కృష్ణదేవరాయలు

[విజయనగర సామ్రాజ్య చరిత్రలో స్వర్ణయుగంగా భావింపబడే శ్రీ కృష్ణదేవరాయల పాలన గురించి తెలుగులో ప్రామాణిక గ్రంథాలు లేని కొరతను మొదటగా తీర్చినది డా. నేలటూరు వెంకటరమణయ్య రచించిన కృష్ణదేవరాయలు (1972). ఈ పుస్తకం పూర్తిపాఠం ప్రస్తుతం ఈమాట గ్రంథాలయంలో ఉన్నది. ఆ గ్రంథకర్త తన రచనకు పరిగణించిన చారిత్రక ఆధారాలను వివరిస్తూ వ్రాసిన మొదటి ప్రకరణం ఇక్కడ సంక్షిప్తంగా పాఠకులకు ఒక పరిచయ వ్యాసంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రచురిస్తున్నాం. – సం.]


ప్రకరణము 1. ఆధారములు

దక్షిణ దేశమును పూర్వకాలమున పాలించిన హిందూ చక్రవర్తులలో గర్ణాట సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ప్రఖ్యాతుడు. ఆ మహారాజు కీర్తిమూర్తి దాక్షిణాత్య హిందూ హృదయముల స్థిరముగ నెలకొని యున్నను, ఆయన చరిత్ర విద్యావంతులకు గూడ సుపరిచితము గాదు. ఉత్తరాపథమునకు విక్రమాదిత్య భోజనరపాలు రెట్లు వంద్యులో గృష్ణరాయ లట్లే సర్వ దక్షిణ భారత భూమికి పూజనీయుడు. ఆంధ్ర వాఙ్మయము నతనెట్లు పోషించినదియు, సంస్కృత కర్ణాటాది భాషల నెట్లాదరించినదియు నంద రెఱుగుదురు. కాని యతని చరిత్రను గూర్చి జనసామాన్యమున కెఱుక పడిన విషయ మత్యల్పము. ఇటీవల చరిత్రపరిశోధకుల కృషివలన రాయలవారి చరిత్రకు సంబంధించిన విషయములు విదితములైనవి. లభ్యమైన చరిత్రాంశముల నెల్ల గ్రోడీకరించి శ్రీకృష్ణరాయల చరిత్రమును సాధ్యమైనంతవఱకు సంపూర్ణముగ రచియింప వలయునని నాయుద్దేశము.


కృష్ణదేవరాయలు
నేలటూరు వెంకటరమణయ్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ
1972, రూ.15.00

ఆద్యమున శ్రీకృష్ణరాయ చరిత్రమునకు గల సాధనసామాగ్రులను వర్ణించుట యుక్తము. ఇవి ఇరు దెఱగులవి. మొదట బెర్కొన దగినవి శాసనములు. తామ్రపట్టికలేమి, శిలాశాసనములేమి రాయలకాలమునాటివి దాదాపు 500 ఇప్పటి వఱకు లభ్యమైనవి. శాసనముల తరువాత బేర్కొనదగినది వాఙ్మయము. వాఙ్మయమనగా కేవల గద్యపద్యాత్మకమైన కావ్యమని ఎంచరాదు. రాయలనాడు విరచితమైన కావ్యములే కాక మహమ్మదీయ చరిత్రకారుల రచనలు, పోర్చుగీసు గ్రంథకర్తల వృత్తాంతములు, వంశాను చరితములు, చాటూక్తులు, గ్రామకవిలెలు, కైఫీయతులు మొదలగునవి యన్నియు నిట గ్రాహ్యములు. ముఖ్యమైన ఆధార గ్రంథములను సంగ్రహముగ నిచట వర్ణించుచున్నాను.

కావ్యములు: భాషననుసరించి ఇవి రెండు తరగతులవి. (1) సంస్కృతకావ్యములలో బ్రధానమైనది రాజనాథ డిండిమ విరచిత అచ్యుతరాయాభ్యుదయము. ఇందు కృష్ణరాయల కళింగ దిగ్విజయ ప్రస్తావన గలదు. మఱియు భండారు లక్ష్మీనారాయణ కృత సంగీత సూర్యోదయ పీఠిక యందు కొన్ని వివరములు గలవు. (2) ఆంధ్రప్రబంధములు: ముఖ్యముగ మూడు: (i) యల్లసాని పెద్దనార్యకృత మనుచరిత్రము, పీఠిక, ఆశ్వాసాద్యంతములు. (ii) కృష్ణరాయవిరచితాముక్తమాల్యద. ఇందు అనేక వివరములతో బాటు కృష్ణరాయ విరచిత సంస్కృతాంధ్ర గ్రంథములును నిందు బేర్కొనబడియున్నవి. (iii) ముక్కు తిమ్మనగారి పారిజాతాపహరణము. ఇతర గ్రంథముల గానరాని రాయల యుమ్మత్తూరు దండయాత్ర ప్రస్తావన ఇందుగలదు.

అర్వాచీన గ్రంథములలో రెంటిని ఇచట జెప్పక తప్పదు. ఇందొకటి రాయవాచకమను వచనగ్రంథము. దీనిని వచనకావ్యమనుట తప్పు. కావ్యలక్షణములెవ్వియు నిందు గానరావు. యత్కృతమో తెలియదు. కానీ క్రీ.శ. 18వ శతాబ్దారంభమునకు ముందు రచియింపబడి యుండదని రుజువగుచున్నది. రాయవాచకమున భాగ్యనగరపు ప్రస్తావన గలదు. గోల్కొండ సుల్తానునకును, నక్బరు పాదుశాహునకును, కర్ణాట సామ్రాజ్యాధిపతి రెండవ వెంకటపతి రాయలకును సమకాలికుడగు ముకుంద బాహుబలేంద్రుని బేర్కొను రాయవాచకము కృష్ణరాయలనాడు రచియింపబడలేదని దృఢముగ జెప్పవచ్చును. రాయవాచకమంతటి విశ్వాసపాత్రమైన యాధార గ్రంథము కాదు. రెండవది కుమార ధూర్జటికృత కృష్ణరాయ విజయము. పద్యకావ్యము. కాని దీనినొక ప్రత్యేక స్వతంత్రచరిత్రాధార గ్రంథముగా దలచుటకు వలను పడదు. ఇది క్రీ. శ. 1630-42 ల మధ్య కర్ణాటక సామ్రాజ్యమును పాలించిన ముమ్మడి వెంకటపతిరాయల కాలమున రచింపబడెను. రాయవాచకమున కిది పద్యప్రతి. కుమార ధూర్జటి యుద్దేశము కృష్ణరాయల విజయములను వర్ణించుట యగుటవలన రాయవాచకమునందలి యన్యాంశములను నాతడు విడిచిపుచ్చెను.

మహమ్మదీయ చరిత్రలు: మనకు దెలిసినంతవరకు విజయనగర చరిత్రకు సంబంధించిన విషయములను దెలుపు మహమ్మదీయ చరిత్ర గ్రంథములు మూడు. ఇవి అర్వాచీనములు. మొదటిది, తారీఖీఫరిష్తా; క్రీ. శ. 18వ శతాబ్దారంభమున రచింపబడెను. రెండవది, బుర్హాన్-ఇ-మ అసీరు. ఈ రెండు గ్రంథముల యందు కృష్ణరాయ ప్రసక్తి లేదు. కాని, రాయల రాజ్యకాలమున దక్కనీమహమ్మదీయ రాజ్యములకును, విజయనగరసామ్రాజ్యమునకును గల పరస్పర సంబంధము వీనివలన గొంత తెలియవచ్చుచున్నది. మూడవది, తారీఖీ మహమ్మదు రచించిన కులీ-కుతుబ్-శాహు.

పోర్చుగీసు గ్రంథకర్తలు: పోర్చుగీసువారు వర్తకము కొఱకు క్రీ. శ. 1490వ సంవత్సర ప్రాంతమున హిందూదేశమునకు వచ్చిరి. వీరికి మహమ్మదీయులతో సహజవైరము గలదు. దీనికి గారణములు రెండు: మొదటిది మతద్వేషము, రెండవది, యీంతకంటే ప్రబలతరమైన వర్తక ప్రతిస్పర్థ. ఇందువలన వారు తమవలనే మహమ్మదీయులకు సహజశత్రువులైన విజయనగర చక్రవర్తులతో మైత్రిని గుదుర్చుకొనిరి. ఇందువలన పోర్చుగీసు రాయబారులు, వర్తకులు ప్రయాణికులు పెక్కండ్రు విజయనగరసామ్రాజ్యసంచారము జేసి కర్ణాట సామ్రాజ్య చరిత్ర గూర్చియు, మఱియు నందు తాము కన్న విన్న విషయములను గూర్చియు గ్రంథములు వ్రాసిరి. ఇందు ముఖ్యమైనవి నాలుగు: (1) కామెంటరీస్ ఆఫ్ ది గ్రేట్ ఆఫోంసో అల్బూకర్కు, (2) దురాతీ బర్బోసా రచించిన ఈస్ట్ ఆఫ్రికా అండ్ మలబార్, (3) క్రానికల్ ఆఫ్ డామింగో పయస్, (4) క్రానికల్ ఆఫ్ ఫెర్ణావన్ న్యూనిస్. పయస్, న్యూనిస్ గ్రంథములు రెండును కృష్ణరాయచరిత్రకు మూలాధారములనుట యతిశయోక్తి కాజాలదు.

వంశానుచరితములు: ఈ తరగతి గ్రంథములలో లింగణకృత కెళదినృపవిజయమొక్కటియే నిచట బేర్కొనదగినది. ఇది కన్నడ చంపూ కావ్యము.

గాథలు: కృష్ణరాయల రాజ్యాభిషేకమును గూర్చియు, మఱికొన్ని విశేషాంశములను గూర్చియు బెక్కు కథలాంధ్రదేశమున బ్రచారమునందున్నవి. ఇందలి సత్యాసత్యములను నిర్ణయింపగల సాధనములు గానరావు. అయిననూ, జ్ఙాతచరిత్రాంశములకు విరుద్ధము గానియపుడు వీని సాక్ష్యము నంగీకరించుట తప్పుగాదు.

చాటూక్తులు: విజయనగర చక్రవర్తులలో గృష్ణరాయలకు సంబంధించినన్ని చాటూక్తులు మఱియెవ్వరిని గూర్చియు కానరావు. ఇందనేకములు రాయల విద్యావ్యాసంగములను దెల్పునవి. కాని నివి యంత ముఖ్యములు గావు. కాని, ఇతర గ్రంధాదుల వలన తెలియరాని విజయములను వర్ణించు చాటువులు కొన్ని కలవు. కృష్ణరాయలు బెడదకోట(బీదరు)ను జయించినట్లేయాధార గ్రంథమునందు కానరాదు. కాని–

“సమరక్షోణిని కృష్ణరాయల భుజాశాతాసిచే బడ్డదు
ర్దమదోర్దండ బెడందకోట యవనవ్రాతంబు సప్తాశ్వమా
ర్గమునన్ గాంచి శబా సహో హరిహరం గాఖూబుఘోడాకితే
తుముకీ బాయిలబాయిదేములికి యందుర్మింటికిన్ బోవుచున్”

అను నల్లసానిపెద్దనార్యుని చాటువొక్కటి రాయల బీదరు విజయమును దెల్పుచున్నది. ఇట్టివి ముఖ్యమైనవి.

గ్రామకవిలెలు, కైఫీయతులు: పూర్వ మాంధ్రదేశమున బ్రతిగ్రామమునకును కవిలెలుండెడివి. ఇందు గ్రామముల పూర్వవృత్తములు వర్ణింపబడియుండును. ఇట్టి కవిలెలందును, వీని నాధారపఱచుకొని తయారుసేయబడిన కైఫీయతులందును కృష్ణరాయల యేలుబడిని గూర్చి కొన్ని యంశములు వివరింపబడియున్నవి. కావున గృష్ణరాయల చరిత్రను రచించువారికి నివియు ఉపయుక్తములు.

ఇంతవఱకు గృష్ణరాయల చరిత్రకు గల యాధారములను స్థూలముగ వివరించితిని. అన్నిటిని విపులముగ వర్ణించుటకు సాధ్యము గాదు; కాని, రాబోవు ప్రకరణములయందు సందర్భానుసారముగ నన్ని యాధారముల నుదాహరించి వలసినట్లు పరిశీలించుచున్నాడను.