(వెల్చేరు నారాయణరావు గారు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్‌సిన్ , మేడిసన్‌లో కృష్ణరాయ చైర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తెలుగు సాహిత్య విమర్శకుడిగా ఎన్నో గొప్ప రచనలు చేసారు. తెలుగు కవిత్వం గురించిన ఒక గ్రంథాన్ని (ఆంగ్లంలో) ఈ మధ్యనే పూర్తి చేసారు. తెలుగు సాహిత్యానికి ప్రపంచ సాహిత్య విమర్శ రంగంలో సమున్నత స్థానం కల్పించటానికి వీరి కృషి ఎంతగానో ఉపకరిస్తోంది.)
చాసో లాంటి కథకులు తెలుగులో మరొకరు లేరు. ఈ మాట ఆయన్ని పొగడడానికి అనడం లేదు. ఆయనలోనే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని గుర్తించడానికి అంటున్నాను. ఈ లక్షణం నేను గుర్తించినట్టుగా మీరూ గుర్తిస్తే చాసో మీకు నచ్చకపోవచ్చు కూడా.
తెలుగు కథావిమర్శకులలో చాసోని మెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వేళ్ళ మీద లెక్కపెట్టదగిన పదిమంది తెలుగు కథానికా రచయితలలో చాసో పేరుంటుందని రోణంకి అప్పలస్వామి గారన్నారట. తెలుగు మరిచిపోయినప్పుడే చాగంటి సోమయాజులుని మరిచిపోవడమని ఆరుద్ర గారు రాసారట.
చాసో ఈ పొగడ్తల కన్నిటికీ తగినవాడే. అంతమంది అంత చక్కగా పొగిడిన తర్వాతచాసోని మళ్ళీ అంత బాగా పొగడడానికైతే నేను ఈ వ్యాసం రాయక్కర్లేదు. ఆ పొగడ్తలన్నీ నాకూ ఇష్టమే కాబట్టి నేను వేరే పొగడవలసిన అవసరమూ లేదు.
చాసో కథ చక్కగా రాస్తాడు; మాట మాటా తూచి వాడతాడాయన. జాగ్రత్తగా తప్ప మరోలా చదవడానికి వీలివ్వవు చాసో కథలు. ఈ గుణం వొక్కటే చాసో ప్రత్యేకత అయితే, ఇలాంటి వాళ్ళు మరికొంతమంది లేకపోలేదు తెలుగులో. వాళ్ళూ కథకులుగా తక్కువ వాళ్ళేం కాదు. కాళీపట్నం రామారావూ, రాచకొండ విశ్వనాథశాస్త్రీ, చలమూ, కుటుంబరావూ ఇలాంటి చిక్కదనం వున్న రచయితలే. కాని వాళ్ళెవరికీ లేని ప్రత్యేక లక్షణం ఉంది చాసో కథల్లో.
చాసో కథల్లో ఉన్న మనుషులకి అంటే ప్రధాన పాత్రలకి ఆవేశాలుండవు; కామం, ప్రేమ, ఈర్య్ష, క్రోధం, ఇలాంటి ఉద్రేకాలుండవు. వాళ్ళు ఏ కోరికకీ లొంగిపోరు ఒక్క బతకాలనే కోరిక తప్ప.
జీవితంలో రెండే నిజాలు ఒకటి కామం, రెండోది డబ్బు. ఈ రెండిట్లో డబ్బు స్థిరమైనది. కామాన్ని సరిగ్గా వాడుకుంటే డబ్బు నిలవడానికి ఉపయోగపడుతుంది. సరిగ్గా వాడుకోకపోతే, అది వ్యక్తిని మింగేస్తుంది. చాసో పాత్రలకి ఈ సంగతి నిబ్బరంగా తెలుసు. మనిషి సుఖంగా బతకాలంటే ఏం చెయ్యాలో చాసో పాత్రలు సూక్ష్మంగా గ్రహిస్తాయి. దాన్ని గురించి ఉపన్యాసాలు చెప్పకుండా స్థిమితంగా ఆ గ్రహింపుని ఆచరణలోకి తెచ్చుకుంటాయి.
కామాన్ని ప్రేమ గానో, దానితో పాటు వచ్చే అసూయ గానో, త్యాగం గానో, మరో ఆదర్శవంతమైన ఆవేశంగానో మారనిచ్చావో జీవితంలో సుఖం ఉండదు. సుఖం దానంతట అది రాదు. సుఖం నువ్వు చేసుకునేది. అది అదృష్టం వల్లో, మరో సదుపాయం వల్లో వచ్చే వొస్తువు కాదు. ఆలోచనల వల్ల, లౌక్యం వల్ల, చాకచక్యం వల్ల మాత్రమే సౌఖ్యం సాధ్యం. నీతి, స్నేహం, న్యాయం, ధర్మం ఇవి నిజాలు కావు. కాని ఇవి ఉన్నాయని తెలివితక్కువ వాళ్ళు నమ్ముతారు. కాబట్టి వాటికి అస్తిత్వం ఉంది. వాళ్ళు నమ్ముతారు కాబట్టి, వాళ్ళే లోకంలో ఎక్కువ మంది కాబట్టి, నువ్వు వాటిని నీ సుఖం కోసం వాడుకోవచ్చు. కాని అవి నిజంగా ఉన్నాయని నువ్వు నమ్మేవో నువ్వూ లోకంలో నానాకష్టాలూ పడే వాళ్ళలో చేరిపోతావు. సంఘానికి సంస్కారం, చట్టుబండలూ అక్కర్లేదు. అది చెయ్యాలనున్నా జరిగే పని కాదు. నువ్వు చెయ్యవలసిన పని అల్లా నీ తెలివితేటలు వాడుకుని అవసరమైనప్పుడు, అవసరమైన పని చేసి అది నీతా, అవినీతా, మంచా, చెడ్డా అనే మీమాంసలు మానేసి సుఖంగా వుండడమే.
ఇది చాసో అనే పేరుతో చాగంటి సోమయాజులు రాసిన కథల్లో పాత్రలతో చెప్పించిన సంగతి అని అంటే, మీరు నమ్మరు.
ఆయన వ్యక్తిగా అభ్యుదయ రచయితల సంఘం స్థాపించిన వారిలో ఒకరు. ఆయన నిత్యజీవితంలో చాలా ఆదర్శాల కోసం పనిచేసారు. సాహిత్య ప్రయోజనం సంఘాన్ని ఉద్ధరించడమనీ, సాంఘికన్యాయం కోసం, సంఘంలో పీడితుల కోసం రచయిత కలం పట్టుకోవాలనీ గట్టిగా నమ్మారు. అంచేత నేను పైన చెప్పిన మాటచాసో కథల్లో ప్రధానాంశం అంటే ఒప్పుకోబుద్ధి కాదు.
అందుకే ఈ వ్యాసం.
చాసో రాసిన గొప్ప కథల్లో ఒకటి ఏలూరెళ్ళాలి అనేది. చెయ్యి తిరిగిన రచయితలు రాసిన కథ తిరిగి చెప్పడం కథకి అన్యాయం. అయినా, ఈ కథని ఇంతకుముందు చదివిన వాళ్ళకి కాస్త గుర్తు చెయ్యడం కోసం స్థూలంగా ఆ కథ సమాచారం చెప్తాను. కాని కథ సంపూర్ణంగా మీ మనసుకి పట్టాలంటే, మీరు ఆ కథ చదవడం తప్ప మార్గాంతరం లేదు.
ఒక వూళ్ళో వున్న ఒక వయస్సు మళ్ళిన ఆడిటరు గారికి మాణిక్యమ్మ గారు అని ఒక ముఫ్ఫై ఏళ్ళ రెండో పెళ్ళాం ఉండేది. అవిడకి పిల్లలు లేరు. ఆ వూళ్ళోనే కాలేజీలో చదువుకుంటూ తన ఇంటి పక్క అద్దెకుంటున్న ఒక పద్ధెనిమిదేళ్ళ కుర్రాడితో చనువుగా మాట్లాడుతుండేది. ఓ రోజున మాణిక్యమ్మ గారు ఆడిటరు గారు ఇంట్లో లేని సమయంలో ఆ కుర్రాణ్ణి మచ్చిగ్గా ఇంటికి పిలిచి గదిలోకి తీసికెళ్ళి కావిలించుకుని, ముద్దులు పెట్టి కామోద్రేకం కలిగించి సిగ్గు పడుతున్న ఆ అబ్బాయి సిగ్గుపోగొట్టి ప్రోత్సహించి అతనితో రహస్యంగా సంబంధం పెట్టుకుంటారు.
కొన్ని నెలల తర్వాత ఆ కుర్రాడు (అతని పేరు పురుషోత్తం) సెలవులకి ఇంటికి వెళ్ళి తిరిగొచ్చేసరికి ఆడిటరు గారు బదిలీ అయి మరో వూరు వెళ్ళిపోతారు. మాణిక్యమ్మ గారూ వెళ్ళిపోతారు. వాళ్ళే వూరు వెళ్ళారో పురుషోత్తానికి తెలియదు. పురుషోత్తం ఆవిడ కోసం కొంత బాధ పడి, చదువు పూర్తి చేసుకుని పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటాడు. అతను ఒకసారి రైల్లో పైబెర్తు మీద పడుకుని ప్రయాణం చేస్తూండగా ఎవరో ఒకావిడ స్వతంత్రంగా గుంజిగుంజి లేపుతుంది. ముందుగుర్తుపట్టడు కాని, తరవాత ఆవిడే మాణిక్యమ్మ గారని పోల్చుకుంటాడు.
మాణిక్యమ్మ గారు చాలా మారిపోయారు. గత తొమ్మిదేళ్ళలో చాలా జరిగాయి. ఆడిటరు గారు పోయారు. ఆవిడ తల సగం నెరిసింది. మనిషి లావయింది. మాణిక్యమ్మ గారు కుశలప్రశ్నలు వేస్తూ, “నీ కొడుకు భోజనానికెళ్ళాడు” అని అంటే పురుషోత్తానికేమీ బోధపడలేదు. “నీ పేరు తలుచుకోని రోజు లేదు; ఇంత ఆధరువు కలిగించావు. అంతే చాలు” అంటే అంతకన్నా అర్థం కాలేదు. తరవాత కబుర్లలో పురుషోత్తం తనకి పెళ్ళయిందనీ ఇద్దరు పిల్లలనీ చెప్పినప్పుడు మాణిక్యమ్మ గారు సునాయాసంగా “నీ పెళ్ళానికిద్దరు. నీకు ముగ్గురు” అన్నప్పుడూ అంతకన్నా వివరంగా “తొమ్మిదేళ్ళ వాడు. సామ్యం చెప్పినట్టొచ్చింది నీ మూడుమూర్తులూ. వొచ్చేక చూద్దువు గాని. ఎలాగో నన్నుద్ధరించేవు. నీ వరప్రసాదం ఉండబట్టి ఆయన గడించిన డబ్బు, పిత్రార్జితం, దఖలు పడ్డాయి. లేకపోతే నా మరుదులు ముండని చేసి మూల కూచోపెడుదురు”
అని స్పష్టంగా చెప్పిన తరవాత అసలు కథంతా పురుషోత్తం తలకెక్కింది. అతనితో పాటు పాఠకుడి తలకెక్కేది కూడా అప్పుడే.
ఆడిటరు గారు చాలా సంపాదించారు. మాణిక్యమ్మ గారు తన సొంత వూరు ఏలూరు వెళ్ళి, అక్కడ మేడ కట్టించుకుని కొడుక్కి ఇంగ్లీషు చదువు చెప్పిస్తున్నారు. ఆడవాళ్ళకి ఆస్తిహక్కులు లేని సమాజంలో కొడుకుండబట్టే ఆవిడకి ఈ సౌఖ్యం కలిగింది.
ఈ కథని చెప్పిన వక్త పురుషోత్తం. రైలు పెట్టెలో పైబెర్తు మీద పడుకున్న తనని ఎవరో గుర్తు తెలియని ఆవిడ స్వతంత్రంగా గుంజిగుంజి లేవదీసి కూచోపెట్టడంతో మొదలుపెట్టి పురుషోత్తం మనకి ఈ కథ చివరంటా చెప్తాడు. రైలు పెట్టెలో మొదలై, రైలు పెట్టెలోనే అంతమయిన ఈ కథని పురుషోత్తం మనకి ఆ తరవాత ఎప్పుడో చెప్పాడు. పురుషోత్తం మనస్సులో జ్ఞాపకాల ద్వారానే అంతకు పూర్వపు కథ మనకి తెలుస్తుంది. కథలో మాణిక్యమ్మ గారి మాటలూ, చేతలూ అన్నీ పురుషోత్తం జ్ఞాపకాల ద్వారా వొచ్చినవే.
ఈ పురుషోత్తాన్ని నిర్మించింది చాసో యే. కాని పురుషోత్తమే చాసో అనే భ్రమలో పడకూడదు. చాసో సొంత వూహలేమితో మనకి తెలియవు. ఈ రచయిత తన కన్న భిన్నమైన పాత్రని నిర్మించలేనంత సామాన్యుడు కాడు. తన వూహలే తన పాత్రల ద్వారా పలికించాలన్న అమాయకుడూ కాదు. కాదని మనకెలా తెలుసంటే, అతని రచనా నైపుణ్యం వల్ల, అతని కథనంలో గడుసుదనం వల్ల.
ఈ కథలో ఎక్కడా శృంగారం లేదు. ప్రేమ మాటలు లేవు. ప్రణయలేఖలూ, విరహాలూ లేవు. పురుషోత్తమే కథావక్త కాబట్టి అతని ప్రేమ భావాలే మనకి వినిపిస్తాయి. అతను కొంత అమాయకప్రణయం ఒలకబోస్తాడు. ఆడవాళ్ళతో అనుభవం లేనితనం అతని మాటల్లో, ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. మాణిక్యమ్మ గారి దగ్గర తన స్థితిని గురించి చెప్తూ తను ఆవిడ దగ్గర “మూర్తపు పెళ్ళికూతురిలా” మొహం వేలాడేసానంటాడు పురుషోత్తం.
తనకి అవిడెప్పుడూ గౌరవవాచకంలో మాణిక్యమ్మ గారే. ఆవిడకి తనెప్పుడూ చనువుగానూ లోకువగానూ ఉండే ఏకవచనపు పురుషోత్తమే. వాళ్ళ మధ్య ఏర్పడిన లైంగికబాంధవ్యం ఈ గౌరవస్థాయిల్ని మార్చలేదు సరికదా బలపర్చింది.
పురుషోత్తాన్ని లొంగదీసుకోడంలోనూ, అతనికి సైకిలు కొనిపెడతాననీ, ఉంగరం చేయిస్తాననీ ఆశ కబుర్లు చెప్పడంలోనూ, అతని మీద తన పెద్దతనాన్ని వినియోగించి అతన్ని చెప్పినట్టు వినేట్టు చేసుకోడంలోనూ తెలుగు లోకంలో ఆ రోజుల్లో అమ్మాయిని అదుపులోకి తెచ్చుకునే మొగాడిలాగా ప్రవర్తిస్తుంది మాణిక్యమ్మ గారు. ఆవిడ ప్రవర్తించే పద్ధతి చివరంటా అలాగే ఉంటుంది రైల్లో ఆవిడ పురుషోత్తంతో మాట్లాడే తరహాలో కూడా (మధ్యలో కాస్త ఏడిచి నప్పుడు తప్ప).
పురుషోత్తాన్ని ఆవిడ ఏలూరు రమ్మని పిలిచినప్పుడూ “నీ కొడుకు అదృష్టవంతుడోయ్” అని మొదలుపెట్టి తన ఆస్తి వివరాలు గర్వంగా చెప్పడంలోనూ, అవిడలో తన జీవితానికి తనే కర్తననే ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ రకమైన ఆత్మవిశ్వాసమే కాని, మాణిక్యాంబలో శృంగారం లేదు. ఆవిడ సంతోషమల్లా ఆస్తి మరుదులకి పోకుండా, తన గౌరవ ప్రపత్తులకి భంగం లేకుండా ఒక కొడుకు పుట్టాడనేదే. ఆవిడ స్వతంత్రంగా జీవిస్తోంది. పురుషోత్తాన్ని ఏలూరు రమ్మని పిలిచినప్పుడు తన ప్రస్తుత హోదాని చూపించుకుందామనే ఉత్సాహమే కాని, మళ్ళీ పాతసంబంధాన్ని కొనసాగిద్దామని కాదు.
అవిడ దృష్టిలో పురుషోత్తం కాసిన్ని వీర్యకణాలు సకాలంలో సమకూర్చిపెట్టిన మొగకుర్రాడు అంతే. కథ మొదటి భాగంలో పురుషోత్తం తనని గుర్తుపట్టలేకపోయినప్పుడు “ఔను మగాళ్ళవి రాతిగుండెలు. నెనరాపేక్షలుండవు. జ్ఞాపకాలుండవు. ఆడవాళ్ళు మనసులో ఉంటారా?” ఇత్యాదిగా ఆవిడ అన్న మాటలు లోకతీరుగా ఆవిడ ధోరణని గమనించాలే గాని, అందులో ఏదో గాఢమైన ప్రేమని గుర్తించాల్సిన అవసరం లేదు.
ఇంకొంచెం మామూలు రచయిత అయితే, ఈ కథని పిల్లలు లేకుండా విధవరాలైన స్త్రీని మరుదులు అన్యాయం చేసిన కన్నీటిగాధగా చిత్రించి ఉండేవారు. విధవా పునర్వివాహాలూ, స్త్రీ స్వాతంత్య్రమూ బోధించే సంఘసంస్కారపు అవసరాన్ని బలంగా చెప్పే సామాజిక చైతన్యం ప్రతిబింబించే కథగా తయారుచేసే వారు. లేదా ముసలిభర్తతో కాపరం తృప్తిలేక యవ్వనవంతుడైన కుర్రాడితో లేచిపోయిన శృంగార కథగా చేసేవారు. ఇంకా చాలారకాలుగా చెయ్యడానికి వీలుంది దీన్ని తక్కువరకం రచయితలు పట్టుకుంటే.
కాని చాసో అలా చెయ్యలేదు. నీతినియమాలూ, కులకట్టుబాట్లూ పకడ్బందీగా ఉన్న సమాజంలో చిక్కుకున్న ఆడది తెలివైనదైతే నిబ్బరంగా ఏ వ్యవస్థనీ ఎదుర్కొని తలబొప్పి కట్టించుకో నవసరం లేకుండా నిశ్చింతగా, స్వతంత్రంగా బతకొచ్చునని చూపించాడు చాసో.
చలాలూ, కుటుంబరావులూ తమ కథల్లో సమాజం మారాలని ఉపన్యాసాలు చెప్తారు. వాళ్ళ పాత్రలు సమాజంలో రావలసిన మార్పులకి ఉపకరణాలుగానో, మార్పులు రావాలని చెప్పడానికి సాధనాలుగానో ఉంటాయి.
చాసో తన కథలో అలాంటి సామాజిక బాధ్యత ఏమీ పెట్టుకోలేదు. మాణిక్యమ్మ గారికి సమాజం మీద గౌరవమూ లేదు; అగౌరవమూ లేదు. ఆవిడకి పాపం, పుణ్యం, నీతి, ప్రేమ, ఇలాంటి వాటి మీద అవసరానికి మించిన నమ్మకాలు లేవు.
అవసరమైతే, అవసరమైనంత వరకూ ఆవిడ నీతిని అతిక్రమిస్తుంది. అందులో తనేదో తప్పుచేస్తున్నాననే “నేరభావం” లేకుండా పరమసహజంగా ప్రవర్తిస్తుంది. ఆ తరవాత మళ్ళా యధాప్రకారం తన జీవితాన్ని నడుపుకుంటుంది.
ఆవిడకి తన భర్త మీద ప్రేమా లేదు, అసహ్యమూ లేదు. అభిమానం లేకపోనూ లేదు. ఆయన వల్ల తనకు పిల్లలు పుట్టరని తనకి తెలుసు. అందుకు కావలసిన ప్రయత్నం చేసుకుంది. అంతేకాని, ఏ దేవుణ్ణో, కర్మనో ఆశ్రయించుకుని విధవ అయి ఇబ్బందులు పడే రకం మనిషి కాదావిడ.
ఇంత స్వయం నిబ్బరం ఉన్న పాత్రనీ, కథనీ, ఏ సెంటిమెంట్లూ లేకుండా సునాయాసంగా తన గొంతు వినిపించాలనే సరదా పడకుండా నిర్మించిన రచయిత మనకి మరొక్కడే ఉన్నాడు. ఆయనా చాసో లాగా విజయనగరం వాడే. ఆయన పేరు గురజాడ అప్పారావు. ఆయన్ని గురించి ఇంకో సారి రాస్తాను గాని చాసో ఇలాంటి కథలు ఇంకా చాలా రాసాడని చెప్పడానికి మరో కథని గురించి కూడా వివరిస్తాను.
“లేడీ కరుణాకరం”
చాసో రాసిన ఈ కథ ఎక్కువ ప్రచారంలోకి రాలేదు. అంచేత చాలామంది చదివివుండక పోవచ్చును. ఈ కథకి వక్త చాసో పేరుతో వున్న రచయితే. అంచేత ఈ కథని మళ్ళీ నా మాటల్లో చెప్పినా కథకి పెద్ద అన్యాయం జరగదు.
ఈ కథలో కరుణాకరం అనే ఆయన పెళ్ళాం ప్రధానపాత్ర. కాని కరుణాకరమూ, ఆయన అత్తమామలూ కూడా ప్రధానమయిన వాళ్ళే. కరుణాకరానికి డబ్బు లేదు. అత్తమామలు డబ్బు పంపుతుంటే పట్నంలో వుండి చదువుకుంటూంటాడు. పెళ్ళాం పుట్టింట ఉంటుంది. ఆవిడ పేరు శారద.
శారదని ఊళ్ళో ఉన్న నాయుడికి తార్చి (ఈ మాట వాడడం కథాకాలానికి ఉన్న సామాజిక వాతావరణాన్ని స్పష్టపరచడం కోసం) ఆవిడ తల్లిదండ్రులు డబ్బు సంపాదిస్తూంటారు. ఆ డబ్బు కరుణాకరానికి పంపి అతని చదువు సాగేలా చూస్తూంటారు.
అత్తవారింటికి పండగకి వెళ్ళిన కరుణాకరానికి ఆ రాత్రి శారద కోసం వచ్చిన నాయుడు కంటబడతాడు. కరుణాకరం నిద్రపోతున్నాడనుకుని, శారద పక్కలోంచి లేచి గదికి బయట గొళ్ళెంపెట్టి నాయుడి కోసం పక్కగదిలోకి వెళ్తుంది. కరుణాకరం తలుపు కన్నంలోంచి చూస్తే ఇదంతా కనిపిస్తుంది. ఆగ్రహంతో కరుణాకరం తలుపు తీసుకుని బయటికి రాబోతాడు. కాని తలుపు బయట గొళ్ళెం వేసి వుండం వల్ల లోపల చిక్కుకుపోతాడు. తలుపు గబగబ తన్నేసరికి శారద తల్లిదండ్రులు వొచ్చి మరదలు పిల్ల హాస్యానికి తలుపుకి గొళ్ళెం పెట్టిందని మభ్యపరచ జూస్తారు. ఈ లోపున నాయుడు వెళ్ళిపోతాడు. కాని ఇదంతా చూసిన కరుణాకరం ఆవేశంతో, అసహ్యంతో, అత్తమామల మీద విరుచుకుపడతాడు. మామగారు నిలబడి అమ్మాయి అమాయకురాలనీ, తప్పంతా తమదేననీ, ఒప్పేసుకుంటాడు. కాని, ఆ పని కరుణాకరం చదువుకోసం విధిలేక చెయ్యవలసివచ్చిందనీ తనని సమర్థించుకుంటూ క్షమాపణ చెప్పుకుంటాడు. ఈ లోపున శారద కూడా మొగుడి కాళ్ళ మీద పడి తనని తల్లిదండ్రులు మాయమాటలు చెప్పి గొంతుకోసారని ఏడుపు మొదలుపెడుతుంది.
కరుణాకరం (తన పేరుకి తగ్గట్టుగా) ఆవిడమీద జాలిపడి, ఆ అర్థరాత్రి ఆవిణ్ణి తీసుకుని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.
ఇంతవరకూ డబ్బు సహాయం చేసే మామగారు డబ్బు పంపకపోవడంతో కరుణాకరం చదువు ఆగిపోతుంది. ఆ వూళ్ళోనే ఓ చిన్న గుమాస్తా ఉద్యోగం సంపాదించుకుని ఓ పేదబతుకు బతుకుతూంటాడు కరుణాకరం.
ఓ రోజున తను ఉంటున్న వీధిలో నాయుడు వెళ్తుండడం కరుణాకరం చూస్తాడు. అనుమానం కలిగి ఆ మన్నాడు ఆఫీసునుంచి కొంచెం ముందుగా వచ్చి వీధిలో మాటు వేస్తాడు. నాయుడు తన ఇంట్లోంచే బయటకు వెళ్ళడం చూస్తాడు.
పెళ్ళాం నిబ్బరంగా నాయుడు వొస్తున్న సంగతి ఒప్పుకుని, తన సందుగు పెట్టెలోంచి లెక్కలేనన్ని రూపాయల కట్టలు తీసి చూపించి, నాయుడి వల్ల కరుణాకరానికి ఏ అపకారమూ జరగలేదనీ, ఆడబ్బుతో పై చదువులకి చదువుకోమనీ సలహా చెపుతుంది.
మొదట్లో తీవ్రంగా ఆవేశపడి పెళ్ళాన్ని ఇంట్లోంచి పొమ్మన్న కరుణాకరం స్థితి పెళ్ళామే తిరగబడి “నువ్వే ఇంట్లోంచి పో” అని ఏకవచనంలో అనేసరికి తారుమారవుతుంది. పెళ్ళాం నెమ్మదిగా నచ్చజెపుతుంది. ఆ చచ్చు గుమాస్తా ఉద్యోగం మానేసి పెద్ద చదువులు చదవమంటుంది. మొగుడివి కాబట్టి నిన్ను పోషిస్తాను లేకపోతే బయటికి పో, నాయుడితో సుఖంగా ఉంటానంటుంది.
ఇప్పుడు కరుణాకరం పెళ్ళాం కరుణ వల్ల పైకి రావలసిన వాడయ్యాడు అంత డబ్బు తను జీవితంలో ఎప్పుడూ చూడనంత డబ్బు కనపడగా. ఆ అందమైన పెళ్ళాం సున్నితంగా మాట్లాడ్డంతో మెత్తబడతాడు. భార్య బహువచనంలో దగ్గరికి తీసుకుని కరుణాకరాన్ని ఒప్పిస్తుంది నాయుడు వల్ల లాభమే కాని, నష్టం లేదని.
కరుణాకరం ఉద్యోగం మానేసి కష్టపడి చదివి పైకొస్తాడు. భార్య కారు కొనిపెడుతుంది. బయట చాలా పెద్ద ఆఫీసర్లతో సంబంధాలు పెట్టుకుని, పార్టీలకీ, సభలకీ ముఖ్య అతిథిగా వెళ్తూ కరుణాకరానికి పైకి వెళ్ళే దారి సుగమం చేస్తుంది. చివరికి కరుణాకరానికి ప్రభుత్వం వారు పై ఆఫీసర్ల సిఫారసుతో “సర్” బిరుదు ఇస్తారు. శారద కరుణాకరం గారి భార్యగా లేడీ కరుణాకరం అవుతుంది.
ఈ కథ చాసో రచయిత గొంతుకతో చెప్పబట్టి అక్కడక్కడ ఈ రకమైన ప్రవర్తనని విమర్శిస్తున్నట్టు భ్రమ కలుగుతుంది. కాని జాగ్రత్తగా చూస్తే అలాంటిదేమీ లేదు. శారదని కుంతీదేవితో పోలుస్తూ రచయిత “ఆరుగురు పిల్లలని పరాయి దేవతలకి కన్న కుంతీదేవి పతివ్రతే అన్నారు. భర్త అనుమతి ఇస్తే తప్పులేదన్నారు శాస్త్రజ్ఞులు…. కుంతి పతివ్రతైతే శారదా పతివ్రతే.” అని రాయడం విమర్శగాదు, సమర్థనే. కాకపోతే గొంతుక కొంచెం కొంటె గొంతుక.
ఇంతకీ ఇందులో శారదకీ, “ఏలూరెళ్ళాలి”లో మాణిక్యమ్మ గారికీ, చెప్పుకోదగ్గ తేడా లేదు. ఆవిడ దృష్టిలోలాగా, ఈవిడ దృష్టిలో కూడా తను చేసిన పని నీతిలేని పని కాదు. మాణిజ్యమ్మ గారి లాగే, శారద కూడా ఎవరినీ ప్రేమించనూ లేదు, అసహ్యించుకోనూ లేదు. శారద అందమైనది, తెలివైనది. ఆ అందాన్ని పెట్టుబడిగా పెట్టుకుని, తెలివిగా మొగుడిని అట్టే పెట్టుకుని తను బాగుపడింది, మొగుణ్ణి బాగుచేసింది. వొట్టి చాదస్తాలు పెట్టుకోవద్దనీ, “నేను నీదాన్నే” అనీ మొగుడికి నచ్చజెప్పి తన పనులన్నీ చేసుకుంది.
అవకాశాలు వినియోగించుకుని తెలివితేటలతో అన్నీ వాడుకుని గౌరవంగా బతకడం ఒక్కటే పరమార్థం ఇదీ చాసో పాత్రలు చేసే పని.
సాహిత్యంలో మాకియవిల్లీ, చాణక్యుడూ, యుగంధరుడూ ఆ కోవలో వాడు చాసో.
మీకింకా నమ్మకం లేదా? ఇంకో కథ చెప్తాను. “బదిలీ” అని చాసో రాసిందే. ఈ కథ ఉత్తరాల రూపంలో వున్న కథ. ఈ ఉత్తరాలన్నీ ఒక పెళ్ళయిన ఆవిడ ఇంకో పెళ్ళయిన ఆయనకి రాసినవి. అంచేత ఇందులో రచయిత, అంటే చాసో గొంతుక వినబడదు. పైగా ఈ ఉత్తరాలకి సమాధానం రాసిన అవతలాయన గొంతుక కూడా నేరుగా వినబడదు.
ఈ పెళ్ళయిన ఆవిడని మొగుడు చూడడం మానేసి, ఒక సానిదాని ఇంట్లో వుంటూంటాడు. ఈ భార్యగారు ఒక్కర్తే ఉండగా ఇంటిపక్కన మేడ మీద పై అంతస్తులో ఉన్న ఈ పెళ్ళయిన ఆయన ఆవిడని తదేకంగా చూస్తూంటాడు.
ఓరోజు ఆవిడే ఆయనకి మొదటి ఉత్తరం రాస్తుంది ఎందుకలా నన్ను చూసి వేధిస్తున్నారు అని. ఆయన సమాధానం రాసాడని ఆవిడ రాసిన రెండో ఉత్తరంలో తెలుస్తుంది. ఆయన ఈవిణ్ణి తన గదిలోకి రమ్మంటాడు. ఈవిడ ఆయన్నే తన పెరట్లో నూతి చప్టా మీద పడుకుంటాననీ, అక్కడికి రమ్మనీ అంటుంది. అతను రాడు. చివరికి అతని పంతమే నెగ్గింది. ఈవిడే ఆయన గదిలోకి వెళ్తుంది.
ఆ తరవాత ఆయన ఈవిడ కోసం ఎంతకైనా తెగిస్తానని ప్రమాణం చేసాడని మనకి తెలుస్తుంది ఈవిడ మరో ఉత్తరం ద్వారా. ఈవిడ ఆయన్ని లేచిపోదాం రమ్మంటుంది. ఈవిడ పెట్టిన నిర్ణీతసమయానికి ఆయన రాడు. రెండు రోజులు వరసగా మేడ గదిలో కనిపించడు. తరవాత ఈవిడకి తెలుస్తుంది ఆయనకి పెళ్ళయిందనీ, పెళ్ళాం ఇంకో రెండు రోజుల్లో కాపరానికి వొస్తుందనీ.
ఈవిడ నిజంగానే కాస్సేపు ప్రేమపిచ్చిలో పడుతుంది. ఆయన్ని వొదులుకోలేననీ, తనని కూడా తీసుకుపొమ్మనీ, ఆయనకీ, ఆయన పెళ్ళానికీ కూడా సేవచేస్తాననీ రాస్తుంది.
కాని వెంటనే రాసిన ఉత్తరంలో ఈవిడ గొంతుక మారుతుంది. ఆయన తన పెళ్ళాం గొప్ప పొగుడుకుని వుంటాడు. పైగా ఈవిడ భర్తని తిడతాడు కూడా. అంచేత ఈవిడ తనని తాను నిబ్బరపరుచుకుని ఆయన పెళ్ళాం ఆయనని గొప్ప అయితే తన మొగుడు తనకి గొప్ప అని జవాబు రాస్తుంది.
ఆ తరవాత ఈవిడ తన భర్తని అదుపులోకి తెచ్చుకుంటుంది. ఆ పని తన బావ గారి సాయంతో తను ఎలా సాధించిందీ వివరంగా ఒక ఉత్తరంలో మేడ మీది ఆయనకి రాస్తుంది.
అయితే ఆయన ఈవిడ మీద మోజు వొదులుకోడు. మరోసారి తన గదికి రమ్మని ఉత్తరం రాస్తాడు. రాకపోతే తన ఉత్తరాలు తన మొగుడికి పంపుతానని భయపెడతాడు.
ఈవిడ భయపడదు. పంపించమంటుంది. నా మొగుడు చెడితే గదా నేను చెడ్డానని నిర్భయంగా చెపుతుంది. ఆ మేడ మీద అమాయకంగా ప్రేమించినట్టు కనిపించే మనిషి ఎన్ని అఘాయిత్యాలు ఇంతకు ముందు చేసాడో తనకు తెలిసిందని చెపుతుంది. ఆయన కొత్తపెళ్ళాం అనాకారి అనీ, అయినా డబ్బున్న కుటుంబాన్నుంచి వొచ్చింది కాబట్టి ఆవిణ్ణి నెత్తిమీద పెట్టుకోవాలనీ ఓ చురక అంటిస్తుంది. నల్లగా ఉన్న ఆవిణ్ణి నల్లబెల్లంతో పోల్చి బెల్లాన్ని పిల్లలు మండకి రాసుకుని నాకుతారనీ, అది మీకింకా తెలియదు అని ఓ గుప్తవాక్యంతో అవమానిస్తూ ఉత్తరం ముగిస్తుంది.
ఈవిడ చెడిపోయిన మొగుడితో కాపరం ససిలేక ఇంకోకొమ్మ పట్టుకుంటే ఆసరా దొరుకుతుందేమో అని చూసింది. ఆ కొమ్మ అవిటికొమ్మ అని తెలిసిన వెంటనే తన కాపరాన్ని తనే దిద్దుకోవడం మొదలుపెట్టింది. అవతలవాడికి లొంగిపోననీ, భయపడననీ చెప్పగలిగింది. మొగుడూ తనూ ఒకలాగే చెడ్డామనీ, ఇద్దరికీ చెడుసహవాసాలే అందుకు కారణం కాబట్టి ఇద్దరం బాగుపడ్డామనీ నమ్మకంగా బతికింది.
ఈవిడలో సంయమనమూ, సామర్య్థమూ, తెలివీ, చొరవా తన బాగుకీ, తన భర్త బాగుకీ కారణమయ్యాయి. ఆ ఉత్తరాల మొత్తం చూస్తే ఈవిడ ఎంత నిక్కచ్చిగా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలదో స్పష్టంగా తెలుస్తుంది తన ఆడతనాన్ని ఏమీ పోగొట్టుకోకుండా.
ఇప్పుడు మరోసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ మూడు కథల్లోని ఆడవాళ్ళూ సమానఫాయిదా కలవాళ్ళని తెలుస్తుంది. నీతులూ, అవినీతులూ తాత్కాలిక విలువలనీ, సుఖంగా జీవించడం ఒక్కటే పారమార్థిక విలువ అనీ వీళ్ళ జీవితవేదాంతం.
ఆవేశాలు, ఆదర్శాలు, సెంటిమెంట్లు, బలహీనతలు లేకుండా నిబ్బరమైన స్వార్థం ఉన్న వ్యక్తిని సాహిత్యంలో పెట్టడం తెలుగులో చాసో లాంటి పరమ ఆధునికుడే చెయ్యగలిగిన పని.
ఆయన కథలని అభ్యుదయ సాహిత్యంలో భాగం చెయ్యడంలో ఏదో పొరపాటుందని నా అనుమానం.