయము

సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే సంస్కృతప్రాకృతములలో, సుమారు 1300 సంవత్సరాలకు ముందు కన్నడములో, సుమారు 1100 సంవత్సరాలకు ముందు తెలుగులో కంద పద్యములు ఉండినవి, ఆ ఛందస్సులో కవులు వ్రాసినారు. కవిరాజమార్గము, ఛందోంబుధి, కవిజనాశ్రయము వంటి లక్షణ గ్రంథాలలో కంద పద్యములే యెక్కువ. కన్నడములోని మొదటి కావ్యమైన పంపకవి వ్రాసిన విక్రమార్జునీయము అనబడే భారతములో సుమారు 45 శాతము కంద పద్యములే. ఆంధ్ర మహాభారతములో మూడింట ఒక పద్యము కంద పద్యమే. ఇవి గాక శతకములలో, యక్షగానములలో, నాటకములలో కంద పద్యములను మనము చదువుతాము. అందుకే కంద పద్యమును అందముగా వ్రాయని, వ్రాయరాని, వ్రాయలేని వాడు కవి కానేరడు అంటారు. కందపద్యములను గుఱించిన కంద పద్యములను చూడండి –

కందంగ ళమృతలతికా
కందంగ ళనూన వాక్య ఫల విలస న్మా
కందంగళ్ తనిరసదు
క్కందంగళ్ సొగసియిర్పు వీతన కృతియొళ్ — (హరిహరుని గిరిజాకల్యాణము)

(అమృతలతల మూలములు, వాక్యముల నిండుదనముతో గూడుకొని విలసిల్లే మామిడి పండ్లు, రసవంతమయిన స్రోతస్సులు, ఇలా సొగసుతో నిండియుంటాయి కంద పద్యములు ఈ కవి కృతిలో)

కందంబులు సకల జనా
నందంబులు సరస మధుర -నవరస ఘుటికా
బృందంబులు నీ కవితా
కందంబులు కుందవరపు -కవి చౌడప్పా — (కవి చౌడప్ప శతకము – 15)

సుందరమగు గీతిక నొక
ఛందమ్ముగ నార్య కొసఁగె -సర్వేశ్వరుఁడున్
గందముగ నయ్యె నది మా
కంద మధుర రసము లొలుకు -కవితలయందున్

కందము సుస్వరభరితము,
కందము వినగను లలితము, -కందము పదమే
కందము బాడగ మధురము,
కందము వ్రాయగ సుకరము, -కందము ముదమే — (నా శతకందసౌరభము – 5)

ఇంత అందమైన కంద పద్యములను గుఱించి మనకు చాల విషయములు తెలియవు. కందపద్యమును గుఱించిన నా అధ్యయనము, పరిశోధనల సారాంశమే ఈ వ్యాసములు.

కందముపైన మొదటి భాగమయిన ఈ వ్యాసములో నేను క్రింది విషయములను చర్చిస్తాను –

  1. సంస్కృతములో ఆర్యా భేదములు, నియమములు
  2. ప్రాకృతములో గాథా భేదములు
  3. కంద పద్యపు నియమములు
  4. 29 కంద భేదములు, వాటికన్నిటికి ఇంతకుముందు వ్రాయబడని లక్ష్యములు
  5. కందముల వర్గీకరణ, నా సూచనలు
  6. కుఱుచ నిడుదపాదములతో 16 కంద భేదములు

ఆర్యా నియమ భేదములు

ఆర్యా లేక గాథా లక్షణములు పింగళుని ఛందశ్శాస్త్రములో, భరతుని నాట్యశాస్త్రములో, జయదేవఛందస్సులో, కేదారభట్టు వృత్తరత్నాకరములో, నందితాఢ్యుని గాథాలక్షణములో, స్వయంభూఛందస్సులో, జయకీర్తి ఛందోనుశాసనములో, హేమచంద్రుని ఛందోనుశాసనములో, విరహాంకుని వృత్తజాతిసముచ్చయములో, ప్రాకృత పైంగలములో గలవు. ఆ సూత్రముల, పద్యముల సారాంశములను మాత్రమే యిక్కడ తెలియబరుస్తున్నాను –

  1. చతుర్మాత్రలు ఐదు, అవి – UU (గగ) – 1, IIU (స) – 2, UII (భ) – 3, IIII (నల) – 4, IUI – 5 (జ)
  2. ఆర్య లేక గాథ పై (మాత్రా)గణములతో నిర్మితములు.
  3. సంస్కృతములో, ప్రాకృతములో ఇది ఒక ద్విపద.
  4. మొదటి పాదములో ఎనిమిది గణములు, రెండవ పాదములో ఎనిమిది గణములు.
  5. రెంటిలో బేసి గణములు జ-గణములుగా నుండరాదు.
  6. చివరి గణము, అనగా ఎనిమిదవ గణము గుర్వంతము.
  7. పూర్వ (ముఖ) పాదములో ఆఱవ గణము నల లేక జ-గణముగా నుండవలయును.
  8. (ద్విపదకు బదులు చతుష్పద అని మను అనుకొంటే ఇది సరి పాదములలో (రెండవ, నాలుగవ పాదములలో) మూడవ గణము అవుతుంది. ఈ సందిగ్ధతను తప్పించుటకై నేను ఈ గణమును నల-జ గణము అని పిలుస్తాను.)

  9. పూర్వ పాదములో నల-జ గణము నలమయితే ఒక పదము మొదటి లఘువుతో అంతమై, మఱొక పదము రెండవ లఘువుతో ప్రారంభము కావాలి. జ-గణమునకు ఈ నిర్బంధము చెప్పబడ లేదు.
  10. పూర్వ పాదములో ఏడవ గణము (నల-జ పిదప గణము) నలమయితే, పదము మొదటి లఘువుతో ప్రారంభము కావాలి.
  11. ఉత్తర (జఘన) పాదములో ఆఱవ గణము నల-జ కు బదులు ఒక లఘువు మాత్రమే.
  12. ఉత్తర పాదములో ఐదవ గణము నలమయితే, పదము మొదటి లఘువుతో ప్రారంభము కావాలి.
  13. పూర్వ పాదములో 30 మాత్రలు, ఉత్తర పాదములో 27 మాత్రలు, గాథకు మొత్తము 57 మాత్రలు.
  14. ఆర్య లేక గాథను తెలుగులో వ్రాసినప్పుడు చతుష్పదగా వ్రాయవలయును. అప్పుడు కుఱుచ పాదమునకు మూడు గణములు, నిడుద పాదమునకు ఐదు గణములు ఉంటాయి. సరి పాదములలో నాలుగవ గణమునకు (నల-జ గణము తఱువాత) యతి నుంచవలయును.

ఆర్యకు శిలాశాసనమునుండి ఒక ఉదాహరణము –

జయతి విభు శ్చతుర్భుజ-
శ్చతురర్ణవ విపుల సలిల పర్యంకః
జయతః స్థిత్యుత్పత్తి-
వ్యయాదిహేతు ర్గరుడకేతుః — (క్రీ.శ. 485, బుధగుప్తుని ఏరణ (మధ్యప్రదేశము) శాసనము)

(చతుర్భుజునికి, చతుస్సాగరమునే పడకగా కలిగినవానికి, సృష్టి స్థితి లయాదులకు కారణభూతుడైనవానికి, గరుడధ్వజునికి (విష్ణుమూర్తికి) జయమగు గాక!)

ఆర్యకు స్తోత్ర కావ్యమునుండి ఒక ఉదాహరణము. ఈ పద్యము చాల అందమైనది. శివుని ముఖము కమలముతో పోల్చబడినది ఇందులో –

జయతి జటాకింజల్కం
గంగామధుముండవలయ బీజమయం
గలగరలపంకసంభవ
మంభోరుహ మాననం శంభోః — (గోవర్ధన పండితుని ఆర్యాసప్తశతి, 5)

(శంభుని అంభోరుహాననము (పద్మము వంటి ముఖము) అతని గొంతులో ఉండే విషమనే పంకము నుండి పుట్టినది. ఆ తామరపూవు కేసరములు అతని జటాజూటములోని వెండ్రుకలు. తల చుట్టూ ఉన్న ఆ మధుర గంగానది అనే వలయము మధ్య బీజములు.)

ఆర్యకు తెలుగులో నా ఉదాహరణము ఒకటి. ఇందులో నల గణమువద్ద విఱుపును /గుర్తుతో చూపినాను.

యాదవ యదువంశార్యా
మాధవ మధుహారి /దనుజ-మర్దన రా
నాదరి వేగమె వేణువు
నూదుచు /లలితముగ – నుత్సుకతన్


పట్టిక 1. ఆర్యాభేదములు

ఆర్యాజాతిని తొమ్మిది విధములుగా వర్గీకరించారు. అందులో మొదటి ఐదు ఆర్యాభేదములు, తఱువాతివి గీతి భేదములు. మొదటి ఐదు పదముల విఱుపు, గణముల అమరిక వీటిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ముఖ, జఘన అనే పదములు మనకు కనిపిస్తాయి. ముఖ అనే పదము పూర్వ పాదమునకు, జఘన అనే పదము ఉత్తరపాదమునకు వర్తిస్తుంది.

పథ్యార్యాలో మూడవ గణము వద్ద పదము అంతమయి నాలుగవ గణము వద్ద మఱొక క్రొత్త పదము ప్రారంభము కావలయును. ఆర్యను ఒక చతుష్పదిగా మనము తలచినయెడల, ఏ పాదమునకు ఆ పాదము పథ్యార్యాలో స్వతంత్రముగా నిలిచి ఉంటుంది. పథ్య అనగా తగినది, ఒప్పినది అని అర్థము. క్రింద నా ఉదాహరణము –

పథ్యార్యా
మానసమందున నీవే /
దానవహారీ మురారి – దయతో నన్
గానఁగఁ బథ్యార్యా రా /
దీనజనులఁ బ్రోచు – దేవునిగా

విపులార్యలోని విశేష మేమనగా, ఇందులో మూడవ గణమువద్ద (అనగా చతుష్పదిలోని మొదటి పాదాంతములో) పదము అంతమవదు, తఱువాత వచ్చే నాలుగవ గణములోనికి ఈ పదము చొచ్చుకొని పోతుంది. పదము రెండు గణములకు వ్యాపించి విపులముగా నుంటుంది కనుక దీనికి విపులార్య అనే పేరు వచ్చినది. క్రింద నా ఉదాహరణము –

విపులార్యా
దేవాధిదేవ దివ్యా-
త్మా / వాంఛింతు నిను వనజ-దళనయనా
కావంగను రా భవ్యా-
త్మా / విపులదయాబ్ధి – దయ గనరా

చపలార్యలో జ-గణమునకు ప్రాముఖ్యత గలదు. ఆర్యలోని పూర్వార్ధములో రెండవ, నాలుగవ, ఆఱవ గణములు జ-గణములుగా నుండవచ్చును. ఉత్తరార్ధములో ఆఱవ గణము కేవలము లఘువు కనుక రెండవ, నాలుగవ గణములు మాత్రమే జ-గణములుగా నుండుటకు వీలగును. చపలార్యను వ్రాయుటలో కిటుకు ఏమనగా, రెండవ, నాలుగవ గణములను జ-గణములుగా నుంచి వాటికి ఎడమ, కుడి భాగములలో గురువులు ఉండే విధముగా పదములను ఎంచుకొనవలయును. అనగా జ-గణమునకు ఎడమవైపు గణము గగము లేక స-గణము, కుడివైపు గణము గగము లేక భ-గణముగా నుండవలయును. నాలుగవ గణము కూడ జ-గణము గనుక, దానికి ముందు గుర్వక్షరము ఉండవలయును. అప్పుడు మూడవ గణము గగము అవుతుంది. ఆర్య రెండు భాగములలో ఈ అమరిక ఉంటే మనకు సంపూర్ణ చపలార్య లభిస్తుంది. పూర్వార్ధములో మాత్రము ఈ విధముగా నుంటే అది ముఖచపల, ఉత్తరార్ధములో మాత్రము ఉంటే అది జఘనచపల. ఈ మూడింటికి క్రింద నా ఉదాహరణములను ఇచ్చినాను. చపలాంతర్గతమైన జ-గణములు ముద్ద అక్షరములలో చూపబడినవి.

చపలార్యా –
చపలా వినోదచిత్తా
జపించు నీ ప్రియుని పేరు – సంతసమై
అపరాహ్నవేళ వచ్చెన్
తపించు వేళాయెఁ – దరుణునికై

ముఖచపలార్యా –
సుఖమాయెనేమొ నీకున్
సఖీ యెఱుంగనుగ నేను – సత్యముగా
ముఖచపలమ్మున కొక్క బ్ర-
ముఖమగు కతము బ్రియ – ముఖమేమో

జఘనచపలార్యా –
కనె జఘనచపల నొక్కఁడు
కనె జఘనచపలయు వాని – గామముతో
జినదాని డెందమం దా
యనంగు డంపెఁ గుసు-మాస్త్రములన్

పథ్యార్య, విపులార్య, మూడు విధములైన చపలార్యల కన్నిటికి ఎల్లప్పుడు మొత్తము 57 మాత్రలు (30+27) ఉండును. మాత్రల సంఖ్యలను మార్చినప్పుడు మనకు గీతులు లభిస్తాయి. ఇవి నాలుగు విధములు. పూర్వ, ఉత్తర పాదములు రెండు పూర్వ పాదమువలె నున్నప్పుడు మనకు 60 మాత్రల గీతి లభిస్తుంది. పూర్వ, ఉత్తర పాదములు రెండు ఉత్తర పాదమువలె నున్నప్పుడు మనకు 54 మాత్రల ఉపగీతి లభిస్తుంది. ఆర్యలోని పూర్వ ఉత్తర పాదముల స్థానములను తారుమారు చేసినప్పుడు (పూర్వ పాదములో 27 మాత్రలు, ఉత్తర ఫాదములో 30 మాత్రలు) మనము ఉద్గీతి అమరికను చూస్తాము. గీతికి ప్రతి పాదములో చివర ఇంకొక రెండు మాత్రలు చేర్చగా లభించిన అమరికను ఆర్యాగీతి అంటారు. అనగా రెండు పాదములలో ఎనిమిదవ గణము గురువుకు బదులు స-గణమో లేక గగమో అవుతుంది. పద్యములో మొత్తము 64 మాత్రలు (32+32) ఉంటాయి. ఆర్యాగీతి, కందపద్యముల గణముల అమరిక ఒక్కటే. క్రింద గీతులకు నా ఉదాహరణములు –

గీతి-
గీతిని బాడఁగ నార్యకుఁ
బ్రీతియు మనమందు గల్గెఁ – బ్రియమయె నా
జేతోభవు నిశితమ్మగు
చూతాస్త్రము లెన్నొ దాక – జోద్యముగా

ఉపగీతి –
గీతియు పాడఁగ నత డుప-
గీతి నొకటి యామె – కిలగొట్టెన్
జేతులఁ జేతులు గలిపిరి
చేతము లొకటయ్యెఁ – జెలువముతో

ఉద్గీతి –
గీతము లుద్గీతములయె
వ్రాతలు గవితలయె – వలపులతో
నూతనమయె డెందములు పు-
నీతములయెఁ బ్రేమలోన – నెయ్యముతో

ఆర్యాగీతి
ఆర్యకు గీతియు నిష్ట
మ్మార్యాగీతియును గంద – మాయెనుగాదా
ఆర్యాపుత్రుఁడు స్కంధా-
చార్యుని కందమ్ము కంద – చరణములేగా

గాథాభేదములు


పట్టిక 2. గాథాభేదములు

సంస్కృత ఛందస్సులోని ఆర్యను ప్రాకృతములో గాథా లేక గాహా అని వ్యవహరిస్తారు. హాలుని గాథాసప్తశతి ఈ ఛందస్సులో వ్రాయబడినదే. ఆర్యను వర్గీకరించినట్లే గాథను కూడ వర్గీకరించినారు. ప్రాకృతపైంగలములో గాథాఛందస్సుకు ఇవ్వబడిన భేదములను రెండవ పట్టికలో చూడవచ్చును. ఇందులో మఱొక విశేషమేమనగా ప్రాకృతపైంగల రచయిత ఈ భేదములను స్కంధక భేదములు (కందపద్యపు భేదములు) అని చెప్పెను. ఇందులో గాహాకు – ఆర్యకు, గాహూకు – ఉపగీతికి, విగ్గాహకు – ఉద్గీతికి, ఉగ్గాహకు – గీతికి ఎట్టి భేదములు లేవు. పేరులోని మార్పులు తప్ప లక్షణములలో అవి ఒక్కటే. ఆర్యాగీతిని స్కంధకము అంటారు. ఇందులో క్రొత్తవి గాహిణీ, సింహిణి అనునవి మాత్రమే. వీటిలో ఒక అర్ధములో ఆర్యలోని పూర్వార్ధమువలె 30 మాత్రలు, మరొక అర్ధము ఆర్యాగీతిలోని పాదములవలె 32 మాత్రలు. గాహిణికి పూర్వార్ధములో ఆర్యా పూర్వార్ధము, సింహిణికి ఉత్తరార్ధములో ఆర్యాపూర్వార్ధము. గాహిణీ, సింహిణీ భేదములను సంకీర్ణ కందములు అని కూడ అంటారు. క్రింద నా ఉదాహరణములు –

గాహిణి – ఆర్యా-1, ఆర్యా-1 + గురువు

వచ్చెను వసంతఋతు వది
తెచ్చెను గుసుమముల రాశి – తృష్ణల నా
కిచ్చెను నీవుండక నిట
హెచ్చెను విరహమ్ము రగిలె – హృదిలో మంటల్

సింహిణి – ఆర్యా-1 + గురువు, ఆర్యా-1

ఎఱ్ఱని బూవులు వనిలో
నెఱ్ఱని కిరణముల సంధ్య – యీ యామనిలో
నెఱ్ఱని దిలకముతో నీ
యెఱ్ఱని పెదవులను నాకు – నీయఁగ రా

కందము

ఆర్యాగీతియే స్కంధకము అని తెలిసికొన్న పిదప, కందపద్యముల నియమములను గుఱించి ఇప్పుడు చర్చిద్దాము. చాల లక్షణగ్రంథాలలో ఇవి సందిగ్ధముగానే ఉన్నవి. కన్నడ, తెలుగు భాషలలో కందపద్యము ఒక చతుష్పది, సంస్కృత, ప్రాకృతములందువలె ద్విపద కాదు. కాని గణముల సంఖ్యలను చెప్పేటప్పుడు (ఉదా. జ-గణము బేసి గణముగా నుండరాదు) ద్విపదలోవలె చెప్పెదరు. మొట్టమొదటిసారిగా అప్పకవి మాత్రమే దీనిని స్పష్టముగా వివరించినాడు.

  1. ఆర్య లేక గాథలోవలె కందపద్యములో కూడ ఐదు చతుర్మాత్రాగణములు మాత్రమే (UU, IIU, UII, IIII, IUI) ఉంటాయి.
  2. కందము ఒక చతుష్పద, ద్విపద కాదు.
  3. బేసి (1, 3) పాదములలో మూడు మాత్రా గణములు, సరి (2, 4) పాదములలోఐదు మాత్రాగణములు.
  4. బేసి పాదములలో బేసి గణములు జ-గణముగా నుండరాదు; సరి పాదములలో సరి గణములు జ-గణముగా నుండరాదు.
  5. (జ-గణము నిషిద్ధమయిన చోటులలో ఆ గణమును ఉంచితే ఆ దోషము విధవ స్త్రీ గర్భము దాల్చగా గలిగిన పాపమువంటిది అంటాడు ఛందోంబుధి రచయిత ప్రథమ నాగవర్మ!)

  6. సరి పాదములలో చివరి గణము ఎల్ల వేళలలో గుర్వంతమే, అనగా స-గణమో (IIU) లేక గగమో (UU) సరి పాదములలో చివరి గణముగా నుండవలెను.
  7. సరి పాదములలో మధ్య గణము నలముగానో లేక జ-గణముగానో ఉండి తీరాలి. దీనినే నేను నలజ గణము అంటాను.
  8. కంద పద్యములో మొత్తము 64 మాత్రలు గలవు.
  9. సరి పాదములలో అక్షరసామ్య యతి మొదటి, నాలుగవ గణముల మొదటి అక్షరములకు చెల్లుతుంది.
  10. తెలుగులో ప్రాస అవసరము. ఈ ప్రాస నియమమువలన మఱొక నియమము జనిస్తుంది – మొదటి అక్షరము గురువయితే (లఘువయితే) అన్ని పాదములలో మొదటి అక్షరము గురువుతో (లఘువుతో) ప్రారంభము కావలెను.

వరాహమిహిరుడు క్రీస్తు శకము ఆఱవ శతాబ్దములో జీవించెను. ఇతడు చంద్రగుప్త విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకరు అని అంటారు. ఇతడు ఒక గొప్ప గణితశాస్త్రజ్ఞుడు, ఖగోళశాస్త్రజ్ఞుడు, జ్యోతిషములో దిట్ట. ఇతడు పాంచసిద్ధాంతిక, బృహజ్జాతకము, బృహత్సంహిత అనే పుస్తకాలను వ్రాసినాడు. అందులో బృహత్సంహితలో 103వ అధ్యాయాన్ని గ్రహగోచరము అంటారు. ఇందులోని పద్యాలు వేఱువేఱు ఛందస్సులలో ఆ పద్యాల పేరులతో (ముద్రాలంకారము) వ్రాయబడినవి. అందులో ఆర్యాగీతి స్కంధకములు ఒకటే అని తెలిపిన పద్యమును క్రింద చదువవచ్చును –

కందము –
సూర్య సుతోఽర్క ఫల సమ
శ్చంద్రసుత శ్చందతః సమనుయాతి యథా
స్కంధక మార్యాగీతి
ర్వైతాలీయం చ మాగధీ గాథాఽర్యాం — (వరాహమిహిరుని బృహత్సంహిత, 103-54)

(సూర్యుడివలెనే అతని సుతుడైన శని కూడా సమముగా ఫలములను ఇస్తాడు. అదెలాగంటే ప్రాకృతములో స్కంధకము సంస్కృతములో ఆర్యాగీతి యైనట్లు, ప్రాకృతములో మాగధి సంస్కృతములో వైతాళీయము ఐనట్లు, ప్రాకృతములో గాథా సంస్కృతములో ఆర్యా ఐనట్లు. పోతే చంద్రసుతుడైన బుధుడు శుభ గ్రహాలతో ఉంటే శుభ ఫలాన్ని, అశుభ గ్రహాలతో ఉంటే అశుభ ఫలాలను ఇస్తాడు.)

ప్రాకృత కవులు స్కంధకములో కావ్యములనే వ్రాసియున్నారు. ఉదాహరణకు ప్రవరసేనుని (సుమారు క్రీ.శ. 400) సేతుబంధమునుండి ఒక పద్యము –

పరివిడ్ఢయి విణ్ణాణం
సంభావిజ్జఇ జసో విఢప్పంతి గుణా
సువ్వఇ సుఉరిస చరిఅం
కిం తం జేణ ణ హరంతి కవ్వా లావా – (ప్రవరసేనుని సేతుబంధము లేక రావణవహ, 1.10)

సంస్కృత ఛాయ –
పరివర్ధతే విజ్ఞానం
సంభావ్యతే యశోఽర్జ్యంతే గుణాః
శ్రూయతే సుపురుష చరితం
కిం తద్యేన హరంతి కావ్యాలాపః

(కావ్యాలాపమువంటి మనోహరమైనదేదియును లేదు, దానిని ఎవ్వరు అపహరించరు, విజ్ఞానము అభివృద్ధి చెందుతుంది, కీర్తి ప్రాప్తిస్తుంది, గుణములను పొందవచ్చును, సత్పురుషుల చరిత్రమును వినవచ్చును.)

జయకీర్తి (సుమారు క్రీ.శ. 1000) సంస్కృతములో వ్రాసిన ఛందోనుశాసనములో స్కంధక లక్షణములను తెలియజేసినప్పుడు కన్నడ, తెలుగుభాషలలోవలె ద్వితీయాక్షర ప్రాసను ఉంచినాడు.

సర్వ చతుర్మాత్రగణో
గుర్వంతాష్టమగణత్వతో నాస్తి భృశం
సర్వగురుర్నాస్తి తథా
పూర్వమతాన్నియత షష్ట జన్లగణత్వాత్ – (జయకీర్తి ఛందోనుశాసనము, 5.14)

ఈ పద్యములో జయకీర్తి స్పష్టముగా కందము చతుర్మాత్రలతో నిర్మితములని, ఎనిమిదవ గణము గుర్వంతము కావలెనని, ఆఱవ గణము నల, జగణములలో ఒకటిగా నుండవలయునని అంటాడు.

శాసనములలో కంద పద్యములు

కందము కన్నడములో సుమారు ఎనిమిదవ శతాబ్దమునుండి, తెలుగులో పదవ శాతాబ్దమునుండి వాడుకలో నున్నవి. మనకు లభించిన పాత గ్రంథమయిన కవిరాజమార్గములో కందపద్యములే ఎక్కువ. అందులోని మొదటి కంద పద్యములు –

శ్రీ తళ్తురదొళ్ కౌస్తుభ
జాతద్యుతి బళసి కాండపటదంతిరె సం-
ప్రీతియి నావన నగలళ్
నీతినిరంతర నుదార నా నృపతుంగం

కృతకృత్యమల్ల నప్రతి-
హత విక్రమనొసెదు వీరనారాయణ న-
ప్పతిశయ ధవలం నమగీ-
గ తర్కితోపస్థిత ప్రతాపోదయమం

(కౌస్తుభమునుండి జనించిన కాంతి తెరవలె వ్యాపించగా, ఏ వక్షఃస్థలమును లక్ష్మీదేవి వీడకుండునో, ఆ (నీతి నిరంతరుడు, ఉదారుడు, నృపతుంగుడు, కృతకృత్యమల్లుడు, అప్రతిహతవిక్రముడు, అతిశయధవళకీర్తిమంతుడు) వీరనారాయణుడు శౌర్యమును ప్రీతితో నొసగుగాక! ఈ పద్యములో రాజునకు శ్రీవిష్ణుమూర్తికి అభేదత్వమును కవి సూచించినాడు. కుండలీకరణములలో నున్నవి రాజబిరుదులు.)

కవిరాజమార్గమునకు ముందు కన్నడములో మూడు కందపద్యములు మాత్రమే మనకు ఇప్పుడు లభ్యము. అందులో నరసింహరాజపురములోని సింగణగద్దె జైనమందిరములోని శ్రీపురుషుని (క్రీ.శ. 726-788) కాలమునందలి కన్నడ సంస్కృత మిశ్రిత తామ్రశాసనములో రెండు కంద పద్యములు గలవు. తఱువాతిది క్రీ.శ. 800 నాటి శివమొగ్గ జిల్లాలోని ఒక శాసనపద్యము. దానిని క్రింద ఇస్తున్నాను –

ఏ పేళ్వుదొ శివమార మ-
హీవళయాధిపన సుభగ కవితాగుణమం
భూవళయదొళ్ గజాష్టక
మోవనిగెయు మొనకెవాడు మాదుదె పేళ్గుం

(శివమారుడను గంగరాజు అందమైన కవితాగుణమును పొంది ఓవనిగె, ఒనకెవాడు వంటి (ఇవి మన తిరగలి, రోకలి పాటల వంటివి) జనప్రియములైన జానపదగేయములవలె గజాష్టకమును రచించినాడు.)


జినవల్లభుని శాసనము

వేములవాడను రాజధానిగా నుంచుకొని క్రీ.శ. 930-955 మధ్య రెండవ అరికేసరి నేటి కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతమును పరిపాలించాడు. అతనికి అర్జునునికి అభేదత్వమును కల్పించి పంపకవి విక్రమార్కవిజయమను పంపభారతము రచించినాడు. అతని తమ్ముడు జినవల్లభుడు. ఇతడు నేటి కుర్క్యాల గ్రామములో వృషభగిరి అనే గుట్టపైన (బొమ్మలగుట్ట) ఒక శిలాశాసనమును చెక్కించినాడు. చక్రేశ్వరి, వృషభనాథ, మహావీరుల విగ్రహాలను, సంస్కృత, కన్నడ, తెలుగు భాషలలో ఒక శాసనమును, మదనవిలాసము అనే ఒక తోటను నిర్మించాడు. తన సహోదరుడైన పంపనికై కవితాగుణార్ణావము అనే ఒక తటాకమును త్రవ్వించినాడు. నన్నయభట్టారకునికి సుమారు వంద సంవత్సరములకు మునుపే క్రీ.శ. 945 నాటి ఈ శాసనములో మూడు కంద పద్యములు తెలుగులో నున్నవి. ఇవియే తెలుగులో మనము ఎఱిగిన అతి ప్రాచీన కంద పద్యములు –

జిన భవనము లెత్తించుట
జిన పూజల్సేయుచున్కి – జిన మునులకు న
త్తిన యన్న దానం బీవుట
జినవల్లభు బోల గలరె – జిన ధర్మపరుల్

దినకరుసరి వెల్గుదుమని
జినవల్లభు నొట్టనెత్తు – జితకవినననున్
మనుజుల్గలరే ధాత్రిన్
వినుతిచ్చెదు ననియ వృత్త – విబుధ కవీంద్రుల్

ఒక్కొక్క గుణంబు కల్గుదు
రొక్కొడగా కొక్కలక్క – లేవెవ్వరికిం
లెక్కింప నొక్కొ లక్కకు
మిక్కిలి గుణపక్షపాతి – గుణమణి గుణముల్ (ఈ పద్యములో యతి తప్పినది)

నన్నయభట్టు ఆంధ్రమహాభారతములో వ్రాసిన మొదటి కంద పద్యము –

విమలాదిత్య తనూజుఁడు
విమల విచారుఁడు గుమార – విద్యాధరుఁ డు-
త్తమ చాళుక్యుఁడు వివిధా-
గమ విజిత శ్రముఁడు తుహిన- కరుఁ డురు కాంతిన్ – (ఆది పర్వము, 1.4)

కందపు మూలము ఆర్యయా లేక గాథయా?

భరతుని నాట్యశాస్త్రములో ఆర్యాభేదములు (పథ్యా, విపులా, చపలా) ఉన్నాయి గాని గీతి భేదములు, ముఖ్యముగా స్కంధకము, చెప్పబడలేదు. సంస్కృత ఛందస్సులో నిష్ణాతుడైన ఆచార్య వేళంకర్ ఆర్యను ప్రాకృతమునుండి సంస్కృతము గ్రహించినదని భావించారు (“Similarly, AryA, popularly known as gAthA, was the only metre borrowed by Sanskrit from the Praakrits.”) రావూరు దొరసామి శర్మ — “నేటి భాషాశాస్త్రవేత్తలు తెలుగు కందమే స్కంధకమను పేరితోఁ బ్రాకృతమునఁ బ్రవేశించి సంస్కృతమున గీతిభేదమై రాణించినదందురు. ఇతమిత్థమని నిర్ణయింప నలవిగాదు,” అని అన్నారు. ఇది సత్యదూరమని నాకు అనిపిస్తుంది. కన్నడ ఛందఃపరిశీలకుడైన తోగరె వెంకటాచల శాస్త్రి కందము, “చాల పురాతనమైన ప్రాకృతపు పుట్టింటినుండి కన్నడమును మెట్టిన ఇల్లుగా చేసికొన్న పెద్ద ముత్తైదువ,” అని అందముగా చెప్పారు.

కందపద్యము ఐదు చతుర్మాత్రాగణములతో నిర్మితము. సంస్కృతములో ఆర్యను పింగళుని పద్ధతిలో అక్షర గణాత్మకముగా వివరించారు. ప్రాకృతఛందస్సులో పాడుటకు వీలగు పద్యములకే ప్రాముఖ్యత ఎక్కువ. అందువలన జాతులు మాత్రమే కాదు వృత్తములను కూడ మాత్రాగణములతో వివరిస్తారు అందులో. తెలుగు ఛందస్సులో మాత్రాగణములను కూడ త్రిక గణములతో వివరించుటయే వాడుక. అందుకే కవిజనాశ్రయకర్త కంద పద్యపు లక్షణములను ఇలా చెప్పుతాడు –

కందము త్రిశర గణంబుల
నందును గాభజసనలము-లైదునె గణముల్
పొందును నాఱిట నలజము
లొందుం దుది గురువు జగణ – మొప్పదు బేసిన్ – (కవిజనాశ్రయము, 6)

కాని కన్నడములో అక్కరలాటి పద్యములను అంశ లేక ఉపగణములతో, రగడ, షట్పదులలాటి మాత్రాబద్ధమైన పద్యములను మాత్రల సంఖ్యతో, వృత్తములను గణములతో (వాటి అధిపతులతో) వివరించాడు నాగవర్మ తన ఛందోంబుధిలో. కందము మాత్రాగణబద్ధమైన జాతులలో పేర్కొనబడినను, వాటిని మాత్రలని చెప్పకుండ చెప్పినాడు నాగవర్మ. అనగా ఆ మాత్రాగణముల ఉదాహరణములను పదములుగా చెప్పి వాటితో పద్య నిర్మాణము జరుగుతుందన్నాడు. ఆ పద్యము –

గిరిశం ధూర్జటి శర్వం
పురారి పురరిపువెనిప్పు వింతయ్దు గణం
బరె శశి పుర విషయాద్రియొ
ళిరవిర్కె పురారియెంబ గణ మబ్జముఖీ – (నాగవర్మ ఛందోంబుధి, 4.3)

గిరిశం (IIU), ధూర్జటి (UII), శర్వం (UU), పురారి (IUI), పురరిపు (IIII) అనే ఐదు గణములలో మొదటి (శశి), మూడవ (పుర), ఐదవ (విషయ), ఏడవ (అద్రి) స్థానములలో పురారి గణము ఉండదు. ఇలా చెప్పినా తెలుగులోవలె వీటిని, స, భ, గగ, జ, నలములని చెప్పలేదు. అనగా వీటిని మాత్రాగణములనే భావించినాడు. అందువలన దీనిని ప్రాకృత ఛందస్సునుండి గ్రహించినాడనే నా అభిప్రాయము.

కందపద్యముల సంఖ్య

ఎన్ని విధములుగా కంద పద్యములను వ్రాయవచ్చును? దీనిని పరిశీలిద్దామా? మొదటి రెండు పాదములను క్రింది విధముగా వ్రాద్దాము –

UU – 1      IIU – 2,      UII – 3,      IIII – 4,      IUI – 5,      U – గురువు,      I – లఘువు

1 2 3 4 5 6 7 8 మొదటి రెండు పాదముల గణముల స్థానములు
1,3 1-5 1-4 1,3 1-4 4,5 1-4 1,2 గురువుతో ఆరంభమయిన పద్యమునకు గణములు
2,4 1-5 1-4 2,4,5 1-4 4,5 1-4 1,2 లఘువుతో ఆరంభమయిన పద్యమునకు గణములు

ఆఱవ మాత్రాగణము ఎప్పుడు IUI లేక IIII, ఎనిమిదవ గణము ఎప్పుడు UU లేక IIU మాత్రమే. మొదటి మాత్రాగణము UU, UIIగా ఉంటే నాలుగవ మాత్రాగణము కూడ ఆ రెంటిలో ఒకటిగా నుండాలి, ఇది ప్రాస నియమము వలన అవసరమవుతుంది. అందువలన పద్యము గురువుతో ప్రారంభమయితే మనము (2x5x4 x 2x4x2x4x2) విధములుగా, అనగా 5120 విధములుగా వ్రాయవచ్చును. పద్యము లఘువుతో ఆరంభమయితే మొదటి గణము IIII, IIUలలో ఒకటిగా నుండాలి, కాని నాలుగవ గణము IIII, IIU, IUI ఈ మూడింటిలో ఏదైనా కావచ్చును. అప్పుడు పాదమును (2x5x4 x 3x4x2x4x2) విధములుగా, అనగా 7680 విధములుగా వ్రాయవచ్చును. ఈ రెండు సంఖ్యలను కలిపితే 12800 లభిస్తుంది. అనగా కందపద్యపు అర్ధ భాగమును 12800 విధములుగా వ్రాయ వీలగును. పుస్తకములలో ఈ సంఖ్య 25600 అని ఇవ్వబడినది, అది సరి కాదు. ఇట్లే మొత్తము కంద పద్యమును [(5120*5120) + (7680*7680)] విధములుగా, అనగా 20,191,641,600 విధములుగా వ్రాయవచ్చును.

తెలుగులో కందముల వర్గీకరణమును వివిధ లాక్షణికులు వేఱువేఱుగా చెప్పినారు. వీటిని కొందఱు ఆర్యాభేదములని, మఱి కొందఱు కందభేదములు అన్నారు. వాటిని సంక్షిప్తముగా క్రింద ఇస్తున్నాను –

  1. పథ్యార్య – ఇది సంస్కృతములోని పథ్యార్యవంటిదే. కాని అప్పకవి మాత్రము ద్వితీయార్ధములో కూడ నలజ గణ స్థానములో లఘువుకు బదులు నలమును చెప్పాడు. అంతే కాక ద్వితీయార్ధములో కూడ ప్రథమార్ధమువలె 30 మాత్రలు ఉన్నవి అప్పకవి పద్యములో. అప్పకవి రెండు అర్ధములలో నలమును ఉంచినాడు. కారణము తెలియదు.
  2. విపులార్య – ఇది కూడ సంస్కృతములోవలెనే. కురుచ పాదములోని చివరి గణములోని పదము నిడుద పాదమునకు చొచ్చుకొని పోవలయును. రెండు అర్ధములకు ఈ లక్షణములు ఉండవలయును. కాని అప్పకవి ప్రథమార్ధములో మాత్రమే విపులీకృతము చేసినాడు, లక్షణపద్యములోని ద్వితీయార్ధము పథ్యలాగే ఉన్నది. అంతే కాక ద్వితీయార్ధములో కూడ ప్రథమార్ధమువలె 30 మాత్రలు ఉన్నవి అప్పకవి పద్యములో.
  3. చపలార్యా లక్షణములను రెండవ జ-గణమునకు మాత్రమే చెప్పారు తెలుగు లాక్షణికులు, మొదటి జ-గణమునకు చెప్పలేదు. ముఖ, జఘన చపలార్యలకు కూడ ఇలాగే చెప్పారు. అప్పకవి జఘనచపలకు మాత్రమే 57 మాత్రలను ఉంచినాడు. చపలకు, ముఖచపలకు 60 మాత్రలను ఉంచినాడు.
  4. ఆర్యకు గల నాలుగు గీతుల లక్షణములు తెలుగులో కూడ సంస్కృతమువలెనే యున్నవి. అప్పకవి గీతిని సమగీతి అని పేర్కొన్నాడు.

పొత్తపి వేంకటకవి లక్షణశిరోమణిలో కందభేదములను ఇలా వర్గీకరించినాడు, అవి – (1) సమకందము, (2) విషమ కందము, (3) ఆర్యా కందము, (4) కుఱుచ కందము, (5) నిడుద కందము, (6) ద్వివిధ కందము, (7) చతుర్విధ కందము, (8) నల చతుష్కందము, (9) జ-గణ చతుష్కందము, (10) వృత్తగర్భిత కందము, (11) భాస్కరవిలసిత కందద్వయము, (12) క్రౌంచపద కందద్వయము, (13) మణిగణనికర కందము, (14) ప్రమితాక్షర కందము.

ఇందులో సమకందము సామాన్యముగా వ్రాసే కందము. విషమ కందములో రెండు కుఱుచ పాదములను వ్రాసిన తఱువాత రెండు నిడుద పాదములను వ్రాయవలయును. క్రింద నా ఉదాహరణము –

విషమ కందము –
విషమ మ్మైనను గందము
సుషమముగ నుండుఁ జదువన్
గృషితో నియ్యదియు వినగఁ – దృప్తిగ నుండున్
మృష కాదిది నిజము మీరె – మెచ్చుదు రికపై

పొత్తపి వేంకటరమణకవి సరి పాదములను లఘ్వంతములుగా చేసి, అట్టి అమరికను ఆర్యాకందము అని చెప్పినాడు. ఇట్టి వివరణ మఱెక్కడ లేదనిపిస్తుంది. ఆర్యాకందమునకు నా ఉదాహరణము –

పొత్తపి వేంకటరమణ కవి ఆర్యాకందము –
మానసమున నీవే నీ
యాననమును జూడఁ గోరి – యమలా యుంటిని
కానంగను రావా నా
ప్రాణమ్ముల శ్వాసలోన – వాణిని వింటిని

కుఱుచ నిడుద కందములు – ఏ కంద పద్యములోనైనను సరి పాదములలో చివర గురువు తప్పక ఉండాలి. రెండు నలజ గణములు జ-గణములైనప్పుడు నాలుగు లఘువులు అవసరముగా నుండి తీరాలి. అనగా ఒక కంద పద్యములో కనీసము రెండు గురువులు, నాలుగు లఘువులు తప్పని సరిగా నుండవలయును. కందపద్యములో మొత్తము 64 మాత్రలు. నాలుగు లఘువులు తప్ప మిగిలిన అక్షరము లన్నియు గురువులైనప్పుడు మనకు కంద పద్యములో 34 అక్షరములు (30 గురువులు + 4 లఘువులు) ఉంటాయి. దీనిని కుఱుచ కందము అంటారు. రెండు గురువులు తప్ప మిగిలినవన్ని లఘువులైనప్పుడు మనకు కంద పద్యములో 62 అక్షరములు (2 గురువులు + 60 లఘువులు) ఉంటాయి. దీనిని నిడుద కందము అంటారు. క్రింద వీటికి నా ఉదాహరణములు –

కుఱుచ కందము లేక గగ కందము లేక “సర్వ” గురు కందము (14 గగములు) –
రామా మేఘశ్యామా
రామా ప్రేమాభిరామ – రాజాద్యక్షా
రామా సుగ్రీవాప్తా
రామా సీతాసమేత – రాజీవాక్షా

నిడుద కందము లేక నల కందము లేక “సర్వ” లఘు కందము(14 నలములు) –
బరువయె ఫలములఁ దరువులు,
సిరులయె వనలతల విరులు – చెరువుల జలముల్
బరుగిడె సెలలయి ధరపయి,
స్వరముల నెలవయెను బ్రకృతి – సరసఋతువునన్

బహువిధ కందములు – ద్వివిధ కందములో పూర్వార్ధమును, ఉత్తరార్ధమును తారుమారు చేసినను పద్యము అర్థవంతముగా నుండవలయును. అదే విధముగా చతుర్విధ కందములో ఒక కంద పద్యములో నాలుగు విధములైన కందపు అమరికలు మనకు అర్థవంతముగా కనబడవలయును. నల చతుష్కందములో సరి పాదములలోని రెండవ గణము నలముగా నుండవలయును. అట్టి నలముతో మఱొక కంద పద్యము ప్రారంభము కావలయును. జ-గణ చతుష్కందములో బేసి పాదములలో రెండవ గణము, సరి పాదములలో మూడవ గణము జ-గణముగా నుండవలయును. సరి పాదములలోని రెండవ గణముతో నూతన కంద పద్యములను మొదలు పెట్టాలి. వీటికి క్రింద నా ఉదాహరణములు –

ద్వివిధ కందము – మొదటి కందము
రాకేందుముఖీ వడి నీ
రాకకొఱకు వేచియుంటి – రంజిల రజనిన్
రాకేందుబింబ మతిగా
రాకొమరిత జూడు వెల్గె – రత్నాంబరమై

రెండవ కందము – పై కందపు పాదములు3,4,1,2 వరుసలో.

చతుర్విధ కందమును మొట్ట మొదట నన్నెచోడుడు కుమారసంభవములో నుపయోగించెను. తఱువాత కావ్యాలంకార చూడామణిలో కూడ ఇట్టి పద్యము గలదు. అవి –

నన్నెచోడుని కుమారసంభవమునుండి (12.217)

చతుర్విధ కందము – మొదటి కందము –
సుజ్ఞానయోగతత్త్వ వి-
ధిజ్ఞులు భవ బంధనములఁ ద్రెంచుచు భువిలో
నజ్ఞానపదముఁ బొందక
ప్రాజ్ఞులు శివుఁ గొల్తు రచల భావనఁ దవులన్

రెండవ కందము –
భవ బంధనములఁ ద్రెంచుచు
భువిలో నజ్ఞానపదముఁ బొందక ప్రాజ్ఞుల్
శివుఁ గొల్తు రచల భావనఁ
దవులన్ సుజ్ఞానయోగతత్త్వ విధిజ్ఞుల్

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణినుండి(6.48)

చతుర్విధ కందము – మొదటి కందము –
చాళుక్య విశ్వవిభునకు
వాలున్ బుధనుతియు సుగుణ – వర్గము నిధులున్
జాలుటయు నీతినిరతియు
మేలున్ మధురతయు నీగి – మీఱినవిధమున్

రెండవ కందము –
బుధనుతియు సుగుణ వర్గము
నిధులున్ జాలుటయు నీతి-నిరతియు మేలున్
మధురతయు నీగి మీఱిన
విధమున్ చాళుక్య విశ్వ-విభునకు వాలున్

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

నేను వ్రాసిన చతుర్విధ కంద మొకటి –

మొదటి కందము –
మిలమిల వెలుగులఁ గందము
గలిగెన్ బలు పలుకు విరుల – గమగమ లలరెన్
దెలుఁగున సొబగుల హారము
జెలగెన్ బలు ఛవుల హృదియుఁ – జిమ్మెను గళలన్

రెండవ కందము –
పలు పలుకు విరుల గమగమ
లలరెన్ దెలుఁగున సొబగుల – హారము జెలగెన్
బలు ఛవుల హృదియుఁ జిమ్మెను
గళలన్ మిలమిల వెలుగులఁ – గందము గలిగెన్

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

నల చతుష్కందము – మొదటి కందము –
భూమీశ దనుజ హారీ
శ్యామా నవమదనరూప – యవనిజభువనా
శ్రీమంత పరమ పురుషా
రామా పవనసుతపాల – రక్షితహవనా

రెండవ కందము –
నవమదనరూప యవనిజ
భువనా శ్రీమంత పరమ – పురుషా రామా
పవనసుతపాల రక్షిత
హవనా భూమీశ దనుజ – హారీ శ్యామా

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

జ-గణ చతుష్కందము –
మొదటి కందము –
రావమ్మ నాదు సాలకు
దేవీ నిను గొల్తునమ్మ – దినమున్ మనమున్
భావింతు భక్తి మలహరి
నీవే నను గనుము రాగ-నిలయా జననీ

రెండవ కందము –
నిను గొల్తునమ్మ దినమున్
మనమున్ భావింతు భక్తి – మలహరి నీవే
నను గనుము రాగనిలయా
జననీ రావమ్మ నాదు – సాలకు దేవీ

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

నా ఉద్దేశములో తెలుగులోని కందముల వర్గీకరణ ఆర్యకు సంబంధించినది. అందులో కందపు పాలు తక్కువ. కందములోని భిన్న రీతులను పాటిబండ మాధవరాయశర్మ తన ఆంధ్రమహాభారత ఛందఃశిల్పములో 16 విధములుగా భారతములోని ఉదాహరణములతో వివరించారు.

  • (1) పథ్య – ఇందులో ఏ పాదమునకు ఆ పాదము స్వతంత్రముగా నుంటుంది.
  • (2-4) ఆది, అంత్య, ఉభయ విపులలు – ఇందులో విపులత్వము (పదము ఒక పాదమునుండి మఱొక పాదమునకు చొచ్చుకొని పోవుట) క్రమముగా పూర్వార్ధములో, ఉత్తరార్ధములో, రెండు భాగములలో నుండును.
  • (5-7) ముఖ, జఘన, మహా చపలలు – ఇందులో చపలత్వము (మొదటి పాదపు రెండవ, రెండవ పాదపు మొదటి గణములు జ-గణముగా నుండుట) పథ్యాకందములలో (పాదాంత విరామము గలిగినవి) పూర్వార్ధము, ఉత్తరార్ధము, రెండు భాగములలో నుండును. జ-గణ స్థానమునకు ప్రాముఖ్యత ఇవ్వబడినదే కాని ముందు వెనుకల గురువుల నియమమును గుఱించి చెప్పలేదు.
  • (8-10) ముఖచపలాది, జఘనచపలాది, మహాచపలాది విపులలు – ఇందులో మూడు విధములైన చపలలకు పూర్వార్ధములో విపులత్వమునుంచుట.
  • (11-13) ముఖచపలాంత్య, జఘనచపలాంత్య, మహాచపలాంత్య విపులలు – ఇందులో మూడు విధములైన చపలలకు ఉత్తరార్ధములో విపులత్వము నుంచుట.
  • (14-16) ముఖచపలోభయ, జఘనచపలోభయ, మహాచపలోభయ విపులలు – ఇందులో మూడు విధములైన చపలలకు రెండు అర్ధములలో విపులత్వము నుంచుట.

కొక్కొండ వేంకటరత్నముపంతులు కూడ కొన్ని విధములైన కందములను సృష్టించారు. వాటిని నేను ఇంతకుముందే మఱొక చోట చర్చించినాను. నా ఉద్దేశములో మాధవరాయశర్మ వర్గీకరణ చాల విపులముగా నున్నది, గుర్తు పెట్టుకొనుట కొద్దిగా కష్టమే. నేను ఒక సులభమైన ప్రణాళికను ఇస్తున్నాను. అది –

1. పథ్యా కందము – ఇందులో నాలుగు పాదములు స్వతంత్రముగా నిలిచి ఉంటాయి.

పథ్యా కందము –
కృష్ణా యనంగ మనసునఁ
దృష్ణయు నాకెపుడుఁ గల్గు – దివ్య సుధలకై
కృష్ణా యనెదను మనికియుఁ
గృష్ణార్పణమగును వాని – గృపతో ధరపై

2. విపులా కందము – ఇందులో పూర్వ భాగము, ఉత్తర భాగము లేక రెండు భాగములలో విపులత్వము (పదములు చొచ్చుకొని పోవుట) ఉంటుంది.

విపులా కందము –
కందము కవి కందము, మా-
కందము పికములకు, నీల – గగనమ్మునకున్
గందము లందము, సమవ-
స్కంద మ్మందమగుఁ గోట – కవనీతలిపై

3. చపలా కందము – ఇందులో పూర్వ భాగము, ఉత్తర భాగము లేక రెండు భాగములలో చపలత్వము (మొదటి పాదములో రెండవ, రెండవ పాదములో మొదటి గణము జ-గణముగా నుండుట) ఉంటుంది. ఈ చపలత్వము రెండు గణములకు ఉండవలెను. నా ఉద్దేశములో ఒక గణమునకు చాలదు.

చపలా కందము –
రామా రఘూత్తమా వి-
క్రమార్క వంశాబ్ధి సోమ – రసమయహృదయా
శ్యామా నవాభిరామా
నమామి యంచెపుడు గొల్తు – నవరాగమయా

4. అతివిపులా కందము – ఇంతవఱకు నాకు తెలిసి ఎవ్వరు చెప్పని ఒక నియమమును ఇక్కడ ఇస్తున్నాను. ఇది కన్నడ, తెలుగు కందముల ప్రత్యేకత. విపులత్వమును ఆపాదించుటలో అందఱు మొదటి రెండు పాదములను, చివరి రెండు పాదములను మాత్రమే పరిగణించినారు. కాని మన ద్రావిడ భాషలలోని కందములలో ఈ విపులత్వము రెండు అర్ధములకు, అనగా రెండవ మూడవ పాదములకు, కూడ వర్తిస్తుంది. దీనికి చక్కటి ఉదాహరణము నన్నయభట్టు వ్రాసిన మొదటి కంద పద్యమే. అందులో రెండవ పాదము “ఉ” తో అంతమై మూడవ పాదము “త్తమ” తో ప్రారంభమవుతుంది. “ఉత్తమ” అనే పదము ఇలా రెండు భాగములలో గలదు. ఇలాటి ఉదాహరణములను మనము కావ్యములలో సులభముగా గ్రహించవచ్చును. ఇట్టివి సంస్కృత ప్రాకృతములలో పాదాంత విరామయతి నియమముచేత ఉండదు లేక అరుదు. కావున ఇది ఒక ముఖ్యమైనదనే నా భావన.దీనిని అతివిపుల అని పిలువ దలచినాను.

అతివిపులా కందము –
విపుల స్కంధద్వయ, మతి
విపులమ్మగు కన్నుదోయి – వెలుఁగులు, కడు రో-
సపు మీసమ్ములు, కన నతి
విపులమ్మగు హృదయసీమ – వెన్నుఁడ నీదౌ

ఒక విపుల గాని అతివిపుల గాని పథ్యగా నుండుటకు వీలు కాదు. కాని చపలాకందము విపులగా, అతివిపులగా, పథ్యగా నుండవచ్చును.

కందభేద కృష్ణస్తోత్రము

కంద పద్యములో 34 నుండి 62 అక్షరముల వఱకు ఉంటాయని ఇంతకు ముందే చెప్పినాను. అందులో రెండు గురువులు, నాలుగు లఘువులు అనివార్యము. కుఱుచ కందములో 30 గురువులు గలవు, అందులో అంత్యగురువులను రెండు తొలగిస్తే మనకు 28 గురువులు మిగులుతాయి. ఒక్కొక్క గురువును రెండు లఘువులు చేయగా మనకు 28 విధములైన కంద పద్యములు దొఱకును. అనగా గురు లఘువుల సంఖ్యను బట్టి మనకు 29 విధములైన కంద పద్యములు సాధ్యము. వీటికి పేరులు కూడ ఉన్నాయి. కాని ఒక్కొక్క లక్షణకారుడు వేఱువేఱు పేరులను ఎన్నుకొన్నాడు. ప్రాకృతపింగలములో, హేమచంద్రుని ఛందోనుశాసనములో, రఘునాథ నాయకుని సంగీతసుధలో ఈ పేరులు ఇవ్వబడినవి. ప్రాకృతపైంగలములో ఈ స్కంధక భేదములు క్రింది నామములతో వ్యవహరించబడినవి, ఇందులో పద్యములోని లఘు-గురువుల సంఖ్య కుండలీకరణములలో గలవు. అవి –

(1) నంద (4-30), (2) భద్ర (6-29), (3) శేష (8-28), (4) సారంగ (10-27), (5) శివ (12-26), (6) బ్రహ్మా (14-25), (7) వారణ (16-24), (8) వరుణ (18-23), (9) నీల (20-22), (10) మదన (22-21), (11) తాడంక (24-20), (12) శేఖర (26-19), (13) శర (28-18), (14) గగన (30-17), (15) శరభ (32-16), (16) విమతి (34-15), (17) క్షీర (36-14), (18) నగర (38-13), (19) నర (40-12), (20) స్నిగ్ధ (42-11), (21) స్నేహాలు (44-10), (22) మదకల (46-9), (23) లోల (48-8), (24) శుద్ధ (50-7), (25) సరిత్ (52-6), (26) కుంభ (54-5), (27) కలశ (56-4), (28) శశి (58-3), (29) యాన (60-2).

కుఱుచ, నిడుద కందములు తప్ప మిగిలిన వాటిని ఎన్నో విధములుగా వ్రాయవచ్చును. ఈ కందభేదములను ప్రస్ఫుటము చేయుచు కందభేద కృష్ణస్తోత్రము నొకటి నేను వ్రాసినాను. ప్రతి భేదమునకు ఒక పద్యము ముద్రాలంకారములో, మఱొకాటి సామాన్య రీతిలో వ్రాసినాను. ఇట్టి ప్రక్రియ నేను చూసిన ఏ ఛందోగ్రంథములో కూడ లేదు. మచ్చుకు ఒక ఉదాహరణమును క్రింద ఇచ్చినాను. మిగిలినవాటిని అనుబంధములో చదువవచ్చును.

10 లఘువులు, 27 గురువులు – సారంగ
విన్నావా కన్నయ్యా
యన్నయ్యయు జెప్పె నీదు – నాగడముల య-
న్నన్నా బిల్తున్ నే గు-
మ్మన్నన్ వేగమ్ము చూడు – మన్నించన్ నేన్.

సారంగమ్మున్ జూడం-
గా రమ్మో కృష్ణ యంచుఁ – గాంతలు జెప్పన్
సారంగ మ్మెందంచున్
శ్రీరంగం డడిగి విరిని – వ్రేలన్ జూపున్.

కుఱుచ-నిడుద కందముల భేదములు – ఇంతకు ముందే పొత్తపి వేంకటరమణకవి రెండు కుఱుచ (కు) పాదములు, తఱువాత రెండు నిడుద పాదములు (ని) ఉంచి విషమ కందమును వ్రాసిన విధానమును తెలిపియున్నాను. ఈ విషమ కందమునే నారాయణరెడ్డి మాకందము అని పిలిచినారు. ఈ భావమును పొడిగించుటకు వీలవుతుంది. రెండు కుఱుచ, రెండు నిడుద పాదములతో ఆఱు విధములుగా ఒక చతుష్పదిని వ్రాయ వీలగును. అవి – (1) కు-ని-కు-ని, (2) ని-కు-ని-కు, (3) కు-కు-ని-ని, (4) ని-ని-కు-కు, (5) కు-ని-ని-కు, (6) ని-కు-కు-ని. ఈ ఆఱు విధములకు క్రింద ఒకే పద్యముతో ఉదాహరణములుగా ఇచ్చుచున్నాను –

(1) కు-ని-కు-ని – కందము
దేవిని సతతము గొలుతును
శ్రీవిద్యల నొసగు మంచు – జీవిత మందున్
బావని ననిశము దలతును
బ్రావీణ్యత నొసగు మంచు – భావము లందున్

(2) ని-కు-ని-కు – మణికందము
శ్రీవిద్యల నొసగు మంచు జీవిత మందున్
బావని ననిశము దలతును
బ్రావీణ్యత నొసగు మంచు భావము లందున్
దేవిని సతతము గొలుతును

(3) కు-కు-ని-ని – మాకందము, విషమకందము
దేవిని సతతము గొలుతును
బావని ననిశము దలతును
శ్రీవిద్యల నొసగు మంచు జీవిత మందున్
బ్రావీణ్యత నొసగు మంచు భావము లందున్

(4) ని-ని-కు-కు – శ్రీకందము
శ్రీవిద్యల నొసగు మంచు జీవిత మందున్
ప్రావీణ్యత నొసగు మంచు భావము లందున్
దేవిని సతతము గొలుతును
బావని ననిశము దలతును

(5) కు-ని-ని-కు – మధుకందము
దేవిని సతతము గొలుతును
శ్రీవిద్యల నొసగు మంచు జీవిత మందున్
బ్రావీణ్యత నొసగు మంచు భావము లందున్
బావని ననిశము దలతును

(6) ని-కు-కు-ని – రసకందము
శ్రీవిద్యల నొసగు మంచు జీవిత మందున్
దేవిని సతతము గొలుతును
బావని ననిశము దలతును
బ్రావీణ్యత నొసగు మంచు భావము లందున్

ఇవి కాక మూడు కుఱుచ, ఒక నిడుద లేక మూడు నిడుద, ఒక కుఱుచ పాదములతో ఒక చతుష్పదిని ఎనిమిది విధములుగా వ్రాయవచ్చును. ఈ ఎనిమిది విధములకు ఉదాహరణములను క్రింద ఇచ్చుచున్నాను. వీటికి నేను పేరు లివ్వ లేదు.

(7-10) కు-ని-ని-ని, ని-కు-ని-ని, ని-ని-కు-ని, ని-ని-ని-కు
శ్రీనాథా నిన్ను గనగ – సిరు లెందుకురా
ఆనందమ్మందు దేలి – యాడుదునుగదా
వేణూనాదమ్ము వినగ – వేదన గలదా
రా నా ప్రాణము నీవే

(11-14) ని-కు-కు-కు, కు-ని-కు-కు, కు-కు-ని-కు, కు-కు-కు-ని
వరవీణా మృదుపాణీ
స్వరరాగమ్ముల రాణీ
నిరుపమ కవితావేణీ
కరుణను నను జూడుమమ్మ – కడగన్నులతో

ఇవి గాక అన్నియు కుఱుచ పాదములు, అన్నియు నిడుద పాదములతో సమపాద జాతి పద్యములను వ్రాయవచ్చును. ఈ రెంటికి ఉదాహరణములు –

(15) కు-కు-కు-కు
మానస వీణయు మ్రోగెను
గానము జక్కగ సాగెను
వానగ గురిసిన పాటలు
తేనియ తేటల మాటలు

(16) ని-ని-ని-ని
చల్లని రేయి యిది శశియుఁ – జల్లెను సుధలన్
మల్లెల మాల యిది మంచి – మత్తును జిమ్మెన్
తెల్లని తెరచాప పడవ – తేలెను నదిపై
ఫుల్లములై మదులు నేఁడు – ముదమునఁ బొంగెన్

ముగింపు

ఆర్యా, గాథా, కందముల ఉత్పత్తి, భేదములు మున్నగువాటిని గుఱించి ఈ వ్యాసములో చర్చించినాను. రెండవ భాగములో కందముతో చిత్రకవిత్వము, కందమునకు కర్ణసుభగత్వము ఏ విధముగా కలుగుతుంది అనే విషయాలకు వివరణల నిస్తాను. కందపద్య నిర్మాణమును ఎలా మిగిలిన ఛందస్సులకు అన్వయించవచ్చును అనే విషయముపైన, కంద పద్యపు భవిష్యత్తు పైన కూడ చర్చిస్తాను.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...