3. వచన పద్యం ఛందో విభాగం కాదు

ఆంధ్ర పత్రిక 1972 ఉగాది సంచికలో అచ్చయిన ‘వచన పద్యం: ఆభాస లక్షణ నిరాకరణం‘ అనే వ్యాసంలో వచన పద్యం లేదా వచన కవిత అనే పేర్లతో ప్రచారంలో ఉన్న కవితా రూపానికి ప్రతిపాదితమయిన లక్షణాలను విపులంగా చర్చించి, హేతుబద్ధంగా లేవని నిరాకరించాను. ఆ చర్చలో సంపత్కుమార తమ వివిధ వ్యాసాల్లో (1962, 1965, 1967, 1970) ప్రతిపాదించిన సిద్ధాంతాలను విశేషంగా విమర్శించి, అవి కూడా శాస్త్రచర్చకు నిలవ్వని నిరూపించే ప్రయత్నం చేశాను. మళ్ళీ సంపత్కుమార తన పూర్వప్రతిపాదనలలో కొన్నిటిని సమర్థించుకుంటూ ‘వచన పద్యం: లక్షణ నిరూపణం‘ అనే వ్యాసం ప్రచురించారు. వారు తమ సమాధానంలో ప్రస్తావించని నా విమర్శల నన్నిటినీ వారు ఒప్పుకొన్నట్లు కాదు. వాటిల్లో కొన్నిటినికాని, అన్నిటినికాని ఎప్పటికైనా ఖండించే హక్కు వారికున్నదని గుర్తిస్తూ, ప్రస్తుతం వారు చర్చించిన విషయాలకే ఈ వ్యాసం పరిమితం చేస్తాను.

సంపత్కుమార తమ వ్యాసంలో, నా పూర్వ వ్యాసంలోని కొన్ని వాక్యాలను మరీ సాగదీసి వైరుద్ధ్యాలను చూపించటానికి ప్రయత్నించారు. ఉదాహరణకు ‘అనియతత్వం లక్షణం కానప్పుడు నియమరాహిత్యం మాత్రం లక్షణమెట్లా అయితుంది?’ అనే ప్రశ్న అట్లాంటిది. అట్లాంటి ప్రశ్నలకు ఈ వ్యాసంలో సమాధానాలుండవు. ఇటువంటి వైరుద్ధ్యాలు సంపత్కుమార వ్యాసంలోనుంచి కూడా చూపించటానికి వీలు లేకపోలేదు. అయినా, ఇక్కడ ఆ పని జరగదు.

పైన పేర్కొన్న సంపత్కుమార వ్యాసంలో ఆయన చెప్పిన అభిప్రాయాలను సాధ్యమయినంతవరకు సానుభూతితో అర్థం చేసుకుంటూ, ఆయన వాదాలు చర్చకు నిలుస్తయ్యా, నిలవ్వా? అనేదే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని, చేతనైనంత హేతుబద్ధంగా పరిశీలించే ప్రయత్నం ఈ వ్యాసంలో చేస్తాను.

నేను ‘వచన పద్యం’ అనే పేరును గురించి అంతగా పట్టించుకోలేదన్న విషయం సంపత్కుమార సరిగ్గా గ్రహించారు. నా చర్చకు ఈ పేరు అంతగా ప్రధానం కాకపోవటమే అందుక్కారణం. సంపత్కుమార ఈ పేరునే ఎన్నుకోవటానికి గల కారణాలను పరిశీలించాను. ఆయన ఈ కవితా పద్ధతిని పరిశీలించిన దృక్కోణం నుంచి చూస్తే ఈ పేరు అందుకు సరిపోతుంది.

నేను నిరాకరించిన అంశాల్లో వచన పద్యానికి ప్రతిపాదించిన పాదబద్ధత అనేది కేవలం ఒక అంశం మాత్రమే కాక, చాలా కీలకమైనది కూడా. అందువల్ల సంపత్కుమార గానీ, నేను గానీ, దాన్ని గురించి విశేషంగా చర్చించాం. పద్యపాదానికి అంతర్నిర్మాణమూ (Internal Structure), బాహ్య పరిమితీ (External Limit) ఉండాలని నా వాదన. ఆ సందర్భంలో పాదం కేవలం అక్షర సముదాయం కాదని, అవి గణాలుగా ఏర్పడాలని అన్నాను. పద్యపాదాలకు అంతర్నిర్మాణం ఉన్నదనటానికి గణవిభజనను ఆధారంగా చూపించాను. గణవిభజన కేవలం సౌలభ్యం కోసం ఏర్పడిందేననీ, పద్యపాదానికిది అవసరమయిన లక్షణం కాదని సంపత్కుమార వాదించారు. గణవిభజనను గురించి మా ఇద్దరి వాదాల్లోనూ కొంత కొంత నిజం ఉంది.

వృత్తాల్లో అక్షర పరిమాణం, పద్య పాదంలో వాటి స్థానం నిర్దిష్టం. అందువల్ల గణవిభజన వృత్తాల అంతర్నిర్మాణాన్ని గుర్తు పెట్టుకోవటానికి ఏర్పరుచుకున్న ఒక పద్ధతిగా మనం అర్థం చేసుకోవచ్చు. గణంలో అక్షర పరిమాణ స్థానాలు నియతం గనక, ఒక గణం ఒక అక్షర క్రమాన్ని మాత్రమే సూచిస్తుంది. ఈ క్రమాన్ని గుర్తు పెట్టుకోగలిగినప్పుడు మనకు గణాలతో పని ఉండదు. అంటే, వృత్తాల పాద లక్షణ నిరూపణ గణవిభజన లేకుండా చెయ్యవచ్చునన్నమాట. ఈ గణాలకు మూడక్షరాలనే ప్రమాణంగా పెట్టుకోటానికి కారణం సంప్రదాయం తప్ప వేరే ‘కారణం’ ఏమీ ఉన్నట్టు లేదు. ఎన్ని అక్షరాలు పరిమితిగా పెట్టుకున్నా, వాటి ప్రయోజనం పాదంలో గురు లఘు క్రమాన్ని సంకేతం చేయటమే.

జాతుల్లో (గీత, సీసాది పద్యాలు) అక్షరాల సంఖ్యా, క్రమమూ నిర్దిష్టం కాదు. ఉదాహరణకు, గీత పద్యపాదంలో అక్షరాల సంఖ్య 12 నుంచి 17 వరకూ ఉంటుంది. ఒక పాదంలో 288 రకాల అక్షర క్రమాలుంటై. అంటే గీత పద్యపాదంలో అంతర్నిర్మాణాన్ని గాని, బాహ్య పరిమితిని గాని గణ సహాయం లేకుండా ‘ఏకైక పద్ధతి’లో (Unique way) చెప్పలేం. ఈ పద్యాల్లో గణ క్రమమూ, గణ సంఖ్యా నిర్దిష్టం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, జాతుల్లో పాదాల అంతర్నిర్మాణాన్ని, బాహ్య పరిమితిని అక్షరాల సహాయంతో ‘ఏకైక పద్ధతి’లో చెప్పలేం. గణాల సహాయంతో చెప్పగలం.

ఇక మాత్రా ఛందస్సుల విషయం. మాత్రా ఛందస్సుల్లో లయ ప్రధానం. ఈ లయ మాత్రా గణానుసారి. లయ ననుసరించి మాత్రా పద్యాల అంతర్నిర్మాణాన్ని గురించి చెప్పాలంటే, మాత్రాగణాలను గుర్తించక తప్పదు. అక్షరక్రమం నిర్దిష్టం కాదు గనుక, అక్షర పద్ధతి ఇక్కడ సాయపడదు. బాహ్య పరిమితినైనా అక్షర సంఖ్యలో చెప్పలేం. ప్రాచీనులు కొందరు మాత్రాపద్యాలకు లయవిరహితంగా లక్షణం చెప్పారు. అంటే, మాత్రా పద్యాల్లో అంతర్నిర్మాణాన్ని గురించి వారు పట్టించుకోలేదన్నమాట. ఆ మేరకు వాళ్ళ లక్షణం అసమగ్రం. మాత్రాగణాల్లో కొన్ని చోట్ల జ-గణాన్ని నిషేధించటానికి కారణాన్ని ఊహించటం కష్టం కాదు. మూడు మాత్రల గణాల్లో ‘లగం’, నాలుగు మాత్రల గణాల్లో ‘జ’గణం, ఐదు మాత్రల గణాల్లో ‘య’గణం విలోమగతి ఉన్న గణాలు. ఈ గణాల్లో ఊనిక గురువైన రెండో అక్షరం మీద ఉంటుంది. అదే మాత్రా సంఖ్య ఉన్న ఇతర గణాలు అనులోమగతి ఉన్న గణాలు. వాటిల్లో మొదటి అక్షరం మీద ఊనిక ఉంటుంది. ఐదు మాత్రల గణాల్లో ‘త’గణంలో రెండో అక్షరం మీద, ‘నలం’లో మూడో అక్షరం మీద కూడా ఊనిక ఉండటానికి అవకాశం ఉంది. అయిటే, వాటిల్లో మొదటి అక్షరం మీద కూడా ఊనిక ఉంటుంది. అనులోమ గణాలుండాల్సిన చోట విలోమ గణాలుంటే లయ భంగమవుతుంది. అందువల్లనే ముత్యాలసరంలో ‘లగం’ ‘జ’గణం వాడరు. ఖండగతి పద్యాల్లో ‘య’గణం ఐదు మాత్రల గణమైనా వాడరు. లయను పట్టించుకోనివాళ్ళు, లయను గ్రహించనివాళ్ళు కొందరు వాడితే వాడవచ్చు. అవి అపవాదాలుగానే నిలుస్తయి. నేటి కవుల్లో, శ్రీశ్రీ పద్యాల్లో అట్లాంటి వ్యతిక్రమణలు కొన్ని కనిపిస్తవి. శ్రీశ్రీ ఐనా ముత్యాలసరంలో ‘లగం’ వాడిన (జగద్గురు శంకరుండేడీ) చోట్లున్నై గాని ‘జ’గణం వాడిన చోట్లు కనపడలేదు. ఖండగతిలో ‘య’గణాన్ని మిగతా గణాలతోబాటు ప్రసిద్ధులైన కవులెవరూ వాడిన ఉదాహరణలు లేవు.

అసలు పద్యాలన్నిటికీ లయ ననుసరించే లక్షణం చెప్పాలని కీ. శే. గిడుగు సీతాపతిగారి వాదం. అంటే, ఛందో విభాగమంతా మాత్రాబద్ధంగా ఉండాలని వారి వాద సారాంశము. అయితే, ఉన్న పద్యాలన్నిటికి మాత్రా పద్ధతిలో లక్షణం చెప్పటం కుదరదు. లయ నిర్దేశించని పద్యాల్లో గతి వైవిధ్యానికి అవకాశం ఉంది. మాత్రా ఛందస్సుల్లో గతిని మార్చటమంటే పద్యాన్ని మార్చటమే అవుతుంది. అయితే, ఆధునిక కవులు ఒకే గతి ఉండాల్సిన పద్యాల్లో భిన్న పాదాల్లో భిన్న గతులు పాటించిన ఘట్టాలున్నై. ఉదాహరణకు 10 మాత్రల బాహ్య పరిమితి గల పద్యాల్లో కొన్ని చోట్ల ఖండగతిని (5+5), కొన్ని చోట్ల మిశ్రగతిని (3+4+3) పాటించారు.12 మాత్రల బాహ్య పరిమితి గల కొన్ని చోట్ల త్రిశ్రగతిని (3+3+3+3), కొన్ని చోట్ల చతురస్రగతినీ (4+4+4) పాటించారు. ముత్యాలసరాన్ని మాత్రం 3+4+3+4 క్రమంలోనే నడిపారు. వీటన్నిటిలోనూ పాటించిన ఒక సాధారణ సూత్రం ఉంది. సరిమాత్రా సంఖ్య బాహ్య పరిమితిగా గల మాత్రా పద్యాలు రెండర్థభాగాలుగా విరుగుతై. 14 మాత్రలను 6+8 మాత్రల గణాలుగా విభక్తమయ్యేట్లు శ్రీశ్రీ రాసిన పద్యాలు కొన్ని ఉన్నై. ఇవన్నీ చాలామందికి తెలిసినవే కాబట్టి ప్రత్యేకంగా ఉదాహరణలు చూపించటం లేదు. ఒకే పద్యంలో భిన్నగతులతో పద్యపాదాలు ఉన్నప్పుడు వాటిని విషమచ్ఛందోభేదాలుగా పరిగణించాల్సి ఉంటుందనుకుంటాను.

మాత్రాపద్యాలకు మాత్రం లయనిర్దేశం ఎందుకు చేయాలి? అని అడగవచ్చు. లయ నిర్దేశించకపోతే మాత్రాపద్యాల్లో అంతర్నిర్మాణం ఉండదు. అక్షర క్రమాన్ని నిర్దేశిస్తే అవి వృత్తాలతో సమానమవుతై. ఇంద్ర చంద్ర గణాలను నిర్దేశిస్తే అవి జాతుల్లో భాగమవుతై. మాత్రా పద్యాలు ప్రత్యేక ఛందస్సుగా నిలబడాలంటే వాటి నిర్వచనం మాత్రా గణాల్లోనే జరగాలి. ఒక్కో పాదానికి అంతర్నిర్మాణం భేదించినా గుర్తించదగిన పద్ధతుల్లోనే (Predictable modes) భేదిస్తుంది. అంతేకాని అసలు అంతర్నిర్మాణమే లేని మాత్రా పద్యం ఉండదు.

పై చర్చ సారాంశం ఏకైక పద్ధతిలో అంతర్నిర్మాణాన్ని, బాహ్య పరిమితిని సూచించాలంటే వృత్తాలకు గణ నిర్మాణం అవసరం లేదని; జాతులకు, మాత్రా పద్యాలకు ఇది అవసరమనీ తేలుతుంది. ‘గణాల దృష్ట్యా పాదానికి అంతర్నిర్మాణమంటూ ఏదీ ఉండదు’ అన్న సంపత్కుమార వాక్యం వృత్తాలకు మాత్రమే అన్వయిస్తుంది.


ఛందోభేదాలు

పైన పేర్కొన్న ఛందో భేదాల్ని పక్కనున్న అంతస్తుల బొమ్మల్లో చూపించవచ్చు. ఈ బొమ్మల్లో పైనుంచి కిందికి గాని, కిందనుంచి పైకి గాని పోవటానికి దార్లున్నై. అంతస్తులకు కుడిపక్కన అంతర్నిర్మాణ రేఖ, ఎడమపక్కన బాహ్య పరిమితి రేఖ ఉన్నై. వృత్తాల్లో అంతర్నిర్మాణ, బాహ్య పరిమితులను అక్షర క్రమం సాయంతో చెప్పవచ్చు కాబట్టి; గణక్రమానికి, అక్షరక్రమానికి ఒకే దారి ఉంది. కాబట్టి, ఇక్కడ గణాల అంతస్తుని తొలిగించినా వచ్చే ఇబ్బంది లేదు. అందువల్ల ఈ అంతస్తుకి వచ్చే అంతర్నిర్మాణ రేఖ, ఈ అంతస్తు నుంచి పోయే బాహ్య పరిమితి రేఖ విరిగిన బాణపు గుర్తులతో సూచించబడింది.

రెండో బొమ్మలో గణాల అంతస్తు నుంచి అక్షరాల అంతస్తుకి దారులు మూడు చూపించబడ్డయ్. ఇక్కడ మూడు బహుత్వానికి చిహ్నం మాత్రమే. ఒక్కొక్క గణాన్ని ఏకైక పద్ధతిలో అక్షరక్రమంగా మార్చలేము. సూర్య గణాన్ని అక్షరక్రమంగా మార్చటానికి రెండు పద్ధతులు, ఇంద్రగణాన్ని అక్షరక్రమంగా మార్చటానికి ఆరు పద్ధతులూ ఉన్నై. అట్లా కాకుండా, నగణం, గలం, నగ, నల, సల, భ, ర, త వంటి గణాల సాయంతో గణక్రమం చెప్తే, గణక్రమం నుంచి అక్షరక్రమానికి ఒకేదారి చాలు. అప్పుడు పాదం నుంచి గణాల అంతస్తుకి దారులెక్కువ చూపించాల్సి వస్తుంది. అంటే, ఈ వైవిధ్యాన్ని ఎక్కడోచోట చూపించక తప్పదు. ఏ పద్ధతిలో అయినా గణాల అంతస్తుని తప్పించుకోలేం. భిన్న అక్షర క్రమాల్ని అక్షరాల అంతస్తులో నిర్మిస్తే గణాల అంతస్తుని తప్పించుకోవచ్చు. అప్పుడు పాదానికి అంతర్నిర్మాణాన్ని ఏకైక పద్ధతిలో చెప్పలేము. పైన పేర్కొన్నట్లుగా గీత పద్యపాదానికి 288 రకాల అక్షరక్రమాలను చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల జాతుల అంతర్నిర్మాణ, బాహ్య పరిమితుల నిర్వచనానికి గణాల సహాయం అవసరమవుతున్నది.

మూడో బొమ్మ కూడా రెండో బొమ్మ లాంటిదే. ఇందులో కూడా గణక్రమం నుంచి అక్షరక్రమానికి దారులెక్కువున్నై. అక్కడ కూడా మాత్రా గణాలకు బదులు అక్షరక్రమాన్ని బట్టి ఏర్పరిచిన గణాల (నిసర్గ గణాలు మొ.) సాయంతో గణక్రమాన్ని సూచిస్తే, అక్షరక్రమానికి ఒకే దారి సరిపోతుంది. అప్పుడు ఇక్కడ కూడా పాదం నుంచి గణక్రమానికి దారులెక్కువ చూపించాల్సి వస్తుంది. ఇక్కడైనా గణాల అంతస్తుని తొలగించలేము. మాత్రా పద్యాల్లో అక్షర క్రమానికి ప్రాధాన్యం లేకపోయినా, ప్రయోజనం ఉండటం వలన అక్షరాల అంతస్తు కూడా ఇక్కడ నిర్మించబడింది. అనులోమ, విలోమ గతి భేదం గురు లఘు క్రమాన్ని బట్టే చెప్పాల్సి ఉంటుంది కనుక మాత్రా ఛందస్సులో అక్షరాల అంతస్తు అవసరమవుతున్నది. మాత్రలు ఒకే పరిమాణం గలవి కనుక వాటిలో క్రమం అంటూ ఉండదు. మాత్రా పద్యంలో బాహ్య పరిమితి మాత్రా సంఖ్యను బట్టి ఉంటుంది కనుక అడుగు అంతస్తు నుంచి కూడా బాహ్య పరిమితి రేఖ మొదలు కావచ్చు. అంతర్నిర్మాణానికి మాత్రం గణక్రమమే ఆధారం. ఈ బొమ్మల్లో కొన్ని వివరాల్లో కొన్ని మార్పులు అవసరం కావచ్చు. కాని, తెలుగులో ప్రచురంగా ఉన్న ఛందోభేదాల్ని అర్థం చేసుకోడానికి ఇవి సాయపడతయ్యనుకుంటాను.

పద్యపాదాల సామాన్య లక్షణాలుగా నేను ప్రతిపాదించిన అంతర్నిర్మాణ, బాహ్య పరిమితులను సంపత్కుమార ఎక్కడా స్పష్టంగా నిరాకరించలేదు. అంతర్నిర్మాణం గణాల దృష్ట్యా మాత్రమే లేదన్నారు. పైగా ఆయన ‘అంతర్విభజన’ అనే మాట నేనుపయోగించిన అంతర్నిర్మాణం అనే మాటకు సమానార్థకంగానే కనిపిస్తున్నది. ఆయన ప్రతిపాదించిన భావగణాలకు ఇంతకన్నా వేరే ప్రయోజనం లేదు. ఒక భావం పూర్తి కావటంతో పాదం పూర్తి కావచ్చు. భావంతో పూర్తి అయిన పాదంలో భావాంశాలుంటే అంతర్విభజన సాధ్యం కావచ్చు. ఒకే ఒక్క భావాంశమే పాదంలో ఉంటే అంతర్విభజన కవకాశం ఉండదు. ఒక పాదంలో ఒకటి మొదలు ఎన్నైనా భావాంశాలుండవచ్చనుకుంటాను. ‘ఒక భావం పూర్తిగావటంతో ఒక పాదం పూర్తి కావచ్చు’ ననటం వల్ల వచన పద్యపాదం గరిష్ఠ పరిమితి ఒక భావమని సంపత్కుమార ఉద్దేశంగా గ్రహించవచ్చు. వచన పద్యపాద కనిష్ఠ పరిమితి భావాంశంతోనూ, గరిష్ఠ పరిమితిని భావంతోనూ సూచించారు. అంటే, నిర్దిష్టమయిన అంతర్విభజన కానీ, బాహ్య పరిమితిని కానీ ఆయన సూచించలేదు. ఒకవేళ, మాట వరసకి భావ, భావాంశాలనేవాటిని గణాలుగా గాని, గణతుల్యాలుగా గాని అంగీకరించినా, వీటి సహాయంతోనైనా అంతర్నిర్మాణ, బాహ్య పరిమితులను నిర్దిష్టంగా చెప్పలేదు కాబట్టి, వచన పద్య పాదాలకివి నిర్దిష్టంగా లేవని అనుకోవాల్సి వస్తున్నది. అసలు భావ, భావాంశాల విభజన, తద్వారా పాద, పాదాంతర్విభజన సాధ్యమవుతుందా? లేదా? అని చర్చించే ముందు సంపత్కుమార నేను వేసిన కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను పరిశీలించాల్సి ఉంది.

వచన పద్యానికి పాదబద్ధత ఉందా, లేదా? అని నేను తెలుసుకోటానికి రెండు ప్రయోగాలను సూచించాను. 1. పాదవిభజన లేకుండా రాసిన, లేక అచ్చు వేసిన వచన పద్యానికి కవ్యుద్దిష్టమైన పాదవిభజన చేయటానికి ప్రయత్నించటం. 2. ఇద్దరు లక్షణకర్తలు ఒకే రకమైన పాదవిభజన చెయ్యగలగటం. ఈ రెండూ సాధ్యం కావు కాబట్టి వచన పద్యపాద విభజనకు ఏకైక పద్ధతి లేదని నా వాదం. ఈ సందర్భంలో సంపత్కుమార ఒకేసారి రెండు పద్యాలుగా గణవిభజన చెయ్యటానికి వీలున్న ఈ పద్యభాగాన్ని ఉదాహరించారు.

మధుర మధురమైన మామిడి పండ్లను
పంచి ఇచ్చు జనుడె మంచివాడు

ఇది ఆటవెలది పద్యంలో అర్థభాగమూ కావచ్చు. సీస పద్యంలో ఒక పాదమూ కావచ్చు. ఈ భాగాన్ని మాత్రమే ఉదాహరిస్తే కవి ఏ పద్యాన్ని ఉద్దేశించాడో చెప్పలేం. కాని, పూర్తి పద్యాన్ని ఉదాహరిస్తే చెప్పటం తేలిక. పద్యమంతా ఇట్లాగే విభక్తమయితే కవి రెండూ ఉద్దేశించాడని చెప్పవచ్చు. యాదృచ్ఛికంగా పద్యమంతా ఇలాగే ఉండటం జరగదు. ఇక్కడ సంపత్కుమార ఉద్దేశం ఏమిటంటే – కనీసం కొన్ని చోట్లనైనా, కొన్ని పాదాల్లోనైనా ఇట్లాంటివి సాధ్యం కాబట్టి, ఆ భాగాలనే ఉదాహరించినప్పుడు కవి దేన్ని ఉద్దేశించాడో చెప్పలేం కాబట్టి, – వచన పద్యాల్లో మాత్రం కవి ఉద్దేశించినట్టే ఎందుకు పాదవిభజన చెయ్యాలి? అని. కవి ఉద్దేశించిన పాదవిభజన ప్రమాణం ఎందుకు కావాలి? నిజమే. అక్కర్లేదు. ప్రాచీన పద్యాల్లో కవి ఉద్దేశించిన విభజన, లక్షణకర్త చేసిన విభజన ఒకటే ఎందుకవుతున్నై? ఇద్దరూ ఒకే సూత్రాన్ని అనుసరించటం వల్ల, అనుసరించటానికొక సూత్రమంటూ ఉండటం వల్ల. అచ్చులో పాదవిభజన చెయ్యటం, చెయ్యకపోవటమనేది అప్రధానం. శార్దూలం వంటి పద్యాల్ని చిన్న సైజు పుస్తకంలో అచ్చు వేసేప్పుడు ఒక్కో పాదాన్ని రెండుగా విరిచి ముద్రించటం చూస్తున్నాం. అయినా అక్కడ సందిగ్ధత కవకాశం లేదు. వచన పద్యంలో అట్లాంటి సందిగ్ధత కవకాశం ఉంది. పైన పేర్కొన్న ‘మధుర మధురమైన’ చోట్ల ఉన్న సందిగ్ధం వేరు. పైన ఉదహరించిన భాగానికి రెండువిధాలయిన విభజనే సాధ్యం. ఆ రెండూ, రెండు సూత్రాల ఫలితాలూ ఒకచోట కలిసిపోవటంవల్ల ఏర్పడినై. ఇది సిస్టమేటిక్ కన్వర్జెన్స్. ఇట్లాంటిది వచన పద్యంలో ఉండటానికి వీల్లేదు. సిస్టం ఉన్నప్పుడు కదా సిస్టమేటిక్ కన్వర్జెన్స్ ఉండేది! దీన్ని ‘ఛందస్‌శ్లేష’ అనవచ్చు. వాక్యనిర్మాణంలో కనిపించే వ్యాకరణశ్లేష వంటిదే ఇది. ఒక వాక్యానికి కేవలం భిన్న వ్యాకరణ సంబంధాలవల్ల భిన్నార్థాలు వస్తే, వ్యాకరణశ్లేష అవుతుంది. ఈ భిన్న వ్యాకరణ సంబంధాలు ఒక వాక్యంలో ఏ పరిస్థితుల్లో ఒకే రకంగా వ్యక్తమవుతయ్యో ప్రెడిక్టు చేయవచ్చు. ఈ పని వ్యాసకర్తలది. ఆధునికులు చేస్తున్న వాక్యనిర్మాణచర్చలో ఈ పరిశీలన కొంత కనిపిస్తున్నది. అట్లాగే, ఛందస్‌శ్లేషని కూడా ప్రెడిక్టు చెయ్యవచ్చు. దీన్ని వివరించాల్సిన బాధ్యత ఛందః పరిశోధకులది.

సంపత్కుమార చూపించినవే కాక , ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటై. ఉదాహరణకు, యతి నియమాలను పాటిస్తూ 17 లఘువులతో పద్యపాదం రచిస్తే అది గీతమూ కావచ్చు, ఆటవెలది బేసిపాదమూ కావచ్చు. ఇందుక్కారణం సర్వలఘువులున్న గణం సూర్యగణాల్లోనూ ఉంది, ఇంద్రగణాల్లోనూ ఉంది. ఆటవెలది బేసిపాదంలోనూ, గీత పద్యపాదంలోనూ ఇంద్ర, సూర్య గణాల సంఖ్య ఒకటే. క్రమం లోనే భేదం. సర్వ లఘువులున్న పాదంలో ఈ రెండు రకాలయిన విభజన అందువల్ల సాధ్యమయింది. ‘సూర్య-ఇంద్ర-సూర్య-ఇంద్ర-సూర్య’ అనే క్రమంలో ఏదన్నా పద్యం ఉంటే, అట్లాగూ విభజించవచ్చు. ఇట్లాంటివే మరికొన్నిటిని గమనించండి.

1. U I U I U I I I I I I I U I
    U I U I U I I I I U I I I I
2.U I I I I I U I I U I I I I
    U I I I I I U I I U I U I
3. U I I I I I I I I I I I I I U I

ఈ పై కూర్పులలో మొదటి జంట గీత పద్యపాదమూ, ఆటవెలది బేసిపాదమూ కావచ్చు. తరువాతి జంట గీత ద్విపద పాదాల్లో ఏదైనా కావచ్చు. చివరిది ఆటవెలది బేసిపాదమూ, ద్విపద పాదమూ కావచ్చు. ప్రయత్నించి చూస్తే, ఒకే కూర్పు ఈ మూడు రకాలు అయ్యేట్టు కూడా చెయ్యవచ్చు. పై కూర్పులో మొదటి గురువు స్థానంలో రెండు లఘువులున్నా, మార్పేమీ ఉండదు. ఇట్లాంటి అవకాశాల్ని పరిశీలించి పరిశోధకులు వివరిస్తే ఛందస్సును గూర్చిన మన అవగాహన పెరుగుతుంది.

ఇంతకీ నా ప్రధానమైన ప్రశ్న ఇది – వచన పద్యానికి కవి ఉద్దేశించినా, లక్షణకర్త ఉద్దేశించినా పాదవిభజనకు పద్ధతి ఏమిటి? ‘భావాన్ని బట్టి’ అని సంపత్కుమార సమాధానం. పాదాంతర్విభజనకీ ఆయన అదే సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఒక వచన పద్యాన్ని భిన్న లాక్షణికులు భిన్నవిధాలుగా విభజించటం సంపత్కుమారగారు అనుకుంటున్నట్టు పైన పేర్కొన్న ‘మధుర మధురమైన మామిడి పండ్లను..’ అన్నదాన్ని సీస పద్యంగానూ, ఆటవెలది అర్ధభాగంగానూ విభజించటం లాంటిది కాదు. ఒకే లక్షణకర్తగానీ, భిన్న లక్షణకర్తలు గానీ దాన్ని రెండు విధాలుగా మాత్రమే విభజించటానికి అవకాశం ఉంది. ఈ లక్షణ భిన్నత్వం కూడా క్రమబద్ధమే. వచన పద్య పాదవిభజనలో భిన్నత్వానికి కారణం లక్షణ భిన్నత్వం కాదు. లక్షణాభావం. ఎందువల్లనంటే, భావ భావాంశాలను గుర్తు పట్టటానికి గాని, పరిగణించటానికి గాని, ప్రమాణించటానికి గాని పద్ధతులేమీ లేక పోవటం వల్ల. భావానికిగాని, భావాంశానికిగాని భాషలో అస్తిత్వం వ్యాకరణ సంబంధాలవల్లనే సాధ్యం. అంటే, భాషలో అవి వ్యస్తపదాలవల్ల గాక పదబంధాల వల్ల, ఉపవాక్యాల వల్ల (Clauses), వాక్యాల వల్ల వ్యక్తమవుతై. వీటి నిర్మాణం వాక్యనిర్మాణ చర్చలో భాగమవుతుంది. భాషావ్యవహారంలో అది సంభాషణైనా, కథాకథనమైనా, పద్యమైనా, గద్యమైనా భావవ్యక్తీకరణం ఈ రకం వాక్యనిర్మితి వల్లనే సాధ్యం. వ్యాకరణంతో నిమిత్తం లేకుండా భావ, భావాంశాలను ఎలా పరిగణిస్తారో నా ఊహకు అందటం లేదు. వ్యాకరణ సంబంధాల కతీతంగా భావం ఉంటుందంటే అందుకు నా అభ్యంతరం లేదు కాని, అది భాషలో ఎట్లా వ్యక్తమవుతున్నదనే నాక్కావల్సింది. అది వ్యాకరణ సంబంధాల వల్లనే సాధ్యమవుతుందని నా అభిప్రాయం. (పదాలకూ పదాంశాలకూ అర్థాలుంటయ్యని, భావ వ్యక్తీకరణలో వాటికి ప్రాధాన్యం ఉంటుందన్న విషయం నేను కాదనటం లేదు. వీటి సంపుటీకరణాన్ని గురించి నేను ఉద్దేశిస్తున్నది.)

వ్యాకరణాతీతంగా భావ భావాంశాలను పరిగణించే సూత్రమేమిటి? అని సూటిగా అడుగుతున్నాను. ‘భావాన్ని, భావాంశాన్ని బట్టి వచన పద్యంలో పాదవిభజన జరుగుతుంది’ అంటే చాలదు. వీటిని గుర్తుపట్టే సాధనాలు ఇయ్యనంతవరకు ఎన్ని ఉదాహరణలిచ్చినా ప్రయోజనం లేదు.

పాదవిభజనలో పద్ధతి ఉందనటానికి సంపత్కుమార ఈ కింది మాటల కూర్పుని ఉదాహరించారు.

ప్రాణాలు బిగబట్టుకొని
సాగేరు ప్రయాణీకులు
నాయకుడు తిరిగి వస్తాడనీ
తుఫాను శమిస్తుందనీ
నదిపొంగు తగ్గేననీ
ఆశతో అహరహమూ!
దేనికైనా ఉద్ధృతి ఎంతసేపు?
దానికి వ్యతిరిక్తం తప్పదా పైనా.

– మాదిరాజు రంగారావు, యుగసంకేతం.

చివరి రెండు పాదాలు భావాన్ని బట్టి, మొదటి ఆరు పాదాలు భావాంశాన్ని బట్టి విభక్తమవుతయ్యని సంపత్కుమార వివరణ. కాని, ఈ భావ, భావాంశాల వ్యక్తీకరణ వ్యాకరణ మూలంగా జరిగిందని, ఇక్కడ పాదవిభజన ఏదన్నా ఉంటే అది వ్యాకరణ సంబంధి అని నా వివరణ. చెవరి రెండు పాదాలూ రెండు వాక్యాలు. వాటినే సంపత్కుమార భావాలన్నారు. మొదటి రెండు పాదాలు కలిసి ఒక వాక్యం. మొదటి పాదం క్త్వార్థక క్రియాంతమైన ఉపవాక్యం. ప్రధాన వాక్యాంశమైన రెండో పాదానికిది రీతిని సూచించే విశేషణ వాక్యాంశం. లేక, ఉపవాక్యం క్త్వార్థక క్రియా వాక్యంలో ప్రవర్తించే తీరుల్లో ఇది ఒకటి. అంటే, ఒక వాక్యంలో రెండు క్లాజుల్ని రెండు పాదాలుగా విడదీశారన్నమాట. 3-6 పాదాలన్నీ కలిపి ఒక వాక్యం. కానీ ఇక్కడ క్రియ లేదు. ఉంటే ఆరో పాదంలో ఉండాలి. కానీ ఇక్కడ లోపించింది. బహుశా అది కవి శైలీవిశేషం కావచ్చు. ఆ లోపించిన క్రియకు ఆరో పాదం విశేషణం అవుతుంది. 3-5 పాదాలు ఒక ‘గర్భితవాక్యం’. ఈ వాక్యాంశాలకు ‘అని’ అనే అనుకరణాద్యర్థ బోధక శబ్దం చేర్చటం వల్ల ఉపవాక్యాలయినై. అంటే, పైన ఉదాహరించిన భాగంలో పాదవిభజన వాక్య నిర్మాణంలో వాక్య, ఉపవాక్య విభజన జరిగే పద్ధతి ననుసరించి జరిగిందని స్పష్టం.

ఈ సందర్భంలోనే కె. వి. రమణారెడ్డిగారి బాధాగాధము అనే ఖండికలోనుంచి నేను ఉదహరించిన భాగాన్ని సంపత్కుమార మళ్ళీ ఉదాహరించి – ‘కొంచెం లోపం ఉండచ్చుగాక’ – అందులో పాదవిభజన జరిగిందని నిరూపించటానికి ప్రయత్నించారు. రమణారెడ్డిగారి అంగారవల్లరి అనే పుస్తకంలోనుంచి కొంతభాగాన్ని గ్రహించి, అచ్చులో అది ఎట్లా ఉందో, అట్లాగే నా వ్యాసంలో ఉదాహరించాను. అచ్చులో అక్షరాల వరస కాగితం మీద అక్షరాలు పట్టే చోటు ననుసరించి కూర్చబడింది. రమణారెడ్డిగారు ‘బాధాగాధము’లో పాదవిభజన ఉద్దేశించలేదు. (అట్లా అని నాకు రాశారు కూడా.) నేనుదాహరించిన భాగంలో అవి నాలుగు పాదాలుగా కనిపించటం కేవలం యాదృచ్ఛికం. రమణారెడ్డిగారి అంగారవల్లరి అనే అచ్చుపుస్తకాన్ని సంపత్కుమార చూసి ఉండలేదనుకుంటాను. చూస్తే బాధాగాధములో పాదవిభజన జరిగిందని పొరపాటుబడే అవకాశం ఉండేది కాదు.

అట్లాగే, తిలక్ రాసిన రాత్రి వేళ అనే ఖండికలో పాదవిభజన జరిగినట్టు నాకు నమ్మకం లేదు. ‘అమృతం కురిసిన రాత్రి’ తిలక్ మరణించిన తరువాత అచ్చయిన పుస్తకం. అందువల్ల, కవి ఏ ఖండికలో పాదవిభజన ఉద్దేశించాడో, ఎక్కడ ఉద్దేశించలేదో తెలుసుకోటానికి అచ్చయిన పుస్తకమే ఆధారం. ఈ ఆధారంతో చూస్తే, కవి ఇక్కడ పాదవిభజన ఉద్దేశించినట్టు తోచదు. ఇప్పుడు కనిపించే పాదవిభజన తిలక్ పద్యాల్ని కాపీ చేసినవారో, అచ్చు వేసినవారో చేసి ఉండవచ్చు.

పాదాల అంతర్విభజనకు సంపత్కుమార భావ గణాలను ప్రతిపాదించారు. ఈ భావగణం భావమూ కావచ్చు, భావాంశమూ కావచ్చు. పాదవిభజనకు కూడా వీటినే ప్రస్తావించారు గనుక ఒక్కో పాదంలో ఒక్కొక్కసారి ఒకే గణం ఉండవచ్చు. ఆ గణం భావాంశ గణమైతే అంతర్విభజన సాధ్యం కాదన్నమాట. భావాంశాలుగా విభక్తం కాని భావగణమున్నా అంతర్విభజన వీలుపడదు. అయినా అభ్యంతరం లేదు. గణితశాస్త్రంలో ‘సెట్ సిద్ధాంతం’ ద్వారా దీన్ని సమర్థించవచ్చు. ఒక పాదం గణాల సెట్ అయితే అందులో ఒక వస్తువు (గణం) ఉన్నా సెట్ అవుతుంది. ఒక సెట్ తనలోతాను అంతర్భాగం అవుతుంది. అక్షర ఛందస్సుల్లో ఏకాక్షరవృత్తాంతర్నిర్మాణాన్ని సమర్థించే మార్గం ఇదే అనుకుంటాను. కానీ, భావగణాలైన ఈ భావం, భావాంశాల స్వరూపాల్ని సంపత్కుమార ఇప్పటి వ్యాసంలోనైనా వివరించకపోవటం విచారకరం. ‘భిన్న భిన్న వచన పద్య పాదాల్లో అక్కడ భావాన్ని స్ఫురింపజేసే పదాల స్థితినిబట్టి భావగణ విభాజకరీతి ఉంటుంది’ అన్న సంపత్కుమార వివరణ చాలా అసంతృప్తికరంగా ఉంది. ఆ ‘స్థితి’ ఏమిటో నిరూపించేవరకూ భావగణాల అస్తిత్వాన్ని అంగీకరించలేను. వీరు ఆధారపడ్డ భావస్ఫూర్తి వ్యాకరణ సంబంధాలవల్ల కలుగుతున్నదని నా వాదం.

ఇంతకు ముందే చెప్పినట్లుగా, వ్యాకరణాంశాలు వదిలేస్తే భావాలు దొరకవు. అందుకనే వారి భావగణాలను (వాటిని గణాలు అనాల్సివస్తే) నేను వ్యాకరణ గణాలు అన్నాను. వ్యాకరణ రూపైకత అనటంలో ప్రతిగణమూ ఇంకో గణంతో సమంగా ఉండటం కాదు నేను ఉద్దేశించింది. కొన్ని పదసమూహాలకు వ్యాకరణ సమత్వం ఉంటుంది. అట్లాంటివి ఒక గణం కావచ్చు. సమత్వ భేదాల్ని బట్టి బహువిధగణాలుండవచ్చు. ఇంతకీ వ్యాకరణ గణాలను వచన పద్యానికి లక్షణంగా ప్రతిపాదించటం నా ఉద్దేశం కాదు. ఛందస్సులో వాడుకోదగిన వ్యాకరణ గణాలున్నయ్యని నేను నమ్మటం లేదు. కాని, సంపత్కుమార ప్రతిపాదిస్తున్న భావగణాలు వ్యాకరణాంశాలను బట్టి విభక్తమవుతయ్యని, వ్యాకరణ గణాలనటం వల్ల వ్యాకరణం సాయంతో వాటిని గుర్తు పట్టవచ్చనీ నా ఉద్దేశం. సంపత్కుమార ‘భావస్ఫూర్తి’ అన్నా, భావస్ఫూర్తి వ్యాకరణ పరిజ్ఞానం లేకుండా జరగదు గనుక, భావగణ విభజనలో వారికి తోడ్పడింది (వ్యక్తంగా కాకపోవచ్చు) ఈ వ్యాకరణ సంబంధాల పరిజ్ఞానమే. వ్యాకరణ విరహితంగా భావస్ఫూర్తి కలిగే పద్ధతి ఒకటుంటే, అది చూపించేవరకూ వారి భావగణాలను ‘వ్యాకరణ గణాలు’ అనే అనవల్సి ఉంటుంది.

సాంప్రదాయిక ఛందస్సులో రచించిన పద్యాలను చదివే పద్ధతిని గురించి సంపత్కుమార కొంత ప్రస్తావించారు. పద్యాన్ని శబ్దం మధ్యలో విరిచి చదవం – అది గణాంతమైనా సరే, పాదాంతమైనా సరే. ప్రకృతి ప్రత్యయాలను గాని, విశేషణ విశేషయాలను గాని కలిపి చదవటానికి కారణం, చదువరికి తన భాషను గురించి వ్యాకరణ పరిజ్ఞానం ఉండటమే. చదవటంలో ఈ భావస్ఫూర్తిని కలిగించేది ఈ వ్యాకరణ పరిజ్ఞానమే. అయితే ఆ పద్యాల్లో భావగణాల ప్రసక్తి గాని, వ్యాకరణ గణాల ప్రసక్తి గాని రాదు. ప్రసిద్ధంగా వాటికి గణవిభజన ఉంది. గణాల్ని బట్టి చదవాల్సిన అవసరం లేదు.

నిజానికి ఈ వ్యాకరణాంశాల పాత్రను సంపత్కుమార పూర్తిగా తిరస్కరించలేదని ఆయన వ్యాసంలోని ఈ వాక్యాల వల్ల మనం చెప్పవచ్చు – “వచన పద్య నిర్మాణంలో భావస్ఫూర్తి విషయికంగా వాక్యనిర్మాణరీతికి ప్రవేశం ఉంది. కాబట్టి వ్యాకరణ రూపైకత అక్కడక్కడా భావగణ విభజనలో కనిపించటం సహజమే. అంత మాత్రాన వ్యాకరణ రూపైకత వల్లనే సర్వత్రా భావగణ విభజన జరుగుతుందనటానికి వీల్లేదు.” వ్యాకరణాంశాలకి, వీరుంటయ్యంటున్న భావాంశాలకి ఏకైక సంబంధం (వన్ టు వన్ కరస్పాండెన్స్) ఉంది కాబట్టి వ్యాకరణ విరహితంగా భావగణ విభజన సాధ్యం కాదని నా నమ్మకం. సాధ్యమని నిరూపించాల్సిన బాధ్యత సంపత్కుమార మీదే ఉంది. కేవలం ‘భావస్ఫూర్తిని బట్టి’ అంటే చాలదు. వ్యాకరణ విరహితంగా భావస్ఫూర్తి ఎలా కలుగుతుందో కూడా ఆయన నిరూపించాలి.

సంపత్కుమార భావగణాలను గురించిన నా సందేహాలకు సమాధానం ఇయ్యటానికి ప్రయత్నించారు. ‘దూరము -దుంపలు-దుఃఖము-దుర్గతి ‘ అన్న మాటలను ఉదాహరించి, వాటిలో మొదటి గుర్వక్షర స్వరూపంలో మార్పున్నా ‘భగణం’ అనే ఒకే పేరుతో పిలుస్తున్నాం కాబట్టి, ‘భావాన్ని ఆధారం చేసుకుని పదాల స్వరూపంలో ఎన్ని తేడాలున్నా గూడా అది భావగణమే. అది ఏకైకం’ అని వివరించారు. పైన ఇచ్చిన మాటల్లో మొదటి అక్షర స్వరూపంలో భేదం ఉన్నా, సామ్యం గూడా ఉందని మరచిపోగూడదు. అంతేగాదు, ఆ సామ్యాన్ని హేతుబద్ధంగా నిరూపించవచ్చు. గురు లఘు నిర్ణయం అక్షర (syllable) పరిమాణాన్ని బట్టి జరిగింది. వ్యంజనాన్ని C అనే గుర్తు ద్వారాను, హ్రస్వాచ్చును V అనే గుర్తు ద్వారాను సంకేతిస్తే, గురు స్వరూపాన్ని ఈ విధంగా చూపించవచ్చు – CV, C, VC. పూర్వ పర వ్యంజనాలతో సంబంధం లేకుండా దీర్ఘాచ్చు గాని, పర వ్యంజనంతో మూతబడిన హ్రస్వాచ్చు గాని గురువు అవుతుంది. తక్కినవి లఘువులు. అక్షర పరిమాణాన్ని బట్టి ఏర్పడింది గురు లఘు విభేదం. ఇట్లాంటి నిశ్చితమైన సూత్రాలమీద ఏర్పడ్డ గురు లఘు క్రమాన్ని అనుసరించి తయారయిన గణాలకూ, భావగణాలకూ పోలికే లేదు. భావగణాలను పరిగణించటానికి వీల్లేదంటే, అది వేరే మాట. కాని, భావగణాల పరిగణనకు ప్రాచీన ఛందస్సామ్యం అతకదు.

సంపత్కుమార ఇప్పటి వ్యాసంలోనైనా వచన పద్యాన్ని అంతర్నిర్మాణమూ, బాహ్యపరిమితీ ఉన్న పాదాలుగా విభజించటానికి స్పష్టమయిన ప్రతిపాదన ఏదీ చెయ్యలేదు. ఆయన ఉన్నయ్యంటున్న భావగణాలు వ్యాకరణాంశాల మీదనే ఆధారపడ్డయి గనుక అవి వ్యాకరణ గణాలే అవుతై. ఆయన భావగణా పద్ధతికి వచన పద్యాన్ని గద్యం నుంచి వేరు చేసే శక్తి లేదు. ‘భావ స్ఫూర్తి ఆధారంగా విభక్తమవుతయ్యని’ సంపత్కుమార అంటున్న భావగణాలు అన్ని రకాల భాషా వ్యవహారాల్లోనూ ఉంటై. అయినప్పుడు ఆయన పద్ధతి ననుసరించి ఒక వ్యాసంలోని వాక్యాలను గూడ భావ, భావాంశాల పద్ధతిలో పాద విభజన చేసి వచన పద్యంగా నిరూపించవచ్చు. అచ్చులో గాని, రాతలో గాని కవి పాదవిభజనని సూచించటం ప్రమాణంగా తీసుకుంటే, ఆ పని వ్యాసకర్త కూడా చేయ్యవచ్చు. ఇకపోతే, వచన పద్యంలో ఉండే కవితా పదార్థం దాన్ని వ్యాసాల నుంచి, ప్రకటనల నుంచి వేరు చేస్తుంది కదా అంటే, కవిత్వానికి గద్యంలో స్థానం లేదని అనాల్సి ఉంటుంది. రసహీనమైన పద్యాలు, రసవంతమైన గద్యం ఉంటయ్యని అందరూ ఒప్పుకుంటారు. కవిత్వం ఉన్నదల్లా ఛందో విభాగం అని, ఛందస్సులో ఉన్నదల్లా కవిత్వం అవుతుందని సంపత్కుమార అంటారనుకోను.

ఈ చిక్కులన్నిటికీ కారణం మనకు ప్రసిద్ధంగా ఉన్న ఛందస్సాంప్రదాయంలో ఎక్కడోచోట ఈ వచన పద్యానికి చోటు కల్పించటం కోసం ప్రయత్నించటం. ఏదో రకమైన ఛందస్సూ, గణ విభజన ఉన్నయ్యంటే, వచన పద్యానికి అదనంగా ఏదో గౌరవం వస్తుందనుకోవటం.

ఏ విధంగా చూసినా, సంపత్కుమార చెప్పిన లక్షణాలు వచన పద్యాన్ని ఛందో విభాగంగా నిలబెట్టలేవు. అందువల్ల వచన పద్యం పద్యం కాదని, గద్యమేనని నేను పూర్వం చేసిన నిర్ణయాన్ని మార్చుకోవలసిన అవసరం సంపత్కుమార వ్యాసం నాకు కలిగించలేదు.

(భారతి, నవంబరు 1972. పు. 41-49)


వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి.

(ఈ వ్యాస పరంపరలో నాలుగవ వ్యాసం కోవెల సంపత్కుమార రాసిన వచన పద్యం పద్యమే.)