అల్లాష్టకము

అల్లా యొక్కడె దైవం
బల్లా పంపెను ముహమదు నవనీతలిపై
నెల్లరి జీవన పథముల
దెల్లముగా దెలియ జేసి దివ్యము జేయన్

అల్లా జగమున కాదియు
నల్లా విశ్వమున కంత మగు నెంచంగా
నల్లా శాంతికి నెప్పుడు
నిల్లై నిల్చును, సమతకు నిరవగు నవనిన్

అల్లా నీవే జనకుడు,
యల్లా నీవే జననియు, నాప్తుడు నీవే,
యల్లా నీవే బంధువు,
యల్లా విత్తములు, విద్య లంతయు నీవే

తల్లుల చల్లని ప్రేమలు,
పిల్లల మాటలు, నగవులు, ప్రియమగు పాటల్
ఫుల్ల ధవళ కుసుమ సరము
లల్లా తెల్లని మనసున కతి ముదము నిడున్

అల్లా యెడారి నొంటిగ
మెల్లగ పడి లేచుచుంటి మిడిమిడి వడలో
జల్లని నీ జేతుల రం-
జిల్లగ నడిపించి యిల్లు జేర్పించు దయన్

కల్లయు కాదిది కనగా
నెల్ల జగ మొక మధుశాల, యెల్లరు పాంథుల్,
త్రుళ్ళు మదియు సఖి పాటల,
నల్లా ప్రేమామృతరస మాస్వాదించన్

అల్లా నామస్మరణయు
కుళ్ళును మదిలో కడుగును కుతుకముతో, నా
యల్లా కరుణకు నెల్లై
యెల్లరి జీవముల నిల్చు హృదయపు కళయై

అల్లా శాంతిని నింపుమ,
యల్లా తొలగించు భ్రాంతియవనిక ద్రుటిలో
దెల్లని కాంతుల జూపుమ
యల్లా గాఢాంధకారమం దిల మాకున్

ఫలశ్రుతి-

అల్లాష్టకమును జదువగ,
నల్లాష్టకము నతి భక్తి నందఱు వినగా,
నల్లా యిచ్చును జీవుల
యుల్లమునకు సుఖము శాంతి నురుతర గతితో


జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...