కవి స్మైల్ గురించి మరొక్కసారి…

సంభాషణల్లో సహజత్వం, వస్తువులో వైవిధ్యం, కథాకథనం లేదా రీతి – కాల్పనిక సాహిత్యానికి ఉండవలసిన కొన్ని ముఖ్య లక్షణాలు అని అంటే అభిప్రాయ భేదం ఉండదనుకుంటాను. అంత మాత్రం చేత వర్ణన, విస్తరణతో కూడిన ‘కథలు’ కథాసాహిత్యంలో ఇమడవు అనడానికి కొంచెం ధైర్యం కావాలి. ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని రచనలు చేసిన మంచి కథకులు మనకి ఎందరో ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఈ లక్షణాలని అధిగమించి రాసిన తెలుగు రచయితలు మాత్రం అరుదుగా కనిపిస్తారు. అటువంటి వాళ్ళ కథలు చదివితే, కథకీ కవితకీ మధ్య ఉండే మట్టి గోడ అసహజంగా కనిపిస్తుంది. ఆ గోడ కరిగిపోతుంది. కనిపించదు. అలా కథకీ కవితకీ తేడా చెరిపేసిన రచనల ఉదాహరణలు కొన్ని ఇస్తాను.

“లేలేత గుండెల్ని కాల్చి
మరోసారి మరోసారి —
పట్టుకున్న పువ్వులదండలు పసరిక పాములయేయి
మరోసారి మరోసారి —
వర్షిస్తాయనుకున్న నీటి మబ్బులు చింతనిప్పుల్నే కురిపించేయి
మరోసారి మరోసారి —
నిండాపాలున్నాయని పట్టుకున్న కుండ
నూనే, నల్లమందులతో నిండా నిండుకుంది.
మరోసారి మరోసారి —
పచ్చనిచల్లని పైరగాలి మంటలుగా మారి మారి బుసలు కొట్టింది
మరోసారి మరోసారి —
పాపంతెలియదనుకున్న పండువెన్నెల్లోకొస్తే
అది సెగలుపొగలుగా రేగి రేగి
లేలేతగుండెల్ని కాల్చి మాడ్చింది.”

ఇది కవిత్వమే, కానీ కథ. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి ‘రత్తాలు – రాంబాబు’ [1]నవల లోది. అలాగే, ఈ కవిత కూడా –

“నరకం ఎలా వుంటుంది?
చీకటి చీకటిగా…..
పైన భగ్గుమండే సూర్యుడు
బైట ఫేళ్ళున కాసే ఎండ
ఎండ ఎలా వుంది?
పులి కోరలా, పాము పడగలా
నరకం ఎలా వుంటుంది?
పులితో పాముతో చీకటిగా…”

ఇదీ రావిశాస్త్రి గారిదే. ఇంత కవిత్వమూ ఆయన కథలో వాక్యమే – ‘మోక్షం’[2]కథ నుంచి ఇదో మచ్చు తునక.

చలం గారి గురించి నేనేమీ మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీకు తెలుసో లేదో కానీ, వజీర్ రహ్మాన్ ‘కవిగా చలం’ అని ఒక పుస్తకం అచ్చేశాడు. చలం కవితలు రాస్తాడా అని చాలామంది ఆశ్చర్యపడ్డారు కూడానూ. ముందు మాటలోనే రహ్మాన్ మనకు చెప్పేస్తాడు చలం వచనం లోంచి ఏరిన కవిత్వమే ఇది అని. చలం గారు ప్రత్యేకించి కవిత్వం ఏవీ రాయలేదు. ఈ ఉదాహరణలు[3] చూడండి, రహ్మాన్ ఏం చేశాడో మీకే తెలుస్తుంది.

“ఆకాశాన మబ్బుల్లో
జుట్టువిరబోసుకొని,
నక్షత్రాలు పూలుగా
దిక్కులకి చేతులు జాచి,
వింత అర్ణ్యాంబరం దాల్చి
సముద్రాలే ఘర్మధారలుగా,
మా బాధల్ని, ప్రాణాల్ని, మరణాల్ని
కాళ్ళకి కట్టుకు తాండవించి,
నూతన సందేశాన్ని
సుందర ప్రణయాన్ని
సృష్టికాంతా వినిపించు.”

“సన్నని దీపం వెలుతురు కింద
పద్మం చుట్టూ అల్లుకున్న అలల మల్లే
అన్నివేపులా పరుచుకున్న జుట్టు;
తెడ్లకింద చెదిరే చందమామ ముక్కలవలె
పరుపుకింద జారిన వేళ్ళచివర మెరిసే గోళ్ళు;
ఏవో క్రూరమైన జ్ఞాపకాలతో
భయపెడుతున్న పెదిమల చివర్లు;
వొంపుల్ని అంటుకు ఆవరిస్తున్న
చీర కుచ్చెళ్ళమీద చారలు;
ఆ దీపపు నీడల అందాలుతప్ప
ఏమీ అందవు నా చిన్ని రెక్కల్లో ఆసక్తికి —
ఆ చిన్నిదీపం చుట్టూ
తిరిగే పురుగు నేను!”

ఆఖరు ఉదాహరణ. వచనానికి కవిత్వానికీ తేడా పూర్తిగా చెరిపేయగల్గిన (చెరిపేసిన) కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారని నేనంటే మీరు కాదనలేరనే నా నమ్మకం. ఇదిగో, అయన రాసిన ‘మా ఊరు పోయింది’[4] వ్యాసం, కాదు! వచన గీతం నుంచి.

“మా ఊరు వెళ్ళిపోతాను
వెంటనే వెడతా. వెళ్ళి
అక్కడ చక్కని, చల్లని, ఇల్లు కడతా.
పూరిల్లు. ఇంటిచూరులంట
శాంతీ చల్లదనమూ ఎప్పుడూ
నామీదికి జారుతూ ఉంటాయి.”

“మాఊరికి ఉత్తరాన
ఒక చెరువు. దక్షిణాన కూడా
ఒక చెరువు.
గాలి ఊదినప్పుడూ,
మీలు ఎగిరినప్పుడూ,
నీళ్ళు గలగలమంటాయి. అప్పుడు
చెరువు నిద్దరలోనుంచి
ఒళ్ళు విరుచుకున్నట్టనిపిస్తుంది.”

“మా ఊళ్ళో పురాణం
ఇటు రామ శాస్త్రిగారు,
ముందు వ్యాసపీఠంలో
దానిమీద పెద్ద పంచాంగం
నాటికాలపు భారతం. పక్కన
ఆముదంపోసిన ప్రమిదతో
సెమ్మా.

ఎదురుగా చీకటిలో
ముదుక దుప్పటులు కప్పుకొని
ముసుగులు వేసుకొనీ, నీడలలాగా
గ్రామ వాసులు. పైన విశాలాకాశంలో
ధగధగ మెరిసే నక్షత్రాలు,
చచ్చి స్వర్గాన ఉన్న భారతవీరుల్లాగా,
ఈ లోకాన్ని కనిపెట్టే వాళ్ళ చూపుల్లాగా.

ఆ చీకట్లో
శాస్త్రిగారి గొంతు
ద్వాపరయుగంనుంచి వస్తుంది.
ఆయన కంఠరవ పక్షాలమీద
శ్రోతల మనస్సులు ఆదికాలాలదాకా
ప్రయాణం చేస్తాయి.
……
ఆముదం దీపంకూడా
పురాణం ఆలకించడం
నేనెరుగుదును.
ఆలకించి
అటూ ఇటూ
తల ఊపుతుంది.”

“చంద్రపాలేనికి త్రోవ ఇదేనా?
అవును. ఈ రోడ్డక్కడికే పోతుంది.
ఈ బస్సు కూడా అక్కడికే.
అదిగో!
దూరాన ఆ టూరింగు సినిమా డేరా!
అక్కడ నా చంద్రపాలెం లేదు.
మా ఊరు పోయింది!”

వచనానికీ కవనానికీ మధ్య భేదం లేదనిపించేట్లు రాయగల వాళ్ళు చలం, కృష్ణశాస్త్రి, రావి శాస్త్రి అని చూపించడంకోసం ఈ ఉదాహరణలు. సరిగ్గా ఆకోవలో రచనలు చేసిన వాడు స్మైల్ అనడం అతిశయోక్తి కాదు. స్మైల్ రాసిన కథలు వేళ్ళమీద లెక్కపెట్టచ్చు – వల, పృధ్వి, కంబళి (ఉర్దూనుంచి అనువాదం), సిగరెట్, సముద్రం, ఇదీ వరస, ఖాళీసీసాలు.

నాకు తెలిసినంతలో ‘వల’ స్మైల్ రాసిన మొదటికథ. 1964-65 ప్రాంతాల్లో రాసిన కథ. కథావస్తువు ఆరోజులకి కాస్త ఘాటైనదే అని చెప్పక తప్పదు. కథానాయకి రాణి ఒక ముస్లిం యువకుడు రహీంని గాఢంగా ప్రేమించి, రహస్యంగా కలుసుకుంటూ ఉంటుంది. అజాగ్రత్త కారణంగా గర్భవతి అవుతుంది. లారీ ప్రమాదంలో రహీం మరణిస్తాడు. తను ఒక చచ్చిన పాపని కంటుంది. ఈ ‘విచ్చలవిడితనం’ సంఘానికి వ్యతిరేకం. ఆ తరువాత తండ్రి సహకారంతో మరొక యువకుడు కాలేజీ లెక్చరర్‌ రవిని కలుస్తుంది. అతన్ని వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ, కథ అతని క్షమాపణ ఉత్తరంతో ముగుస్తుంది.

మొట్టమొదటిసారి ఈ కథ వ్రాతప్రతిలోచదివినప్పుడు, కథావస్తువులో స్పష్టంగా చలంగారు కనిపించారు. బహుశా ఇప్పుడూ చలంగారు కనిపిస్తారు. ఈ కథని ఎవరు అచ్చువేస్తారా అన్న అనుమానం కూడా వచ్చింది. అరవైఆరులో భారతి పత్రిక ఈ కథని ప్రచురించింది. ఈ కథలో కథకుడు, కథానాయకి గొంతుతో కథ చెప్పిస్తాడు. కథానాయకి పాత్రకి, కథకుడికీ మధ్య ఉండ వలసిన భేదం, వ్యత్యాసం మరుగునపడిపోతాయి. ఈ ప్రక్రియ పాశ్చ్యాత్య సాహిత్యంలో మొట్టమొదటిసారిగా ఫ్లాబే (Flaubert) చేశాడని అంటారు. ఈ పద్ధతిలో కథనం జరిగినప్పుడు, సాధారణంగా భూత వర్తమాన కాలాల మధ్య ఉండవలసిన నిడివి తగ్గిపోతుంది. అప్పుడు కథాకథన రీతికి ప్రాముఖ్యత వస్తుంది. ఇదే కృష్ణశాస్త్రిగారి మాఊరు పోయింది కథ (కవిత) లో కూడా చూస్తారు.

వల కథ కవితలా ప్రారంభం అవుతుంది.

“నవ్వుతూ నిలబడిఉన్న
నాన్న పక్కన
అందమైన యువకుడు.
కొత్త చేప.
పాత ఎర.
అందమైన అబ్బాయి వచ్చినప్పుడు
కాఫీలో ఏదైనా
మత్తుమందు కలిపితే
బావుంటుందంటాడు
నాన్న.

చూపుల్తో ఉచ్చులు వేయాలి
సెక్స్ అప్పీల్ తో కట్టిపడవేయాలి.
సిగ్గుతో కత్తి దిగిన వాసంలాగ
చీలిపోకూడదు.
గాలిపోయిన బ్లాడర్ లాగ
ముడుచుకు పోకూడదు.

నేను నిజంగా తెగించా
నేను అందమైన దాన్ని.
సెక్స్ ని టెర్లిన్‌ చీరలో,
జాకెట్లో బిగువుగా
ప్యాక్‌ చేస్తే
అందం
దానంతట
అదే వస్తుంది.”

పైన చెప్పిన చలంగారి ‘కవిత’ల పక్కన ఈ కవిత పెట్టి చదవండి. ఇదే పద్ధతిలో మొత్తం కథని కవితలా తిరిగి చెప్పవచ్చు. అప్పుడు కవితలో కథ వుంటుంది, కథలో కవిత బదులు. అంటే, మంచి కవితకీ మంచి కథకీ మధ్య తేడా ఉండదని నా భావం. కవితలో కథ అన్నాను కదూ, సరిగ్గా ఆ పనే చేసాడు స్మైల్, ‘తూనీగ’ అన్న కవితలో. తూనీగ కవిత ఆంధ్రజ్యోతి (4-7-80) లో అచ్చయ్యింది.

“వేళ్ళు తొండలైపోయేవి తూనీగ దొరికేదాకా. మేఘాలు మొహాలు చూసుకునే పచ్చటి చెరువు నీట్లో పచ్చిక గరువుల్ని నెవరేసే గేదెలకొమ్ములమీద సాయంత్రపుసూర్యుడితోపాటు గాలి సర్దాగా కూచున్నట్టు గుంపులుగుంపులుగా తూనీగలు. ఆబగా చూస్తుండేవి నావేళ్ళు. తొండలై పోయాయి. ఇంధ్రధనస్సు వేళ్ళచివర రెపరెపమన్నట్టుండేది, తూనీగ తోక పట్టుకున్నప్పుడు; రంగులోకాల నీడ నున్నటి అద్దాల కళ్ళతో మిలమిలా మెరిసేది. తుమ్మముల్లుకి తూనీగని శిలువ వేసేశా కదలకండా మెదలకండా. తూనీగ చచ్చిపోయింది.”

ఈ రకంగా మొత్తం కవితని కథలా పేర్చవచ్చు. చిన్ననాటి ఆకతాయితనం, తిరిగివచ్చిన జ్ఞాపకం. గుండెల్లో బాధ, అప్పుడు, ఇప్పుడూనూ! కృష్ణశాస్త్రి గారి ‘మాఊరు పోయింది’ తో పోల్చి చూడండి.

మరోకథ ‘సముద్రం’. ఈ కథ ఎక్కడ ప్రచురించబడిందో తెలియదు. మిత్రులమంతా ఈ కథ కూడా రాతప్రతిలో ఉండగా చదివాం. 1964 -1965 ప్రాంతంలో. ఇందులోనూ స్త్రీ (వసుంధర) తానొక స్త్రీగా హాయిగా, స్వేచ్చగా ఉండలేని స్థితి కథావస్తువు. తనకి తన భర్త (సుదర్శనం) తో తృప్తి లేదు. నిరాశ, నిసృహ. అతనికి తన అవసరాలు అర్థం కావు. తన ప్రేమికుడికి (రవి) అతని భార్యతో తృప్తి లేదు. ఆవిడ అవసరాలు అతనికి తెలియవు. రవి భార్య మరెవరితోటో లేచిపోతుంది. అవమానం భరించలేక రవి ఆత్మహత్య చేసుకుంటాడు. వసుంధరకి తన అవసరాలు తెలియని భర్త తోటే కాపురం. నిసృహ, నిట్టూర్పు. ఇందులోనూ బోలెడు చలంగారు కనపడతారు. ఇది కూడా సంప్రదాయానికి విరుద్ధమైన కథే! కథ వసుంధర నోటిమీదుగానే రచయిత చెప్పిస్తాడు. ఈ కథలో కూడా ముఖ్యపాత్రకి, కథకుడికీ మధ్య వ్యత్యాసం మరుగున పడిపోతుంది.

స్మైల్‌ ని ఖాళీసీసాల స్మైల్ అనే వాళ్ళు. అతని ఖాళీసీసాలు కథ ఈ సంచికలో పొందు పరిచాం. చదవండి. ఆ కథలో పాత్రలన్నీ కథకుడి గొంతుతో మాట్లాడుతాయి. కథకుడు చెప్పే మాటలు కథ మధ్యలో ఉపన్యాసాల్లా అడ్డుపడవు. అదీ, కథ చెప్పే పద్ధతి, రీతిలో ఉన్న స్వారస్యం. పేదరికం తోడు బ్రతుకు మీద విపరీతమైన ఆశ కొట్టవచ్చినట్టు కనపడే కథ ఖాళీసీసాలు. కథకుడు ఇంటర్వీన్‌ అయిన ప్రతి భాగం ఒక కవితగా మలచడం (ఊహించడం) కష్టం కాదనుకుంటాను. రావిశాస్త్రిగారి కవిత ‘దీనంగా చీకటి’ గుర్తుకు రావటల్లేదూ?

అందుకే అన్నాను – వచనానికీ కవనానికీ మధ్య భేదం లేదనిపించేట్లు రాయగల వాళ్ళు చలం, కృష్ణశాస్త్రి, రావి శాస్త్రి అని. సరిగ్గా ఆకోవలో రచనలు చేసిన వాడు స్మైల్ అని.


స్వంత విషయం: 1960 ల నుంచీ స్మైల్ మాకు మంచి స్నేహితుడు. వెల్చేరు నారాయణరావు గారి ద్వారా పరిచయం. మాతో కలిసి అర్థరాత్రుళ్ళూ అపరాత్రుళ్ళూ తిరిగాడు. మాతోపాటు చదివాడు. వాదించాడు. నేను సరదాగా చాలాసార్లు వేధించాను కూడాను. 1968 నుంచీ ఇండియా వెళ్ళినప్పుడల్లా మొయిల్ దారిలో స్మైల్ వచ్చేవాడు; చూడటానికి, మాట్లాడటానికీ. స్మైల్ కి ఇరవై ఏళ్ళక్రితం గుండె జబ్బు వచ్చింది. 1995 లో చికాగో వచ్చినప్పుడు, డాక్టర్ సోంపల్లి నాయుడుగారు పరీక్షలు చేయించారు. అతనికి గుండెజబ్బు ఉన్నదని చాలా కొద్దిమందికే చెప్పాడు. మరి తనది మంచి హృదయం కదూ, అందుకనేనేమో! (చికాగో వచ్చినప్పుడు అన్నాను కదూ. ఇంతకుముందు స్మైల్ గురించి రాసిన నాలుగు మాటల్లో ఒక చిన్న పొరపాటు జరిగింది. స్మైల్ వస్తున్నాడని గుర్తు చేసింది జంపాల చౌదరి గారు.ఒకటికి రెండుసార్లు బాపూగారు స్మైల్ వస్తున్నాడటగా అని అడిగిన విషయమే నాకు జ్ఞాపకం ఉండటం, అదే విషయం రాయడం జరిగింది. చౌదరిగారు చెప్పిన విషయం రాయకపోవడం నా పొరపాటే.)

మరొక విషయం. ‘కాగితప్పులి కళ్ళల్లో భయం’ అనే మకుటంతో విరసం వాళ్ళు ప్రచురించిన కవితలసంపుటి పై 2002 లో ఆంధ్రభూమి పత్రికలో నేనొక దీర్ఘ విమర్శ రాసాను. ఆ విమర్శపై స్మైల్ స్పందించాడు. నా విమర్శ లో కొన్ని భాగాలతో స్మైల్ ఏకీభవించలేదు; అతని స్పందనలో కొన్ని వివరణలతో నేనూ ఏకీభవించలేదు. దరిమిలా, మా ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. చాలా పెద్ద పెద్ద ఉత్తరాలు రాసుకొని చివరకి “థూ నా బొడ్డూ” అనుకున్నాం.

అ సందర్భంలో ఒక వుత్తరంలో చివర ఇలా రాసాడు: “మీరు అక్కడ కూచొని తెలుగులో ఎలా టైప్ చేయగలిగారో నాకు చెప్పరా? ఇక్కడ ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేసుకోడానికి నాకు వీలవుతుందా? ఏవన్నా రాయాలంటే పెద్ద శ్రమ. చావై పోతుంది రాస్తూ కూచుంటే. మీ రాత వెనక రహస్యం చెప్పి నన్ను రక్షించండి. నాక్కొంచెం రాసుకొనే అదృష్టం దక్కుతుంది”. ఎలా తెలుగులో టైప్ చెయ్యచ్చో చెప్పాను. కానీ, తరువాత అతను ఏమీ రాసినట్టు లేదు. రెండేళ్ళక్రితం అమెరికా వచ్చినప్పుడు ఈమాటకి రచనలు ఎంత సులువుగా పంపిచవచ్చో కూడా చెప్పాను. అయితేనేం! మనకి ఆ అదృష్టం లేదు!

కానీ, స్మైల్ నాకు గొప్ప ఉపకారం చేసాడు. ఒకరోజు హైదరాబాదులో, చూడటానికొచ్చి, పుట్టుమచ్చ (ఖాదర్ మొహియుద్దీన్‌), సినబ్బ కతలు (నామిని) స్వయంగా తెచ్చిఇచ్చాడు. అదే పదివేలు!


  1. రాచకొండ విశ్వనాథ శాస్త్రి ‘రత్తాలు – రాంబాబు’ నవల మూడోభాగం, పేజీ 145. ‘రావిశాస్త్రి కవిత్వం – ఎన్నెలో ఎన్నెల’. కూర్పు, ప్రచురణ: త్రిపురనేని శ్రీనివాస్. కవిత్వం ప్రచురణలు -10 (1991).
  2. రాచకొండ విశ్వనాథ శాస్త్రి ‘మోక్షం’ (ఆరు సారాకథలు – సంకలనం నుంచి) కథ ప్రారంభవాక్యాలు. ‘రావిశాస్త్రి కవిత్వం – ఎన్నెలో ఎన్నెల’. కూర్పు, ప్రచురణ: త్రిపురనేని శ్రీనివాస్. కవిత్వం ప్రచురణలు -10 (1991).
  3. చలం ‘కవిగా చలం’ వరుసగా 7, 19 పేజీలు. సమర్పణ : వజీర్ రహ్మాన్‌, సెప్టెంబర్ 1956.
  4. దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘మా ఊరు పోయింది’ (పుష్పలావికలు – సంకలనం నుంచి) . ఓరియంట్ లాంగ్మన్‌, 1993.