1. వచన పద్యం: ఆభాస లక్షణ నిరాకరణం

ఇక రెండో వర్గ లక్షణాలు. మొదటి వర్గాన్ని కుందుర్తి ఆంజనేయులు గానీ, ఇతర అనుయూయులు గానీ పరిభాషగా ఉద్దేశించారని చెప్పలేం. సీరియస్‌గా చర్చించదగిన విలువ నిజానికీ ప్రతిపాదనలకు లేదు. కాని, రెండో వర్గంలో లయ, అంతర్లయ, అంతర్నాదం, భావగణాలు అనే వాటిని పరిభాషగా ఉద్దేశించినట్టు కనిపిస్తున్నది. కొద్ది భేదాలతో ఇవన్నీ సమానార్థకాలుగా కనిపిస్తున్నై. కానీ అంతర్లయ, అంతర్నాదం వేరు వేరని మాదిరాజు రంగారావు (1969) ఉద్దేశించినట్లు కింది వాక్యాలవల్ల తెలుస్తుంది.

అనుభూతి ప్రమాణంలో, ఆవేశపు పొంగులో మనోగతిని బట్టి, శబ్ద సంయోజనమూ, వాక్యరీతి, భావవిన్యాసమూ రూపొందిన రచనలివి. ఇందులో ఏ ఛందస్సూ ఉద్దేశించలేదు. అంతర్లయ కన్నా అంతర్నాదం అనుభవానికి వచ్చే స్వేచ్ఛా కవితగా భావిస్తాను

– రంగారావు (1969) యుగసంకేతం పీఠికలో.

అంతర్నాదమంటే ఏమిటో రంగారావు చెప్పలేదు. అంతర్లయ అంటే ఏమిటో ఇతరులు చెప్పలేరు. ఇక రెంటికీ తేడా తెలుసుకొనే మార్గమేమిటి?

లయ, అంతర్లయ, భావలయ అనే మాటల్ని దాదాపు ఒకే అర్థంలో రచయితలు వాడుతున్నట్టు కనిపిస్తున్నది. సి. నారాయణరెడ్డి ఇట్లా అంటున్నారు:

వచన గేయమునకు లయ ముఖ్యము. ఈ లయ గణములను కూర్చుటలోనే ఉత్పన్నము కాదు. ఒకానొక ఊపులో, విసురులో పదములను గుప్పించుట వలన ఈ లయ ఏర్పడును. ఏ నియమమును లేకుండ శుద్ధవచనమును లయాత్మకముగ మార్చినచో అది వచన గేయమగును.

… పాఠకునిలో భావోద్వేగమును కలిగించు అంతర్లయ దీని ప్రధాన లక్షణము. దీనిలో కేవలము అనుప్రాసాదుల వలన సంక్రమించు శబ్దలయ అనుషంగికమైనది. దీనికి అతీతమైన భావలయ ముఖ్యమైనది. భావలయ అనగా పూసలలో దారమువలె నుండు అంతర్లయ.

– సి. నారాయణరెడ్డి, సిద్ధాంత గ్రంథం (1967)

నారాయణరెడ్డి గారి ప్రకారం వచన పద్యానికి లయ ముఖ్య లక్షణం. ఈ లయ ఒకానొక (?) ఊపులో, విసురులో పదాల్ని గుప్పించటం వల్ల వస్తుంది. ఒకానొక అంటే ఎలాంటి? మళ్ళీ మొదటికే వచ్చాం. ఆ ఊపు, విసురు అర్థం అయితేకాని ఈ లయ అర్థం కాదు. అదే పుస్తకంలో ఇంకోచోట భావలయ ముఖ్యమంటున్నారు. భావలయ అంటే ఏమిటి? “పూసల్లో దారంలాగా ఉండే అంతర్లయ.” అది తెలిస్తే గదా ఇది తెలియటానికి. మార్జాలమంటే బిడాలం!

పై వాక్యాల్లో నారాయణరెడ్డి కొత్తగా చెప్పిందేమీ లేదు. కుందుర్తి ఆంజనేయులు, అరిపిరాల విశ్వం మొదలైనవాళ్ళు చెప్పిందాన్నే వేరే మాటల్లో చేశారు. వాళ్ళ ప్రతిపాదనలెంత అస్పష్టంగా ఉన్నాయో ఇదీ అంతే.

ఈ భావలయను అరిపిరాల విశ్వం ప్రతిపాదించినట్టు కుందుర్తి ఆంజనేయులు ఆమోదపూర్వకంగా రాసిన ఈ వాక్యాలవల్ల తెలుస్తున్నది.

ఆ మార్గం (వచన కవితా మార్గం) పూర్తిగా వృద్ధి పొందటానికి మిత్రులు డా. అరిపిరాల విశ్వంగారు స్థాపించిన భావలయ సిద్ధాంతము, కోవెల సంపత్కుమార ప్రతిపాదించిన భావగణ సిద్ధాంతము బాగా ఉపయోగపడే సాధనాలు.

– ఆంజనేయులు (1967 ఎ.)

విశ్వం, కృష్ణాపత్రిక 1941 జనవరి 7, 14 సంచికల్లో ‘ప్రాచీనాలంకారుల ధ్వనికి, ఆధునిక వచన కవిత్వంలోని భావలయకూ గల సాదృశ వైషమ్యాలు’ అనే పేరుతో పెద్ద వ్యాసం ప్రచురించారు. ఈ వ్యాసంలో ఒక్కో కవి పద్యాలను ఉదాహరించి ఇందులో భావలయ ఉంది చూడమంటారే గాని అదేమిటో చెప్పలేదు. దాదాపు వచన కవిత్వానికి లక్షణాలు ప్రతిపాదించిన వాళ్ళందరూ ఇదే పని చేశారు. (ఒక్క సంపత్కుమార ఇందుకపవాదం.) లయను గురించి కుందుర్తి ఆంజనేయులు ఇలా అంటున్నారు.

శబ్దానికిగాని, భావానికిగాని ఆనాటి వచనాలలోని లయ వచనపు లయ. వచన గేయంలోని లయ కవిత్వపు లయ. ఈ రెంటి మధ్య గల సరిహద్దు కేవలం బుద్ధికి మాత్రమే తోచే స్వభావం కలిగి చాలా సున్నితంగా ఉంటుంది. వచన గేయమైనా విశృంఖల విహారం చెయ్యరాదనీ, దాని నడకలోనూ ఒక (!) లయ పంక్తిలో ఒక నిర్మాణ పద్ధతి ఉండాలని సారాంశం.

– కుందుర్తి ఆంజనేయులు (1967 బి.)

ఒక లయ అంటే ఎట్లాంటి లయో తెలీదు. పైగా అది కవిత్వపు లయ అట! అదెట్లా ఉంటుందో ఎవ్వరూ స్పష్టంగా చెప్పరు. దాన్ని విడదీసి చూడటం కష్టమని ఆంజనేయులు గారి అభిప్రాయంలాగా కనపడుతున్నది.

వచన పద్యంలో శబ్దలయను వీరెవరూ అంత ప్రధానంగా పరిగణిస్తున్నట్టు లేదు. (శబ్దలయ అనేటప్పటికి మళ్ళీ మాత్రా ఛందస్సు అవుతుందేమోనని వీరి భయం కావచ్చు!). శ్రీరంగం శ్రీనివాసరావు రాసిన ‘కవితా ఓ కవితా’ ఖండికను కొందరు వచన పద్యంగా గుర్తించకపోవటానికి ఇదే కారణమనుకుంటాను. శబ్దాని కతీతమైన అంతర్లయ గాని, భావలయ గాని, వచన పద్యానికి ముఖ్యమని వీరి అభిప్రాయం. అది ఇంగ్లీషులో వాడుతున్న Rhythm of thought అనే పదానికి తెలుగులో సమానార్థకంగా కనిపిస్తున్నది.

పద్యంలో అర్థవంతమైన శబ్దాల కూర్పు (Morphological Arrangement), ధ్వనుల కూర్పు (Phonological Arrangement) ఉంటై. ధ్వనుల కూర్పు అక్షరపరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ అక్షరాలనే గురు లఘువులని ఛందశ్శాస్త్ర కర్తలు విభజించారు. గురులఘుక్రమం నిర్ణీతమైన అక్షరగణఛందస్సు అవుతుంది. అట్లా కాక గురు లఘు సమూహాల పరిమాణాన్నే తీసుకొని త్రస్య (త్రిశ్ర) చతురస్రాది భేదాలుగా విభజించి ప్రయోగిస్తే మాత్రాగణఛందస్సు అవుతుంది. మాత్రాగణఛందస్సు లయ ప్రధానమైనది. నియతమైన మాత్రాపరిమాణం గల గురు లఘు సమూహాల (మాత్రా గణాల) క్రమావృత్తిని ఛందస్సులో లయగా నిర్వచించవచ్చు. అయితే వీటిల్లో పదప్రయోగం కూడా సహకరిస్తేనే లయ సాధ్యమవుతుంది. ఇక్కడ అర్థవంతమైన శబ్దాల పాత్ర ఉంటుంది. దీన్నే Morphological Arrangement అంటున్నాను. ప్రయోగించిన పదాలు మాత్రా గణాంతంలో విరిచి చదివినా అర్థబోధకు ఆటంకం కలక్కపోతే పదప్రయోగం లయానుకూలమవుతుంది. పూర్వపదాంతాక్షరంతో మాత్రాగణాన్ని ప్రారంభించినట్టయితే లయ భంగమవుతుంది. పదంత విరామము (Word Juncture), గణాంత విరామమూ కలసి వస్తే లయ స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కోసారి పదాంత విరామం బదులు పదాంశాంత విరామం (Morpheme Juncture) గణాంత విరామంతో కలిసినా లయ కనిపిస్తుంది. ఈ రెండూ సాధ్యం కానపుడు ఊనిక (Stress) ఉన్న అక్షరంతో గణం ప్రారంభమయినప్పుడు అక్షరం పదమధ్యమైనా లయానుకూలమే. తెలుగులో ఒక పదంలో రెండో అక్షరం గురువు కాకపోతే మొదటి అక్షరం మీద ఊనిక ఉంటుంది. రెండో అక్షరం గురువైనా, మొదటి అక్షరం కూడా గురువే అయితే మొదటి అక్షరం మీదనే ఊనిక ఉంటుంది. మొదటి లఘువు తరువాత గురువుంటే ఆ గురువు మీద ఊనిక ఉంటుంది. మూడక్షరాల పదాలను ప్రమాణంగా తీసుకుంటే ఊనిక ప్రవర్తనను ఈ విధంగా చూపించవచ్చు.(ముద్ద అచ్చు ఊనికను సూచిస్తుంది.)

U l l
U l U
U U l
l l l
l l U
l U l
l U U

రెండక్షరాలకూ ఇదే పద్ధతి వర్తిస్తుంది. నాలుగక్షరాలక్కూడా ఇది వర్తిస్తుంది గాని అక్కడ పదాంశ విభాగమూ (Morpheme Division), పదాంశ గణమూ (Morpheme Class) ఊనిక ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. తెలుగులో ఊనిక ప్రవర్తన మీద పరిశోధన అంతగా జరగలేదు కనుక ఇంతకన్నా ఊనిక మీద ఎక్కువ చెప్పటం ప్రస్తుతం సాధ్యం కాదు. పై వాటిల్లో మొదటి అక్షరం మీద ఊనిక ఉన్నవాటిని అనులోమ గణాలనీ, రెండో అక్షరం మీద ఊనిక ఉన్నవాటిని విలోమగణాలనీ అనవచ్చు.

ఈ ఊనిక సహాయంతో పద మధ్యాక్షరంతో గణం ప్రారంభమైనా అక్షరం ఊనిక ఉన్నదయితే లయ సరిపోతుంది. ఉదాహరణకు:

చక్ర | వర్తి అ | శోకు | డెక్కడ

అన్న పాదంలో చక్ర తో పదం అయిపోలేదు. కాని చక్ర అర్థవంతమైన రూపం. అందువల్ల చక్ర తరువాత పదాంశాంత విరామం (Morpheme Juncture) ఉంది. ఇక్కడికి ఒక మూడు మాత్రల గణం అశోకుడెక్కడ అన్నప్పుడు శో మీద ఊనిక ఉంది. అందుకు కారణం దీని పూర్వాక్షరం పదాది లఘువు. ఊనికతో ఉన్న అక్షరంతో గణం ప్రారంభమయింది. వర్తి – అవిభాజ్యమైన రెండు గణాల మధ్య ఉండటంవల్ల ఇది గణం కాగలిగింది. డెక్కడ అన్నప్పుడు పదవిభాగం చేస్తే అజాది పదం వస్తుంది. ఊనిక ఎప్పుడూ అచ్చుమీదే ఉంటుంది. అందువల్ల అర్థస్ఫురణకు భంగం ఉండదు.

అక్షర నిర్ణయంలో స్వరమే ప్రధానమని సీతాపతి (1921) ఇలా అంటున్నారు.

ఈ సందర్భమున మాత్రా పరిమాణము అచ్చును గూర్చి చెప్పవలెను. వ్యంజనము గూర్చి చెప్పకూడదు. అచ్చులబట్టి అక్షరములేర్పడును గాని వ్యంజనములబట్టి ఏర్పడవు. ‘భ్రన్’ లో ఎన్ని వ్యంజనములున్నా అచ్చు ఒక్కటే గనుక అది ఒక్క అక్షరమనే చెప్పవలెను.

ఇక్కడ కీ. శే. గిడుగు సీతాపతి ఉద్దేశించింది – ప్రధానంగా అక్షర నిర్ణయాన్ని గురించి. అక్షర సంఖ్యా నిర్ణయం అచ్చుల ఆధారంగానే చెయ్యాలనే నిర్ణయం భాషాశాస్త్ర సమ్మతమైంది. మాత్రా పరిమాణంలో వ్యంజనానికి అసలు ప్రమేయం లేదని సీతాపతిగారి అభిప్రాయంగా నేననుకోను. అచ్చు అక్షరానికి శిఖరప్రాయమైనది (Syllable Peak) కాబట్టి అక్షర బేధాన్ని బట్టి గురు లఘు భేదాలేర్పడతై గాబట్టి మాత్రా పరిగణన ప్రధానంగా అచ్చులమీద ఆధారపడి ఉంటుంది అనేది సీతాపతిగారి అభిప్రాయం. అయితే ఇంత స్పష్టంగా చెప్పక పోవటంవల్ల ఇది పాటిబండ్ల మాధవశర్మగారి (1966) విమర్శకు గురి అయింది.

లయస్ఫురణకు, పద, పదాంశ విరామాలు, పదంలో ఊనిక ప్రధానపాత్ర వహిస్తున్నయ్యని పైన నిర్ణయించబడింది. ఇంకా పరిశోధిస్తే కేవలం ఊనికనే లయకు కారణంగా నిరూపించవచ్చు ననుకుంటాను. అయితే ఈ ఊనిక ప్రవర్తన పద, పదాంశ విభాగం మీద ఆధారపడి ఉంటుంది. పద, పదాంశ విభాగ విరామాల పరిజ్ఞానం ఛందశ్శాస్త్రానికి ఎట్లాగూ తప్పవనుకుంటాను.

మాత్రా పద్యాల్లో సాధారణంగా లయ నియతంగా ఉంటుంది. లయభంగమైన ఘట్టాలు లేవని కాదు. ఖండగతి (5+5) పద్యాల్లో ఒక్కోసారి మిశ్రగతి (3+4+3) కనిపిస్తుంది. మాత్రా పద్యాల్లో ఎక్కువగా మాత్రాగణాల ఎన్నికతోనే లయ నిర్ణీతమవుతుంది. అక్షరగణచ్ఛందస్సుల్లో లయ గణాల ఎన్నికను బట్టి నిర్ణీతం కాదు; పదాల ఎన్నికను బట్టి నిర్ణీతమవుతుంది. అక్షరగణచ్ఛందస్సుల్లో గురు లఘు ప్రయోగంలో కవికి స్వేచ్ఛే లేదు. లయను ఎన్నుకోవటంలో మాత్రం స్వేచ్ఛ ఉంది. లయ లేకుండా (అంటే లయస్ఫురణ లేకుండా) శుద్ధవచనంగా రాసిన పద్యాలున్నై. మాత్రా పద్యాల్లో సరిగ్గా నియమాన్ని పాటిస్తే లయ విషయంలో స్వేచ్ఛ లేదు. (కనీసం తక్కువ.) గురు లఘు ప్రయోగంలో మాత్రం చాలా స్వేచ్ఛ (స్వేచ్ఛ అనేకంటే choice అనటం సబబు) ఉంది. సాధారణంగా లయస్ఫూర్తి లేని మాత్రా పద్యముండదు. కానీ లయ లేని వృత్తం ఉండవచ్చు.

దీన్నిబట్టి లయ ప్రధానంగా అక్షరగుణం (Syllabic Quality) అనీ, నియతపరిమాణం (Quantity) గల గణాలుగా ప్రయోగించటం వలన లయ సిద్ధిస్తుందనీ, దీనికి గణాంతాల దగ్గర విరిచి చదివినా అర్థభంగం కాని విధంగా పదాల కూర్పు ఉండాలనీ తేలుతున్నది. ఒక నియతపరిమాణం గల గణాలు క్రమావృత్తమైనప్పుడే లయ ఉంటుంది. ఈ లక్షణం వచన పద్యంలో ఉంటే, అదే మాత్రా పద్యమవుతుంది. మాత్రా పద్యంలో ఒకే రకపు లయ సాధారణంగా పద్యమంతా ఉంటుంది. వచన పద్యంలో అవసరాన్ని బట్టి భిన్నలయలు ఉండవచ్చునంటే, అది గతులు మార్చిన మాత్రా పద్యమవుతుంది గాని వచన పద్యం కాదు. అంటే పైన వివరించిన పద్ధతుల్లో, లయ ఉన్న పద్యం మాత్రా పద్యమో, తద్వికారమో అవుతుంది తప్ప వచన పద్యం కాదన్నమాట. వచన పద్యంలో స్పష్టమైన అక్షర సంబంధమైన లయ ఉండదని సారాంశం. బహుశా ఇది గుర్తించే కాబోలు విశ్వం (1961) భావలయనూ, సంపత్కుమార (1967) భావగణాలనూ ప్రతిపాదించారు. వేరుగా కనిపిస్తున్నా ఈ రెండూ ఒకటే. శబ్ద రూపంలో అక్షరసమూహాల పరిమాణాన్ని బట్టి మాత్రాగణాలుంటై. తద్వారా సాధించిన లయ శబ్దలయ అవుతుంది. దీన్నే అక్షరలయ అని కూడా అనవచ్చు. అది చెవికి వినిపించేది. అర్థంతో నిమిత్తం లేకుండా శ్రోత గుర్తించేది. అట్లా కాకుండా భావగణాల ద్వారా సాధించేది భావలయ. భావగణాలుంటే భావలయ ఉంటుంది. భావగణాలు లేవని నిరూపిస్తే భావలయ సిద్ధాంతం కూడా నిరాసమవుతుంది.