బ్రహ్మానందం, ఆనందో బ్రహ్మా అంటూ ముచ్చటగా మూడో టకీలా షాట్ వేసింతర్వాత, ప్రపంచ ఆర్థిక పరిస్థితి గురించి ఫమీదాకి పాఠం చెప్పడం మొదలెట్టాడు, బార్‌లో. ప్రతి శుక్రవారం ఫమీదాకీ బ్రహ్మానందానికీ ఇది మామూలు తతంగవే. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ యోయోలా పైకీ కిందకీ పోవడం, నూటికి తొంభైసార్లు కిందకే పోవడం జరుగుతూవుంటే, బ్రహ్మానందంకి అన్ని ఆర్థిక సిద్ధాంతాల మీద గౌరవం పూర్తిగా సన్నగిల్లిపోయింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంతా ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ అని సిద్ధాంతీకరించి, ప్రతి శుక్రవారం ఫమీదాకి ఈ కొత్త సిద్ధాంతం నూరిపొయ్యడం ఒక పెద్ద పనిగా తయారయ్యింది.
బ్రహ్మానందం రిజిస్టర్డ్ ఇండిపెండెంట్ స్టాక్ బ్రోకర్. డౌన్‌టౌన్‌లో ట్రాన్స్ అమెరికా భవనంలో నలభైరెండో అంతస్తులో రెండు గదుల ఆఫీసు. ఏ. బీ. బ్రోకర్స్, యెల్.యెల్. సీ. ప్రెసిడెంట్ ఆనంద్ బ్రహ్మా, ఎం. బి. ఏ, అనే పాలరాతి పలక ఆఫీసు గుమ్మం పక్కన గోడమీద అతికించి ఉంటుంది. ఫమీదా బ్రహ్మానందానికి పర్సనల్ అసిస్టెంట్. ముందు గదిలో మూడు ఫోనులు, మూడు కంప్యూటర్లూ, ఒక పెద్ద డెస్క్. దాని వెనకాల, ఎత్తు కుర్చీలో ఫమీదా. వెనక గదిలో బ్రహ్మానందం డెస్కు, కంప్యూటర్లూ, టెలిఫోన్లూ! గోడమీద పెద్ద సైజు టెలివిజన్. స్టాక్ బ్రోకర్ అని చెప్పుకున్నా నిజంగా బ్రహ్మానందం స్టాకులు కొనడం, అమ్మడం, కొనిపించడం, అమ్మించడం లాంటి పనులు చాలా అరుదుగా చేస్తాడు. అతగాడి వ్యాపారం తొంభై పాళ్ళు ద్రవ్య మారకం అని చెప్పాలి.
ముందుగా బ్రహ్మానందం పుట్టుపూర్వోత్తరాలు చెప్పడం అవసరం. బ్రహ్మానందం చిన్నప్పుడు ప్రతి క్లాసూ కనీసం రెండేసి సార్లు చదివాడు. “అదేమిటిరా?” అని ఎవరన్నా అడిగితే, “మంచి పునాది” అనేవాడు. అతనిది చాలా తీక్షణమైన బుద్ధి అని క్లబ్బులో అందరూ అనేవాళ్ళు. పేకాటతో వాడి బుద్ధి దినదిన ప్రవర్థ మానంగా వికసించడం మొదలయ్యింది. క్లబ్బులో పేకముక్కలు పంచగానే వళ్ళు విరుచుకున్నట్టుగా నటిస్తూ వెనక్కి వంగి వంగి, అతి నైపుణ్యంగా పక్కవాడి ముక్కలు చూసేసేవాడు. “అదేమిటయ్యా బ్రహ్మానందం?” అని ఎవడన్నా నిలదీస్తే, “అయ్యా! మన పేకముక్కలు మనం ఎప్పుడన్నా చూసుకోవచ్చు. పక్కవాడి చేతి జాతకం తెలిస్తే నెగ్గటం తేలికవుతుంది. ఇదే బ్రహ్మ సూత్రం” అనేవాడు. తన చిప్స్ జేబులో పెట్టుకొని, టేబుల్ మీద మిగితా అందరి చిప్స్ లెక్కపెట్టేసే వాడు. పక్క వాడి ఆర్థిక స్థితిమీద బ్రహ్మానందానికి ఎనలేని మమకారం.
బ్రహ్మానందం నాన్నగారు హైదరాబాదులో ఒక ప్రైవేటు బ్యాంకు జనరల్ మేనేజరుగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయన బావమరిది, అంటే బ్రహ్మానందం మేనమామ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా చాలాకాలం పనిచేసి, డెప్యూటీ కమీషనర్ గా రిటైర్ అయ్యాడు. వీళ్ళ ఇద్దరికీ పరిచయం లేని రాజకీయ నాయకుడు లేడు. ఎమ్మెల్లేలు, మాజీ మంత్రులు, తాజాగా ఎన్నికైన ఎంపీలు, ఒకడేమిటి, అందరూ వీళ్ళకి దోస్తులే! వీళ్ళిద్దరికీ తెలియని పోలీసు ఆఫీసర్లు, జడ్జీలూ లేరు. వీళ్ళ ఇళ్ళకి అన్ని పార్టీల నాయకులూ ఎప్పుడూ వచ్చీ పోతూ ఉండేవాళ్ళు. వీళ్ళ ఇళ్ళల్లో ఎప్పుడూ, ఏవో సంబరాలు, సంతర్పణలూ! అప్పట్లో, అంటే సుమారు ముప్ఫై యేళ్ళక్రితం మాట! వీళ్ళిద్దరి ఇళ్ళల్లోనూ సోడాలు పట్టే మిషనులు కూడా ఉండేవి. క్లబ్బులో అందరూ అంటూ ఉండేవాళ్ళు ‘ బ్రహ్మానందం ఒకచేత్తో వెండి చెంచా, మరోచేత్తో పేకముక్కా పట్టుకొని పుట్టాడర్రా’ అని. కాలేజీలో చదివే రోజుల్లోనే, బ్రహ్మానందం జేబులోఎప్పుడూ ఇరవై రూపాయిల నోట్ల కట్టలు ఉండేవి.
బ్రహ్మానందం నాన్నగారు బ్యాంకు మేనేజరు కాకముందు, తెలుగు దేశంలో ఎవరో గిట్టని తెలుగు వాళ్ళు ఆయన మీద ఏవేవో అభాండాలు వేసి,మూడేళ్ళపాటు ఆయన్ని ఉద్యోగంనుంచి సస్పెండ్ చేయించారు. బ్యాంక్ పైన కోర్ట్ కేసు పెట్టి, బ్యాంక్ వాళ్ళని హైకోర్ట్ దాకా ఈడ్చుకెళ్ళి ఆయన తన ఉద్యోగం తిరిగి సంపాదించుకున్నాడు ప్రొమోషన్‌తో సహా! అప్పుడే ఆయన బావమరిది పదిమందితో మాట్లాడి బాగా సహాయం చేసాడని అంటారు. ఆపైన తన కూతురు అనసూయ నిచ్చి బ్రహ్మానందానికి పెళ్ళి కూడా చేసాడు. బ్రహ్మానందం బి.ఎ. పాస్ అని విన్న మరుక్షణమే ఎం.బి.ఎ. చదువుకి, అమెరికా పంపించాడు తన స్వంతఖర్చుతో!
రెండేళ్ళల్లో మూడు యూనివర్సిటీలు మారి, చివరికి ఫ్లారిడా కోస్టల్ యూనివర్సిటీలో రిజిష్టరయ్యి, డిగ్రీ సంపాదించాడు, బ్రహ్మానందం. వెంటనే జె. జె. దోషీ అండ్ కంపెనీలో అసిస్టెంట్ బ్రోకర్ ఉద్యోగం సంపాదించాడు. జె.జె. దోషీ అండ్ కంపెనీకి బొంబాయి లోను, సూరత్ లోనూ బ్రాంచీలున్నాయి. ద్రవ్యమారక వ్యాపారంలో అతి సూక్ష్మమైన కిటుకులన్నీ స్వయంగా దోషీ గారి శిష్యరికం చేసి నేర్చుకున్నాడు. దోషిగారి వ్యాపారం నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు నగదు వ్యాపారం. ఆయన అనేవాడు “వ్యాపారంలో ఒకడి మీద మరొకడికి నమ్మకం ఉండాలి. రాతకోతలు, రసీదులు ఇవ్వడం పుచ్చుకోవడం నాకు పనికిరాదు. అది నా వ్యాపార సరళి కానేకాదు. నా జీవితంలో నేను ఒక్కడికి కూడా రసీదు ఇవ్వలేదు; ఒక్కడి దగ్గిర నుంచి కూడా రసీదు పుచ్చుకోలేదు”.
బ్రహ్మానందానికి నగదు వ్యాపారం ఏమీ కొత్త కాదు. క్లబ్బులో పేకాట అంతా నగదు వ్యాపారవే కద! ఇండియా వచ్చినప్పుడల్లా, దోషీగారి పర్మిషన్‌తో బొంబాయి బ్రాంచికి, సూరత్ బ్రాంచికీ వెళ్ళి వాళ్ళు చేస్తున్న ద్రవ్యమారకం వ్యవహారం స్వయంగా చూసి వచ్చాడు. దోషీ గారికి బ్రహ్మానందం మీద మంచి గురి కుదిరింది. నమ్మకం పెరిగింది. బ్రహ్మానందం దోషీగారికి కుడిచెయ్యిగా తయారయ్యాడు, పనిలో చేరిన కొద్దిరోజుల్లోనే! పోతే, బ్రహ్మానందం నాన్నగారికి, మావయ్యగారికీ హైదరాబాదులో ఉన్న ప్రతిష్ట, పలుకుబడి వివరాలన్నీ వాకబ్ చేసి తెలుసుకున్న దోషీ గారు, ఒక సుముహూర్తాన, బ్రహ్మానందాన్ని తన ప్రెవేటు ఆఫీసు గదిలోకి పిలిచి, “చూడు బ్రహ్మా! హైదరాబాదులో జె.జె.దోషీ కంపెనీ బ్రాంచీ పెడదామని ఉంది. ఏమంటావ్?” అని అడిగాడు.
తడుముకోకండా చెప్పాడు, బ్రహ్మానందం. “హైదరాబాద్ లో బ్రాంచీ పెట్టడం కన్నా మంచి ఉపాయం చెబుతా, వినండి. నేనే అమెరికాలో ఒక బ్రోకరేజ్ కంపెనీ పెట్టి హైదరాబాదు నుంచి రాబోయే వ్యాపారం అంతా బొంబాయి, సూరత్‌లో బ్రాంచీల ద్వారా చేయడం సులభం, లాభదాయకం,” అని దోషీగారితో అన్నాడు. “ఇది ఏ రకంగా మనకి లాభదాయకం?” అని దోషీగారు అడగ్గానే, “ఒక కంపెనీ బదులు రెండు వేరే కంపెనీ లయితే మనకి అమెరికాలో ఆదాయపు పన్నుల భారం సగానికి సగం తగ్గుతుంది, పేరుకి రెండు కంపెనీలు గానీ, వెనకమాటుగా జరిపే అసలు వ్యవహారం అంతా ఒక కంపెనీ ద్వారానే కదా! ” అని ఠకీమని దోషీగారికి సమాధానం చెప్పాడు. ఇదేదో దోషీగారికి తెలియని బ్రహ్మ విషయం కాదు; బ్రహ్మానందం తెలివికి, వ్యాపార వ్యవహారాలలో లౌక్యతకి షహబాష్ అని మెచ్చుకున్నారు. అంతే! పదిహేనేళ్ళ క్రితం, దీపావళి రోజున ఎ.బి. బ్రోకర్స్, ఎల్‌ఎల్‌సీ, ప్రారంభమయ్యింది.
హైదరాబాదు నల్ల రూపాయలని తెల్ల డాలర్లుగా మార్చడంతో మొదలైంది ఎ.బి. బ్రోకర్స్ వారి వ్యాపారం. అది బోణీ. అంతే! అప్పటినుంచీ నాన్నగారికి, మావయ్యగారికి ఉన్న పరిచయస్తులందరికీ, ఆ పరిచయస్తుల దోస్తులందరికీ వాళ్ళ చుట్టాలకీ పక్కాలకీ అమెరికాలో బినామీ ఎక్కౌంట్లు ప్రారంభించాడు. ఆ ఎక్కౌంట్లు జాగ్రత్తగా చూసిపెట్టినందుకు మస్తుగా కమీషనులు ముట్టుతున్నాయి! మొదటి పదేళ్ళూ ఈ వ్యాపారం బాగానే జరిగిపోయింది, మూడు పువ్వులూ, ఆరుకాయల్లా!
ఫమీదా బ్రహ్మానందం కంపెనీలో బ్రహ్మనందానికి పర్సనల్ అసిస్టెంట్ గా చేరింది. కొద్దిరోజుల్లోనే ఆ పరిచయం చాలా దగ్గిర స్నేహంగా మారింది. అలా దగ్గిర స్నేహంగా మారడానికి ఒకరకంగా అనసూయే కారణం అని చెప్పాలి. అనసూయా బ్రహ్మానందాల సంసారం పెళ్ళయిన మొదటి మూడేళ్ళూ ముచ్చటగానే సాగింది. ఆ తరువాత అనసూయ మనసు అమెరికాలో దేవాలయాల మీదికి మళ్ళింది. ఎప్పుడూ ఏవో పూజలు, పునస్కారాలూ! ఆషాఢమాసం మినహా, ప్రతినెలా ఏవో నోములూ, వ్రతాలూ చెయ్యడంలో పుణ్యకాలం కాస్తా పూర్తయ్యేది. దానికి తోడు ఎడతెరిపి లేకండా అమెరికా వచ్చీపోయే అమ్మలూ, బాబాలూ! అనసూయా బ్రహ్మానందాల జీవితంలో పెద్ద అగాథం గానీ కందకం గానీ పడిందని చెప్పలేం గానీ, ఒక చిన్న గండి పడిందనే చెప్పాలి. బ్రహ్మానందం ఒక్కొక్కసారి రెండు మూడు రోజులుపోయినా ఇంటికొచ్చేవాడు కాదు. ఇక వారాంతంలో అసలు కనిపించేవాడు కాదు. అనసూయ ఇదంతా పట్టించుకున్నట్టే ఉండేది కాదు. ఆవిడ లోకం ఆవిడదే!