‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా

[1956 సంవత్సరంలో విడుదలైన అపరాజితో సినిమా ‘అపు చిత్రత్రయం’ లో రెండవది. నవంబర్ నెలలో పరిచయం చేసిన పథేర్ పాంచాలీ సినిమా లాగే, అపరాజితో సినిమాకి మూలం కూడా బెంగాలీలో వచ్చిన బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ స్వీయ కథాత్మక నవల “పథేర్ పాంచాలీ” .]

అంతర్జాతీయంగా ‘పథేర్ పాంచాలి’కి వచ్చిన పేరుతో, రాయ్ తియ్యబోయే సినిమాలపై ఆశలు, ఊహాగానాలు ఎక్కువయ్యాయి. పథేర్ పాంచాలి సినిమా అంత బాగా ‘అపరాజితో’ తీద్దామనుకొన్నా, ఈ సినిమా విషయంలో తనకి కొంత ఆశాభంగం జరిగిందని రాయ్ స్వయంగా చెప్పుకొన్నాడు. కానీ, ఈ సినిమా తియ్యటంలో రాయ్, అతని బృందం ఏ విషయంలోనూ రాజీ పడలేదు.


సర్బజయ, అపు

అపరాజితో అంటే, ‘పరాజయం లేని’ అని అర్ధం. హరిహరన్ తన స్వగ్రామమైన నిశ్చిందపురం వదిలి, బెనారస్‌లో భార్య సర్బజయ, పదేళ్ళ అపులతో జీవితం గడపటంతో సినిమా మొదలవుతుంది. హరిహరన్ మరణంతో కథ మలుపు తిరుగుతుంది. హరిహరన్ చనిపోటంతో తల్లీకొడుకులు మాత్రమే ఒకరికొకరు మిగులుతారు. పెరుగుతున్న అపును, తండ్రి లాగే పౌరోహిత్యం చెయ్యమని తల్లి అడగటం, అపు అందుకు ఇష్టపడక స్కూల్లో చేరటం, తల్లి కష్టపడి కొడుకును చదివించటం ఈ సినిమా ముందు భాగంలో ప్రధానాంశాలు. తరవాత భాగంలో అపు పెరుగుతూ తల్లి నుంచి ఎలా దూరమవుతాడు అన్నది ముఖ్యాంశం. తల్లీకొడుకులు అనుబంధం, వారి మధ్య అంతఃఘర్షణలు ఈ అపరాజితో సినిమాకు కేంద్రం.

బెనారస్ డైరీ

అది మార్చ్ 1956 సంవత్సరం. స్థలం బెనారస్‌లోని గంగా ఘాట్, అక్కడికి దగ్గరగా ఉన్న మరికొన్ని ప్రదేశాలు. సత్యజిత్ రాయ్ ప్రతి రోజూ సినిమా తియ్యటంలో తనకు జరిగిన అనుభవాలను డైరీలో రాసుకొనేవాడు. అందులో కొన్ని విషయాలు రాయ్ మాటల్లో:

మార్చ్ 1:

పొద్దున్నే ఐదు గంటలకు గంగా ఘాట్‌ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దామని ఒక్కడినే బయలుదేరాను. ఇంకో అరగంటలో సూర్యోదయం. అనుకున్నదాని కంటే వెలుతురూ, జనసమ్మర్ధం కూడా ఎక్కువగా అనిపించింది. …ఎటు చూసినా మనసుకు హత్తుకుపోయే దృశ్యాలే! …మళ్ళీ మధ్యాహ్నం నాలుగింటికి అదే చోటుకెళ్ళా! పొద్దున్న కలిగిన అనుభూతికి, ఇప్పటి అనుభూతికి సామ్యం లేదు. ఇది ఇంకొక అందమైన అనుభూతి. ఇప్పుడు సూర్యుడు మరోలా ప్రకాశిస్తున్నాడు. పెద్ద పెద్ద భవనాల వెనక అస్తమిస్తున్న సూర్యుడి నీడలు, గంగ ఒక ఒడ్డు నుంచి, రెండో ఒడ్డుకి చేరుకుంటున్నాయి. సాయం సంధ్యలో పల్చబడుతూ విస్తరిస్తున్న సూర్య కాంతి, నిస్తేజమైన ప్రకృతిలో కరిగిపోతోంది. ఒక్కటే అనిపించింది. పొద్దుటి షూటింగ్ పొద్దున్నే తియ్యాలి. సాయంత్రం షూటింగ్, సంధ్యా సమయంలోనే తియ్యాలి.

మార్చ్ 4:

దుర్గ గుడికి వెళ్ళాను. ….అపుతో ఒక మంచి దృశ్యం తియ్యాటానికి అనువైన చోటు.

మార్చ్ 15:

ఘాట్‌ల వద్దకు పావురాలని చిత్రీకరిద్దామని ఐదు గంటలకు చేరుకున్నాం. ఒక గుంపుగా ఆకాశంలోకి ఎగిరి, వలయాకారంలో చక్కర్లు కొట్టే పావురాల దృశ్యాన్ని తియ్యాలని సంకల్పం. పావురాలని అదరగొట్టటానికి కొంచెం గట్టిగా శబ్దం వచ్చే బాంబులు మా వెంట తెచ్చుకున్నాం. కెమేరా సరైన దిశలో గురి పెట్టబడి ఉంది. సుబీర్ బాంబు వత్తికి నిప్పంటించాడు. ఒక ముప్ఫై సెకన్లు గడిచాయో లేదో! నిమాయ్ వళ్ళు తెలియని ఆవేశంతో ఏవో సంజ్ఞలు చేస్తున్నాడు. ఏదో జరక్కూడనిది జరుగుతోందనిపించింది. సుబీర్ బాంబు పేలకుండా ఉంటే బాగుండునన్నట్టు మూకాభినయం చేస్తున్నాడు. బాంబు చక్కగా పేలింది. హుందాగా పావురాలన్నీ ఆకాశంలోకి లేచాయి. కెమేరా మాత్రం పావురాలు ఎగురుతున్న దిశగా తిరగలేదు. అప్పుడు చూసుకున్నాం! కెమేరా మోటారుని, బాటరీకి కలపాల్సిన ఎలక్ట్రిక్ తీగ ఊడిపోయి ఉంది. అదృష్టవశాత్తు, పావురాలు నాలుగు చక్కెర్లు చుట్టి, మళ్ళీ నేలకు చేరాయి. మేం తెచ్చుకున్న నాలుగు బాంబుల్లో, రెండోది వాడి అతి చక్కని దృశ్యాన్ని షూట్ చేసాం.

మార్చ్ 20:

చౌశతి ఘాట్ మెట్ల దగ్గర హరిహరన్ స్పృహ తప్పి పడిపోయే దృశ్యం. చాలా సంతృప్తి కలిగే దృశ్యాలని చిత్రీకరించాం. బలంగా వీచిన గాలి వల్ల గంగ మీద అలలు ఎగసి పడటంతో, ఆ దృశ్యానికి ఒక చైతన్యం వచ్చింది. అతి సహజంగా కాను బాబు (హరిహరన్ పాత్రధారి) క్రింద పడ్డప్పుడు మాత్రం మోకాలి చిప్ప మీద ఒక అంగుళం లోతు గాయం అయ్యింది.

గ్రామీణ జీవితం

తండ్రి మరణంతో, తల్లితో కలిసి బెనారస్ నుంచి తల్లికి బంధువు, తనకి వరసకి మేనమామ ఉన్న పల్లెటూరు ఇంటికి వస్తాడు అపు. కొంత బాల్యం అపు ఇక్కడ గడిపినపుడు, రాయ్ పల్లెటూరు చిత్రణ అద్భుతంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం సినిమా చూస్తున్నామా లేక ఒక డాక్యుమెంటరీ (“భారత దేశంలో పల్లె జీవితం” అన్న టైటిల్ సరిపోతుందేమో) చూస్తున్నామా అన్న అనుమానం రావటం సహజం. పొలాలు, చేల గట్లు, చెట్లు, చేమలు, కాలవలు, అందులో పిల్లల ఈతలు, అప్పుడప్పుడు దూరంగా ఆకాశంలోకి నల్లని పొగలు చిమ్ముతున్న రైలు బండ్లు (అప్పటికి ఇంకా డీజిల్ ఇంజన్ రైలు బండ్ల వాడకం లేదు) – ఇవన్నీ సినిమాలో చూసేవారిని ఎక్కడకో పాత జ్ఞాపకాల్లోకి తెరలు తెరలుగా, పొరలు పొరలుగా తీసుకెడతాయి. ‘పథేర్ పంచాలి’ సినిమాలోలాగే ఈ సినిమాలో కూడా పల్లెటూరి వాతావరణం అద్భుతంగా చిత్రీకరిస్తాడు రాయ్. యుక్తవయస్సు వచ్చాక అపు, కలకత్తాలో కాలేజీ చదువుకు వెడుతున్నప్పుడు ఆ చిన్న ఊరి రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూట్టం, కాలేజీ శలవల్లో ఇంటికి రాగానే తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా, వాళ్ళ ఇంటి ముందున్న చెరువులోకి దభీమని దూకటం – ఇవన్నీ పల్లెటూరు జీవితం అనుభవం ఉన్నవారికి భావోద్రేకంతో కూడుకున్న అనుభవాలే!

హెడ్‌మాష్టారు

అపు పాత్ర చిత్రణలో ప్రస్ఫుటంగా కనిపించి, నిలిచిపోయే సంగతి ఒకటుంది. ఏ విషయమైనా తెలుసుకొనేందుకు అపు చూపించే ఉత్సాహం, దాని ద్వారా సంపాదించే జ్ఞానం. అపు చూపించే ప్రవృత్తి, ‘పథేర్ పాంచాలి’లో కూడా కనపడుతుంది. ‘అపరాజితో’లో, తండ్రి లాగే పూజారి వృత్తి చేపడితే బాగుంటుందన్న తల్లి కోరికను మొదట ఒప్పుకున్నా, అపు తరవాత అందరి లాగే స్కూలుకు వెళ్ళి చదువుకోవాలనుకుంటాడు. అపులోని చురుకుతనం మొదటగా గుర్తించినవాడు, అపు చదివే స్కూల్లోని హెడ్‌మాష్టారు. సుబోధ్ గంగూలీ ఈ పాత్రని పోషించాడు. ఇక్కడ, సినిమా జరుగుతున్న కథాకాలం 1920ల్లోదని మనం గుర్తుంచుకోవాలి. ఒక రోజు విద్యార్ధులను పరీక్షించటానికి స్కూల్లో పై అధికారి జరిపిన తనిఖీలో అపు తెలివితేటలు గమనించి, హెడ్‌మాష్టార్ అపుని ప్రోత్సహిస్తాడు. ఈ హెడ్‌మాష్టార్ పాత్రని స్వయంగా తాను వేసిన ఒక మంచి స్కెచ్‌లో చూపిస్తాడు రాయ్. మనలో చాలా మందిని ప్రభావితం చేసిన స్కూల్ టీచర్లు, మన జీవితాల్లో తప్పకుండా ఒక్కరైనా ఉంటారు. అటువంటి పాత్ర ఈ హెడ్‌మాష్టారు. సైన్సు, జాగ్రఫీ, హిష్టరీ వంటి విభాగాల్లో మంచి పుస్తకాలను అపుకి పరిచయం చేసి, స్కూల్ చదువు పూర్తి అయ్యేనాటికి, కలకత్తాలో కాలేజీ చదువుకి స్కాలర్షిప్ వచ్చే ఏర్పాటు చేస్తాడు. అపు జీవితాన్ని హెడ్‌మాష్టారు ఎంత ప్రభావితం చేసాడో చూపడానికి ఒక ఉదాహరణ – హెడ్‌మాష్టర్ బహుమతిగా ఇచ్చిన ఒక చిన్న గ్లోబ్ ఎప్పుడూ పట్టుకుని తిరుగుతుండే అపు.

globe apu
తల్లితో అపు

అపు తను స్కూల్లో నేర్చుకున్న విషయాలు తల్లికి చెప్పటం, ప్రపంచ పటంలో ఏ ఏ ప్రదేశాలు ఎక్కడ ఉన్నయో తల్లికి చెప్పటం – ఇలాంటి సంఘటనల ద్వారా తల్లి, కొడుకుల మధ్య అనుబంధం ఎలా గట్టిపడుతుందో చూపిస్తాడు రాయ్. ఇలాంటి సంఘటనల వల్ల, మనకు తెలియకుండానే మనం ఈ సినిమాలో ఒక పాత్ర అయిపోతాం.

కెమేరా పనితనం – కాంతిని ఉపయోగించిన పద్ధతి

ఈ సినిమాలో కూడా సుబ్రత మిత్ర కెమేరా పనితనం మనకు కనపడుతుంది. పథేర్ పాంచాలి సినిమా మొత్తం తిన్నగా వచ్చే లైట్ కాంతి, పగలైతే సహజంగా ఉండే సూర్య కాంతి – రాత్రి వేళ స్టూడియోలో ఉండే లైట్ కాంతి, ఉపయోగిస్తూ షూటింగ్ పూర్తి చేసారు. రాయ్ సినిమా ‘అపరాజితో’తోనే మిత్ర, పరావర్తనం చెందిన కాంతిలో షూటింగ్ చెయ్యటం మొదలు పెట్టాడు. రాయ్ తరవాత సినిమాలకి కూడా ఇదే పద్ధతిని (రాయ్ మొదటి రంగుల సినిమా ‘కాంచనజంగా’ తో సహా) ఉపయోగించాడు. రాయ్, మిత్రా ఇద్దరూ ఇలా పరావర్తనం చెందిన కాంతిని వాడటం ద్వారా, సినిమా చూసేవారికి ఒక అద్భుతమైన, మరచిపోలేని అనుభూతి ఇవ్వగలదని నమ్మారు. ముఖ్యమైన సన్నివేశాల్లోని పాత్రల్లో, మానసిక ప్రభావం తీసుకు రావటానికి ఈ పద్ధతి సరిగ్గా ఉంటుందని వీరి అభిప్రాయం. మిత్రా తరవాత చెప్పిన దాన్ని బట్టి, ఈ విషయాన్ని మొదట గమనించినవాడు ఈ సినిమాలకి పని చేసిన ఆర్టు డైరెక్టర్ బన్సి చంద్రగుప్త. బెనారస్‌లో జరిగిన షూటింగుల్లో చాలా భాగం సహజ దృశ్యాలను వాడుకున్నా, హరిహరన్ కుటుంబం ఉన్న ఇల్లు మాత్రం స్టూడియోలో వేసిన సెట్లపై తీసారు. అందులో, సన్నివేశాలు బాగా రావటం కోసం, సూర్య కాంతిని పరావర్తనం చేసి కొన్ని ఫిల్టర్లు వాడుతూ అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ ప్రయోగం మొదట్లో అందరూ మిత్ర సూచనలను విని నవ్వుకున్నారట. ఇలా కాంతిని ఉపయోగించటం వల్ల, అనుకున్న ఫలితాలు ఉంటాయా అని వారి అనుమానం. నిజానికి, ఇలా పరావర్తనం చెందిన కాంతిని వాడటం వల్ల, సినిమా చూసిన వారికి, సినిమాలో చూపించిన ఇల్లు నిజమైన ఇల్లు లాగే కనపడింది. సెట్‌పై వేసిన ఇల్లు అని ఎవరూ ఊహించలా!

హృదయాలను హత్తుకొనే దృశ్యాలు

అంతకు ముందు రాయ్ తీసిన పథేర్ పాంచాలి సినిమాలాగే, ‘అపరాజితో’లో కూడా చూపిస్తున్న విషయంలో కానీ, దాన్ని చూపే విధానంలో కాని ఎక్కడా ‘అతి’ అన్నది ఉండదు. ఈ సినిమాలో చూపిన రెండు మరణాలను (హరిహరన్, సర్బజయ) చాలా సహజంగా, హుందాగా చూపిస్తాడు రాయ్.


హరిహరన్ మరణం అపు

ఒక ఉదయాన్నే జబ్బుతో ఉన్న హరిహరన్ పక్కనే సర్బజయ కూర్చొని ఉంటుంది. హరిహరన్ “గంగ నీళ్ళు” అని గొణుగుతాడు. అపు గంగ నీళ్ళు తీసుకొని రాగా, సర్బజయ హరిహరన్ తల ఎత్తి పట్టుకొని అతని నోట్లో నీళ్ళు పోస్తుండగా, హరిహరన్ తల వేళ్ళాడి పోయి తలదిండు మీద పడుతుంది. వెంటనే, ఇందాకా రాయ్ డైరీలో రాసుకున్నట్టు, రివ్వున ఒక పావురాల గుంపు ఆకాశంలోకి ఎగిరి చక్కెర్లు కొడుతుంది. వెనకగా జోగ్ రాగంలో వేణువు మీద వినిపించే సంగీతం దృశ్యంతో కలిసి, కరిగి పోతుంది. హరిహరన్ శారీరక దురవస్థ నుంచి విముక్తుడవుతాడు.

సర్బజయ మరణం – ఒక సాయంత్రం ఇంటి బయటున్న చెట్టుకి ఆనుకొని, కాలేజీలో చదువుతున్న అపు రాకకై ఎదురుచూస్తూ ఉంటుంది సర్బజయ. దగ్గర్లో ఒక రైలు వెడుతుంది. ఆమెలో స్పందన లేదు. ఆమెకు తెలుసు, ఆ రైల్లో అపు లేడని. తరవాత దృశ్యంలో ఇంట్లోని వరండాలో ఆమె చలనం లేకుండా కూర్చొని ఉంటుంది. ఉన్నట్టుండి అపు పిలుస్తున్నట్టనిపిస్తుంది. అంతా భ్రమ. అపు వచ్చాడన్న ఆశతో, ఇంటి బయటకి తన శరీరాన్ని బరువుగా మోసుకుంటూ బయటకు వస్తుంది. దగ్గర్లో ఉన్న మడుగు వద్ద కదిలే మిణుగురు పురుగుల్ని చూస్తుంది. అదే మనం ఆమెను చూసే ఆఖరి చూపు.

తల్లి – కొడుకు

తల్లీ కొడుకుల మధ్య జరిగే సంభాషణలు ఎంతో సహజంగా రాయ్ చిత్రీకరించాడు. ఒక ఉదాహరణ:

మొదటిసారి కాలేజీ శలవల్లో అపు ఇంటికొస్తాడు. పక్క మీద పడుకొని పుస్తకం చదువుతూ ఉంటాడు.

సర్బజయ: మళ్ళీ ఈసారి ఇంటికి వచ్చినప్పుడు కొన్ని బొత్తాలు పట్టుకురా.

(అపు చదవటంలో ములిగిపోయి సమాధానం చెప్పడు)

సర్బజయ: అపూ… పుస్తకం పక్కన పెట్టు.

(అయిష్టంగా అపు పుస్తకాన్ని పక్కన పెడతాడు)

సర్బజయ: నాతో మాట్లాడు.

అపు: దేని గురించి?

సర్బజయ: అదే… నువ్వు పట్నంలో ఏం చూసావు?

అపు: అదే… అన్ని రకాలైనవి. విక్టోరియా మెమోరియల్, వైట్‌వే లైడ్‌లా, అతి పెద్ద కిరాణా షాపు, హాగ్ మార్కెట్టు, జూ…

సర్బజయ: మరి. కాలీఘట్ దేవాలయం?

అపు: ఆ. అవును. మొన్నెప్పుడో అక్కడికి వెళ్ళాం! అప్పుడే కియొరొటొలా కూడా చూసాం.

సర్బజయ: కియొరొటొలాలో ఏం ఉంది?

అపు: అదే. తగలబడే ఘాట్‌లు.

(సీన్ కట్)

సర్బజయ: ఏమిటి?

అపు: నీకు తెలుసు కదా! శ్మశానం.

సర్బజయ: ఊ… రోడ్లపై నడిచేటప్పుడు జాగ్రత్త. నే ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. తొందరగా ఆ చదువు పూర్తి చేసుకొని ఒక ఉద్యోగం సంపాదించు.

(సీన్ కట్)

(అపు అప్పటికే నిద్రతో జోగుతూ ఉంటాడు. సర్బజయ అది గమనించకుండా మాట్లాడుతూ ఉంటుంది)

సర్బజయ: నీకు ఉద్యోగం వచ్చిన తరవాత నే నీ దగ్గరకి వచ్చి ఉంటాను…. నన్ను ఉండనిస్తావు కదూ?

అపు: (నిద్రలో తూలుతూ) ఓ! అలాగే!

సర్బజయ: నిజంగా? నాకు అతి విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకవేళ నేను జబ్బు పడితే? కోలుకో లేని జబ్బు? అలా జరగొచ్చు, నీకూ తెలుసు కదా! సాయంత్రాల్లో నాకేం బాగుండటం లేదు. ఆకలుండదు. నీకు ఈ విషయం చెప్పాలని ఎన్నో సార్లు అనుకున్నా! చెప్పటానికి మనసొప్పలా! ఒకవేళ నేను నిజంగా జబ్బు పడితే, చదువు ఒదిలేసి నన్ను చూసుకోటానికి రావు కదూ? (అపు నుంచి సమాధానం ఉండదు) జవాబు చెప్పవేం? అపూ….

(అపు అప్పటికే గాఢ నిద్రలో ఉంటాడు)

(ఫేడ్ అవుట్)

తల్లి-కొడుకుల మధ్య మరచిపోలేని ఈ సంభాషణలు విశ్వవ్యాప్తంగా ఏ సమాజానికైనా వర్తిస్తాయి!


సర్బజయ, అపు

ఈ సినిమాలో తల్లీ కొడుకుల బంధం ఒక ప్రధానమైన అంశం. ముందు తన అక్క, బెనారస్ వచ్చిన తరవాత తన తండ్రి చనిపోటంతో, సహజంగానే తల్లికి చేరువ అవుతాడు అపు. బాల్యంలోంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న అపుకు, తల్లికి పరిచయంలేని ప్రపంచం పరిచయం అవటం మొదలవుతుంది. ఇందులో ఒక భాగమే అపు చదువు పట్ల చూపించే అచంచలమైన ఆసక్తి, తద్వారా సంపాదించే జ్ఞానం! దాన్ని తల్లితో పంచుకోటానికి ఎంతో ఇష్టం చూపించే అపు త్వరలోనే కాలేజీకి వెళ్ళటంతో, అతనికి తల్లి జ్ఞాపకాలు తగ్గిపోతాయి. అపు ఆలోచనలన్నీ తన జీవితంపై తాను నిర్ణయించుకునే భవిష్యత్తు మీద కేందీకృతమవుతాయి. సర్బజయకి, అపు భవిష్యత్తు మీద ఉన్న ఆలోచనలు అందుకు పూర్తిగా భిన్నం. తొందరలో అపు కాలేజీ చదువు పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తే, తన శేష జీవితమంతా కొడుకుతో గడపాలని తల్లి ఆశ. ఉన్న పరిస్థితుల్లో సర్బజయకి అపు మీద ఆశలు పెంచుకోటం ఎంత సమంజసమో, అప్పుడే విశాలమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్న అపుకు తన భవిష్యత్తును తాను నిర్ణయించుకోటం అంతే సమంజసం. ఒక రకంగా చూస్తే, అపు స్వార్ధపరుడు, తల్లి విషయం పట్టించుకోడు అనిపిస్తుంది. మరొక రకంగా చూస్తే, తన సుఖం కోసం అపు భవిష్యత్తుని త్యాగం చెయ్యాలని కోరుకునే తల్లిది స్వార్ధం. నిజానికి ఇందులో ఎవరి స్వార్ధం లేదు. జీవితమంటే ఇదే!

చిత్రమైన విషయం ఏమిటంటే, భారతీయ జీవితాల్లో (లేదా విశ్వవ్యాప్తంగా ఉన్న మానవ సంబంధాల్లో) ఇటువంటి సంఘర్షణలు ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం.

ఈ సినిమా పేరు అర్ధవంతమైనదేనా?

ఈ సినిమా నాకు పరిచయం అయినప్పటి నుంచి ఈ సినిమాలో చూపించిన విషయాలకి, ‘అపరాజితో’ అన్న పేరు ఎలా సరిపోయిందో కదా అన్న అనుమానం బాధించేది. పథేర్ పాంచాలి సినిమాలో చూపించినట్టు, అపు చిన్న తనంలో తన అక్క మరణాన్ని చూస్తాడు. అపరాజితో సినిమాలో కొంచెం పెద్దయ్యాకా, తన తండ్రి మరణం, మరి కొంత పెద్దయాకా తన తల్లి మరణం చూసి ఒంటరి వాడవుతాడు. ‘అపు’ లాంటి పాత్ర జీవితంలో ఏం చూసుకొని బతకాలి? అసలే పేద కుటుంబం. పరిస్థితులు ఎంత తిరగబడినా, ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొని పరాజితుడు కాకుండా ముందుకు వెళ్ళటం ఈ సినిమా చూపిస్తుంది. నిజానికి ‘అపు’ భారత దేశంలో కొన్ని లక్షల మందికి ప్రతీక. భారతీయ సంస్కృతి, విలువలు చెప్పీ చెప్పకుండా చూపించటం ఈ సినిమాలో జరిగింది. అందుకే నా దృష్టిలో, ఈ సినిమా కూడా ‘పథేర్ పాంచాలి’ అంత గొప్ప సినిమానే!

అపరాజితో – 1956, ఇండియా, 113 నిమషాలు, తెలుపు – నలుపు బెంగాలీ చిత్రం, ఇంగ్లీషులో క్రింద శీర్షికలతో

ప్రశంసలు

బంగారు సింహం, సెయింట్ మార్క్, వెనీస్, 1957; సినిమా నూవో ఎవార్డ్, వెనీస్, 1957; క్రిటిక్స్ ఎవార్డ్, వెనిస్, 1957; FIPRESCI Award, లండన్, 1957; ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, శాన్ ఫ్రాన్సిస్కో, 1958; అంతర్జాతీయ క్రిటిక్స్ ఎవార్డ్, శాన్ ఫ్రాన్సిస్కో, 1958; ఉత్తమ విదేశి చిత్రం – బంగారు పతకం, 1958-59, U.S.A ; సెల్జిక్ బంగారు పతకం, బెర్లిన్, 1960; బోడిల్ ఎవార్డ్: ఉత్తమ యూరోపియనేతర చిత్రం, డెన్మార్క్, 1967.


ఈ వ్యాస రచనకు ఉపయోగపడిన పుస్తకాలు, డివిడి.

  1. అపరాజితో సినిమా డీవీడీ. సత్యజిత్ రే బాక్స్ సెట్ నుంచి.
  2. The Inner Eye“, Andrew Robinson, University of California Press, 1989.
  3. Satyajit Ray – A Vision of Cinema“, Nemai Ghosh, Satyajit Ray and Andrew Robinson, I.B.Tauris & Co, London – New York, 2005.
  4. “Portrait of a Director: Satyajit Ray”, Marie Seton, Indiana University Press, 1971.
  5. Our films their films“, Satyajit Ray, Orient Longman Limited India, 1976.
  6. “పథేర్ పంచాలి”, బిభూతి భూషన్ బందోపాధ్యాయ్, తెలుగు అనువాదం – మద్దిపట్ల సూరి, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, జులై 2008.
  7. ఈ వ్యాసంలో ఉపయోగించిన చిత్రాలు కొన్ని సత్యజిత్‌రే.ఆర్గ్ నుంచి తీసుకోబడ్డాయి.