వసంతభామిని

వచ్చెనదె వాసంతిక
సుధాపూర్ణ విపంచిక
చారు సుందర సీమలందున
చైత్ర భామిని ప్రభవించగ
వనములందున మనములందున
పుష్ప సంచయ ప్రహేళిక
త్వరితగతినీ తలలనూచీ
మోసులెత్తును పసరిక
రెమ్మరెమ్మకు ఆకులతికే
కొమ్మ కోరిక మీరగా
వేప గంధముతనువుసోకీ
మొగ్గదాల్చిన మల్లిక
మావి చివురులు తీరమెసవీ
కుహుకళించెను కోయిలా
తోటలందున బాటలందున
విరులు దాల్చిన తరువులై
పూవుపూవును స్పృశించు వేడుక
పరిభ్రమించే భ్రమర రవమై
మించు వేడుక నుద్యమించే
హొయల పులుగుల వేకువై
భువన మోహన
యమున విహరణ
మధుర కామన
గురుతు లెరిగిన సమయమై
జగతి కంతకు జననితానై
ఇలను జీవము నింపగా


ఝాన్సీలక్ష్మి కొత్త

రచయిత ఝాన్సీలక్ష్మి కొత్త గురించి:

కొత్త ఝాన్సీలక్ష్మిగారు ప్రముఖ కవయిత్రి. ‘తత్త్వమసి’ అనే కవితా సంకలనాన్ని రచించారు. వీటితో పాటు, వివిధ సాహిత్య వేదికలపై డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలపై సమీక్ష, ‘పొద్దు’ ఊహాతీతం | పొద్దు వంటి పత్రికలలో ఎన్నో సున్నితమైన కవితలు, విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు.

 ...