పాఠం

[శ్రీ స్మైల్ జ్ఞాపకార్థం, వారి ‘పాఠం’ అనే మిరోస్లావ్ హోలబ్ (Miroslav Holub) చెక్ కవిత అనువాదాన్ని ఇక్కడ పునః ప్రచురిస్తున్నాం. ఇది ప్రచురించడానికి ప్రత్యేక అనుమతి నిచ్చిన శ్రీమతి యాస్మిన్ ఇస్మాయిల్ గారికి కృతజ్ఞతలు – సం.]

ఓ చెట్టొచ్చి అందికదా వినయంగా వొంగి
నేనో చెట్టుని
ఓ నల్లటి కన్నీటి చుక్క అంది నింగినుంచి రాలి
నేనో పిట్టని
సాలెగూడు క్రింద
ప్రేమలాంటిదేదో దగ్గరకొచ్చి అంది
నేనో నిశ్శబ్దాన్ని
కానీ ఆ బ్లాక్ బోర్డ్ పక్కన
అతి నిర్లక్ష్యంగా కూచొని ఉంది
వెయిస్ట్ కోట్‌లో
ఓ జాతీయ ప్రజాస్వామ్య గుర్రం
చెవుల్ని నిక్కబొడిచి చెప్తోంది
చెప్పిందే చెప్పిందే
మళ్ళా మళ్ళా చెప్తోంది
నేను చరిత్ర యింజన్‌ని
మనమంతా ప్రగతికాముకులం
ధైర్యాన్ని
యోధుల ఆగ్రహాన్ని
ప్రేమిస్తాం మనం

క్లాసురూం గుమ్మం కింద
ఓ సన్నటి నెత్తుటి ధార
చేరుతోంది

ఏంలేదు అమాయకుల
సామూహిక హత్య జరగడం
ఇక్కడే
ఆరంభం అవుతోంది