రామా కనవేమిరా!

నిద్ర లేచి కాఫీ కోసం కిచెన్ లోకి వెళ్ళే వేళకు, ప్రక్కింటి తెల్ల వాళ్ళు చర్చికి బయల్దేరే సందడి వినిపిస్తోంది.

“ఇవ్వాళ శ్రీరామనవమి. గుళ్ళో రాముల వారి కళ్యాణం. మనమూ చేయిద్దామా?”అడిగింది శైలు, కాఫీ కలుపుతూ. హఠాత్తుగా ఈ హడావిడి ఏమిటని ఆలోచిస్తూండగానే, “యాభై ఎనిమిది డాలర్లట. ఇద్దరం పీటల మీద కూర్చోవచ్చు” అంది.

“మరి మన బుడుంకాయో?” అడిగాను. మహి బుద్దిగా టీవీ చూస్తున్నాడు. వచ్చే జూన్ కు ఏడు నిండుతాయి.

“వాడూ మనతోనే వస్తాడు. ప్రక్కనే కూర్చుంటాడు”

“అంత సేపు ఆ పీటల మీద కూర్చోవడం నా వల్లకాదు. నాక్కష్టం. అయినా రాముడి పెళ్ళికి మనం పీటల మీద కూర్చోడమేమిటి. నాకింకో పెళ్ళి చేస్తానంటే చెప్పు ఆలోచిస్తా” అన్నాను.

ఇదెప్పటినుంచో నాకు అర్థంకాని విషయం. రాముని పెళ్ళి ఏడాదికోసారి మనుషులు జరిపించడం! పూజారులు పెళ్ళి చేయిస్తుంటే మేమంతా పీటల మీద కూర్చోడం!

కాఫీ కప్పు దాదాపు మొహమ్మీదకు విసిరేస్తూ “ఏం ఒక పెళ్ళి చాలదా?” అంది శైలు.

“సర్లే, ఆ గొడవ ఇప్పుడెందుకు”

“మరి గుడికి కాల్ చేసి, కళ్యాణానికి రిజిస్టర్ చెయ్యనా?”

“మనం చెయ్యకపోతే రాముల వారి పెళ్ళి ఆగిపోతుందా?” అడిగాను.

“ఆగిపోతుందని కాదు. చాలా వేడుకగా, ముత్యాల తలంబ్రాలతో చేస్తారు. చాలా బాగుంటుంది”

“ఆ కళ్యాణానికిచ్చే డబ్బులు ఏదైనా ఛారిటీకిస్తే అవసరంలో వున్న వాళ్ళకు ఉపయోగపడతాయి” .

“ఆహా! చేసేవాళ్ళకు కూడా చెల్లదు. చేతికి ఎముక లేని వాడని ఎంత పేరో” చురుక్కున తగిలింది నాకు. చారిటీ వర్కు చేద్దామనే ఉంటుంది కానీ, ఎప్పుడూ ఏదో పనిలో పడి మర్చిపోతూనే ఉంటా.

“నాన్నోవ్, మంచిపనులు చేసేవాళ్ళల్లో దేముడుంటాట్ట. నువ్వు మంచి చేస్తే గుడికి రాక్కర్లా” సలహా ఇచ్చాడు పుత్రరత్నం టివీ నుంచి తల తిప్పకుండానే. వీడిలా టీవీ చూస్తూనే మా సంభాషణ ఎలా వినగలడో, దొండకాయ అంత లేడు. నాకైతే టీవీ చూస్తుంటే శైలూ చెప్పేదేమీ వినపడదు, నిజంగానే.

“వీడికీ పిచ్చి నమ్మకాలు నేర్పించకు. ఉన్న డబ్బంతా దానధర్మాల కిచ్చి కూర్చుంటాడు. అప్పుడు మనకూ అయ్యేది కళ్యాణం” అన్నా.

“నిజమే కదా. ఆత్మారాముడు మన కులదైవం. ఆయన్నే నమ్ముకుంటే సరి” మళ్ళీ చురుక్కుమంది.

నాకు పెద్దగా దేవుడి మీద నమ్మకం లేదు. కాలేజీ రోజుల్లో స్నేహితులతో ఒకసారేదో డిస్కషన్లో, ఇదే మాట చెబితే – ఉంటే నమ్మకం ఉండాలి. లేకుంటే లేదు. ఈ పెద్దగా నమ్మకం లేక పోవడమేమిటని అడిగాడొక ఫ్రెండు! అప్పుడేం చెప్పానో గుర్తు లేదు. కానీ, ఇప్పుడెవరైనా అదే ప్రశ్న అడిగితే ఖచ్చితమైన సమాధానం నా దగ్గర లేదు. అప్పుడప్పుడు మా ఆవిడ, అబ్బాయిలతో గుడికి వెళ్తుంటా. వాళ్ళ లాగే నేనూ దణ్ణం పెట్టుకుంటా. గుళ్ళో దొరికే ప్రసాదం తింటా. కొన్ని సార్లు దణ్ణం పెట్టుకోడానికి ముందే ప్రసాదం తెచ్చుకుని తింటా.

ఈ విషయాన్ని ఇక్కడితో ఆపకపోతే కష్టమని, ” ఐనా మీ రాముల వారి పెళ్ళి చేయడానికి కోట్ల మంది పోటీలు పడుతుంటారుగా?! మనమొక్కళ్ళం చేయించకపోయినా నష్టం లేదు” అన్నాను.

“అలాగని కాదు గానీ – నాకు శ్రీరాముడంటే ఇష్టం. ఈ సారికి కళ్యాణం చేయిద్దాం”.

“రాముడంటే ఎందుకిష్టం?” అడిగాను.

“ఎందుకిష్టమో చెప్పలేను. ఇష్టమని మాత్రం చెప్పగలను”

“నీకంతగా చేయించాలనుంటే, నువ్వెళ్ళి చేయించు. సాయంత్రం నాకు వేరే పని ఉంది. గుళ్ళో ఎలాగూ విందు భోజనం ఉంటుంది కదా. పనయ్యాక గుడికి వచ్చి కలుస్తా. భోజనం చేసి వద్దాం” అంటూ, కిచెన్ లోంచి బయటకొచ్చాను.

“నేనొక్కదాన్ని పీటల మీద కూర్చోలేను కదా. ఐనా మీ మొండి తనం కాకపోతే…” తనింకా ఏదో అంటోంది.

స్నానానికి టబ్బులో కాసిని వేణ్ణీళ్ళు ఒదిలి ‘రామా కనవేమిరా… రఘు రామా కనవేమిరా…’ అని రాగం తీస్తూ, టబ్బులోకి దిగి కాళ్ళు చుర్రున కాలి గావు కేక పెట్టి ఒక్క గెంతులో బయటకు దూకి, బాత్రూం రగ్ మీద గంతులేస్తుంటే, “ఏమైంది నాన్నా” అంటూ మా అబ్బాయి, వాడి వెనకే కంగారుగా మా ఆవిడ.

“హీటర్ కేమైంది? నీళ్ళు ఇంత వేడిగా వస్తున్నాయి?” అడిగాను, రగ్ మీద కాళ్ళు రాసుకుంటూ.

“ఏమీ కాలేదే. ఇందాక నేను స్నానం చేసినప్పుడు నీళ్ళు బాగానే వచ్చాయి” అంది, టాప్ కట్టేస్తూ.

“అమ్మా, నాన్న మీద దేవుడికి కోపం వచ్చిందా”

కాళ్ళ మంటలు కాస్త తగ్గాయి. “నిజమే, మీ రాముడికి కోపం గానీ రాలేదు కదా?” అన్నా నవ్వుతూ.

“ఏమో మరి. పొద్దు పొద్దున్నే అలా నోరు పారేసుకుంటే, దేవుడూరుకుంటాడా?”

ఇది మరో చిక్కు ప్రశ్న నాకు. రామాయణం ఒక ఇతిహాసం. సజీవమైన పాత్రలతో, అన్ని కాలాలకు దారి చూపించే విలువలతో , జీవితాలకు దిక్సూచి లాంటి నీతితో వ్రాయబడ్డ కావ్యంలో రాముడు ఒక పాత్ర, కథానాయకుని పాత్ర! అలాంటి పాత్ర దేవుడెలా అయ్యాడు? దశరధుని కొడుకైనా, మామూలు మనిషి అనుభవించే సుఖదుఃఖాలను చాలా వరకు రాముడూ అనుభవించాడు. రాముణ్ణి ప్రేమించే వాళ్ళున్నారు – ద్వేషించే వాళ్ళున్నారు. మరాయన దేవుడెలా అయ్యాడు?

“ఏమిటాలోచిస్తున్నారు? గుడికి కాల్ చెయ్యనా?” అడిగింది.

“ఊహు…”అంటూ తల అడ్డంగా ఊపాను.

“నాన్నోయ్! ఇవాళ మంచి పని చెయ్యి. లేకపోతే కళ్ళు పోతాయట, దేముడికి కోపమొస్తే ” మా అబ్బాయి. వాడి పరిధిలో నన్ను హెచ్చరించాడు.

“ఏడ్చావులే. వెళ్ళి పాలు తాగు” అని వాడిని బాత్రూం లోంచి బయటకు పంపి, చన్నీళ్ళతో స్నానం చేస్తూంటే- ఏమో నిజంగానే రాముడికి కోపమొచ్చి ఇలా శిక్షించడం లేదు కదా అనే ఆలోచనే మళ్ళీ.


కొంచెం పెందరాళే గుడికి బయల్దేరాం. వస్తూ వస్తూ రాంచ్ మార్కెట్లో ఆగాలిట, షాపింగ్ కోసం. తప్పదుగా, సరే అన్నా.

ఈ గుళ్ళో రాముల వారి కళ్యాణం ఎంత వైభవంగా చేస్తారో నేనెప్పుడూ చూళ్ళేదు గానీ, శ్రీరామ నవమి రోజు భోజనం మాత్రం చక్కటి పెళ్ళి విందులా ఉంటుంది.ఇవ్వాళ మా ఆవిడ పోరు పడలేక బయల్దేరినట్లు నటించినా, లోపల మాత్రం ఎప్పుడెప్పుడు పెళ్ళి భోజనం తిందామా అన్న ఆలోచనే. అసలు బయల్దేరిందే తినడానికాయె! నేను తప్పై, దేవుడు ఉండి, రాముడే దేవుడైతే నన్ను తన శరపరంపరతో చీల్చి చెండాడతాడేమో?!

గుడి పార్కింగ్ లాట్ నిండిపోయింది. బయట రోడ్డు ప్రక్కన కారు పార్క్ చేసి, గుడి ఆఫీసు దగ్గర చెప్పులు వదిలి, జనాలతో కిక్కిరిసిన గుళ్ళోకి వెళ్ళాం. అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతోంది. జంటలు జంటలుగా చాలా మంది పట్టు వస్త్రాలలో బారులు తీరి కూర్చున్నారు. ఆ ఆవరణలో చాలామంది దేవుళ్ళు, దేవతలు ఉన్నా, ఇవ్వాళ రాముల వారికే భక్తుల తాకిడి ఎక్కువ. సీతాదేవిని, రాముల వారిని పూలతో, పసుపు కుంకుమలతో, పట్టు వస్త్రాలతో అలంకరించి, శాస్త్రోక్తంగా పెళ్ళి జరిపిస్తున్నారు. చూడబోతే మాంగళ్య ధారణకు, తలంబ్రాల ఘట్టానికి ఇంకా టైమున్నట్లనిపించింది. అప్పటిదాకా ఆత్మారాముడు ఆగేట్లు లేడు.

“భోజనం చేసి వద్దామా?” మా ఆవిడను భయపడుతూనే అడిగాను.

“కనీసం హారతి వరకైనా ఉందాం. రాగానే తిండికి బయల్దేరితే ఏం బాగుంటుంది”

“నాక్కాస్త ఆకలేస్తోంది” గుసగుసగా అన్నా.

“అమ్మా… నాక్కూడా ఆకలేస్తోంది” వంత పాడాడు మా సుపుత్రుడు.

“తప్పు. ముందు దేవుడికి దణ్ణం పెట్టుకుని, పూజ చేసి అప్పుడు ప్రసాదం తినాలి” అంటూ, వాడి చేయి పుచ్చుకుంది.

“ఎలాగూ ఇవ్వాళ రష్ ఎక్కువుంది కదా. నే వెళ్ళి భోజనాల లైనులో నిలబడనా” అన్నా. వీడితో ఇంకా గొడవ ఎందుకనుకుంది కాబోలు, “మీ ఇష్టం” అని తను ప్రదక్షిణాలకు, కొడుకుతో బయల్దేరింది. నేను చుట్టూ ఒకసారి చూసి, మెల్లగా గుడి వెనక డైనింగ్ రూం వైపు వెళ్ళాను. అప్పటికే రామసేతువంత పొడవైన లైనుంది. అంత దూరానికి కూడా వంటల ఘుమఘుమలు కమ్ముకొచ్చి, ఆకలి ఎక్కువయింది.

లైను మెల్లగా కదులుతోంది.

గుళ్ళో ఇలా విందు భోజనాలు, అందరికీ అన్న దానాలు, ప్రసాదాలు ఒక్క మన సంస్కృతిలోనే నేమో! పోయినేడాది మా ఆఫీసులో పనిచేసే పదిహేను మంది దేశీలు దీపావళి జరిపారు. ఆడవాళ్ళు చీరెల్లో, మగవాళ్ళు సల్వార్ కమీజుల్లో ఆఫీసుకు వచ్చారు. ఒక కాన్ఫరెన్స్ రూంను అలంకరించి, ఆఫీసులో పని చేసే అందరికీ భోజనాలు పెట్టారు. చాలా మందికి భోజనం తప్ప, దీపావళి గురించి ఏమీ తెలిసి ఉండదు. తెల్ల వాళ్ళు, వాళ్ళ పండగలకు స్వంత ఖర్చులతో ఆఫీసులో పన్చేసే అందరికీ ఫుడ్ పెడతారా? ఏమో?!

లైను కదలడం కాసేపాగి, మళ్ళీ కదిలింది. వాలంటీర్లు హడావిడిగా తిరుగుతున్నారు. వాళ్ళంతా వానర సైన్యంలా అనిపించారు. వాలం కలవారు వాలంటీర్లా! నా ఊహకు నాకే నవ్వొచ్చింది, ఆకలి మరింత ఎక్కువయింది.

నేను భోజనాల గదికి వెళ్ళే ముందే శైలు, మహి వచ్చేశారు. అక్కడ వాలంటీర్లు చూపించిన టేబుల్ దగ్గర ముగ్గురం కూర్చున్నాం. కాగితపు విస్తళ్ళు పరిచారు. గ్లాసులు పెట్టారు. గ్లాసుల్లో నీళ్ళు పోసారు. అప్పడాలు, వడియాలు వడ్డించారు. ఐతే తర్వాత రావల్సినవి రావడం లేదు! కాసేపు వెయిట్ చేసి, అటువైపు వెళ్తున్న వాలంటీర్ తో ‘మాకింకా రైస్ రాలేదని’ చెప్పాను.

“కాస్త వెయిట్ చెయ్యండి సార్. రైస్ కాస్త షార్టేజ్. ఇంకో ఐదు నిమిషాల్లో రెడీ అవుతుంది” చెప్పాడు. అప్పటికే చాలా మంది మాలాగా అప్పడాలు కరకరలాడిస్తున్నారు. మరో వైపు టేబుల్స్ వాళ్ళకు అన్నం కూరలు వడ్డించడం మొదలెట్టారు. మనం అటు వైపు కూర్చున్నా బావుండేది అంది శైలు. ఇంకో పావు గంట తర్వాత తెలిసిన వార్త అన్నం ఉంది కాని, కూరలు వండుతున్నారని.

“ఏమండోయ్ – మేము పెళ్ళి కొడుకు వైపు నుంచొచ్చాం. మా సంగతి కాస్త చూడండి” అంటూ, ఒక వాలంటీర్ను ఆపి చెప్పా, నవ్వు ముఖానికి పులుముకొని, మరీ.

“ప్లీజ్… జస్ట్ టెన్ మినిట్స్” అంటూ అతడు వెళ్ళిపోయడు. జోకర్థమైనట్లు లేదనుకుని, మరో నాలుగు అప్పడాలు వేసుకుని తింటూ కూర్చున్నాం. అనుకున్న దానికి మూడు రెట్లకు పైగా అతిధులు వచ్చారట. దాంతో అంచనాలు తారుమారయ్యాయి.

“గుళ్ళోకొచ్చి దణ్ణం పెట్టుకోకపోతే ఇలాగే అవుతుంది” సతీమణి వ్యాఖ్యానం.

“నువ్వు చాలా దణ్ణాలు పెట్టుకున్నావుగా” అన్నాన్నేను.

“అందుకే మాకు లక్షణంగా లడ్డూల ప్రసాదం దొరికింది” అని చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవర్ చూపించింది.

“నాన్నోయ్, నేను కూడా చాలా దణ్ణాలు పెట్టా, నువ్వొక్కడే పెట్టుకోలే” అన్నాడు మా అబ్బాయి. కాసేపు పోయినేడాది ఇదే రామనవమికి తిన్న విందు గురించి నెమరేసుకున్నాం. అంతలోనే కాస్త అన్నం, సాంబారు మాత్రమే ఉన్నాయని, ఏమీ అనుకోకుండా వాటినే ప్రసాదంగా స్వీకరించమని నిర్వాహకులు చెప్పారు. తిని బైటపడ్డాం. నేను హారతి వరకు గుళ్ళో లేకపోవడం వలనే పెళ్ళి భోజనం మిస్సై, జైల్లో నేరస్తుల్లా సాంబారన్నం తినాల్సి వచ్చిందని శైలు, మహేష్ దారి పొడుగునా నన్ను దెప్పుతూనే ఉన్నారు.

పొద్దునలా కాళ్ళు బొబ్బలెక్కేలా కాలడం, ఇప్పుడు కడుపు కాలడం – ఏమో ఇదంతా రాముడి కక్ష సాధింపు చర్య కాదు కదా అనిపించింది.


రాంచ్ మార్కెట్లో షాపింగయిపోయి, కారెక్కాక తన స్పైడర్ మేన్ కళ్ళజొడు కనిపించట్లేదని మావాడు గోల మొదలెట్టాడు.

“ఎక్కడ వదిలేశావ్? కార్టు లోనా?” అడిగాను. తల అడ్డంగా ఊపాడు. ఎందుకైనా మంచిదని, ప్రక్కనే మేమొదిలేసిన కార్ట్ లోపల వెదికాను. షాపింగ్ బేగుల్లో వెదికాం. కారంతా వెదికాం. మా వాడి జేబులు వెదికాం. మా అబ్బాయి గోల చిన్నగా ఏడుపులోకి మారింది. వాడిని ఏడుపు ఆపమంటూ కోప్పడి, దారిలో వెతకడానికి ముగ్గురం బయల్దేరాం. దారిలో దొరకలేదు.

షాపులో వెదుకుతూ, అక్కడ కనిపించిన స్టోరతన్ని, కళ్ళద్దాల గురించి అడుగుతుంటే, ఇంతలో “నాన్నా నా కళ్ళ జోడిదిగో” అంటూ మా అబ్బాయొచ్చాడు, ప్రక్క అయిల్ లోంచి.

“ఎక్కడ దొరికిందిరా?”అంటే, “నాకు రాముడు తెచ్చిచ్చాడు” అని చెప్పాడు.

“నీ మొహం సరిగ్గా చెప్పు” అని గదమాయిస్తే, ఆ అయిల్ కు మరో కొసన, షాపింగ్ కార్టును నెట్టుకెళుతున్న ఒక ముసలి చైనీయుడి వైపు చూపిస్తూ “అడుగో” అన్నాడు మహి.


మర్నాడు ఉదయం శైలు ఆఫీసుకు ఫోన్ చేసి హీటర్ బాగు చేసే అతను వచ్చి వెళ్ళాడని, బాగు చేయడానికి వంద డాలర్లు వసూలు చేసాడని చెప్పింది.

“వందా! కళ్యాణం చార్జీల కోసం రాముడు కాదు కదా వచ్చింది?” అనడిగా.

“నాకూ అదే అనుమానమొచ్చింది. వచ్చింది నల్లతను. అంటే నీల మేఘ శ్యాముడేగా!” శైలూ నవ్వు.

అప్పటికి నవ్వినా, ఏదో మూల రాముడే నా మీద పగ పట్టాడేమోననిపించింది. అయినా ఎన్నో కోట్లమంది భక్తుల్లో, నేను ఒక్కణ్ణీ కళ్యాణం చేయించకపోతే, నేనొకణ్ణీ గుళ్ళో దణ్ణం పెట్టుకోకపోతే దేవునికి తెలుస్తుందా? తెలిసినా ఏదో చూసీ చూడనట్లు పోవాలి గాని ఇలా వెంటబడి మరీ వేపుకు తినడం ధర్మమా? అన్యమనస్కంగానే ఆఫీసు పని ముగించుకుని, ఇంటి దారి పట్టాను. పెద్దగా ట్రాఫిక్ లేదు.

ఏ విషయం మీదైనా, ఎవరి మీదనైనా ఉంటే పూర్తి నమ్మకం ఉండాలి. లేకుంటే అసలు లేదు. సందర్భానుసారంగా నమ్మకం ఉండడం – లేకపోవడం తోనే అసలు చిక్కంతా! అంటుంది శైలూ. మోతాదులో భక్తి అంటే అదే, అన్నా ఒకసారి. చెవులూడి పోయేటట్టు ఉపన్యాసం ఒకటి పీకింది. మా బుడతడేమో మనుషుల్లో దేవుళ్ళని చూస్తున్నాడు, ఇదీ శైలూ ట్రెయినింగే అయుండాలి. ఆలోచిస్తూ కారు నడుపుతున్నా. సెల్ మ్రోగింది. సురేష్ ఫోన్. ఏదో అవసరమై ఉంటుంది. మామూలప్పుడు వీడికి నేను గుర్తు రాను. ఆరు నెలలకో సంవత్సరానికో ఫోన్ చేస్తాడు. ఎవరిదో ఫోన్ నంబరు కావాలట. తర్వాత ఇస్తానని చెప్పి ఫోన్ పెట్టేసాను. ఠాప్ మన్న శబ్దమొచ్చి, కారు కంట్రోల్ తప్పబోయింది. నెమ్మదిగా బ్రేకేసి, షోల్డర్ లైనులో బండాపాను.

ఫ్లాట్ టైర్! ట్రిపుల్ ఏ వాళ్ళకు ఫోన్ చేసి, కారులోనే కూర్చున్నా. పెద్దగా ట్రాఫిక్ లేదు కాబట్టి సరిపోయింది గాని, ఫ్రీవే మీద ట్రాఫిక్కుంటే పరిస్థితి ఏమై ఉండేదో! కొత్త టైర్లు. వేయించి మూణ్ణెళ్ళు కాలేదు. అప్పుడే టైరు ఫ్లాటా?!

అవునూ – నిజంగానే రాముడు నాతో అమీతుమీ తేల్చుకోవాలనుకున్నాడా?! దేవుడి మీద నాకస్సలు నమ్మకం లేదని నేనెప్పుడూ అనుకోలేదు. నాస్తికుడిని అంతకన్నా కాను. ఎందుకన్నా మంచిది, అర్జంటుగా ఒకసారి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రావాలి.


ఇంటికెళ్ళి మా ఆవిడతో గుడికి వెళదామంటే, నేనేదో జోక్ చేస్తున్నాననుకుంది. జరిగింది చెబితే, నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానంది. యాదృచ్చిక సంఘటనలకు రంగు పులుముతున్నానంది. అంతగా వెళ్ళాలనుకుంటే వీకెండు గుడికి వెళ్దామంది. ఇంట్లోనే దీపారాధన చేసి, శ్రీరాముడి పటానికి దణ్ణం పెట్టుకుని చెంపలేసుకోమంది.

నాతో పాటు మా అబ్బాయి కూడా, బుద్దిగా దణ్ణం పెట్టుకుని, చెంపలేసుకుని, సీసాలోంచి కలకండ ముక్కను తీసుకుని ప్రసాదంగా నోట్లో వేసుకున్నాడు.