ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం: రెండో సారి!

గూగుల్ కంపెనీ వాళ్ళు ప్రపంచ విజ్ఞాన సాహిత్యం డిజిటైజ్ చేయబూనడం – ఏడు మిలియను పుస్తకాలని డిజిటైజ్ చేసిన తరువాత రచయితలు, ప్రచురణకర్తల సంఘాలు కాపీరైట్ ఉల్లంఘన ఉదహరిస్తూ కోర్టు వెళ్ళడం గురించి స్థూలంగా ఇదివరకు (అంటే మార్చ్ 2009లో) ముచ్చటించాను. ఆ సందర్భంగా, నాకు తెలిసున్నంతలో కాపీరైట్ సమస్యల గురించి నా అనుమానాలు కూడా చెప్పుకున్నాను.

ముందుగా 2004 నుంచి మార్చ్ 2011 వరకూ గూగుల్ కంపెనీ వారి డిజిటైజేషన్ బృహత్పథకం గురించి జరిగిన కథ కాస్త వివరంగా చెప్పుకోవడం అవసరం.

  • 2004: గూగుల్ కంపెనీ పరిశోధన గ్రంథాలయాలలో పుస్తకాలని డిజిటైజ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఆ పుస్తకాలు మొత్తం కాకుండా, వాటిలోని కొన్నికొన్ని భాగాలు మాత్రం జనబాహుళ్యానికి ఊరికేనే అందుబాటులోకి తెచ్చింది.
  • 2005: రచయితల సంఘం, ప్రచురణకర్తల సంఘం, తమతమ కాపీరైట్లని గూగుల్ కంపెనీ ఉల్లంఘించిందని వ్యాజ్యం వేశాయి.
  • 2008: రెండు పక్షాల వాళ్ళూ రాజీపడి ఒక ఒడంబడిక చేసుకొని, న్యూయార్క్ కోర్ట్‌లో ఆ ఒడంబడిక దాఖలు చేసుకున్నారు. దానిపై కొన్ని వందల ఆక్షేపణలు కోర్ట్ వారికొచ్చాయి.
  • 2009: మళ్ళీ రెండు పక్షాల వాళ్ళూ ఆక్షేపణలకి సమాధానంగా, మార్పుచేసిన మరొక ఒడంబడిక కోర్ట్‌లో దాఖలు చేశారు. దీనినే Amended Settlement Agreement (ASA) అంటారు.
  • 2010: జడ్జ్ డెన్ని చిన్ (Denny Chin) ఏ.యస్. ఏ పై వాదప్రతివాదాలు విన్నాడు. ఆ సందర్భంగా మరికొన్ని ఆక్షేపణలు కూడా పైకొచ్చాయి.
  • మార్చ్ 23, 2011: జడ్జ్ డెన్ని చిన్ గూగుల్ – రచయితలు, ప్రచురణకర్తలూ చేసుకున్న మార్పుల ఒడంబడిక చెల్లదని తీర్పు ఇచ్చాడు.

ఇది, స్థూలంగా గూగుల్ డిజిటైజేషన్ కథ.

గూగుల్ 2004లో అనుకున్నట్టుగా పుస్తకాల్లో భాగాలు ఊరికేనే, లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉంచినట్లయితే అసలు గొడవే ఉండేది కాదు. పుస్తకాలలో వాక్యాలతో పాటు, గూగుల్ వ్యాపార ప్రకటనలని జోడించటం తంటా వచ్చిపడింది. ప్రచురణకర్తలకీ, గూగుల్‌కీ వ్యాపార పోటీగా పరిణమించింది.

ఎప్పుడైతే లాభాపేక్ష అనే మిష వస్తుందో, అప్పుడే లాయర్లు ప్రత్యక్షమౌతారు. రెండు పక్షాలవారూ లాయర్లకై 45మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టారు.

గూగుల్ మొదలుపెట్టిన పథకం ఒక రకంగా మంచి పథకమే. కోట్లకొద్దీ జనానికి మరో ప్రచురణకి నోచుకోని లక్షల కొద్దీ పరిశోధన గ్రంథాలు అందుబాటులోకి వచ్చేవి. రచయితలకి డిజిటల్ పుస్తకాలు ‘అమ్ముడు’ పోవడం మూలంగా డబ్బులొచ్చేవి. కొద్ది రుసుము కట్టుకుంటే గ్రంథాలయాలకి లక్షల గ్రంథాలు అందుబాటులో వుండేవి.

మరి ఇది మంచిదే కదా! కానీ ఒక్క ముఖ్యమైన ఆక్షేపణ ఈ మంచిపనికి అడ్డం వచ్చింది. అది గూగుల్ వ్యాపార సరళి. పబ్లిక్ డొమైన్లో ఉన్న పుస్తకాలకి కూడా, గూగుల్ కంపెనీ డిజిటైజ్ చెయ్యడానికి గ్రంథాలయాలు రుసుము చెల్లించాలి! హార్వర్డ్ విశ్వవిద్యాలయం పబ్లిక్ డొమైన్లో ఉన్న 850,000 గ్రంథాలు డిజిటైజ్ చెయ్యటానికి, 1.9 మిలియన్ల డాలర్లు వెచ్చించింది. తిరిగి ఈ డిజిటైజ్ అయిన గ్రంథాలు కావాలంటే, గ్రంథాలయాలు సంవత్సర చందా రుసుముగా చెల్లించుకోవాలి. ఈ వ్యాపార ధోరణి చూస్తే, ఒక తెలుగు సామెత గుర్తుకొస్తున్నది: “నువ్వు మీ ఇంటి నుంచి అటుకులు పట్టుకొని రా. నేను మా ఇంటి నుంచి ఊక తెస్తాను. కలిపి ఊదుకొని మనిద్దరం తిందాం,” అన్నది.

ఈ ఒడంబడిక చెల్లదని నిర్ణయించడంలో కొన్ని విషయాలు గమనార్హం.

గూగుల్‌కి ఏకచత్రాధిపత్యం, అంటే పోటీ లేకండా పోవడం. ముఖ్యంగా ‘అనాథ’ గ్రంథాలు (’orphan’ books) డిజిటైజ్ చేసి వాటిని అమ్ముకోవడం. కాపీరైట్ ఎవరికున్నదో తెలవని, తేల్చలేని గ్రంథాలు ‘అనాథ’ గ్రంథాలు. 1923 నుంచి 1964 వరకూ ప్రచురితమైన పుస్తకాలలో సుమారు 5మిలియన్ల పుస్తకాలు, ‘అనాథ’ గ్రంథాలుగా అంచనా వెయ్యబడ్డాయి. మరొక విషయం. విదేశీ రచయితల, ప్రచురణకర్తల కాపీరైట్లు గురించి. గూగుల్ కంపెనీ విదేశ గ్రంథాలని, వారి కాపీరైట్లని ఉల్లంఘించి డిజిటైజ్ చెయ్యడం.

ఈ ఒడంబడిక చెల్లదనడంతో, గూగుల్ చేసిన ‘మంచి’ కూడా అందుబాటులోకి రాకుండా పోతుంది. అది విచారకరం.

అందుకు ప్రతిగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, గ్రంథాలయాధికారి, రాబర్ట్ డార్న్‌టన్ (Robert Darnton) గత రెండు సంవత్సరాలుగా డిజిటల్ పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ అమెరికా సృష్టించుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు. వ్యాపార లాభాపేక్ష లేని ఇటువంటి లైబ్రరీ రావాలంటే, ప్రభుత్వం లేదా ప్రతిఫలాపేక్ష లేని సంస్థలూ పూనుకోవాలని అతని కోరిక. పాశ్చాత్య దేశాలు కొన్ని (నార్వే, నెదర్‌లాండ్స్) ఈ పని చేశాయి. అలాగే యూరోపియానా (Europeana) అనే డిజిటల్ లైబ్రరీ కూడా. వాళ్ళ పద్ధతుల్లో అమెరికాలో కూడా అటువంటి పబ్లిక్ డిజిటల్ లైబ్రరీ నిర్మించాలని అతని ఆశయం. ఈ పైవాటితో ఇబ్బందులు లేవని కాదు. ఆ ఇబ్బందులు అధిగమించే పథకం అమెరికా చేసుకోవాలని అతని ఆశ.

మన పుస్తకాలకి సంబంధించినంతవరకూ, డి. యల్. ఐ. (Digital Library of India) ఉంది. ఆ లైబ్రరీ నుంచి పుస్తకాలు దిగుమతి చేసుకోవడం తేలికైన పని కాదు. పైగా, ఈ ‘గ్రంథాలయం’ ఎటువంటి స్థితిలో ఉన్నదో, దీనిని ఎలా మార్పు చెయ్యాలో, ఈ పనిలో సాధకబాధకాలు ఏమిటో డిజిటైజేషన్లో సామర్థ్యం ఉన్నవాళ్ళకి అప్పచెప్పుదాం. అక్కడ కూడా, కాపీరైట్ చట్టాలని ఉల్లంఘించకుండా చెయ్యవలసిన మార్పులు, చేర్పులు నైతికంగా చేయడానికి ప్రయత్నాలు కొనసాగాలి.

అందుకుగాను ఇక్కడ వలసకొచ్చిన మన దేశీయుల, మన తెలుగువారి సమర్థుల అండదండలు, వారి సామర్థ్యం అవసరం.

[గూగుల్ కోర్ట్ కేస్ గురించి, డిజిటల్ పబ్లిక్ లైబ్రరీ గురించీ వివరణ, విశేషాలూ, డార్న్‌టన్ వ్యాసాల్లో కూలంకషంగా చర్చించబడ్డాయి – సం]


References:

  1. Robert Darnton : ” Can We Create a National Digital Library?,” The New York Review of Books, October 28, 2010.
  2. Robert Darnton : ” Google’s Loss : The Public’s Gain,” The New York review of Books, April 28, 2011.