[తానా వారు వెల్చేరు నారాయణరావుగారికి Lifetime Achievement Award ఇస్తున్న సందర్భంలో, తెలుగునాడి సంపాదకులు జంపాల చౌదరి గారి ప్రేరణ పై జులై 2007 తెలుగునాడి సంచికకి రాసిన సంక్షిప్త వ్యాసం ఈ వ్యాసానికి మూలం. — రచయిత]
‘వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’ అని నారాయణరావుగారు తిరుపతిలో మే నెలలో మండుటెండలో గంగమ్మ జాతర ఊరేగింపు చూస్తున్న డేవిడ్ షూల్‌మన్ (David Shulman)తో అన్నప్పుడు (1), షూల్‌మన్ కి ఈ మాటలు అనిశ్చితమైన మిణుగురుపురుగుల కాంతి లా అంతుపట్టకపోయి ఉండాలి. ఈ మాటలు అంత తేలికగా ఊహకందే మాటలు కావు. మొట్టమొదటిసారి నేను ఈ వాక్యం విన్నప్పుడు, నారాయణరావు మేష్టారు ముందరికాళ్ళకి బంధం వేస్తున్నారా అని అనిపించింది.
వాల్టర్ ర్యాలీ (Walter Raleigh)ని ఇంగ్లండులో జైలులో పడేసినప్పుడు అతను తీరిగ్గా జైలులో కూచొని ప్రపంచ చరిత్ర రాద్దామనుకున్నాడు. ఒకరోజున జైలు బయట కొట్లాట చూశాడు.వార్డెన్‌ని అడిగాడు, ఏమిటీ అని. అతనొక కథ చెప్పాడు. తనతో జైలులో ఉన్న ఖైదీలని అడిగాడు, వాస్తవం తెలుసుకోడానికి! ఒక్కక్కడూ ఒక్కక్క కథ చెప్పాడు,ఈ కొట్లాట గురించి. అంతే! ప్రపంచ చరిత్ర రాయడం మానుకున్నాడని కథ! కారణం? తాను కళ్ళారా చూశాననుకున్నదే రకరకాల వ్యాఖ్యానాలతో వస్తే, తను ఎరగని విషయాలు నిశ్చయంగా ఎలా రాయగలడు? (ఈ కథ నేను వేరే సందర్భంలో ఒక ఫిజిక్స్ జర్నలులో ఒక ఉత్తరంగా రాసాను (2), నారాయణరావుగారి వాక్యాన్నిఉదహరిస్తూ!)
‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే; మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’ అని నారాయణరావు గారు జార్జ్ హార్ట్ (George Hart)తో అన్నప్పుడు (3), హార్ట్ గారిని ఈ వాక్యం మరుగుటద్దంలా, గాలిలో దీపంలా చంచలంగా కలవరపెట్టి ఉండాలి. తదుపరి ఈ వాక్యం ఆయనకి భారతీయ ప్రాచీన సాహిత్యంలో మూలరూపాలపై పరిశోధనా వ్యాసానికి నాంది అయింది.
వెండీ డానిగర్ (Wendy Doniger)కి నారాయణరావు గారు రంభా నలకూబరుల కథ ఒక ఆరితేరిన పౌరాణికుడిలా చెప్పిఉండాలి. డానిగర్ కి అలలు అలలు గా, ఈ కథ కళ్ళకు కట్టినట్టు ఉండి ఉండాలి, కపటవేషధారుల లక్షణాలపై (4), గుర్తింపుపై పరిశోధనా వ్యాసం రాస్తున్నప్పుడు!
“సురవీధీ లిఖితాక్షరంబుల్”– ఆకాశంలో రాయబడ్డ అక్షరాలు అన్నాడు ధూర్జటి, కాళహస్తీశ్వరశతకంలో( 5). అంటే కనిపించినట్టే కనిపించి మాయమైపోతాయన్న ధోరణిలో! భావం బహు గట్టిది, క్లిష్టమైనది కాదు; సృజన అంతకన్నా బలమైనది; క్షణభంగురమైన నిలకడలేని మాటలు ఈ భావాలని, ఈ సృజననీ కట్టి పట్టలేవు – అని నారాయణరావుగారి తో పరిచయం ఉన్నవాళ్ళకి తెలిసిన విషయం.
శ్రీకాకుళం జిల్లాలో లో చిన్న పల్లెటూరు అంబఖండి నుంచి ఉత్తర అమెరికాలో మేడిసన్ కి తెలుగు సంస్కృతీచరిత్రలో ప్రధాన ఆచార్యుడిగా వచ్చిన నారాయణరావుగారి జీవితకథ విచిత్రంగాను, గజిబిజిగానూ (chaotic) కనిపిస్తుంది.
పదకొండవ ఏడు వచ్చేవరకూ, తండ్రిగారి దగ్గిర ప్రాచీన కవిత్వం వినడం, అగ్రకులంకాని ఒక వ్యవసాయదారుడిదగ్గిర అమరకోశం నేర్చుకోవడం, స్త్రీలదగ్గిరనుంచి జాతీయాలు, పాటలు నేర్చుకోవడం. అంబఖండినుంచి ఏలూరు రావడం, అక్కడ హైస్కూలు, కాలేజీ.
నారాయణరావుగారు రాజకీయంగా, సాహితీపరంగా, ఎదిగింది ఏలూరనే చెప్పచ్చు.
పెన్మత్స సూర్యనారాయణ రాజు, పోణంగి రామకృష్ణారావు, నేనూ ఐదు దశాబ్దాలుగా నారాయణరావు గారి దోస్తులం. నారాయణరావుగారు కాలేజీలో మేష్టారే అయినా, మాకెవ్వరికీ డైరెక్ట్‌గా పాఠం చెప్పిన మేష్టారు కాదు. అందుకే, దోస్తులం అన్నా! మా రాజు (నారాయణరావుగారు పిఎచ్.డి. డిగ్రీ కోసం రాసిన పరిశోధనా వ్యాసం ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ ఊరికేనే అంకితం పుచ్చుకున్న వాడు! రాజు మూడేళ్ళక్రితం స్వర్గస్తుడయ్యాడు!), శాంతినికేతనంనుంచి తిరిగి వచ్చాడు 57-58 లలో! మార్క్స్ (Karl Marx), కాడ్వెల్ (Christopher Caudwell), కామూ (Albert Camus), కాఫ్కా (Franz Kafka) లని పట్టుకొని! అందరం హుటాహుటీన చదివేశాం. ఆ తరువాత బెకెట్ (Samuel Beckett), ఉనామునో (Miguel de Unamuno), పిరాండెల్లో (Luigi Pirandello), అయనెస్కో (Eugene Ionesco)తోపాటు హక్స్‌లీ (Aldous Huxley), హెమింగ్వే (Ernest Hemingway), సాతర్ (Jean Paul Sartre)! ఒక పద్ధతి లేదు, ఒక వరస లేదు; దొరికిన పుస్తకం చదవడం, కొన్నాళ్ళపాటు, చదివిన కొత్త పుస్తకం మత్తులో పడటం!
సుమారు ఒక దశాబ్దం పాటు, ఎండాకాలం శలవల్లో కలవడం, అర్థరాత్రుళ్ళు ఇరానీ టీ తాగి, వాద ప్రతివాదాలు చెయ్యడం మామూలయ్యింది. ఇదే రోజుల్లో, వారానికొక ఉత్తరం, Indian Express దిన పత్రికకి! చైనా అణుబాంబు ప్రయోగం నుండి, ఏలూరు కి రెండు రైలు స్టేషనులు అనవసరం, దండగ, అనీ! సాతర్ నోబెల్ బహుమతి నిరాకరించినందుకు హర్షం వెలిబుచ్చుతూ అతనికి ఒక ఉత్తరం, హక్స్లీ ఇల్లు కాలిపోతే, విచారం వెలిబుచ్చుతూ అతనికో ఉత్తరం; — నేను draft రాయడం, అందరూ సవరించడం – ఆ రోజుల్లో నేనొక – ఉత్తర – కుమారుణ్ణే!
నారాయణ రావు గారు ఈ పాశ్చాత్యులతో పాటు, కృష్ణశాస్త్రిని, శ్రీశ్రీని, శ్రీనాథుడినీ, విశ్వనాథనీ శ్రద్ధగా చదివేవారు. బొమ్మకంటి సింగరాచార్యులు, శ్రీనివాసాచార్యుల ప్రభావం కావచ్చు. ఈ రకమయిన అధ్యయనం చెయ్యడం, నారాయణరావుగారికే సాధ్యం అయ్యింది. అంతే కాదు; పరిచయస్తులందరిచేతా చదివించి వాదన చెయ్యడం ఆయనకి వేడుక కాదు,– తన నిబద్ధతకి నిదర్శనం. అటు శ్రీశ్రీనీ, ఇటు విశ్వనాథనీ ఒకేబిగిన చదివి వాళ్ళ కవిత్వాన్ని సమానంగా మెచ్చుకోగలగడం చాలామందికి సంకటంగా ఉండేది. (నిజం చెప్పద్దూ! ఆ రోజుల్లో మాకూ కాస్త ఇబ్బందిగానే ఉండేది!)
మౌఖిక సాహిత్యంతో చిన్నప్పుడే ఉన్న పరిచయం, ప్రాచీన ఆథునిక సాహిత్యాల అధ్యయనం, సాహిత్యానికీ సాంఘిక అస్తిత్వానికీ జమిలిగా ఉన్న సంబంధం నిరూపించిన పాశ్చాత్య సిద్ధాంతాల పఠనం –ఈ అంశాలపై తన ప్రావీణ్యత తాను తరువాత రాసిన సిద్ధాంత వ్యాసం, తెలుగులో కవితావిప్లవాల స్వరూపం (6) లో స్పష్టంగా కనబడుతుంది. తెలుగు సాహిత్యచరిత్రగతికి ఒక నియతమయిన స్వరూపం ఉన్నదని నిరూపించినది ఆ పుస్తకంలో!
‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ గురించి రెండు మాటలు చెప్పడం అవసరం. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారివద్ద పిఎచ్.డి. డిగ్రీ కోసం రాసిన పరిశోధనా వ్యాసం ఈ పుస్తకం. 1974 లో నారాయణరావుగారికి విశ్వవిద్యాలయంవారు డాక్టరేట్ డిగ్రీ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా వ్యవహారిక భాషలో రాసిన తెలుగు థీసిస్! 1978 లో విశాలాంధ్ర ప్రచురణాలయంవారి ద్వారా ప్రచురించబడినది. మూడు దశాబ్దాలలో, చాలాకాలం ఎం.ఏ. విద్యార్థులకి పాఠ్య గ్రంధం అయినతరువాత కూడా, — అంటే ఇప్పటివరకూ, ఈ పుస్తకంపై చెప్పుకోదగిన విమర్శనా వ్యాసం రాలేదు. వచ్చిన బహు కొద్ది విమర్శలూ, పక్షపాతంతో రాసినవేనని చెప్పవచ్చు.
ఇరవై ఏళ్ళ క్రితం చలమాల ధర్మారావుగారు (ఆయన తెలుగు భాషకి, స్కూళ్ళల్లో తెలుగులో బోధనకీ, ప్రభుత్వం తగిన వనరులు కల్పించాలని చాలా కాలంగా నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ వ్యక్తి!) నాతో అన్నారు : నారాయణ రావు సిద్ధాంత గ్రంధం తెలుగులో విమర్శకి, పరిశోధనకీ చేసిన ఉపకారం, ఇంకొక పాతికేళ్ళ తరువాత తెలుస్తుంది,అని!
నారాయణ రావుగారు మేడిసన్‌లో విస్కాన్‌సిన్ విశ్వవిద్యాలయంలో గత మూడు దశాబ్దాల పైచిలుకు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. దక్షిణ ఆసియా విభాగంలోసాహిత్యంపై, సాహితీచరిత్రపై ఆయన చేసిన పరిశోధనలని గుర్తించి, విస్కాన్‌సిన్ విశ్వవిద్యాలయం నారాయణరావుగారిని కృష్ణదేవరాయ ప్రొఫెసర్ ఆఫ్ లాన్‌గ్వేజస్ అండ్ కల్చర్స్ ఆఫ్ ఏషియా గా గుర్తించి గౌరవించింది. భారత దేశ సాహిత్యాన్ని, ముఖ్యంగా దక్షిణ భారత సాహిత్యాన్ని, తెలుగుసాహిత్యం-చరిత్రలు నాభిస్థానంగా నిలబెట్టిన ఖ్యాతి నారాయణరావుగారిదే! అందుకే, ఆయనని కృష్ణదేవరాయ ప్రొఫెసర్ అని పేర్కొన్నారు! ఈ మూడు దశాబ్దాలలో నారాయణ రావుగారు చేసిన కొన్ని అనువాదగ్రంధాలు, రాసిన పుస్తకాలు, వ్యాసాలు గురించి సంక్షిప్తంగా ముచ్చటించుకుందాం.
మొట్టమొదటి అనువాద గ్రంధం, ధూర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర శతకం. 1987 లో బర్కెలీ విశ్వవిద్యాలయం ప్రచురించింది (7). శతక సాహిత్యం పై, రాజులకి కవులకీ మధ్య ఉన్న సంబంధాల చరిత్ర, కాలక్రమేణా ఆ సంబంధాలలో వచ్చిన మార్పులు నారాయణరావుగారు రాసిన వెనుక మాట లో అతి నైపుణ్యంగా చర్చించబడ్డాయి. ధూర్జటి కవిత్వాన్ని బాగా అర్థం చేసుకోడానికి ఈవ్యాసం చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో ఆయన (ఇతర పండితులతో కలసి) చేసిన అన్ని అనువాద గ్రంధాల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పడం అవసరం. అనువాదం ఎలా ఉన్నదీ, ఫలానా తెలుగు మాటకి ఫలానా ఇంగ్లీషు పదం సబబేనా కాదా అనే సాధారణమైన లౌకిక ప్రశ్నలు కాసేపు పక్కకినెట్టి, పుస్తకం చివర రాసిన వెనుక మాటల వ్యాసం చదవడం అవసరం. ప్రతి పుస్తకానికీ ఉన్న వెనుక మాటలలో ఆ పుస్తకానికి, ఆ పుస్తకం వచ్చిన శతాబ్దానికీ సంబంధించిన సాహిత్య సాంస్కృతిక చరిత్ర విమర్శనాత్మకంగా, కూలంకషంగా చర్చించబడి ఉండటం ఈ అనువాదాల ప్రత్యేకత.
తరువాతి అనువాదం (1990), పాల్కురికి సోమనాధుని బసవపురాణం (8). దీనిని ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయం వారు ప్రచురించారు. ఈ పుస్తకానికి రాసిన విమర్శనాత్మక పరిచయ వ్యాసం, టీక వ్యాఖ్యానం – విజ్ఞులకీ సాహితీ పిపాస ఉన్న విద్యార్థులకీ ఎంతో ఉపయోగకరమైంది.
తరువాతి పుస్తకం తెలుగు వారికి ఎంతో ముచ్చటగొలిపే అనువాదం; చాటుపద్యాల సంకలనం (9). ఈ సంకలనాన్ని (1998) బెర్కెలీ విశ్వవిద్యాలయం ప్రచురించింది. చాటువుల గురించి ఇంతకుపూర్వం విమర్శకులు చేసిన అపవాదులని అతి చాకచక్యంగా ఖండించిన వ్యాసాలు పుస్తకం ముందు, పుస్తకం చివర ఉన్నాయి. చాటు పద్యాలకున్న ప్రత్యేకత, మౌఖిక సాహిత్యంలో వీటి ప్రాముఖ్యత చదువరికి మంచి శిక్షణ ఇచ్చే వ్యాసాలు. ఈ వ్యాసాలు, చాటువుల పరిశోధనలో ముఖ్యాంశం – తారీఖులు, దస్తావేజులు కావని మేల్కొలిపి చెప్పే వ్యాసాలు.
ఈ చిన్న పరిచయ వ్యాసంలో, అన్ని పుస్తకాల గురించీ వివరంగా చెప్పడం సాధ్యం కాదు. అందుచేత, కేవలం ఒక జాబితా ఇస్తాను. 1994 లో క్షేత్రయ్య, రుద్రకవి, సారంగపాణి మొదలైన వారి పాటలు (10), 2002 లో సుమారు వెయ్యి సంవత్సరాల సంప్రదాయ సాహిత్యంనుండి ఏరి చేసిన అనువాదాల సంకలనం (11), 2003 లో ఇరవైవ శతాబ్దపు కవితల సంకలనం (12) చెప్పుకోదగ్గవి.
పింగళి సూరన గారి కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం (2003, 2006) వేరుగా పేర్కొనాలి (13, 14). ముఖ్యంగా, కళాపూర్ణోదయం దక్షిణ ఆసియా లో పదహారవ శతాబ్దంలో వచ్చిన మొట్టమొదటి నవలగా నిర్ధారించి రాసిన వ్యాసం, నవల చదివిన తర్వాత చదవవలసిన ప్రత్యేక వ్యాసం. ఇందులో సూరన్నని సెర్వాంటెస్ (Cervantes)తో పోల్చిన భాగాలు అనువాదకుల సునిశిత ప్రజ్ఞ కి నిదర్శనాలు. ఈ రెండు కథలూ అద్భుతమైన కథలు. తెలుగులో చదవడానికి బిడియపడేవారిని ఈ అనువాదాలు తప్పక ఆకర్షిస్తాయి.
2005 లో సుమారు ఒక వంద అన్నమయ్య కీర్తనలు (15) అనువదించబడ్డాయి. అన్నమయ్య పదాలు కొన్ని ఆధ్యాత్మికమని, మరికొన్ని శృంగారమనీ విభజించినా, ఈ పుస్తకంలోని వెనుకమాట చదివితే, ఈ రెండు విభాగాలూ ఒకదానితో మరొకటి ఎలా పెనవేసుకొని సమగ్రత చేకూర్చుతాయో బోధ పడుతుంది.
దక్షిణ భారత (సాహిత్య) చరిత్రకి సంబంధించిన రెండు పుస్తకాలు చెప్పుకోదగ్గవి. మొదటిది Symbols of Substance (1992), రెండవది Textures of Time (2002, 2003). ఈ రెండవ పుస్తకం 2004 లో ఫ్రెంచ్ లోకి అనువదించబడింది. ఇది తెలుగు లోకి అనువదించవలసిన అవసరం ఉన్నది.
త్వరలో రాబోయే పుస్తకాలు, సంస్కృతంనుంచి ఇంగ్లీషులోకి కాళిదాసు రచన – విక్రమోర్వశీయం, కన్యాశుల్కం అనువాదం (16), శ్రీనాథుని సాంస్కృతిక జీవిత చరిత్ర ఎదురుచూడదగ్గవి.
ఇవి కాక, సుమారు అరవై పైచిలుకు తెలుగు సాహిత్యంపై పరిశోధనా వ్యాసాలు (విశ్వనాథ సత్యనారాయణగారి హాహా హూహూ, వీరవల్లడు, అనువాదాలు వ్యాసాలుగా పేర్కొంటున్నాను, స్త్రీలరామాయణ పాటలు వగైరా…) ప్రచురించారు నారాయణరావుగారు.
ఉత్తర అమెరికాలో కనీసం ఒక పది పేరుమోసిన విశ్వవిద్యాలయాలలో తెలుగు బోధన, తెలుగు సాహిత్యంపై , తెలుగు సంస్కృతిపై, సాహిత్య సాంస్కృతిక చరిత్రపై పరిశోధన చెయ్యటానికి వెసులుబాటు కల్పించడం కోసం నారాయణ రావు గారు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
ముగింపుగా, మిలరెప (Milarepa) రాసిన లక్షపాటలనుంచి Jeff Schmidt (17) ఇంగ్లీషులోకి అనువదించిన ఒక పాట:
Devoid of form and color,
Excelling the sense of realms,
Is this wondrous mind
Out-reaching words and phrases.
మూలాలు:
- Syllables of Sky, Studies in South Indian Civilization in honor of Velcheru Narayana Rao, Edited by David Shulman, See Chapter 1, Oxford University Press (1995)
- Health Physics News, Letters to the Editor, June 2003 (?)
- See Syllables of Sky, See Chapter 7
- Syllables of Sky, See Chapter 5
- కాళహస్తీశ్వర శతకము, ధూర్జటి కవి, తాత్పర్య కర్త, కె. సింగరాచార్యులు, బాలసరస్వతీ బుక్ డిపో, 1993
- తెలుగులో కవితావిప్లవాల స్వరూపం, విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ-2, 1978
- For the Lord of the Animals: Poems from the Telugu Kalahastiswara Satakamu of Dhurjati, Hank Heifitz and Velcheru Narayana Rao, University of California Press, Berkeley, 1987.
- Siva’s Warriors: Basava Purana of Palkuriki Somanatha, Translation Assisted by Gene Roghair, Princeton University Press, 1990.
- A Poem at the Right Moment : Remembered Verses from Pre-Modern South India, Velcheru Narayana Rao and David Shulman, Universiy of California Press, Berkley, 1998.
- When God is a Customer : Telugu Courtesan Songs by Kshetrayya and Others. A. K. Ramanujan, Velcheru Narayana Rao and David Shulman, University of California Press, Berkeley, 1994.
- Classical Telugu Poetry: An Anthology, Velcheru Narayana Rao and David Shulman, University of California Press, Berkeley, 2002.
- Hibiscus on the Lake: Twentieth Century Telugu Poetry from India, Velcheru Narayana Rao, University of Wisconsin Press, 2003.
- Sound of the Kiss, or the Story that Must Never be Told: Translation of Kalapoornodayamu of Pingali Suranna, Velcheru Narayana Rao and David Shulman, Columbia University Press, New York, 2003.
- The Demon’s Daughter: A Love Story, Translation of Prabhavati Pradyumnam, Pingali Suranna, Velcheru Narayana Rao and David Shulman, State University of New York Press, 2006.
- God on The Hill: Temple Songs from Tirupati, Translation of Annamayya songs, Velcheru Narayana Rao and David Shulman, Oxford University Press, New York, 2005.
- Girl For Sale: Kanyasulkam, A Play from Colonial India by Gurajada Apparao, Translated by Velcheru Narayana Rao, University of Indiana Press, 2007.
- Hundred Thousand Songs of Milarepa, (2 Volumes), Garna C. C. Chang (Translator) University Books, New Hyde Park, New York, 1962 (The quoted song, #21 is from 365 Buddha, by Jeff Schmidt, 2002)