3.
‘నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటెను సూనృతవ్రత యొక బావి మేలు’ అనే పద్యంలో చివరికి లోకోపకారాలన్నిట్లోకి ఒక సూనృత వాక్యము మేలు అని తేలుస్తారు నన్నయ్య. సూనృతమంటే నిజం, అంటే సత్యమైన మాట. అనృతమంటే అందుకు విరుద్ధంగా నిజం కానిది, అంటే ‘జూటా’. నిజం చెప్పటానికి అది తెలిసుండాలి, ‘నిజాన్నే కనుక్కుని చెప్పాలీ’ అన్న పట్టుదలా ఉండాలి. అనృతం అని కూడా తెలిసి, తెలిసి కోరుండే చెప్పొచ్చు. లేదూ తెలియక, ‘ఏదో ప్రయోజనకరమైన నిజాన్నే చెప్తున్నాను’ అని నమ్మి చెప్పొచ్చు. ఈ రెండవ తరహా ‘జూటా’ ని జాగర్తగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే కళలతో సహా విజ్ఞానపు అన్ని పార్శ్వాలకు ఇలాంటి అమాయకత్వం వలన చాలా నష్టమే జరుగుతూ వచ్చింది. The road to hell is paved with good intentions అని సెయింట్ బెర్నార్డ్ (Saint Bernard of Clairvaux) అన్న మాట వివేచనకు అడుగడుగునా వర్తిస్తుంది. వివేచనలో అనృతాన్ని పరిహరించుకోడానికి, అదుపులో పెట్టాడానికి విజ్ఞాన శాస్త్రం, అంటే Science ఒక వ్యవస్థగా చేసిన పరిశ్రమ, విధించుకున్న కట్టుబాట్లు సృజనల్ని గురించిన వివేచనకూ పనికొస్తాయి.
నూతులు, బావులు, సత్క్రతువులు ఇవన్నీ కలకాలం ఉపయోగపడేవి. ఒక వాక్యానిదేముంది? కేవలం ఒక్క మాట. మనకందరికీ మాట్లాడటం సహజంగా వస్తుంది. తెలివైన వాళ్ళకైతే మాటల్ని రకరకాలుగా తెలివితేటలుగా అల్లటం కూడా వస్తుంది. ఇంకా చతురులైతే మాటల్ని ఒక గారడీలా, కనికట్టులాగ ప్రయోగించే చాతుర్యం ఉంటుంది. ఇలాంటి చాతుర్యానికి ఎన్నో లౌకికమైన ప్రయోజనాలున్నాయి – అమ్మటం, బోధించటం, పోరాడటం, నాయకత్వం వహించటం, వినోదింపచేయటం ఇలాంటివి. అందుకే వాక్చాతుర్యానికి లోకవ్యవహారంలో చాల గౌరవం, మతింపు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి నేను, మా బావ వాజపేయీ గారి ఉపన్యాసం వినటానికి వెళ్ళేము. ఆయన గొప్ప చతురుడైన వక్త; కాంగ్రెస్ ని ఎండగడుతుంటే జనం ఆవేశంతో ఊగిపోయి చప్పట్లు కొట్టేరు. ఆ మర్నాడే అదే వేదికమీద ఇందిరాగాంధీ గారు ఉపన్యాసం ఇచ్చి ఆయన చెప్పిందంతా సరికాదు, తను చెప్పిందే సరైందని రూపిస్తే ఆ ప్రజలే అంత ఆవేశంతోనూ చప్పట్లు కొట్టేరు. అదీ, ఇదీ చూసి మా బావ – గొప్పదనం చెప్పిన విషయంలో లేదనీ, చెప్పినోడి మాటకారితనంలో ఉందనీ అన్నాడు.
ఏ విషయాన్ని గురించైనా మన పరిజ్ఞానానికి వాస్తవాలు, దృఢ నిశ్చయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు, సంశయాలు, అపోహలు వంటి మౌలికమైన పార్శ్వాలుంటాయి. వీటిని మన అంతరంగంలో ఎలా నిర్మించుకుని, స్థిరపరుచుకుంటామనే విషయాన్ని గురించి సాంఘిక మనస్తత్వ శాస్త్రం చెప్పే సంగతులు ఇక్కడ లేవనెత్తుతున్న ప్రశ్నలకి ఎంతో ఉపకరిస్తాయి. వీటిలో చాలా వారకు పార్శ్వాలు మన వ్యక్తిత్వపు పరిమితుల – అంటే prejudice వంటి సంకుచితత్వాల – వలన మనమే గ్రహించుకోలేక పోతాము. ఒకవేళ ఎరిగి ఉన్నా సాంఘిక మర్యాదలకు, మనదే అయిన భేషజానికి తలొగ్గి వీటిని చాలా వరకు మరుగున ఉంచుకుంటాము. ఇది జరిగే పద్ధతిని వివరంగా తెల్సుకొవటం సృజనల పరిశీలనకు అనివార్యమౌతుంది. మనకి బాగా ఆసక్తి ఉన్న విషయాలలో పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాల్ని, ప్రతిపాదనల్ని ఎలాగైనా సరే సమన్వయం చేసుకోవాలని మనకి చాలా తహతహగా ఉంటుందట. దీన్ని Cognitive Dissonance అన్నారు. సారస్వతం మీద ఆసక్తి ఉన్నవాళ్ళకి సహజంగానే ఇలాంటి జిజ్ఞాసను శోధించి, చర్చించి పరిష్కరించుకోవాలని తీరని ఆరాటంగా ఉంటుంది. అనుశీలన కోసం, చర్చ కోసం ఇందుకే ఆరాటపడతాము. ఇంతేకాక, ఈ Cognitive Dissonance మన అభిప్రాయాల్ని, నమ్మకాల్ని ఇతరులు కూడా ఒప్పుకొనే తీరాలన్న మంకుతనంగా పరిణమించడం కద్దు. ఇది ఒక్కోసారి తీవ్రమైన అసహనంగా, labeling అని వ్యవహరించే చిన్నచూపుగా, చివరికి ధూర్జటి ‘నిరూఢ క్రోధం’ అని వర్ణించిన కోపంగా కూడా ముదిరిపోవటాన్ని సారస్వతంతో సహా అన్ని రంగాల్లోనూ చూస్తుంటాము.
సృజనకారులు ఇలాంటి రుగ్మతల్నుండి ముక్తులు కావటానికి ప్రజాస్వామ్యం అని వ్యవహరించే సాంఘిక మర్యాద, సౌభ్రాతృత్వం అని వ్యవహరించే నైతిక మర్యాద, విశ్వ ప్రేమ, కరుణ అని వ్యవహరించే అధ్యాత్మిక, ధార్మిక మర్యాదా ఇవేవీ సరిపోవు సరి కదా అడ్డం పడి, చివరికి అవ్యవస్థకే దారితీస్తాయి. ఇంతకంటె లోతైన సాధన, సృజన తత్వాన్ని గురించీ, అనుభవం కోసం నిజాయితీ గల వెదుకులాట, ఆత్మ పరిశీలన ప్రాతిపదికలుగా దీనికి సృజన సమ్మతమైన మర్యాదను, అంటే వ్యవస్థను నిర్మించుకోవడం సాధ్యమవుతుందా? ‘జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారు’ అనిపించే ఇలాంటి క్షమను, సహనాన్ని కేవలం తమ సృజనానుభవమే భూమికగా సాధించుకున్న సాహితీమూర్తులు అరుదుగా తారస పడుతుంటారు. వీళ్ళ చరిత్రలు వెదుక్కొని, వీళ్ళు చెప్పిన మాటలు చదువుకోవటం ఆరోగ్యకరం అవుతుంది. Opinion Formation ఇంకా Cognitive Dissonance అన్న ఈ రెండు ముఖ్యమైన విషయాలూ ముందుకి వివరంగా చెప్పుకొనేదానికి ఇది కొంత ఉపోద్ఘాతం.
గడుసుదనంతో, మాటకారితనంతో అప్పటికి ‘ఇదేదో బాగానే ఉంది’ అని రూపించే మాటలు ఇలాంటి వెదుకులాట నుండి వచ్చేవి కావు. ఇవి తాత్కాలికమైన వినోదాన్నిస్తాయి, మన boredomకు, క్లిష్టమైన విషయాల్ని గురించి మన శక్తి కొద్దీ ఆలోచించి ఎలాగోలా సమాధానపడాలన్న ఆతృతకి కొంత ఉపశమనంగా ఉంటాయి. కానీ మా అప్పదొడ్డ మజ్జిగన్నం వంటి ఈ మాటల వలన, సంతృప్తినిచ్చి నాలుగు కాలాల పాటు స్థిమితంగా ఉండే ప్రయోజనం దక్కదు. ఇంట్లో ఎవరికైనా జలుబో, జ్వరమో ఇలా ఏ సుస్తీ చేసినా మా అప్పదొడ్డ చాలా ప్రేమతో, ఆతృతగా “అమ్మా! నానీ! వాడికి ఇంత మజ్జిగా అన్నం కలిపి పెట్టండే! ఇదుగో… ఈ మజ్జిగా అన్నం తినీరా నానీ?!” అని కలిపి తెచ్చీసీది. అయితే వాస్తవానికి అన్ని రోగాలూ మజ్జిగాన్నానికే తగ్గిపోవు. అందరి ఆరోగ్యం గురించి నిజంగానే ఎంతో పరితపించే ప్రేమమూర్తి మా అప్పదొడ్డ మజ్జిగా అన్నం కలిపి చేసే హడావిడి ఆవిడ ప్రేమనైతే ప్రకటిస్తున్నాయి గాని, రోగాలు కుదర్చటానికి పనికిరావని క్రమంగా అందరం గ్రహించుకున్నాము.
మానవ వ్యాపారాల్ని, విజ్ఞానాన్ని లోక వ్యవహారం, శాస్త్ర విజ్ఞానం, కళ, ఆధ్యాత్మికం అని ఇలా నాలుగు విభాగాలుగా అనుకున్నట్టయితే ఈ నాలుగింటిని గురించిన వివేచనకూ, పరిశ్రమకూ ‘మాట’ అంటే భాష ఒక సామాన్యమైన, ముఖ్యమైన పనిముట్టు. మనుషులందరికీ మాటలొచ్చు. కోట్లమందిలోన కొన్ని వేలమందైనా బాగా తెలివైనవాళ్ళుంటారు. వీళ్ళలో మాటకార్లకు తమ వాక్చాతుర్యాన్ని వినియోగించే అవకాశాలు ఈ నాలుగు రంగాల్లోనూ విరివిగానే ఉంటాయి. అలాంటివాళ్ళ మాటలలోని చమత్కారం, గడుసుదనం, చాతుర్యం వలన నిజానికి అవి చాల రంజింపచేస్తాయి. మరప్పుడు అలాంటి మాటలన్నీ ఈ నాలుగు రంగాల్లోనూ ‘సూనృతములు’, అంటే ఒప్పుకోవలసినవి, ‘నిజం’ అయిన మాటలవుతాయా? చెప్పే మాటలు నిజమే అవ్వాలన్న నియమం ఎందుకంటే నిజమైన మాటలు మాత్రమే ఈ నాలుగు రంగాల్లోనూ ప్రయోజనకరమైనవి. ఉదాహరణకు శస్త్రచికిత్స కత్తులు, దబ్బనాల వంటి పనిముట్లని ఉపయోగించి చేస్తారు. ఇలాటి పనిముట్లనే చెప్పులు, బట్టలు కుట్టడానికీ, కూరలు, మాంసం తరగటానికీ ఉపయోగిస్తారు. కాని వీటిలో ప్రతీ పనికీ తమవైన తర్ఫీదు, నైపుణ్యం ఉన్నప్పుడు మాత్రమే, అదే మనిషి అవే కత్తుల్ని వాడి ఎంచుకున్న పనిని విజయవంతంగా, అంటే ప్రయోజనకరంగా, హాని లేకుండా పూర్తి చెయ్యగలుగుతారు. ఆ పని జరిగే పద్ధతిని యదార్ధంగా వివరించగలిగేదే సూనృతం. అందుకే దానికి అంత విలువ. అప్పదొడ్డ మజ్జిగాన్నం వంటి అనృతాలు ఈ అన్ని రంగాల్లోనా రకరకాల కారణాల వలన ‘నిజాలు’ గా చెలామణీలోకి వచ్చేస్తుంటాయి.
ఒక ఆలోచన అది యదార్ధమా, కాదా అన్న విషయంతో సంబంధం లేకుండా చెలామణీలోకి తెచ్చి సాంఘిక గౌరవాన్ని సాధించుకోడానికి ఏడు రకాల తోవలుంటాయట. ఇది marketing, అంటే సరుకుల అమ్మకంలో అనుభవం ఉన్న శాస్త్రజ్ఞులు నిరూపించిన సంగతి. వీటిలో ఒక ఉదాహరణకు social trappings అని ఉన్నాయి – అంటే సంఘంలో పెద్దవారు అని గౌరవం ఇవ్వవలసిన చిహ్నాలు – పెద్ద వయస్సు, ఆచార్య, Ph. D. వంటి పదవులు, లోగడ సంపాదించుకున్న ప్రతిష్ట, డబ్బు, అధికారం మొదలైనవాటితో వచ్చే మతింపు ఇలాంటివి. ఇవి ఉన్నవాళ్ళ మాటల్ని మనం అనాలోచితంగా యదార్ధాలే అని ఒప్పుకోవటం ఈ ఏడింటిలో ఒకటి. మనం స్వయంగా పరిశీలించి నిర్ణయించుకొనే బదులు ఎవరైనా నిపుణులు, విమర్శకులూ విప్పి చెప్పేస్తే, వాళ్ళ గౌరవ చిహ్నాల్ని అనుసరించి ఆ చెప్పిన మాటని ఒప్పుకోవటానికే మనం మొగ్గిపోతాము. “Men would rather die than think” అని బెర్ట్రాండ్ రస్సెల్ (Bertrand Russell) అన్నారు. మనకు పరిచితులు, స్నేహితులైన వాళ్ళ మాటల్ని, ప్రతిపాదనల్ని మనం ఇష్టంగా ఒప్పుకుంటామట, ఇది ఇంకొకటి. అలాగే, మన యెడల సామరస్యంగా, సుహృద్భావంగా ఉండే వాళ్ళ అభిప్రాయాల్నే మనం పరస్పరం ఒప్పుకొని, గౌరవించుకుంటామట. మరి దీన్నే నేను ‘మర్యాద’ అనుకున్నాను. ఇలా ఏడు కారణాలున్నాయి. అయితే ఈ ఏడింట్లోనూ ముఖ్యమైనది – అంటే ‘బమ్మిని తిమ్మి’ చెయ్యడానికి ఎంతగానో పనికొచ్చేది – ఏమంటే ప్రచారం, propaganda. దీన్ని సృజనలతో సహా అన్ని వస్తువుల అమ్మకానికీ విజయవంతంగా ప్రయోగించవచ్చు అని ఇటీవలి పరిశోధనలు స్పష్టపరుస్తున్నాయి. అంటే ఏదైనా మాటని, వస్తువుని అది అనృతమా, సూనృతమా అని ఖాతరు లేకుండా, పదే పదే సమాజపు దృష్టిలో పడేటట్టు, పదుగురి నోళ్ళలో నానేటట్టూ చేస్తే చాలు. ఆ వస్తువును అమ్మడంలో, దానికి సాంఘిక గౌరవాన్ని సంపాదించటంలో విజయం సాధించవచ్చు. ‘పదుగురాడు మాట పాటియై ధరజెల్లు’ అని కవి ఏనాడో అనుకున్నాడు కదా!
విజ్ఞానశాస్త్రాల్లో, సాంకేతికరంగంలో ఆలోచనలు, ప్రతిపాదనలు ఇలాంటి తప్పుడు ప్రతిష్టను సంపాదించుకొంటే వచ్చే అవ్యవస్థ వలన సమాజానికి హాని, చివరికి ఆ రంగాలకూ నగుబాటు. ఉదాహరణకు ఆ మధ్య రామర్ పిళ్ళై అనే మాటకారి మూలికలు, వేర్లు ఉడికించి చవగ్గా పెట్రోల్ తయారు చేస్తానని బాగా ప్రచారం చేసుకొని, చివరికి నవ్వులపాలయ్యేడు. ఇలాంటి అవ్యవస్థను పరిహరించి, మరింక తలెత్తకుండా నివారించుకొనే ప్రయత్నాలకు పునాది మన విజ్ఞానపు చరిత్రలో ఈ నాలుగు రంగాలకీ ఒకే మూలమైన తత్వ శాస్త్రంగా మొదలయ్యింది. విలువైన వాటి కోసం పోటీ అనేది లోక వ్యవహారంలో కద్దు. పోటీ అనేది సంపద, ప్రతిష్ట వంటి వాటి కోసమే కానక్కర్లేదు. ఆలోచనలు, నిర్ణయాలు, భావజాలాల నడుమ పోటీని, ఘర్షణను ఏది మిక్కిలి ప్రయోజనకరమైన నిజమో అనే అన్వేషణలో భాగంగా చాల ఆరోగ్యకరంగా కూడా నిర్వహించే పద్ధతి ఉంది. ఇలాంటి వివేచనకు అవసరమైన తర్కాన్ని, పనిముట్లను ఏర్పాటు చేసుకోవాలన్న కోరికే జ్ఞానమీమాంస (Epistemology) అనే శాస్త్రానికి ప్రాతిపదిక. అంటే మానవాళి జ్ఞాన సముపార్జనకు తర్క సమ్మతమైన, ఆరోగ్యకరమైన ప్రాతిపదికలు ఏవి? అనే ప్రశ్నకు జవాబులు వెదకటం ఈ శాస్త్రపు పని. తత్వశాస్త్రంగా మొదలైన జ్ఞానం క్రమంగా శాఖోపశాఖలుగా విడిపోయిన తరవాత తమవైన పనిముట్లను, తర్కాన్ని – అంటే తమ రంగానికి సంబంధించిన ‘సూనృతాన్ని’ – నిర్మించుకొని, దానికి నిబద్ధమై పని చెయ్యటంలో విశేషమైన విజయాన్ని సాధించినది ప్రధమంగా విజ్ఞాన శాస్త్రం (Empirical Science).
ఈ విజయం అంత సులభంగా రాలేదు. వేల వేలమంది ప్రతిభావంతుల్ని, వాళ్ళ వాళ్ళ అహంకారాన్ని, వాక్చాతుర్యాన్ని, చాపల్యాన్ని దాదాపు పరిహరించుకొని శ్రద్ధగా, ఓపిగ్గా కూలీ చీమల్లాగ విజ్ఞాన శాస్త్రపు అనేక శాఖల్లో పరిశోధన, వివేచన కోసం కలిసికట్టుగా పని చేయించే అతి కష్టమైన వ్యవహారాన్ని సైన్స్ సమర్ధవంతంగా నిర్మించి, నిర్వహించుకోగలిగింది. ఆరంభంలో మాటకారివాళ్ళు, గడుసు వాళ్ళు, లౌక్యులు తమ చాతుర్యంతో నిజం కానిదాన్ని నిజంగా చెలామణీ చేసి, సూనృతవ్రతులని అనదగిన వాళ్ళని హింసలకు, హేళనకు, మరణదండనకు గురిచేసినా కూడా, క్రమంగా అలాంటి అవ్యవస్థ పోయి సత్యమైన విజ్ఞానాన్నే నిలబెట్టుకోగలిగిన వ్యవస్థ సైన్స్‌లో బలంగా ఏర్పడింది. దీనికి ప్రాతిపదిక అయిన శాస్త్రీయ దృష్టి భౌతికం; ఇంద్రియాలకు లేదా పరికరాలకు గోచరమైన రుజువులని మాత్రమే ఆధారం చేసుకొని నిజాలని నిర్ధారిస్తుంది. కడపటి సత్యాల్ని నిర్ధారించేవి భౌతికమైన రుజువులే గాని, ఈ పద్ధతికి మొదలైన సృజన మాత్రం కళ, సారస్వత సృజనల లాగనే చాల ఆంతరంగికమూ, మార్మికమైన మానసిక ప్రక్రియ. “Science is the poetry of reality” అని ఎవరో మాబాగా అన్నారు. సృజనను వెలికితెచ్చి, ప్రకటించి వినియోగించుకొనే నిర్వహణను సైన్స్ బలంగా నిర్వహించుకోగలుగుతున్నాది. అలాంటి వైజ్ఞానిక వ్యవస్థ ఫలాల్నే ఈ నాడు మానవాళి అనుభవిస్తోంది. వైజ్ఞానికులు ఈ వ్యవస్థను సుమారు గత మూడు వేల ఏళ్ళుగా వెదుక్కొని, నిర్మించుకొని, పటిష్టపరుచుకొన్న చరిత్ర చాల హృద్యంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇందుకు పాశ్చాత్యులు – అంటే తెల్లోళ్ళు – చేసిన సేవను, కనబరిచిన ప్రతిభను, పట్టుదలను, నాయకత్వాన్ని, వాళ్ళు చూపించిన తోవను ఆధునిక సమాజంలో బతుకుతున్నవాళ్ళం కృతజ్ఞతతో అంగీకరించవలసి ఉంది. ఈ నిర్మాణం కోసం స్వయంగా గొప్ప ప్రతిభావంతులై ఉండీ, తమ అహంకారాల్ని వ్యవస్థ కోసం త్యజించి పరిశ్రమించగలిగిన త్యాగ నిరతిని వాళ్ళు ఎన్నో ఘర్షణలు, యుద్ధాలు, రక్తపాతాల్ని అనుభవించి మరీ సాధించుకున్నారు. నేటి కాలపు సైన్స్ విద్యార్ధులు ఆ పరిశ్రమ ఫలాల్ని ఇప్పుడు సుఖంగా అనుభవిస్తున్నారు.
సృజన, కళా రంగాల్లో ఇంత బలమైన వ్యవస్థ లేదు. అందువల్ల, ఈ అనువు చూసుకుని వైజ్ఞానికులు, సంస్కర్తలు, లౌక్యులు ‘పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం’ అన్నట్టు తమ కార్యరంగాల లక్ష్యాల్ని, తర్కాన్ని, పనిముట్లనూ, ప్రమాణాల్నే సృజనకూ వర్తింపచేసే జబర్దస్తీని అడ్డుకొనే స్థైర్యం కూడా సృజనకారులు అంత సులభంగా సాధించుకోలేరు. ఎందుకంటే మర్యాద చిహ్నాలు, అంటే social trappings ఈ రంగాలకి పుష్కలంగా ఉంటాయి, వాటిని ఈనాడు మనం పూజిస్తాము. ఇవే కాదు, సంఘంలో గౌరవింపబడే వ్యవస్థలన్నిటికీ సృజనను కలుషితం చేసి, బలహీనపరచే శక్తి, అవకాశాలూ ఉంటూనే వస్తున్నాయి. వీటిలో అందరికీ పరిచితమైనవి అధికారం, డబ్బు, ప్రచార సాధనాల మీద పట్టు, ఇతర రంగాల్లో సాధించుకున్న ప్రతిష్ట ఇలాంటివి. ఇవే కాకుండా ఇంకా పదిమందీ చాలా వాంఛనీయమైనవి అనుకునే విషయాలన్నిటినుండీ ఇలాంటి ప్రమాదమే ఉంది. ఉదాహరణకు భగవంతుని మీద రాసిన కావ్యాలు దైవభక్తి దన్నుతో ప్రాచుర్యంలోకి వచ్చిన వ్యవస్థ మనకుండేది. మానవత్వం, మంచితనం, శాస్త్రీయ దృక్పధం, దేశ భక్తి, సంఘ సంస్కరణ, ‘జెన్ మౌనం’, తాత్విక చింతన – ఇలాంటి గౌరవనీయమైన వ్యవస్థలన్నిటి నుండీ సృజన మౌలికమైన ఉనికికి ప్రమాదం ఉన్నాది. సృజన వీటిలో ఏ ఒక్కదాని కార్యరంగమూ కాదని గ్రహించుకొని, ఈ అన్ని మర్యాదల ఉక్కు పిడికిళ్ళ నుండీ తప్పించుకోవటం సృజనకారులకు అంత సులభం కాదు. మర్యాదతో సృజన చేసే ఈ పోరాటాన్ని తమవైన తోవల్లో నిర్వహించుకున్న సృజనకారులు చరిత్రలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళ చరిత్రలలో కొన్నే ‘హాలికులైననేమి..’ వంటి ఉదంతాలుగా చరిత్రకెక్కేయి. దీనికి ఒక కారణం ఏమయ్యుంటుందంటే వీళ్ళు ప్రచారానికి ఆసక్తులై ఉండరు కాబట్టి క్రమంగా మరుగున పడిపోతారు. రెండవది ఏమంటే నికార్సైన సృజన, దాన్ని అనివార్యంగా ప్రేమించే సృజనశీలురు కూడా సున్నితంగా, మృదు స్వభావులై ఉంటారు. ఇలాంటి వాళ్ళ తోవల్ని, చరిత్రల్ని వెదికి చదువుకోవటం ఇక్కడి మూడో ప్రశ్నకు అవసరం అవుతుంది. ముఖ్యంగా మన దేశంలోన దురదృష్ట వశాత్తు ఇలాంటి వాళ్ళ గురించి ఆ నోటా ఆ నోటా చూచాయగా తెలుస్తుంటుంది గాని అంతకు మించి ఎక్కువ సమాచారమే దొరకదు. అయితే ప్రపంచ చరిత్రలో ఇలాంటివాళ్ళందరి గురించీ వెదికి చదువుకుంటే కొన్ని వాస్తవాలు బోధపడతాయి. ఒకటి ఏమిటంటే గణాంక శాస్త్ర ప్రకారం (statistical గా) ప్రతి తరంలోనూ కొంత శాతం అవిటివాళ్ళు, నపుంసకులూ ఉన్నట్టే సృజనశీలురు కూడా ఉంటారు. దీన్ని గురించిన గణాంకాలు కూడా ఉన్నాయి! రెండవది ఏమిటంటే వీళ్ళకి కూడా మర్యాద డేగ చూపులకు దూరంగా మరుగ్గా, అంటే underground లాగ వాళ్ళలో వాళ్ళకి ఒక వ్యవస్థ ఉంటుంది. ఇప్పటికింత చెప్పి ముందుకి వీళ్ళని గురించి మరింత వివరంగా చెప్పుకుంటాను.
సైన్స్ తరవాత సత్యవంతమైన వ్యవస్థను సాధించుకోవటంలో చాలా వరకు సఫలమైన రంగాలు లోకవ్యవహారం, అంటే వ్యాపారం, నాయకత్వం, కార్య నిర్వహణ, పాలన ఇలాంటి పనులకి సంబంధించినవి – టెక్నాలజీ, మేనేజిమెంట్, లా, గవర్నమెంట్ ఇలాంటివి. శాస్త్ర విజ్ఞానపు పద్ధతుల్ని, ఫలితాల్నీ ప్రాతిపదికగా చేసుకొనే ఈ రంగాల్లో ఇలాంటి వ్యవస్థ ఏర్పడి, వృద్ధి చెందింది. వీటి తరువాత వరుసలోనివి మానవీయ శాస్త్రాలు. ఇవి భౌతికమైన సత్యాల్ని కాక, సంఘం, అంతరంగం, వ్యవస్థ వంటి అభౌతికమైన వస్తువుల్ని పరిశోధించేవి. వీటిని గురించిన నిజాల్ని నిర్ద్వంద్వంగా నిర్ధారించడం సుళువు కాదు, ఒక్కోసారి సరైన పరికరాలు, ఆలోచనలు తయారుకానందువలన ఇంకా సాధ్యం కాదు కూడాను. మిగిలిన విజ్ఞాన శాస్త్రాల్నుండి ఇచ్చి పుచ్చుకొని వీటి వ్యవస్థను బలపరిచే ప్రయత్నాలు, Exact Sciences and Humanities అని ఇలాగ ఇటీవలే మొదలయ్యేయి. మరి ఈ విషయంలో అత్యంత బలహీనమైనది, వివాదాస్పదమైనది అయిన వ్యవస్థ కళా రంగానిది, అందునా చిట్ట చివరి చోటు సారస్వతానిది. ఎందుకంటే శిల్పం, చిత్రలేఖనం వంటి మూర్తమైన కళలకు కనీసం కళ్ళెదుట ఒక బొమ్మ ఉంది. చివరికి సంగీతానికి కూడా అమూర్తమైనప్పటికీ కేవలం మాటలమీద కాక, మాటలకు అతీతంగా గణితం వంటి ఖచ్చితమైన విజ్ఞానానికి సమీపమైన నిర్ణాయక ప్రాతిపదిక వ్యవస్థ ఉంది. గ్రీకువాళ్ళు సంగీతాన్ని అంక గణితం, క్షేత్ర గణితం, ఖగోళ శాస్త్రాలతో సమానంగా ఒక శాస్త్రంగా భావించేరు. ఈ రంగాలన్నిటికీ భిన్నంగా సారస్వత వివేచనకు, సారస్వత సృజనకు శరీరం, అంటే medium మాటలే. వాటి ఫలితాలు కనిపించేది కూడా మాటలు గానే. చమారి పనిచేసి చెప్పులు కుడతాడు, దర్జీ పనిచేసి బట్టలు కుడతాడు, కాని సృజనశీలి పని చేసీ చివరికి ఉత్త మాటల్నే కుడతాడు. అందరికీ సాధారణంగా, ఉచితంగా అందుబాటులో ఉండే మాటలు – అంటే భాషే పనిముట్టూ, పెట్టుబడీ కూడా అవటం ఒక రకమైన అయోమయం, సందిగ్ధతతో కుడిన అవ్యవస్థకు దోహదం చేస్తుంది. తొందరపడి ఇలాంటి అవ్యవస్థను గురించి చేసే వివేచన కూడా భాషకు, ఆలోచనకు, మర్యాదకే పరిమితమైతే, అంటే సృజన అంతర్గత స్వరూపాన్ని విచారించటానికి అనాసక్తము, అశక్తమైతే అది అప్పటికే నెలకొని ఉన్న అవ్యవస్థకు ఇంకొంచెం దోహదం చేస్తుంది. సృజన, సారస్వత వివేచన రెండూ మాటల్లా ఉంటాయే గాని, అవేం మాటలు కావు.
4.
సృజనను అర్ధంచేసుకోటానికి బాహ్యమైన లక్షణాల్ని ప్రాతిపదికలుగా గాని, లక్ష్యాలుగా గాని చేసే వివేచన సంతృప్తికరంగా ఉండదు. సృజన తత్వపు అనుభవం దీనికి కొంత మెరుగైన ప్రాతిపదిక కావచ్చు. బిపిన్ దీన్ని ‘అనుభవం’ అంటున్నారు. శాస్త్రీయ పద్ధతి – అంటే Scientific Method అనే పనిముట్లను, సృజన అనుభవం అనే ప్రాతిపదికను వినియోగించి చేసే వివేచన సారస్వతానికి కొంత పనికొస్తుంది. అయితే ఈ పనిముట్లు భౌతికశాస్త్రాల్లో వాడేలాంటివి కావు, ఇక్కడి ప్రశ్నలు ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేసి ‘ఇవిగో జవాబులు’ అని తేల్చెయ్యగలిగేవి కావు. ఇక్కడ లేవనెత్తుతున్నవి మౌలికమైన ప్రశ్నలు, అంటే eternal questions అంటారు కదా, అలాంటివి. వీటిని గురించి ఎవరో గుర్తులేదు గాని ఏమన్నారంటే, వాటికి జవాబులైతే ఉండవు గాని, it is very important that we keep raising these questions అని. రావి శాస్త్రిగారు ఈ మాటనే ఎత్తిచెప్పేవారు.
కళ అనుశీలనను గురించిన ఈ ప్రశ్నలు ఎందుకింత క్లిష్టంగా ఉంటాయంటే, కళకు ఆధారభూతమైన సృజన రూపుదిద్దుకొనేది అంతరంగపు లోతుల్లోన, అంటే మనస్తత్వంలో అంతశ్చేతన అని వ్యవహరించే చోటు నుండి. మనోవిజ్ఞాన రంగంలో పితామహుడని పేరుపొందిన కార్ల్ యుంగ్ (Carl Gustav Jung), ఆయన అనుయాయులు ఈ విషయాన్ని గురించి బలమైన ప్రతిపాదనలు చేసేరు. సృజన తత్వపు అనుశీలన కోసం వాళ్ళు సైన్స్‌లో, లోకవ్యవహారంలో ఉపయోగించే తర్కానికి భిన్నంగా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్ని ప్రతిపాదించేరు. స్థూలంగా ఈ పద్ధతుల స్వరూపం ఏమిటంటే సృజన నైసర్గిక స్వరూపం, దాని ఆవిష్కరణల చుట్టూ పక్షుల్లాగ పదే పదే చక్కర్లు కొడుతూ, ఒక్కో చంక్రమణంతోను కొన్ని పరిశీలనలను (observations) ప్రోదిచేసుకొనే పద్ధతి. దీనికి ప్రాతిపదిక తర్కం కాదు, సృజనానుభవం. ఇలా చెయ్యగా, చెయ్యగా ఏనుగును కావిలించుకున్న గుడ్దివాళ్ళ కధలోలాగ సృజన స్వరూపాన్ని గురించి కొంతైనా గుడ్డిలో మెల్ల వంటి అవగాహన రూపు దిద్దుకొనే అవకాశం తప్పకుండా ఉంది. దీనికి కావలసిన ముడి సరుకు (experimental subjects) ఎవరంటే స్వయంగా సృజనశీలురైన వాళ్ళ సృజనలు, వాళ్ళు చెప్పుకున్న మాటలు, వాళ్ళ ప్రవర్తన, హావభావాలు, జీవితాలు, వాటిని స్వీకరిస్తున్న పాఠకులు – ఇవి. వీటిమీద ఇటీవలి కాలంలో Cognitive Science నుండి, Neurology వంటి ప్రయోగశీలమైన శాస్త్రాలనుండీ ఎంతో ఉపయోగకరమైన ప్రతిపాదనలు వస్తున్నాయి. మనస్తత్వ శాస్త్రాలకు చెందిన పద్ధతులని ఉపయోగించి, సృజనానుభవాన్నే కేవలమైన ప్రాతిపదికగా ప్రతిష్టించి నిర్వహింపబడే ఈ పద్ధతులకు ఉపోద్ఘాతమే చాలా ఉంది; ఉదాహరణకు ఒకవైపు కార్ల్ యుంగ్, ఆయన అనుయాయులు ప్రతిపాదించిన ఆలోచనలు, పద్ధతులూ ఉన్నాయి. ఇటీవల మనస్తత్వంలో, కంప్యూటర్ సైన్స్‌లో వస్తున్న ప్రతిపాదనలున్నాయి, సృజనకారులే చెప్పిన సంగతులు చాలా ఉన్నాయి, రస సిద్ధాంతులు కాంట్ (Immanuel Kant), హ్యూమ్ (David Hume) వంటివాళ్ళు చెప్పుకున్నవి ఎన్నో ఉన్నాయి.
కళ అనుశీలన కోసం సృజన అనుభవపు ప్రాధాన్యతను నొక్కిచెప్పినవాళ్ళు చాలామందే ఉన్నారు. ఇలాంటి మొండి పట్టుదలను ప్రదర్శించిన తాత్వికులు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చెప్పినది లేదు. ఇలాంటి విషయాల్ని గురించి మాటల్లో చెప్పి బోధపరచగలిగేది చాలా తక్కువట. ఇలాగని బిపిన్, త్రిపుర, నారాయణ రావుగారు కూడా వేరు వేరు సందర్భాల్లోన నాతో అన్నారు. బిపిన్ ఏమన్నాడంటే “There is too much explanation and not enough understanding. There is too much understanding and not enough experience.” అన్నాడు. ఈ మాట నాకు ఎంతో పట్టుకుంది. వేమన “లోచూపు చూడనొల్లక వాచా బ్రహ్మంబు పలుకవలదుర వేమా!” అన్నాడట. కన్నడిగుల వేమన సర్వజ్ఞమూర్తి అని, అతను “అనుభవియ వేదవే వేద!” అంటే ‘అనుభవించినవాని వేదమే వేదము’ అన్నాడట. కాంట్ ఈ విషయంలో రస సిద్ధాంతాన్ని గురించి చేసిన ప్రతిపాదనలను చాల ఉత్కృష్టమైన నిర్ణయాలని ఈ నాటి aesthetes అంటే రస సిద్ధాంతులు చెప్పుకుంటారు:
“Genius is the talent (or natural gift) which gives the rule to Art. Since talent, as the innate productive faculty of the artist, belongs itself to nature, we may express the matter thus: Genius is the innate mental disposition (ingenium) through which Nature gives the rule to Art.”
కాంట్ వివరించిన సంగతులు ముందుకి కొంతైనా చెప్పుకోవాలి. పై వాక్యాల్లో ఆయన ఏమంటున్నారంటే సృజనను నియంత్రించే ఛందస్సు, పాదాల విరుపు, యతి, ప్రాస వంటి నియమాలని (rules) నిర్దేశించేది కేవలం సృజనశీలి యొక్క సృజనానుభవం (ingenium) మాత్రమే.
అనుశీలన కోసం చంక్రమనాన్ని ఉపయోగించుకొనేటప్పుడు తీసుకోవలసిన ఒక జాగర్త ఏమిటంటే సరళత, అంటే simplicity. దీన్ని సాధించుకోవటం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో విషయాలు, అన్నీ ముఖ్యమైనవే, చర్చనీయమైనవేనన్నట్టు అగుపడి మొత్తం మీద అయోమయానికి దారితీయటం కద్దు. ఛాల్స్ పూర్ (Charles Poore) అనే ఆయన ఏమన్నాడంటే “There is nothing quite so complicated as simplicity. Infinitude of distractions and irrelevancies must be forced into perspective to achieve it.” అని. సారస్వత వివేచనలో ఈ అయోమయాన్ని అడ్డుకోడానికి ఒక ఉపాయం ఏమిటంటే వివేచనకు ఏదో ఒకటి – ఒక్కటి మాత్రమే, బలమైన, స్పష్టమైన ప్రాతిపదిక ఉండాలి. దీనికి నేను సూచించే ప్రాతిపదిక సృజన తత్వపు అనుభవం. సృజనకు బాహ్య లక్షణాలు – ఛందస్సు, పద విభజన, వ్యాకరణం, లౌకిక ప్రయోజనం ఇలాంటివి కొల్లలుగా ఉన్నాయి. కాని సృజన అనుభవం సార్వజనీనంగా, సర్వకాలీనంగా, మానవ జంతువు cognitive experience లోన ఒకే ఒక్కటి ఉంది. దీనికి జీవ పరిణామ క్రమానికి సంబంధించిన కారణాలు ఉన్నాయని నిరూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివేచన ఈ మౌలికమైన ప్రాతిపదిక మీద కేంద్రీకృతమైతే కొంతైనా ప్రయోజనం ఉంటుంది.
సృజన అనుభవపు లోతుల్లోంచి వచ్చిన ఆవిష్కరణలు స్థూలంగా, భాష, తర్కంతో గోచరమయ్యే విషయార్ధం కంటే లోతయిన సృజనానుభవానికి కేవలం సంకేతప్రాయాలుగా ఉంటాయి. సృజనకు ఆయువుపట్టు ఏమిటంటే సృజనకారుని సాహితీ మూర్తిమత్వం అంటారే, అది! ఉదాహరణకు నారాయణ రావుగారి రచన ‘మా లిఖ‘ అని ఉంది. దాన్లో ప్రస్తావించిన కవి పఠాభి కవిత్వాన్ని నేను ఆయన సూచిస్తున్నట్లు ఆస్వాదించలేను. కాని ఆ వ్యాసంలో కవిత్వ భాషను గురించి చేసిన ఆలోచన ఇప్పుడు చెప్తున్న అనుభవపూర్వకమైన వివేచనకు ఒక మేలైన ఉదాహరణ. దాన్ని పదిసార్లు పట్టి చదివితే తప్ప అక్కడ చెప్తున్న విషయంలోని ‘పరమార్ధం’ అవగతం కాదు. మేలైన సృజనల లక్షణాల్లో ఒకటి ఏమంటే అవి చదవగానే, లేదా వినగానే గ్రాహ్యం కాకపోవచ్చు. కాని అవి అన్నీ మనకు అలవాటైన, తర్క సమ్మతమైన ప్రపంచపు అనుభవం కంటే లోతైన, పరిపుష్టమైన సృజన అనుభవాన్ని ప్రకటించటం కోసం భాషను, ఆలోచనను కేవలం సంకేతమాత్రాలుగా వాడుకుంటాయి. ‘లంజా! అంటే కధైపొయ్యింది, నా బట్టా! అంటే కధైపొయ్యింది’ అని నామిని చెప్పుకున్నారు. సృజన అనుభవం ఎలా సిద్ధిస్తుంది అనే విషయం మీద కళాకారులు చెప్పుకున్నవి చాల వివరాలున్నాయి. మేధస్సు అని వ్యవహరించే తర్కప్రజ్ఞ కాకుండా, సృజన అనుభవం, కనీసం దాన్ని గురించిన వివేకం సృజనల్ని కట్టడానికీ, ఆస్వాదించటానికీ చదివేవాళ్ళకు, విమర్శకులకు కూడా అవసరం. దీన్ని Cognitive Science లోన Reader Creativity అన్నారు. సృజన కవి, పాఠకుడు జట్టుగా నిర్వహించే ప్రదర్శన.
కళ, సారస్వతం వంటి వెసులుబాటు లేని రంగాల్లోన ఎవరైనా అంత ఓపిగ్గా పరిశ్రమ ఎందుకు చేస్తారు? వాళ్ళ మనస్తత్వానికి అది తప్పనిసరి, అనివార్యం అయితేనే కదా చేస్తారు. సృజనకారుల సంకల్పాలను, చోదకశక్తుల్నీ పరిశీలించే ముందు, కేవలం తెలివితేటలూ, స్వయంప్రతిభ తోటే గొప్ప ఫలితాల్ని సాధిస్తామనుకొనే వాళ్ళ విశ్వాసాలు, న్యూనతల్ని గురించి ‘రామానుజన్ సిండ్రోం’ అని ఒక కధ ఉన్నాది. చాన్నాళ్ళ క్రితం ఒక రోజు బిపిన్ తన ఆఫీసులో తలపట్టుకుని కూచున్నాడు. నేను ఆయన కోసం మధ్యాన్నభోజనం వండి తీస్కెళ్తే అది తింటూ ఆయన నా ప్రశ్నలకు జవాబులు చెప్పడం మా ఆనవాయితీ. ఆవేళ మాత్రం ధుమధుమ లాడుతున్నాడు. ‘ఎంచేత అలాగున్నావ’ని అడిగేను. ‘నీకు రామానుజన్ సిండ్రోం’ అంటే తెలుసునా?’ అన్నాడు. నాకు తెలీదన్నాను. ఆయనకి ఎప్పుడైనా కొందరు విద్యార్ధులు తారసపడ్తారట. వాళ్ళు చాల తెలివైనవాళ్ళే, కాని ఇంకా వాళ్ళు ఎంచుకున్న శాస్త్రాల్లో తర్ఫీదు కావలసినవాళ్ళు, లోతైన అవగాహన లేనివాళ్ళు. అయితే వాళ్ళకి తమ తెలివితేటల మీద తమకే మితిమీరిన విశ్వాసం, తాము మరొక రామానుజన్ (Srinivasa Ramanujan) అని వెర్రి నమ్మకం. ఇది గీర, అహంకారం, కపటం, అపనమ్మకం, ఈర్ష్య ఇలా రకరకాలుగా ప్రకటితమయ్యి వాళ్ళ చదువుకీ, వాళ్ళ సాటి విద్యార్ధుల చదువుకీ, ప్రొఫెసర్ల పనికీ కూడా ఆటంకంగా మారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాడుచేస్తుంది. అలాంటి అభినవ రామానుజన్ ఒకబ్బాయి నేను వెళ్ళడానికి ముందు బిపిన్ ఆఫీసులోకి వచ్చి ఏదో యాగీ చేసి వెళ్ళేడు, తన గొప్పదనాన్నీ, ప్రతిభనీ సరిగ్గా ఎవరూ గుర్తించటం లేదనీ, తనంటే అందరికీ అసూయ అనీ, తనవంటి మహా ప్రతిభాశాలిని అర్ధం చేసుకోవటం అంత తేలిక కాదనీ ఇలాగ. ఆ కధ విని నాకు ఎక్కడో ‘చురుక్కు’మని గుచ్చుకుంది. ఇలాగని బిపిన్‌తో అంటే నవ్వీసి ఊరుకున్నాడు.
మనవైపు తెలివైన పిల్లల్ని ‘మా అమ్మాయి ఛైల్డ్ ప్రోడిజీ’ అని, ‘లెక్కల్లో జీనియస్, మావాడు రామానుజన్’ అనీ పొగిడే అలవాటు, అలాగే కళా సారస్వత రంగాల్లోన తొందరపడి సృజనలను ప్రచురించీ, పోటీలు నిర్వహించీ అంచనాలు ప్రకటించే పద్ధతీ ఇలాటి రుగ్మతలకు ఆజ్యం పోస్తాయనిపిస్తుంది. ఇటువంటి స్వభావాల్ని ఇది నిజంగానే ఒక మానసిక రుగ్మతా? అనిపించేంత తీవ్రంగా నేను కూడా కొందరిలో చూసేను. నిజానికి సృజనశీలత ఒక మానసిక రుగ్మత (neurosis) అని ఫ్రాయిడ్ (Sigmund Freud) బలంగా ప్రతిపాదించేరు. దీన్ని తరవాత వచ్చినవాళ్ళు యుంగ్‌తో సహా చాలవరకు ఖండించేరు గాని, సృజన ఒక రకమైన ‘వెర్రి’ అనేది అందరూ ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని గురించి ముందుకి వివరంగా చెప్పుకుందాము. సైన్స్ వంటి పటిష్టమైన వ్యవస్థ ఉన్న రంగాల్లో ఇటువంటి బాల రామానుజన్లు క్రమంగా తమ శక్తియుక్తులేమిటో, వాటి పరిమితులేమిటో వాళ్ళే తెలుసుకొని, రుగ్మతలను దిద్దుకోవడానికి అవకాశం మెరుగ్గా ఉంది. ఇది ఎలా జరుగుతుందంటే, కోట్లాది కోట్లమంది తమవంటి కూలి చీమలే ‘నా బొందో’ మని పని చెయ్యగా చెయ్యగా నిర్మితమైన, అద్భుతమైన సృష్టి విజ్ఞానపు సృజన అని, ముందు దాన్ని చాల గౌరవిస్తూ శ్రద్ధతో అనుభవంలోకి తెచ్చుకోవాలని, అటు పిమ్మట తమవంతు పని చేసే అవకాశం వస్తుందనీ ఇలాంటి స్పృహ క్రమంగా బాల రామానుజాలకు కలిగేలా వ్యవస్థే నిర్దేశిస్తుంది.
సారస్వతం ఇలాక్కాదు. దాని అంతర్గత స్వరూపం మరే ఇతర శాస్త్రాలకూ తీసిపోనంత క్లిష్టమైనది, కాని బాహ్యరూపం కేవలం ఉత్త మాటలు! దీనికి తోడు సరైన వనరులు, స్వానుభవ సంపన్నులైన ఉపాధ్యాయులు, పటిష్టమైన నిర్ణాయక వ్యవస్థ ఇవేవీ లేకపోవడం వలన ఇలాంటి దిద్దుబాటుకి అవకాశాలు మృగ్యమై బాల రామానుజాలు అలాగే పెరిగి పెద్దవారై తమ సహజాతాన్ని అపరిపక్వంగానే నిర్వహించుకుంటూ, దాని చుట్టూ తమ అహంకారాన్నే కవచంగా నిర్మించుకొని పెద్ద వయసును చేరుకొనే దుస్థితి ఉంది. ఉదాహరణకు ఉమాకాంత విద్యా శేఖరులని, ఆయన పుస్తకం ‘నేటి కాలపు కవిత్వం’ను గొప్ప విమర్శా గ్రంధంగా ప్రతిపాదిస్తుంటారు ఈ రామానుజన్లు కొందరు. అదేమో వాక్చాతుర్యంతో చమత్కారమైన విన్యాసాలైతే చేస్తుంది గాని, పట్టి చదవబోతే అదేదో సినిమాలో రావు గోపాలరావు గారు అనేటట్టు కామన్‌సెన్సుకి ఎక్కువ, స్కాలర్‌షిప్పుకి తక్కువ, అంటే ప్రగల్భాలకి ఎక్కువ, పాండిత్యానికి తక్కువగా తోచి నవ్వు పుట్టిస్తుంది.
మరి సృజనను నిర్వహించుకోడంలో ఇన్ని చిక్కులుంటే రాయటం, చదవటం, చర్చించటం మానుకుంటే తీరిపోలేదా? ఊరుకుంటే, అంటే ‘మౌనం’ వహించి దాని జోలికి పోకుండా ఒదిలేస్తే సరిపోదా? అంటే అలా వదులుకోవడం సృజనశీలికి అసాధ్యమట, ఎంతమాత్రం వీలుకాదట, ఒకవేళ ఏదోలా అదిమి పట్టుకున్నా అది మళ్ళీ మానసిక రుగ్మతకే దారితీస్తుందట! ఇది మనోవైజ్ఞానికులు పరిశోధనల ఆధారంగా ఏభయ్యేళ్ళ క్రిందటే తేల్చి చెప్పిన సంగతి. ఈ విషయాన్ని గ్రహించే త్రిపుర, నారాయణ రావు, బిపిన్ వీళ్ళు ముగ్గురూ కూడా సృజన యెడల ఏ మాత్రం ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవర్నైనా, ఏమీ సంకోచించకుండా రాసుకుని, ప్రచురించి తీరాలి అనే సూచిస్తున్నారు. అంటే, చూసేరా అదేదో కధలో అనగనగా ఒక రాజుంటాడు. వాడికి చెప్పరాని చోట ఒక గాజు గుచ్చుకున్నాది! అది తీస్తే తంటా, తియ్యకపోతే మంట! ఊఁ అంటే ఒస్తుందా?” “ఉ ఊఁ … రాదు!” “ఉ ఊఁ … అంటే ఒస్తుందా?” “అబ్బా రాదు!” ” అబ్బా రాదు అంటే ఒస్తుందా?!” అని ఆ కధ అలా నడుస్తుంది! సృజనశీలికి తన సహజాతాన్ని నిర్వహించుకోకుండా ఒదిలేస్తే చిక్కే, కాని దాన్ని వివేకంతో, క్రమశిక్షణతో, శ్రద్ధతో నిర్వహించుకోకపోతే అదీ చిక్కే. తీస్తే తంటా, తియ్యకపోతే మంట!
(ఇంకా ఉంది)