సంజయ్ సుబ్రహ్మణ్యం (Sanjay Subrahmanyam) యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్ ఏంజిలిస్, చరిత్ర విభాగంలో విశిష్ట ఆచార్యుడిగా, వలసపాలన పుర్వపు భారతదేశ చరిత్రను పరిశోధిస్తుంటారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి 1987లో డాక్టరేట్ పట్టా పొందారు. 1995 నుంచి 2004 దాకా పారిస్, స్కూల్ ఆఫ్ సోషల్ స్టడీస్‌లో అధ్యాపకుడిగా పనిచేసిన సంజయ్, బహు గ్రంథకర్త, ఇన్ఫోసిస్ హ్యుమానిటీస్ ప్రైజ్ 2012 గ్రహీత.]
[మూల వ్యాసం in English]
వెల్చేరు నారాయణ రావుని నేను మొదటిసారి ఫిలడెల్ఫియాలో, 1987 చివర్లో కలిశాను. అప్పుడతనికి యాభై ఐదేళ్ళు, అప్పుడెలా ఉన్నాడో చూడడానికి ఇప్పుడూ అలాగే ఉన్నాడు ఇరవైదేళ్ళ తర్వాత కూడా. కొంచెం జుట్టు పల్చబడింది, అంతే. వీఎన్నార్, హాంక్ హెఫెట్జ్ అనువాదం చేసిన ధూర్జటి కాళహస్తీశ్వరశతకం పుస్తక సమీక్ష లోనూ, షూల్మన్ అతనితో కలిసి వ్రాసిన పుస్తకం ది కింగ్ అండ్ ది క్లౌన్ ముందుమాటలో వీఎన్నార్ గురించి అప్పటికే చదివి వున్నాను. షూల్మన్ చెప్పిన సంగతులు, ఇతరత్రా కూడా విన్న విశేషాలతో నారాయణ రావుని ఎంతో గంభీరంగా ఊహించుకున్నాను. కానీ, నేను కలిసిన వీఎన్నార్ ఎంతో నమ్రతతో బిడియస్తుడిగా అనిపించాడు. డేవిడ్ షూల్మన్ ఆ ఏడాది ఫిలడెల్ఫియా లోనే ఉన్నాడు. మేమంతా అక్కడికి చేరుకోవడానికి కారణం ఆంత్రొపాలజిస్ట్ అర్జున్ అప్పాదురై, భారతీయ జానపద సాహిత్యం మీద ఏర్పాటు చేసిన సమావేశం. అందులో నారాయణ రావు ప్రసంగం కూడా అతని లాగే ఏ ఆర్భాటమూ లేకుండా సాగింది, మిగతా కొందరు అమెరికన్ వక్తల ప్రసంగాలలా కాకుండా. ఆ రోజు సాయంకాలం అర్జున్ ఇంట్లో విందుకి కలిసినప్పుడు కూడా, నారాయణ రావు అందరి మధ్య కొంచెం ఇబ్బందిగా, సంకోచిస్తున్నట్టుగానే అనిపించాడు. ఆ హడావిడిలో, ఒక ఐదూ పది నిమిషాలు దొరికిందేమో నాకు అతనితో మాట్లాడడానికి, అంతే. కానీ, వీఎన్నార్, షూల్మన్ అప్పటికే కొనసాగిస్తున్న చర్చలో నేను ఆ తర్వాత భాగం కావడం, పర్యవసానంగా మేము కలిసి రాసిన పుస్తకం సార్ధక ప్రతీకలు (Symbols of Substance) 1992లో ప్రచురణకు రావడం జరిగింది.
షూల్మన్, వెల్చేరు, సుబ్రహ్మణ్యం
ఆ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ముగ్గురమూ, వేరు వేరు చోట్లలో, వేరు వేరు సమయాల్లో ఉండడంతో ఎప్పుడూ ఒక చోట కలుసుకోలేక పోయేవాళ్ళం. అందుకని ఆ పుస్తకానికి రెండు వైపుల నుంచి మేము పనిచేసే వాళ్ళం. వీఎన్నార్, డేవిడ్ ప్రధానంగా సాహిత్యాధారాల మీద పని చేసేవారు. నేను, డేవిడ్ ముఖ్యంగా కవిలెలు, శాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలను పరిశోధించే వాళ్ళం. ఇలా డేవిడ్ మా ఇద్దరికీ మధ్య కేంద్ర బిందువులా ఉండేవాడు. కానీ, ఆ పుస్తకానికి సంబంధించిన ముఖ్యమైన ఆలోచనలు చాలా వరకు వీఎన్నార్ నుండే వచ్చాయి. అప్పటికే అతను, బర్టన్ స్టెయిన్ (Burton Stein) ప్రతిపాదనల వల్ల దక్షిణ భారత చరిత్రలను విశ్లేషించడంలో వచ్చిన మార్పులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. పుస్తకం మొదటి ప్రతి బహుశా 1990లో అనుకుంటాను, పూర్తయింది. అప్పుడు ఫ్లాపీ డిస్కులను పోస్టులో ఒకరికొకరం ఎన్నిసార్లని పంపుకున్నామో. అలా మా పరిష్కరణ అంతా ఫ్లాపీలు మెయిల్లో పంపుకోవడం తోనే జరిగింది. పుస్తకం 1992లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించినప్పుడు వీఎన్నార్ ఢిల్లీకి వచ్చేదాకా నేనతన్ని మళ్ళీ కలుసుకోలేదు. [ఈ పుస్తకం ముందుమాట ఇక్కడ.]
ఢిల్లీ డిఫెన్స్ కాలనీలో సాగర్ రెస్టారెంట్ అని ఉండేది. 1992 చివర్లోనో, 93 మొదట్లోనో అనుకుంటాను. నేనూ, వీఎన్నార్ అక్కడ ఒకరోజు తీరిగ్గా ఇడ్లీ, వడై తింటూ మొదటిసారి వివరంగా ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాం. డేవిడ్‌తో కలిసి మేము ముగ్గురం ఇంకా ఏ విషయాల మీద అధ్యయనం చేస్తే బాగుంటుందో చర్చించుకున్నాం. ఇక్కడొక సంగతి చెప్పాలి. వీఎన్నార్కి మా అమ్మ వయసు ఉంటుంది. (రెండు వారాలు చిన్న, నిజానికి.) ఇలా వయసు తేడా ఉన్నప్పుడు, ప్రత్యేకించి మన దేశంలో, ఒక గురు శిష్య సంబంధం లాంటిది వెంటనే ఏర్పడుతుంది. కానీ వీఎన్నార్తో నాకు ఏర్పడింది సమవుజ్జీల మధ్య ఉండే స్నేహం. ఇలా పెద్దా చిన్నా అని కాకుండా సమవయస్కుల మధ్య ఉండే స్నేహం లాంటిది ఏర్పడడానికి కారణం వీఎన్నార్ ప్రవర్తనే. అతనికి, తనకు ఎంత తెలుసో బాగా తెలుసును. అలాగే ఎంత తెలీదో, ఏమి తెలీదో కూడా అంతకంటే బాగా తెలుసును. నారాయణ రావు బిడియస్తుడు అని నాకు కలిగిన మొదటి అభిప్రాయం తప్పని అర్థమయింది. కానీ ఆ నమ్రత వెనుక ఎంత లోతైన మనస్తత్వం దాక్కొని వుందో కూడా నాకు అప్పుడే తెలిసింది.
అలా, మా వృత్తి రీత్యా పరిచయం 1987లోనే మొదలయినా, వ్యక్తిగతంగా స్నేహం 93నుంచే పెరిగింది. ఇక అప్పటి నుంచీ తరచుగానే కలుసుకున్నాం: ఢిల్లీ, హైద్రాబాద్, జెరూసలేం, పారిస్, బెర్లిన్, మాడిసన్. అప్పటికీ, ఎప్పుడో ఒకసారి గానీ మేము ముగ్గురం ఒకేచోట కలుసుకోగలిగే వాళ్ళం కాదు. కానీ కొంత కాలం పాటు కలిసి ఉండే అదృష్టం ఒకసారి 2000-01 మధ్య బెర్లిన్‌లో ఉండి భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం (Textures of Time) పుస్తకాన్ని పూర్తి చేసినప్పుడు దొరికింది. అలా వీలు కానప్పుడు, లేదూ డేవిడ్ లేనప్పుడు, వీఎన్నార్, నేను కలిసి వేరే అంశాల మీద కలిసి పనిచేసేవాళ్ళం. మేమలా కలిసి చేసిన పని రకరకాలుగా ఉండేది. కొన్ని సార్లు, ఒక ఖచ్చితమైన ప్రశ్నకు సమాధానం కోసం పరిమితంగా కొన్ని పుస్తకాల మీదే మా దృష్టి నిలిపి వాటినే లోతుగా విశ్లేషించేవాళ్ళం. ఇంకొన్ని సార్లు, చాలా విస్తారమైన ఒక ప్రతిపాదనని ఎలా నిరూపించాలో, ఏ ఆధారాలు కావాలో స్పష్టంగా తెలియకపోయినా సరే వెతుక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ‘భారతీయ చరిత్ర రచన: శైలీ లక్షణం’ అలానే మొదలయింది. ఆ పుస్తకానికి నాంది ఇలా పడింది.
1995 మొదట్లో అనుకుంటాను రెండు వారాలు నేను జెరూసలేం వెళ్ళాను. వీఎన్నార్ అప్పుడు ఆ ఏడాదంతా అక్కడే ఉన్నాడు. డేవిడ్ విపరీతమైన పని ఒత్తిడిలో ఉండడంతో సాయంకాలం పూట, గంట, రెండు గంటలు మాత్రం కలిసేవాడు. కానీ వీఎన్నార్, నేను, రోజంతా కలిసే ఉండేవాళ్ళం. పొద్దునే ఫలహారం తిని ఊరు చుట్టి వచ్చేవాళ్ళం. లేకపోతే అపార్ట్మెంట్ లోనే కూర్చోని మాట్లాడుకునే వాళ్ళం. రాత్రిపూట వంట చేస్తూ గడిపేవాళ్ళం. దేశింగ రాజు కథ మీద నేను రాస్తున్న వ్యాసం అప్పటికి దాదాపు పూర్తి కావచ్చింది. వీఎన్నార్ అప్పుడు కుమార రాముని కథ చదువుతున్నాడు. అలా ఆ రెంటి గురించి మేము ముగ్గురం ఒక పూట మాట్లాడుకుంటున్నప్పుడు, చర్చ వలసపాలనకు ముందు భారతీయులకు చారిత్రక స్పృహ లేదు అన్న అభిప్రాయం మీదకు మళ్ళడం, ఈ విషయం మీద పుస్తకం వ్రాస్తే బాగుంటుందన్న ఆలోచన రావడం, వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ పుస్తకానికి కేంద్రంగా టెక్స్చర్ (Texture) అన్న పదాన్ని వీఎన్నార్ ఒక్క రోజులోనే ప్రతిపాదించాడు. ఆ తర్వాత ఎన్నో రోజులు మేము ఆ పదం మీద చర్చిస్తూ కూర్చున్నాం.
కలనేసిన ఊలు కంబళీని మనం చూస్తే పడుగు పేకలా ఊలు కలిసిపోయిన కంబళీ అంతా ఒకే రకంగా ఉండదు. ఊలు చుట్టులో తేడాలుండడం చేతో, నేతలో బిగి, వదులు ఇలా హెచ్చుతగ్గుల వల్లనో తేడాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల గరుకు గానూ, కొన్ని చోట్ల నునుపుగానూ ఆ కంబళీ వుంటుంది. లేదూ ఒకే రకంగా కనిపించే కొన్ని కంబళీల మధ్య తేడా వుంటుంది. ఇది పరీక్షగా చూస్తే గానీ గమనించలేం. అదే విధంగా సాహిత్యం అంతా ఒకే రకమైన సాహిత్యం లాగా, ఒకే రకమైన కంబళీ(లు)గా కనిపించినా, కంబళీ కలనేతలో లాగానే, ఆ సాహిత్యపు అల్లికలో కూడా హెచ్చు తగ్గులు వుంటాయి. భాషను వాడిన తీరు, వ్రాసిన శైలిలో ఉండే తేడాలు, ఇవి సాహిత్యంలో పడుగు పేకలు. ఈ రెంటి కలనేత ఆ సాహిత్యానికి వున్న శైలీ లక్షణం. ఇదీ Texture (శైలీలక్షణం) అన్న పదం వెనుక ఉన్న అర్థం.
వీఎన్నార్ ప్రతిపాదన ముఖ్యంగా ఇది: పాశ్చాత్య సంస్కృతిలో లక్షణాల ఆధారంగా స్పష్టంగా జాన్రాలుగా (Genre) విభజించే పద్ధతి ఉన్నది. సాహిత్యాన్ని చారిత్రక గ్రంథాలనీ, కాల్పనిక సాహిత్యమనీ జాన్రాలుగా విభజిస్తారు. అటువంటి స్పష్టమైన భేదం లేని భారతీయ సాహిత్యాన్ని ఆ ధోరణిలో పరిశీలించడం సరికాదు. సాహిత్యం అంతా అలాంటప్పుడు ఒకే జాన్రాగా కనిపించినా, రచన అనుష్ఠించిన పద్ధతి, కథన సంవిధానం (శైలీలక్షణం) మనకు కలిగించే అనుభవం ద్వారా చారిత్రక సాహిత్యాన్ని కాల్పనిక సాహిత్యం నుండి వేరు చేసి మనం చూడగలం.
అంటే వలస పాలనకు పూర్వం భారతీయ సాహిత్యంలో చారిత్రక స్పృహ లేకపోలేదు. కానీ అది ఇతర సాహిత్యంలో కలిసిపోయింది. ఆ చారిత్రక సమాచారాన్ని కాల్పనిక సాహిత్యం నుండి వేరు చేసి చూడడానికి సూక్ష్మదృష్టి, సుశిక్షితమయిన శ్రవణం కావాలి. ఇవి లేని సాధారణ పాఠకుడు పొరపడే అవకాశం ఎంతో ఉంది. అందువల్ల సాహిత్యము, చరిత్ర పడుగు పేకలా కలిసిపోయిన ఈ అల్లికలో ఏదెలా గుర్తించాలి అన్న విషయంపై ఆధారాలు వెతకడం మొదలు పెట్టాం. అందులో భాగంగానే బొబ్బిలి గురించిన కథలు ఆ పుస్తకంలో మొదటి అధ్యాయాలకు మూలం అయ్యాయి. రెండేళ్ళ తరువాత, మాడిసన్లో కలుసుకున్నాం. వీఎన్నార్ పుస్తకాలు, ఆఫీసు ఇంటి బేస్మెంట్లోనే ఉండేవి. అక్కడే కూర్చుని ఆ మొదటి అధ్యాయాల మొదటి ప్రతి పూర్తి చేశాం. 2000 అక్టోబర్‌లో బెర్లిన్ విస్సెన్షాఫ్ట్ కళాశాలకి (Wissenschaftkolleg) మేము చేరుకునేటప్పటికి మధ్య అధ్యాయాలు పూర్తి చేయగలిగాం. ఇక మిగిలిందల్లా, రాజులు కరణాల మీద అధ్యాయం, ఆఖరి అధ్యాయం, ఉపోద్ఘాతాలు. ‘సార్ధక ప్రతీకలు’ వ్రాసినప్పటిలా కాకుండా ఇప్పుడు బెర్లిన్‌లో అన్ని సౌకర్యాలతో కలిసి కూర్చుని, కొన్ని నెలల పాటు మొదటి ప్రతిని పరిష్కరించుకుంటూ వచ్చాం. అలా మెరుగులు దిద్దుకోవడంలో రోజులు గడిచిపోయాయి. అప్పుడప్పుడూ, డేవిడ్, వీఎన్నార్ వేరే అనువాదాల మీద పని చేస్తుండేవారు. నేను, ముజఫర్ ఆలమ్ కలిసి నలదమయంతుల కథ పర్షియన్ అనువాదంపై పని చేసేవాళ్ళం. మేమంతా గ్రునెవాల్డ్లో ఒకే విల్లాలోనే వుండేవాళ్ళం కావడంతో ఇలా ఏకాగ్రతతో పనిచేయడానికి అనువైన ఏకాంతం మాకు దొరికింది.
బెర్లిన్‌లో ఇలా ఒక ఏడాది పాటు కలిసి గడపడం, నారాయణ రావుని లోతుగా అర్థం చేసుకోవడానికి నాకెంతో ఉపయోగపడింది. అతని ఆలోచనల తీరు, భారతీయ సంస్కృతీ సాహిత్యాలను అధ్యయనం చేస్తున్న పద్ధతుల్లో మార్పు కోసం దేశవిదేశాల్లో అతను చేస్తున్న కృషి, అతని తపన నాకు వివరంగా తెలిసి వచ్చాయి. కొందరు విదేశీయులు భారతీయ సంస్కృతిని విశ్లేషించే పద్ధతులతో అతనికి చిక్కులుండేవి. అంతకంటే ఎక్కువగా ఆధునిక భారతీయ పరిశోధకులు ప్రాచీన సాహిత్యం మీద చేసే విశ్లేషణలు, ప్రతిపాదనలు అతన్ని విసిగించేవి. అవి అర్థసత్యాలనీ, నిర్ధారించలేని వ్యాఖ్యానాలనీ, వాటిపై విశ్వాసం ఉంచుకొనే విధంగా లేవని ఎంతో బాధ పడేవాడు. అటువంటి విశ్లేషణలను అతనెప్పుడూ ఒకే మాటతో (విక్టోరియన్, అని) తీసిపారేసేవాడు.