సార్థకప్రతీకలు – ముందుమాట

సార్థకప్రతీకలు (Symbols of Substance) అనే ఈ పుస్తకరచన కేవలం యాదృచ్ఛికంగా మొదలయ్యింది. దీని గ్రంథకర్తల్లో ఇద్దరు, 1987-88లలో ఫిలడెల్ఫియా నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, దక్షిణ ఆసియా అధ్యయనవిభాగం వారి సౌజన్యం వల్ల కలిశారు. ఇద్దరికీ 16-17వ శతాబ్దపు తమిళనాడుపై ఆసక్తి ఉండటం వల్ల మాటలు కలిశాయి. ఒకరికొకరు, తమకు కొరుకుపడని విషయాలు చర్చించుకున్నారు. వీరిలో సాహిత్య చరిత్రకారుడికి ఆర్థిక చరిత్రకారులు సేకరించగలిగే సాధికారమైన సమాచారమంటే మక్కువ. రెండవ వారికి ఆ శతాబ్దాల్లోని రాజాస్థానాలలో రచించబడ్డ తెలుగు, తమిళ గ్రంథాల ఆధారాలు — డచ్చి వారూ, ఆంగ్లేయులూ, పోర్చుగీసు వారూ భద్రపరిచిన అభిలేఖలకంటే — స్ఫుటంగా తోచాయి. చర్చ సాగినకొద్దీ వారి దృష్టికోణాలు కలిశాయి. ఆ ప్రాంతం దేశీయ వాగ్విశారదులకూ, అక్కడికి వలస వచ్చి అక్కడే స్థిరపడిన పరదేశస్థులకూ ఎలా గోచరించిందో నెమ్మదిగా బోధపడసాగింది.


సింబల్స్ ఆఫ్ సబ్‌స్టన్స్ (1993)
వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్,
సంజయ్ సుబ్రహ్మణ్యం

ఈ పుస్తకంలో చర్చించిన నాయకరాజుల కాలం తమిళనాడు చరిత్రలో ఇంచుమించుగా 16వ శతాబ్దం మొదటిభాగం నించీ 18వ శతాబ్దం వరకు ఉన్న సమయం. 1730లలో నాయకరాజ్యాలలో గొప్పదనిపించుకున్న మదురై రాజ్యం చితికిపోయింది. నాయకరాజ్యాలలో ప్రధానమైన మూడు రాజ్యాలకు కేంద్రాలు సెంజి, తంజావూరు, మదురై/తిరుచ్చిరాప్పల్లి. ఈ మూడు రాజ్యాల కాలాలు, అభివృద్ధి తీరుతెన్నులు, భౌమిక పర్యావరణాలు, వాటి విశిష్టమైన చారిత్రకానుభవాలు ఒకటికొకటి వేరు వేరుగా ఉన్నవి. కానీ, ముఖ్యమైన నిర్మాణ లక్షణాలలోను, సాంస్కృతిక పరివర్తనలోను వీటిలో కొంత సామ్యం కనిపిస్తుంది. 17వ శతాబ్దం తొలిరోజుల్లో, ఈ రాజ్యాలు ఉచ్చదశలో ఉండినప్పుడు, ఇవి తమిళ దేశంలో చాలా ప్రాంతం విస్తరించి ఉండేవి. అయితే సమకాలికమైన మొగల్‌ సామ్రాజ్యంతో కాని, తమ పుట్టుకకి మూలమైన విజయనగర సామ్రాజ్యంతో కాని పోల్చి చూస్తే, నాయకరాజ్యాలు చాలా చిన్నవని ఈ సంక్షిప్తవర్ణన నుంచి కూడా మనకి స్పష్ట మౌతుంది. ఆధునిక చరిత్రకారులు ప్రాయికంగా నాయకరాజ్యాల సంగతి పట్టించుకోలేదు. గత రెండు దశాబ్దాలలో భారత చరిత్ర రాసిన వారు నాయకరాజ్యాల ప్రసక్తి కూడా ఎత్తక పోవడమే కాక బహమనీ సుల్తానుల వలన విజయనగర సామ్రాజ్య పతనం జరిగిన 1565 నుంచి, 1761లో మైసూరులో హైదర్ ఆలీ ఏలిక ప్రారంభం వరకు ఉన్న కాలాన్ని దక్షిణభారత చరిత్రలో ఒక అంధకారయుగంలా పరిగణించారు. ఈమధ్యనే ఈ అలక్ష్యానికి బదులుగా నాయకులు, వారి కాలమంటే ఒక కొత్త ఆసక్తి కనబడుతున్నది. సూజన్ బేలీ (Susan Bayly), కరోల్ బ్రెకెన్‌రిడ్జ్, (Carol Appadurai Breckenridge), నికలస్ డిర్క్స్ (Nicholas Dirks), నొబోరు కరాషిమా (Noboru Karashima), డేవిడ్ లడెన్ (David Ludden), జార్జ్ మిషెల్ (George Michell), ఆర్. నాగస్వామి (R. Nagaswamy), పామెలా ప్రైస్ (Pamela Price), బర్టన్ స్టెయిన్ (Burton Stein), జోఆన్ వాగ్‌హార్న్ (Joanne Waghorne), పాల్ యంగర్ (Paul Younger) వంటి వారివే కాక మరి కొందరు పండితుల పరిశోధనల అమూల్యమైన ప్రాతిపదిక వల్లనే ఈ పుస్తకరచన సాధ్యమయిందంటే అతిశయోక్తి కాదు. వారందరికీ మేము ఋణపడి ఉన్నాం.

ఈ పుస్తకంలో విశదీకరించినట్టుగా, నాయకరాజులు దక్షిణ భారతీయ సమాజపు భావనలోనూ, సంస్థాగత నిర్మాణంలోనూ మౌలికమైన పెద్ద మార్పుకు సాక్షులు గానూ, కొంతలో కొంతవరకూ కారణభూతులుగానూ ఉన్నారని మా వాదం. అయితే ఈ పుస్తకంలో అటువంటి మార్పును నిర్దిష్టంగా రుజువు చేసే యత్నం మేము తలపెట్టలేదు. ఇటలీదేశంలో సాంస్కృతిక పునరుద్ధరణ (cultural renaissance), చరిత్రల సందర్భంలో జేకబ్ బర్క్‌హార్డ్ (Jacob Burckhardt) ప్రతిపాదించినంత సమర్థమైన సమన్వయం వంటిది నాయకరాజుల యుగానికి సాధించడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదన్నది ఇందుకు ఒక కారణమైతే, మా పరిమిత శక్తి ఇంకొక కారణం. ఇంతకు ముందు చెప్పినట్టుగా నాయకరాజుల కాలపు దక్షిణ భారతం ఇటీవలి వరకూ ఉపేక్షించబడడమే కాక అప్పటి సాంస్కృతిక సమాచారం తిరస్కారానికి, నిరాదరణకు కూడా గురి అయింది. ఆ కాలాన్ని గురించిన అపారమైన సమాచార సంపదను చరిత్రకారులు చాలా వరకు శ్రద్ధగా పరిశోధించకపోవడానికి ముఖ్యకారణం ఆ సమాచారం తమిళం, తెలుగు, సంస్కృతం, పోర్చుగీస్‌, డచ్‌, ఇటాలియన్‌ వంటి ఆంగ్లేతరభాషలలో ఉండడమే. ఈ భాషాసంబంధమైన ఇబ్బందులకు వైధానికమైన సమస్యలు కూడా తోడయ్యాయి. చరిత్రకారులకి ఇప్పటికీ ప్రబలంగా కొన్ని అపోహలున్నాయి. వారు లిఖితశాసనాలకూ, యాత్రావర్ణనలకూ ప్రాముఖ్యతనిస్తారు గానీ సాహిత్యపరమైన ఆధారాలంటే వారికి చాలా అనుమానం, చిన్నచూపు.

ఈ అసమానత్వాన్ని సరిదిద్దడానికి మేమొక ప్రయోగాత్మక పద్ధతిని ఉపయోగించాము. భారతీయ, యూరొపియన్‌ భాషల్లో లభ్యమయ్యే విభిన్న సమాచారాంశాలను ఒకే గాటికి కట్టడం అతికష్టం. వేర్వేరు దృక్పథాలు, అవసరాలతో చేసిన వర్ణనలనుండి అసలు కథని ఆవిష్కరించాలంటే ఆ పని సైద్ధాంతిక ప్రక్రియల వల్లనే కొంత సాధ్యం. అందుచేత, ఈ పుస్తకంలోని వివిధ అధ్యాయాలను అవసరం కంటే ఎక్కువ సమన్వయీకరించే ప్రయత్నం మేము చేయలేదు. మేము అనుసరిస్తున్నది ఒక కొత్త పంథా. పైన చెప్పినట్టుగా మేము పరిశీలిస్తున్న ఆధారాలు ఇతర పరిశోధకులు పట్టించుకోనివి. ఒకవేళ పట్టించుకున్నా, ఆ సమాచారాన్ని వీలైనంత తక్కువగా వాడుకున్నారు. నాయకుల కాలపు చరిత్రాధ్యయనానికి మార్గదర్శులైన ఆర్. సత్యనాథ అయ్యర్‌, సి.ఎస్. శ్రీనివాసాచారి, వి. వృద్ధగిరీశన్‌, నేలటూరి వెంకటరమణయ్య వంటివారు సాహితీ రచనలను తెలిసీ ఉపేక్షించారు. ఇక ఆ కాలపు దక్షిణభారత రాజకీయ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి డచ్‌ కంపెనీ పత్రాల వంటి యూరోపియన్‌ సమాచారం ఉపకరించవచ్చునన్న ఆలోచన ఎవరికీ కలిగినట్లు లేదు. విశ్లేషణాత్మక ప్రశ్నల ద్వారా ఈ భిన్నాంశాలలోని పరస్పర సంబంధాలను ఎత్తి చూపడానికి మా పరిశోధనలో ప్రయత్నించాము. ఇందుకోసం విస్తృతమైన ఆధారాలను పరిశీలించాము. ఆ ఆధారాల వివరాలు ఈ పుస్తకానికి అనుబంధంగా ఇచ్చాము.

మళ్ళీ ఇంకొకసారి అప్పటి రాజకీయ చరిత్రని తిరగదోడడం మా ఉద్దేశం కాదని స్పష్టమయ్యే ఉండాలి (ఆ రాజకీయ చరిత్రకి పునర్విమర్శ ఎంత అవసరమైనప్పటికీ). ఆ వివరాలు తెలియగోరినవారు పాదసూచికల లోను, గ్రంథపట్టికలోను ఇచ్చిన ముందు తరాల ప్రామాణిక గ్రంథాలను, బర్టన్ స్టెయిన్ విజయనగరంపై వ్రాసిన పుస్తకాన్ని (New Cambridge History of India, 1.2) సంప్రదించగలరు. ఆ విజ్ఞానసంగ్రహాలు, వాటిలో సూచించిన కాలక్రమానుగత నిర్మాణం మాకెంతో ఉపకరించాయి. అయితే, మా రచనలో నాయక రాజకుటుంబాలకే పరిమితమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి ప్రామాణిక గ్రంథాల పరిధిని అధిగమించే ప్రయత్నం చేశాము.

క్లుప్తంగా ఈ పుస్తక నిర్మాణక్రమం ఇదీ: తొలి అధ్యాయాలలో ఆ కాలంలో నెలకొన్న సంఘర్షణలు చర్చించబడ్డాయి. ఈ సంఘర్షణలు వేర్వేరు కారణాల వలన సంభవించాయి. కొన్ని సామాజిక వర్గాలు పైకి రావడం కారణంగా సంఘంలో ఏర్పడిన అస్థిరత వల్ల కలిగినవి కొన్ని; ఈ వర్గాలలోని కొందరు పొరుగున ఉన్న తెలుగునాటి నుండి నాయకరాజ్యాలలోకి చొరబడటం వల్ల వచ్చినవి కొన్ని; నిమ్నవర్ణాలవారు (కళ్ళర్‌, మఱువర్‌ వంటివారు) నాయక సంఘపు ప్రధాన జనజీవనస్రవంతిలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడినవి కొన్ని; నాయక ప్రపంచపు శివార్లలో పొంచివున్న యూరోపియన్ల బెడద వల్ల సంభవించినవి కొన్ని, ఇలా ఎన్నో కారణాలు. పరిమిత రాజ్యవ్యవస్థలు, వాటి పాలనార్హత కోరే అతివాదాలు, విపరీత స్థితులను సృష్టించి రాజ్యంలో సంఘర్షణకి కొంత వరకు కారణాలు, కొంత వరకు ఫలితాలు అయ్యాయి. రెండవ, మూడవ అధ్యాయాల్లో ఈ విషయాలు విపులంగా చర్చించబడ్డాయి. అంతేగాక, ఈ రాజ్యాలను ఎవరు ఎలా స్థాపించారు, వాటి మూలనిధు లేమిటి, ఆ వనరులను ఎలా వర్ణించారు, ఎలా నిర్వహించారు అన్న విషయాలను కూడా చర్చించాము.

ఆ కాలపు సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులలోని అస్థిరత అప్పటి సాహిత్యంలో ఎలా ప్రతిబింబించింది అన్న విషయాన్ని మధ్య ప్రకరణాలలో విశదీకరించాము. ముఖ్యంగా, ఆ సాహిత్యంలో దేహవర్ణనలు, అంగచ్ఛేదాలు, వాటి పునరుద్ధారణలు ఎలా చిత్రించారో అన్న విషయం నాయకా ఆంత్రొపాలజీ అన్న అధ్యాయంలో గమనించాము. అలాగే, వివిధ ప్రాంతాల అధిక్షేపకవిత్వంలో ఆ సమాజాలలో ప్రీతిపాత్రమైన వాక్చాతుర్యాన్ని కూడా పరిశీలించాము. చాలా వరకు తంజావూరు లోనూ, కొంచెం తగ్గుపాలులో మదురై లోనూ వెలువడిన సాహిత్యం మీదనే మా దృష్టి కేంద్రీకరించాము. తరువాతి అధ్యాయాలలో విషయాలు అప్పటి ఘర్షణలు, యుద్ధాలు. ఆరవ అధ్యాయంలొ అప్పటికే మారుతున్న యుద్ధప్రక్రియలు, యుద్ధరీతులపై తుపాకుల ప్రభావం; ఏడవ అధ్యాయంలో ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల ప్రజలు నాయకరాజ్యాల నుడికారపు వాడుక ద్వారాను, దానిలో మార్పుల ద్వారాను తమని తాము ఎలా సంఘటితం చేసుకున్నారన్న సంగతులు పరిశీలించాము. చివరి అధ్యాయంలో, తంజావూరును ఉదాహరణగా తీసుకొని, నాయకరాజుల తరువాతి కాలంలో వచ్చిన పరిణామాలు చర్చించాము.

ప్రతి అధ్యాయంలోనూ ఈ గ్రంథరచయితలైన ముగ్గురి కృషీ ఉన్నది. ఈ రచనకు ముగ్గురు గ్రంథకర్తలుండడం ఏదో పురాణాలలో చెప్పినట్లు కనబడవచ్చు. పురాణాలలో త్రిశిరస్సు అనే రాక్షసుడి ప్రసక్తి ఉన్నది. అతడి ఒక తల వేదపఠనమూ, రెండవ తల సురాపానమూ చేస్తూంటే మూడవ శిరస్సు ఊరికే శూన్యంలోకి చూస్తూ వుండేదట. ఈ విధంగా మా బాధ్యతలను పంచుకోవడానికి ప్రయత్నించ దలచుకోలేదు. ఈ రాక్షసుడి తలలను వేరుచేసే విధానాలెన్నో ఈ సరికే మా స్నేహితులకి తట్టి ఉండవచ్చు! అయితే, ఎడతెగని, అసంపూర్ణమైన ముక్కోణపు చర్చకు ఈ పుస్తకం అద్దం పడుతోందని మాత్రం స్పష్టంగా తెలుస్తుందని మా ఆశ. ఈ పుస్తకం లోని కొన్ని భాగాలలో వేర్వేరు నిపుణతలు కనబడవచ్చు. కాని, ప్రతి అధ్యాయమూ కొన్ని మౌలిక ప్రశ్నలకు సమాధానాలు వెదికే ప్రయత్నమే.

నాయకరాజుల ప్రత్యేకత ఏమిటి? 16-18వ శతాబ్దాల నాటి సమకాలీన విశాల వాస్తవికతలలో ఒక వైపు, మధ్యయుగాల నాటి నుండి అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్న భిన్నకాలిక సాతత్యంలో ఇంకొక వైపు, వాళ్ళెలా ఇమిడారు? కళలు, సాహిత్యం, చరిత్రరచన, సాంస్కృతిక శబ్దార్థ శాస్త్రాలలో సంస్థాగతమైన క్రొత్త నమూనాలు నాయక రాజ్యాస్థానాలలో ఎలా పెంపొందాయి? మా పరిశోధనలకు ఉపకరించిన సాహిత్యాధారాలు కేంద్రీకృతమైన తంజావూరు వంటి నడిమి నాయక రాజ్యాలకూ, పొరుగున ఉన్న చిన్నచిన్న రాజ్యాలకూ, ఒకప్పుడు సామ్రాజ్యకేంద్రాలై ఉండి అప్పటికి తగ్గుముఖం పట్టిన చంద్రగిరి, వేలూరులకూ మధ్య గల తేడా లేమిటి? అక్కడి వాస్తవ్యుల తమిళ సాంస్కృతిక పద్ధతులకూ, అక్కడికి దిగుమతి అయిన తెలుగు రాచకుటుంబాల ఆచారాలకూ మధ్య పరస్పర సంబంధం ఏర్పడిందా? ఆ రాజాస్థానాలలోని అంతర్గత వాస్తవికత మీదా, ఊహాత్మక ఆత్మసంవేదాల మీదా, బయటి ఆర్థిక, సాంఘిక పద్ధతుల ప్రభావం ఉండేదా? కొత్తగా స్పష్టమవుతున్న సాంకేతిక క్రమపు నిర్బంధాలనూ, వ్యామోహాలనూ నాయకరాజ్యాల చంచల రాజకీయాలు ఎలా వ్యక్తపరిచాయి?

ఈ విషయాలపైన బహుశా భవిష్యత్తులో విపులమైన పరిశోధన జరగవచ్చు. నాయకరాజ్యాల సాహిత్యరీతులు, చిత్ర-శిల్పకళలు, క్షేత్రయ్య, అతని అనుయాయుల వంటి పదకవుల రచనల ఆంగ్లానువాదాలు, ఆ కాలపు పోర్చుగీసు ఆధారపత్రాలు (పేస్, న్యూనెజ్‌ల వృత్తాంతాల పునఃపరిశీలన) వంటి విషయాలపై కొన్ని వ్యాసాలు వెలువరించాలని మేము ఆశిస్తున్నాము. మరాఠా కాలపు తంజావూరులో రాజకీయ-ఆర్థికవ్యవస్థ, సాంస్కృతిక ప్రపంచాలపై కూడా ప్రస్తుత పుస్తకానికి తరువాయిగా ఒక సంపుటం రావాలి. మధ్య యుగాల చివరి, లేక నవీన యుగాల తొలిరోజులనాటి తమిళనాడులోని సాంస్కృతిక, చారిత్రక సంపదలు ఇప్పుడిప్పుడే వెలుగు నోచుకుంటున్నాయి. వాటి విలువను గుర్తించడం, వాటి ప్రాథమిక పఠనం, ఆ స్థలకాలాల స్మృతులను కనీసం లీలగానైనా రేకెత్తించడం ప్రస్తుత కృషి ముఖ్యోద్దేశాలు.

నేషనల్ ఎండోమెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అనే అమెరికా కేంద్రప్రభుత్వ సంస్థ నుండి లభించిన ధనసహాయానికి నారాయణ రావు, షూల్మన్‌ల కృతజ్ఞతలు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం లోని దక్షిణ ఆసియా ప్రాంతీయాధ్యయన శాఖలోనూ, కర్టిన్‌ విశ్వవిద్యాలయం (పెర్త్‌, ఆస్త్రేలియా) లోని ఇండియన్‌ మహాసముద్ర ప్రాంతీయాధ్యయన కేంద్రం లోనూ, జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం లోని చరిత్ర విభాగం లోనూ సందర్శకాచార్య నియామకాలు కల్పించినందుకు మా ధన్యవాదాలు.

మేడిసన్‌, ఫిలడెల్ఫియా, హైడెల్‌బెర్గ్‌, లైడెన్‌, ఢిల్లీ, పెర్త్‌, సిడ్నీ నగరాలలో జరిగిన వివిధ గోష్టులలో శ్రోతల ఓర్పు, కొన్ని సార్లు ప్రశంసలు ఈ బృహత్కార్యాన్ని పూర్తిచేయడానికి కావలసిన శక్తిని, పుష్టిని ప్రసాదించాయి. లైడెన్‌ నగర వాస్తవ్యుడైన డిర్క్ కాఫ్, ఇండో-నెదర్‌లాండ్స్ కల్చరల్ ఎక్స్‌ఛేంజ్ సహకారంతో, హేగ్‌ నగరంలోని ప్రాచీన గ్రంథాలయంలో పురాతన పత్రాలను పరిశీలించే అవకాశం కల్పించాడు. ఈ పుస్తకంలోని చిత్రాలు వేసినది లోతికా వరదరాజన్‌, పటాలు వేసినది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌కి చెందిన బాచీ రామ్‌. ఈ పుస్తకాన్ని ఉత్తర భారత మధ్య యుగాల దృష్టికోణం నుండి శ్రద్ధగా చదివి వారి అమూల్యాభిప్రాయాలు వెలిబుచ్చిన ముజఫర్‌ ఆలం, సునీల్‌ కుమార్‌లకు మా ధన్యవాదాలు.

ఢిల్లీ/జెరూసలెం/మేడిసన్‌
ఆగస్ట్‌ 1990


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...