తెలుగు సాహిత్యావగాహన – నారాయణ రావు వేరు బాట

“A serpent which is unable to strip off its skin will perish. So will all those intellectuals that are prevented from changing their opinions: They cease to be intellectuals.”

– Nietzsche


‘వెల్చేరు నారాయణ రావు తన పరిశోధనల ద్వారా (పాశ్చాత్యులకి) దక్షిణ భారత సాహితీ సంస్కృతి చరిత్ర అవగాహనలో ఒక విప్లవం తీసుకొని వచ్చాడు,’ అని వెల్చేరు నారాయణరావు అభినందన సంకలనగ్రంథం Syllables of Sky[1] లోపలి అట్టపై ప్రచురణకర్తలు పరిచయ వాక్యాలు రాశారు. నారాయణ రావు గత మూడున్నర దశాబ్దాలుగా ప్రచురిస్తున్న తెలుగు సాహిత్యానువాదాలు, దక్షిణ భారత సాహితీ చరిత్రలపై పరిశోధనలు — వీటి గురించి ఏ మాత్రం పరిచయం ఉన్నా ఈ వాక్యాలు కేవలం ప్రశంసా వాక్యాలు కావు; నిరపేక్షంగా నిజం అని చెప్పవచ్చు. ఈ పుస్తకంలో వచ్చిన వ్యాసాలని అడపాతడపా స్థూలంగా వ్యాఖ్యానిస్తూ ఇదివరలో అక్కడక్కడ (తెలుసా, తానా పత్రిక(1995), ఈమాటలో) ప్రస్తావించాను.

డేవిడ్ షూల్మన్ ఆప్యాయతతో రాసిన చక్కని పరిచయవ్యాసం, ‘ఒక కొత్త భారతీయ కావ్యానుశాసనం వైపు: వెల్చేరు నారాయణ రావు మరియు సాహిత్య విప్లవాల స్వరూపం,’ దక్షిణాసియా సాహిత్య చారిత్రికాధ్యయన పరంగా నారాయణ రావు మేధోపరిణామక్రమానికి నాందీవాక్యం అని చెప్పవచ్చు. నారాయణ రావు డాక్టరేట్ డిగ్రీ సిద్ధాంతవ్యాసం (1978) ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం‘[2] అని తెలుగు సాహిత్య పాఠకులకి తెలిసినదే. ఇదే కాకుండా, ఎందరో సాహిత్య పరిశోధకులు ప్రత్యేకంగా ఈ సంకలనం కొరకు రాసిన వ్యాసాలున్నాయి. ఇందులో చాలా వ్యాసాలు, నారాయణ రావు సాహిత్య సభల్లోను, వ్యక్తులతోనూ చేసిన ప్రసంగాలు, మౌఖికంగా చెప్పిన ‘కథల’ ప్రేరణ ఫలితాలని చెప్పవచ్చు.

ఈ పుస్తకం పేరు, Syllables of Sky, ధూర్జటి (1530) శ్రీ కాళహస్తీశ్వర శతకంలో చెప్పిన ఒక చక్కని పద్యం మూడవ చరణంలో భాగం. ఆ పద్యం పూర్తి పాఠం ఇది.

తరగల్ పిప్పల పత్రముల్ మెఱుగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమాలతతుల్ ఖద్యోదకీటప్రభల్
సురవీధీలిఖితా క్షరంబులసువుల్ జ్యోత్స్నా పయఃపిండముల్
సిరులందేల మదాంధులౌదురోజనుల్! శ్రీకాళహస్తీశ్వరా!

‘సురవీధీలిఖితాక్షరంబుల్,’ — ఆకాశంలో రాయబడ్డ అక్షరాలు అశాశ్వతం. అస్థిరం. ఈ పద్యం యొక్క నిజమైన బలం అశాశ్వతని కొనియాడటం కాదు; జీవితంలో శ్రేష్ఠతను సాధించడం దీని అంతిమ ధ్యేయం. అదేవిధంగా, అంతు చిక్కని భాష, దాని సృజనాత్మకశక్తి, మౌఖిక సాహిత్య మేధావి నారాయణ రావు సద్యోజనిత వివేకానికి అద్భుతంగా నప్పుతాయని, నారాయణ రావుతో ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా తెలుస్తుంది. నారాయణ రావు, హాన్క్ హైఫెట్జ్ (Hank Heifetz) శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని[3] For the Lord of the Animals పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు అని ఇక్కడ ప్రస్తావించటం అప్రస్తుతం కాదు.


ఈ వ్యాసం ప్రారంభంలో, ‘వెల్చేరు నారాయణ రావు తన పరిశోధనల ద్వారా (పాశ్చాత్యులకి) దక్షిణ భారత సాహితీ సంస్కృతి చరిత్ర అవగాహనలో ఒక విప్లవం తీసుకొని వచ్చాడు,’ అని ఉదహరించాను. పాశ్చాత్యులకే కాదు; ప్రాచ్య సాహితీవేత్తల అవగాహనలో కూడా, ఒక కొత్త దృక్పథం, ఒక మార్పు, ఒక విప్లవం తీసుకొని వచ్చాడు. నారాయణ రావు రచనలపై, ఇదివరకు ఈమాట లోను, తదితర తెలుగు వెబ్ పత్రికల లోను, తెలుగునాట అచ్చుపత్రికల లోను వ్యాసాలు, వాదోపవాదాలు, విమర్శలూ వచ్చిన సంగతి పాఠకులకు విదితమే.

నారాయణ రావు సాహితీ జీవనయానం విచిత్రంగాను, గజిబిజిగానూ కనిపిస్తుంది. నారాయణ రావు జన్మస్థలం శ్రీకాకుళం జిల్లాలో చిన్న పల్లెటూరు అంబఖండి. జీవితంలో మొట్టమొదటిసారి రైలు బండి ఎక్కి అంబఖండి నుంచి ఏలూరుకి మొదటి మజిలీ. హైస్కూలు, కాలేజీ చదువు; ఆ కాలేజీలోనే తెలుగు మేష్టారుగా ఉద్యోగం. ఏలూరు తరువాత వేసిన పెద్ద మజిలీ ఉత్తర అమెరికాలో మేడిసన్. మేడిసన్‌లో అమెరికన్ విద్యార్థులకి ‘తల వల పలక పడవ’ పాఠం చెప్పడానికి రావడం, బహుశా కేవలం కాకతాళీయం. అయితే, ఆ మజిలీ తన సాహిత్య జీవితంలో ఒక సరికొత్త మలుపు అని చెప్పక తప్పదు. నాలుగు దశాబ్దాల తరువాత షికాగో విశ్వవిద్యాలయం మీదగా, ప్రస్తుతం అట్లాంటా ఎమొరీ విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ అలసట లేకుండా పని చేస్తూనే వున్నాడు. నారాయణ రావు తనకు తానే చెప్పాడు: ‘ఏలూరులోనే స్థిరపడిపోయి ఉంటే, జీవితాంతం హెమింగ్వే, సాతర్లతో సతమతమవుతూ ఉండేవాడి’నని.

నారాయణ రావు మేడిసన్‌లో విస్కాన్సిన్ విశ్వవిద్యాలయానికి రావటం, డబ్ల్యూ. ఎచ్. ఆడెన్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా రావటం — ఈ ఇద్దరి రాకలకీ, సాహిత్య పరంగా కొన్ని పోలికలున్నాయి. ఆడెన్ ఆక్స్‌ఫర్డ్ వచ్చిన కొత్తలో అప్పటి సాహితీ రంగాన్ని పరిశీలించి చూశాడు. అతనికి అదేమీ సంతృప్తికరంగా కనిపించలేదు; కేవలం విశాలమైన ఖాళీ రంగస్థలం కనిపించింది. ‘ఎవరి రాక కోసమో ఎదురుచూస్తున్నట్టు ఆ రంగస్థలం కనిపించింది. అంతే. తాను ప్రధాన పాత్ర తీసుకున్నాడు.’ అని ఆడెన్ గురించి ఎక్కడో చదివాను. అంతే కాదు. అతనికి, అప్పటి క్రమబద్ధమైన సాహిత్య విమర్శ ఏదో అసంబద్ధంగా కనిపించింది. విమర్శ అనేది అచింతితమైన సాధారణ సంభాషణలా ఉండాలని అతని అభిప్రాయం.

నారాయణ రావు మేడిసన్ వచ్చేటప్పటికి తెలుగు గురించి, తెలుగు సాహిత్యం గురించీ పాశ్చాత్య దేశాల్లో సాహితీకారులకి, విశ్వవిద్యాలయాలలో పండితులకీ, ఆచార్యులకీ ఏమీ తెలియదు. తను ‘ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా, ప్రతిసారీ ఎనిమిది కోట్లమంది మాట్లాడే సజీవభాష తెలుగు; వెయ్యి సంవత్సరాల సాహిత్యం చరిత్ర ఉన్న దక్షిణభారత భాష తెలుగు, అని తెలుగేతరులకు చెప్పవలసి వచ్చేది,’ అని, బాధ వెలిబుచ్చుతూ రాశాడు.[4][5] అతను మేడిసన్ వచ్చేటప్పటికి, తెలుగు పరంగా పాశ్చాత్య దేశాలలో ఉన్న పరిస్థితి అది.

దక్షిణ భారత సాహిత్యాన్ని గురించి, ముఖ్యంగా తెలుగు సాహిత్యం గురించి అధికారికంగా చెప్పటానికి, విమర్శాత్మకంగా రాయటానికి నారాయణ రావుకి ఇక్కడ ఒక ఖాళీ కేన్వాస్ కనిపించింది; ఆడెన్‌కి ఆక్స్‌ఫర్డ్‌లో లాగా! ఇక పోతే, పాశ్చాత్యుల కోసమని ఇంగ్లీషులోకి అనువదించబడిన తెలుగు సాహిత్యం అసలే లేదు. విమర్శ గ్రంథాలు లేనే లేవు. పోనీ, తెలుగుభాషలో రాసినవి, చెప్పుకోదగ్గవీ, ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ప్రాచీన ప్రబంధ సాహిత్యంపై సహేతుకమైన నిష్పాక్షికమైన విమర్శ గ్రంధాలు ఏమీ లేవు. ఉన్న కొద్దిపాటి విమర్శ, వ్యాఖ్యానం, విక్టోరియన్ నీతులు ప్రమాణంగా శిరసావహించి ఇరవైవ శతాబ్ద ప్రథమార్ధంలో రాసినవి.

నేచెప్పిన ఖాళీ కేన్వాసు చాలా పెద్దది. వెయ్యేళ్ళ తెలుగు సారస్వతం అంతకన్నా మరింత పెద్దది. అందుచేత, కేన్వాసు నింపడం ఒక్కరి జీవితంలో జరిగే పని కాదు. అది అసాధ్యం. అందుచేత, ప్రామాణికమయిన కొన్నిముఖ్య గ్రంథాలను అనువదించటం, పరిచయం చెయ్యటం, తెలుగేతర పాఠకులకి బోధపడేట్టుగా వ్యాఖ్యానం చెయ్యటం నారాయణ రావు చేపట్టిన బృహత్కార్యక్రమం.


నారాయణ రావు, హైఫెట్జ్, శ్రీ కాళహస్తీశ్వర శతకానువాద[3] ప్రారంభంలో ‘అనువాద పద్ధతి పై,’ అని రాసిన ముందు వాక్యాలనుంచి క్రోడీకరిస్తాను.

ఈ అనువాదాలు తెలుగు మినహా ఇతర భారతీయ భాషలు ఆచారబద్ధంగా చదివిన ఒక అమెరికన్ రచయిత, చిన్నప్పుడు మౌఖికంగా ఈ పద్యాలు నేర్చిన ఒక తెలుగు రచయిత కలిసి చేసినవి. మా పద్ధతి మౌఖిక సాంప్రదాయ పద్దతికి దగ్గిరగా తీసుకొని వచ్చింది. నారాయణ రావు ఈ పద్యాలు తెలుగులో రాసి, సంప్రదాయపద్దతిలో చదవటం (పాడటం), తెలుగు మాటలకి వరసగా ఇంగ్లీషు అర్ధాలు రాయటం, హాన్క్ హైఫెట్జ్ ఆ ఇంగ్లీషు మాటలని పద్యంగా మలచటం — ఇదీ వరస. తరువాత, ప్రతి ‘పద్యం’ చదివి, ఇంగ్లీషు పదాల పొందికపై, అమరికపై చర్చించుకొని, ఆ పద్యం తెలుగులో మూలపద్య భావానికి ఎంత దగ్గిరగా వచ్చినదో ఇద్దరూ నిర్ధారించుకున్న తరువాత ముందుకు సాగటం జరిగింది. చిన్న చిన్న మార్పులు చెయ్యటం తరువాత జరిగినప్పటికీ, అనువాదం మొత్తం ముఖ్యంగా ‘ముఖాముఖీ’ సంభాషణల ద్వారానే పూర్తయ్యింది.

‘ఒక్కొక్క తెలుగు మాటకి, ఇంగ్లీషు అర్ధాలు రాయటం’ అని చదివిన తరువాత నాకు జోసెఫ్ బ్రాడ్‌స్కీ (Joseph Brodsky) రాసిన ఈ మాటలు గుర్తుకొచ్చాయి. “మనమందరమూ (అంటే కవిత్వం రాసే అందరూ అని అతని భావం) నిఘంటువుకి పని చేస్తాము.” అంటే అతని ఉద్దేశంలో, కవిత్వాధిదేవత (Muse) నీహారికలా కవి సన్నిధిలో కూర్చున్న ఒక స్త్రీ మూర్తి కాదు; పుటల అంచులు కుక్కచెవుల్లా వంకరతిరిగిపోయిన ఒక ‘పెద్ద పుస్తకం,’ అని. ఇది ఛలోక్తిగా పైకి కనిపించినా కఠోర నిజమని గుర్తించాలి.

ఒక భాషలో కవిత్వం రాసేటప్పుడు, కవి ఆ భాషకి సహజమైన జాతీయాలు ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటాడు. అయితే, ఈ జాతీయాలతో పేచీ లేకపోలేదు. ముఖ్యంగా, ఒక భాషనుంచి మరొక భాషలోకి అనువాదాలు చేసేటప్పుడు అనువాద భాషలోకి ఈ జాతీయాలు ఒక పట్టాన ఇమడవు. ఇది అనువాదకులందరినీ వేధించే సమస్యే. ప్రతీకలు, అలంకారాలూ అనువదించటం అంత కష్టం కాకపోవచ్చు. మూలభాషలో ఏ మంచి పద్యానికైనా శ్రుతి, సరసమైన శబ్దసంపద ఉంటాయన్నది నిర్వివాదం. అంటే, మాతృభాషలో ఒక కవిత చదివేటప్పుడు ఆ భాష తెలిసిన పాఠకుడికి వినిపించే శబ్ద మాధుర్యం, అనువాదం చదివేటప్పుడు లోపిస్తుంది. అందుకనే అనువాదకులు సాధ్యమైనంత వరకూ లయకి, యమకానికీ ప్రాధాన్యత ఇవ్వడం సహజంగా కనిపిస్తుంది. ఇది తెలుగు నుంచి ఇంగ్లీషు లోకి అనువదించేటప్పుడు మరీ ముఖ్యం అనిపిస్తుంది.

ఇప్పుడు, మచ్చుకి సురవీధీలిఖితాక్షరంబుల్… అని పైన ఉదహరించి పూర్తి పాఠం ఇచ్చిన పద్యం అనువాదం చూద్దాం.

Waves, trembling leaves,
Glittering mirrors, lamps
In a wind, the flickering
Ears of an elephant, vision after vision
Of imaginary water, firefly light,
Letters written on air, a single breath,
Rice balls made of the milk of moonlight –
Such is wealth.
Then why do men go blind with pride
About it,
O God of Kaalahasti?

ఇంగ్లీషు మాతృభాషగా వచ్చిన వ్యక్తికి ఇది కవితగా వినిపించాలి.

ఈ పుస్తకం వెనుకమాటలో నారాయణ రావు ధూర్జటి గురించి ప్రత్యేకంగా చెపుతూ, తెలుగు సాహిత్య చరిత్ర సంగ్రహంగా చెప్తాడు. ధూర్జటి అన్న పేరు సహజమైన తెలుగు పేరు కాదు. ధూర్జటి అంటే ‘బరువయిన జటలు కలవాడు,’ అని అర్థం. ధూర్జటి అన్న పేరు కవి వీరశైవమతం పుచ్చుకున్నప్పుడు శివునిపై గౌరవంతో మార్చుకున్న పేరు అయి ఉండవచ్చు. ఈ కవి తన పూర్వీకుల గురించి, తన కులం గురించీ ఎక్కడా చెప్పలేదు. ఈయన, కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకడనే ప్రాచీన కథ ఉన్నది. అయితే ఈ ‘అష్టదిగ్గజాలు’ అనబడే ఎనిమిదిమంది రాయలు కొలువులో ఉన్నారా అన్నదే ఒక ముఖ్యమైన ప్రశ్న.

ఈ శతకంలో చాలా భాగం దేవుని పొగడ్తల ప్రసంగాలే. అయితే, ఈ ప్రసంగాలలో మానసిక, తత్వజ్ఞాన సంబంధమైన జిజ్ఞాస, ఐహికసుఖాలు, భోగాసక్తుల ప్రసక్తి, మననం కనిపిస్తుంది. ధూర్జటి సామాజిక కవి (social poet). ఒక రకంగా ‘రాజకీయ’ కవి అని కూడా అనచ్చు. అప్పటి రాజకీయ వ్యవస్థాధికారాన్ని ఎదిరించిన వాడు. ఉదాహరణకి ‘రాజన్నంతనె బోవునా కృపయు… దుర్బీజ శ్రేష్ఠులుగా గతంబు కలదే…’ పద్యం చూడండి. అలాగే రాజులంటే అసహ్యత, ‘రాజై దుష్కృతి చెందె చందురుడు… నా రాజశబ్దంబు ఛీ! జన్మాంతరమందు నొల్లను జుమీ!…’ అన్న పద్యంలో స్పష్టంగా కనిపిస్తుంది.

వెనుక మాటలో నారాయణ రావు తెలుగు సాహిత్య చరిత్రలో కవికి, కవిపోషకుడైన రాజుకీ ఉన్న సంబంధం కాలానుగుణ్యంగా ఎట్లా మార్పు చెందుతూ వచ్చినదో వివరంగా రాస్తాడు. నన్నయ కాలంలో కవి, రాజుకి గురువు, రాజు కవికి శిష్యుడు. విజయనగర సామ్రాజ్య కాలంలో కవి, రాజు స్నేహితులు. నాయకరాజుల కాలం వచ్చేటప్పటికీ కవి రాజుకి గులాముగా తయారయ్యాడు. అది కాక, ఆస్థానకవులు, రాజుల పరస్పర ప్రశంసలతో సాహిత్యం వచ్చిన రోజుల్లోనే, దేవాలయాలతో సంబధం పెట్టుకున్న దేవాలయ కవులు కూడా వచ్చారు. ఈ చరిత్ర ఇంకా విశదంగా తెలుసుకోవాలనుకుంటే, ఈ ఆఖరి మాట పూర్తిగా చదవాలి.


నేను ప్రస్తావించే రెండవ అనువాదం, A poem at the right moment,[6] తెలుగు, సంసృత తమిళ చాటువుల అనువాదం. ఇంతకుముందు ఈ పుస్తకాన్ని స్థూలంగా నేను ఈమాటలో పరిచయం చేశాను. (కె.వి.యస్. రామారావు, సాయి బ్రహ్మానందం గొర్తి వేరువేరుగా పుస్తకం.నెట్‌లో ఈ పుస్తకం గురించి రాశారు.) ఈ పుస్తకం చాలా ప్రజాభిమానం పొందిన పుస్తకం! నేను నా పాత వ్యాసంలో కొన్ని అనువాదాలు కూడా ఉదహరించాను. ఇప్పటి ప్రస్తావనలో, ముఖ్యంగా వెనుకమాటలో విషయాల గురించి చెప్పదలచుకున్నాను. కారణం: చాటువుల గురించి పాతుకొని పోయిన పాత అభిప్రాయాలు మారుతాయన్న ఆశ. ఆ వ్యాసం నుంచి కొన్ని చాటువులు మళ్ళీ ఉదహరిస్తాను.

చాటువులకుండే లక్షణాలు ఏమిటి? చారిత్రకంగా వీటికి ఏదైనా విలువ, ప్రాముఖ్యత ఉన్నదా? చాటు పద్యాల కర్తృత్వ చర్చ చాటు సంప్రదాయ సంస్కృతికి ఏవిధంగా ఉపయోగిస్తుంది? ఇటువంటి ప్రశ్నలు ఈ పుస్తకపు మలిపలుకులో విస్తృతంగా చర్చించబడినాయి.

ముందుగా గుర్తు చేసుకోవలసిన విషయం: చాటుపద్యం పుస్తకంలో నిక్షిప్తంగా దాగి ఉండదు. చాటుపద్యాలు నిశ్శబ్దమైన వాతావరణంలో కూర్చొని చదువుకొనేవి కాదు. ఆ మాటకొస్తే ఏ పద్యమైనా సరే, మంచి పద్యమైతే, అది రసజ్ఞుల నాలికపైన, అనుభవజ్ఞుల స్మృతిలోనూ ఉంటుంది. ఈ సందర్భంలో బోర్హేస్ (Jorge Louis Borges) ప్రాచీన కవిత్వం గురించి అన్నమాటలు గుర్తుకొస్తున్నాయి: “మంచి కవిత్వం గట్టిగా పైకి చదవాలి. సన్నగా పైకి చదవబడటానికో, లేదా నిశ్శబ్దంగా లోపల లోపల చదువుకోవటానికో, మంచి పద్యం ‘ఒప్పుకోదు.’ కవిత్వం ముందుగా మౌఖిక కళ; అది పాట. ఆ తరువాతనే అది లిఖిత కళ అవుతుంది.”

చాటువుల విషయంలో ఇది తప్పనిసరిగా నిజం.

చాటుపద్యం తనంత తానుగా ఏకాకిగా నిలబడే పద్యం మాత్రమే కాదు. ప్రజల స్మృతిలో ఉండి, అంతర్గతంగా పొందిక కలిగి మౌఖికంగా చెలామణీ అవుతూ, దక్షిణ భారతదేశంలో, ఏదో ఒక చారిత్రక సమయంలో ఉద్భవించిన కవితలు చాటువులు, అని నిర్ధారణగా చెప్పవచ్చు. సాధారణంగా చాటు పద్యాలు ప్రఖ్యాత కవులకు ఆపాదించబడి ఉంటాయి. ఆ కవితో, ఆ చాటువుతో ఒక కథో, కొన్ని వేరువేరు కథలో ఉంటాయి. ఈ ఆరోపణల చుట్టూ ఒక విచిత్రమైన భాష్యం, విమర్శ ఉంటాయి. శ్రీనాథుడిదని ఆరోపించబడ్డ చాటువు చారిత్రకంగా మనమెరిగిన శ్రీనాథ కవిసార్వభౌముడు రాసినది కాకనే కాకపోవచ్చు. సాధారణంగా అది సత్యమే. ఆ చాటువు శ్రీనాథుడి శైలిలో, శ్రీనాథుడు వాడిన శబ్దసరణిలో చెప్పబడి ఉంటుంది. ఆ చాటువు శ్రీనాథుడి జీవితం, ఆయన కవితాలక్షణాలు, విశదపరిచే వ్యాఖ్య అవుతుంది. అయితే, మరొక్క విషయం. శ్రీనాథుడే శ్రీనాథుడి శైలిలో చాటువు చెప్పి ఉండడానికి కూడా అవకాశం ఉన్నది. ఈ సందర్భంలో మయకోవిస్కి (Vladimir Mayakovsky), యాకొబ్‌సన్‌ల (Roman Jakobson) కథ చెప్పటం అనుచితం కాదు. ఒకసారి మయకోవిస్కి కొన్ని కొత్త పద్యాలు రాసి యాకొబ్‌సన్‌ కిచ్చాడు. కొద్దిరోజులు పోయిన తరువాత, మయకోవిస్కీ యాకొబ్ సన్ దగ్గిరకు వచ్చి, ‘కవితలు నచ్చాయా?’ అని అడిగాడట! ‘ చాలా బాగున్నాయి. కాని, మయకోవిస్కి కవితలంత బాగా లేవు,’ అని యాకొబ్‌సన్‌ చెప్పాడట!

చాటు సంస్కృతీ సంప్రదాయంలో కాలక్రమానుగత చరిత్ర మటుమాయమవుతుంది. ఉదాహరణకి మధ్యయుగ సంస్కృత (చాటు) సంప్రదాయంలో కాళిదాసు (నాలుగవ శతాబ్దం) భవభూతి (ఎనిమిదవ శతాబ్దం) భోజుని కొలువులో కవులు! కాళిదాసు, భవభూతి, వీరిద్దరిమధ్య ‘ఎవరు గొప్పకవి,’ అని నిర్ధారణ పేరుతో ఉన్న కథలు చాటు సంప్రదాయంలో నలుగురి నోళ్ళల్లోనూ నలిగి పడి ఉన్నాయి. ఈ కథల్లో వైచిత్రి ఏమిటంటే, ఒక్కొక్కసారి, దైవిక జోక్యం కూడా ఉంటుంది. కాళిదాసు, భవభూతి మధ్య ఎవరు గొప్పకవి అని వచ్చిన వాదన సరస్వతి జోక్యంతో సద్దు మణగడం ఒక అద్భుతమైన కథ. వీళ్ళిద్దరి మధ్యా వైరుధ్యం ఉన్నట్టి కథలే కాదు; ఒకరిని ఒకరు సంప్రదించుకున్న కథ కూడా చాటు సంప్రదాయంలో ఉన్న ప్రఖ్యాతమైన కథ. భవభూతి రాసిన ఉత్తరరామచరిత్ర అంతా విని, కాళిదాసు ‘కావ్యం మొత్తంలో ఒకే ఒక్క ‘సున్న’ ఎక్కువయిందని — ఏవ, ఏవం కథ అందరికీ తెలిసినదే! అందులోనూ, కాళిదాసు తెలుగులో తమలపాకులో సున్నం ఎక్కువైనదని అన్నమాట, సంస్కృత శ్లోకంలో సున్నకి సరిగ్గా సరిపడటం చాటు సాంప్రదాయ విచిత్రం!

విజయనగర సామ్రాజ్య కాలంలో, ముఖ్యంగా కృష్ణ దేవరాయల ఆస్థానంలో కూడా అష్టదిగ్గజాలు ఉన్నట్టుగా ఆ కవులకు ఆపాదించిన చాటువులు, తెలుగు వారికి తెలియనివి కావు. తెనాలి రామలింగడని ఒకణ్ణి తెలుగు వాళ్ళు సృష్టించుకోవడం, అతని చుట్టూ ఎన్నోకథలు, చాటువులూ చెప్పుకోవడం పరిపాటే.

తమిళ చాటు సంప్రదాయంలో నత్కీరుడి కథలో, నత్కీరుడు శివుడు రాసిన పద్యాన్నే హేళన చేసి నానా అగచాట్లూ పడ్డట్టు చాటుకథ. ఇక్కడ దేవుడితో వైరం! తెలుగులో మనకి పోతన గురించి చాటువులు, వాటి చుట్టూ అల్లిన కథలూ ఉన్నాయి. పోతనకి ఆపాదించిన ఒక చాటువు, నేను చిన్నప్పుడు, మౌఖికంగా నేర్చుకున్న చాటువు మళ్ళీ ఉదహరిస్తాను.

కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ
హాటకగర్భురాణి! నిను ఆకటికై కొనిపోయి అల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ

శ్రీనాథుడు పోతనకి, ఎందుకయ్యా మడి దున్నుకొని ఇన్ని కష్టాలు పడతావు? హాయిగా “కమ్మని గ్రంథం బొక్కటి ఇమ్ముగ ఏ నృపతికైన కృతి ఇచ్చిన కై కొమ్మని ఈ యరె అర్థం బిమ్మహి దున్నంగ నేల ఇట్టి మహాత్ముల్?” అని సలహా ఇచ్చాడనీ, ఆ రోజు రాత్రి సరస్వతీదేవి పోతన కలలోకి వచ్చి కంట నీరు పెట్టుకున్నదనీ, ఆమెను ఓదారుస్తూ పైపద్యం చెప్పాడనీ చాటుకథ. శ్రీనాథుడు, పోతన సమకాలికుడవునో కాదో, వీళ్ళిద్దరికీ బాంధవ్యం ఉన్నదో లేదో అన్న ‘చారిత్రక’ చర్చ చాటు సంప్రదాయానికి శుద్ధ అనవసరం.

ఇంకొక కథ, గజేంద్రమోక్షం లోనిది. పోతన ‘అల వైకుంఠ పురంబులో…’ అని రెండు మాటలూ రాసి, తరువాత పద్యం ఎలాగ పూర్తి చెయ్యాలో బోధపడక గంటము, తాళపత్రాలు పదిలిపెట్టి బయటికి పోయడట! అప్పుడు, విష్ణువే పోతన రూపంలో వచ్చి, పద్యం పూరించాడు. కొద్ది సేపటి తరువాత నిజం పోతన తిరిగి వచ్చి, ‘అరె! ఎవరు ఈ పద్యాన్ని పూర్తిచేశారు?’ అని ఆశ్చర్యపోతూ వుంటే, పోతన కూతురు ‘నీవే కదా! మరిచిపోయావా?’ అని అడిగిందని చాటు కథ. ఒక కథలో దేవుడితో వైరం; మరొక కథలో దేవుడి సహకారం!

పరపూరిత కవిత గురించి: ‘మృదుతల్పంబు వికార లీల దిగి…’ పెద్దనకి ఆపాదించబడిన పద్యం. ఆఖరి చరణం పెద్దన కూతురు పూర్తిచేసిందని ఒక కథ. నేను మౌఖికంగా విన్న కథ వేరు! ఒకే చాటువు చుట్టూరా, వేరువేరు కథలుండవచ్చును కదా! ‘పరపూరిత’ కవిత గురించి మహాభారత పరంగా ప్రసిద్ధి కెక్కిన నన్నయ, ‘శారద రాత్రులుజ్జ్వల…’ పద్యానికి సంబంధించినది. ఈ పద్యం పూర్తిపాఠం:

శారదరాత్రు లుజ్జ్వలసత్తరతారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో
దారసమీరసౌరభము తాల్చి సుధాంశువికీర్యమాణ క
ర్పూర పరాగపాండురుచిపూరము లంబరపూరితంబులై

పద్యం ఆఖరి చరణంలో చిన్నసంధి మార్పుతో ‘పరపూరితంబులై,’ అన్న మాటలు చాటు సంప్రదాయం లోకి వచ్చాయి. నన్నయకి ‘ఇదే తన ఆఖరి పద్యం,’ అని తెలుసునని, ఇతరులు మిగిలిన భాగాలు పూరిస్తారు అని చాటు కథ. (పాండురుచిపూరములున్ + పరపూరితంబులై, అని)

చాటువులు జనాలలో చెలామణీ చేసిన వాళ్ళు, ఒకే భాషకి పరిమితం కాలేదు. చాటువులు ఒక భాష నుంచి మరొక భాష లోకి సునాయాసంగా పోయాయి; వాటి కథలతో పాటు. అప్పట్లో ప్రాంతీయ భాషల నుంచి సంస్కృతం అప్పు తెచ్చుకొని ఉండవచ్చు. సంస్కృతంలో చాటువులు భోజప్రబంధ అన్న గ్రంధంలో ఉండటం, చాటుసంప్రదాయానికి ప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. అందులోని చాటువులు ఓరుగల్లు ప్రాంతంతో ముడిపడటం, తెలుగువారికి మరింత గర్వదాయకం!

సాహిత్య ‘చరిత్రకారులు,’ చాటువుల చుట్టూ ఉన్న కథలు చూసి, ఇవన్నీ నమ్మశక్యం కాని పుక్కిట పురాణాలని తోసిపుచ్చటం పరిపాటి అయ్యింది. అంతే కాదు; చాటు పద్యాలని సేకరించి పండితులు వీటిలో ‘దోషాలని’ నిషేధించి ప్రచురించారు. ముఖ్యంగా శ్రీనాథుడివని ఆరోపించిన చాటువులని పరిష్కరించారు. శ్రీనాథుడి కవితా ప్రతిభకి ఇవి కళంకం అని వాళ్ళు ఊహించి ఈ పని చేశారు. చాటు సంప్రదాయానికి దానిదైన ప్రత్యేకత ఉన్నది. ఎవరు, ఎప్పుడు, ఏ సంవత్సరంలో, ఫలానా చాటువు(లు) రాశారు? అని, అనుభవ పూర్వక చరిత్ర కోసం ప్రయత్నించడం కొంచెం హాస్యాస్పదంగా కనపడుతుంది. అచ్చుయంత్రం వచ్చిన తరువాత కూడా, ఈ సంప్రదాయం మరొక విధంగా కొనసాగుతూనే ఉన్నది. ఉదాహరణకి, తిరుపతి వెంకట కవుల పేరున ఎన్నో చాటువులున్నాయి. వాటి చుట్టూ సజావయిన కథలూ ఉన్నాయి. మచ్చుకి ఒకటి:

సమస్యా పూరణకి ఇచ్చిన నాల్గవపాదం. ‘మా కులదాస యెంత యభిమానము లేదుర చంద్రశేఖరా!’ ఈ సమస్యా పూరణ వెనుక ఉన్న కథతో ఇది చాటు సంప్రదాయం లోకి వచ్చింది. పూర్తి పద్యం:

నాకు విభూది రాయఁడొక నాయకుఁడా” యని నీదు భార్య ర
త్నాకరు చెట్టవట్టు టది యారసి యుండియు, సిగ్గులేక ర
త్నాకరుఁ జంకఁ బెట్టికొని యక్కులటన్ దలఁ దాల్చి తౌర! భా
మాకులదాస! యెంత యభిమానము లేదుర! చంద్రశేఖరా!

(ఈ పద్యం నేను చాటుపద్యసంపుటము, శ్రీతిరుపతివేంకటీయము, 1957 నుంచి తీసుకున్నాను. పరిచయం చేస్తున్న సంకలనంలో పద్యానికి, దీనికీ కొద్ది భేదం ఉన్నది – వేవే)

ఆ ఊరిలో చంద్రశేఖరుడనే అతను ఉండటం, అతని భార్య ఆ ఊరిలో ఒక ధనికునితో అక్రమ సంబధం పెట్టుకోవటం, ఆ పెద్దమనిషికి తెలిసి కూడా ఉరకనే ఉండటం — పురాణకథలో శివుడు గంగని నెత్తిన పెట్టుకోవడంతో పోల్చి, ఆ ఊరి చంద్రశేఖరుడి కథ బట్టబయలు చేయడంతో సమస్యా పూరణ పద్యం చాటు సంప్రదాయంలోకి వచ్చింది.

ఆఖరిగా మరొక్కసారి చాటువుల గురించి పునరావృతి అవసరం. పాశ్చాత్య విద్యాప్రభావం తెచ్చిపెట్టిన ‘పరిశోధన’ సంకెళ్ళు తెంచుకోలేని మన ఆథునిక పండితులు, అర్థరహితమైన ప్రశ్నలు అడగటం నేర్చుకున్నారు. చాటుకవుల చారిత్రకత, అప్పటి రాజుల శృంగారం వంటి ప్రశ్నలతో సతమతమవుతూ, ఒక సజీవ సంప్రదాయం, మన సంస్కృతికిచ్చిన వైభవాన్ని మరిచిపోయారు.

ఈ సందర్భంగా నాకు బాబ్ డిలన్ పాడిన ఒక పాత పాట, Desolation row, గుర్తుకొస్తున్నది:

And Ezra Pound and T. S. Eliot
Fighting in the captain’s tower
While calypso singers laugh at them
And fishermen hold flowers


ఈ వ్యాసంలో ముందుగానే చాటువుల ప్రసక్తి తేవడానికి ముఖ్య కారణం, శ్రీనాథుడి గురించి, శ్రీనాథుని పుస్తకాల గురించీ మాట్లాడటానికే! ఒక తెలుగు మహాకవి సాహితీ చరిత్ర, ఇంగ్లీషులోకి రావడం మొట్ట మొదటి సారి జరిగింది. అది శ్రీనాథుని సాహితీ ఆత్మకథ[7] అనవచ్చు. ఈ పుస్తకం గురించి ప్రస్తావించ బోయేముందు ‘చరిత్ర’ అంటే ఏమిటి? పూర్వం, పాశ్చాత్య సాహిత్యపరంగా ‘చరిత్ర’ స్థానం ఎటువంటిది? ఏ విధమైన అవగాహన ఉండేది? అని ప్రశ్నించుకోవడం అవసరమని నా అభిప్రాయం.

ఒక పుస్తకం చరిత్ర పుస్తకం ఎప్పుడవుతుంది? 18వ శతాబ్దంలో నవలాకారులు వాళ్ళ పుస్తకాలను ‘చరిత్రలు’ అని మొదటి టైటిల్ పేజీ మీదే రాసుకునే వారు. హెన్రీ ఫీల్డింగ్ 1749లో తన నవల History of Tom Jones, A Foundlingలో తన కలం నుంచి వచ్చినది ‘నిజమైన చరిత్ర’ అని రాయటమే కాకుండా, చరిత్రకారులు రాసినది ‘కాల్పనిక కథ’ అని కూడా అన్నాడు. బహుశా, ఫీల్డింగ్ వేళాకోళం చేస్తూ వుండచ్చు.

నవల అనే జాన్ర (Genre) 18వ శతాబ్దంలో పుట్టింది. చరిత్ర అనేది ఒక అనుభవసిద్ధ శాస్త్రంగా 16వ శతాబ్దంలో మొదలయి 19వ శతాబ్దంలో సురక్షితంగా పాదుకొన్నదని చెప్పవచ్చు. అయితే 1834 – 1874 మధ్యలో జార్జ్ బాన్క్రాఫ్ట్ (George Bancroft) అనే అమెరికన్ రాజ్యాంగవేత్త పది భాగాల ‘అమెరికన్ చరిత్ర’ అనే పెద్ద పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని ఇప్పుడు చారిత్రక సత్యానికి చేసిన ద్రోహంగా పరిగణిస్తారు, చారిత్రకపరిశోధకులు. ఎందుకంటే, ఆ పుస్తకం ఒక కాల్పనిక కథగా, స్వబుద్ధి పక్షపాత సాహిత్యంగా రుజువు కావడమే కారణం.

18వ శతాబ్దంలో నవలలు రాసిన వాళ్ళే ‘చరిత్ర’ కూడా రాశారు. ఉదాహరణకి, వోల్తేర్, ఫీల్డింగ్, డేనియల్ డెఫో, విలియమ్ గోడ్విన్ మొదలైన వాళ్ళు. హ్యూమ్ (David Hume) ఉద్దేశంలో ఒకే పుస్తకాన్ని చరిత్ర గాను, కల్పన గానూ చదవవచ్చు. అతన్ని ఒక అందమైన అమ్మాయి, నవలలు పంపమని కోరితే, ఆ అమ్మాయికి ప్లూటార్క్’స్ లైవ్స్ (Plutarch’s Lives) పంపిస్తూ “ఇందులో ఒక్క మాట కూడా ‘చారిత్రక సత్యం’ కాదు,” అని చెప్పాడట! అలెగ్జాండర్, సీజర్ల విషయాలు పుస్తకంలో చదవగానే, ఆ అమ్మాయి హ్యూమ్‌ని ‘నువ్వు నన్ను మోసం చేసావని’ తిడుతూ ఆ పుస్తకం తిరిగి ఇచ్చిందట! నిజం చెప్పాలంటే, ప్లూటార్క్’స్ లైవ్స్ కాల్పనిక సాహిత్యంగా అద్భుతం అని, చరిత్ర పుస్తకంగా భరించరానిదనీ అంటారు.

గాడ్విన్ ఉద్దేశంలో నిజమైన చరిత్ర ఎప్పుడూ ఎక్కడా ఉండదు. వాస్తవ్యానికి సాక్ష్యం ఎప్పుడూ అసంతృప్తికరం గాను, అనిశ్చితం గానూ, వైరుధ్యాలతో నిండి ఉంటుంది. ప్రతి చరిత్రా అసంపూర్ణం. ప్రతి చరిత్రకారుడికీ తన దృక్పథం ఉంటుంది, అని అంటాడు గాడ్విన్. నిజం చెప్పాలంటే అద్భుతమైన చరిత్ర నవలలో ఉంటుంది, అని అతని అభిప్రాయం. ఎప్పుడో 1797లో రాసిన అతని వ్యాసం 20వ శతాబ్దం వరకూ అచ్చు కాలేదు! ఉత్తరాధునిక సాహితీవేత్తలు అన్నట్టుగా, ‘గతం అనేది మనం చెప్పుకునే కథ మాత్రమే,’ అయితే, మరి చరిత్ర అంటే ఏమిటి? (ఇంకా నిశితమైన విమర్శ, చరిత్ర గురించి హేళన, మరికొన్ని వివరణలూ కావాలంటే, Jill Lepore వ్రాసిన, Just The Facts, Ma’am, The New Yorker, March 24, 2008 చదవండి.)

ఇక్కడ నారాయణ రావు ఒకసారి అన్న వాక్యాలు, ‘వాస్తవాలు అని ఎంచబడ్డ వాటికి రూపాంతరాలుంటాయి; కాల్పనికకథలు నిర్దిష్టమైనవి,’ తిరిగి చెప్పడం అవసరం. ఈ వాక్యం మొట్టమొదటి సారి చదివినప్పుడు, నాకు ఈ కింది కథ గుర్తుకొచ్చింది. ఇదీ ఆ పిట్టకథ:

వాల్టర్ ర్యాలీ (Walter Raleigh) అనే ఒక రచయితని ఇంగ్లండులో జైలులో పడేసినప్పుడు అతను తీరిగ్గా జైలులో కూర్చోని ప్రపంచ చరిత్ర రాద్దామనుకున్నాడు. ఒక రోజున కిటికీ లోంచి జైలు బయట జరిగిన కొట్లాట చూసి వార్డెన్‌ని అడిగాడు, ఏమిటీ అని. అతనొక కథ చెప్పాడు. తనతో జైలులో ఉన్న ఇతర ఖైదీలని అడిగాడు, వాస్తవం తెలుసుకోడానికి! ఒక్కక్కడూ ఒక్కక్క కథ చెప్పాడు, ఈ కొట్లాట గురించి. అంతే! ప్రపంచ చరిత్ర రాయడం మానుకున్నాడట! కారణం? తాను కళ్ళారా చూశాననుకున్నదే రకరకాల వ్యాఖ్యానాలతో వస్తే, తను ఎరగని విషయాలు నిర్దిష్టంగా ఎలా రాయగలడు?

బహుశా ప్రాచీన సాహిత్యం జాగ్రత్తగా వేరొక దృక్పథం నుంచి చదివితే, చరిత్ర రాయటం సాధ్యమవుతుందేమో! దక్షిణ భారత చరిత్రకి సంబంధించి రెండు పుస్తకాలు Textures of Time, Symbols of Substance అవి జాగ్రత్తగా చదివితే, చరిత్ర రచనపై మన అవగాహన మారవచ్చు.

ఇప్పుడు కవిసార్వభౌముడు శ్రీనాథుడి పై పుస్తకం గురించి చెప్పుకుందాం.

ఎవరీ శ్రీనాథుడు? ఏమాకథ? తెలుగుదేశ జనబాహుళ్యానికి శ్రీనాథుడు ప్రసిద్ధికెక్కిన చాటుకవిగా పరిచయస్తుడు. చాటువు శ్రీనాథుడు, కవిసార్వభౌముడిగా, డిండిభట్టు కంచుఢక్క బద్దలు కొట్టిన మహా కవి, పండితుడిగా పేరెక్కిన శ్రీనాథుడు, ఒకరేనా కారా అన్న ప్రశ్న నేను అడగను! కారణం చెప్పనవసరం లేదనుకుంటాను.

దక్షిణ ఆసియా సాహిత్య సంప్రదాయంలో మార్పు తెచ్చిన కవుల గురించి, వారి పుస్తకాల గురించి, వారి జీవనశైలి గురించీ పుస్తకాలు లేనే లేవు. భారత సాహిత్య చరిత్రలో అత్యున్నత స్థాయికి చెందిన కవుల్లో ఒకడని తప్పక చెప్పి తీరవలసిన కవి, తెలుగుకవి శ్రీనాథుడు. కోస్తా ఆంధ్రదేశంలో (1370 – 1450) పుట్టి, అద్భుతమైన ఐదు గ్రంధాలు (శృంగార నైషధము, భీమేశ్వర పురాణం అనే భీమఖండము, కాశీఖండము, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము — ఈ ఐదు గ్రంథాలే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి) తెలుగు వారికిచ్చాడు. ఈ పుస్తకం అతని సాహిత్య జీవిత కథనం. ఒక కవి జీవనశైలికి, సాహితీ ప్రత్యేకతకీ ప్రతిబింబం అని చెప్పదగ్గ పుస్తకం ఈ పుస్తకం.

ఎవరీ శ్రీనాథుడు? అన్న ప్రశ్నకి శ్రీనాథుడే తన ఆఖరి(?) కావ్యం శ్రీ కాశీఖండములో ‘ఆత్మ కథ’ అనబడదగు సీసపద్యంలో చెప్పుకున్నాడు:

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటి నాఁడు
       రచియించితి మరుత్తరాట్చరిత్ర
నూనూఁగు మీసాల నూత్న యౌవనమున
       శాలివాహన సప్తశతి నొడివితి
సంతరించితి నిండు జవ్వనంబున యందు
       హర్షనైషధ కావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయః పరిపాకమునఁ గొని
       యాడితి భీమనాయకుని మహిమఁ

బ్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మను మహాగ్రంథమేను
దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశ కటక
పద్మవనహేళి శ్రీనాథభట్ట సుకవి.

మొదట చెప్పిన రెండు పుస్తకాలు ఇప్పుడు దొరకటల్లేదు. శ్రీహర్షుడు సంస్కృతంలో రాసిన నైషధకావ్యం శ్రీనాథుడు తెనుగు చేశాడు. అది లభ్యం. శ్రీహర్షూడి నైషధకావ్యం ‘విద్వదౌషధం’ అంటారు. అంటే పండితులకున్న వ్యాధులన్నీ పోగొట్టుతుందని భావం. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణగారి వ్యాఖ్యానం మహ సరసంగా ఉంది. పండితులకున్న ఒక వ్యాధి, ‘తమకు సర్వమూ తెలుసునన్నది.’ ఆ వ్యాధి దుమ్ము దులిపేది, శ్రీహర్షుని నైషధం!

హర్షుడి సంస్కృతం చాలా కఠినమైనదని, ఆయన శబ్దసరణి ఇంతకు ముందు ఎవరూ వాడనిదనీ అంటారు. అటువంటి కష్టమైన గ్రంధాన్ని, శ్రీనాథుడు తనకు ‘నిండు యవ్వనం’ రాగానే తెనుగు చేశాడు. తాను తెనుగు చేసిన ‘శృంగార నైషధము’ గురించి సంస్కృత పండితుల హేళన చెప్పటం అనుచితం కాదు. శ్రీనాథుడు హర్షుడు వాడిన దుర్లభ సంస్కృత నామవాచకాల చివర తెలుగు ప్రత్యయాలు (డు, ము, వు, లు) తగిలించి వాటిని ‘తెనుగు’ మాటలుగా తయారు చేశాడని, ‘నీ డు, ము, వు, లు, నువ్వు తీసుకొని మా హర్షనైషధం మాకు తిరిగి ఇచ్చెయ్యి’ అని వేళాకోళం చేశారట! మరో పిట్టకథ:

నైషధం కథ పాత కథే! నలదమయంతి కథ. ఇందులో రాజహంస తను దమయంతిని చూచిన విషయం చెపుతున్నప్పుడు పద్యం:

కమలేందీవర షండ మండిత లసత్కాసార సేవారతిన్
గమికర్మీకృతనైకనీ వృతుఁడనై కంటిన్ విదర్భంబునన్
రమణిం బల్లవపాణిఁ బద్మనయనన్ రాకేందు బింబాననన్
సమపీనస్తని నస్తి నాస్తి విచికిత్సా హేతు శాతోదరిన్

శ్రీహర్షుడి సంస్కృత నైషధంలోని శ్లోకం:

సరసీః పరిశీలితుమ్ మయా గమికర్మీకృతనైకనీవృతా
అతిథిత్వమ్ అనాయి సాద్రోసోః సదసత్సంశయగోచరోదరీ

‘గమికర్మీకృతనైకనీవృతా,’ అన్నపదబంధం గురించి పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు శ్రీనాథుడిని, ఆ సంస్కృత పదబంధం ఎట్లాగ తెలుగు చేశావు? అని అడిగాడట. శ్రీనాథుడు, ‘గమికర్మీకృత నైకనీవృతుడనై,’ అని తెనుగు చేశానని చెప్పాడట! ఆఖరి పాదంలో హంస దమయంతి నడుము గురించి చమత్కారంగా చెప్పుతున్నది. ‘ఒక్కక్షణం, ఆమె నడుము చూశాను; ఖచ్చితంగా చెప్పలేను, నడుము ఉన్నదో లేదో, మరి!’ అని.

శృంగార నైషధము తెలుగు పంచకావ్యాలలో ఐదవది. సంస్కృతంనుంచి తెలుగు చేయబడ్డ కావ్యం ఇది ఒక్కటే! ఆ తెనుగు చేసిన ఘనత, శ్రీనాథుడిదే! శ్రీనాథుడు తెనుగు చేయడంలో కొంత స్వతంత్రించినాడు. కొన్ని భాగాలు అనౌచిత్యములని వదిలి పెట్టాడు. కొన్ని చోట్ల హెచ్చు చేశాడు. శ్రీనాథుడు యెంత గడుసువాడో భీమఖండములో ఈ పద్యం చదివితే బోధ పడుతుంది.

హరచూడాహరిణాంక వక్రతయు కల్పాంతఃస్ఫురచ్చండికా
పరుషోద్గాఢపయోధరస్ఫుటతటీపర్యంత కాఠిన్యమున్
సరసత్వంబును సంభవించెననగా సత్కావ్యముల్ దిక్కులన్
చిరకాలంబు నటించుచుండు కవిరాజీరత్నగేహంబులన్

కవిత ఎల్లా వుండాలో చెపుతున్నాడు: కఠినత్వం, కాస్త వక్రత కలిసిన కమ్మదనం వుండాలి. తన కవిత్వానికి ఈ లక్షణాలున్నాయని ఘంటాపథంగా, ధైర్యంగా చెప్పగలిగిన కవి శ్రీనాథుడు.

శ్రీనాథుడి ఒక చాటువులో తన కవిత్వం గురించి ఇలా చెపుతాడు:

పంపావిరూపాక్ష బహు జటా జూటికా రగ్వధ ప్రసవ సౌరభ్యములకు,
తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమ ఘుమారంభములకు,
కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షా లతా ఫల స్తబకములకు,
కర్ణాట కామినీ కర్ణ హాటక రత్నతాటంక యుగ ధాళ ధళ్యములకు,

నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత
తెలుగునను, సంస్కృతబునఁ బలుక నేర్తు,
ప్రౌఢదేవేంద్ర రాయ భూపాలవరుని
సమ్ముఖంబున దయచూడ ముమ్మ సుకవి!

తెలుగులోను, సంస్కృతంలోనూ తను చెప్పగలిగే కవిత్వం లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు, పై కవితలో.

శ్రీనాథుడు కరణాలకి, చిన్న చిన్న మంత్రులకి తన గ్రంధాలని అంకితం ఇచ్చి, వాళ్ళకి ఎనలేని కీర్తి సంపాదించి పెట్టాడు. కాశీఖండం మాత్రం ఒక పెద్ద రాజుకి అంకితం ఇచ్చాడు, ఆఖరి రోజులలో! అందుకనే కాబోలు, The Poet who made gods and kings అని ఈ శ్రీనాథసాహితీ జీవిత చరిత్ర గ్రంధానికి సముచితమైన టైటిల్ పెట్టారు. భీమఖండంలో గోదావరి డెల్టా మండలంలో దాక్షారామంలో శివుని పురాణకథలు చెప్పాడు. కాశీఖండంలో ఉత్తరకాశీ కథ (ఇప్పటి బెనారస్), శివుడి కథ చెప్పాడు. హరవిలాసములో ఎన్నో శివుని కథలు, చిరుతొండనంబితో (తమిళంలో కూడా ఉన్న కథ) మొదలుపెట్టి, శివుని నీలకంఠహేతువు కథ అతి సుందరంగా చెప్పాడు. పుస్తకం పేరులో దేవుళ్ళని కలిపిన కారణం ఇదే కావచ్చు.

మహదేవుడు కథ చెప్పడానికి సుముఖుడై ఉన్నాడని, అతని ‘ఇంగితంబెఱింగి,’ పార్వతి అడుగుతున్నది:

అభవ! నీ కంఠ మూలంబునందుఁ దెలిసి
కాననయ్యెడు నిది యేమి కప్పు? సెప్పు
మఖిల లోక విలోచ నాహ్లాద కలన
కందమై యందమయ్యె శృంగార రేఖ.

ఆనతిమ్ము మహదేవ! యభవ! నీదు
కంఠమూలము నలుపైన కారణంబు
నన్ను మన్నించి ఈ కారణంబు నాకు
నానతీఁ దగు నీకు లోకాభి వంద్య!

అలాగని, పార్వతి అడగంగానే, శివుడి చేత శ్రీనాథుడు మొత్తం కథ మనకి మొట్టమొదటిసారి వింటున్నట్టుగా చెప్పిస్తాడు. అందరికీ తెలిసిన కథే! అయినా ఈ కథ హరవిలాసంలో చదువుతే మొట్టమొదటిసారి ‘వింటున్న’ భావం కలుగుతుంది. వస్తువు పాతదే! చెప్పే విధానం సరి కొత్తది; అందమైనది. ఒక రకంగా, శ్రీనాథుడు తెలుగులో చిన్నకథకి అంకురార్పణ చేశాడని చెప్పవచ్చు. కాదు. ‘కాల్పనికసాహిత్యా’నికి పునాది వేశాడని అనవచ్చు. పార్వతికి తెలియదా, శివుని గరళకంఠం, ఆయన గొంతుపై అందమైన నలుపు? శివునిలో సగశరీరం ఆవిడదే కదా! కథ, అడగడంలోని లాలిత్యం, సౌమ్యత; కథ చెప్పించడంలో చమత్కారం! అవి కొత్తదనాన్ని చూపిస్తున్నాయి. శ్రీనాథుడు మౌఖిక సాహిత్యానికి, లిఖిత సాహిత్యానికీ వంతెన వేసి, తరువాత 16వ శతాబ్దంలో రాబోయే ప్రబంధకవులకి సుగమమైన కవితామార్గం, ఒక వరవడి, చూపించాడని చెప్పవచ్చు.

శ్రీనాథుడి ఐదు పుస్తకాలూ అనువాదంలో వివరంగా చర్చించబడ్డాయి. ఆ పుస్తకాల వెనుక ‘చారిత్రక’ కథలు రమ్యంగా చెప్పబడ్డాయి. శ్రీనాథుడి చాటువులపై చివరి భాగంలో ఒక చిన్న వ్యాఖ్యాన వ్యాసం కూడా ఉన్నది. నిజం చెప్పాలంటే, ఈ ఒక్క పుస్తకాన్నీ వేరుగా సమీక్ష చెయ్యవలసిన అవసరం ఉన్నది.


ఇక్కడితో శ్రీనాథుడిని వదిలి క్రీడాభిరామము[8] అనువాదం గురించి మాట్లాడుకుందాం.

శ్రీనాథుడిని వదిలి పెడదామనుకున్నా శ్రీనాథుడు మనలని వదిలి పెట్టద్దూ? చాలా కాలం పాటు, ఎంతోమంది తెలుగు సాహితీ వేత్తలు, క్రీడాభిరామము శ్రీనాథుడు రాసినదే అని చెబుతూ వచ్చారు. అప్పట్లో, ఈ పుస్తకంపై పండితులు చేసిన తర్జన భర్జనలు, ముఖ్యంగా కర్తృత్వంపై ఇంకే పుస్తకం పైనా రాలేదు. కాశీఖండము, హరవిలాసము, భీమఖండము, శృంగార నైషధము రాసిన మహా పండితుడు, కవిసార్వభౌముడు ‘ఇటువంటి చెత్త పుస్తకం,’ రాస్తాడా అని సంశయించిన సాహితీవేత్తలు లేకపోలేదు.

ఇప్పుడు, క్రీడాభిరామము శ్రీనాథుడి శైలికి హాస్యానుకరణంగా (Caricature), లేదా వ్యంగానుకరణంగా (Parody) ప్రసిద్ధికెక్కిన వీధి నాటకం అని ధ్రువపడింది.

హాస్యానుకరణం అనే ప్రక్రియ గురించి మూడు మాటలు చెప్తాను. పేరడీ ఒక సాహిత్య ప్రక్రియ అని అరిస్టాటిల్ మొదటగా గుర్తించాడు. ఛాసర్ (Geoffrey Chaucer) కాలం నుంచీ ఇంగ్లీషులో పేరడీకి ఉదాహరణలు అక్కడక్కడ కనిపిస్తాయి. కాని, 19వ శతాబ్దం, ఆ తరువాత కాలంలోనే ఈ హాస్యానుకరణం ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా నిలదొక్కుకున్నది అని పాశ్చాత్య సాహిత్య చరిత్రకారులు చెప్పుతారు. ఈ సందర్భంలో, క్రీడాభిరామము ‘కావ్య’పరంగా మనం గర్వించదగ్గ విషయం — మన సాహిత్యంలో ఈ ప్రక్రియ 15వ శతాబ్ద ప్రారంభంలోనే ఉన్నదన్న మాట!

మూలగ్రంథం బాగా తెలిసినప్పుడే, అంటే మూలగ్రంధం లోని కవితలకున్న సూక్ష్మత తెలిసినప్పుడే, పేరడీ రక్తి కడుతుంది. మూల గ్రంధంలో కవితలో గంభీరత ఉంటే, ఆ గంభీరతని గంభీరంగా ఎగతాళి చెయ్యటం, పేరడీ ముఖ్య లక్షణం. పేరడీ మూలగ్రంథంపై అసూయతో చెయ్యవచ్చు; అభిమానం, గౌరవం, వాత్సల్యంతో చెయ్యవచ్చు. వల్లభరాయుడికి శ్రీనాథుడంటే గౌరవం. హాస్యానుకరణం అతి చాకచక్యంగా చేశాడు. (మొత్తం 295 పద్యాల క్రీడాభిరామం ఈమాట గ్రంథాలయంలో ఉన్నది.)

ఈ పుస్తకంలో కథ అత్యల్పం. గోవింద మంచనశర్మ అనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు, తన వైశ్య స్నేహితుడు టిట్టిభశెట్టితో కలిసి ఓరుగల్లులో వేశ్య, కామమంజరిని కలవడానికి వస్తూ దారి పొడుగునా చూసిన విషయాల అద్భుత రసిక వర్ణన, చేసిన పనులు, అంతే!

నారాయణ రావు, షూల్మన్‌, వాళ్ళ అనువాద గ్రంథంలో శ్రీనాథుడి పద్యాలు, వల్లభరాయుడి పేరడీ పద్యాలు చక్కగా ఉదహరించి, వ్యాఖానించారు. శ్రీనాథుడిపై పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన తెచ్చి అందులోనూ కొన్ని ఉదాహరణలు — ముఖ్యంగా శ్రీనాథుని చాటువులని పేరడీ చేసిన పద్యాలు — ఇచ్చారు. మచ్చుకి కొన్ని ఉదహరిస్తాను.

శృంగారనైషధములో పూజ చెయ్యటానికి వెళ్ళుతున్న నలుడు వేసుకున్న దుస్తుల వర్ణన: గన్నేరుఁ బూచాయఁ గనుపట్టు జిలుఁగైన సలిల కాషాయ వస్త్రంబు గట్టి… కొద్దిగా మార్చి, వేశ్యని చూడటానికి వెడుతున్న గోవింద శర్మ వేషం దుస్తుల వర్ణన: గన్నేరుఁ బూఁజాయ కరమొప్పు నీర్కావి మడుగు దోవతి పింజె విడిచికట్టి… అని హాస్యానుకరణ.

అలాగే భీమఖండంలో వ్యాసుడు మొదలైన మహాఋషులు దాక్షారామం లోకి ప్రవేశించటానికి శుభసమయం కోసం ‘గార్గ్య సిద్ధాంత’ పద్యాన్ని, కొద్దిగా మార్పు చేసి, వేశ్యల ఇళ్ళకి వెళ్ళటానికి శుభసమయం పరంగా పద్యం చెపుతాడు:

గార్గ్య సిద్ధాంత మత ముషః కాల కలన,
శకున మూనుట యది బృహస్పతి మతంబు
వ్యాస మతము మనఃప్రసా దాతిశయము
విప్ర జన వాక్య మరయంగ విష్ణు మతము

ప్రయాణంలో దోవ పొడుగూతా చూసిన సాధారణ విషయాలు, విపరీత వర్ణనలు, శ్రీనాథుని వర్ణలకి అనుకరణలుగా కనిపిస్తాయి. ఉదాహరణకి కోడిపందెపు వర్ణన చూడండి: ఒక పెద్ద వచనం, వెనువెంటనే ఒక సీసపద్యం. వచనంలో రెండు కోళ్ళు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవటం, వాలి సుగ్రీవులు, వింద అనువిందులు, మురారి చాణూరుల పోరాటాలతో పోలుస్తాడు. పద్యం ఆఖరున, యుద్ధంలో మరణించిన యోధులకి స్వర్గంలో రంభామేనకతిలోత్తమలతో సంభోగం ప్రాప్తిస్తుందన్న సుప్రసిద్ధ విశ్వాసం తీసుకొని, పోరులో చచ్చిన కోళ్ళకు కూడా ఆ అదృష్టం పడుతుందా, అని ప్రశ్నార్థకంగా హేళన చేస్తాడు. నారాయణ రావు, షూల్మన్, ఈ కోడిపందెపు వర్ణనని ఇలా అభివర్ణించారు: …almost as if a modern sports commentator were describing a local Little League baseball match in terms of Achilles’ feud against Hector. ఈ పరిశీలన చక్కని హాస్య పరిశీలన అని నేను మీకు మూలంలో చెప్పినట్టుగా ఉదహరించాను.

ఈ పుస్తకంలో పచ్చి శృంగారం ఉన్నదని, ఒక్కొక్కచోట జుగుప్స కలిగించే అశ్లీల వర్ణనలు ఉన్నాయన్న ఆక్షేపణలు, అసందర్భ నైతిక వాదనలు అవతలకి నెట్టి చదివితే, ఈ పుస్తకం హాయిగా ఆనందించవచ్చు. అనువాదం, అందులోని వ్యాఖ్యానం చదివిన తరువాత మూలాన్ని చదివితే, మూలం మరింత రుచికరంగా ఉంటుందని నా అభిప్రాయం.

ఈ సందర్భంలో ఒక్క విషయం నిష్కర్షగా మనవి చెయ్యాలి. ఇప్పుడు ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలలో అధ్యయనం చేసే కొద్దిమంది గురించి నాకు అంత బాగా తెలియదు. పోతే, తెలుగు మాతృభాష అని చెప్పుకునే చాలామందికి (అంటే నాబోటి వాళ్ళకి) ప్రాచీన సాహిత్యంలోకి ప్రవేశం, ఇంగ్లీషు అనువాదాల ద్వారానే సాధ్యం. అంటే, ఇప్పుడు నారాయణ రావు, అతని సహచరులూ చేస్తున్న అనువాద గ్రంధాలు, పాశ్చాత్యులకే పరిమితం కాదు; మనకి కూడా అవసరం. అవి చదివిన తరువాత, మూలగ్రంధాలు చదివి ఆనందించటం సులభమవుతుందని స్వానుభవంతో నేను చెప్పగలిగిన అభిప్రాయం.


పదహారవ శతాబ్దపు రెండవ భాగంలో పింగళి సూరన తెలుగు సాహిత్యం లోకి తెచ్చిన ఒక కొత్త ప్రక్రియ, ఒక కొత్త జాన్ర, భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి ‘నవల’ అని చెప్పదగిన కళాపూర్ణోదయం, దాని ఆంగ్లానువాదం[9] గురించి, ఆ తరువాత పింగళి సూరన చెప్పిన చక్కని ప్రేమకథ, ప్రభావతీ ప్రద్యుమ్నము, దాని అనువాదం[10] గురించి క్లుప్తంగా ముచ్చటిస్తాను.

కళాపూర్ణోదయం పేరుతో ఎలాటి కథ రాద్దామనుకున్నాడో ప్రారంభంలో సూరన చెపుతాడు: “… యత్య పూర్వకథా సంవిధానవైచిత్రీ మహనీయంబును, శృంగార రసప్రాయంబును, బుణ్యవస్తు వర్ణనాకర్ణీయంబును…” అనే మూడు విషయాలు: ఇంతకు పూర్వము లేనిది, ఆశ్చర్యము కలిగిస్తూ, శృంగార రసభరితమై, దేవుళ్ళ గురించి అందంగా వినిపిస్తూ చెప్పే ఒక చక్కని కథ నేను చెపుతానని, అన్నాడు.

ఈ కథ రకరకాల మెలికలు తిరిగే జటిలమైన కథ. టూకీగా కథా ప్రారంభం ఇది: సృష్టి కర్త బ్రహ్మ ఈ కథ చెబుతున్నాడు. అంటే, అది నిజం అవ్వాలి; జరగాలి కదా! బ్రహ్మ చెప్పే కథ సరస్వతి పెంపుడు చిలుక వింటూన్నది. సరస్వతి ప్రణయకోపంతో పెడముఖం పెట్టినా శ్రద్ధగా కథ వింటూన్నది. “అనగా అనగా కాసార పురం. ఆ పట్టణాన్నేలే రాజు కళాపూర్ణుడు. ఆ రాజు తల్లి, మణి స్థంభుడు; తండ్రి సుముఖాసత్తి.” సరస్వతి ఫక్కున నవ్వింది. ‘తల్లి మగవాడు, తండ్రి ఆడదీనా?’ అని సరస్వతి అడగ్గానే, బ్రహ్మ తన నాలుగు ముఖాలతో సరస్వతిని ముద్దాడాడు. ఆ తరువాత ఏమయ్యింది? సరస్వతిని ముద్దాడినప్పుడు ఆమె కంఠంలో నుంచి అపూర్వమైన మణితస్వరం వచ్చింది. ఆ స్వరాన్ని చిలుక నెమరు వేసుకుంటున్న సమయంలో రంభ వస్తుంది. ఆ స్వరం విని దాని పుట్టు పూర్వోత్తరాలు చెప్పమని అడుగుతుంది. చిలుక రంభతో చెప్పటం, సరస్వతి చిలుకకిచ్చిన శాపం, ఇలా అంచెలు అంచెలుగా మెలికలు తిరిగి, అసలు కళాపూర్ణుడి కథ ఐదవ ఆశ్వాసం వరకూ మొదలవదు. అయినా, ఈ కథ చెప్పకూడదు గదా! (మొత్తం కథ వచనంలో ఈమాట లైబ్రరీలో దొరుకుతుంది.)

నారాయణ రావు, షూల్మన్, ఈ పుస్తకాన్ని, సెర్వాంటెస్ (Cervantes) నవల, డాన్ కిహోటెతో (Don quixote) పోల్చారు. ఈ రెంటికీ ఒక రకమైన సమకాలీనత ఉన్నది కూడాను. యూరోపియన్ సాహిత్యంలో డాన్ కిహోటె, మొట్టమొదటి నవలగా గుర్తిస్తారు. కళాపూర్ణోదయం[9] మన సాహిత్యంలో మొదటి నవల అని వీరి అభిప్రాయం.

బాఖ్తిన్ అనే రష్యన్ సాహితీవేత్త నవల ముఖ్య లక్షణం, బహుళార్థకం, బహుధ్వనితం (polyphonic), అని సిద్ధాంతీకరించాడు. నవలలో పాత్రలు ఒక రకంగా ‘స్వతంత్రులు.’ ఒకరితో ఒకరు మాట్లాడుతారు; అభిప్రాయాలు చెప్పుకుంటారు అనటం సమంజసం. రచయిత జోక్యం ఉండదు. అంటే రచయిత ఈ అభిప్రాయాలు ఎలా వుండాలో ముందుగా నిర్వచించడు. ఇక్కడ కథ సృష్టించినది, భగవంతుడే, అయినప్పటికీ, ఆయన ప్రమేయం లేకుండా, పాత్రలు కథని నడిపిస్తాయి. పాత్రలు నిజం మనుష్యులలాగా, స్వతంత్ర వ్యక్తులలాగా ప్రవర్తిస్తాయి. బాఖ్తిన్ సిద్ధాతం మరికొంత క్షుణ్ణంగా అర్థం చేసుకోవటానికి అతని పుస్తకాలు[11] చదవాలి. ఈ నవలకి సంబంధించినంత వరకూ, నారాయణ రావు రాసిన వెనుకమాట శ్రద్ధగా చదవటం అవసరం.

పింగళి సూరన మరొక పుస్తకం ప్రభావతీ ప్రద్యుమ్నము.[10] ఇది ప్రేమకథ. హరివంశం నుంచి ఈ కథ తీసుకున్నాడు. ఈ పుస్తకాన్ని తన తండ్రికి అంకితం ఇచ్చాడు. ఉజ్జాయింపుగా 1570 ప్రాంతాన ఈ రచన చేసి ఉంటాడని తెలుగు సాహితీ చరిత్రకారుల ఊహ. హరివంశములో కథ మాతృక. దీనికి కొద్ది మార్పులు చేర్చి, ఒక నూతన బాణీలో సూరన ఈ కథ చెప్పాడు. అనువాదకుల దృష్టిలో ఈ కథ రోమియో జూలియట్ చిత్రణకు సరిపడుతుంది. ప్రభావతికి, ప్రద్యుమ్నుడికీ మధ్య రాయబారి శుచిముఖి అనే తెలివి గల హంస. ఈ హంస సరస్వతి దగ్గిర చదువులు నేర్చిన హంస. ప్రభావతిని గురించి చెప్పే పద్యం చాల అందమైన పద్యం. అసలు, అంతకు ముందుగా సూరన చెప్పిన మొట్టమొదటి దైవస్తుతి పద్యమే ‘ప్రబంధ’ సాహిత్యంలో ఒక కొత్త పోకడను సూచిస్తుంది.

శ్రీమదుమామహేశు లతిచిత్రవిలాసులు దారు మున్ వియో
గామిత చింత నొండొరులకై సగమౌటలు నిచ్చఁ దెల్పు కాం
క్షామహిమంబుచేఁ జెఱుసగంబుగ నొక్కయొడల్ ధరించు స
త్ఫ్రేమపుదంపతుల్ కృతిపతిన్ దనరింతురుగాతఁ గీర్తులన్

చాలాకాలంగా ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండటం మూలంగా కలిగిన వ్యథ చేత చిక్కి సగమై పోయి, ప్రేమాతిశయంతో కలిసినప్పుడు గాఢంగా కౌగలించుకొని ఒకటై పోయారు. మనకందరికీ తెలిసిన అర్థనారీశ్వర రూపం ఆదిరూపం కాదన్నమాట! ఈ వర్ణన కవి నూతన చమత్కృతి.

ప్రభావతి గురించి హంస చెప్పిన పద్యంలో, సాధారణంగా స్త్రీ సౌందర్యవర్ణనలో వాడే ఉపమానాలు ఏవీ ప్రభావతి సౌందర్యాన్ని చెప్పటానికి సరిపోవు అని చెపుతుంది. మాటలలో సౌందర్యం వర్ణించటానికి అంతకన్నా వేరు మార్గం లేదు కదా! అయితే, అంతమాత్రం చేత నాకు సంభాషణశక్తి లేదనుకోకు. నన్ను పెంచినది సరస్వతి. నాకు విద్యాబుద్ధులు నేర్పినది ఆ వాగ్దేవత. ఏదో రకంగా కష్టపడి చెప్పుదామనుకున్నా, ప్రభావతి సొగసులో ఒక కోటివంతు గూడా చెప్పలేక పోతున్నాను, మాటలతో! సూరన చూపించిన నవ్యత, నవలకున్న బహుళార్థకతనీ, బహుధ్వనిత్వాన్నీ అన్వేషించి మళ్ళీ తెలుగు నాటకంలో ప్రవేశపెట్టిన ఖ్యాతి గురజాడ అప్పారావుకే దక్కుతుందని అనువాదకులు, ఈ పుస్తకం వెనుకమాటలో ధైర్యంగా చెప్పుతున్నారు. ఆ విషయం ఈ వ్యాసంలో పరిశీలిద్దాం.

అంతకు ముందుగా పాఠకులకు మరొక విషయం మనవి చేసుకోవాలి. నేను ఈ వ్యాసంలో మరొక రెండు పుస్తకాల గురించి చెప్పదలచుకోలేదు. ఆ రెండు పుస్తకాలూ ఇవి: Classical Telugu Poetry: An Anthology[4]; Hibiscus on the Lake: Twentieth Century Telugu Poetry from India[5]. వెయ్యి సంవత్సరాల తెలుగు పద్యసాహిత్యం నుంచి — నన్నయ నుంచి నేటి వరకూ వచ్చిన కవితలు — వీటిలో కొన్ని ఏరి, అనువదించి, రాసిన కవుల స్వీయచరిత్ర స్థూలంగా పదిలపరిచిన పుస్తకాలు, ఇవి. వీటిని మరొకసారి విచారించటానికి ప్రయత్నిస్తాను.


అన్నమయ్య తరువాత పదకవులలో ప్రసిద్ధి కెక్కిన మరొక తెలుగు కవి క్షేత్రయ్య. క్షేత్రయ్య పదాలని, మరికొందరి పదకవుల కవితలనీ కలిపి రామానుజన్, నారాయణరావు, షూల్మన్, ప్రచురించిన అనువాద గ్రంథం[12] గురించి క్లుప్తంగా ముచ్చటిస్తాను. క్షేత్రయ్యతో పాటు, ఐదు అన్నమయ్య పదాలు, రుద్రకవి జనార్దనాష్టకం, అరడజను సారంగపాణి పదాలు, కొంకణేశ్వర ప్రభువుపై ఒక పదం, ఈ సంకలనంలో ఉన్నాయి. మిగిలిన 37 పదాలూ క్షేత్రయ్యవి. అందుచేత క్షేత్రయ్య పదాలపై అనువాదకర్తల ఉపోద్ఘాతం, ఆముఖాలలో చెప్పిన విషయాలని క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

పదాలు, శాస్త్రీయ లలిత సంగీత కవితలు. పాడుకోటానికి, నృత్యానికి ఉద్దేశింపబడ్డ ఈ కవితలు యావద్భారతదేశంలో ఉన్నాయి. సంస్కృతంలో ప్రసిద్ధికెక్కిన భక్తిగీతాలు పన్నెండవ శతాబ్దంలో జయదేవుడు రాసిన గీతగోవింద కావ్యం. దక్షిణ భారతదేశంలో ఈ ప్రక్రియ పదిహేనవ శతాబ్ద ఉత్తర భాగంలో తెలుగులో అన్నమయ్య పదాలతో ప్రమాణీకరించబడింది. అన్నమయ్య భక్తిగీతాలు దేవాలయ పూజలతో సంబంధించినవిగా పరిగణిస్తే, క్షేత్రయ్య పదాలు, దేవాలయాల వెలుపలే రాయబడినవి. అయితే, వీటిలో ముఖ్యపాత్ర, నాయకుడు మువ్వగోపాలుడు దైవమే.

దక్షిణ భారతదేశ భక్తిగీతాలలో ఆది నుండీ శృంగార (కామోద్దీపకమైన) ప్రస్థావన ఉంది. తమిళ భక్తి కవితలలో, దేవుడు తరచుగా ప్రేమికుడిగా కనపడతాడు. తెలుగు పదకవులు తమిళ భక్తి కవుల కవితలచే ఆకర్షించబడ్డారు. అయితే, తెలుగు పదకవితలలో ఉన్న విశిష్టత, వ్యత్యాసం ఏమిటి? అని ప్రశ్నించుకోవాలి.

ఎనిమిదవ శతాబ్దంలో ముఖ్య పదకర్త నమ్మాళ్వార్ రాసిన ఒక భక్తిగీతం అనువాదకులు ఉదహరించారు. ఈ గీతంలో గొంతు ఒక యువతి. ఆమె ప్రియుడు కృష్ణుడో, రాముడో, –నల్ల దేవుడు — అతని నుంచి యెడబాటు. ఇది ఇతివృత్తం. ఈ (దేవుడు-ప్రియుడు) ప్రియుడు ఆమె దరికి రావటానికి ఒప్పుకోడు. ఈ యువతి ఏకాకి. రాత్రి సమయం. నిద్ర పోలేదు; ఊరంతా నిద్ర పోయినప్పటికీ! మొత్తం మీద, ఆమెకు చివరకు మిగిలినది ఆశాభంగం. ఇది కేవలం విరహం-భక్తి. తమిళ ఆళ్వారుల ‘అకం’ కవితలకు కవితాజగత్తులో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదని, ఈ స్వతంత్ర ప్రతిపత్తికి అధిభౌతిక రూపకత్వం ఆపాదించటం కవితలకున్న సంపూర్ణతని, వాటి సంకేతశక్తితో సహా ధ్వంసం చెయ్యటమేనని ‘విరహ-భక్తి’ పై పరిశోధనలు చేసిన ముఖ్యుల అభిప్రాయాలతో ఈ అనువాదకులు ఏకీభవిస్తారు.

ఈ యువతి ప్రియుడి కోసం వేచి ఉండటం తప్ప వేరే గత్యంతరం లేదు. వేర్పాటు బాధని అనుభవించటం తప్ప వేరేమీ చెయ్యలేదు. ప్రియుడు ఇష్టమైతే రావచ్చు; లేకపోతే రాకపోవచ్చు. జాలిపడి రావచ్చు; లేదా ఆమె తన విరహబాధతో మరణించవచ్చు. స్త్రీ అవడం ఆమె పరాధీనతకి మూలం. ఈ రకమయిన బాధిత స్త్రీ వ్యక్తిత్వ ప్రదర్శన తమిళ భక్తి గీతాలలో ఉన్న విశిష్ట లక్షణం. నిరుద్ధమైన కోరిక, అంతులేని యెడబాటు, అంధకారబంధురమైన జీవనం,నిస్సహాయస్త్రీత్వం, శిధిలమైన వ్యక్తిత్వం –ఇవన్నీ మూర్తీభవించిన తమిళ భక్తికవితతో క్షేత్రయ్య రాసిన ఒక పదం పోల్చి వ్యత్యాసం ఏమిటో చూద్దాము. అనువదించబడిన పదానికి మూలం ఇది:

చెల్లబో పాలగిరి – చెన్నుడే వీడు కొమ్మా!
ఎల్ల లోకము లిత – డేలు ననగా వినవా. |చెల్లబో|

పరిగే వాని చేతి పైడి – పట్టిన దానవా యింటి
గురుతు చెప్ప వద్దా యెంత – సరసు రాలవె కొమ్మా!
గురిగాడు గనుక సి – గ్గున నెవ్వరి నడుగక
వెర చీ సందు కా సందుకు – తిరుగగా దోడి తెచ్చితివి. |చెల్లబో|

వచ్చిన దాక తల – వాకిట నీ వైనాను
నెచ్చెలు వైన నుండితే – నేర మటవె కొమ్మా!
యిచ్చిన పైడి చేతికి – వచ్చినదే చాలు నటవే
హెచ్చు కొద్దు లెరుగ వలదా – యెవరంట యున్నావే. |చెల్లబో|

బాలరో మువ్వ గో – పాలుడైన చక్కని
పాలగిరి చెన్నుడు నీ – పాల గల్గె కొమ్మా!
యేలి (ఏల) రేపు వచ్చే నంటే – యింతైన సమ్మ తించక
యేల రా వద్దంటివే ని – న్నే మందునే చెలియ! |చెల్లబో|

దేవుడే ఖాతాదారుడిగా వస్తే ఈ యువతి (వేశ్య) ఆయనతో అహంకారిగా వ్యవహరించింది. అందుకు గాను, వేశ్యమాత చీవాట్లు పెడుతూన్నది. డబ్బులు పుచ్చుకోని, తాను ఉండే చోటు చెప్పటానికి కూడా నిరాకరించింది. వేశ్యవాడలో దోవ అడగటానికి సిగ్గుపడుతూ, తారట్లాడుతున్న ఆయన్ని వేశ్యమాత చూసింది. పల్లవి లోనే ఖాతాదారుడెంత శక్తిమంతుడో తెలుసు, కానీ ఇక్కడ ఈ స్త్రీ దే పైచెయ్యి. ఈ వ్యవహారంలో, దుడ్డే ప్రథానం. దేవుడు ప్రేయసిల మధ్య అసౌష్ఠవం నమ్మాళవార్ పదం లోనూ ఉన్నది; ఇక్కడ కూడా ఆ అసౌష్టవం ఉన్నది. కానీ, ఇక్కడ తల్లకిందులైన అసౌష్టవం. అంతే కాదు. తెలుగు పదంలో ఉద్విగ్నధ్వని స్వభావసిద్ధంగా వేరు. విరహం కరిగి నీరైపోయింది.

క్షేత్రయ్య పదాలలో ఎల్లప్పుడూ స్త్రీ గొంతుకే కాదు; ఒక్కొక్కప్పుడు ప్రేమికుడైన దేవుడి గొంతు కూడా వినబడుతుంది. అయినా పైచేయి స్త్రీదే. చాలా పదాల్లో తన ప్రియుడు మరొక స్త్రీతో సంపర్కం ఉన్నట్టు ఫిర్యాదు చేస్తుంది. చిరాకు పడటం, ఒకరిపై ఒకరికి కోపం రావటం, పదసాహిత్యానికి నిర్వచనంగా అగుపిస్తుంది.

అన్నమయ్య పదాలలో దేవుడిదే పైచేయి. ప్రేయసి ఫిర్యాదు చెయ్యచ్చు, కోపగించుకోవచ్చు, దెబ్బలాడవచ్చు, కానీ చివరకి ఇద్దరూ ఒకరినొకరు అనుభవించడం కద్దు. దేవుడే నెగ్గుతాడు, ఆఖరికి!

క్షేత్రయ్య కాలానికి పరిస్థితి వేరయ్యింది. విజయ రాఘవ నాయకుడి (1633 – 1673) కాలంలో క్షేత్రయ్య తన పదాలని రాశాడు. అప్పుడు, రాజే దేవుడయ్యాడు. రాజే దేవుడయితే, డబ్బున్నవాడే రాజవుతాడు. అంటే, డబ్బున్నవాడే దేవుడయ్యాడన్న మాట. అందుచేత క్షేత్రయ్యకి, రాజులని దేవుళ్ళుగా చిత్రించి పదాలు రాయటానికి అభ్యంతరం లేదు.

క్షేత్రయ్య ఒక పదంలో చెపుతాడు: రెండువేల పదాలు మధుర తిరుమల నాయకుడిపై , వెయ్యి పదాలు తంజావూరు విజయ రాఘవ నాయకునిపై, నలభై రోజుల్లో పదిహేను వందల పదాలు గోల్కొడ పాదుషాపై పాడానని చెపుతాడు. నాలుగు వందల పదాలు మాత్రం ప్రస్తుతం లభ్యం అవుతున్నాయి.

గత శతాబ్దంలో విక్టోరియన్ నీతుల ప్రభావంతో ఈ పదాలని, ‘సంస్కరించడానికి’ విద్యాధికులు ప్రయత్నించారు. వేశ్యావృత్తి నిర్మూలనకై జోరుగా ప్రచారం చేసిన రోజులవి. ఈ పదాలు శృంగార రస కవితలుగా పండితుల ఆమోదం పొందటానికి ప్రయత్నాలు జరిగినాయి. బహిరంగంగా ‘కామోద్దీపన’ చేసే పదాలని సంస్కరించడం, లైంగిక సంకేతాలున్న వాటికి ఉన్నతమైన ఆధ్యాత్మిక అర్థాలు ఆపాదించి తిరిగి నూతన వ్యాఖ్యానం చెప్పడం ఇప్పటి కొత్త ధోరణి.

వేశ్యాగృహం తోనే క్షేత్రయ్య పదాల మొట్టమొదటి సంబంధం. ఖాతాదారుడు దేవుడు; అతణ్ణి సంతోషపెట్టడమే ముఖ్యం. సంస్కృత ఆలంకారిక లక్షణాలను ఆపాదించి, ఆ విధంగా వర్గీకరించి ఈ పదాలకి వేరే పరమార్థం ఉన్నదని చెప్పటం ఈ పదాల్లో ఉన్న సౌందర్యం, సున్నితత్వాన్ని వికృతీకరించటమే అవుతుందని, అనువాదకులు పునరుద్ఘాటించారు.

ఆఖరిగా మరొక రెండు పుస్తకాల గురించి విచారించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. మొదటి పుస్తకం: గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం. రెండవది, చాసో (చాగంటి సోమయాజులు) కథలు.


వెల్చేరు నారాయణ రావు చేసిన కన్యాశుల్కం అనువాదం[13], Girls for Saleపై, ఈమాటలో నేనొక పరిచయ వ్యాసంరాసి వున్నాను. పెంగ్విన్ (ఇండియా) సంస్థ ఈ అనువాదాన్ని 2011లో తిరిగి ప్రచురించింది. ఈ పుస్తకం విడుదలైన తరువాత ఈ మధ్యకాలంలో తెలుగునాట పత్రికలలో ముఖ్యంగా, అనువదించబడ్డ కొన్ని మాటలపై ‘హేళన’ చేస్తూ కొన్ని విమర్శలు వచ్చాయి. అవి చదివిన తరువాత కన్యాశుల్కం నాటకం, దాని అనువాదం, మరొకసారి చదివాను. అనువాదం కన్నా ముఖ్యం The Play in Context పేరున వ్రాసిన మలిపలుకు వ్యాసం. ఈ వెనుకమాటలో నారాయణ రావు ఒక సరికొత్త ప్రతిపాదన చేశాడు. ఒక రకంగా ఇది విప్లవాత్మకమైన ప్రతిపాదన. ఆ ప్రతిపాదన కన్యాశుల్కం వేరొక దృక్పథంతో చదవటానికి ముఖ్య ప్రేరణ. నేను రాసిన పాత వ్యాసం నుంచి కొన్ని వివరణలు తిరిగి చెప్పవలసిన అవసరం కనిపించింది. పాఠకులు పునరుక్తిని క్షమిస్తారని భావిస్తున్నాను.

కన్యాశుల్కం నాటకంపై గత 50-60 సంవత్సరాలలో వచ్చిన వాదప్రతివాద వ్యాసాలు కూడా గుర్తించడం అవసరం. అటువంటి కొన్ని వ్యాసాలలో వివరణలు క్లుప్తంగా నా పరిచయ వ్యాసానికి అనుబంధంగా పొందు పరచి ఉన్నాము. ముఖ్యంగా, నేటి విమర్శకులు నారాయణ రావు చేసిన ప్రతిపాదనలతో వ్యతిరేకించబోయే ముందు, కన్యాశుల్కం నాటకం, నారాయణ రావు రాసిన వెనుకమాట పూర్తిగా చదవమని కోరుతున్నాను.

గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకంలో 19వ శతాబ్దం ఉత్తర భాగంలో విజయనగరం శివార్లలో వాడే మాండలికం వాడారు. నాటకంలో ప్రతీ పాత్ర మాట్లాడే మాటల్లో ఆ పాత్ర కులం, ఆర్థిక స్థితి, చదువు సంధ్యలు, లింగభేదం స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. వ్యావహారిక తెలుగు భాషకి, ఒక తియ్యని మాండలికానికీ అప్పారావుగారు కన్యాశుల్కం నాటకం ద్వారా చేసిన అమోఘమైన సేవ మరెవ్వరూ చేయలేదు.

గత ఐదు దశాబ్దాలలో కన్యాశుల్కం నాటకం పై కొన్ని వందల వ్యాసాలు, విమర్శలు ప్రతివిమర్శలూ, వివాదాలు ఉత్తరాలూ వచ్చాయి. ఈ వ్యాసాలు నాటక కర్తృత్వంతో మొదలు పెట్టి, నాటకంలో ప్రతి పాత్ర పైన, అప్పారావు అంకిత వాక్యాల పైన, పీఠికల పైన, పాత్రల ఔచిత్యం పైన, వాటి ఆవశ్యకత పైన, నాటక లక్షణాల పైన, లక్ష్యాల పైన, వస్తువు పైన, వస్త్వైక్యత పైన, నిర్వహణ పైన, సాంఘిక సంస్కరణల పైన, అటూ ఇటూ… ఎన్నో ఎన్నెన్నో! కన్యాశుల్కం నాటకం కొందరికి బ్రహ్మపదార్థం అయితే, మరి కొందరికి ప్లేడౌ (play dough!) అయ్యింది. ఒక్కొక్క విమర్శకుడికి ఒక్కొక్క రకంగా కనిపించింది, వినిపించింది. మరి కొందరు విమర్శకులకి వాళ్ళకి నచ్చిన పాక్షిక పద్ధతిలో మలచుకోబడ్డది! పైగా ఈ నాటకం కొన్ని వందలసార్లు తెలుగుదేశంలో ప్రదర్శించబడింది. అయితే, మూలంలో నాటకాన్ని కుదించి కత్తిరించి అప్పుడప్పుడు అప్పారావు వాడిన భాషని కూడా ‘సంస్కరించి’ ఈ ప్రదర్శనలు చేశారు. మూలంలో నాటకం ఏడు అంకాలు, ముప్ఫైరెండు రంగాల నిడివి గలది. అందుకనే కాబోలు, ప్రసిద్ధ, అప్రసిద్ధ నాటక ప్రయోక్తలందరూ ప్రదర్శనా సౌలభ్యం పేరుతో కుదించారు, కత్తిరించారు, సవరించారు.

నారాయణ రావు ప్రతిపాదనకి పూర్వ రంగం ఇది: కన్యాశుల్కం నాటకం పై ఇంతకు పూర్వం విమర్శకులందరూ అప్పారావు ఈ నాటకం రాయడానికి ప్రేరణ, కారణం, సంఘసంస్కరణే అని ప్రతిపాదించారు. నాటి సమాజంలో ముఖ్యంగా మూడు దురాచారాలని ఎత్తిచూపి వాటి నివృత్తికి ఈ నాటకం మార్గదర్శి అని విమర్శకులందరూ (ఒకరో ఇద్దరో మినహా!) పదే పదే నొక్కి వక్కాణించారు. ఈ మూడు దురాచారాలూ వరుసగా – కన్యాశుల్కం, అంటే ఆడపిల్లలని అమ్మడం, కొనుక్కోవడం; వితంతు వివాహానికి వ్యతిరేకత; వేశ్యా సమస్య. గత 50 సంవత్సరాలుగా వచ్చిన వ్యాస పరంపర, ఈ మూడింటినీ పూర్తిగానో, అర్థోక్తిలోనో, సమర్థించినవే.

నారాయణ రావు చేసిన ప్రతిపాదన సారాంశం ఇది: ఈ విమర్శకులలో ఏ ఒక్కరూ కన్యాశుల్కం నాటకాన్ని, రచనా వ్యూహాన్ని, సరిగా అర్థం చేసుకోలేదు. బ్రిటీషు వలసరాజ్యం అప్పటి సంఘం మీద తెచ్చిన వత్తిడి వారికి పూర్తిగా బోధ పడలేదనీ ఉదహరిస్తూ అప్పారావు లోని నవ్యతనీ, ఆయనదయిన ‘ఆధునికత’నీ సోదాహరణంగా వివరించారు.

ఆధునికత మన దేశంలో ఎప్పుడు మొదలయ్యింది అన్న ప్రశ్నకి సాధారణంగా మన ఆధునికులు చెప్పే సమాధానం — బ్రిటీషు వాడి వలస రాజ్య స్థాపన తరువాతనే అని. అది సరైన వాదం కాదని, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఆధునికత 16వ శతాబ్దంలోనే ఉన్నదనీ, వెల్చేరు నారాయణ రావు, సంజయ్ సుబ్రహ్మణ్యం, డేవిడ్ షూల్మన్, గత 15 సంవత్సరాలుగా తమ చారిత్రక సాహిత్య పరిశోధనల ద్వారా మనకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆనాటి సాహిత్యాన్ని సునిశితంగా, చారిత్రకంగా పరిశీలించి, నూతన పద్ధతుల్లో పరిశోధన చేస్తే బ్రిటీషు వలసకి పూర్వమే ఆధునికత స్పష్టం అవుతుందని వారి వాదం. బ్రిటీషు వాడి రాక మూలంగా వచ్చిన ఆధునికతని వాళ్ళు కాదనడం లేదు; వాడికి పూర్వమే ‘ఆధునికత’ ఉన్నది — అది చారిత్రక పరిణామంలో క్రమంగా సంప్రదాయకంగా వచ్చింది అని అర్థం. వలస రాజ్యం తరువాత వచ్చిన ఆధునికత సంప్రదాయ విరుద్ధం అని చెప్పవచ్చు. ఈ విషయాలపై నిశితమైన చర్చ Penumbral visions[14], Textures of Time[15], Symbols of substance[16] అనే పుస్తకాలలోను, పింగళి సూరన అనువాదాల[9][10] వెనుక మాటలలో చదవ వచ్చు. 16వ శతాబ్దపు చైతన్యాన్ని ‘ఆధునికత’ గానూ, 19వ శతాబ్దపు మార్పులను ‘వలసవాద ఆధునికత’ గానూ నారాయణ రావు పిలుస్తాడు.

ఇంతకాలం విమర్శకులు ఈ నాటకాన్ని ఎందుకు సరిగా అర్థం చేసుకోలేక పోయారు? ఈ నాటకం సమాజం కుళ్ళిపోయిందని, సంస్కరణే శరణ్యమని ఉద్బోధ చేస్తున్నదని ఎలా చూశారు?

ఇందుకు నారాయణ రావు నాలుగు ముఖ్య కారణాలు చెప్పుతున్నాడు. మొదటి కారణం: ఈ నాటకం మొదటి ప్రచురణ – దాని ప్రదర్శనకి (1892) సంబంధించిన సందర్భం. రెండవ కారణం: ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వలస రాజ్య ప్రాబల్యం వల్ల వచ్చిన సమకాలీన సాహిత్య రాజకీయ వాతావరణం. మూడవ కారణం: తెలుగు రచయితలపై, ఆధునిక విద్యావంతులపై టాగూరు ప్రబల ప్రభావం. నాలుగవ కారణం: మార్క్సిస్టులు వాళ్ళ సాంఘిక రాజకీయాల కోసం ఈ నాటకాన్ని స్వంతం చేసుకోవడం.

కన్యాశుల్కం నాటకం ఏకార్థకం (monologic) కాదు. అది బహ్వర్థకం, బహుధ్వనితం (polyphonic). అంటే ఏమిటి? ఏకార్థకంలో ఉన్న రచనల్లో రచయిత పాత్రల జీవన పద్ధతిని నిర్దేశిస్తాడు. వారందరి గొంతుకా అతనిదే! అట్లా కాకండా బహ్వర్థక రచనల్లో పాత్రల నుండి మనం రచయిత గొంతు వినం. పాత్రలు తమదైన స్వంత గొంతుతో తమ ప్రపంచంలో ఉండి మాట్లాడుతాయి. అంటే, రచయితకి ఏ విధమైన స్వతంత్రతా లేదని కాదు. ఈ పాత్రలన్నీ రచయిత తయారు చేసినవే! అయితే, ఈ పాత్రలన్నీ రచయిత వాక్కుతో సమాన స్థాయిలో మాట్లాడుతాయి. అంటే, స్థూలంగా, బహ్వర్థక రచనలో ఒకే ఒక్క సందేశం మాత్రమే ఉండదు. దేశవిదేశీ సంస్కృతు లన్నింటిలోనూ, పౌరాణిక సాహిత్యం, మతసంబంధ సాహిత్యం, బహ్వర్థక సాహిత్యం అని చెప్పవచ్చు. స్థూలంగా చెప్పాలంటే, ఈ పోలిఫోనిక్ సాహిత్యం — బహుస్వన, బహుస్వర, బహుళార్థక సాహిత్యం అని అర్థం.

ఈ రకమైన సాహిత్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? వివిధ రకాల వ్యాఖ్యానాలకి, దృక్పథాలకీ ఈ సాహిత్యం అనువునిస్తుంది. ఈ సాహిత్యం చదివిన ప్రతి ఒక్కసారీ వేరొక అర్థం స్ఫురించడం జరుగుతుంది. కారణం: కథల్లో పాత్రలు రచయిత దృక్పథానికి ప్రతిబింబాలుగా మాత్రమే ఉండరు. అంటే, కొన్ని ముఖ్య పాత్రలు వారి అభిప్రాయాలని వ్యక్తం చేస్తారు. రచయిత ఇది సబబా, కాదా అని నిర్ణయించడు; ఈ వ్యక్తులని, పాత్రలనీ తానే సృష్టించినప్పటికీ! బాఖ్తిన్ (Mikhail Bakhtin) బహుళార్థక రచనలపై వ్యాఖ్యాన వ్యాసాలు రాశాడు. మోర్సన్, ఎమర్సన్, రాసిన వ్యాఖ్యాన గ్రంధంలో[17] ఈ పోలిఫోనీ పై వివరణ పూర్తిగా చదువుకోవచ్చు.

ఈ విధమైన సాహిత్యానికి రకరకాల వ్యాఖ్యానాలివ్వడానికి తావు ఉండబట్టే కాబోలు, ఈ సాహిత్యాన్ని కాలానుగుణంగా తిరిగి రాయడం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో తిరిగి అనువదించడం, పదేపదే వ్యాఖ్యానించడం పరిపాటి అయింది. రచయితల సంస్కృతి, అనుభవం, విద్యాధిక్యతలపై ఆధారపడి, ఈ వ్యాఖ్యానాలు, వివరణలు కూడా వేర్వేరు స్థాయిలలో ఉంటాయి.

పాక్షిక దృష్టి, రాజకీయ అవసరాలు పక్కకు నెట్టి, నారాయణ రావు అనువాదంలో వెనుకమాట చదివి, బాఖ్తిన్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని మళ్ళీ తెలుగు కన్యాశుల్కం వేరే దృక్పథం నుంచి చదివితే, ఈ నాటకం polyphonic లిటరేచర్ అని బోధపడుతుంది. అప్పుడు ఈ నాటకం ఏకైక ఆధునిక ‘ఎపిక్’ అని గుర్తిస్తాం.


చాసో (చాగంటి సోమయాజులు 1915 – January 1994) తన 78 సంవత్సరాల జీవితంలో రాసిన కథలు మొత్తం నలభై. వీటి నుంచి ఇరవై కథలు ఏరి వాటిని ఇంగ్లీషు[18] లోకి నారాయణ రావు, షూల్మన్, అనువదించారు.

చాసో తెలుగునాట అగ్రశ్రేణికి చెందిన కథారచయిత. ఆథునిక కథారచయితలలో ఉత్తమ కథకుడనీ ఒప్పుకోక తప్పదు. ఆయన తన కథలపై ‘సరైన విమర్శ రాలేదు,’ అని అత్తలూరి నరసింహారావు, 1995లో చాసో డెబ్భైవ జన్మదిన సందర్భంగా చేసిన ముఖాముఖీలో చెప్పాడు. (చూ; జననీరాజనం, తిరుపతి : చా.సో. స్ఫూర్తి 1995.) చాసోని, ‘మార్క్సిస్ట్ రచయిత’గా వర్గీకరించటం అలవాటయి పోయింది. సాధారణ ప్రజల జీవితంపై సాంఘికచైతన్యంతో ఆయన కథలు రాశాడు. పొరపాటున, తను మార్క్సిస్ట్ అనే భ్రమ ఆయనకి ఉన్నది. అభ్యుదయ రచయితల సంఘం (అ.ర.సం) వ్యవస్థాపకులలో ఒకడు, చాసో. ఆంధ్ర కమ్యూనిస్టులు అ.ర.సం. రచయితల్ని వెనువెంటనే తమలో కలిపేసుకున్నారు. తరువాతి రోజుల్లో చాలామంది భావకవులు కూడా అ.ర.సం. లో చేరారు — కష్టపడి పనిచేసే పేద ప్రజలని బాధల నుంచి వాళ్ళ విమోచన కోసం కవిత్వం — అన్న భావనతో!

అయితే, తాను అభ్యుదయవాదిగా చెప్పుకున్నప్పటికీ అతని కథలపై ‘మార్కిస్ట్’ ప్రభావం ఏమీ లేదు. చాసో స్థిరబుద్ధి గల వాస్తవికవాది. గురజాడ లాగానే, మానవ సంబంధ ప్రేరణలని తీక్షణమైన దృష్టితో పరిశీలించి, వాటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నవాడు, చాసో. అతని కథల్లో, పాత్రలు సజీవ పాత్రలు. ఆ పాత్రలకి , నైతికత, స్నేహభావం, న్యాయం, ధర్మం, వగైరాలు సత్వవిచార సత్యాలు కావు. జనం అప్పుడప్పుడు వీటిని నమ్ముతారు కాబట్టి, ఇవి ఉన్నాయి. మనం సమాజాన్ని సంస్కరించలేము. ఏ సమయానికి ఏది అవసరమో అది చేస్తూ, నీతి, అవినీతి లాంటి వాటిని గురించి అనవసరంగా వ్యాకులపడ నక్కరలేదు. అదే వాస్తవికమైన గమ్యం.

ఈ పై విషయాలు, అనువాదానికి ఉపోద్ఘాతంలో రాశారు. (చాసో గురించి నారాయణ రావు ఈమాటలో ఒక వ్యాసం రాశాడు. అందులో కొంత తెలుస్తుంది.) చాసో మార్క్సిస్ట్ కాదని చెప్పటం, తెలుగుదేశంలో ‘మార్క్సిస్ట్’లమని చెప్పుకునే విమర్శకులకి నప్పలేదు. దానితో, ఒక చిన్న దుమారం రేగింది. అయితే, వీళ్ళెవ్వళ్ళూ ఆయన కథలు ఎందుకు మార్క్సిస్ట్ కథలుగా పరిగణించాలో ఎక్కడా రాయలేదు.

ఆయన అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్నవాడు కాబట్టి మార్క్సిస్ట్ అనే లేబిల్ అంటించారు. అ.ర.సం. లో ఇదివరకు ఎవరున్నారో ఎవరికీ ఖాతరు లేదు. ఒకసారి ఒక లేబిల్ వేస్తే, అది శాశ్వతం అని ఆంధ్రా మార్క్సిస్ట్లులు నమ్ముతారు. అది మారకూడదని, మారటానికి వీలు లేదనీ వాళ్ళ ధృడనమ్మకం. పేదల బాధల గురించి రాసినంత మాత్రాన ఆ రచయిత మార్క్సిస్ట్ అయి పోడు, అని అంటే వీళ్ళకి పడదు. అసమానత, ఆకలి, పీడన, ధర్మాగ్రహం, పేదరికం, దోపిడీ, అణిచివేత — ఈ రకమైన సాంఘిక అనర్థకాల గురించి రాయటానికి ‘మార్క్సిజం’ తెలియవలసిన అవసరం లేదు. ‘మార్క్సిస్ట్’ కానవసరం లేదు కూడా. సంఘంలో అవినీతి గురించి ఏ కథకుడైనా రాయగలడు.

మరొక విషయం. చాసో అనుసరించిన ఆధునికత వలసవాదకాలపు ఆధునికత కన్నా భిన్నమైనది. గురజాడ ఆధునికత కన్నా కొత్తదీనూ. అంటే, తెలుగు మార్క్సిస్టులు చేసే నేలబారు చట్రానికి లొంగే ఆధునికత కాదు. చాసో కథల్ని పడికట్టు పదాలతో కట్టి పడేసి కథకుడి ఉద్దేశం అదే సుమా అని చెప్పడం గొప్ప కథకుడిగా చాసోకి అన్యాయం.

“అభ్యుదయ రచయితల సంఘంలో అందరూ ఉండవచ్చు. ఏ రాజకీయాభిప్రాయాల ప్రభావం పొందిన వారయినా ఉండవచ్చు. సమస్త మానవకోటి ఒకానొక నూతన లక్ష్యం వైపు నడుస్తున్నది. పాత ప్రపంచం శిథిలమయి ఆ స్థానంలో మరో కొత్త ప్రపంచం ఉద్భవిస్తున్నది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని చైతన్యంతో, ప్రసన్న బుద్ధితో ఎవరు దేన్ని గురించి ఏది వ్రాసినా అభ్యుదయ రచనే అవుతుంది. ఏ విషయాన్ని గాని ముందుగా కొన్ని అపోహలు పెట్టుకొని ఆలోచించడం మంచిది కాదు. పీడింపబడేవాళ్ళు, పీడించేవాళ్ళు ఉన్న ఈవర్గ సమాజం ఉండాలని ఎవరూ కోరరు. రానున్న విధానంలో సాధారణ మానవుడే మకుటధారి. పురోగమిస్తున్న లోకాన్ని ప్రతిఘటింప జూచేవారు ఎప్పుడూ అభ్యుదయవాదులు కాజాలరు. ఈ ధనిక సమాజం పోవాలనుకోవడమే అభ్యుదయం. ఇది మనసులో పెట్టుకొని వ్రాసేదే అభ్యుదయ రచన.

ఆకలి దప్పులకు, అనేక బాధలకు గురి అయిన కోటానుకోట్లమంది పీడితప్రజలు, శ్రమజీవులు నా కండ్ల యెదుట కనిపిస్తుండగా, నేను వారికి ప్రతికూలంగా ఎలా వ్రాయగల్గుతాను? వారి కష్టమే నా కష్టం గాను, వారి సమస్యే నా సమస్య గాను తీసుకొని తీరుతాను. నేను ప్రజల్లో లీనమై పోగలిగినప్పుడు వారి భాష లోనే వారి సమస్యలనే చిత్రిస్తాను.”

దేవులపల్లి కృష్ణశాస్త్రి, 1946లో రాజమండ్రిలో జరిగిన అభ్యుదయ రచయితల తృతీయ మహాసభలో ఇచ్చిన అధ్యక్షోపన్యాసంలో చెప్పిన మాటలు ఇవి.

అయితే, కృష్ణశాస్త్రి మార్క్సిస్టేనా? మార్క్సిస్టు రచయితేనా? పేదవారి గురించి, వారి బాధల గురించీ సురవరం ప్రతాపరెడ్డి, వేలూరి శివరామ శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి వాళ్ళు ఎందరో రాశారు. వీళ్ళూ మార్క్సిస్టులు కారు. మార్క్సిస్టు రచయితలసలే కారు. పైకి కనిపిస్తున్నాయని భ్రమించే ఆలోచనలే సాహిత్యంలో ఉంటాయని, సాహిత్యానికి ఇంకే రకమైన లోతు, గాఢత, క్లిష్టత ఉండవని చెప్పడం సాహిత్యానికి అపచారం చెయ్యడమే. గొప్ప రచయితల అభిప్రాయాలు వేరు, గొప్ప రచనలు వేరు. ఈ రెండూ ఒకటే కానక్కరలేదు; సాధారణంగా కావు కూడా!

చాసో ఒక సిద్ధాంతానికి, ఒక కాలానికీ పరిమితమై పోయే రచయిత కాడు. అన్నమయ్య కాడు, పింగళి సూరన కాడు. గురజాడ అప్పారావు కాడు. ఇదే మాట నారాయణ రావుకి కూడా వర్తిస్తుంది. నా వ్యాసంలో అందుకు సరిపోయినన్ని ఉదాహరణలు ఇచ్చాననే అనుకుంటున్నాను.


నారాయణ రావు స్నేహితుడు, సహ రచయిత అయిన డేవిడ్ షూల్మన్ మాటల్లో చెప్పాలంటే: “నారాయణ రావు విప్లవాత్మకమైన సాహిత్య వివేచన, అవగాహన, ప్రపంచ సాహిత్య విమర్శకులను, విశ్లేషకులను ఎంతగానో ప్రభావితం చేసినా, ఇప్పటి దాకా తెలుగు సాహిత్య పరిశోధకులు — ప్రత్యేకించి సాటి తెలుగు వారిగా అందరి కంటే ముందుగా గుర్తించాల్సిన వీరే — ఈ కృషిని ఏమాత్రమూ గుర్తించక పోవడం, నాకు అర్థం కాని ఒక వైపరీత్యం.”

విమర్శకుల (భావకులు) గురించి రాజశేఖరుడు (900 – 950 AD) రాసిన కావ్యమీమాంసలో, మంగళుని అభిప్రాయము ఇలా ఉన్నదని చెప్తాడు: విమర్శకులు నాలుగు విధములుగా ఉంటారు. ఆరోచకుడు, మత్సరి, తత్వాభినేశి, సతృణాభ్యవహారి, అని. ఆరోచకుడికి సహజంగా ఏ రచనా నచ్చదు. అయితే, రకరకాల గ్రంథాలు చదివిన జ్ఞానంతో ఉత్తమ విషయాలు ఏదన్నా పుస్తకంలో వుంటే, ఆ పుస్తకాన్ని మెచ్చుకొనటానికి సందేహించడు. మత్సరి, ఈసు గలవాడు, ఇతరులు రాసినది ఏదీ ప్రశంసించడు. అతనికి మనసు ఒప్పదు. తత్వాభినేశి, అంటే యథార్థము తెలుసుకోవాలనే ఆశ వుండే వివేకశాలి ‘నూటికో కోటికో’ ఒక్కడుంటాడు. ఇకపోతే, సతృణాభ్యవహారి, గడ్డి తినేవాడు (పశువు), సర్వసాధారణుడు అని భావం. విపరీతమైన ఉత్సుకత మూలంగా ఒక రచన లోని మేలిమికి, దోషానికీ వున్న వ్యత్యాసం గుర్తించలేడు. వీళ్ళు ఏ పుస్తకం గురించి చెప్పినా ఒకే రకంగా మాటల పోగుల్లా వుండటం మామూలు. ఒకప్పుడు, తత్వాభినేశులు, ఆరోచకులు ఉండేవారేమో! కాని, ఇప్పుడు మాత్రం మనకి మత్సరులైన విమర్శకులే ఎక్కువగా వుండటంతో, సద్విమర్శ పూర్తిగా కుంటుపడుతున్నది. ఇక, సతృణాభ్యవహారుల గురించి చెప్పకుండా ఊరుకోవడమే మంచిది.

గొప్ప రచయితలకి సిద్ధాంతాల చట్రాలు పట్టవు అని విమర్శకులు (ప్రత్యేకంగా తెలుగు వారు) గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం. దక్షిణ భారత సాహితీ సంస్కృతి, చరిత్ర అవగాహనలో ఒక విప్లవం తీసుకొని వచ్చిన నారాయణ రావు వంటి సాహిత్య మేధావి విషయంలో మరీ మరీ అవసరం. ఈ నిజాన్ని గుర్తించకుండా, తమ తమ సిద్ధాంతపు చట్రాలలో బిగుసుకొని పోయి నారాయణ రావును విమర్శించే వారి వ్రాతలు నిజంగానే సురవీధీలిఖితాక్షరాలు, గాలిలో రాసిన రాతలు. సువర్ణాక్షరాలుగా మిగిలిపోయేవి నారాయణ రావు చేవ్రాలులు మాత్రమే. ఈ వ్యాసాన్ని మొదలు పెట్టిన నిషే సూక్తి తోనే ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

“A serpent which is unable to strip off its skin will perish. So will all those intellectuals that are prevented from changing their opinions: They cease to be intellectuals.”

– Nietzsche


గ్రంథసూచి

  1. Syllables of Sky: Studies in South Indian Civilization In honor of Velcheru Narayana Rao, Edited by David Shulman. Oxford University Press, Delhi, 1995.
  2. తెలుగులో కవితావిప్లవాల స్వరూపం, విశాలాంధ్ర ప్రచురణ, 1978. (ద్వితీయ ముద్రణ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1987. తృతీయ ముద్రణ తానా ప్రచురణలు, 2008.
  3. For the Lord of the Animals – Poems from the Telugu: The Kalahastisvara Satakamu of Dhurjati. Hank Heifitz and Velcheru Narayana Rao. and Hank Heifetz. University of California Press, Berkeley, 1987.
  4. Twentieth Century Telugu Poetry: An Anthology. Velcheru Narayana Rao, Oxford University Press, 2002.
  5. Hibiscus on the Lake: Twentieth-Century Telugu Poetry from India. Velcheru Narayana Rao, University of Wisconsin Press, 2003.
  6. A Poem at the Right Moment, remembered verses from pre-modern south India, collected and translated by Velcheru Narayana Rao and David Shulman, University of California Press, Berkley, 1998.
  7. Srinatha: The Poet who Made Gods and Kings, Velcheru Narayana Rao and David Shulman, Oxford University Press, USA; Bilingual edition, 2012.
  8. The Sound of the Kiss, or The Story That Must Never Be Told. kalapurnodayaM of Pimgali Surana. Tr. Velcheru Narayana Rao and David Shulman, Columbia University Press, 2002.
  9. The Demon’s Daughter: A Love Story from South India. Prabhavati pradyumnamu of Pimgali Surana. Tr. Velcheru Narayana Rao and David Shulman, SUNY series in Hindu studies, 2006.
  10. For example: The Dialogic Imagination: Four essays. M. M. Bakhtin, University of Texas Press Slavic Series, 1982.
  11. When God is a Customer: Telugu Courtesan Songs by Ksetrayya and Others. Tr. A. K. Ramanujan, Velcheru NarayaNa Rao, and David Shulman, University of California Press, 1994.
  12. Girls for sale – kanyasulkam, A play from colonial India, Gurajada Apparao, Tr. VelchEru Narayana Rao, Indiana University Press, 2007.
  13. Penumbral Visions : Making Polities in Early Modern South India, Sanjay Subrahmanyam, University of Michigan Press, 2001.
  14. Textures of Time : Writing History in South India 1600-1800, Velcheru Narayana Rao, David Shulman and Sanjay Subrahmanyam, Permanent Black publ., 2001.
  15. Symbols of Substance: Court and State in Nayaka-Period Tamilnadu, Velcheru Narayana Rao, David Shulman and Sanjay Subrahmanyam, Oxford University Press, 1993.
  16. Mikhail Bakhtin: Creation of a Prosaics, Gary Morson, Caryl Emerson, Stanford University Press, 1990.
  17. Dolls’ Wedding and other Stories by Chaso, Velcheru Narayana Rao and David Shulman, Penguin Books of India, 2012.