ఛందశ్శాస్త్రంలో గణాలు – అవి మాత్రా గణాలు గానీ, అక్షర గణాలు గానీ పరిమిత సంఖ్యాకాలు. అంటే పరిగణనీయాలు, వాటి మిశ్రమాలు. పద్యపాద పరిమితిని బట్టి అధిక సంఖ్యాకాలు కావచ్చు. కాని గణాలు మాత్రం పరిమిత సంఖ్యాకాలే. అవి నిసర్గ, ఇంద్ర, చంద్ర, సూర్య గణాలు కావచ్చు. రెండు, మూడు, నాలుగు, ఐదు మాత్రల గణాలుగా రావచ్చు. కానీ, ఈ భావగణాల సంఖ్య ఎంత? భావాలు ఎన్ని ఉంటయ్యో భావగణాల సంఖ్య అంతన్నమాట! భావాలు ఎన్ని ఉంటయ్యో ఎవరు అంచనా వెయ్యగలరు? అనంతమైన భావగణాలున్నప్పుడు వాటికి వ్యవస్థ ఏమిటి?
అక్షర గణాల్లో కాని, మాత్రా గణాల్లో కాని, ఒక్కో గణం పరిమితిని ఉచ్ఛారణతో కొలవవచ్చు. ఒక్కో భావగణ పరిమితిని భావంతో కొలవగలమా? భావాలు వ్యక్తమయ్యేది భాషలో వాక్య వాక్యాంశాల ద్వారా కాబట్టి వాటి ద్వారానే కొలవాల్సి ఉంటుంది. సంపత్కుమార (1967) ఇచ్చిన ఉదాహరణలను బట్టి చూస్తే వ్యాకరణ రూపైకత (grammatical similarity in form) ఉన్న వాక్యాంశాలను ఒక గణంగా భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. కీ. శే బాలగంగాధర తిలక్ కవిత లోనుంచి ఈ భాగాన్ని సంపత్కుమార ఉదహరించారు.
ప్రతిమాటకీ | శక్తి ఉంది | పదును ఉంది
ప్రతిమాటకీ | అర్థం ఉంది | ఔచిత్యం ఉంది.
ఇక్కడ కి-విభక్తి బంధం ఒక గణం. తరువాత వచ్చిన నామం, క్రియ కలిపి ఒక గణం. శక్తి, పదును, అర్థం, ఔచిత్యం అనేవి ఒక రకపు (నామ) గణాలు గానూ, ఉంది అనేది ఒక (క్రియా) గణం గానూ ఎందుకు విభజించకూడదు? శక్తి ఉంది అనేది ఒక భావమా?రెండు భావాలా? ప్రతిమాటకీ శక్తి అనేది ఒక గణం ఎందుకు కాగూడదు? భావగణాలను వేరు చేసే నిర్దిష్టమైన సూత్రాలేమిటి? Objective criteria ఏమైనా ఉన్నయ్యా? కేవలం arbitraryగా చేసే విభాగమేనా? ఈ ప్రశ్నల్లో వేటికీ సమాధానాలు దొరకవు. అందుకే సంపత్కుమార (1967) ఇక్కడ అర్థాన్ని బట్టి గణ విభజన ఆభాసరూపకంగా చెయ్యవచ్చునన్నారు. వారి భావగణాలు అభాసాలే గాని, నిర్దిష్టమైనవి కావని వారే అంగీకరిస్తున్నారు. ఈ ఆభాస గణాలు వచన పద్యాన్ని నిరూపించలేవు కాబట్టి వాటిని నిరాకరించవల్సి వస్తున్నది. అసలు విషయమేమిటంటే భావాలని గణాలుగా విభజించటం సాధ్యం కాదనీ, వీరు విభజించింది వ్యాకరణ రూపైకత ఉన్న పద సమూహాలు కాబట్టి, వీటిని న్యాయంగా వ్యాకరణ గణాలు అని అనాల్సి ఉంటుందనీ తేలుతున్నది. వ్యాకరణ గణాలు వాక్య శబ్ద నిర్మాణానికి సంబంధించినవి. వాటి ఆవృత్తి ఒకే శబ్దంతో అయితే పునరుక్తి, భిన్నశబ్దాలయితే అనుప్రాస అవుతుంది. సంపత్కుమార భావగణాలంటున్న వ్యాకరణ గణాలు పద్య బాహ్య స్వరూపానికి అవసరమైన గణాలు కావనీ, వాక్య నిర్మాణానికి అవసరమైన కూర్పు అనీ తేలుతున్నది. పద్య నిర్మాణం వేరు, వాక్య నిర్మాణం వేరు. వేటి సూత్రాలు వాటికే ఉన్నై. భావగణాలే లేనప్పుడు వాటి మీద ఆధారపడి ఉండే భావలయ కూడా ఉండదని చెప్పక తప్పదు.
ఇవికాక సంపత్కుమార 1962లో పది లక్షణాలు, 1965లో ఆరు లక్షణాలు ప్రతిపాదించారు. ఇక వాటిని పరామర్శిస్తాను. 1962లో లక్షణాల్ని సంక్షిప్తం చేస్తే వచ్చినవే 1965లో ప్రతిపాదితమైన లక్షణాలు. అందువల్ల 1965లో లక్షణాల్నే ఇక్కడ ఇస్తాను.
1. భావాన్ని, భావాంశాన్ని బట్టి పాదాలను విభజించటం.
2. క్రియా పదాలతో ప్రారంభించటం, పూర్తి చేయటం.
3. క్రియారహితంగా భావాన్ని వాక్యంగా రూపించటం.
4. అనియతంగా యతిప్రాసల్ని, అంత్యప్రాసల్ని ఉపయోగించటం.
5. ఒక్కొక్క పాదాన్ని తత్పూర్వ పాదంకన్నా పొడిగిస్తూ తగ్గిస్తూ భావోద్దీప్తిని కలిగించడం.
6. భావాన్ని లయబద్ధంగా స్ఫురించేట్టు పాదాలలో పదాలకూర్పు ద్వారా ఇమడ్చటం.
వీటిని ఈ క్రమంలో కాకుండా నాకు వీలైన క్రమంలో పరిశీలిస్తాను. వీటిల్లో 2, 3, 4 లక్షణాలను ఆభాసంగానైనా లక్షణాలుగా అంగీకరించలేం. క్రియాపదాలతో ప్రారంభించటం, పూర్తి చేయటం పద్య లక్షణమెలా అవుతుంది? మాటవరసకు అవుతుందనుకుందాం. క్రియాపదం మధ్యలో ఉండదా? క్రియాపదం అంటే సమాపకమా? అసమాపకమా?
గోవేగదా అని దండం పెట్టబోతే
ఉన్నట్లే ఉండి ఎగిరి మీదపడుతుంది
– సంపత్కుమార నేల విడిచిన సాము (చేతనావర్తం, పే. 2)
వాడెప్పుడు తెర దించుతాడో తెలవదు
ఏ ఘట్టంలో మరి ఈ నాటకం ముగుస్తుందో
అనుక్షణం అయిపోయిందనే అనిపిస్తుంది
అయితే ఇది మొదలంటాడు వాడు.
– సంపత్కుమార ఆత్మాశ్రయం (చేతనావర్తం పే. 13)
క్రియాపదం సమాపకమైనా, అసమాపకమైనా పై ఖండికల్లో పాదం మధ్యలో వచ్చినట్లు స్పష్టమే కదా. అంటే, క్రియా పదం పాదాది మధ్యంతాల్లో ఎక్కడైనా రావచ్చునన్నమాట. ఈ మూడు చోట్లా కాకుండా ఇంకెక్కడొస్తుంది?
క్రియారహితంగా భావాల్ని వాక్యంగా రూపించడం మూడో లక్షణం. దీనికి మాదిరాజు రంగారావు కవిత నుంచి ఉదాహరణలు చూపించారు. వాక్యప్రయోగ విశేషం పద్య లక్షణంగా చెప్పటం విచిత్రం. క్రియ అవసరమైన చోట లేకుండా చెప్పటం వాక్యదోషం అవుతుంది. అయితే కవులకు ఈ లైసెన్సు ఉంది. ఒకానొక కవి శైలీవిశేషాన్ని పద్య లక్షణంగా చెప్పటం కుదరదు. మాదిరాజు రంగారావు వచన పద్యాల్లో గ్రాంథిక భాష ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని కూడా వచన పద్యం లక్షణంగా అంగీకరిస్తామా?
యతిప్రాసల్నీ, అంత్యప్రాసల్నీ అనియతంగా ప్రయోగించటం నాలుగో లక్షణం. అనియతత్వం ఒక లక్షణం ఎట్లా అవుతుంది? అనుప్రాస అలంకారం. తెలుగులో అక్షరసామ్యయుక్తమైన యతిప్రాసలు అలంకార సన్నిభాలే. అయితే, ప్రాచీన కవులు వీటిని నియమాలుగా పాటించారు. మాత్రా పద్యాల్లో వీటిని చాలామంది అనియతంగానే పాటించారు. కాని, వాటిని మాత్రా పద్య లక్షణాలుగా ఎవరూ చెప్పినట్టు లేదు.
పై లక్షణాల్లో 1, 5, 6 లక్షణాలు ఆభాసంగానైనా లక్షణాలుగా కనిపిస్తున్నై. ఆరో లక్షణానికి సమానమైంది సంపత్కుమార (1962) లో ఇలా ఉంది:
10. గణవిభజనాదులకు భిన్నముగా రచనాశక్తి నాధారముగా చేసి లయను సమాకర్షించుట.
సంపత్కుమార (1962) నీ, (1965) నీ కలిపి చూస్తే ఆయన ఇక్కడ భావలయనే ఉద్దేశించినట్టు కనిపిస్తుంది. భావలయను ఇంతకు ముందే విపులంగా చర్చించి నిరాకరించాను.
1, 5 లక్షణాలు పాద విభజనకు సంబంధించినవి. పద్యానికీ, గద్యానికీ పాదవిభజన ప్రధాన బేధం అని ప్రాచీనులు చెప్పారు.
పాదకల్పనంబు వలవదు గద్యమునకు
పాదనియతినొప్పుఁ బద్యంబులు
అని అనంతుడు ఛందోదర్పణంలో అన్నాడు. సంపత్కుమార (1962, 1965, 1967, 1968, 1970) పాదబద్ధతను గూర్చి చాలా చోట్ల ఉద్ఘాటించారు. వచన పద్యాన్ని ఛందో విభాగంలో చేర్చటానికి ఆయన ప్రధానంగా దీనిమీదే ఆధారపడినట్లు కనిపిస్తున్నది. ఉదాహరణకు ఈ వాక్యాలు చూడండి.
ఛందో విభాగానికి చెందిన ప్రతిదీ పాదబద్ధమై లేదా పాద విభాగంతో ఉంటుంది. పాదబద్ధత ఛందస్సు యొక్క మొట్టమొదటి లక్షణం. పాదాలు అన్నీ సమాన రూపంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అయినా అదీ పద్యమే.
– సంపత్కుమార (1968)
వచనం నుంచి పద్యాన్నీ భేదింపజేసేది దాని పాదబద్ధత. పద్యానికి సంబంధించి ఇతర విషయాలనేకం ఎట్లా ఉన్నా అది పద్యం కావటానికి పాదబద్ధత ప్రధాన లక్షణం. పాదబద్ధంగా ఉండాలన్నదే ప్రధానం తప్ప పాదసమత్వం గానీ, పాద సంఖ్యా నియమం గానీ కావు… అందువల్ల ప్రధానమయిన పాదబద్ధతను స్వీకరించి, మిగిలిన అంశాలను ఐచ్ఛికం చెయ్యటం, ఒక దశలో నిరాకరించటం, వచన పద్యంలో ప్రధానంగా గమనించవలసి ఉంటుంది.
– సంపత్కుమార (1970)
వీటిని బట్టి ఇంతకుముందు చర్చించిన లక్షణాలు ఐచ్ఛికాలనీ, ఒక్కోసారి వాటిని నిరాకరించవచ్చనీ, పాదబద్ధత మాత్రం నిరాకరింపరాని లక్షణమనీ సంపత్కుమార అభిప్రాయంగా మనం గ్రహించవచ్చు. పాదబద్ధత స్థాపితమైతే వచనపద్యం సలక్షణమైన పద్యరూపంగా అంగీకరించవచ్చని తాత్పర్యం. పాదబద్ధత అన్ని పద్యాలకూ లక్షణమవుతుంది గదా: మరి వచన పద్యాన్ని మిగతా పద్యాలనుంచి పృథక్కరించటమెట్లా అనే ప్రశ్నకు అనియత గురు లఘ్వక్షర ప్రయోగాన్ని వేరు చేసే గుణంగా సరిపెట్టుకోవచ్చు. అంటే పాదబద్ధత ఏకైక, అనైచ్ఛిక లక్షణమన్నమాట.
ఈ పాదబద్ధతకి లొంగనివి కూడా ఆధునిక కవిత్వంలో కొన్ని ఉన్నై. కీ. శే. బాలగంగాధర తిలక్ రాసిన ఆర్తగీతం, రాత్రి వేళ అనే ఖండికల్లో ఈ పాదబద్ధతను పాటించినట్లు కనిపించదు.
నిర్జనస్థలం, ఎవ్వరూ లేరు, చుట్టూ పరచుకున్న మైదానపు
నగ్నదేహాన్ని స్పృశించబోయే నీచుల శాఖాగ్రపు వ్యగ్రపు
తొందర నిశ్శబ్దం మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తోంది. ఆకాశం
మీద ఒక చుక్క మరో నక్షత్రంతో మాట్లాడే మాట మనసుకి
వినిపిస్తోంది.
– తిలక్ ‘రాత్రి వేళ’
ఇందులో పాదవిభజనకు ఆధారాలేమిటో నాకర్థం కావడం లేదు. ముఖ్యంగా మూడో పాదం ఆకాశంతో అంతం కావటానికి హేతువు ఎవరయినా చెప్తే సంతోషిస్తాను.
పాపికొండలకావల నిజాం గజాంకుశం కాలేదూ నీవు?
కోనసీమలో, లంకసీమలో పాపాల దీపాల నార్పలేదూ
నీవు? విచ్చుకత్తుల బోను రెక్కలు త్రుంచలేదూ
రాత్రిని కప్పుకొని, ధాత్రిని మప్పుకొని చరించలేదూ నీవు?
– కె. వి. రమణారెడ్డి బాధాగాధము.
పైదాంట్లో రమణారెడ్డి అచ్చులో కూడా పాదబద్ధత పాటించలేదు. అయితే దీన్ని “వచన పద్యములను కూడా అతిక్రమించి ఆవేశస్ఫోరకంగా అంతర్లయాన్వితంగా సాగిన ఈ కావ్యం కావ్యోపన్యాసం అనదగింది” అంటున్నారు రమణారెడ్డి. నరసింహారెడ్డి (1968) దీన్ని తానంటున్న వచన కవితగానే పరిగణించారు.
నగ్నముని రాసిన మొహమ్మీది చంద్రుడు అనే ఖండిక (దిగంబర కవులు – 2) లో పాదబద్ధత అసలు పాటించలేదు. స్వరూపాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి మేం రాస్తున్నది వచన కవిత అని మేం అనదల్చుకోలేదు అని దిగంబర కవులు అన్నా వచన పద్య కవులు, సిద్ధాంతకర్తలు వాళ్ళని వదలలేదు. వాళ్ళు ఒప్పుకోకున్నా దిగంబర కవుల స్వరూపం ఫ్రీవర్సుదే నంటున్నారు వరవరరావు (1967).
దిగంబర కవుల్ని వదిలేద్దాం. రమణారెడ్డి బాధాగాధాన్నీ కావ్యోపన్యాసమనే అందాం. వచన పద్య కవులందరూ ఒప్పుకునే తిలక్ మాటేమిటి? వీటిని అపవాదాలుగా పరిగణించి పాద బద్ధతను గురించిన మిగతా అంశాలు పరిశీలిద్దాం. పాదబద్ధత పద్యానికీ, గద్యానికీ ప్రధానమైన భేదమనీ, పాదసంఖ్యా నియమం అంత ప్రధానం కాదనీ, పాదాలు సమపాదాలే కానక్కర్లేదనీ, విషమ పాదాలు కూడా అంగీకార్యాలేననీ సంపత్కుమారతోపాటూ నేను కూడా అంగీకరిస్తాను.
(ఆంధ్ర పత్రిక, ఉగాది సంచిక. 1972.)
వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి.
(ఈ వ్యాస పరంపరలో రెండవ వ్యాసం కోవెల సంపత్కుమార రాసిన వచన పద్యం: లక్షణ నిరూపణం.)