పరిశోషణం

అనుకోకుండా ఏదో ఒకరోజు
అంతా ఖాళీ అవుతుంది.
అంచులదాకా నిండి
అతిశయంతో తొణికిసలాడే
ఈ యవ్వన కలశం తెలియకుండానే
నిశ్శబ్దంగా నిండుకుంటుంది.

ఏదో ఒక రోజు
ఒద్దికగా చెక్కిన పువ్వులతో
వయ్యారపు లతల సౌష్ఠవంతో
మెరిసే ఈ సౌందర్య కలశం
వన్నె తగ్గి తెల్లబోతుంది.

అలనాటి ఛాయాచిత్రంలా
జ్ఞాపకాలలో మాత్రం
స్థిరంగా నిలిచిపోతుంది


రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...