నిలువనీడ

వాచ్‌మాన్ తెల్లవారు జామునే నిద్ర లేచాడు. వేకువ రాక ముందే జాగరూకుడై దానికి స్వాగతం పలకాలతను. ఒళ్ళు విరుచుకుని, తను కాపలాగా ఉండే భవనం చుట్టూ మూడు చుట్లు చుట్టడంతో తన దినచర్యని ప్రారంభించాడు. మొదట దగ్గరలో ఉన్న పబ్లిక్ టాయ్‌లెట్‌లోకి దూరాడు. తర్వాత ఓ మగ్గులో నీళ్ళు, కాస్త పళ్ళపొడి తీసుకుని చూపుడువేలితో పళ్ళు తోముకున్నాడు. తోటలో చిల్లులు పడ్డ నీటి గొట్టంతో చన్నీళ్ళ స్నానం కానిచ్చాడు.

సూర్యుడు, పేదవాళ్ళు, సాంప్రదాయవాదులు నిద్ర లేచేటప్పటికల్లా బేస్‌మెంట్‌లో ఉన్న తన చిన్న గదికి స్నానం చేసి వచ్చేసాడు. ఒళ్ళు తుడుచుకుని, తనకున్న రెండో జత యూనిఫాం వేస్కున్నాడు. టీ నీళ్ళు మరగపెడుతూ, తన గది చుట్టూ చూస్కున్నాడు. మాసిన మరో జత యూనిఫాం, ఒక జత మాములు బట్టలు, కొన్ని లోదుస్తులు, ఓ అద్దం, ఓ దువ్వెన, ఓ పాడై పోయిన చేతి గడియారం, వాడని రెండు షేవింగ్ బ్లేడ్లు, కులదైవం ఫోటో, వీటన్నింటితో ఏ మాత్రం పొందిక లేని ఓ మాంట్ బ్లాంక్ పెన్ను. అది కారణాంతరాల వల్ల ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోతున్న అప్పటి యజమాని తన దగ్గర చాలా కాలం నుంచి పని చేస్తున్న వాచ్‌మాన్‌ ఉద్యోగం తీసేస్తూ ఇచ్చిన బహుమతి. ఆ రోజుల్లో ఎంతో బాగుండేది. తన కోసమే ఓ అవుట్ హౌస్ ఉండేది, తోటలో ఓ మూల కొంత స్థలం ఉండేది. అక్కడ అతను కొన్ని గులాబి మొక్కలు తెచ్చి నాటాడు, పూలు రానేలేదు. కొన్ని బంగాళాదుంపలు పాతాడు కాని దుంపలు పూర్తిగా పక్వానికి రాక ముందే హడావుడిగా తవ్వి తీసేసాడు. పాపం, యజమాని ఈ చేష్టలన్నింటిని భరించాడు. హాయిగా జీవితం చివరిదాకా అలానే ప్రశాంతంగా గడిచిపోవాల్సింది. ఖర్మ! ఇక్కడకొచ్చిపడ్డాడు.

టీ కొద్దికొద్దిగా చప్పరిస్తూ, భవనం మేలుకోడం విన్నాడు. బిల్డింగ్ సెక్రటరీకి నచ్చచెప్పదలచుకున్న మాటలను మళ్ళీ మననం చేసుకున్నాడు. ఈ అభ్యాసం బానే సాగింది ఎందుకంటే అతను ప్రస్తుతం నచ్చచెప్తుంది తన కులదైవం ఫోటోకి. ఈ మూగ దైవం ఆ మహా కోపిష్టి మనిషికి ప్రత్యామ్నాయం కాదు మరి!

“నువ్వెందుకూ పనికి రావు…” అని కులదైవాన్నుద్దేశించి అంటూ నీరెండలో కూర్చోడానికి బయటకు నడిచాడు. మెల్లిగా పొద్దెక్కుతోంది. సందు మలుపులో గారేజ్ ఉన్న మెకానిక్ వెడుతూ వెడుతూ పలకరించి వెళ్ళాడు. వీధి చివర ఉన్న గుడిలో పూజారి ఇతన్ని అసలే మాత్రం పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు.

ఇంతలో ఏడో నెంబరు అపార్ట్‌మెంట్‌కి ఎవరో ఒకాయన ఆటోలో రైలు ప్రయాణంలో వుండే నిద్రలేమి, అలసటతో పాటు పెద్ద పెద్ద సామాన్లు కూడా మోసుకొచ్చాడు. వాచ్‌మన్ వాటిని తన బాధ్యతగా ఆటోనుంచి ఊగిపోతూ వుండే పాత లిఫ్ట్‌ వరకు మోసుకెళ్ళాడు. రోడ్డు కెదురుగా ఫుట్‌పాత్ పైన పూలమ్ముకునే లావుపాటి ఆవిడ వచ్చి తన సరంజామా పరిచింది. మొగ్గలపై నీళ్ళు చల్లింది, నిండుగా విచ్చుకున్న పూలతో మాల అల్లడం మొదలు పెట్టింది. మల్లెపూల వాసన పట్టణపు ముక్కి వాసనను కాసేపు భరించేలా చేసింది.

ఇక పోక మొదలైంది. మూడో నెంబరు అపార్ట్‌మెంట్‌లో ఉండే సేల్స్ ఎగ్జిక్యూటివ్ గబగబా మెట్లు దిగాడు. కిక్ కొట్టి బైకుని స్టార్ట్ చేసి హడావుడిగా ముందుకు దూకించాడు. ఆరో నెంబరు అపార్ట్‌మెంట్‌లో ఉండే సొగసరి ఇంజనీరింగ్ విద్యార్ధిని హొయలుపోతూ మెట్లు దిగి, తన కోసం రోడ్డు మీది కాసుకుని కూర్చున్న రోమియోని పట్టించుకోకుండా బస్‌స్టాండ్ వైపు నడిచింది. తొమ్మిదో నెంబరు అపార్ట్‌మెంట్‌లో ఉండే కవలలు ఏడుస్తూ కిందకొచ్చారు, వాచ్‌మాన్ వేళ్ళు పట్టుకుని కూడా ఏడుస్తునే ఉన్నారు. స్కూల్ బస్ రాగానే, బాల్కనీలోంచి వాళ్ళమ్మ చూస్తున్నా సరే, ఏ మాత్రం ఉత్సాహం లేకుండా బస్ ఎక్కారు. పిల్లలు జాగ్రత్తగా బస్ ఎక్కడాన్ని చూసి వాళ్ళమ్మ తలూపింది.

వీళ్ళంతా సరే, అతని పాలిట యమగండం – బిల్డింగ్ సెక్రటరీ మాటేమిటి? “ఇంకా నిద్ర లేచుండడు దుంప ముఖం వెధవ. వీడూ అందరిలా పోతే బాగుండు” అని అనుకున్నాడు ఆలోచనగా.

ఎప్పటికో చాలా సేపటికి, సెక్రటరీ మెట్లు దిగి తన కొత్త కారు కేసి దర్జాగా నడవడం చూసాడు. ఉన్నట్లుండి తన వాదనలో పస లేదని వాచ్‌మాన్‌కి అనిపించింది. ఒక్క క్షణం పాటు ఆలోచించాడు. తన వాదనని మరోసారి వినిపించాలా లేక, పని మానేస్తానని నిన్న మూర్ఖంగా బెదిరించినందుకు క్షమించమని బ్రతిమాలాలా? అతడు ఈ రెండూ చేయలేదు. బదులుగా, గే్టు మీదుగా దారికి అడ్డంగా వంగిపోయిన చెట్టు కొమ్మని ఎత్తి పట్టుకున్నాడు. దాంతో సెక్రటరీ తన కారుని జాగ్రత్తగా బయటకు తెచ్చాడు. కిటికి కొంచెం తెరిచి, కార్లోంచి వస్తున్న చక్కని పరిమళం వాచ్‌మన్‌ని కాసేపు పీల్చుకోనిచ్చాడు.

“ఏదో ఒకటి తేల్చుకో! నేను సాయంత్రం తిరిగొచ్చేసరికి ఉంటే నువ్వు లేకపోతే ఆ చెట్టు” అంటూ వెళ్ళిపోయాడు సెక్రటరీ.

ఉక్కపోతతో కూడిన ఆ మధ్యాహ్నం వేళ వీచిన చిరుగాలికి వాచ్‌మాన్‌కి కునుకు పట్టేసింది. ఊహాలోకాల్లోకి జారుకున్నాడు. అక్కడ సెక్రటరీ ఓ పేడపురుగుగా మారిపోయాడు. చెప్పులు లేని తన కాలితో ఆ పురుగుని నలిపేస్తున్నాడు, దాని మూగ రోదనలను పట్టించుకోకుండా. అంతే! ఉన్నట్లుండి ఓ తుమ్మెద రొద చేస్తూ చుట్టూ తిరగడంతో అతనికి మెలకువ వచ్చేసింది. బైటప్రపంచంలోకి వచ్చాడు.

సెక్రటరీ పేడ పురుగు కాలేడు. అతను తన రాకపోకలకి ఆటంకం కలిగిస్తున్న ఆ చెట్టుని కొట్టించేయాలనే లక్ష్యంతో ఉన్నాడు. వాచ్‌మాన్ నిట్టూర్చాడు. మూడేళ్ళ క్రితమే కదా? – తన సొంత చేతులతో గేటు పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో ఓ మొక్కని నాటాడు. అదే ఇప్పుడీ అద్భుతమైన, చురుకైన చెట్టుగా ఎదిగింది, కొద్దిపాటి గాలికే ఆకులను గలగలలాడిస్తూ, ఆవరణలోకి వచ్చిపోయే కార్లకు స్వాగతం పలుకుతుంది. బయట ప్రపంచపు వరండాలో నిలబడి, లోపలి ప్రపంచమంతా భిన్నమైనదని గర్వంగా చెబుతున్నట్లుంటుంది.

చెట్టు చిన్నగా గలగల్లాడింది. చిరపరిచితమైన ఆ సవ్వడి ఒక్కసారిగా అతడిని శాంతపరచింది, అదే క్షణంలో విచారమూ కలిగించింది. అన్నీ తెలిసిన ఆ దేవుడు ఈ చెట్టుని గేటు మీదగా వాలమని ఎందుకన్నాడు? గేటుకు దూరంగా ఉండుంటే ఆ సెక్రటరీ కొత్తకారు ఏ ఆటంకం లేకుండా బయటకు వెళ్ళగలిగేది కదా?

సెక్రటరీని తలచుకోగానే వాచ్‌మాన్‌కి కోపం వచ్చింది. “వాడి మొహం మండ” అని తిట్టుకున్నాడు. “నువ్వు నా చెట్టువు. నాతోనే నువ్వు కూడా” అంటూ చెట్టుకి ధైర్యం చెప్పాడు.

“నిజమా?” అడిగింది చెట్టు ఓ సంతోషమైన స్నేహితుడిలా, కొమ్మలను ఊపుతూ.

“కాదు. నిజం కాదు”.

కొన్నాళ్ళ క్రితం తన మేనకోడలిని చూడడానికి పట్టణంలోకి వెళ్ళిన సంగతి గుర్తు చేసుకున్నాడు. రోడ్లన్నీ బస్సులతో, బస్సులన్నీ జనాలతో నిండి ఉన్నాయి. వాళ్ళంతా ఎక్కడికెడుతున్నారు? ఏం పనులు చేస్తారు? అతన్ని విపరీతమైన భయం ఆవహించింది. ఆ రోజు నుంచి మెయిన్ రోడ్ దాటాలంటేనే గజగజా వణికిపోతున్నాడు. మరి కొత్త ఉద్యోగాన్ని వెదుక్కోడం, కొత్త జీవితాన్ని ఆశించడం జరిగే పనేనా? కాదు. ఏ మాత్రం కాదు.

“ఎందుకు..” చెట్టు అలిగింది.

“నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి” అన్నాడు వాచ్‌మాన్ కీచుగొంతుతో. “ఎవడైనా దొంగ దూరితే, నాకు గట్టిగా అరిచే బలం కూడా లేదు. నా పక్కటెముకల్ని లెక్కపెట్టడం ఆ కవలపిల్లలకి ఒక ఆట. ఇదీ నా బతుకు!”

“బావుంది. సరే అయితే…” చిన్నగా కదిలింది చెట్టు.

ఒకరి సహచర్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ చెట్టు, అతను అలాగే కూర్చుండిపోయారు. సూర్యుడు పొద్దు గూకుతున్నాడు. ఉన్నట్లుండి జ్ఞానోదయమైనట్లు హఠాత్తుగా లేచి గబగబా తన గదికి పరిగెత్తి మాంట్ బ్లాంక్ పెన్నుతోనూ, బ్లేడ్ తోనూ తిరిగి వచ్చాడు. బ్లేడ్‌తో చెట్టు మొదల్లో అరచేయంత వెడల్పుగా బెరడు కోసి తీసేసాడు. నున్నగా ఉన్న కాండంపై పెన్నుతో తన పేరు ఎంతో ప్రేమగా రాసుకున్నాడు. దాన్ని చూసుకుంటూ కాసేపు అక్కడే తృప్తిగా కూర్చున్నాడు లేచెళ్ళి గొడ్డలి తేబోయే ముందు.

[ఆంగ్ల మూలం: ఈశ్వర్ సుందరేశన్ (Eshwar SundarESan) వ్రాసిన Age-Old Tales ఈ-బుక్ సంకలనంలోని షేడ్స్ ఆఫ్ రియాలిటీ అన్న కథ.]

కొల్లూరి సోమ శంకర్

రచయిత కొల్లూరి సోమ శంకర్ గురించి: కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు. ...