యువకుడుగా భీమ్‌సేన్‌జోషీ
24 జనవరి 2011 తేదీన కాలంచేసిన భీమ్‌సేన్‌జోషీ మనదేశంలో చెప్పుకోదగ్గ హిందూస్తానీ గాయకులలో ఒకడు. 2009లో భారతరత్న బిరుదు లభించడమూ, మిలే సుర్ మేరా తుమ్హారా, వంటి టీ.వీ. ప్రదర్శనలూ, దక్షిణాదివారికి సంబంధించినంతవరకూ బాలమురళితో చేసిన జుగల్బందీ కచేరీలూ ఇటీవలి కాలంలో ఆయనకు ఖ్యాతి తెచ్చిపెట్టాయనేది నిజమే అయినప్పటికీ సంగీతకారుడుగా ఆయన దశాబ్దాల కిందటే పేరు పొందినవాడు.
ఎంతోకాలంనుంచీ పుణే నగరంలో నివసిస్తూ మహారాష్ట్రలో ఎక్కువగా సంగీతకచేరీలు చేస్తూ ఉండడంతో భీమ్‌సేన్‌జోషీ దక్షిణాదికి చెందినవాడనేది ఎక్కువగా గుర్తుకురాదు. ఆయన పుట్టిపెరిగిన ఉత్తర కర్నాటక ప్రాంతంనుంచి అనేకమంది గాయనీగాయకులు పేరుపొందారు. 1922లో గడగ్‌లో జన్మించిన జోషీని చిన్నవయసులోనే తల్లి చనిపోవడంతో సవతితల్లి పెంచిందట. 16 మంది పిల్లల్లో పెద్దవాడైన భీమ్‌సేన్‌జోషీకి చిన్నప్పటినుంచీ సంగీతమంటే ఇష్టమట. గుడిలోని భజనలూ, మసీదు ప్రార్థనలూ అన్నీ అతనికి బాగానే ఉండేవట. అతని తాతగారు కీర్తనలు పాడేవాడట. అతని తండ్రి సంస్కృత పండితుడు. ఇంగ్లీష్ టీచర్‌గా, స్కూలు హెడ్మాస్టర్‌గా పనిచేసేవాడు.
చిన్నప్పుడు భీమ్‌సేన్‌జోషీకి కొంత మొండివైఖరి ఉండేదట. ఎక్కువగా పాటల రికార్డులమ్మే దుకాణం బైట నిలబడి సంగీతం వింటూ కాలం గడిపేవాడట. అతన్ని 11వ ఏట ఎక్కువగా సమ్మోహితుణ్ణి చేసినది కరీమ్‌ఖాన్ పాడిన బసంత్ రాగం.
తండ్రి గురురాజ్‌జోషీ ఆశీస్సులు
సంగీతాభిమానం కారణంగా భీమ్‌సేన్‌జోషీ చదువు హైస్కూలు దశలోనే ఆగిపోయింది. తన 11వ ఏటనే ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా అతను సంగీతం కోసమని ఊరూరూ తిరిగాడు. ఒకరకమైన అశాంతీ, మొండితనం, తెగింపూ, పట్టుదలా అతన్ని ముందుకు నెట్టాయి. స్వస్థలమైన గడగ్‌నుంచి అతను బిజాపూర్, పుణే, బొంబాయి, గ్వాలియర్, బెంగాల్, జలంధర్ మొదలైన చోట్లన్నిటికీ వెళ్ళాడు. ఎన్నోసార్లు అతను టికెట్టు లేకుండానే రైళ్ళెక్కాడు. డబ్బు కోసం రైళ్ళలో భజనలు పాడి పొట్ట నింపుకున్నాడు. ఇళ్ళలో చాకిరీ కూడా చేశాడు. గ్వాలియర్‌లో ప్రసిద్ధ సరోద్ విద్వాంసుడు హాఫిజ్అలీని (నేటి కళాకారుడు అమ్జద్ అలీ తండ్రి) కలుసుకున్నాడు. ఆయన భీమ్‌సేన్‌జోషీకి మార్‌వా, పూరియా, లలిత్ వంటి రాగాల విశిష్టతను తెలియజెప్పాడు. జలంధర్‌లో మహారాష్ట్ర గాయకుడు వినాయక్‌రావు పట్వర్ధన్ అతని గోడు విని సవాయీ గంధర్వ గురించి చెప్పి, ‘మీ ప్రాంతంలోనే ఉంటూ ఆయనవద్ద సంగీతం నేర్చుకో’మని సలహా ఇచ్చాడట.
సవాయీగంధర్వగా పేరుపొందిన రాంభావూ కుందగోళ్కర్ (1886-1952) ఉస్తాద్ కరీమ్‌ఖాన్ శిష్యుడు. (సవాయీ గంధర్వ అంటే ‘ఒకటింబావు గంధర్వ’ అని అర్థం. ఆ రోజుల్లో ఎంతో పేరు పొందిన బాలగంధర్వకు ఇతనేమీ తీసిపోడనే అభిప్రాయంతో ఎవరో ఒకాయన ఇతన్ని సవాయీగంధర్వ అన్నాడట. అప్పటినుంచీ ఈ పేరు స్థిరపడిపోయిందట). మొత్తంమీద తన యాత్రలన్నిటినీ ముగించుకుని భీమ్‌సేన్‌జోషీ సవాయీగంధర్వ వద్ద శిష్యుడుగా చేరి 1940-1945 మధ్యలో సంగీతం నేర్చుకున్నాడు. గాత్రం నేర్పడానికి సవాయీగంధర్వ ఆ రోజుల్లోనే నెలకు పాతికరూపాయలు తీసుకున్నాడట. అప్పటికి భీమ్‌సేన్‌జోషీ తండ్రి గురురాజ్‌జోషీ నెలజీతం వందరూపాయలే అయినప్పటికీ ఆయన వెనకాడలేదు. గురుశుశ్రూషగా ఇంటిచాకిరీ అంతా చేసిన అయిదేళ్ళలో భీమ్‌సేన్‌జోషీ గురువువద్ద మూడే రాగాలు (తోడీ, ముల్తానీ, పూరియా) నేర్చుకున్నాడట. తక్కినవి గురువు కచేరీల్లో పాడుతున్నప్పుడూ, గంగూబాయి హానగల్ (1913-2009) వంటి సీనియర్ శిష్యులు పాడగా వినీ ఆకళించుకున్నాడు. సవాయీగంధర్వ ఇతర శిష్యుల్లో బసవరాజ్ రాజ్‌గురు (1917-1991), ఫిరోజ్ దస్తూర్ (1918-2008) మొదలైనవారుండేవారు.
గొప్ప సంగీతవిద్వాంసులందరూ కఠోరసాధన చేసి పైకొచ్చినవారే. భీమ్‌సేన్‌జోషీకి బాల్యస్నేహితుడైన కులకర్ణీ అనే ఒకాయన ఆ వివరాలు చెప్పాడు. భీమ్‌సేన్‌జోషీ తన ఇరవయ్యో ఏటనే సాయంత్రం 7గంటలకు మొదలుపెట్టిన సంగీతసాధనను మర్నాడు పొద్దున్న 6 దాకా కొనసాగించేవాడనీ, వేసిన గమకం వెయ్యకుండా పాడేవాడనీ అన్నాడు. అతను జీవితమంతా సీదాసాదా వ్యక్తిగానే ఉన్నాడనీ, కీర్తిప్రతిష్ఠల కోసం ఎన్నడూ పాకులాడలేదనీ చెపుతూ, భీమ్‌సేన్‌జోషీకి సంగీతం పట్ల విపరీతమైన ఆసక్తీ, రాఘవేంద్రస్వామి మీద భక్తీ మటుకు పుష్కలంగా ఉండేవని కులకర్ణీ అన్నాడు.
భీమ్‌సేన్‌జోషీ, గంగూబాయి
కులకర్ణీకూడా బొంబాయిలో కష్టపడ్డ మనిషే. బొంబాయి రేడియో ప్రోగ్రాములు సవ్యంగా వచ్చేదాకా భీమ్‌సేన్‌జోషీ బీదరికంతో కష్టపడ్డాడనీ, తాను మాటుంగాలో మరొక 20మంది కన్నడం కుర్రవాళ్ళతో కలిసి ఉంటున్న కొంపనుంచి చర్నీరోడ్డు దగ్గరున్న రేడియోస్టేషనుకు వెళ్ళడానికి ట్రాము టికెట్టు ఖర్చుకు అణా ఖర్చుపెట్టలేక 10 కి.మీ. కాలినడకనే వెళ్ళివచ్చేవాడనీ కులకర్ణీ అన్నాడు. ఆ తరవాత ప్రోగ్రాముకు 5 రూపాయల చొప్పున సంపాదించి, దానితో రెండేసి వారాలు గడిపేవాడనీ, నెమ్మదిగా అతని ప్రతిభ గురించి నలుగురికీ తెలిసిందనీ ఆయన చెప్పాడు.
భీమ్‌సేన్‌జోషీకి గాయకుడుగా లక్నో రేడియోస్టేషన్‌లో మొదటి ఉద్యోగం ఇప్పించినది ప్రముఖ గజల్ గాయని బేగం అఖ్తర్. అతను 1943లో బొంబాయి రేడియోకు బదిలీ చేయించుకున్నాడు. అక్కడ అతని ఎచ్.ఎం.వీ. రికార్డ్‌లూ, 1946లో తన గురువు షష్ఠిపూర్తికి చేసిన పాటకచేరీ మంచి పేరును తెచ్చిపెట్టాయి. అతను 1960లలో కచేరీలకని ఎన్ని ప్రయాణాలు చేసేవాడంటే అతనికి రైల్వే టైమ్‌టేబ్‌ల్ కంఠతా వచ్చుననీ, ఎయిర్‌హోస్టెస్‌ల పేర్లన్నీ క్షుణ్ణంగా తెలుసుననీ సాటి గాయకులు అనుకునేవారట!
భీమ్‌సేన్‌జోషీ పాడుతున్నప్పుడు ఆయన గొంతు ఖంగుమని మోగుతుంది. అంత తియ్యగా, మృదువుగా అనిపించదు. సవాయీగంధర్వ తన గురువుగారి మధురమైన గాత్రపద్ధతిని అనుకరించాడు గాని భీమ్‌సేన్‌జోషీ శైలిలో ఆ ధోరణి కాస్త తగ్గినట్టే అనిపిస్తుంది. భీమ్‌సేన్‌జోషీ పాటలో మార్దవం తక్కువే అనడానికి ఉదాహరణగా ఆయన పాడిన మియాఁ మల్‌హార్ మూడు భాగాల్లో చివరిది మేఘాల ఉరుములనూ, పిడుగులూ, మెరుపులనూ స్ఫురింప జేస్తుంది. అది వర్షఋతువుకు సంబంధించిన రాగం (ని2 స రి2 ప మ1 ప ని1 ద2 ని2 స, స ని2 ధ2 ని1 మ1 ప ని1 గ1 మ1 రి2 స) కనకనే ఆయన ఆ ధోరణిని ప్రదర్శించాడని వేరే చెప్పనవసరంలేదు. అందులోని రెండు నిషాదాల బిగువైన విన్యాసాలను గుర్తించినవారికి అద్భుతంగా అనిపించితీరుతుంది. ఆయన పాడిన దుర్గా (శుద్ధసావేరి) విన్నప్పుడు ఆయన నిర్దుష్టమైన శైలి మనను ఆకట్టుకుంటుంది. తాను అన్ని రకాల రాగాలనూ పాడననీ, తన పద్ధతికి నప్పేవాటినే ఎంచుకుంటాననీ ఆయన ఒక సందర్భంలో చెప్పాడు.
శాస్త్రీయసంగీతానికి ఆకర్షణీయమనిపించే కంఠధ్వని అంత ముఖ్యంకాదనేది తెలిసినదే. అటువంటి పట్టింపులుంటే వోలేటి వెంకటేశ్వర్లు వంటి గాయకులకు పేరు వచ్చేదే కాదు. డి.వి.పలూస్కర్ వంటి గాయకుల గొంతు ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే భీమ్‌సేన్‌జోషీ గాత్రంలో ఉన్న పుష్టిదనం యొక్క ఆకర్షణీయత తక్కువేమీ కాదు. ఆయనది శాస్త్రీయతతో ఏ మాత్రమూ రాజీపడని ధోరణి. రాగం మీద ఆయనకు ఎంతటి అభిమానమూ, అధికారమూ ఉండేదంటే కేవలం భక్తిగీతాలు పాడుతున్నప్పుడు కూడా ఆయన శైలిలో శాస్త్రీయధోరణి మోతాదు ఎక్కువగా ఉంటుందని కొందరు విమర్శ చేసేవారు. శాస్త్రీయరచనల్లో ఆయన పదాలు ఉచ్చరించే తీరు ఇతర హిందూస్తానీ గాయకులలాగే అస్పష్టంగా ఉన్నప్పటికీ, భక్తిసంగీతం పాడుతున్నప్పుడు మాత్రం మాటలను స్పష్టంగా పలుకుతూ, అర్థమయేట్టుగా పాడేవాడు. సంగీతంలో ఏ సందర్భంలో సాహిత్యం ప్రధానాంశమవుతుందో ఆయన వంటి అనుభవజ్ఞులకు బాగా తెలుసు. అహీర్‌భైరవ్ (చక్రవాకం) రాగంలో ఆయన పాడిన తీర్థ విఠ్ఠల భజన్ ఎంతో ప్రజాదరణ పొందింది.
భీమ్‌సేన్‌జోషీ సంగీతం గురించి నాకు చిన్నప్పుడే తెలుసు. 1960 ప్రాంతాలనుంచీ మా ఇంటికి రేడియో ప్రోగ్రాముల తెలుగు పక్షపత్రిక వాణి తెప్పించుకునేవాళ్ళం. (ఆ తరవాత అన్ని స్టేషన్ల వివరాలూ చూసేందుకని ఇంగ్లీష్ వారపత్రిక ఆకాశ్‌వాణీ తెప్పించుకున్నాం). ఆ రోజుల్లో ఏటా నవంబర్లో జరిగే రేడియో సంగీత సమ్మేళనంలో ప్రతిరాత్రీ తొమ్మిదిన్నరనుంచీ, ఆదివారాలు ఉదయమూ, రాత్రిళ్ళూ కూడా పేరుమోసిన సంగీతకారుల కచేరీలు ప్రసారం అయేవి. ఆ వివరాలన్నీ రేడియో పత్రికలో ముందుగానే ఫోటోలతోసహా అచ్చయేవి. అప్పట్లో బడే గులాంఅలీఖాన్, హీరాబాయి బడోదేకర్, అమీర్‌ఖాన్ మొదలైన ప్రసిద్ధులవి పెద్ద ఫోటోలు కాగా, భీమ్‌సేన్‌జోషీ వంటి ‘ప్రాంతీయ’ గాయకులవి చిన్నవిగా ఉండేవి. అటువంటివారి సంగీతానికి అప్పట్లో అభిమానులూ తక్కువేననిపించేది. 1957లో ఆయన పాడిన ముల్తానీ వింటే అప్పటి తీరు మనకు తెలుస్తుంది. ఆ కచేరీ వివరాలుకూడా ఈ లింకులో చదవవచ్చు. ఆయన పాటలోని వేగమూ, గమకాల (ఫిరత్) నిర్దుష్టతా, హిందూస్తానీ గాత్రశైలిలో సామాన్యంగా వినబడే సాధనకు (తయ్యారీ) అద్దంపడతాయి.
అయితే 1971లో నేను బొంబాయి జీవితం మొదలుపెట్టేనాటికి భీమ్‌సేన్‌జోషీ అక్కడ గొప్ప ప్రజాదరణ సంపాదించుకున్నట్టుగా తెలుసుకున్నాను. కొద్దిరోజుల తరవాత ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ నేను హాజరైన శంకర్‌లాల్ సంగీతసమావేశానికి భీమ్‌సేన్‌జోషీ కారణాంతరాలవల్ల రాలేకపోయాడనే వార్త విని, వచ్చిన వందలాది ప్రేక్షకులు హతాశులవడం గమనించాను. ఆయనకు దేశమంతటా ఎందరో అభిమానులున్నారనేది స్పష్టంగా తెలిసింది.
ఆ రోజుల్లో ఆయన పాడుతున్నప్పుడు చేసే చేష్టలు కాస్త విచిత్రంగా ఉండేవి. గమకాల విన్యాసాలను అనుసరిస్తూ రెండు చేతులూ బారచాపి, ఒక పెద్ద చక్రాన్ని గుండ్రంగా తిప్పుతున్నట్టూ, రెండు దారాల కొసలను రకరకాల పద్ధతుల్లో ముడివేసి, మెలిపెట్టి వాటిని విప్పుతున్నట్టూ ఎన్నెన్నో అభినయాలు చేసేవాడు. దీని గురించి 1972లో బాలమురళీకృష్ణ ఒకసారి ‘నరసింహావతారం’ అని చమత్కరించాడుకూడా! అయితే రాగ ప్రస్తారంలో నిమగ్నుడై పాడుతున్న భీమ్‌సేన్‌జోషీ మేటిగాయకుడు కనక ఎవరూ పెద్దగా ఈ పోకడలను విమర్శించేవారు కారు. ఇవన్నీ క్రమంగా తగ్గిపోయాయి.
భీమ్‌సేన్‌జోషీ పాడిన కచేరీలు నేను బొంబాయిలో డజన్లసార్లు విన్నాను. ఆయనకు కొంతకాలం తాగుడు వ్యసనం బాగా ఉండేది. ఒక కచేరీ మధ్యలో ఆయన పాడటం ఆపేసి, తమ సంప్రదాయం గురించిన ఉపన్యాసం మొదలుపెట్టాడు. పరిస్థితిని అర్థంచేసుకున్న ప్రేక్షకులు కొంత చనువుగా నవ్వుతూ అదంతా భరించారు. అయితే ఆయన గాత్రంలో మటుకు ఎటువంటి తొట్రుపాటూ తలెత్తలేదు. జలంధర్ ప్రాంతంలో జరిగిన మరొక కచేరీలో ఈ సమస్య ఒక పెద్ద రభసకు దారి తీసింది.
తరవాతి కాలంలో భీమ్‌సేన్‌జోషీ పాటకచేరీ చేసే పద్ధతి చాలా బావుండేది. ఆయనకు ప్రేక్షకులున్నారన్న సంగతి తెలుస్తోందా అని అనుమానం కూడా కలిగేది. తన ఆనందం కోసమూ, హార్మోనియం, తబలా కళాకారుల సాంగత్యం కోసమూ మటుకే పాడుతున్నాడా అనిపించేది. ఏనాడైనా ఆయనకు అభిమానుల్లో అన్ని వయసులవాళ్ళూ కనబడేవారు. హిందూస్తానీ ప్రేక్షకులు తమకు అభిమానపాత్రులైన కళాకారుల కచేరీలకు ఉత్సాహంతో వచ్చి, మనస్ఫూర్తిగా ప్రోత్సాహాన్నిస్తారు.
భీమ్‌సేన్‌జోషీకి సంగీతం గురించి చాలా వాస్తవికదృక్పథం ఉండేదని తెలుస్తుంది. బడే గులాంఅలీఖాన్ లాగా పాడబోయి తామంతా గొంతు చించుకున్నంత పని చేశామని ఒక సందర్భంలో ఆయన అన్నాడు. తన వంటివారు సామాన్యుల కోసం పాడితే ఉస్తాద్ అమీర్‌ఖాన్ వంటివారు సంగీతజ్ఞుల కోసం పాడతారని ఆయన అనేవాడు. అమీర్‌ఖాన్ చనిపోయాక చేసిన ఒక కచేరీలో మార్‌వా రాగంలోని ఆయన స్వీయరచన ఒకటి భీమ్‌సేన్‌జోషీ పాడి వినిపించాడు. అమీర్‌ఖాన్ స్వయంగా పాడిన ద్రుత్ ఖయాల్ రాజన్ పరీకర్ మార్వా రాగంపై రాసిన వ్యాసంలో ఇచ్చిన లింకులో చివరి రెండు నిమిషాలపాటు వినవచ్చు. భీమ్‌సేన్‌జోషీ దాన్ని పాడిన తీరు ఇది. ‘నాకు కరీమ్‌ఖాన్‌గారి కచేరీ వినే అవకాశం కలగలేదుగాని నేను శుద్ధకల్యాణ్ రాగం పాడుతున్నప్పుడు ఆయనే నన్ను ఆవేశించినట్టుగా అనిపిస్తుంది’ అన్నాడు భీమ్‌సేన్‌జోషీ.
భీమ్‌సేన్‌జోషీ గాత్రంలో తాను విని, అవగాహన చేసుకున్న విభిన్న గాయకశైలుల ప్రభావం శ్రోతలు గమనించవచ్చు. ఆ తత్వగ్రాహ్యత కారణంగా గ్వాలియర్ ఘరానాలోని బోల్‌తాన్ (సాహిత్యంలోని పదాలను రకరకాల గమకాల విన్యాసాలతో పాడే) పోకడలూ, ఆగ్రా ఘరానాలోని లయబద్ధమైన సంగతులూ, జైపూర్ పద్ధతిలో గొంతు విప్పి పాడే విధానమూ, కిరానా సంప్రదాయంతో కలిసి మనను అలరిస్తాయి.
భీమ్‌సేన్‌జోషీ వంటి ఉద్దండుణ్ణి సినిమారంగం గుర్తించకపోలేదు. 1956లోనే శంకర్-జైకిషన్ సంగీత దర్శకత్వంలో బసంత్‌బహార్ అనే సినిమాలో మన్నాడే భీమ్‌సేన్‌జోషీతో ఒక యుగళగీతం పాడాడు. ఇందులో భీమ్‌సేన్‌జోషీ బసంత్ రాగం పాడగా మన్నాడే బసంత్‌బహార్ రాగాన్ని పాడతాడు. భీమ్‌సేన్‌జోషీ చనిపోయాక మన్నాడే ఆ రికార్డింగ్ గురించి చెపుతూ ఆయనొక మహావిద్వాంసుడని గుర్తుచేసుకున్నాడు. అది సినిమా కథే అయినప్పటికీ తాను ఒక గొప్ప గాయకుణ్ణి పాటలో ఓడించడమేమిటని మన్నాడే తన అయిష్టతను వ్యక్తం చేశాడట. శంకర్-జైకిషన్ మటుకు కథలోని సందర్భాన్ని వివరించి పట్టుదలగా మన్నాడేను ఒప్పించారట. భీమ్‌సేన్‌జోషీ కూడా నెమ్మదిగా మన్నాడేను ప్రోత్సహిస్తూ నిజంగా తాను ఓటమి పాలయే సమస్య ఏమీ ఉండదని నచ్చజెప్పాడట. రికార్డింగ్ జరుగుతున్న సమయంలోకూడా భీమ్‌సేన్‌జోషీ దాన్ని గురించి ఏమీ పట్టించుకోకుండా రాగంలో లీనమై పాడాడని మన్నాడే ప్రశంసించాడు. సినీమాయలోకంలో ఒక్కొక్కప్పుడు భీమ్‌సేన్‌జోషీని మన్నాడే ఓడిస్తే, ఒక హాస్యగీతంలో కిశోర్‌కుమార్ మన్నాడేను ఓడిస్తాడు.
ప్రపంచవ్యాప్తంగా కీర్తి వచ్చినప్పటికీ తన రాష్ట్రంలో తనకు తగినంత పేరు రాలేదని భీమ్‌సేన్‌జోషీ బాధపడేవాడట. అందుకే బాలమురళీకృష్ణ చెన్నైలో స్థిరపడినట్టుగా ఆయన పుణేలో ఉండిపోయాడు. తన గురువు సవాయీగంధర్వ వర్ధంతి సందర్భంగా 1953లో పుణేలో భీమ్‌సేన్‌జోషీ మొదలుపెట్టిన సంగీతోత్సవం చిన్నస్థాయిలో ప్రారంభమై, ఈనాడు మనదేశంలోని అతిముఖ్యమైన సంగీతసమావేశాల్లో ఒకటిగా పేరు పొందింది. దీని కారణంగా అనేక ప్రముఖ సంగీతజ్ఞులతో భీమ్‌సేన్‌జోషీకి ఉండిన పరిచయాలు ఎంతగానో బలపడుతూ వచ్చాయి. పెద్ద పండగవంటి వాతావరణంలో డిసెంబర్ మొదటివారంలో పుణే నగరంలో జరిగే ఈ సంగీతకచేరీలు విని, ఆనందించడానికి, బొంబాయినుంచీ, ఇతర ప్రాంతాలనుంచీ శ్రోతలు వస్తూ ఉంటారు. మూడు రోజులపాటు సాగే ఈ ఉత్సవం మొదటి రెండు సాయంత్రాలూ 8 ప్రాంతాల మొదలై, రాత్రంతా కొనసాగి, ఉదయం 6 ప్రాంతాల ముగుస్తుంది. చివరిరోజు మాత్రం ఇది మధ్యాహ్నం 11 దాటాక పూర్తవుతుంది. 2002లో రిటైరయేదాకా చివరి కళాకారుడు భీమ్‌సేన్‌జోషీయే. ఆ తరవాత సవాయీగంధర్వ పాడిన బిన్‌దేఖే వంటి సింధుభైరవి రికార్డు వినిపిస్తారు (మ్యూజిక్ ఇండియా ఆన్లైన్ సైట్‌లో వినవచ్చు.) హాజరైన అయిదారు వేలమందీ, జాతీయగీతంలా లేచి నిలబడి ఆ పాటను వింటారు. ఎంతటి చలినైనా లెక్క చెయ్యకుండా టెంట్‌లాంటి ఆచ్ఛాదన మాత్రమే ఉన్న ఆ సంగీతసమావేశానికి వచ్చే వేలాదిమందిని చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది.
దేశంలో ఎక్కడైనా సరే, భీమ్‌సేన్‌జోషీ కచేరీ లేని సంగీతోత్సవం అంటూ ఉండేదికాదు. త్వరలోనే భీమ్‌సేన్‌జోషీ అభిమానులు అన్ని ప్రాంతాల్లోనూ కనబడసాగారు. వయసు పెరుగుతున్నకొద్దీ ఆయనకు మనదేశపు అగ్రగాయకులలో ఒకడుగా పేరు రాసాగింది. అరుదుగా ఆయన కొన్ని జుగల్‌బందీ కచేరీలు కూడా చేశాడు. బాలమురళితో ఆయన పాడిన కచేరీకి బాగా పేరొచ్చింది. వారిద్దరూ కలిసి పాడిన భైరవ్, మాయా మాళవగౌళ రాగాల్లోని ఈ గీతం ఎక్కువమంది విని ఉండక పోవచ్చు.
ఇదికాక, తనకన్నా 44 ఏళ్ళు చిన్నవాడైన రషీద్‌ఖాన్‌తో కలిసి పాడిన శంకరా మొదలైన రాగాలు వింటే ఆయనకున్న పరిపక్వత అర్థమవుతుంది. అవి పాడుతున్నప్పుడు తానెంతగా భయపడ్డాడో రషీద్ వివరిస్తూ, అబ్దుల్ కరీంఖాన్‌కు చెందిన తంబూరాను భీమ్‌సేన్‌జోషీ స్వయంగా శ్రుతిచేసి ఉపయోగించడానికి తనకిచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. తనకు జుగల్‌బందీ పాడుతున్న భావన కలగలేదనీ, కేవలం పెద్దాయన అన్న స్వరాలను తిరిగి పాడినట్టే అనిపించిందనీ రషీద్‌ఖాన్ అన్నాడు.
ప్రఖ్యాత తబలా కళాకారుడు జకీర్‌హుసేన్ భీమ్‌సేన్‌జోషీ కచేరీల గురించి చెపుతూ ఆయన తాదాత్మ్యం చెందుతూ పాడిన విధానం అద్భుతంగా ఉండేదని అన్నాడు.
భీమ్‌సేన్‌జోషీ లతా మంగేశ్కర్‌తోకూడా కలిసి కొన్ని భక్తి గీతాలు పాడాడు. ఆయనతో తనది చిరకాల పరిచయమేనని చెపుతూ లతా బసంత్‌బహార్ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు తానుకూడా విని, ఆనందించానని చెప్పింది. ఒక సందర్భంలో చాలా ఏళ్ళక్రితం తాను పాటలు పాడటానికి కలకత్తా వెళ్ళినప్పుడు ఉదయం 4 గంటలకే ఎవరో తలుపు తడితే తాను కంగారుపడ్డాననీ, తీరా చూస్తే ఆ వచ్చినది భీమ్‌సేన్‌జోషీ అనీ ఆమె చెప్పింది. తీరా లోపలికొచ్చాక ఆయన తనకు ఆమె తండ్రి దీనానాథ్ మంగేశ్కర్ గాత్రమంటే చాలా ఇష్టమనీ, స్వయంగా విన్నాననీ ఆమెతో అన్నాడట. ఆ రోజు తన కచేరీలో ఆయన దీనానాథ్ నాటకంలో పాడిన ఒక గీతాన్ని పాడాడట కూడా. మరాఠీ నాటకసంగీతంలో శాస్త్రీయసంగీతం పాలు చాలా ఎక్కువ. పైగా వారికి తమ సాంస్కృతిక వారసత్వం అంటే వల్లమాలిన అభిమానం. ఇటువంటిది మనవాళ్ళలో కనబడదు. ఉదాహరణకు ఏ రఘురామయ్య పాటనో బాలమురళీకృష్ణ తన కచేరీలో పాడడం ఊహించుకోలేము!
భీమ్‌సేన్‌జోషీ, జస్రాజ్
ప్రసిద్ధ గాయకుడైన జస్రాజ్ భీమ్‌సేన్‌జోషీతో 1942నుంచీ తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ, తనతో 1966లోనే భీమ్‌సేన్‌జోషీ తన తరవాతి గాయకుల సంగతి చెపుతూ, ‘నువ్వు నా వెనకాలే వస్తున్నట్టనిపిస్తుంది’ అని తనను ప్రశంసించడం తనకెంతో ప్రోత్సాహాన్నిచ్చిందని చెప్పాడు. భీమ్‌సేన్‌జోషీ ఎక్కువ రాగాలు పాడకపోయినప్పటికీ, ఒక్క శాస్త్రీయసంగీతమే కాక మరాఠీ అభంగ్‌లు (భజనలు) అద్భుతంగా పాడగలిగేవాడనీ, అదొక బహుముఖప్రజ్ఞ అనీ జస్రాజ్ అన్నాడు. తాన్‌సేన్‌కు అక్బర్ ఆదరాభిమానాలున్నట్టే భీమ్‌సేన్‌జోషీకి కోట్లాది అభిమానుల అండదండలున్నాయని జస్రాజ్ అభిప్రాయం.
ప్రసిద్ధ నాటకప్రయోక్త గిరీశ్ కర్నాడ్ చెప్పినట్టుగా భీమ్‌సేన్‌జోషీ పాడుతున్నప్పుడు ఆయన శరీరమంతా గానంలో పాల్గొంటున్నట్టనిపిస్తుంది. ఆయన గాత్రానికి భీమబలం ఉన్నట్టనిపించడానికి కారణం అదే. ఆయన మరాఠీలోనూ, కన్నడంలోనూ పాడిన భక్తిగీతాలకు ఆశేషప్రజాదరణ లభించింది. మాల్కౌఁస్ రాగం మీద వ్రాసిన వ్యాసంలో రాజన్ పరీకర్ ప్రస్తావించిన తుకారామ్ భజన అందుకొక ఉదాహరణ.
ఆయన వారసత్వాన్ని కొడుకు శ్రీనివాస్, శిష్యుడు శ్రీకాంత్ దేశ్‌పాండే తదితరులు కొనసాగిస్తున్నారు. అనవసరమైన భేషజాలేమీ లేకుండా, నిజాయితీగా శుద్ధశాస్త్రీయ సంగీతాన్ని అనేక దశాబ్దాలు పాడి, ఎందరో అభిమానులను తయారుచేసుకున్న భీమ్‌సేన్‌జోషీ సంగీతం రికార్డింగ్‌ల ద్వారా విని మనం ఎన్నేళ్ళైనా ఆనందించవచ్చు. ఈ పరిచయవ్యాసం అందుకు దోహదపడే చిన్న ప్రయత్నం మాత్రమే.