కన్నులనొదిలే కన్నీళ్ళవ్వక
కంట్లో కరగని నలుసువిగా
వేకువనొదిలే చీకటివవ్వక
మెలకువలోనూ ఒక కలగా
తీరం వొదిలే కెరటం అవ్వక
దాహం తీర్చని సంద్రానివిగా
చిరుజల్లొదిలే మేఘం అవ్వక
నీటికి ఆరని అగ్నిజ్వాలగా
తాపాన్నొదిలే తుషారమవ్వక
శిశిరం వీడని మండేఎండగా
ఇంకా ఎందుకు మిగిలావు.. ?
కలల సౌధాన్ని కూల్చేసి
ఓ శిధిలమైనా కానివ్వక
గత స్మృతులను చెరిపేసి
ఓ జ్ఞాపకమైనా కానివ్వక
నీలో నన్ను తరిమేసి
నన్ను నాలో మిగలనివ్వక
ఇంకా ఎందుకు మిగిలావు… ?