మంచుమనిషి

అంబరమ్మది అవని కిచ్చెను
సంబరమ్మున స్ఫటికమణిఖచి-
తాంబరమ్మును, తరళమౌ శ్వే-
తాంబరము ప్రేమన్

తెల్లతెల్లగ తేలి హిమమణి
మెల్లమెల్లగ మెదలి కదులుచు
చల్లచల్లగ చక్కగా బడె
కొల్లలుగ గంటల్

పువ్వులో, యవి పుష్యరాగపు
రవ్వలో, యవి రజత వృక్షపు
రివ్వలో, యవి ఋతుకుమారికి
నవ్వులో, దువ్వల్

చాల సొబగుల సరములో, ర-
త్నాల సరముల తళుకులో, ము-
త్యాల సరముల ధవళిమయొ, చి-
త్రాల చెల్వములో

ప్రతిఫలించెను స్ఫటికమణు ల-
మితముగా రవి మిశ్ర వర్ణము
లతి విచిత్రపు లాస్యమాయెను
ప్రతి నిమేషములో

‘కారు’ దారిని కాలి దారిని
జేరగా సరి జేయుచుంటిమి
పారద్రోయుచు ప్రక్క నిటు నటు
చారు హిమమణులన్

పిల్ల లందరు వేగ గూడిరి
త్రుళ్ళి యాడుచు తూలి పడి య-
త్యుల్లసమ్ముగ దొర్లుచుండిరి
తెల్లగా నగుచున్

వింతగా నతి వేగ జారిరి
బంతు లాడిరి బండి లాగిరి
పంత మాడిరి పరుగు దీసిరి
సంతసము నిండన్

కలసి నిల్పిరి కర్ర నొక్కటి
తలల నూపుచు తప్పుటడుగుల
పలు విధమ్ముల పడుచు తెచ్చిరి
లలిత హిమరాశుల్

మనిషి జేసిరి మక్కువన్, యిరు
కనుల వీనుల, కాలుజేతుల,
వెనుక ముందును పెట్టి మంచును
తనువు జేసేరు

శిరముపై నొక చిన్న ‘హ్యాటు’ను
కరములందున ‘గ్లవు’ల తొడిగిరి
అరెరె ‘మఫ్లరు’ నపుడు గొంతుకు
సరిగ చుట్టేరు

అలరుచును ముత్యాల సరమును
గళము వేసిరి గంతు లిడుచును
అలలు అలలుగ నతి ముదమ్ముగ
సలిపిరే కేకల్

ముంచె పిల్లల మోద వాహిని
మంచు మనిషిని మంచి మనిషని
మించి పొగడుచు మేటి మాటల
నెంచి పాడేరు

చెన్నుగా నీ చెంత జేరిరి
చిన్న వారలు జీవ మొసగిరి
ఎన్న విరిసెను హృదయపద్మము
లన్ని హిమరాజా

వీచు గాలిని వినుచు నిలిచెను
చూచు కొమ్మల జూచి నవ్వెను
లేచు సూర్యుని లేత యెండకు
వేచు తారలకై

తాప మెరుగక తరలె రోజులు
పాప మయ్యో భానుమూర్తి ప్ర-
తాప మెగయుచు తపన నొక దిన
మాపకను మండె

వేగ మెక్కెను వేడి గాలికి
మేఘమాలిక మింట గనపడె
వేగ మెరసెను వెండి మెరుపులు
మ్రోగె వర్షించె

చెరిగిపోయెను చిన్న కలవలె
కరగె మెల్లగ ఘన హిమమ్ములు
కరిగె శిల్పము కనుల ముందుగ
హరిహరీ నేడు

విరిగిపోయెను విగ్రహ మ్మది
కరిగిపోయెను కాయ మెల్లను
పరుగు తీసెను ‘పారి’ పోయెను
యిరవు శూన్యమయెన్

ఎంత కాల మ్మిలను బ్రదుకో
అంతమౌ నది అవనిపై, బ్రదు-
కింతె నిజముగ హిమమనుష్యా
అంత మాది కగున్

ఎక్కడో యా హిమపు రాశులు
ఎక్కడో యా హిమపు ధవళిమ
ఎక్క డేగె హిమేంద్రజాలము
ఎక్క డా స్ఫటికాల్

మాయ మాయెను మంచు మనిషియు
మాయ మాయెను మంచి మనిషియు
మాయ మాయెను మంచు మాయలు
తీయనౌ స్మృతిగా

మిగిలె ‘గ్లవ్వు’లు మిగిలె ‘మఫ్లరు’
మిగిలె ‘హ్యాటు’ను మిగిలె కర్రయు
మిగిలె గడ్డియు మిగిలె గుడ్డయు
మిగిలె బలు సరముల్

మరల వచ్చును మధు వసంతము
మరువ లేమా మంచు మనిషిని
వరదవలె నా భవితలో స్మృతి
చిరము నిల్చునుగా


ముత్యాల సరాన్ని ఎన్నో విధాలుగా రాస్తారు. నేను రాసిన ముత్యాలసరానికి లక్షణాలు – మొదటి మూడు పాదాలలో ప్రతి పాదానికి త్రిమాత్ర, చతుర్మాత్ర, త్రిమాత్ర, చతుర్మాత్ర; యతి మూడవ గణముతో చెల్లుతుంది. నాలుగవ పాదములో తొమ్మిదినుండి 14 మాత్రలను ఉంచవచ్చు. నా నాలుగవ పాదానికి త్రి, చ, గురువు. దీనికి యతి లేదు. చివరి గురువు లఘువుగా కూడ ఉండవచ్చు. పాడేటప్పుడు అది గురుతుల్యము. అన్ని పాదాలకు ప్రాస ఉంచాను. గురజాడవారి ముత్యాల సరాలలో యతి ప్రాసలు యాదృచ్ఛికము. భామినీ షట్పదిలోని మొదటి మూడు పాదాలకు ఇవే లక్షణాలు. అందులోని మూడవ పాదము నేను రాసిన ముత్యాలసరాలలో మూడవ, నాలుగవ పాదాలకు సరిపోతుంది. ఈ భామినీ షట్పది కన్నడములో చాల ప్రసిద్ధము, కావ్యాలనే ఈ ఛందస్సులో రాసినారు. తెలుగులో కూడ యక్షగానాలలో ఈ భామినీ షట్పదిని బోలిన ఛందస్సును త్రిపుట రేకులని వాడుతారు. కానీ గురజాడవారు ముత్యాలసరపు నమూనా పారసీకమునుండి గ్రహించబడినదని అన్నారు. కాని ఇలాటి ఛందస్సునే కంకంటి పాపరాజు రాసిన విష్ణుమాయావిలాసము అనే యక్షగానములో ముద్రాలంకారముతో ఒక పద్యాన్ని శ్రీ చేకూరి రామారావుగారు (ముత్యాలసరాల ముచ్చట్లులో) ఎత్తి చూపారు. ఈ విషయాన్ని శ్రీ కోవెల సంపత్కుమారాచార్యులు కూడ (ఛందోభూమికలులో) ముచ్చటించారు. ఆ పద్యము –

పైట తొలగ బటాక బయలగు
బటువు గుబ్బల మీద చుక్కల
సాటియై ముత్యాలసరములు
నీఱు గులుకన్

ముత్యాలసరాలతో అలంకరించిన ఈ ‘మంచుమనిషి’ని మంచి మనిషైన శ్రీ కోవెల సంపత్కుమారాచార్యుల స్మృతికి అంకితము చేస్తున్నాను. – మోహన.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...